Site icon Sanchika

అధరాల అంచున చిరునవ్వే నాన్న ఆస్తి!

[ఫాదర్స్ డే సందర్భంగా శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘అధరాల అంచున చిరునవ్వే నాన్న ఆస్తి!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]కువ చీకటిని చీల్చుకుంటూ
నీ కళ్ళు కాగడాలై
వెలుగు బాటను చూపగా …
జోడెద్దుల కాడికి నాగలిని జోడించి
పొలంబాట పట్టావు
దుక్కి దున్ని విత్తు నాటి వాన చుక్క కోసం
ప్రార్థనలే చేశావు!

వరుణుడు కరుణించి
వర్ష ధారలు కురిపించిన వేళ …
సంబరాలు చేసుకొని మురిసిపోయావు!
భూమి తల్లి ప్రసవించిన మొక్క బిడ్డకు
కన్న తండ్రిగా కాపు కాశావు!

ప్రతిఫలం.. చేతికందే సమయాన
ప్రకృతి ప్రకోపించి
ప్రళయతాండవం చేయగా..
పంట చేను నీట మునిగి
కన్నతల్లి భూమాత కడుపు కోతకు గురియై
శోక సముద్రంలో మునిగి తల్లడిల్లిపోతుంటే..
నీ గుండె పగిలి కుప్పకూలిపోయినా …
నా భావి జీవితం సుసంపన్నం కావాలని
ఆత్మస్థైర్యంతో కోలుకొని …
జీవన పోరాటంలో ముందుకుసాగి
‘రైతురాజు’లా వెలుగొందిన రోజులను
మది లోయలలో నిక్షిప్తం చేసుకొని …
‘రైతుకూలీ’గా పరిణామం చెందావు!
‘బిచ్చగాడి’ పాత్రలో ఒరిగిపోయావు!

నన్ను నీ గుండెల్లో దాచుకొని
నువ్వు మాత్రమే భౌతికంగా …
కష్టాల కడలిలో ఈదులాడావు!

కన్నీటి సముద్రాన్ని
హృదయం లోతుల్లో దాచుకొని …
అధరాల అంచున
చిరునవ్వుల్ని చిలకరించావు!

ప్రయోజకత్వం సౌధంలో
నన్ను అంబరాన నిలిపి
నువ్వు మాత్రం …
కానరాని లోకంలో
సేద దీరుతున్నావా!?
నీ రుణం తీర్చుకోవడానికి …
నా కడుపున బిడ్డవై పుట్టు నాన్నా!

Exit mobile version