Site icon Sanchika

అద్భుత సౌందర్య రాశి ‘కాశ్మీరం’

[కశ్మీరులో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]హి[/dropcap]మాలయ పర్వత సానువుల్లో కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, చలికాలంలో గడ్డకట్టే దాల్, అంచర్ సరస్సుల తోనూ ఆకాశాన్ని తాకేలా పైకి పెరిగిన చినార్, దేవదార్, పైన్ వంటి చెట్లతోనూ, మిలమిల మెరిసే ఆకుపచ్చని రంగు పులుపుకున్న పచ్చిక బయళ్ళతోనూ, రంగురంగుల్లో తమ సోయగాలంతా చూపించే పూల బాలల తోనూ, కొండల మధ్య భాగాల్లో నుంచి పాల వంటి నీళ్ళు ధారలుగా ప్రవహించే నీటి జలపాతాల తోనూ భూలోక స్వర్గంగా పేరు పొందిన కాశ్మీరును చూడటానికి మేము ఈనెల 8వ తేదీన వెళ్ళాము. ఐదు రోజుల పాటు కాశ్మీరు అందాలను తనివితీరా చూసి 12 వ తేదీ తిరిగి స్వరాష్ట్రానికి వచ్చాం.

శ్రీనగర్ ఎయిర్‍పోర్డ్

ప్రపంచపు భూతల స్వర్గంగా పేరుగాంచిన స్విట్జర్లాండ్ దేశాన్ని 2009 లోనే చూసి గొప్ప అనుభూతికి లోనయ్యాం. ఆల్ప్స్ పర్వత శ్రేణుల అద్భుత సౌందర్యానికి అచ్చెరు పొందుతూ ఉంటే, మా సమూహం లోని ఒక దాక్టరు “కాశ్మీరు ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది” అని అన్నది. అప్పటి నుంచీ కాశ్మీరును చూడాలని చాలా కోరికగా ఉన్నది. నాయని కృష్ణకుమారి గారు 1967లో చూసి కవితావేశంతో రాసిన ‘కాశ్మీర దీపకళిక’ను పాఠ్యంశంగా చదివి పిల్లలకు చెప్పినప్పుడు ‘నేను కూడా ఎప్పటికైనా చూడాలి’ అని మనసులో గట్టిగానే అనేసుకున్నాను. అయితే ‘రోజా’ సినిమాలలో జవాన్ల పహారాలో ఉన్న కాశ్మీరాన్ని చూసి ముళ్ళ మధ్యన ఉన్న గులాబీ పువ్వులా అనిపించింది. నేను పుట్టక ముందు రాయబడిన ‘కాశ్మీర దీపకళిక’ లోని కాశ్మీరు సౌందర్యాన్ని ఇంత ఆలస్యంగా చూస్తున్నందుకు కించిత్తు బాధగా ఉన్నా, ఇప్పటికైనా అవకాశం వచ్చినందుకు పరమ సంతోషంగా ఉన్నది ‘నియోకాన్’ అనబడే కాన్ఫరెన్స్ శ్రీనగర్ లోని SKICC లో జరుగుతున్నందున మా వారితో పాటు మేమూ కాశ్మీరు చూసేందుకు ఎగిరి గంతేసి బయల్దేరాం. పిల్లల డాక్టర్ల కాన్ఫరెన్స్ వల్ల జమ్ము కాశ్మీరు యొక్క వేసవి రాజధాని అయిన శ్రీనగర్‌ను చూస్తున్నాం. ఈ SKICC లో G20 సమ్మిట్ జరిగిందట.

కాన్ఫరెన్స్ వెన్యూ

కాలేజీలో చదువుకునేటప్పుడు ఏర్పాటు చేసిన ‘ఫ్యాషన్ షో’ లో ‘కాశ్మీరీ గర్ల్’ వేషం వెయ్యమన్నపుడు కాశ్మీరీ అమ్మాయిల అందచందాల గురించి జరిగిన పెద్ద డిస్కషన్ గుర్తొచ్చింది మెత్తటి  ‘పశ్మీనా’ శాలువాలు కొన్నపుడు, ఎర్రటి కేసరాల కుంకుమ పూల డబ్బా కొనుక్కుంటున్నపుడు, ఎర్రటి బుగ్గలున్న కాశ్మీరీ యాపిల్స్‌ను కొరికి తింటున్నపుడు, ఎంతో ఖరీదు పెట్టి కొనుకున్న డ్రైఫ్రూట్స్‌ను బలమని తింటున్నపుడు కాశ్మీరును ఎన్నోసార్లు గుర్తుకు తెచ్చుకుంటుంటాం.

కశ్మీరీ సాంప్రదాయ దుస్తుల్లో రచయిత్రి

భారతదేశం లోని కేంద్రపాలిత ప్రాంతాలలో జమ్ము కాశ్మీరు కూడా ఒకటి. ఒకప్పుడు రాష్ట్రంగా ఎంతో అల్లకల్లోలానికి గురైన జమ్మూ కాశ్మీరు 2019 ఆగస్టు నుంచి కేంద్ర పాలిత ప్రాతంగా మారింది. ఎప్పుడూ కాల్పులతో కర్వ్యూలతో అస్తవ్యసంగా ఉండే శ్రీనగర్ ప్రస్తుతం ప్రశాంత జీవనం కొనసాగిస్తోంది. శ్రీనగర్ జమ్మూ కాశ్మీరుకు వేసవి రాజధాని. ఇక్కడ ఉన్న 17లక్షల జనాభాలో ముస్లిములు ఎక్కువగా నివసిస్తున్నారు. జమ్మూలో హిందువులు ఎక్కువగా నివసిస్తారట. జమ్ము శీతాకాల రాజధాని. మేము జమ్ము దాకా వెళ్ళలేదు వేసవిలో కాశ్మీరాన్నీ చూశాము. దాల్ లేక్ మామూలు నీళ్ళతో కదిలే సరస్సులా చూశాము.

బోట్ హౌస్

 

ఇందులో పడవ ప్రయాణం చేశాము. ఈ సారి కాశ్మీరాన్నీ శీతాకాలంలో చూడాలి . గడ్డకట్టిన దాల్ సరస్సును చూడాలి అనుకున్నాము. మేము స్విట్జర్లాండును కూడా వేసవి కాలం లోనే చూశాం. అక్కడకు వెళ్ళినప్పుడూ ఇలాగే మరల శీతాకాలంలో దర్శించాలనుకున్నాం. ఇంత వరకూ వెళ్ళలేదు. తెల్లని మంచు టోపీలు పెట్టుకున్న కాశ్మీర సుందరిని చూడటానికి సమయం ఎప్పుడు వస్తుందో ఏమో! కాశ్మీర సుందరి అంటే జ్ఞాపకం వచ్చింది . మా ఐదురోజుల పర్యటనలో ఎక్కడా మహిళలు ఎక్కువగా కన్పించలేదు. అక్కడక్కడా అతి కొద్దిగా కనిపించిన మహిళలు బహుశ పర్యుపకులై ఉండవచ్చు. దుకాణాలలో, వస్త్ర సముదాయాల్లో, హోటళ్ళలో పని చేసే స్త్రీలయితే ఎక్కడా కనిపించలేదు. సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ కనీసం పిల్లలు కూడా కనిపించలేదు. హోటళ్ళలో పాత్రలు కడుగుతూనో, తినుబండారాలు వండుతూనో కూడా మహిళలు మాకు కల్పించలేదు.

జామా మసీదు వద్దు రచయిత్రి

మేము జామా మసీదును చూడటానికి వెళ్ళినపుడు ప్రార్థనా మందిరం లోకి నన్ను వెళ్ళనివ్వలేదు. ఇక్కడకు మహిళలు రాకూడదు. “స్త్రీలకు వేరేగా మంచి ప్రార్థనా మందిరమున్నది అక్కడకు వెళ్ళండి” అని మర్యాదగా చెప్పారు. ‘నేనొక ఫోటో తీసుకోవచ్చా’ అని అడిగినప్పుడు “మీరు బయటి నుంచే ఫోటో తీసుకోవాలి, లోపలికి రాకూడదు” అని చెప్పారు. మా వారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేటపుడు ఫోటో తీసుకుని వచ్చారు.

శ్రీనగర్ లోని పాత బస్తీలోని సౌహట్టా ప్రాంతంలో జామా మసీదు ఉన్నది. ఇది 1394లో కట్టబడిందట. ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పూర్తయింది అన్న వివరాలతో శిలా ఫలకమున్నది దానిని పోటో తీసుకున్నాను. నాలుగు వైపుల నాలుగు మీనార్లతో అందంగా తీర్చిదిద్దబడింది. 1402 సంవత్సరంలో పూర్తి చేయబడింది. ఉత్తర దక్షిణాలలో 384 అడుగుల ఎత్తుతోనూ, తూర్పు పడమరల్లో 381 అడుగుల ఎత్తుతోనూ నిర్మాణాలున్నాయి. ఈ నిర్మాణాలలో వాడబడిన దేవదారు చెట్లు ఏక పొడవుతో ఒకే చెట్టు కాండాన్ని అతుకులు లేకుండా వాడారట. ఇక్కడ నుంచి హరి పర్బత్ కోట కూడా కనిపిస్తున్నది.

శ్రీనగర్ ఓల్డ్ సిటీ

కాశ్మీరులో ప్రధానంగా సింధు, చీనాబ్, జీలం నదులు ప్రవహిస్తాయి. శ్రీనగర్ పట్టణం లోకి ప్రవేశిస్తూనే జీలం నది దర్శనమిస్తుంది. ఇది సింధూనది యొక్క ఉపనది. ఇది శ్రీనగర్ పట్టణం మొత్తాన్ని ఆక్రమించుకుని ఉన్నది. సింధు నది టిబెట్‌లో పుట్టి కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‌కు వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. జాతీయ నది సింధూకు జీలంతో పాటుగా చినాబ్, బియాస్, సట్లెజ్ రావీ ఉపనదులుగా ఉన్నాయి. సింధు నది 2880 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్నది. సింధు నదీ లోయలో సుమారు 500 సంవత్సరాల సింధు నాగరికత వెల్లివిరిసిందనీ, హరప్పా, మొహంజుదారోలలో కూడా నాగరికత వర్ధిల్లిందనీ మనం చిన్ననాడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న పాఠం ఇక్కడ సజీవంగా కళ్ళెదుట కనిపిస్తుంది.

శ్రీనగర్ నుంచి సోనామార్గ్ 85 కిమీల దూరంలో ఉన్నది. ఇది చూసి రావడానికి ఒక పూర్తి రోజు పట్టింది. కేవలం 85 కి.మీల దూరం చేరడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టింది. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా ఆలస్యమైంది. ఇది గందర్ బాల్ జిల్లా లోని ఒక ముఖ్యమైన హిల్ స్టేషన్. సోనామార్గ్ అంటే ‘బంగారు పచ్చిక భూమి’ అని అర్ధం. దీని పై భాగంలో ‘ధాజివాస్ గ్లేసియర్’ ఉన్నది. అక్కడ దాకా వెళ్ళడానికి పోనీల సహాయం తీసుకుంటారు. గుర్రపుస్వారీతో కొండల మీద ప్రయాణం సాగుతున్నది. నేను పోనీ మీదకు ఎక్కగానే అది అటు ఇటు కదిలేసరికి భయపడి దిగేశాను. మిగతా కుటుంబ సభ్యులంతా గుర్రాల మీద కెక్కి కొండల మీదకు ఎక్కారు. థాజివాస్ గ్లేసియర్ దాకా వెళ్ళి వచ్చారు. నేను మాత్రం నడవగలిగినంత దూరం నడిచి కొండను ఎక్కి చుట్టూ ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదించాను. శ్రీనగర్ నుంచి సోనామార్గ్ చేరేవరకూ కూడా ప్రకృతిని చూస్తూ కనురెప్ప వేయడం కూడా మరిచిపోతాం. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య నుంచి జాలువారే జలపాతాలు దూరం నుంచి కనిపిస్తూ కనువిందు చేస్తాయి. కంటితో చూస్తూ ఆనందించాలా కెమెరా కన్నుతో పోటోలు, వీడియోలు తియ్యాలా అర్థం కాక సతమతమై పోతుంటాము. ఫోన్ ఆన్ లోనే ఉంచుకుంటే ఛార్జింగ్ సమస్య వస్తున్నది. అద్భుతమైన సీనరీని తీద్దామనుకునేలోపు కారు ముందుకు వెళ్ళిపోతోంది. ఏది అద్భుతం, ఏది అపూర్వం, ఏది అత్యంత అద్భుతం అని నిర్ణయించేందుకు మనసు సుప్రీం కోర్టు జడ్జి కన్నా ఎక్కువ కష్టపడుతున్నది. రాత్రి పది గంటలకు తిరిగి శ్రీనగర్ చేరుకున్నాం.

ఊరి నడిబొడ్డులో పారుతూ ప్రవహిస్తున్న దాల్ సరస్సుపై బోట్ షికార్ చేస్తున్నారు. ఘాట్ నెంబర్ 1, 2, 3 అంటూ ఇరవైకి పైగా పాయింట్లు ఉన్నాయి. అందంగా అలంకరించబడి మెత్తని పరుపులతో ఉన్న పడవలపై కూర్చుని గంటా రెండు గంటలు దాల్ సరస్సుపై విహారం చేశా. చుట్టూ ఉన్న జబ్బర్ వాన్ కొండలు వెనక నుంచి తొంగిచూసే హిమాలయాలు మన విహారాన్ని చూస్తూ ఉంటాయి. రాత్రంతా నీటిలోని ఉండే హౌస్ బొట్లు ప్రయాణీకులకు అందుబాట్లో ఉన్నాయి. మరికొన్ని బోట్లపై బట్టలు, ఫ్యాన్సీ వస్తువులు షాపులున్నాయి. బోట్ షికారు లోనే షాపింగ్ కూడా చేయవచ్చు. నేను ఇంతకు ముందు ‘ఫ్లోటింగ్ బజారు’ అని ఇలాగే చూశాను. కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు. అలాగే టీ, కాఫీ, మిర్చి, సమోసా వంటి వాటిని పడవలలో అమ్ముతూ మన దగ్గరకు వస్తారు. మేము కాఫీ తాగాం. తమాషా అనుభవం.

కాశ్మీరు వెళ్ళి మొఘల్ గార్డెన్స్ గురించి చెప్పకపోతే ఎలా – మొఘల్ గార్డెన్స్‌లో గులాబీలు రెండు అరచేతులంత సైజులో పూస్తున్నాయి. చిన్నప్పుడు అరకు వ్యాలీలో ఉన్న గులాబీ తోటను చూసే మైమరచి పోయాం. కాశ్మీరు వ్యాలీ లోని గులాబీల అందాన్ని వర్ణించే శక్తి ఏ కవికీ లేదనిపించింది. అనేక రకాల పూల లావణ్యం, సొగసు, వర్ణరూపాలు రాజు భోగం వర్ణించవలవి కాదనిపించింది. ఫొటోలు తీసి తీసి చేతులు నొప్పి పుట్టాయి. ఇక్కడ చెర్రీ చెట్టును చూసి ఆనందపడిపోయాం. మొఘల్ చక్రవర్తి జహంగీర్ తన భార్య నూర్జహాన్ కోసం ఈ తోటలను నిర్మించారు. దాల్ సరస్సుకు అభిముఖంగా ఉన్నది. షాలిమార్ బాగ్, నిషాత్ బాగ్, చష్మే షాహి అని మూడు తోటలు మొఘల్ గార్డెన్స్‌లో ఉన్నాయి ఇక్కడ కాశ్మీరీ వేషభాషలతో అలంకరించి పాటలు తీస్తారు.

కాశ్మీరీ పుష్పాలు

కాశ్మీరులో తిరుగుతున్నపుడు చినార్, పైన్, విల్లో, యాపిల్, వాల్ నట్లూ చెట్లను చూసి ఆశ్చర్యానందాలకు లోనయి వాటి వద్ద ఫోటోలు తీసుకున్నాను. ఆకులు, కాయాలు తెంపి ఇంటిదాకా తెచ్చుకున్నాను. స్విట్జర్లాండు దేశం నుంచి పైన్ చెట్ల కాయలు తెచ్చి రంగులు వేసి బొమ్మలు చేసి మా మిల్కీ మ్యూజియంలో పెట్టుకున్నాను. కాశ్మీరు నుంచి డ్రైఫ్రూట్స్, కుంకుమపువ్వు, పశ్మీనా షాల్స్, స్వెటర్లు తెచ్చుకున్నాను. విల్లో చెట్ల కాండంతో క్రికెట్ బ్యాట్లు తయారుచేస్తారట. వుడ్ కార్వింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దేవదారు వృక్షాల కలపతో దేవుడికి సంబంధించిన ఆలయాలలో గవాక్షాలు ద్వారాలు, పైకప్పులు తయారుచేస్తున్నారు. ఊరంతా ఎక్కడ చూసినా వారు శిల్పాలు, కళాకారులు, దుకాణాలు కనిపిస్తున్నాయి.

వాల్‍నట్ చెట్టు వద్ద రచయిత్రి

ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లు చెపుతున్న శంకరాచార్య ఆలయం శ్రీనగర్ ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ఆలయం ఒక కొండపై ఎత్తైన అష్టభుజి వేదికపై ఉన్నది. కారులో కొండ ఎక్కాక దాదుపు 243 మెట్లు ఎక్కిన తర్వాత గానీ శివున్ని దర్శనం చేసుకోలేము. ఇది 200 BC కాలం నాటిది. ఈ ఆలయాన్ని సాలమన్ రాజు గార్డెన్ అని కూడా పిలుస్తారు.

మరో రోజు ఉదయమే ‘దూద్ పత్రి’కి బయల్దేరాము. ఇది ఘాట్ రోడ్డులా కాక మైదాన ప్రాంతంలా అనిపించింది. ఇక్కడ పైన్, విల్లో చెట్లు విపరీతంగా కనిపించాయి. ఇక్కడ కొండ మీద నుంచి నీటి జలపాతం దగ్గరకు వెళ్ళటానికి పోనీలు, బైకులున్నాయి. మేము బైకులు తీసుకున్నాం. వీటిని ఈటివి బైకులంటారు. నాలుగు చక్రాలతో రాళ్ళమీద సైతం నడపటానికి వీలుగా ఉన్నాయి.

బైక్ రైడింగ్

ఈ లోయ అద్భుతంగా ఉన్నది. ఇక్కడ నీళ్ళు పాల వలె తెల్లగా ఉండటంతో దీనికి ‘దూద్  పత్రి’ అనే పేరు వచ్చింది. పొడవైన చెట్ల మధ్య నుంచి పడే సూర్య కిరణాలు, కొండల మీద నుంచి దూకే జలపాతాలు పచ్చిక బయళ్ళ పై గడ్డిని మేస్తూ గుర్రాలు నిజంగా భూలోక స్వర్గం పేరు సార్ధకమైందనిపిస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి నీరు పాల రంగులో దూకుతుంటే ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి దేవేంద్రుడికి వలె ఒళ్ళంతా కళ్ళుంటే గానీ సాధ్యపడేలా లేదు. ఈ అందాలను వర్ణించాలంటే భాష సరిపోదేమో అనిపిస్తుంది. చూసి మనసులో పదిల పరుచుకోవటమే. జీవితంలో ఒక్కసారైనా చూసి ఆనందించవలసిన అద్భుత సౌందర్యాల ముగ్ధ కాశ్మీరు సుందరి.

Exit mobile version