[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘అదేంటో..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]బా[/dropcap]కీ పడిన పక్షుల వెనుక
తలకిందుల ఆసనం వేశాడు సూర్యుడు
చెప్పుతెగిన మూడో కాలిని ఈడుస్తూ
ఆ పక్కనుంచి చెప్పకుండా వెళుతోంది ఆకాశం
కొండముంగిట్లో వేసిన చలిమంట వద్దకు
తూలుతూ వస్తోంది తాగుబోతు ముసలి మేఘం
కుంపట్లోని బొగ్గులనెవరో
ఎర్రతాడుతో తాజాగా ఉరితీసారిప్పుడే
దిక్కులేని చెట్టొకటి డొంకదగ్గర
చెమ్మచెక్కలాడుతోంది ఒంటరిగానే
బాసింపట్టు వేసుకుని భోంచేసిన చెరువు
ఉప్పుమూటలాట కోసం ఉవ్విళ్ళూరుతున్నది
పాకుతూ వెళుతోన్న జలగొకటి
పాడలేని పాటకు గాలం విసురుతోంది
నల్లని కళ్ళ వెనుక నిలబడి
తెల్లని పరదా పడీపడీ నవ్వుతోంది
ముసలి బైరాగి మెత్తటి గొంతు
నిన్నటి రోజును నిలువుగా కక్కుతోంది
మూతబిగిసిన మనసు త్రికోణంలోకి
కొత్త కవితొకటి నదిలా కస్సున దిగుతోంది
మత్తునిండిన లక్ష వత్తులను
నడవలేని దీపం విడవకుండా తాగుతోంది