అడ్డుగోడలు

1
2

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘అడ్డుగోడలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]రవయ్యేళ్లు వెనక్కి తిరిగి
బాల్యాన్నొకసారి
సింహావలోకనం చేసుకుంటే,
మనసు వికలమై..
గుండెబరువెక్కిపోతుంది
గతం ఒక విషాదం అనిపిస్తుంది!

పండుగలు – పబ్బాలు..
ఆ వేడుకలు – ఆనందాలు,
మమ్మల్ని అస్పృశ్యుల్ని చేసి
దూరంగా జరిగిపోయేవి..!

కమ్యూనిజానికి..
నాస్తికవాదం తోడై..
‘దేవుడు’ అనే పదం..
మా అవగాహనా నిఘంటువులో
అసలు చోటుచేసుకోలేదు!

దీపావళి వచ్చిందంటే..
ఆనందానికి బదులు..
నీరసం ముంచుకొచ్చేది!
చుట్టుపక్కల పిల్లలంతా
ఉత్సాహంగా ఉల్లాసంగా
కాకరపువ్వొత్తులు – చిచ్చుబుడ్లు
మతాబాలు – విష్ణు చక్రాలు
సిసింద్రీలు కాలుస్తూ –
టపాకాయలు – లక్ష్మీ బాంబులు
పేలుస్తుంటే.. నాలాంటివాళ్ళు
చిటికెల పోట్లాముతోనే..
సరిపెట్టుకోవాల్సి వచ్చేది!
పండగంటే —
పటాసులు కాల్చుకోవడం
పిండివంటలు తినడమే
అనుకున్న రోజులవి..!

రోజులు మారాయ్..
జీవనపరిస్థితులు మారాయ్,
అయితేనేమి..
పండగ పరిస్థితి యథాతథం!
అప్పుడు నాస్తికత్వానికి –
పేదరికం తోడయింది..!
ఇప్పుడు —
లక్ష్మీ దేవి కటాక్షం వున్నా,
మత మౌఢ్యం మస్తుగా
అడ్డుపడుతోంది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here