అదే పాట ఇదే చోట-1

0
2

[box type=’note’ fontsize=’16’] ఎన్నో తెలుగు పాటల మూలాలు హిందీ, తమిళం, మళయాళం, బెంగాలీ భాషా చిత్రాల నించి స్ఫూర్తిగా తీసుకుని ట్యూన్ చేయడం జరిగింది. అందులో బహు పాపులర్ అయిన పాటల గురించి “అదే పాట ఇదే చోట” అనే రచనలో వివరిస్తున్నారు ఆర్. దమయంతి. [/box]

[dropcap]తె[/dropcap]లుగులో కొన్ని పాటలు నన్నెంతగానో ఆకట్టుకునేవి. కానీ, అవి ఇతర భాషా చిత్రాల నించి తీసుకోవడం జరిగిందని తెలిసినప్పుడు ‘అరె, ఔనా!??ఈ పాట ఘంటసాల గారి సొంతమనుకున్నానే? రాజేశ్వర రావు గారు అబ్బ ఎంత అద్భుతంగా ట్యూన్ చేసారో అని మురిసానే!!’ అంటూ ఆశ్చర్యపోతుండేదాన్ని. పెద్దయ్యాక, ఆ పాపులర్ ట్యూన్ కాపీదని తెలిసాక నిరాశగా వుండేది, మనవాళ్ల మీది అభిమానం వల్ల.
కానీ, తెలుగులో పాటలూ – హిందీ మరి ఇతర భాషల్లోకి వెళ్లాయని తెలిసినప్పుడు భలే సంతోషమేసేది. చిన్నపిల్లలా సంబరపడిపోయేదాన్ని.
ఒకటా రెండా అలా ఎన్నో తెలుగు పాటల మూలాలు హిందీ, తమిళం, మళయాళం, బెంగాలీ భాషా చిత్రాల నించి స్ఫూర్తిగా తీసుకుని ట్యూన్ చేయడం జరిగింది. అందులో బహు పాపులర్ అయినవి ఎన్నో వున్నాయి.
వీటిని ఒక చోట చేర్చి వీక్షించడం అంటే నాకు మహ సరదా. అంతే కాదు, ఇతర భాషలో వున్న ఆ పాట సాహిత్యాన్ని ఇంగ్లీష్‌లో తర్జుమా చేయించుకుని, అర్థాన్ని కూడగట్టుకుని, కవి మనోభావాలను చదవడం చాల ఆసక్తి కరమైన హాబీగా చెప్పాలి. ఇటీవల యూ ట్యూబ్ పుణ్యమా అని.. ఆ పాటలన్నీ ఇతర భాషలలో ఎలా చిత్రీకరించారో, ఏ నటీనటులపై చిత్రీరీకరించారో అని కూడా పరిశీలిస్తూ వుంటాను.
అలా ఎన్నో అద్భుత గీతాలు దొరికాయి. వాటిలో ముఖ్యంగా రాము తమిళ చిత్రంలో-
నిలవె ఎన్నిడం నిరుంగాదె..
ణి నినైక్కుం ఇదథ్థిల్ నాన్ ఇల్లై
మలరె ఎన్నిడం మయంగాథె నీ…
మయంగుం వగైయిల్ నాన్ ఇల్లై
అనే ఈ తమిళ పాట నన్ను అమితంగా ఆకట్టుకుందని చెప్పాలి.
ఈ పాట పాడిన పి.బి. శ్రీనివాస్ గారిని కానీ, ఆ పాట చిత్రీకరణని కానీ, గీత సాహిత్యానికి తగినట్టు తమ హావ భావాలను ప్రదర్శించిన నటీనటులను కానీ మరచిపోదామన్నా మరపురానంత అద్భుతంగా మన మనసుని దోచుకుపోతాయి అని అనడంలో ఎలాటి అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా – ఆ దృశ్య చిత్రీకరణలో చూపిన కెమెరా పనితనం చెప్పలేనంతగా ఆకట్టుకుంది. గాలికి ఊగే పూలతీగెలో సైతం విషాదం పరిమళాలు విరచిమ్ముతున్న భావన కలుగుతుంది అంటే ఆ ప్రతిభ అంతా సినీ దర్శకులదనే చెప్పాలి.
నిజం చెప్పొద్దూ.. తెలుగులో కంటేనూ.. నాకు తమిళంలోనే ఈ పాట చిత్రీకరణ చాలా బాగా నచ్చింది. అలానే, గానం, గాత్రం సైతం (సినీ పండితులూ ఒప్పుకున్నమాట ఇది. సాక్షాత్తు మన ఘంటసాల మాస్టారు సైతం బహిరంగంగా ప్రకటించారట).
తమిళంలో ఈ గీతాన్ని రాసినవారు – కణ్నదాసన్ అయితే, తెలుగులో దాశరథి గారు రచించారు. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్ ఈ సినిమా 1966లో తమిళం లోనూ, 1968లో తెలుగులోనూ విడుదల అయిందని తెలుస్తోంది. తెలుగులో సంగీత దర్శకత్వం ఘంటసాల. తెలుగు, తమిళంలో రెండు చిత్రాలలోనూ ఒకే రీతిలో కంపోజ్ చేసిన ఈ గీతాలనూ, ఆ సిట్యుయేషన్‌ను, మీరూ ఇక్కడ వీక్షించి ఆనందించవచ్చు.
1. రాము (తమిళం)
https://www.youtube.com/watch?v=F0xW0-EfOrQ
2. రాము (తెలుగు)
https://www.youtube.com/watch?v=QqisgUojg18

*మరో అత్యంత అద్భుతమైన చిత్రం “రక్త సంబంధం”. అన్నా చెల్లెళ్ళు అంటే ఇలా వుండాలి, రక్తసంబంధం అంటే ఇలా నిలిచిపోవాలి అని అనిపించేంత గొప్ప సెంటిమెంటల్ మూవీ – రక్తసంబంధం. ఎన్నిసార్లు ఈ చిత్రాన్ని చూసినా, ముగింపు సన్నివేశంలో కన్నీరు పెట్టని తెలుగు ఆడపడచు అంటూ వుండరు. అంతలా ప్రేక్షకుల గుండెని కదిలించిన సినిమా.
ఈ చిత్రంలో మనం మరచిపోలేని అద్భుత గీతం – చందురుని మించి అందమొలికించు… సావిత్రి, యన్.టి.ఆర్.ల పై చిత్రీకరించిన ఈ గీత దృశ్యీకరణ మనల్నిఅలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇదే సినిమా తమిళంలో పాసమలార్ అనే పేరుతో వచ్చింది. ఈ పాట స్టైల్ కూడా తమిళంలోనూ తెలుగు పాటలానే వుంటుంది.
తమిళంలో సౌందర్ రాజన్, మన సుశీలమ్మా పాడారు. తెలుగులో సుశీలా, ఘంటసాల ఆలపించారు. రెండింట్లోనూ ఫిమేల్స్ ఒక్కరే. యాక్ట్రెస్ అయినా, సింగర్ అయినా. మేల్స్ మాత్రం మారతారు.
తమిళంలో చక్కని గమకాలు ఒలికిస్తారు గాయకుడు సౌందర్ రాజన్. ఆ చిన్న చిన్న గమకాలు ఎంత గొప్ప అందాన్ని ఆపాదించి ఇచ్చాయో పాటకి. బహు సౌందర్యమే! – వింటుంటే మంచి అనుభూతిని కలిగిస్తుంది. నటనా పరంగా అక్కడ శివాజీ గణేశన్, ఇక్కడ యన్.టి.రామారావ్ గార్ల నటనలు రెండూ అద్భుతాలే. ఏకైక అద్భుతాభినయం మాత్రం సావిత్రి అని చెప్పక గానీ, ఒప్పుకోక గానీ తప్పదు. భాషలు రెండు కానీ నటన మాత్రం ఒక్కటే. ఏం గాత్రం మన సుశీలమ్మ గారిది!! – మన తెలుగింటి ఆడపడుచు తమిళంలో పాడుతుంటే వినడానికి భాష అడ్డెలా అవుతుంది మనకైనా, వారికైనా? అందుకే అంటాను. మనసు మాటాడే భాష ఏ మనిషి ఏ దేశాన మాట్లాడినా మనకి ఇట్టే అర్థమైపోతుందని. సంగీతానికి భాష భేదం లేదు.
రెండు సినిమాల్లోనూ మహానటి సావిత్రి ప్రదర్శించే ఆ హావభావాలను మరి మరి చూడటం కోసం నేను తమిళ పాటనే ఎంచుకుంటుంటాను. తెలుగులో కూడా.
మీరే చూడండి.. ఈ రెండు పాటలనూ, ఆ రెండు సన్నివేశ చిత్రీకరణలను!
తమిళ గీతంలో మరొక సొగసు గురించీ మీకు ఇక్కడొక మాట చెప్పి తీరాలి. పాట పల్లవిలో ఒక చిన్న బిట్ – ఇన్‍స్ట్రుమెంటల్ బిట్ వుంటుంది. అహా! ఎంత సొగసుగా వినిపిస్తుందో. విషాదం ఒక చిన్న అలలా ఎగసి పడుతున్నట్టు… వినిపిస్తుంది..భలే అందమిస్తుంది పాటకి. సంగీత దర్శకుల క్రియేటివిటీని ఇట్టే పట్టిస్తాయనడానికి ఇదొక నిదర్శనం. వింటే మీకే తెలుస్తుంది. మరి ఉద్దండులు కాదూ, ఎం ఎస్ విశ్వనాథన్, రామూర్తి గార్లు. నమోనమహ! ___/\___
అది విన్నాక, తెలుగులో సీదా సాదాగా వున్నట్టు అనిపించినా, దేనందం దానిదే కదా! బహుశా, నేటివిటీకి తగినట్టు ఎంతవరకు గ్రహించాలో సంగీతం నించి, అంతవరకే తీసుకున్నారేమో అప్పటి దర్శకులు కానీ, సంగీత దర్శకులు కానీ… అని నా ఉద్దేశం. కొన్ని రకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌పై వాయిద్యాలను తెలుగు వారు అంతగా ఆదరించరన్న అభిప్రాయమూ కావొచ్చేమో! అని నా ఊహ. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
1. రక్త సంబంధం (తమిళం )
https://www.youtube.com/watch?v=7hdxyLFk3_8
2. రక్త సంబంధం (తెలుగు)
https://www.youtube.com/watch?v=HdoiIHdmphY

* ఇతర భాషా చిత్రాల నించి పాటల్ని అరువు తెచ్చుకున్నా, ఇవ్వడంలోమాత్రం మనమేం తక్కువ కాదు అని నిరూపించుకున్నాం.
తెచ్చుకున్న అన్ని పాటలకూ కలిపి ధీటుగా, స్వీటుగా ఎన్నో గీతాలని అందించాం. ఇచ్చి, ఔరా అనిపించుకున్నాం. భారత సినీ చరిత్రలోనే ఆ గీతం ఒక సంచలనం అని చెప్పాలి. ఆ స్వర సృష్టి కర్త మన తెలుగు సంగీత దర్శకులు పి ఆదినారాయణ గారు కావడం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం! మహద్భాగ్యం.
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని ఆ పాటసువర్ణ సుందరి చిత్రం లోనిది. ‘ హాయి హాయిగా ఆమని సాగే…’ ఎంత చక్కని గీత సాహిత్యం! – సముద్రాల గారు రాసిన ఈ గీతం అక్కినేని, అంజలి గార్లపై చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రం 1958లో విడుదల అయింది. అంటే 60 యేళ్లైందన్నమాట. షష్టి పూర్తి చేసుకున్న ఈ గీతం ఇప్పటికీ యవ్వనవతియై, సౌందర్య రాశియై వర్ధిల్లుతూ, దిన దిన ప్రవర్ధమానమౌతూ ఆ అందం విలసిల్లుతోందంటే నా మాటల్లో అతిశయోక్తి ఇసుమంత అయినా లేదు!
క్లాసికల్ సినీ గీతాల ప్రసక్తి వచ్చినప్పుడు ముందు వరసలో, సువర్ణ సుందరి గీతం స్వర్ణ పతాకంలా మెరుస్తుంది. హిమాలయంలా అంత ఎత్తున నిలుస్తుంది. కారణం ఆ సొగసులోని రహస్యం అంతా మ్యూజిక్ కంపోజింగ్‌లో దాగుంది. ఆదినారాయణ గారి ప్రతిభకి తార్కాణం, గానాలకే గానంలా కిరీటంలా నిలిచే పాట.. హాయి హాయిగా ఆమని సాగే…
హిందీలో కూడా ఈ పాట అచ్చుగుద్దినట్టున్నా.. వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే తెలుగులోనే ఈ పాట సౌందర్యం ద్విగుణీకృతమైందని అంటాను. హిందీ తెలుగు రెండు భాషా చిత్రాలోనూ హీరో హీరోయిన్లు ఒకరే. హిందీ ఈ గీతాన్నిభరత్ వ్యాస్ రాశారు.
సంగీత దర్శకులు మనకు తెలిసిన పేరు పి.ఆదినారాయణ లో పి అంటే -పెనుపాత్రుని!
ఈ చిత్ర దర్శకులు వేదాంతం రాఘవయ్య.
ఇరు చిత్రాలలోనూ గాయనీ గాయకులు వారి వారి భాషల్లో అత్యంత అద్భుతంగా ఈ గీతాన్ని ఆలపించారు.
మీరూ విని, చూసి ఆనందించవచ్చు.
1. సువర్ణ సుందరి (తెలుగు)

2. సువర్ణ సుందరి (హిందీ)
https://www.youtube.com/watch?v=6ZxdIF-45QU

ఇంకొన్ని గీతాల గురించి మరోసారి ముచ్చటించుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here