అదే నేల – పుస్తక పరిచయం

0
2

[dropcap]భా[/dropcap]రదేశపు వివిధ భాషలలోని కవిత్వాన్ని తెలుగు పాఠకులు అనువాదాల ద్వారా అందిస్తూ భారతీయ కవిత్వపు నేపథ్యాన్ని వివరిస్తున్నారు సుప్రసిద్ధ కవి ముకుంద రామారావు.

***

“అనువాద కళని ఆపోశన పట్టిన రామారావు యిప్పుడు ‘అదే నేల’ ద్వారా భారత దేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాల్ని వాటి చారిత్రక నేపథ్యంతో సహా మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలితో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి దాదాపు మూడు వేల మంది కవుల్ని యీ గ్రంథం ద్వారా ఆయన పరిచయం చేస్తున్నారు. ఏడు వందలకు పైగా కవితల్ని అనువదించి దేశంలోని భిన్న జాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే వాటిమధ్య ఐక్యత కోసం సాంస్కృతిక వారధిని నిర్మిస్తున్నారు.

పొరుగున వున్న భాషల్లో వచ్చే సాహిత్యం గురించిన యెరుక ఆసక్తి మనకు తక్కువ. సంచలనం కల్గించిన వచన రచనలనైనా అనువదించి తెచ్చుకుంటాం గానీ కవిత్వమైతే గ్రహాంతరానికి సంబంధించిన సరుకే. ఒకప్పుడు బెంగాలీ నుంచి కొన్ని రచనల్ని అనువదించుకున్నాం గానీ యిప్పుడు దానికీ దూరంయ్యాం. బయటి భాషల్లో జరిగే సాహితీ వ్యాసంగం విషయికంగా అంధత్వాన్ని ప్రదర్శిస్తోన్న కారణంగా ఆదాన ప్రదానాలు ఆగిపోయాయి. అధ్యయనం అడుగంటింది. అధ్యయనం లేమి యే భాషా సాహిత్యాలకైనా మంచిది కాదు. బావిలో కప్పల బెక బెకల్లో సృజనాత్మకత తగ్గుముఖం పట్టింది. ఈ నేలపై పెరిగిపోతున్న యీ సాహిత్య సాంస్కృతిక దూరాల్ని అధిగమించడానికి గత దశాబ్ద కాలంగా ముకుంద రామారావు చేసున్న ప్రయాణంలో ‘అదే నేల – భారతీయ కవిత్వం: నేపథ్యం’ గుర్తుండిపోయే మలుపు” అని వ్యాఖ్యానించారు సంపాదకులు ఎ.కె. ప్రభాకర్ తమ ముందుమాటలో.

***

“ఇందులో ఎన్నుకున్న కవితలు, నాకు లభ్యమైన మంచి కవితల అనువాదాల నుంచి నాకు నచ్చినవి, నేను అనువాదం చేయగలను అనుకున్నవి మాత్రమే. అయితే కవితల్ని ఎన్నుకునే ప్రక్రియలో, కొన్ని కవితలని చారిత్రక ప్రాముఖ్యత మూలంగాను, కొన్ని వాటి ఏకైకత మూలంగాను, కొన్ని వాటి సాధారణ ప్రజాదరణ మూలంగానూ, మరికొన్ని వాటి శక్తివంతమైన ధోరణుల మూలంగానూ, అలా అలా ఎన్నో నన్ను, నాకు తెలియకుండానే నాకు సాయపడి వాటిని ఎన్నుకునేట్టు చేసేవి. అది ఈ రచనకున్న పరిమితి. అంచాత ఏ సంకలనమూ సర్వ సమగ్రం కాదు అన్నది అందరూ అంగీకరించే సత్యం. సంకలనాలు ఒక విధంగా ఇంకా చదవాలన్న ఆకలిని పుట్టించే సాధనాలు, ఆకలిని పూర్తిగా తీర్చగలిగేవి మాత్రం కావు.

~

ఈ సంకలనం భారతీయ భాషల్లోని కవితల్ని చదవాలన్న కుతూహలాన్ని ఏమాత్రం కలిగించినా రేకెత్తించినా నాకు సంతోషమే. నేను దానికి క్రియాశీల ఉపకరణం కాలేకపోయినా కనీసం ఉత్ప్రేరకంగా మిగిలినా కూడా ఆనందమే” అన్నారు కవి ముకుంద రామారావు తమ ముందుమాటలో.

***

కొన్ని భారతీయ భాషల కవితలకు ముకుంద రామారావుగారి అనువాదం చూద్దాం.

అద్దె ఇల్లు

నా ఒక గదిలో అతను కూర్చుని చదువుకుంటాడు
మరొక గదిలో విందుకి భోజనానికి
ఇంకొక గదిలో పాడుతాడు.
మరొక దానిలో నిద్రిస్తాడు
అతను హృదయం అద్దెకు తీసుకున్నాడు
నా హృదయం నాలుగు గదుల్ని
అతనెవరో కాదు
దుఃఖం.

అసోమియా మూలం నీలిం కుమార్.

***

నల్ల గోరింటాకు

దేవుడి ప్రతినిధులు
స్వర్గం మందులు పంచుతున్నారు
వాంతులు వాంతులు చేసుకుంటూ
బక్కపలచని దేవుణ్ణి
అగ్ని కురిపిస్తూ అడుగుతున్నారు
దినబత్తేలు ఎక్కడని.

బోడో మూలం విష్ణుజ్యొతి కచారి.

***

ఎక్కడా లేని వ్యక్తి

చింతిస్తున్నానని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది
కనుక మనం అపరిచిత పదాలు వాడదాం
ఎండలు పోయి భూమి చల్లబడుతోంది
పాత రహదారి మళ్ళీ నన్ను వెనక్కి పిలుస్తోంది
మరొక సమయంలో మళ్ళీ కలుద్దాం:
అపరిచితుల్లా, మిత్రుల్లా,
లేదా బహుశా ప్రేమికుల్లా మళ్లీ
అప్పుడు తిరుగు, తిరుగు వర్షానికి మళ్లీ.

ఆంగ్ల మూలం ప్రీతీష్ నంది.

***

అదే నేల (కవిత్వం)
రచన: ముకుంద రామారావు
ప్రచురణ: సాహితి ప్రచురణలు
పుటలు: 867
వెల: ₹ 600/-
ప్రతులకు:

  • సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
  • ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here