Site icon Sanchika

అద్దె గర్భం

[శ్రీ మెట్టు మురళీధర్ రచించిన ‘అద్దె గర్భం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“నా[/dropcap] పాపను నాకు దూరం చేయకండి” అంటూ చేయెత్తి నమస్కరించింది సుశీల. కోర్టు బోనులో జడ్జీ ముందు నిలబడి విపరీతంగా ఏడుస్తోందామె. గ్యాలరీలో కూర్చున్న సుశీల తల్లి వెంకటలక్ష్మి కన్నీరు మున్నీరవుతోంది. ఈ విషయమంతా తెలియని పాప వెంకటలక్ష్మి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. లాయరు వాదన ప్రారంభించాడు, “నీ పేరేంటమ్మా?” అంటూ.

“సుశీల” అంటూ ఏడుస్తూనే చెప్పిందామె.

“నీ భర్త..?”

“లేడు.”

“మరి ఈ పాప..?”

“నా పాపే.”

“ఎలా?.. నిన్నెవరైనా మోసం చేశారా?”

సమాధానం చెప్పకుండా సుశీల ఏడుస్తోంది.

“ఏడుపు సమాధానం కాదమ్మా?”

“ఇది నా పాపే.”

“అదే.. ఎలా?”

“నేను నా గర్భాన్ని అద్దెకిచ్చాను.”

“డబ్బులు ముట్టాయా మరి?”

“ముట్టాయి”

“మరింకేం?”

“నాకు పాపే కావాలి. వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చేస్తాను.”

“అలా అంటే ఎలా? వాళ్ళు నీ గర్భాన్ని అద్దెకు తీసుకున్నారు. అద్దె చెల్లించారు. సరిపోయింది కదా?”

“కాదు, నేను తొమ్మిది నెలలు మోసి కన్నాను”

“అలా అను. అద్దె సరిపోలేదను. కోర్టువారు మరిన్ని డబ్బులిప్పిస్తారు.”

“నాకు డబ్బు అవసరం లేదు, పాపే కావాలి.”

“అలా అంటే ‘లా’ ఒప్పుకోదు.”

“సార్! నేను మీలా బాగా చదువుకున్నదాన్ని కాదు. దయచేసి నా పాపను నాకు దూరం చేయకండి.”

“అసలు పాపే నీది కాదు, దూరం చేయడమేమిటి?”

“నేను కన్నప్పుడు పాప నాదే కదా?”

“కంటేనే సరిపోదమ్మా!”

“మరి?”

“పాప జన్మకు కారణమైన ఫలదీకరణకు మూలం కావాలి” సుశీలకు మాట పెగల్లేదు. కాసేపు నిశ్శబ్దం. తర్వాత అంది,

“కాకపోవచ్చు. కాని పాప ఎదగడానికి మూలమయ్యాను. పాపకు నా రక్తమాంసాలు అందించాను. పాప పుట్టడానికి కారణమయ్యాను. పాప నా కడుపులో పడ్డ మరుక్షణం నుంచి పాపతో నా బంధం పెరిగింది.”

“చూడమ్మా! నీవెన్ని చెప్పినా పాప నీది కాదు. ఎందుకంటే కోర్టుకు సాక్ష్యాలు కావాలి.”

“సాక్ష్యం కావాలంటే నాకు పురుడు పోసిన డాక్టరమ్ముంది.”

“ఆ డాక్టరమ్మే పాప నీది కాదని చెబుతోంది. సుకన్య సుకుమార్ దంపతుల పిండమూలాన్ని నీ గర్భంలో నిలిపానని చెబుతోంది.”

ఆ మాట విని సుశీల ఏడుస్తోంది. మళ్ళీ లాయరే అన్నాడు, “DNA రిపోర్టు కూడా పాప, సుకన్య సుకుమార్ లదేనని చెబుతోంది. మీరు రాసుకున్న ఒప్పందపత్రాల్ని సుకన్య సుకుమార్‌లు కోర్టుకు సమర్పించారు. చూడమ్మా! నీకు కావాలంటే మరింత డబ్బు ఇప్పించుకొని వాళ్ళ పాపను వాళ్ళకు అప్పగించు.”

సుశీల వెక్కివెక్కి ఏడుస్తూ బోనులో కూలబడిపోయింది. అంతలోనే.. నిమిషంలోనే సుశీల పైకిలేచి అంది,

“అదిగో! నా పాపకు ఆకలవుతున్నట్టుంది. నాకు పాలచేపులు వస్తున్నాయి..”

అని అంటుండగానే సుశీల జాకెట్టుతో పాటు ఆమె పైట కూడా పాలతో తడిసిపోయింది. అంతలోనే వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న పాప ఏడవడం మొదలుపెట్టింది. ఆ దృశ్యాన్ని చూచి జడ్జిగారు తట్టుకోలేక పోయారు. కోర్టును తాత్కాలికంగా వాయిదావేసి లోపలికి వెళ్ళిపోయారు.

బోనులో ఉన్న సుశీల ఒక్క ఉదుటున వెళ్ళి పాపను ఎత్తుకొని పరిసరాల్ని కూడా గమనించకుండా పాపకు పాలు ఇస్తోంది. ఆమె కళ్ళు ధారగా కురుస్తున్నాయి.

***

తెలిసీతెలియని వయసులో, తొమ్మిదో తరగతి చదువుతున్న సుశీలను చదువు మానిపించి 15 సంవత్సరాలకే పెళ్ళిచేసింది వెంకటలక్ష్మి. మంచి సంబంధమంటూ, పోతే దొరకదంటూ తల్లి చేసిన సంబంధంలో సుశీలకు మంచేమాత్రం జరుగలేదు. పెళ్ళై ఐదు సంవత్సరాలైనా సుశీల తల్లి కూడా కాలేదు. డాక్టరుకు చూపిస్తే ఆమెలో ఏ లోపం లేదని, ఆమె భర్తను పరీక్షించాలంది. కాని సుశీల భర్త ఒప్పుకోలేదు. అంతేకాదు, తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి సుశీల మీద ‘గొడ్రాలి’ ముద్ర కూడా వేశాడు.

అప్పటికే తాగుడుకు, జూదానికి అలవాటుపడ్డ సుశీల భర్త ఐదు సంవత్సరాల్లోనే ఉన్న మూడెకరాల భూమిని అమ్మేసి కూలిపనినే ఆమెకు ఆస్తిగా మిగిల్చాడు. తర్వాత ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. అలా పోయినవాడు ఐదారు సంవత్సరాలు దాటినా తిరిగి రాలేదు. అతడు చనిపోయాడేమో అని చాలామంది అనుకున్నారు.

వెంకటలక్ష్మికి సుశీల ఒక్కతే కూతురు. ఆమె పుట్టిన పది సంవత్సరాలకు ఆమె తండ్రి మరణించాడు. అప్పటినుండి తల్లీ కూతుళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు.

వెంకటలక్ష్మికి మొదటినుండీ అనారోగ్యమే. ఏ పని చేసినా ఆయాసం వచ్చేది. పల్లెటూరు డాక్టర్లు ఇచ్చే మందులు ఆమెకు పెద్దగా పనిచేయలేదు. అప్పటికే సుశీల చిన్నమ్మవాళ్ళు పట్నంలో ఉన్నారు. సుశీల చిన్నాయన సెంట్రింగ్ పనులు చేసేవాడు. తాము కూడా పట్నంపోతే మూడునాలుగు ఇండ్లల్లో ఇంటిపని, వంటపని చేసుకోవచ్చని, ఇంకా తల్లికి మంచి వైద్యం అందించవచ్చనుకొని పట్నం చేరింది సుశీల.

కాని పట్నం చేరిన కొద్దిరోజులకే వెంకటలక్ష్మి ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అది గుండెజబ్బని నిర్ధారించి, తొందరగా ఆపరేషన్ చేయాలని, ‘ఆరోగ్యశ్రీ’ కార్డు లేదు కాబట్టి నాలుగైదు లక్షలు ఖర్చవుద్దని చెప్పారు. అప్పట్లో ప్రభుత్వం కొన్ని కార్డుల్ని రద్దు చేయడంతో వెంకటలక్ష్మికి ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు రద్దయి మళ్ళీ రాలేదు. సుశీలకు ఏం చేయాలో తోచలేదు.

సరిగ్గా అప్పుడే సుశీల చిన్నాయన చెవిలో ఓ వార్త పడింది. అతడు పనిచేసే దగ్గర సుకుమార్ అని ఓ ఇంజనీరున్నాడు. అతని భార్య సుకన్య. మంచి అందగత్తె. పెళ్ళయి పది సంవత్సరాలైనా ఆమె పిల్లల్ని కనలేదు. పిల్లల్నికంటే తన అందం చెడిపోతుందని భావించి డాక్టరు సలహాతో అద్దెగర్భం వైపు మొగ్గు చూపుతోందామె. అందుకే ఏ ఆరోగ్యవంతమైన యువతియైనా తన గర్భాన్ని అద్దెకిస్తే ఆమెకు ఐదులక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్దపడింది.

ఈ విషయం తెలియగానే సుశీల చిన్నాయనకు, సుశీల మనసులో మెదిలింది. సుశీల తన గర్భాన్ని అద్దెకిస్తే, వచ్చిన డబ్బుతో తల్లికి గుండె ఆపరేషన్ చేయించవచ్చుగదా? అనిపించింది. ఆ విషయాన్నే సుశీలతో చెప్పాడు. అంతేకాదు, అద్దెగర్భం వల్ల స్త్రీ శీలం పోయినట్టుకాదని, అదొక రకంగా సహాయమేనని డాక్టర్లు అంటున్న విషయాన్ని కూడా చెప్పాడు. ఐతే అతని సలహాను వినకపోగా అతన్నే తిట్టి పంపేసింది సుశీల.

చిన్నాయన మాటలతో మనసు వికలమైన సుశీల వారం రోజులదాకా ఎవరి ఇంటికీ పనికిపోలేదు. వెంకటలక్ష్మీ పోయి పని చేసింది. అలా పనిచేస్తూనే ఒకరోజు ఒకరి ఇంట్లో గుండెనొప్పితో కుప్పకూలింది. విషయం తెలిసిన సుశీల పరుగున వచ్చి తల్లిని హాస్పిటల్లో చేర్చింది. డాక్టర్లు పరీక్షించి వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు. సుశీల ఆలోచనలో పడింది.

ఒకవైపు తన కోసమే బతుకుతున్న అమ్మ. మరొకవైపు తనను వెక్కిరిస్తున్న పేదరికం. ఇంకొకవైపు చిన్నాయన చెప్పిన అద్దె గర్భం.. రాత్రంతా ఆలోచించి ‘తల్లి తర్వాతే మిగతావన్ని’ అనుకొని తన గర్భాన్ని అద్దెకివ్వాలని నిర్ణయించుకుంది. వెంటనే చిన్నాయనను పిలిచి తన నిర్ణయాన్ని చెప్పింది.

అంతే.. రెండు రోజుల్లో అన్నిపనులూ పూర్తయ్యాయి. డాక్టరు సుశీలను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. పిదప సుకన్య సుకుమార్‌లు డాక్టరు ద్వారా మరియు లాయరు ద్వారా అన్ని పత్రాలమీద సుశీల సంతకాలు తీసుకున్నారు. వెంకటలక్ష్మి తోను మరియు సుశీల చిన్నాయనతోను సాక్షి సంతకాలు తీసుకున్నారు. తర్వాత సుకన్యసుకుమార్‌లు ఐదులక్షల రూపాయలు సుశీల చేతికి ఇచ్చారు. ఆ తర్వాత వెంకటలక్ష్మికి గుండె ఆపరేషన్ జరిగిపోయింది.

ఆపరేషన్ జరిగిన నెలరోజుల్లో వెంకటలక్ష్మి కోలుకుంది. తర్వాత సుశీలకు ట్రీట్‍మెంటు ప్రారంభమయింది. రెండుమూడు నెలల్లోనే ట్రీట్‍మెంటు ఫలించింది. సుశీలకు గర్భం నిలిచింది. సుకన్యసుకుమార్‌లు సంతోషంతో పొంగిపోయారు.

నెలలు గడుస్తున్నకొద్ది సుశీల ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువయింది. సుశీల శరీరంలో మార్పులు ప్రారంభమయ్యాయి. శారీరక మార్పులతో పాటు సుశీల మానసిక స్థితిలో కూడా మార్పులు మొదలయ్యాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నకొద్ది సుశీలకు బిడ్డమీద ప్రేమ పెరుగసాగింది. బిడ్డతో బంధం బలపడసాగింది. బిడ్డను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ముద్దాడాలి? అనే కోరికలు బలీయమయ్యాయి. బిడ్డ గుర్తుకు వస్తేనే ఆమె మనసు పులకరిస్తోంది. బిడ్డను తలుచుకుంటేనే అమ్మతనం పొంగివస్తోంది.

‘పుట్టకముందే ఇంతగా ప్రేమించే బిడ్డను పుట్టిన తర్వాత తాను సుకన్యకు ఇవ్వాలి. ఇవ్వగలదా? బిడ్డను విడిచి పోవాలి. పోగలదా?’ బిడ్డలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతోంది సుశీల. ఇంకా పుట్టని బిడ్డకోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తోంది. నెలలు నిండాయి. భరించలేని పురిటినొప్పులు

మొదలయ్యాయి. భరించాలంది డాక్టరమ్మ. బిడ్డ రూపాన్ని

ఊహించుకుంది సుశీల. బిడ్డ లేలేత బుగ్గలు, చిన్ని చిన్ని కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు.. అన్నీ ఆమె కళ్ళ ముందు కనిపించాయి. బిడ్డను ఎత్తుకున్నట్టు, ముద్దాడినట్టు అనుభూతికి లోనై పాపనుకన్నది సుశీల.

సుకుమార్ సుకన్యల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. హాస్పిటల్లో అందరికి స్వీట్లు పంచారు. నర్సులకు, ఆయాలకు, పనివాళ్ళకు డబ్బులు వెదజల్లారు.

ఒప్పందం ప్రకారం పాపను సుకన్యకు ఇచ్చి పోవాలి సుశీల. ఆ విషయం గుర్తుకురాగానే వణికిపోయింది సుశీల. ఆమెలో ఆలోచనలు మొదలయ్యాయి. ‘ఇప్పుడు తాను పాపను వదిలి వట్టిచేతులతో పోవాలి. పోగలదా? తొమ్మిదినెలలు తనలో భాగంగా ఉన్న పాపను మరొకరికి ఇవ్వాలి. ఇవ్వగలదా? పాపను విడిచి ఉండాలి. ఉండగలదా? పాప లేకుండా బతకాలి. బతుకగలదా? లేదు.. లేదు. పాప తనకు కావాలి. తనకే కావాలి. పాప ఉంటే చాలు. మరేమీ వద్దు’. సుశీల ఒక నిర్ణయానికి వచ్చింది. సుకుమార్, సుకన్యలు వచ్చారు. పాపను తీసుకోడానికి సుకన్య చేతులు చాచింది. సుశీల అడ్డుకుంది.

“ఇది నా పాప. నేను ఇవ్వను” అని కచ్చితంగా చెప్పింది. సుకుమార్ సుకన్యలు బెదిరిపోయారు. విషయం తెలిసి లాయరు డాక్టరమ్మ పరుగు పరుగున వచ్చారు.

“సుశీలా! ఇది నీ పాప కాదు” అన్నారు ముక్తకంఠంగా.

“నా పాపే, నా పేగు తెంచుకొని పుట్టిందీ పాప. ఇవ్వను గాక ఇవ్వను” పిచ్చిదానిలా అరుస్తోంది సుశీల.

“ఇవ్వనంటే కుదరదు. ఒప్పందం ప్రకారం మేం తీసుక పోతాం, అంతే” అన్నారు వారు అదే స్థాయిలో.

“అలా చేస్తే నేను ఇక్కడే, ఇప్పుడే చచ్చిపోతా” అంటూ అరిచింది సుశీల. అరుస్తూనే ఉంది..

లాయరు మధ్యలో కలుగజేసుకొని సుశీలకు సర్ది చెప్పాడు. ఆమె వినలేదు. పాపకు DNA టెస్టు చేయిస్తానన్నాడు. సుశీల పట్టించుకోలేదు. కోర్టుకు వెళతానని బెదిరించాడు. సుశీల బెదరలేదు.

సుకుమార్ సుకన్యలు ఖంగుతిన్నారు. డాక్టరమ్మ ఆశ్చర్య పోయింది. కోర్టులో తేల్చుకుందామని లాయరు కోపంగా వెళ్ళిపోయాడు. తెల్లవారే కోర్టులో కేసు ఫైలయింది. రోజులు.. నెలలు.. వాయిదాల మీద వాయిదాలు..

గతమంతా కళ్ళముందు మెదిలి బిగ్గరగా ఏడ్చింది సుశీల.

***

ఆ రోజు పాప విషయంలో తీర్పు వచ్చేరోజు. నెలలుగా నడుస్తున్న ఈ కేసు సంచలనాత్మకమయింది. పేపర్లలో, TV లలో రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. న్యాయం తెలిసినవారు పాప సుకన్యదే అంటున్నారు. మాతృహృదయం తెలిసినవారు పాప సుశీలదంటున్నారు.

బోనులో నిలబడింది సుశీల. లాయరు వాదిస్తున్నాడు.

“చూడు సుశీలా! కావాలంటే డబ్బు అడుగు. అంతేగాని మొండిగా ఉండకు “

సుశీల ఏడుస్తోంది.

“నువ్వు ఏడ్చినా పాప నీకు దక్కదు. ఒక్క సాక్ష్యం కూడా నీకు అనుకూలంగా లేదు.”

ఇంకా సుశీల ఏడుస్తూనే ఉంది. చివరికి లాయరు జడ్జీవైపు తిరిగి అన్నాడు,

“గౌరవ జడ్జీగారూ! మీకు అన్ని రిపోర్టులు సమర్పించాను. ఇంకా ఈ కేసులో వాదించేందుకు ఏమీ లేదు. దయచేసి నా క్లయింట్లు సుకుమార్ సుకన్యలకు పాపను ఇప్పించి వారికి న్యాయం చేయండి.”

లాయరు వాదన ముగించాడు. న్యాయమూర్తి ఏం చెబుతారోనని అందరిలోను ఉత్కంఠగా ఉంది. జడ్జి గారు పెదవి విప్పారు. “అమ్మా సుశీలా! నీవు చెప్పేది ఏమైనా ఉందా?” అని అడిగారు.

“ఉంది సార్! నన్ను మీ కూతురుగా భావించి నామాటలు వినండి. నేను గర్భాన్ని అద్దెకిచ్చింది నిజమే. డబ్బు తీసుకున్నదీ నిజమే. కాని నేను గర్భం దాల్చక ముందు మాతృత్వపు అనుభూతి నాకు తెలియదు. తర్వాత తెలిసింది. ఇప్పుడు పాప నా శరీరంలో ఒక భాగమయింది. నాఊపిరిలో ఊపిరయింది. పాప నా కడుపులో పెరుగుతున్నకొద్ది పాపతో నా బంధం బలపడింది. కడుపుతీపి అంటే ఏమిటో నాకర్థమయింది. అమ్మతనం తెలిసివచ్చింది.” సుశీల కళ్ళు తుడుచుకొని మళ్ళీ ప్రారంభించింది.

“పాపను నేను నవమాసాలు మోసి కన్నాను. అందుకే పాప కదలికలు నాకు తెలుస్తున్నాయి. పాపకు ఆకలయితే నాకు పాలు పొంగివస్తున్నాయి.పాప ఏడిస్తే నా హృదయం తల్లడిల్లిపోతున్నది. ఒకవేళ ఇవన్నీ నాకు ముందే తెలిస్తే నేను నా గర్భాన్ని అద్దెకు ఇచ్చేదాన్నే కాదు.”

ఉబికివస్తున్న కన్నీళ్ళు సుశీల గొంతుకు అడ్డుపడ్డాయి. కాసేపు ఆగి కళ్ళు తుడుచుకొని మళ్ళీ ప్రారంభించింది సుశీల.

“సార్! అద్దెగర్భాలు మంచో కాదో నాకు తెలియదు. కాని అద్దెగర్భం ద్వారా గర్భం ధరించిన తల్లి మనసు నాకు తెలుసు. ఆ తల్లి అనుభూతులు నాకు తెలుసు. ఆ గర్భం ద్వారా పుట్టిన బిడ్డ దూరమైతే తల్లి పడే ఆవేదన నాకు తెలుసు. అందుకే వాళ్ళ డబ్బును వాళ్ళకు ఇచ్చేస్తాను. జీవితాంతం ఊడిగం చేసైనా సరే వాళ్ళ బాకీ తీరుస్తాను. దయచేసి నాపాపను నాకు దూరం చేయకండి.”

సుశీల చేతులెత్తి నమస్కరించింది. ఆమె కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి. కోర్టులో విషాద వాతావరణం ఆవరించింది. కోర్టు హాలు నిశ్శబ్దమయింది. అంతలోనే నిశ్శబ్దాన్ని భగ్నంచేస్తూ గ్యాలరీలో కూర్చున్న వెంకటలక్ష్మి ఒడిలోని పాప ఏడవడం ప్రారంభించింది.

“పాపను ఊరుకుంచండి” అని జడ్జిగారన్నారు.

“పాల పాలకేడుస్తుందయ్యా” వెంకటలక్ష్మి సమాధానం.

“పాపను బయటికి తీసుకపొండి.”

“బయటకు పోయినా పాపకు అమ్మపాలు కావలసిందే” పాప ఏడుపు ఎక్కువయింది. గుక్కపట్టి ఏడుస్తోంది పాప.

“సుశీలా! పాపకు పాలు పట్టిరా తల్లీ” అన్నారు జడ్జి.

సుశీల బోనులోంచి పోయి పాపను ఆత్రంగా అందుకుంది. ప్రేమగా అక్కున చేర్చుకుంది. లాలనగా పాలు పట్టింది. పాలు తాగుతూ పాప సుశీల ఒడిలోనే మలమూత్రాలు విసర్జించింది. సుశీల ఏ మాత్రం అసహ్యించుకోకుండా తుడిచేసుకుంది. పాప ఏడుపు మానింది. పాపను వెంకటలక్ష్మికి ఇచ్చేసి మళ్ళీ బోనులోకి వచ్చి నిలబడింది సుశీల. జడ్జిగారు తీర్పు చెప్పడం ప్రారంభించారు.

“గత కొన్నినెలలుగా ఈ కేసుపై వస్తున్న విశ్లేషణలను, వార్తలను వింటున్నాను, చూస్తున్నాను. కాని విశ్లేషకులకు, సామాజికవేత్తలకు ఉన్నంత స్వేచ్ఛ కోర్టులకుండదు. కోర్టుకు కొన్ని పరిధులుంటాయి. కోర్టుకు సాక్ష్యాలే ముఖ్యం. తీర్పుకు సాక్ష్యాలే ప్రాణం. ఈ కేసులో అన్ని సాక్ష్యాలను పరిశీలించాను. సాక్ష్యాలన్నీ సుకన్యకే అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల పాప సుకన్యకే చెందాలని తీర్పు ఇస్తున్నాను. సుశీల ఊరట పొందాలని కోరుతున్నాను.

ఈ కేసులో న్యాయసంబంధమైన అంశాలతోపాటు మాతృత్వపు అనుభూతులు మిళితమై ఉన్నాయి. అందువలన ఈ కేసులోని పూర్వాపరాలను, సామాజిక ప్రయోజనాలను, మాతృమూర్తుల అనుభూతులను దృష్టిలో పెట్టుకొని అద్దెగర్భాలపై స్వయం నియంత్రణ పాటించాలని నేను మానవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మాతృత్వం ఎంతో పవిత్రమైనది. అది స్త్రీ జాతికి చెందిన వరం. అందువల్ల పిల్లల్ని కనగలిగి ఉండి అద్దెగర్భాల వైపు మొగ్గుచూపుతున్న మహిళామణులను మరొకసారి ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను.” అంటూ తీర్పు చెప్పి జడ్జి గారు సీట్లోంచి లేచారు.

ఆయన కళ్ళు తుడుచుకుంటున్న దృశ్యం అక్కడున్నవాళ్ళకు కళ్ళనీళ్ళు తెప్పించింది.

సుశీల బోనులోంచి పరుగెత్తుకెళ్ళి పాప దగ్గరికి పోయింది. కాని అప్పటికే వెంకటలక్ష్మి చేతుల్లో ఉన్న పాప సుకన్య చేతుల్లోకి మారిపోయింది.

అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న పాప ‘స్పర్శ’ మారిందేమో మళ్ళీ ఏడుపు ప్రారంభించింది.

Exit mobile version