అడవిలో వెన్నెల

17
2

[dropcap]అ[/dropcap]ది తాడేపల్లిగూడేం సమీపంలో ఒక పెద్ద పల్లెటూరు. చుట్టూ పంట పొలాలు, కాల్వలతో పచ్చగా కళకళ లాడుతోంది. చుట్టూ పెద్ద వృక్షాలు. ఊరికి కాస్త దూరంలో ఇంజనీరింగ్ కళాశాల. కాలేజీ అంతా నిశ్శబ్దంగా వుంది. తరగతుల్లో పాఠాలు జరుగుతూ వున్నాయి. అధ్యాపకుల స్వరాలు మాత్రమే వినపడుతూ వున్నాయి.

అక్కడ కంప్యూటర్స్ తరగతి ఆసక్తికరంగా జరుగుతూ వుంది. పక్క వరుసలో కూర్చున్న వంశీకృష్ణ కేసి చూసింది కళ్యాణి. రెండు మూడు సార్లు వంశీని పరికించింది కానీ వంశీ అదేమీ గమనించలేదు. ఏకాగ్రతతో, క్లాసులో లెక్చరర్ చెప్తున్న విషయాన్ని వింటూ, నోట్స్ రాసుకుంటున్నాడు.

కాలేజీలో మూడు సంవత్సరాల నుండీ వంశీకృష్ణ మాత్రం, తనను పట్టించుకోవటం లేదని అర్థం అయ్యింది కళ్యాణికి.. అందరితో కలుపుగోలుగా వుండే వంశీ తనతో అంటీ ముట్టనట్లుగా ఎందుకంటాడో అర్థం కాలేదు.

సాయంకాలం కాలేజీ అయిపోగానే వంశీ, పవన్, కిరణ్ ముగ్గురూ కలిసి బయటకి అడుగులు వేశారు. ఇంతలో “వంశీ.. వన్ మినిట్” అంటూ వెనక నుండీ పిలుస్తూ పరిగెత్తుకొచ్చింది రాణి.

ఆ పిలుపు విని ముగ్గురూ ఆగి పోయారు..

“కంగ్రాట్స్! ప్రీ ఫైనల్ పరీక్షలో కాలేజీ మొదటి రాంక్ మీదేనని తెలిసింది” అంటూ చేయి కలిపింది రాణి.

“అవును రాణి.. కానీ బోర్డు పరీక్షలో రావాలి.. దీనిదేముంది” అన్నాడు చిన్నగా నవ్వు మొహం పెట్టి.

ఇంకా కొందరు అమ్మాయిలు వచ్చి వీళ్ళను కలిశారు. అందరూ కల్సి మాట్లాడుకుంటూ కాలేజీ బయటకు అడుగులు వేశారు. వెనకాల వస్తున్న కళ్యాణి వీళ్ళను గమనించి. ‘ఎప్పుడు చూసినా వీడి చుట్టూ అమ్మాయిలే’ అనుకుని చిరాకుగా మొహం తిప్పుకుంది.

కాలేజీ బయట మరికొందరు నిలబడి వంశీని గమనించసాగారు.

“వీడేంట్రా అమ్మాయిలతో అంత తీయగా మాట్లాడతాడు” అన్నాడు విజయ్ మీసం తిప్పుకుంటూ.

“అవునురా మనమంటే అసలు భయం లేదు వీడికి. ఏదోక రోజు వీడి పని పట్టాలి” అన్నాడు నర్సింగ్.

స్కూటరు పై వెళ్తున్న వంశీని ఒక సారి చూసి కారెక్కి కూర్చుంది కళ్యాణి. కార్ ఇంటి ముందుకు రాగానే పాలేరు నర్సయ్య పరుగెత్తుకుంటూ వచ్చి గేట్లు బార్లా తీసాడు.

అదొక పెద్ద బంగాళా, ముందుగా నాలుగు ట్రాక్టర్లు, రెండు కార్లు ఒక పక్కగా కనపడుతున్నాయి. మరొక వేపు ఆవులు, ఎద్దులు కట్టేసి వున్నాయి. వాటి పక్కన రెండు పెద్ద గడ్డి వాములు బంగారం రంగులో మెరుస్తున్నాయి.

పోర్టికోలో కారు దిగుతున్న కూతుర్ని చూసి “ఏరా.. ఈ రోజు ఆలస్యమైందే?”అడిగాడు నవ్వుతూ కళ్యాణి నాన్న రాఘవయ్య.

“అవును నాన్నా” అంటూ తండ్రి భుజాల మీద రెండు చేతులు వేసి, ఇంట్లోకి దారి తీసింది కళ్యాణి. ఉషారుగా లోనికి అడుగు పెట్టిన కూతురిని చూసి “వచ్చే వారం నీకు పెళ్లి చూపులు.. అమెరికా అబ్బాయి.. కోట్ల ఆస్తులు. మనకు మించిన సంబంధం” అంది ప్రభ నవ్వుతూ.

“అబ్బా మళ్ళీ మొదలెట్టావమ్మా” అని చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళింది కళ్యాణి.

భుజానికున్న బ్యాగు ఒక పక్కన గిరాటేసి, మంచం మీద బోర్లా పడుకుంది కళ్యాణి. ఆ వచ్చే అబ్బాయి వంశీ అయితే ఎంత బావుంటుంది అనుకుంది. వంశీ గుర్తుకు రాగానే అతను నడిపే పాత స్కూటర్ మనసులో మెదిలింది. తాను ఆ స్కూటర్ వెనక కూర్చుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని నవ్వుకోసాగింది.

***

“ఏరా.. పరీక్షలు అయిపోగానే, పై చదువులు చదువుతావా?” అడిగింది నిర్మల కొడుకు కంచంలో పెరుగు వడ్డిస్తూ.

“ఆలోచిస్తానమ్మా.. అప్పుడు మన ఊరు దాటి వెళ్లాల్సొస్తుంది” అన్నాడు వంశీ పెరుగు ముద్ద తింటూ.

“వెళ్ళాలి.. లేదంటే మనకున్న పదెకరాల సేద్యం చేస్తూ ఉంటే, ఇదిగో నీ జీవితం కూడా ఇలా మధ్య తరగతి బ్రతుకు అయిపోతుంది.” అంది నిర్మల కాస్త విచారంగా.

“ఏం…. మనకిప్పుడేం తక్కువ?” అడిగాడు అమ్మను ప్రేమగా చూస్తూ.

ఏమీ మాట్లాడకుండా కొడుకు వేపు చూసింది నిర్మల.

“అమ్మా.. సినిమాకెళ్ళొస్తానే.. ఈ రోజు మా స్నేహితులతో ప్రోగ్రామ్” అన్నాడు వంశీ చేతులు కడుక్కుంటూ. థియేటర్‌లో టికెట్లు తీసుకుని సీట్లు వెతుక్కుంటూ వెళ్లి కూర్చున్నారు. అప్పటికే సినిమా మొదలైపోయింది.

పవన్ కళ్యాణ్ హీరో. సినిమా అందరూ లీనమై చూస్తున్నారు. అంతలో ముందు వరస నుండీ కొందరు లేచి కంగారుగా అరవటం మొదలయ్యింది. కాసేపటికి సినిమా చూస్తున్న కొందరు లేచి నిలబడి అటువైపు చూడసాగారు. దాంతో గోలగా అయిపొయింది.

“ఏంటో అక్కడ? చూద్దాం పద అని లేచాడు పవన్. దాంతో, వంశీ, కిరణ్ కూడా లేచి ముందుకు అడుగులు వేశారు.

అంతలో సినిమా ఆగిపోయి హాల్‌లో లైట్స్ వెలిగాయి. ముందు వరసలో కళ్యాణి స్పృహ పోయి సీట్లో ఒరిగి పోయి వుంది. పక్కన ప్రభ ఏం చేయాలో పాలుపోక “కాస్త సహాయం చేయండి ఎవరైనా, హాస్పిటల్ కెళ్ళాలి” అంటూ అందరి వేపు చూసింది. కానీ భయంతో ఎవరూ ముందుకు రాలేదు.

వంశీ ముందుకు అడుగేసి, రెండు చేతులలో కళ్యాణిని లేపి మోసుకుంటూ బయటకు గబగబా అడుగులు వేశాడు.

“మీ కారెక్కడుందో చూపించండి” అన్నాడు పవన్, ప్రభ వేపు చూసి.

అందరూ కార్ దగ్గరకు పరుగెత్తారు. కిరణ్ కారు డోర్ తీసి పట్టుకోగానే, అందులోకి కళ్యాణిని చేరగిలా వేసి, ప్రభ కూర్చోగానే కార్ ముందుకురికించాడు వంశీ. దగ్గర్లో వున్న హాస్పిటల్ ముందు కార్ ఆపి, కళ్యాణిని చేతుల్లోకి ఎత్తుకుని ఎమర్జెన్సీ వార్డు వేపు తీసుకెళ్ళాడు వంశీ.

ఇద్దరు నర్సులు వెంటనే వచ్చి పల్స్, బీపీ చెక్ చేయసాగారు.

“మీరందరూ వెళ్ళండి” అంది ఒక నర్స్

అది విని వంశీ, పవన్, కిరణ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కొద్దిసేపట్లో రెండు పెద్ద కార్లు హాస్పిటల్ ముందు ఆగాయి. అందులోనుండి రాఘవయ్య పరుగెత్తుకుంటూ వచ్చి కంగారుగా లోపలికెళ్ళాడు.

“కళ్యాణి ఫాదర్ అనుకుంటా” అన్నాడు పవన్.

“సరే మన పని అయిపొయింది. బయలుదేరదామా ఇంక” అన్నాడు వంశీ రుమాలుతో మొహం మీద తుడుచుకుంటూ.

“మీరే కదా సహాయం చేసింది” అంటూ అప్పుడే బయటికి వచ్చి అడిగాడు రాఘవయ్య.

“ఇందులో సహాయం ఏమీ లేదు, మేమందరం ఒకే క్లాస్ అండి” అన్నాడు చేతులు కట్టుకుని పవన్.

“చాలా థాంక్స్ బాబు. నీరసంతో బ్లడ్ ప్రెషర్ తగ్గి ఇలా అయ్యిందంటున్నారు డాక్టర్. తర్వాత వీలు చూసుకుని మా ఇంటికి రండి. మీ పేర్లేమిటి “అన్నాడు రాఘవయ్య నవ్వుతూ.

చెప్పారు ముగ్గురు స్నేహితులు. ఇంతలో నర్స్ వచ్చి “పేషెంట్ లేచారు రండి” అంది.

“రండి కల్సి వెల్దురు.” అంటూ లోనికి నడిచాడు రాఘవయ్య.

ముందు తన తండ్రి, వెనకాలే వస్తున్న వంశీని చూసి ఆశ్చర్య పోయింది కళ్యాణి.

“ఇదుగో వీళ్ళేరా నిన్ను సమయానికి తెచ్చింది.” అని వంశీని చూపించింది ప్రభ.

“థాంక్యూ వంశీ, థాంక్యూ పవన్, కిరణ్” అంది కళ్యాణి చిన్నగా నీరసంగా నవ్వుతూ.

“అబ్బే మరేం పర్లేదు కళ్యాణి. మేం కాదు ఇదుగో వంశీ చేసాడు” అన్నారు నవ్వుతూ.

తనను తీసుకుని వచ్చింది వంశీ అని తెలియగానే కళ్యాణి మనసంతా ఆనందంతో నిండిపోయింది.

“సరే కళ్యాణి, మేం వెళ్లొస్తాం, రేపు కాలేజీలో కలుద్దాం. ఓకేనా” అన్నాడు వంశీ. అతని మొహంలో ఎటువంటి భావాలు కనపడలేదు కళ్యాణికి. మర్యాదగా అందరికీ నమస్కరించి బయటకు అడుగులు వేసాడు వంశీ.

వెనక్కి తిరిగి ఆత్మవిశ్వాసంతో నడుస్తూ వెళ్తున్న వంశీని చూసాడు రాఘవయ్య.

“కాలేజీలో అన్నిటా ఫస్ట్ నాన్నా. లెక్చరర్స్ అభిమానంగా చూస్తారు.” అంది. కళ్యాణి గొంతులో సంతోషం కనపడుతూ వుంది.

***

ఆఖరి గంట మ్రోగింది. క్లాసుల నుండీ విద్యార్థులందరూ బయటకు వచ్చి స్కూటర్లు, బైక్‍లు తీసుకుని ఇండ్లకు బయలు దేరారు. స్కూటర్ స్టార్ట్ చేసి బయటకు వస్తూ గేటు వద్ద నిలబడ్డ కళ్యాణిని చూసాడు వంశీ.

“వంశీ వన్ మినిట్” అంటూ పిలిచింది కళ్యాణి.

స్కూటర్ ఆపాడు వంశీ.

“ఎందుకో నా కార్ రాలేదు. నాన్నగారు మొబైల్ లేపటం లేదు. కాస్త ఇంటి వరకూ దింపేస్తారా” అంది కళ్యాణి.

ఇబ్బందిగా అటూ ఇటూ చూసాడు.

“మీకు ప్రాబ్లమ్ ఉంటే వదిలెయ్యండి” అంది కళ్యాణి.

ఆకాశం కేసి చూసాడు వంశీ. మబ్బులు దట్టంగా ముసురుకుంటున్నాయి. పెద్ద వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయి.

ఇక తప్పేట్లు లేదన్నట్లుగా చూసి “రండి” అన్నాడు గంభీరంగా.

కళ్యాణి ఎక్కి కూర్చుంది. ఇదంతా గమనిస్తున్న నర్సింగ్ గ్యాంగ్ అసూయ, ఈర్ష్యలతో వంశీని చూసారు.

“కళ్యాణి నాన్నకు, అన్నయ్యకు తెలిసిందంటే వీడి పని ఖతం” అన్నాడు నర్సింగ్‍తో, పక్కన నిలబడ్డ విద్యాపాల్.

“నిజమే మొదలే వాళ్ళు మంచివారు కాదు” అన్నాడు నర్సింగ్.

స్కూటర్ కళ్యాణి ఇంటి గేటు వరకూ వచ్చేసరికి వర్షం జోరెత్తుకుంది.

“అయ్యో తడిసి పోయారు. లోపలికి మీరు కూడా రండి వంశీ” అని లోనికి నడిచింది కళ్యాణి. స్కూటర్ స్టాండ్ వేసి లోనికి పరిగెత్తాడు వంశీ.

లోపలనుండీ టవల్ తీసుకొచ్చి “తుడుచుకోండి, నిలబడే ఉన్నారేంటి, సోఫాలో కూర్చోండి” అంది కళ్యాణి.

టవల్ పక్కన పెట్టి జేబులోనుండీ రుమాలు తీసుకుని తుడుచుకోసాగాడు వంశీ.

“ఇప్పుడే వస్తా” అంటూ లోని కెళ్లింది కళ్యాణి.

సోఫాలో కూర్చొని ఇల్లంతా కలయ చూసాడు. పైనుండీ పెద్ద పెద్ద దీపాలు వేలాడుతూ వున్నాయి. గోడకు తలుపెదురుగా పెద్ద గోడ గడియారం వేలాడుతూ వుంది. ఇల్లంతా లక్ష్మీకళ తాండవిస్తూ వుంది, ఎంతైనా జమీందార్ల ఇళ్ళే వేరు అనుకున్నాడు. ఇంతలో నిర్మల వచ్చి చూసి లోపలి నుండీ పనివాడితో టీ పంపించింది. డ్రెస్ మార్చుకుని వచ్చి వంశీ ఎదురుగా కూర్చుంది కళ్యాణి.

టీ త్రాగుతూ కళ్యాణి కాళ్ళ వంక చూసాడు. పసుపు రంగులో నాజూకుగా వున్న పాదాలకు బంగారు పట్టీలు మెరుస్తూ వున్నాయి.

“రేపు సాయంత్రం మీ స్నేహితులతో రండి. కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం” అంది కళ్యాణి, తల దించుకుని టీ తాగుతూ వున్న వంశీని చూసి.

టీ కప్ పక్కన పెట్టేసి లేచి నుంచుని “వస్తా కళ్యాణి.. థాంక్ యు. మంచి టీ. వర్షం కూడా ఆగి పోయింది.” అని బంగాళాలో నుండి బయటకు వచ్చాడు.

మెట్లు దిగి వెళ్తున్న వంశీని చూసుకుంటూ వచ్చిన కళ్యాణి అన్న రంగారావు “ఎన్ని మార్లు చెప్పాలి, లోనికి రానివ్వకుండా బయట వరండా లోనే కూర్చోపెట్టాలని.” చిరాకుగా కళ్యాణి వేపు కోపంగా చూసి అన్నాడు.

“ఇప్పుడేమైంది? అతను నా కాలేజీనే” అంది కాస్త విసుగ్గా.

మళ్ళీ చెల్లెలి వేపు తీక్షణంగా చూసి గదిలోకి వెళ్ళాడు రంగారావు.

***

ఆ రోజు తొందరలో మొదలయ్యే కాలేజీ విహార యాత్ర గూర్చి విద్యార్థులందరూ ఆసక్తిగా చేర్చించుకుంటున్నారు.

క్లాస్ లోకి వచ్చిన నోటీసు చదవసాగారు లెక్చరర్ రామయ్య. “రేపు సాయంత్రం అయిదు గంటలకు ట్రైన్ బయలు దేరుతుంది. అందరూ కనీసం ఒక గంట ముందు వచ్చి రిపోర్ట్ చెయ్యాలి. రాత్రి భోజన సౌకర్యం ఉంది. చర్చి, కోట చూసిన తర్వాత మూడవ రోజు రాత్రి మనం తిరిగి ఇక్కడకు చేరుకుంటాం” అని చెప్పి, విద్యార్థులందరినీ ఒక సారి నవ్వుతూ చూసి “జాగ్రత్తగా వెళ్లి రండి. హ్యాపీ జర్నీ” అన్నారు

“ముందుగా ఎవరెవరు వెళ్ళదల్చుకున్నారో వాళ్ళు పేర్లు నమోదు చేసుకోండి” అని చెప్పి క్లాస్ లోనుండీ బయటకు నడిచారు రామయ్య.

***

కళ్యాణి, రేవతి, హేమ ఇంకా నలుగురు అమ్మాయిలూ రైల్వే బోగీలో కూర్చున్నారు.

“మెదక్ వెళ్లాలంటే రామాయంపేటలో దిగాలా?” అడిగింది హేమ తన వెంట వస్తున్న ఒక సిస్టర్‌ను.

“అవును సిస్టర్” అంది చర్చి నుండి వచ్చి తీసుకెళ్తున్న సిస్టర్.

ట్రైన్ బయలుదేరుతున్నట్లుగా విజిల్ వేసాడు గార్డ్. కళ్యాణి కళ్లన్నీ స్టేషన్ గేట్ వైపే వున్నాయి. దూరంగా పరుగెత్తుకుని వస్తున్న వంశీని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకుంది కళ్యాణి.

“కళ్యాణి అదుగో వంశీ..” అంది హేమ.

“ఆరు నూరయినా వస్తాడు, నాకు తెలుసు.” అంది కళ్యాణి నర్మగర్భంగా.

అది విన్న హేమ అయోమయంగా చూసింది కళ్యాణి వేపు.

ప్లాట్‌ఫారం మీద బోగీ కిటికీ పక్కగా నిలబడ్డ రంగారావు కళ్యాణి మొహంలో కదిలే భావాలు గమనించి వంశీ వేపు తీక్షణంగా చూసాడు. తన పక్కన నిలబడ్డ జగ్గును చూసి “వీడు రాజారావు గాడి కొడుకనుకుంటా, వాడి పేరు, వివరాలు కనుక్కో” అన్నాడు మెల్లిగా వంశీ వేపు కంటి చూపుతో చూపిస్తూ.

“అలాగే అన్నా” బదులిచ్చాడు జగ్గు.

“అలా అమ్మాయిల గురించి పరుగులు తీసే వ్యక్తిత్వం కాదు అతడిది” అంది హేమ.

“అవును అది తెలుసు. అందుకే కదా..” అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది కళ్యాణి. ఆమె కళ్ళల్లో తృప్తి, గర్వం కనపడింది. కళ్యాణి కేసి విచిత్రంగా చూసి కళ్ళెగరేసి మొహం తిప్పుకుంది హేమ.

వంశీ ఎక్కి కూర్చోగానే రైలు కదిలింది.

చెల్లెలు వేపు చేయి ఊపుతూ, “అమ్మా జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి” అని పెద్దగా అరిచాడు రంగారావు.

ఆ అరుపులు విని కిటికీలో నుండీ రంగారావు వేపు చూసాడు వంశీ.

ఏదో ఆలోచిస్తూ, ట్రైన్ కనుమరుగయ్యేవరకూ నిలబడ్డాడు రంగారావు.

***

ట్రైన్ వేగంగా పరుగులు పెడుతోంది. అమ్మాయిలు, అబ్బాయిల మాటలు వింటూ ఒక పక్కగా కూర్చున్నారు కళ్యాణి, వంశీ. ముందు నుంచే తాను వంశీకు దగ్గరగా వుండేట్లుగా చూసుకుంది కళ్యాణి. బోగీ అడుగు నుండీ పట్టాల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది.

మధ్యలో చిన్న స్టేషన్ లో ఆగింది ట్రైన్.

“టీ తెస్తాను” అని ట్రైన్ దిగాడు వంశీ.

కళ్యాణి కూడా లేచి “నేనూ వస్తా” అంటూ కిందికి దిగి, బోగీలో కూర్చున్న అందరికీ టీలు అందివ్వసాగింది వంశీతో బాటు. అంతలో రైలు కదిలింది. వీరెక్కవలసిన బోగీ ముందుకు వెళ్లి పోయింది. చేతుల్లో వున్న టీ కప్స్ వదిలేసి కళ్యాణి, వంశీ వెనక వేపున్న బోగీ అందుకున్నారు. వారిద్దరూ జాగ్రత్తగా ఎక్కారని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు పవన్, కిరణ్.

బోగీ లోని కెళ్ళి చూసాడు వంశీ. మధ్యలో దారి మూసేసి వుంది. “ఈ బోగీ నుండీ దారి మూసేసి వుంది, తరవాతి స్టేషన్‌లో దిగి వెళ్లొచ్చు లెండి” అన్నాడు వంశీ.

“మీరున్నారుగా నాకేం భయం” అని వంశీ కళ్ళలోకి అభిమానంగా చూసింది. తల వంచుకు నిలబడ్డాడు వంశీ.

ఇద్దరూ అలాగే బోగి తలుపుల దగ్గరే నిలబడి లోపలికి జోరుగా వీస్తున్న గాలిని, వేగంగా వెనక్కు వెళ్ళిపోతున్నపచ్చటి పొలాల అందాన్ని ఆస్వాదించసాగారు.

ఉన్నట్టుండి కళ్యాణి కొంగు ఎగిరి వంశీ మొహానికి చుట్టుకుంది. మెల్లిగా చేత్తో తీసి ఇచ్చాడు. ఆ కొంగులో నుండి వస్తున్న సువాసనలు వంశీ మనసును చుట్టేశాయి. సిగ్గుపడుతూ కొంగు సర్దుకుంది కళ్యాణి. ఇద్దరూ మౌనంగా వున్నారు. అరగంట తర్వాత స్టేషన్‌లో ట్రైన్ ఆగగానే దిగి తమ బోగీ లోకి వెళ్లిపోయారు.

రాత్రి అందరూ డిన్నర్ కానిచ్చి బెర్త్‌ల పైన నిద్రకుపక్రమించారు. పై బెర్త్‌లో ఒక వేపు కళ్యాణి, ఇంకో వేపు వంశీ పడుకున్నారు. కళ్యాణి చాలా సేపు వంశీ ఆలోచనలతో నిద్ర పోలేదు. వంశీ మాత్రం కొద్ది సేపటి లోనే నిద్ర లోకి జారుకున్నాడు.

ఉదయాన్నే వారు దిగవలసిన స్టేషన్ వచ్చేసింది. స్టేషన్ బయటకు వచ్చి మెదక్ వెళ్లే ఒక బస్సు ఎక్కి కూచున్నారు. బస్సు అంతా పల్లెటూరి జనాలతో కోలాహలంగా వుంది. సన్నటి మట్టి రోడ్డు పై నుండి దడ దడ మంటూ బస్సు పరిగెత్తి అరగంటలో మెదక్ బస్సు స్టాండ్‍కు చేరవేసింది. అమ్మాయిలందరూ ఉత్సాహంగా చర్చి వేపు నడవటం మొదలు పెట్టారు.

“కాఫీ తీసుకుంటే బావుంటుందేమో” అంది రేవతి.

“పదండి” అంటూ ఎదురుగా వున్న హోటల్ లోకి దారి తీసాడు వంశీ. ఒక మూలగా వున్న టేబుల్స్ దగ్గర అందరూ కూర్చున్నాక కళ్యాణి అటూ ఇటూ చూసి వేరే ఒక కుర్చీ తీసుకుని వంశీకు ఎదురుగా వేసుకుని కూర్చొంది. అమ్మాయిలెవరు దాన్ని పట్టించుకోలేదు కానీ రేవతి గమనించి నవ్వుకుంది. అందరికీ కాఫీలు అందించాడు సర్వర్.

కొద్దిగా ఒక సారి చప్పరించి కాఫీ కప్ కింద పెట్టేసాడు వంశీ.

అది చూసి ” ఏమిటి కాఫీ వదిలేశారు? ” ప్రశ్నించింది కళ్యాణి.

“అది టీ అనుకున్నాను.. కాదు.. నాకు కాఫీ పెద్దగా నచ్చదు” అన్నాడు వంశీ.

“అలాగా” అని చేయి చాపి ఆ కప్ అందుకుని తాగటం మొదలు పెట్టింది కళ్యాణి.

“అరెరే!! అదేంటి” అంటూ కంగారుపడి, మరింకేం మాట్లాడాలో తెలీక మౌనంగా చూస్తూ వుండిపోయాడు వంశీ.

అందరూ కలిసి ముందుగా ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్‌లో కాలకృత్యాలు తీర్చుకుని చర్చ్ వేపు దారి తీశారు. ముందుగా అందరూ వెళ్తుండగా వంశీ, కళ్యాణి కాస్త వెనకగా నడవసాగారు. వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు.

“ఈ చర్చి ని 25th డిసెంబర్ 1924 లో మత సేవకై పవిత్రం కావించబడింది. వాటికన్ చర్చి తర్వాత ఇదే ప్రపంచంలోకెల్లా పెద్దది. మొత్తం 300 ఎకరాలు.” చెప్పాడు వంశీ.

“ఇవన్నీ మీకెలా తెలుసు” అంది కళ్యాణి ఆశ్చర్యంగా.

మళ్ళీ చెప్పసాగాడు వంశీ

“కేథడ్రాల్ వెడల్పు 100 అడుగులు, పొడవు 200 అడుగులు, ఒకేసారి అయిదు వేలమంది జనం కూర్చోవటానికి వీలుంది, ఇప్పటికి కూడా చెక్కు చెదరని కళా నైపుణ్యం, వైభవం, ఎక్కడా లోపం లేని నిర్మాణం, దీని గొప్పతనం. ఆ ఎత్తుగా కనిపించే బెల్ టవర్ 175 అడుగులు. అది దాదాపుగా కొన్ని కిలోమీటర్‍ల దూరం నుండీ కనపడుతుంది. చర్చి పై కప్పులో స్పాంజ్ లాంటి పదార్ధం పెట్టి సౌండ్ ప్రూఫ్ చేశారు.” వివరించాడు వంశీ.

“కిటికీలు చూడండి. ఒక వైపు వాటి అద్దాలకు క్రీస్తు జన్మ విశేషాలు, మరొక వైపు శిలువ వేయటం వగైరా ఉంటాయి. ఇంకొక అతి పెద్ద విశేషం ఏమిటంటే ఇది చార్మినార్ కంటే కూడా ఎత్తైనది. అది తెలిసి నిజాం నవాబు దీని ఎత్తు తగ్గించే ప్రయత్నం కూడా చేసారని ఒక అపప్రథ.” అని చెప్పాడు. పైన వుండే పెద్ద పెద్ద కిటికీలను చూపించి “దీన్ని బ్రిటిష్ దేశస్థుడు చార్లెస్ వాకర్ నిర్మించాడు.” అని చెప్పి ఆపగానే హేమ “మీరు హిస్టరీ చదివారా?” అంటూ నవ్వింది. ఒక చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు వంశీ.

కళ్యాణి కళ్ళలో ఒకింత గర్వం పొడచూపింది.

తిరుగు ప్రయాణం, ట్రైన్‌లో రాత్రి వరకు తన కుటుంబ విషయాలన్నీ ఏకరువు పెట్టింది కళ్యాణి. చాలా ఓపికగా వింటూ కూచున్నాడు వంశీ. రాత్రి అందరూ అలసి పోయి నిద్రపోయారు.

తెల్లవారు జామున అయిదు గంటలకు లేచి బెర్త్ నుండీ కిందకు దిగింది కళ్యాణి. “గుడ్ మార్నింగ్” నవ్వుతూ పలకరించాడు వంశీ.

“వెరీ గుడ్ మార్నింగ్” సమాధానం చెప్పింది కళ్యాణి.

‘అమ్మయ్య కనీసం నవ్వాడు’ అనుకుంది.

బ్రష్ చేసుకుని, జుత్తు సరి చేసుకుని వచ్చి కూచుంది కళ్యాణి. ట్రైన్ వేగంగా వెళుతూ వుంది. అందరూ దుప్పట్లు కప్పుకుని హాయిగా ఇంకా నిద్రపోతూ ఉన్నారు. “వెళ్లి తలుపు దగ్గర కూచుందామా?, అక్కడ ఎంత బావుంటుందో?” అంది కళ్యాణి.

“ఊ…” అని ఒక సెకను అలోచించి, “పదండి” అంటూ లేచాడు వంశీ.

ముందుగా ట్రైన్ తలుపు తీసి కింద కూచుని కాళ్ళు కిందకు వేసి, పక్కన వున్న రాడ్స్‌ను పట్టుకుని వెనక్కు చూసి “మీరు కూడా కూచొని చూడండి భలేగా ఉంటుంది.” అని తన పక్కన చోటు చూపించింది కళ్యాణి.

కాస్త సంకోచిస్తున్న వంశీని చూసి “పరవాలేదు రండి.” అని మరి కొద్దిగా పక్కకు జరిగింది. పక్కన కూచొని వేగంగా వెనక్కు వెళుతున్న కరెంట్ తీగల్ని, చెట్లను చూస్తూ, రివ్వున ముఖానికి కొడుతున్న గాలిని తట్టుకుంటూ, ‘ఈ అమ్మాయిలో మంచి,అందమైన కళాత్మక దృష్టి వుంది.!!’ అని అనుకుని నవ్వుకున్నాడు వంశీ.

“మీరుండేది ఏ వీధిలో?” అంది కళ్యాణి

చెప్పాడు వంశీ.

“అయితే దగ్గరే మా ఇంటికి..” అంటూ ఆగి పోయింది.

కొద్దీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారిద్దరు. ట్రైన్ బోగీలో అందరూ నిద్ర లేచినట్లుగా సందడి మొదలయ్యింది.

“ఇక లోనికెళదాం” అని లేచి నించున్నాడు వంశీ. “పదండి” అంటూ తానూ లేచింది కళ్యాణి. ఆ రోజంతా కబుర్లతో గడిచి పోయింది.

రాత్రి పన్నెండు గంటలకు ట్రైన్ వాళ్ళ ఊరికి చేరుకుంది. అందరూ దిగి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఇళ్లకు బయలుదేరారు. బయటకు నడిచి చుట్టూ చూసింది కళ్యాణి. తన కార్ ఎక్కడా కనపడ లేదు. సమయం రాత్రి పన్నెడు గంటలు దాటింది. వెనకనుండి వంశీ, పవన్ వచ్చి పక్కన నుంచున్నారు.

“ఏంటి కళ్యాణి మీ కార్ రాలేదా?” అడిగాడు పవన్.

“రాలేదు.. కానీ నడుస్తూ వెళ్తాను” అంది.

“మేము కూడా వస్తాము తోడుగా.. పద” అన్నాడు పవన్.

వంశీ కేసి చూసింది కళ్యాణి. అతని మొహంలో ఎటువంటి భావాలు కనపడలేదు. ముందుకు ఒకడుగు వేసి కళ్యాణి చేతిలోనుండి బ్యాగ్ తీసుకున్నాడు వంశీ. త్రోవలో ముందుగా పవన్, ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

కళ్యాణి ఇంటి గేట్ ముందుకు చేరుకోగానే బ్యాగు కళ్యాణి చేతికిచ్చి “గుడ్ నైట్” అని వెంటనే వెనక్కి తిరిగాడు వంశీ.

“వన్ మినిట్ వంశీ” అంటూ పిలిచింది కళ్యాణి. వెనక్కి వచ్చాడు వంశీ.

“ఏంటి కళ్యాణి” అని ఆగి చూసాడు.

“నాతో ఎప్పుడూ దూరంగా ఎందుకుంటావ్?” ఆకస్మికంగా అడిగింది. కళ్యాణి మొహంలో కాస్త ఉక్రోషం, అనుమానం కనిపించాయి. ఆ ప్రశ్న విని సమాధానం ఏం చెప్పాలో తెలీక మౌనంగా వుండిపోయాడు వంశీ.

మళ్ళీ అడిగింది కళ్యాణి. “చెప్పు వంశీ.. నేనంటే ఇష్టం లేదా?”

“అసలేం అంటున్నావు కళ్యాణి.. నాకు అర్థం కావటం లేదు” కంగారుగా అన్నాడు వంశీ.

“నీకన్నీతెలుసు వంశీ.. నిజం చెప్పు..” అంది చాలా దగ్గరగా వచ్చి నిలబడి.. ఒకడుగు దూరం జరుగుతూ వెనక్కి అడుగు వేసాడు వంశీ. రెండు క్షణాలు అసహనంగా చూసాడు కళ్యాణి వేపు.

“చూడు కళ్యాణి.. మేము చిన్న రైతులము.. నువ్వేమో కోటీశ్వరుల కూతురువి.. నీకు, మన అంతస్తుల తేడా మీద అవగాహన లేదు. ఏ మాత్రం పొరపాటు జరిగినా మీ ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకుంటే.. విషయం పెద్దదిగా అయ్యి ప్రమాదాలకు దారి తీస్తుంది. అందుకే నా లిమిట్స్‌లో నే వున్నా. కాస్త ఆలోచించు, నీకే అర్థం అవుతుంది” అని చెప్పి వెను తిరిగి వెళ్ళిపోయాడు.

చీకటిలో వంశీ కనిపించేవరకూ అలాగే నిలబడి చూసి ఆ తర్వాత లోకెళ్లింది.

అప్పుడే పట్నం నుండీ కారులో వెనుతిరిగి వస్తున్న రాఘవయ్య తన ఇంటి గేట్ వద్దనుండి వస్తున్న వంశీని చూసి గుర్తుపట్టి, కార్ ఆపి కిందకు దిగి “బాబు, ఏంటి ఇటు వేపు వచ్చారు?” అన్నాడు.

నడుస్తున్న వంశీ ఆగిపోయి “నమస్తే సార్… అందరం టూర్ కెళ్ళి వస్తున్నాం, స్టేషన్‌కు ఎవరూ రాలేదు, కళ్యాణి ఒక్కతే వస్తుంటే దిగపెట్టటానికి వచ్చాను” అన్నాడు.

“ఓహ్.. అలాగా.. సరే వెళ్ళు” అని నవ్వి, కారెక్కి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

***

మరుసటి రోజు కాలేజీలో పరీక్షల తేదీలు వచ్చేసాయి. రెండవ రోజు నుండీ సెలవులు మొదలయ్యాయి. అందరికీ పరీక్షల జ్వరం పట్టుకుంది. వంశీ పొలం గట్టు మీద కూర్చొని పవన్, కిరణ్ – కళ్యాణి గురించి మాట్లాడుకుంటున్నారు.

“మూడు సంవత్సరాల నుండీ కళ్యాణి నీకు దగ్గరవ్వాలని చాలా ప్రయత్నించింది” అన్నాడు కిరణ్, పక్కనే కూర్చుని చదువుకుంటున్న వంశీని ఉద్దేశించి. ఏమీ మాట్లాడలేదు వంశీ.

మళ్ళీ అన్నాడు కిరణ్ “నిన్నే.. నాకు తెలుసు నీకా అమ్మాయంటే ఇష్టం.. ఆ అమ్మాయి మంచి అమ్మాయి, పైగా ధనవంతుల కూతురు.. నీకేంటి ప్రాబ్లమ్?”

“అదే ప్రాబ్లమ్ రా కిరణ్, మనం మధ్య తరగతి. కష్టం చేసుకుని బ్రతకాలి. అది మర్చిపోతే ఎలా? కాలేజీ అయిపోగానే, అన్నీ మర్చిపోయి, తన అంతస్తుకు తగ్గ అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోతుంది చూడు కావాలంటే” అన్నాడు..

“అదేం లేదు.. తాను నిన్ను వదలదు.. బెట్” అన్నాడు పవన్ రెండు కాళ్ళు ఊపుతూ.

వంశీ కాసేపు పవన్ వంక చూసి తల దించుకుని, మళ్ళీ ఆకాశం వేపు చూస్తూ మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయాడు.

***

నెల రోజుల వ్యవధిలో పరీక్షలు పూర్తి అయిపోయాయి. ఆఖరి పరీక్ష అయిపోయిన సాయంత్రం విద్యార్థులందరూ కాలేజీ బయట గుంపులుగా నిలబడి, పరీక్షల తర్వాత భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి చర్చించుకుంటున్నారు.

స్నేహితుల మధ్యన నిలబడ్డ కళ్యాణి వారితో మాట్లాడుతూ దూరంగా అబ్బాయిలతో మాట్లాడుతూ నిలబడ్డ వంశీని చూసింది.

“విజయ! అదుగో వంశీని కలిసి వద్దాం పద” అంటూ విజయ చేతిని పట్టుకుని వంశీ వేపు అడుగులు వేసింది.

“హలో కళ్యాణి, విజయ” అన్నారు వంశీ, పవన్, కిరణ్ ఒకే మారుగా.

“హలో.. మీరందరూ మా ఇంటికి రేపు డిన్నర్‌కి రావాలి. మన క్లాస్‌మేట్స్ గురించి ప్రత్యేకం” అంది కళ్యాణి నవ్వుతూ.

“ఓహ్ చాలా హ్యాపీ. తప్పకుండా వస్తాము” అన్నాడు పవన్.

“ఓకే వస్తాను” తలూపాడు కిరణ్. వంశీ వైపు చూసింది కళ్యాణి.

“ఓకే.” అన్నాడు వంశీ.

విద్యార్థులందరూ చీకటి పడుతుండగా కాలేజీ వదిలి వెళ్ళిపోతూ ఆఖరి రోజు కావటంతో చెప్పలేని బాధతో, బరువైన గుండెలతో ఇళ్లకు బయలుదేరారు.

“రేపు మీ ఇంట్లో పార్టీ అని మాకు ఇంత వరకూ చెప్పలేదే” అడిగింది విజయ.

“నాకూ తెలీదు, ఇప్పుడే అనుకున్నాను. రేపు అందరిని పిలుస్తాను ఫోన్లు చేసి” అంది కళ్యాణి చిరునవ్వుతో.

“ఏమో బాబు నిన్నర్థం చేసుకోవటం కష్టమే” అంది విజయ. ఆ మాటతో విజయను ఓరగా చూసి చిలిపిగా నవ్వింది కళ్యాణి.

ఇంటికి చేరుకోగానే బల్ల పీట ఉయ్యాల మీద కూర్చున్నరాఘవయ్య దగ్గరగా వెళ్లి పక్కన కూర్చొని భుజం పైన తల ఆనించి “నాన్నా రేపు సాయంత్రం మా క్లాస్‍మేట్స్‌కు చిన్న డిన్నర్ ఇస్తాను.. సరేనా” అంది కళ్యాణి గోముగా.

“సరేరా అమ్మా.. మన గుమాస్తాకు చెప్పు, నీకేం కావాలో అన్నీఏర్పాట్లు చేసేస్తాడు” అన్నాడు కూతురు తల నిమురుతూ.

సంతోషంగా లేచి వేగంగా మెట్లెక్కి గదిలోకి పరిగెత్తింది కళ్యాణి.

పరుగెడుతున్న కూతురిని చూసి ‘ఏంటో ఇంకా చిన్నతనం’ అని నవ్వుకున్నాడు రాఘవ రావు.

అప్పుడే గది లోకి వచ్చిన రంగారావు భార్య భారతి అనుమానంగా కళ్యాణిని చూసి, ఆలోచనలో పడింది.

***

కళ్యాణి ఇంటి ముందు ఆవరణలో కింద కార్పెట్‌లు వేసి దాని మీద కొన్ని కుర్చీలు, టేబుల్స్ సర్ది, వాటి పైన గ్లాసులు, ప్లేట్స్ పెట్టి ఉంచారు. పక్కన డాబా మీద నుండీ రెండు పెద్ద లైట్లు వెలుగుతూ వున్నాయి. అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. పది మంది అమ్మాయిలు కళ్యాణి చుట్టూ కూర్చొని గల గల మంటూ కబుర్లు చెప్తూ వున్నారు.

కిరణ్,పవన్, వంశీ కలిసి గేట్ లోకి అడుగు పెట్టారు. వంశీని చూడగానే కళ్యాణి గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. చటుక్కున లేచి, చుట్టూ వున్న స్నేహితురాళ్లను తోసుకుని గేట్ దగ్గరికి పరుగెత్తింది.

“రండి.. రండి..గుడ్ ఈవెనింగ్” అంది కళ్యాణి, చటుక్కున వంశీ చేయి పట్టుకుని.

“గుడ్ ఈవెనింగ్” అని సమాధానం ఇచ్చి సున్నితంగా కళ్యాణి చేయిని విడిపించుకున్నాడు వంశీ.

మిద్దె మీది బాల్కనీలో కూర్చున్న రంగారావు ఇదంతా గమనించి మొహం చిట్లించి సిగరెట్ అంటించుకుని వాళ్లనే చూడసాగాడు.

“కాస్త ఆలస్యమైంది.. సారీ” అన్నాడు పవన్, కళ్యాణితో సంజాయిషీగా.

“పర్లేదు.. రండి” అంటూ లోనికి తీసుకెళ్లింది కళ్యాణి.

కొద్ది సేపట్లో ఆ ప్రాంతమంతా స్నేహితులతో కోలాహలంగా మారిపోయింది.

“పిజి చేస్తారా?” అడిగింది కళ్యాణి, వంశీ పక్కన వచ్చి నిలబడి అతని కళ్ళలోకి చూసి.

కళ్యాణి కళ్ళలోకి చూసాడు వంశీ. అందులో వున్న ఆకర్షణ తట్టుకోలేక కళ్ళు దించి “లేదు కళ్యాణి.. గ్రూప్స్ రాస్తాను.. అంత వరకూ మా భూమిలో కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తాను.” అని సమాధానం ఇచ్చాడు.

“నేను పిజి చదువుతాను.. రిజల్ట్స్ రాగానే సిటీకి వెళ్తాను.” అంది కళ్యాణి

“అది మంచిది” అన్నాడు కిరణ్, కళ్యాణి మాటకు సమాధానంగా.

ఇదంతా చూస్తున్న రమ “ఇది మనల్ని పిలిచింది కానీ, దాని ధ్యాసంతా వంశీ, వాడి స్నేహితుల మీదే వుంది” అంది మెల్లిగా విజయ వేపు వంగి.

“అవును” అంది విజయ, వంశీని గమనిస్తూ.

దగ్గరకు వచ్చిన కళ్యాణి చేయి పట్టుకుని. “అసలే మాత్రం నిన్ను పట్టించుకోడు వంశీ.. నీకేం తక్కువ, అతని వెంట పడటం అనవసరం” అంది మెల్లిగా విజయ, కళ్యాణి పక్కన నిలబడి చెవిలో.

చివుక్కున చూసింది కళ్యాణి.

“అదీ చూద్దాం.. నేనతడినే పెళ్లి చేసుకుంటా.. పందెం” అంది చిన్న చిరునవ్వుతో.

“అదెలా సాధ్యం? కష్టం” అంది కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా.

రాత్రి పది గంటలకు అందరూ, తమ సెల్ నంబర్స్ ఇచ్చుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. పని వాళ్ళు సామానంతా శుభ్రం చేసి వెళ్లిపోయారు. మధ్యలో కుర్చీలో కళ్యాణి ఒక్కతే నిస్తేజంగా కూర్చుండి పోయింది చాలా సేపు. ఇక ప్రతీ రోజు వంశీని ఎలా చూడాలి అని ఆలోచించసాగింది.

దాదాపుగా పది రోజులు దాటింది పరీక్షలు పూర్తయి. ఆ రోజు ఉదయం డాబా మీద కేన్ కుర్చీలో కూర్చుని కాఫీ త్రాగుతూ వుంది కళ్యాణి. ఇంటిముందు నుండీ ట్రాక్టర్ నడుపుతూ వెళ్తున్నాడు వంశీ. అది చూసి వెంటనే “వంశీ” అంటూ అరిచింది. కానీ ఆమె అరుపు వంశీ వరకూ చేరుకోలేదు. ఒళ్ళు మర్చిపోయి చప్పట్లు కొట్టింది. ట్రాక్టర్ చప్పుడుతో అది కూడా వంశీకి వినపడ లేదు. చూస్తుండగానే ట్రాక్టర్ దూరంగా వెళ్ళిపోయింది.

కింద బులెట్ స్టార్ట్ చేస్తున్న రంగారావుకు పైనుండీ కళ్యాణి అరుపు, చప్పట్లు వినిపించి పైకి చూసాడు. ఒక క్షణం కోపంగా చెల్లెలి వేపు చూసి, ఏమీ అర్థం కాక, మోటార్ సైకిల్ నడుపుతూ బయటకు వెళ్ళిపోయాడు. అన్నయ్య తనను చూడగానే మొహం అమాయకంగా పెట్టి మౌనంగా నిలబడింది కళ్యాణి. అన్నయ్య అటు తిరిగి వెళ్ళిపోగానే సంతోషంతో నవ్వుకుని కిందకు పరిగెత్తింది.

బయట జీప్ తుడుస్తున్న వెంకన్నను చూసి “నే అయిదు నిమిషాల్లో వస్తున్నా.. మన తోట కెళ్ళాలి” అని చెప్పి లోని కెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది.

అక్కడే నిలబడి చూస్తున్న భారతిని చూసి “వదినా కాస్త అలా పొలం వేపు వెళ్ళొస్తా, అన్నయ్యకు చెప్పొద్దు సుమా” అంది.

అది విని “ఇంతకూ ఎక్కడికీ” అని నవ్వింది భారతి.

“తర్వాత చెప్తా వదినా” అని భారతి చెవిలో మెల్లిగా చెప్పి బయటకు పరుగెత్తింది.

గతుకుల రోడ్ మీద జీప్ మెల్లిగా వెళ్తూ వుంది. “వెంకన్నా! నీకు వంశీ వాళ్ళ పొలం ఎటు వైపో తెలుసా?” అంది.

చెప్పాడు వెంకన్న.

“సరే అయితే అక్కడికి పోనీ” అంది కూర్చుని సీరియస్‍గా.

జీప్‍ను ఒక పక్కగా మలుపు తిప్పి తీసుకెళ్ళసాగాడు డ్రైవర్ వెంకన్న.  కనుచూపు మేర పచ్చటి పొలాలు, అక్కడక్కడా కొన్ని తోటలు కనపడుతూ వున్నాయి. కొద్ధి దూరం వెళ్ళగానే జీప్ ఆపి “ఇదే అమ్మాయిగారు” అన్నాడు వెంకన్న.

కిందకు దూకి రివ్వున వీస్తున్న చల్లని పైరగాలికి చెదిరి పోతున్న పక్క ముంగురులు సర్దుకుంది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటూ వున్నాయి. ధైర్యంగా ముందుకు అడుగేసింది కళ్యాణి.

ట్రాక్టర్‌తో అరకు దున్నుతున్న వంశీ దూరంగా నడుస్తూ వస్తున్న కళ్యాణిని చూసి ఆశ్చర్యంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆపేసి దిగి అర చేయి పైకి లేపి సైగ చేసి కళ్యాణి దగ్గరకు వచ్చాడు. మట్టి అంటుకున్న బనియన్, లుంగీతో గమ్మత్తుగా వున్నాడు. తలకు చుట్టుకున్న టవల్ తీసి మొహానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.

ఎదురుగా వచ్చి నిలుచున్న వంశీను చూసి సంతోషంతో పలకరింపుగా నవ్వింది కళ్యాణి. ఇద్దరు ఒకరినొకరి చూసుకుంటూ నిలబడ్డారు. ఇద్దరి మనసులో సంతోషం, కళ్ళలో చెప్పలేని ఆనందం. మాటలు రావటం లేదు.

“భలేగా వచ్చేసావు కళ్యాణి. అసలు ఊహించలేదు” అన్నాడు వంశీ, గొంతులో ఏదో తట్టుకున్నట్లుగా వుంది అతడికి.

“ఒకసారి కలవాలని అనిపించింది.. అదే.. మీ పొలం చూద్దామని, నువ్వీ డ్రెస్‌లో భలే వున్నావు వంశీ” నవ్వు బిగబట్టి, తనను తాను తమాయించుకుని అంది.

“అలాగా.. ఇప్పుడు ఇది కాలేజీ జీవితం కాదుగా, రైతు బిడ్డను ఇలాగే వుంటాను. పద అదుగో అక్కడ కూర్చుందాం” అని, పెద్ద మామిడి చెట్టు కింద వున్న కుర్చీ వేపు చూపించాడు.

వెళ్లి కూర్చున్నారిద్దరు. కుర్చీ ఎదురుగా వున్న చిన్న గడ్డి వాము మీద కూర్చున్నాడు వంశీ. చల్లని గాలి వీస్తూ వుంది.

“ఎన్నెకరాలు?” అంది ఏం మాట్లాడాలో తెలీక.

“పది.. మొత్తంగా” అన్నాడు.

చుట్టూ చూస్తూ వుంది కళ్యాణి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ వుంది.

“అయితే పిజి కెళ్ళవా? వ్యవసాయమేనా” అడిగింది. ఏం మాట్లాడాలో తెలీటం లేదు.

“నాన్న ఇక చేయలేని పరిస్థితి.. ఇక్కడే వుండి వ్యవసాయం కొత్త పద్ధతుల్లో అభివృద్ధి చేద్దామనుకుంటున్నా కళ్యాణీ” వంశీ గొంతులో మళ్ళీ ఏదో అడ్డం పడ్డట్లుగా అనిపించింది.

“నిజమే, మావి రెండొందల ఎకరాలు.. దాదాపుగా అనుకుంటా. అన్నయ్య, నాన్న చేస్తున్నారు” అంది.

 చాలా సేపు మౌనంగా కూర్చున్నారిద్దరూ. వారి మనసులో ఎన్నో ఆలోచనలు, చెప్పాలనుకుని బయటకు రాని మాటలు. మనసుల నిండా చెప్పలేని ఉద్వేగం. మొదటి సారిగా ఇద్దరికీ లభించిన ఏకాంత సాన్నిహిత్యం కొత్తగా వుంది.

“వస్తాను మరి” అంది కళ్యాణి మనసులోని సంతోషాన్ని అదుపు చేసుకుంటూ.

“రోజూ ఉదయం నుండీ సాయంత్రం వరకూ ఇక్కడే వుంటాను” అన్నాడు, రెండు చేతులు వెనక్కి పెట్టుకుని.

వంశీ కళ్ళలోకి చూసింది. తనను రోజూ రమ్మన్నట్లుగా, తోచింది. “వీలైనప్పుడు వస్తుంటాను నీకేం ఇబ్బంది లేదుగా” అంది.

“మరేం పర్లేదు.. రావచ్చు. రేపు వస్తావా” అని అడిగి ఆపి, నాలుక కర్చుకుని, ఆతృతగా చూసాడు.

అది విని వంశీ వేపు ఓర చూపు చూసి నవ్వి “రమ్మంటావా? అయితే అసలు రాను” అని చిలిపిగా నవ్వి వెనక్కి తిరిగి అడుగులు వేసింది కళ్యాణి.

జీపెక్కి వెళ్తున్న కళ్యాణిని చూసి, తిరిగి ఆకాశం వేపు, ఎగురుతున్న పక్షుల వేపు, చుట్టూ పొలం వేపు చూసాడు వంశీ. అవన్నీ ఎప్పుడూ లేనంతగా ఎంతో అందంగా, మనోహరంగా కనిపించాయి. తల విదుల్చుకున్నాడు. ‘లాభం లేదు.. మనసుని అదుపులో పెట్టుకోవాలి.’ అనుకుని తిరిగి తన పనిలో నిమగ్నమై పోయాడు.

మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసిన కళ్యాణిని చూసి వంశీ మనసు పరవళ్లు తొక్కింది. ఇద్దరూ పొలం గట్ల వెంబడి నడుస్తూ, కొబ్బరి చెట్ల కింద నిలబడి, మామిడి చెట్టు నీడలో మాట్లాడుకున్నారు. గంటలు నిమిషాల్లా గడిచి పోయాయి. సాయంకాలం చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకుంది కళ్యాణి.

అప్పుడు స్పృహ లోకి వచ్చి వాచీలో సమయం చూసుకుంది. భయం భయంగా మెల్లిగా ఇంట్లోకి అడుగు పెట్టింది. ఎవరూ కనపడలేదు.

“రాము.. ఎటెళ్ళారు అందరూ?” అని ఎదురొచ్చిన వంటబ్బాయిని అడిగింది.

“మధ్యాన్నం.. బాబు, చిన్న అమ్మ, పెద్ద అయ్యగారు పట్నం వెళ్ళారమ్మా. సాయంకాలానికి వచ్చేస్తామని చెప్పమన్నారు.” చేతులు కట్టుకుని అన్నాడు రాము.

“ఎటెళ్ళావు పొద్దున్నించి. మధ్యాన్నం కూడా తినలేదు” అంది తల్లి ప్రభ.

“ఊరికే అలా బయటకు పొలం వేపు వెళ్లాను అమ్మా” అంది.

“సరే మొహం అంతా వాడిపోయి వుంది. కడుక్కుని రా” అంది చిరాకుగా

అమ్మయ్య! బ్రతికాం అనుకుంటూ మేడ మీది తన గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి.

***

దాదాపు ఆరు నెలలు గడిచి పోయాయి. కళ్యాణి ప్రతి రోజూ వీలు చిక్కినప్పుడల్లా వంశీ దగ్గరికి వెళ్ళ సాగింది. రాత్రిళ్ళు మొబైల్ ఫోన్‍లో ముచ్చట్లు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం ఎక్కువైంది.

“అవున్రా వెంకట్,.. అప్పుడప్పుడు అమ్మాయిగారిని కార్లో ఎక్కడ తిప్పుతున్నవురా” అడిగాడు రంగారావు, చెవిలో వేలు తిప్పుకుంటూ.

ఏమీ సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలాడు డ్రైవర్ వెంకన్న.

“చెప్పరా.. నసుగుతావేంటి” కళ్ళు ఎర్ర చేసి అరిచాడు రంగారావు.

చేతులు కట్టుకుని కళ్ళు దించుకుని వణుకుతూ నిలబడ్డాడు డ్రైవర్ వెంకన్న.

“చెప్తావా.. కాలిరగకొట్టనా” అంటూ ఒక దుడ్డు కర్ర అందుకున్నాడు రంగారావు.

“రాజారావు.. అదే.. వంశీ.. పొలానికి వెళ్తుంటారయ్యా” అన్నాడు భయంతో.

“సరే నువ్వెళ్లు” అని డ్రైవర్‍కి చెప్పి, దుడ్డు కర్ర కింద పడేసి ఇంట్లోకి వెళ్ళాడు రంగారావు.

సరాసరి తండ్రి గది లోకి వెళ్లి పట్టె మంచం మీద పడుకుని పుస్తకం చదువుతున్న రాఘవయ్యను చూసి

“నాన్న, కళ్యాణి పద్ధతేమి బాగోలేదు. ఆ వంశీ అని రాజారావు గాడి కొడుకు చుట్టూ తిరుగుతోంది” అన్నాడు కోపంగా.

కొడుకుని తేరిపారా చూసాడు రాఘవయ్య “ప్రశాంతంగా కూర్చొని చెప్పు.. కళ్యాణి మన పిల్ల, తప్పు పని చెయ్యదు”

“అదే నాన్నా! వాడు కూడా అదే కాలేజీలో చదువుకున్నాడు, వాడి ఇంటికి, పొలానికి వెళ్తోంది, ఈ మధ్య ఎక్కువైంది..” అని చెప్పి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.

“అదేం చిన్న పిల్ల కాదు.. మనం కంగారు పడకుండా జాగ్రత్తలు చెప్పుకుందాం” అన్నాడు రాఘవయ్య స్థిమితంగా.

“మీకు అర్థం కావటం లేదు” అని లేచి వెళ్ళిపోయాడు రంగారావు.

కాసేపు సుదీర్ఘంగా ఆలోచించాడు రాఘవయ్య. ఒక నిశ్చయానికొచ్చినట్లు నిట్టూర్చి లేచి హాల్ లోకొచ్చి, అక్కడ టీవీ చూస్తున్న కళ్యాణిని చూసి “అమ్మా కళ్యాణీ ఇలా రా” అని వెను తిరిగి గదిలోకి వెళ్ళాడు.

గదిలో కొచ్చిన కళ్యాణిని మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకుని “ఏంటమ్మా నీకేమైనా కావాలా, రేవు పట్నం కెళ్తున్నాను.” చేయి తన చేతి లోకి తీసుకుని అన్నాడు.

“నాన్నా, అయితే నేనూ వస్తాను” అంది సంతోషంగా.

“సరేరా.. నువ్వూ వద్దువు గానీ.. నీకేం కావాలన్నా నేనున్నానుగా, ఏదైనా సరే నన్ను అడుగమ్మా.. కానీ జాగ్రత్తగా ఉండాలి నువ్వు. త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది” అని ప్రేమగా కూతురి కళ్ళలోకి చూసాడు.

“అలాగే నాన్నా” అని తల దించుకుంది.

“ఓకే వెళ్లి పడుకొ తల్లి” అన్నాడు.

“గుడ్ నైట్ నాన్నా” అని సంతోషంగా వెళ్ళిపోయింది కళ్యాణి.

వెను తిరిగి వెళ్తున్న కూతురిని అలాగే కాసేపు చూసి నిట్టూర్చాడు రాఘవయ్య.

హాల్‌లో టివి ముందు కూర్చుని ఆలోచించసాగింది కళ్యాణి. ఎప్పుడూ లేంది నాన్న ఎందుకిలా అన్నాడు? బహుశా వంశీతో తన స్నేహం తెలిసిందా? అన్నయ్య తోటే అసలు చిక్కు. ఒకసారి అమ్మని కదిలించి చూడాలి అని నిశ్చయించుకుని, మనసు నెమ్మదించి, టివి చూడసాగింది.

ఆ రోజు పొలంలో పనులు అయ్యేప్పటికీ పొద్దు పోయింది. ఆకాశమంతా చీకట్లు ముసురుకుంటున్నాయి. కాళ్ళు, చేతులు మొహం కడుక్కుని, తువ్వాలు తలకు చుట్టుకుని మోటార్ సైకిల్ తీసి ఇంటి దారి పట్టాడు వంశీ.

దారి మలుపులో వున్న మర్రి చెట్టు పక్కనుండీ చీకట్లో ఎవరో కొందరు ఆకస్మికంగా ముందుకొచ్చారు. వెంటనే కంగారుతో బ్రేకులు వేసాడు వంశీ. చీకట్లో నీడ లాగ ఏదో వస్తువు తల మీదకు రావటం కనిపించింది. బుజం మీద బలంగా ఏదో తగలింది. సర్రున జారి కింద పడ్డాడు వంశీ.

పైకి లేవ బోతుండగా తల మీద దెబ్బ పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. దెబ్బకి కళ్ళు మూసుకుపోవటం తెలుస్తోంది వంశీకి.

“ఆపండి.. చాలు చాలు” అన్న మాటలు వినిపించాయి. ఎప్పుడో ఎక్కడో విన్న ఆ గొంతెవరిదో గుర్తు పట్టాడు వంశీ. ఆ మరుసటి క్షణం పూర్తిగా స్పృహ కోల్పోయాడు.

***

స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు వంశీ. తలంతా విపరీతమైన నొప్పిగా వుంది. లేవాలని ప్రయత్నించాడు.

“లేవద్దు, పడుకో రా” అన్న తల్లి గొంతు వినపడింది.

కళ్ళు చిట్లించి చూసాడు వంశీ. తల్లి కనపడింది.

“వుండు డాక్టర్‌ను పిలుస్తాను..లేవొద్దురా” అని బయటకు పరుగెత్తింది నిర్మల

వంశీ తలకు తెల్లటి బ్యాండేజ్ కట్టి వుంది. ముందుగా వంశీ తండ్రి రాజారావు, అతడి వెనకాలే డాక్టర్ గది లోకొచ్చారు. వంశీ స్నేహితులు కూడా లోపలికి కొచ్చేశారు.

“ఎలా వున్నారు వంశీ” అంటూ నవ్వాడు డాక్టర్.

అందరూ ఆదుర్దాతో వంశీ వేపు చూస్తున్నారు.

“బాగానే వున్నా డాక్టర్” అన్నాడు వంశీ నీరసంగా.

అంతలోనే “పక్కకు జరగండి, బయటకు వెళ్ళండి” అంటూ ఇద్దరు పోలీసులు, ఇన్‌స్పెక్టర్, వంశీ దగ్గరకు వచ్చి నిల్చున్నారు. అందరూ బయటకు వెళ్లి పోయారు.

అక్కడున్న కుర్చీ దగ్గరకు లాక్కుని “ఆ.. వంశీకృష్ణ, ఎవరు కొట్టారు నిన్ను” అడిగాడు ఇన్‌స్పెక్టర్.

అప్పుడాలోచించాడు వంశీ. ఆఖరున విన్న ఆ గొంతు వున్నట్లుండి గుర్తుకొచ్చింది అదెవరిదో.

“చెప్పండి” రెట్టించాడు ఇన్స్పెక్టర్.

“ఎవరూ కొట్టినట్టు లేదు సార్. ఆ మూల మలుపులో బండి జారి కింద పడ్డాను” అన్నాడు కళ్ళు మూసుకుని.

“సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. అక్కడ మీ రక్తం అంటిన దుడ్డు కర్ర కూడా దొరికింది.” అన్నాడు నిశితంగా వంశీ మొహం కేసి చూస్తూ.

“లేదు ఇన్‌స్పెక్టర్ గారు. నేనే పడ్డాను” అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

లేచి బయటకు వచ్చిన ఇన్‌స్పెక్టర్ చుట్టూ మూగారు వంశీ తల్లి తండ్రి,స్నేహితులు.

వారి వేపొక సారి చూసి “మీవాడేం చెప్పటం లేదు. బహుశా భయపడుతున్నట్లుంది. ఏమైనా చెప్పాలనుకుంటే స్టేషన్‌కి రండి” అని జీప్ వేపు అడుగులు వేసాడు.

అది విని రాజారావు, నిర్మల ఒకరి మొహాలు ఇంకోరు చూసుకుని, హాస్పిటల్ గది లోకి నడిచారు.

వంశీ పక్కన కూర్చొని “వాళ్లెవరో చెప్పరా.. నేను చూసుకుంటాను వారి సంగతి” వంశీ చేయి పట్టుకుని అన్నాడు రాజారావు.

తండ్రి కళ్ళలోకి ఒకసారి చూసి మాట్లాడకుండా తల పక్కకు తిప్పి పడుకున్నాడు వంశీ.

అంతలో డాక్టర్ లోపలి కొచ్చి “ఏమీ ప్రమాదం లేదు. తలకు చిన్న గాయం అయ్యింది. పెద్ద దెబ్బ తగల్లేదు. బహుశా తలకు చుట్టుకున్న టవల్ కాపాడిందనుకుంటా. ఈ రోజు చూసి రేపు డిశ్చార్జ్ చేస్తాం” అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

“పడుకో” అని చెప్పి లేచి వెళ్ళాడు రాజారావు.

వెంటనే స్నేహితురాలందరూ లోపలికి వచ్చి వంశీ చుట్టూ నిలబడ్డారు.  అందరినీ చూసి నీరసంగా నవ్వాడు వంశీ. “నాకేం కాలేదురా బాగానే వున్నాను” అన్నాడు.

“ఇంతకూ ఎవరో చెప్తావా?” అడిగాడు కిరణ్.

మౌనంగా చూసాడు వంశీ.

“పోలీసులకు ఎందుకు చెప్పలేదు” అసహనంగా అన్నాడు కిరణ్.

ఏమీ మాట్లాడలేదు వంశీ. అప్పుడే లోనికి వచ్చిన కళ్యాణిని చూసి అందరూ పక్కకు జరిగారు.

వంశీ కళ్ళలోకి చూసింది. ఇంకాస్త దగ్గరకు వచ్చి వంశీ అర చెయ్యి పట్టుకుని “ఎలా జరిగింది ?ఎవరు వాళ్ళు” అంది. కళ్యాణి కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.

వంశీ మొహంలో చిన్న చిరునవ్వు కదలాడింది. బెడ్ పక్కనే కుర్చీలో కూర్చుంది కళ్యాణి.

“ఎవరి మీదయినా అనుమానం ఉందా? ఎవరు ఈ పని చేశారో?” స్నేహితుల వేపు చూసి అడిగింది.

ఎవరూ మాట్లాడలేదు.

ఇంతలో మెల్లిగా అన్నాడు కిరణ్ “వాడికెవరితో శత్రుత్వం లేదు. మీతో సన్నిహితంగా వున్నందుకు ఏదైనా జరిగిందేమో అని మా అనుమానం”.

“అనవసరంగా మాట్లాడకురా” చిరాకుగా అన్నాడు వంశీ.

కాసేపటికి అందరూ వెళ్లిపోయాయారు. అలాగే కూర్చొని ఆలోచనలో పడింది కళ్యాణి. ఏదో స్ఫురించగానే లేచి నిలబడి “వంశీ నాకు అర్థం అయ్యింది, నే రేపు ఇంటికొచ్చి కలుస్తాను.” అని వంశీ చెయ్యి నొక్కి, దృఢ నిశ్చయంతో బయటకు వేగంగా అడుగులు వేసింది.

“కళ్యాణి తొందర పడకు” అన్న వంశీ మాటలు ఆ సమయంలో ఆమెకు వినపడలేదు.

***

హాస్పిటల్ నుండీ బయలుదేరి ఇంట్లోకి కోపంగా అడుగెట్టింది కళ్యాణి.

“ఎటు వెళ్లొస్తున్నావ్” తీక్షణంగా చూస్తూ అడిగాడు రంగారావు.

“హాస్పిటల్‍లో వంశీని చూసొస్తున్నాను. ఎవరో చీకటి దెబ్బ కొట్టారు.” అన్నయ్య వేపు అనుమానంగా చూసి సమాధానం ఇచ్చింది.

“పెద్దింటి అమ్మాయిలు తేరగా దొరికారని వాళ్ళను మాయ చేసి ఉంటాడు, కడుపు మండి ఎవరో ఏసి వుంటారు” కసిగా అన్నాడు నోట్లో వక్క నములుతూ.

చివుక్కున అన్నయ్య కేసి చూసింది కళ్యాణి. మొహం తిప్పుకున్నాడు రంగారావు.

“అయినా చిన్న వాళ్ళ విషయాలు మనకెందుకమ్మా? మన అంతస్తు చూసుకుని మసలుకోవాలి” అన్నాడు అప్పుడే గదిలో నుండీ బయటకొస్తున్న రాఘవయ్య.

“అదేం చిన్న పిల్ల కాదు, అన్నింటికీ అభ్యంతరం పెట్టకండి” అంది ప్రభ భర్తను ఉద్దేశించి.

“నాన్నా మీకు తెలుసా, ఆ రోజు సినిమా థియేటర్ నుండీ హాస్పిటల్‌కి తీసుకొచ్చిన అబ్బాయిని ఎవరో చీకట్లో తల మీద దెబ్బలు వేశారు.. ప్రస్తుతం హాస్పిటల్‌లో వున్నాడు. ప్రాణాపాయం తప్పింది. అందరికీ మన మీదే అనుమానం.” అంది రంగారావు వేపు కోపంగా చూస్తూ.

కొడుకు వేపు అనుమానంతో చూసాడు రాఘవయ్య. తండ్రి చూపులు తప్పించుకుంటూ “మనకేం అవసరం అల్లాంటివి” అన్నాడు.

భర్త వేపు అపనమ్మకంతో చూసింది భారతి.

“ఒరేయ్ ఒకసారి లోపలి కి రా” అని గట్టిగా చెప్పి తన గది లోనికి వెళ్ళిపోయాడు. వెనకాల రంగారావు, ప్రభ వెళ్లారు.

హాల్‌లో కళ్యాణి దుఃఖంతో అలాగే నిలబడి పోయింది.

“ధైర్యంగా వుండు.. మెల్లిగా నేనూ చెప్తాను మీ అన్నయ్యకు” అని ఓదార్చింది భారతి.

కాసేపు ఆలోచించి తండ్రి గది వేపు అడుగులు వేసింది కళ్యాణి.

లోపల రాఘవయ్య అటూ ఎటూ పచార్లు చేస్తున్నాడు.

“అసలు ఏ మాత్రం పొరబాటు చేసినా మన కుటుంబం మొత్తం పోలీసుల చుట్టూ తిరగాలి అది తెలుసా నీకు.” గద్దించాడు రాఘవ రావు.

“కాస్త బెదిరిద్దామని చేశా.. కొద్దిగా దెబ్బలు గట్టిగా పడ్డాయి. నేనూ అనుకోలేదు ఇంత సీరియస్ అవుతుందని” నసుగుతూ అన్నాడు రంగారావు.

“మనం ఇప్పటికే అడవి జనాలతో ఇబ్బందుల్లో వున్నాం. ఎంత ఇచ్చినా ఇంకా కావాలని అడుగుతున్నారు. మొదలే మనం జమీందార్లమని ఏడుపు. నువ్విలాంటి పనులు చేసావని తెలిస్తే వాళ్లకు దొరికిపోతాం.”అన్నాడు రాఘవయ్య నిస్సహయంగా.

“అయినా నీకిదేం పొయ్యే కాలం రా, మనమ్మాయిని మనం జాగ్రత్త చేసుకోవాలి గానీ” అంది ప్రభ.

తల కిందకి వేసుకుని నిలబడ్డాడు రంగారావు.

తలుపు పక్కనుండే ఇవన్నీ విన్న కళ్యాణి కళ్ళ నీరు తుడుచుకుంటూ తన గది లోకి పరుగెత్తి తలుపు వేసుకుంది.

గదిలో ప్రభ ఆ చప్పుడు విని బయటకు వచ్చి విషయం అర్థం అయ్యి లోకెళ్ళి అంది “అమ్మాయి అన్నీ విన్నట్లుంది.”

“సరే ముందు అమ్మాయిని అదుపులో పెట్టు” అన్నాడు రాఘవయ్య చిరాకు అణుచుకుని.

***

రాత్రి నిద్ర పట్టకుండా అటూ ఇటూ పొర్లుతున్న కూతురిని చూసి మంచం పై నుండీ లేచి వచ్చి పక్కన కూర్చుంది ప్రభ.

“ఏంటమ్మా నిద్ర పోకుండా ఏంటిది” అంది ప్రభ కూతురి కళ్ళలో నీళ్లు చూసి.

ఏమీ మాట్లాడకుండా పక్కకు తిరిగింది కళ్యాణి. తల నిమిరి అంది ప్రభ “నాకు చెప్పకపోతే ఎలా? అబ్బాయితో మామూలు స్నేహమా?”

“వంశీ అంటే నాకిష్టం అమ్మా” అంది మెల్లిగా.

ప్రభ మొహంలో భయం పొడసూపింది. కాసేపు మౌనంగా కూర్చుంది.

“మనం కుటుంబం, మనం అంతస్తు నీకు తెలుసుగా,” అంది ప్రభ. ఆమె ఒంట్లో బలం పూర్తిగా హరించుకు పోయినట్లుగా అయిపోయింది.

“వంశీ మంచివాడు. పైగా డబ్బు లేదనే కాని ఇంకే అడ్డంకి లేదుగా.. అంతేకాదు వంశీ ఎప్పుడూ హద్దు మీరలేదు.” అంది కళ్యాణి లేచి మోకాళ్ళ మీద తల పెట్టుకుని.

“మీ నాన్న, అన్నయ్య ఒప్పుకోవడం కష్టం” అంది నిట్టూరుస్తూ.

“అమ్మా నాకేమీ ఆస్తి, భూమి అక్కర లేదు, వంశీతో పెళ్లి చేయండి చాలు” అంది కళ్యాణి ఏడుస్తూ.

కాసేపు అలోచించి “సరే నువ్వేం కంగారు పడకు. నిదానంగా వుండు. నే చూసుకుంటాను. ఒకసారి అబ్బాయి తల్లి తండ్రితో కలిసి మాట్లాడాలి. నేనే సమయం చూసుకుని అబ్బాయితో మాట్లాడి చూస్తాను. అప్పటివరకూ నువ్వు జాగ్రత్తగా వుండు.”అని చెప్పి కన్నీళ్లు తుడిచి లేచి వెళ్లి పడుకుంది ప్రభ.

***

మరుసటి రోజు మొబైల్‌లో వంశీతో మాట్లాడి వంశీ ఇంటికి బయలు దేరింది కళ్యాణి.

ఇంటి ముందు కారు దిగి బయట నిలబడ్డ కళ్యాణిని చూసిన రాజారావు లోనికి రమ్మని సంజ్ఞ చేసాడు.. నమస్కారం పెట్టి వంశీ ఇంటి లోకి అడుగు పెట్టింది కళ్యాణి

“అమ్మా నువ్వూ.. రాఘవయ్య కూతురివి కదూ?” అడిగాడు రాజారావు అనుమానంగా.

“అవునండీ.. వంశీ నేనూ ఒకే కాలేజీలో చదువుకున్నాం” అంది కళ్యాణి.

“కూర్చో అమ్మా” అని చెప్పి, మొహం చిట్లించుకుని, కండువా భుజం మీద వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు రాజారావు.

వంశీని చూసి “నీకొక విషయం చెప్పాలి వంశీ” అంది కళ్యాణి తల కిందకు దించుకుని.

“ఏంటి కళ్యాణి? చెప్పు” అన్నాడు వంశీ, సోఫాలో మెల్లిగా వెనక్కు వాలి.

“మన విషయం మా అమ్మకు చెప్పాను” అంది

గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ. “అసలు ఇబ్బందులేంటో నీకిప్పుడు తెలుస్తాయి” అని చిన్నగా నవ్వాడు.

“నీకింకో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి” అంది వంశీ కళ్ళ లోకి చూడకుండా తల దించుకుని.

“ఏదీ మీ అన్నయ్య కొట్టించిన సంగతా?” అన్నాడు నింపాదిగా.

 విస్మయంగా వంశీని చూసింది కళ్యాణి.

“అయితే నీకు తెలుసా?” అడిగింది ఆదుర్ధాగా.

“అవును” అన్నాడు నిరాశగా.

కాసేపు ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరూ. ఇంతలో కాఫీ తీసుకుని వచ్చింది నిర్మల.

“నమస్కారం” అని లేచి నిలుచుంది కళ్యాణి.

“పర్వాలేదు కూర్చోమ్మా” అని లోనికి వెళ్ళిపోయింది నిర్మల.

మెల్లిగా అంది కళ్యాణి “వంశీ నాకు భయంగా వుంది. నన్నొదలకు” అంటూ వంశీ కళ్ళలోకి చూసింది కళ్యాణి.

“అవన్నీ ఏం మాటలు కళ్యాణి.. ధైర్యంగా వుండు.. అంతా మంచే జరుగుతుంది.” అతని కళ్ళలో ఎంతో ధీమా.

“మరి పోలీసులకు అన్నయ్య పేరెందుకు చెప్పలేదు?” కాసింత ఆశ్చర్యంగా అడిగింది.

సమాధానంగా అలాగే కళ్యాణి కళ్ళలోకి చూసాడు వంశీ.

“వారి తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను” అంది కళ్ళు దించుకుని.

“ఇక దాని గురించి మర్చిపోదాం” అన్నాడు చిరునవ్వుతో.

***

గదిలో తూగుటుయ్యాల మీద కూర్చొని పేపర్ చూస్తున్నాడు రాఘవయ్య.

దగ్గర గా వచ్చి నిల్చున్న భార్య వేపు చూసి “ఊఁ..” అన్నాడు.

“అమ్మాయి విషయం..” అంది కాస్త సంకోచంగా.

“ఏదీ.. ఆ రాజారావు కొడుకు విషయమా?” అన్నాడు భృకుటి ముడివేసి.

“అవును.. అమ్మాయి ఇష్టపడుతోంది” అంది ప్రభ.

“దానికెలాగూ మన అంతస్తు, హోదా గురించి అవగాహన లేదు.. నువ్వైనా చెప్పొచ్చుగా” అన్నాడు అసహనంగా.

“అబ్బాయి మంచివాడు.. పైగా ఈడు జోడు బావుంది. చదువుకున్నవాడు. తెలిసిన కుటుంబం ఒకే ఊరు.” అని ఆగి భర్త వేపు చూసింది.

ఇబ్బందిగా కదిలాడు రాఘవయ్య. “కావొచ్చు.. కానీ బాగా వున్న కుటుంబానికి చెందిన సంబంధాలు వస్తున్నాయి అమ్మాయికి” అని ఆగాడు.

“అమ్మాయికి నచ్చాడు. అది కూడా ఆలోచిస్తే మంచిది” అని చెప్పి వెళ్ళిపోయింది.

చాలా సేపు అలాగే కూర్చొని ఆలోచించసాగాడు రాఘవయ్య. గోడ గడియారం టంగుమని గంట కొట్టింది. ఉలిక్కిపడి ఆలోచనల నుండీ బయటకు వచ్చి, ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు.

అప్పుడే లోని కొచ్చి నాన్న వేపు చూసాడు రంగారావు.

“సమయానికి వచ్చావు రా.. ఇలా కూర్చో” అన్నాడు కొడుకు వేపు చూసి రాఘవయ్య.

అలాగే నిలబడి అడిగాడు రంగారావు “ఏంటి నాన్నగారు?”

“అదే రాజారావు కొడుకు విషయం “అన్నాడు రాఘవయ్య.

“మనకే మాత్రం సరి తూగడు.. తెలుసుగా”

“అదేరా నేనూ ఆలోచించేది. నాకూ మనసొప్పటం లేదు. కానీ అమ్మాయికిష్టం కదా.”

“ఆ సంబంధం చేసుకోవటానికి మనకేం కర్మ?” కోపంగా అన్నాడు రంగారావు.

“కర్మ కాదు గానీ అమ్మాయికి జీవితంలో ఇబ్బంది లేకుండా మన కళ్ళ ముందే ఉంటుంది” అంది అప్పుడే అక్కడి కొచ్చిన ప్రభ.

“నువ్ కాసేపు మాట్లాడకు..” అన్నాడు రాఘవయ్య నుదురును చేత్తో రాసుకుంటూ..

“నాకైతే ఇష్టం లేదు” అని చెప్పి వెళ్ళిపోయాడు రంగారావు.

 అన్నీ విన్న కళ్యాణి, భారతి గది గుమ్మం పక్క నుండీ వెళ్ళిపోయారు.

***

వారం తర్వాత ఒక రాత్రి రాఘవయ్య ఫోన్ మ్రోగసాగింది. రాఘవయ్య నిద్రలో నుండీ లేచి పక్క టేబుల్ మీద ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు.

అవతలి నుండీ సమాధానం వచ్చింది.

ఆ గొంతు విని గుర్తుపట్టి “ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేశారు?” గౌరవంగా అన్నాడు రాఘవయ్య.

మళ్ళీ కాసేపు అవతలి వ్యక్తి చెప్పింది విని “బిల్ రాగానే అనుకున్న డబ్బు పంపించేసానుగా.. ఇక ఇప్పుడు మళ్ళీ అంత మొత్తం కావాలంటే ఎక్కడ నుండీ తేవాలి” అసహాయంగా అన్నాడు రాఘవయ్య.

అవతలి నుండీ చెప్పింది విని “సరే రేపు ఉదయమే వస్తాను” అని పెట్టేసాడు రాఘవయ్య.

“ఎవరూ మళ్ళీ వాళ్లేనా?” అంది ప్రభ.

“అవును, డబ్బులింకా కావాలంటున్నారు, మాట్లాడదాం కొన్ని విషయాలు, జిల్లా సరిహద్దుల్లోని అడవిలోకి రమ్మంటున్నారు” అన్నాడు.

“వెళ్తారా? ప్రమాదం ఏమీ లేదుగా” అంది.

“వెళ్ళకపోతే ఇంకా ప్రమాదం” అని కళ్ళు మూసుకున్నాడు రాఘవయ్య.

ఉదయమే లేచి విషయం రంగారావుకు చెప్పి, టిఫిన్ చేసి జీప్ ఎక్కాడు రాఘవయ్య. గుమ్మం బయట నిలబడ్డ భార్యకు చేయి ఊపి జీప్ స్టార్ట్ చేసాడు. గుండెలు దిటవు చేసుకుని భయంగా మొహం పెట్టి చేయి ఊపింది ప్రభ.

ఆ రోజు సంధ్య చీకట్లు అలుముకోసాగాయి. మొబైల్ తీసుకుని భర్తకు కలిపింది ప్రభ. నాట్ రీచబుల్ అంటూ వచ్చింది. అది దాదాపుగా ఇరవయ్యో సారి ఫోన్ కలపటం.

ప్రభ మనసులో భయం మొదలైయింది. కాస్త అలోచించి కొడుక్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. కాసేపటిలో బులెట్ మోటార్ సైకిల్ మీద నుండీ దిగి ఇంట్లోకి వచ్చాడు రంగా.

హాల్‌లో కూర్చున్న చెల్లెలు, అమ్మ, భార్య వేపు చూసి “ఎందుకు కంగారు పడటం, వచ్చేస్తారు” అని కూర్చున్నాడు.

అందరూ అలాగే కూర్చున్నారు. గోడ గడియారం పది గంటలు కొట్టింది. అప్పుడు రంగారావులో కూడా ఆదుర్ధా మొదలైంది. తన ఫోన్ తీసుకుని తండ్రి నెంబర్ కలిపాడు. స్విచ్ ఆఫ్ అని వినపడింది.

“ఏం చేద్దాం రా రంగా?”అంది ప్రభ భయంగా.

“అన్నయ్యా! పోలీసులకు చెపుదామా?” కళ్యాణి అంది కంగారుగా.

“అది చేస్తే ఇంకా ప్రమాదం నాన్నకు, పైగా వీళ్ళు మనల్ని నానా ప్రశ్నలు వేసి సావ కొట్టేస్తారు” అన్నాడు రంగ.

ఇంతలో రంగ ఫోన్ మ్రోగింది. ఆదుర్దాగా “హలో ఎవరూ” అన్నాడు.

అవతలి వ్యక్తి చెప్పింది విని “అంత డబ్బులు ఇప్పుడే ఎలా తేగలను. మా నాన్న ఎక్కడ. ఇంత వరకూ రాలేదు” అన్నాడు.

మళ్ళీ అవతలి వ్యక్తి చెప్పింది విని “మా నాన్ననేమీ చేయకండి. ఆయన్ను పంపించేయండి. డబ్బులు వీలు చూసుకుని పంపిస్తాము “అన్నాడు.

అవతలి నుండీ లైన్ కట్ అయ్యింది.

ఫోన్ చెవి దగ్గర నుండీ తీసి “యాభై లక్షల రూపాయలు తీసుకుని అడవిలోకి రమ్మంటున్నారు. అప్పటి వరకూ నాన్నను వదలమని అన్నారు” అన్నాడు ప్రభను, భార్య భారతిని చూసి.

“రేపు అన్ని బ్యాంకులకు వెళ్లి డబ్బులు సర్దు. నాన్నగారి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు” అంది కళ్యాణి. తన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అవును అన్నట్లు తల ఊపింది భారతి.

ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. అలాగే సోఫాలో కూర్చున్నారు. ఫోన్ తీసుకుని రాఘవయ్యకు నెంబర్ కలుపుతున్నారు కానీ ఎవరికీ దొరకలేదు. స్విచ్ ఆఫ్ అనే వచ్చింది.

ఉదయం రంగ తన మోటార్ సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళాడు.

***

అప్పుడే స్నానం చేసి గది లోకి రాగానే మ్రోగుతున్న తన మొబైల్ తీసుకుని “హలో చెప్పు కళ్యాణి” అన్నాడు వంశీ చిరునవ్వుతో.

జరిగిన విషయమంతా, ఏడుస్తూ చెప్పసాగింది కళ్యాణి. అంతా విని “ముందు ఏడుపు కంట్రోల్ చేసుకో. మీ నాన్నకు ఏమీ కాదు, క్షేమంగా తిరిగి వస్తారు, మీ అన్నయ్య ఏం చేద్దామనుకుంటున్నారు? డబ్బులు కొంత వరకూ సర్దుబాటు చేయగలను. ఏ అవసరం వున్నా వెంటనే సరే ఫోన్ చెయ్యి” అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు వంశీ.

మధ్యాన్నం రెండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు రంగారావు. గుమ్మం లోనే ఎదురైంది భారతి.

“సర్దుబాటు అయ్యిందా” అడిగింది భారతి భర్త ని చూసి.

“ఊఁ” అంటూ భారతిని చూసి లోనికి అడుగులు వేసాడు రంగారావు.

హాల్‌లో భారతి తల్లి లక్ష్మి, తండ్రి శ్రీనివాసయ్యని చూసి “నమస్కారం మామయ్య, నమస్తే అత్తయ్యా” అని గది లోకి వెళ్ళాడు.

సాయంత్రం కాగానే రాఘవయ్య బావలిద్దరు, తమ్ముడు సూర్యం ఇంట్లోకి అడుగు పెట్టారు.

అందరూ గదిలో కూర్చొని ఫోన్ కాల్‌కై ఎదురు చూడసాగారు.

సాయంకాలం ఆరు గంటలకు మొబైల్ ఫోన్ మ్రోగగానే చటుక్కున తీసి “హలో చెప్పండి.. నేను రాఘవయ్య కొడుకుని” అన్నాడు.

అవతలి నుండీ చెప్తున్న అన్నింటికీ సరే నంటూ జవాబిచ్చి కాల్ కట్ చేసాడు రంగారావు.

“డబ్బులు తీసుకుని నన్ను ఒక్కడినే, అడవిలో తూర్పు గుట్ట ప్రాంతానికి రమ్మంటున్నారిప్పుడే” అన్నాడు రంగారావు కంగారుగా.

“అన్నయ్యా! రేపు ఉదయం వస్తానని చెప్పితే బాగుంటుందేమో” అనుమానంగా అంది కళ్యాణి.

“డబ్బులు తీసుకుని అడవిలోకి వెళ్ళటం ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం. డబ్బులిచ్చాక నాన్నగారిని వదులుతారనే నమ్మకం నాకు లేదు. పైగా నన్ను కూడా వదలక చంపేసే ఛాన్సెస్ ఎక్కువ” అన్నాడు రంగారావు. అతడి మొహంలో చావు భయం కనపడుతూ వుంది

“మీరు వెళ్ళటానికి వీల్లేదు” అంది భారతి.

“మరెవరు వెళ్తారు” కంగారుగా అడిగాడు రంగారావు అందరినీ చూసి.

ఎవరూ సమాధానం చెప్పకుండా మౌనంగా వున్నారు.

ఇదంతా చూసి, కళ్ళలో నీరు తుడుచుకుంటూ గదిలోనుండీ బయటకు వెళ్లి సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసింది కళ్యాణి.

“హలో” అని వెంటనే సమాధానం ఇచ్చాడు వంశీ

“వంశీ నువ్వొక సారి మా ఇంటికి రాగలవా?” అంది బాధగా.

“వస్తున్నా ఇదుగో” అని చెప్పి బయటకు వచ్చి మోటార్ సైకిల్ కిక్ కొట్టాడు వంశీ. వున్నట్లుండి ఆకాశం నుండి చినుకులు పడటం మొదలైంది.

కళ్యాణి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురు వచ్చిన రంగారావు, వంశీని చూసి ముభావంగా నమస్కరించి గదిలోకి తీసుకెళ్లాడు.

అప్పటి వరకూ జరిగిందంతా విని ఆలోచనలో పడ్డాడు వంశీ.

“ఇంతకూ ఎక్కడికి రమ్మన్నారు?” అన్నాడు వంశీ.

“అడవిలోని తూరుపు గుట్ట దగ్గరకు” అన్నాడు రంగారావు.

ఎవరూ మాట్లాడలేదు. బయట వాన గాలి ఎక్కువ అయ్యింది. కిటికీలు, తలుపులు కొట్టుకోవటం మొదలైంది.

వున్నట్లుండి వంశీ “నేను వెళ్తాను” అన్నాడు.

కళ్యాణి కంగారుగా వంశీని చూసింది.

కళ్యాణిని చూసి అన్నాడు వంశీ “నాకేం కాదు.. నే వెళ్లి తీసుకొస్తాను” అతని గొంతులో దృఢ నిశ్చయం తెలుస్తోంది.

తన మొబైల్ తీసి నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు వంశీ.

“ధైర్యంగా వెళ్ళరా..నీకేం భయం లేదు” అన్నాడు రాజారావు అటునుండి.

“సరే నాన్నా.. అమ్మకు ఇప్పుడే ఏమీ చెప్పకు” అని ఫోన్ పెట్టేసాడు.

అందరూ వంశీని చూసారు.

“మీరెవ్వరూ భయపడకండి, క్షేమంగా తిరిగి ఇద్దరం వస్తాము.. ఆ డబ్బులివ్వండి” అన్నాడు ధీమాగా. కళ్యాణి వంక ఒకసారి చూసి, బ్యాగ్ చేతిలోకి తీసుకుని,తన మొబైల్ కళ్యాణి చేతిలో పెట్టి, కళ్ళ తోటి భరోసా ఇచ్చి, బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేసాడు వంశీ.

ఆకాశంలో మెరుపులు, సన్నగా తుంపర మొదలైంది. గేట్ బయటకు వెళ్తూ కళ్యాణిని చూసి చేయి ఊపాడు వంశీ.

కాసేపట్లో కరెంటు పోయి ఊరంతా చీకటి అయిపొయింది.

కళ్యాణి గుండెలు అర చేతిలో పట్టుకుని వరండాలో సోఫాలో కూర్చొని రెండు చేతులు ఎత్తి భగవంతుడిని స్మరించుకుంది. దూరంగా ఎక్కడో ధడేల్ మంటూ పెద్ద శబ్దంతో పిడుగు పడింది. హోరున వర్షం కురవసాగింది.

***

వర్షం ఎక్కువై, మట్టి రోడ్‌లో మోటార్ సైకిల్ నడపటం కష్టంగా వుంది. అలాగే కొంత దూరం వెళ్లే సరికి అసలు రోడ్ కనిపించటం లేదు. వర్షం నీటితో అంతా బురద మయం అయిపొయింది. మోటార్ సైకిల్ ఒక పక్కన వున్న పెద్ద చెట్టుకింద ఆపేసి, ఒక చేతిలో డబ్బుల బ్యాగ్, మరో చేతిలో టార్చి లైట్ తీసుకుని నడక సాగించాడు వంశీ.

బట్టలన్నీ తడిచి పోయి వొళ్ళంతా చల్లగా అయిపొయింది. కనీసం రైన్ కోటు తెచ్చుకుంటే బావుండేదేమో అనుకున్నాడు వంశీ. వర్షం తుక్కు తుక్కుగా మొహం మీద కొట్ట సాగింది. పెద్ద చప్పుడుతో చుట్టూ వర్షం. చిమ్మని చీకట్లో ఆ వర్షపు జల్లు ముందు టార్చి లైట్ పని చేయటం లేదు. ముందు ఏముందో ఏమీ కనపడటం లేదు. అలాగే బురదలో మెల్లిగా నడక సాగించాడు.

అలాగే మూడు గంటలు నడిచిన తర్వాత ఒక పక్క నుండీ చిన్నగా ఈల చప్పుడు వినిపించింది. వెంటనే ఆగిపోయాడు వంశీ. చుట్టూ చూసాడు. ఎవరూ కనిపించ లేదు. ఇంకో వేపు నుండీ దట్టమైన అడవి చెట్ల నుండీ ఇంకో ఈల వినిపించింది.

“ఎవరూ.. నేను రాఘవయ్య మనిషిని” అని అరిచాడు. ఆకస్మాత్తుగా వంశీ మొహం మీద టార్చి లైట్ వెలుతురు పడింది.. కళ్ళకు చేయి అడ్డం పెట్టుకుని “మీ డబ్బులు తెచ్చాను” అన్నాడు.

ఆ చీకటిలోనుంచీ కొందరు వ్యక్తులు వచ్చి వంశీ చేతిలోని బ్యాగ్ అందుకుని “మా వెనక రా” అని ముందుకు నడిచారు.

దాదాపుగా రెండు గంటలు నడిచిన తర్వాత నది ఒడ్డున చిన్న ఇసక మైదానం వద్ద ఆగారు. మధ్యలో రెండు కిరోసిన్ లాంతర్లు వెలుగు తున్నాయి. ఒకతను కింద గడ్డి మీద కూర్చొని వున్నాడు. చుట్టూతా మరో నలుగురు చేతుల్లో తుపాకులు పట్టుకుని నిల్చున్నారు. వంశీ తెచ్చిన బ్యాగ్‌ను అందులో ఒకడు తీసుకుని లోపలికి చూసి తృప్తిగా ఊపిరి పీల్చి “నువ్వెవరు, వాడి కొడుకువా?” అంటూ దూరంగా నిలబడ్డ రాఘవయ్యను చూపించి.

“కాదన్నా.. నేను రాజారావు కొడుకుని”

“ఆయన చిన్న రైతు కదా.. తెలుసు.. అయినా కష్ట జీవులు మీరు, ఈ జమీందారు గాడితో నీకేం పని. నువ్వెందుకొచ్చావ్. వాడికో కొడుకున్నాడుగా. నీకెంత ఇచ్చారేంటి?” తీక్షణంగా చూసాడు ఆ వ్యక్తి వంశీని.

“ఒకే ఊరి వాళ్ళం కదన్నా.. వచ్చాను” అన్నాడు వంశీ చేతులు కట్టుకుని.

అప్పుడు ఆ వ్యక్తి ఇంకో అనుచరుడి వేపు చూసి “సరే మన పని అయిపొయింది. వదిలెయ్యండి” అన్నాడు గట్టిగా.

బక్క పలచటి వ్యక్తి వెళ్లి రాఘవయ్య చేతి కట్లు విప్పి ముందుకు తోసాడు.

తూలి పడబోతున్నరాఘవయ్యను చూసి ముందుకు వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు వంశీ. జేబులోనుండీ రుమాలు తీసి రాఘవయ్య చేతికి ఇచ్చి, చుట్టూ చూసాడు. వాళ్ళెవరూ ఎవరూ కనపడలేదు. చీకటిలో కలిసి పోయారు.

చేతిలో టార్చ్ లైట్ వేసుకుని, రెండు రోజుల నుండీ తిండి, నిద్ర సరిగ్గా లేక నీరసంగా నడుస్తున్న రాఘవయ్య నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని ముందుకు నడక కొనసాగించాడు వంశీ. కుంభవృష్టి కురుస్తోంది. వర్షం ఏడా పెడా మొహాల మీద జల్లు కొట్ట సాగింది.

వంశీ భుజం మీద నీరసంగా చేయి వేసి ముందుకు, తడబడుతూ నడిచాడు రాఘవయ్య.

ఒక గంట పిమ్మట వర్షం తగ్గు ముఖం పట్టింది. అడవి లోని వృక్షాల మీద నుండీ పక్షులు రెక్కలు దులుపు కోవటం మొదలు పెట్టాయి.

తూర్పున వెలుగు రేఖలు ఆకాశం అంచున పరుచుకుంటున్నాయి..

మధ్యాహ్నానికి అడవి నుండీ బయటకు వచ్చి ఆ దారిలో వెళ్తున్న ఒక చిన్న లారీని ఆపి ఎక్కారు ఇద్దరూ.

నీరసంగా వంశీ మీదకు తూలి పోయి కళ్ళు మూసుకున్నాడు రాఘవయ్య.

ఇంతలో లారీ డ్రైవర్ మొబైల్ మ్రోగసాగింది. వెంటనే కళ్ళు తెరచి “బాబూ ఒక సారి నీ ఫోన్ ఇస్తే ఇంటికి ఫోన్ చేసుకుంటాను” అన్నాడు రాఘవయ్య.

కాల్ కట్ చేసి ఫోన్ రాఘవయ్య చేతిలో పెట్టాడు డ్రైవర్.

ఫోన్ చేతిలోకి తీసుకుని నెంబర్ కలిపాడు రాఘవయ్య

“హలో ఎవరూ?” అంది అటు నుండీ ప్రభ కంగారుగా.

“నేనే ప్రభా.. వస్తున్నా.. అందరికీ చెప్పు. మేము క్షేమమే” అని చెప్పి ఫోన్ కట్ చేసి డ్రైవర్ చేతిలో పెట్టి కళ్ళలో నీరు తుడుచుకుని వంశీని, చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

వాన వెలిసింది. లారీ కిటికీలో నుండీ వస్తున్న చల్లని గాలికి నిద్ర లోకి జారుకున్నాడు రాఘవయ్య. కళ్యాణిని చూడాలనే ఆతృతతో వున్న వంశీకి నిద్ర పట్టలేదు. అతడి కళ్ళలో భవిష్యత్తు మీద ఎన్నో కలలు.

దారిలో తన బండి ఆపిన చోట లారీ ఆపించాడు. అక్కడ్నించి రాఘవయ్యని ఎక్కించుకుని ఇంటికి చేర్చాడు వంశీ.

బండి దిగుతున్న తండ్రిని, వంశీని చూసిన కళ్యాణి ఉద్వేగంతో వెళ్లి రాఘవయ్యను, వంశీ ని కౌగిలించుకుని ఏడవసాగింది.

రంగారావు పరుగెత్తుకొచ్చి వంశీ చేయి పట్టుకుని “లోనికి రండి బావగారు” అని ఇంట్లోకి దారి తీసాడు.

అక్కడే వరండాలో నిలబడ్డ రాజారావు, నిర్మల వంశీని గర్వంగా చూసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here