ఉపాధ్యాయుడు కొన్ని విడతలు సూచనాప్రాయంగా చెప్పి ఊరుకోవాలి, దాని వల్ల శిష్యులకు స్వయంగా ఊహించుకొని తెలుసుకోగలిగే భాగ్యము, ఆనందము లభిస్తాయి. ఛాత్రులకు స్వయంగా నేర్చుకొను స్వభావము ఆసక్తి అభ్యాసము అలవడునట్లు చేయగలవాడే ఉత్తముడయిన అధ్యాపకుడు. Spoon feeding ఎక్కువ కారాదు.
క్లాసులోని వారికి ఎంత వరకు తెలిసియున్నదో తెలిసికొనకుండ వాళ్ళకు తెలిసినదానినే రోకటిపాటగా చెప్పక, ఎక్కడ నుండి కొత్త విషయాన్ని ఎత్తుకోవలెనో దాని తెలిసి చెప్పేవాడు ఉత్తమ శిక్షకుడు.
శిష్యులను సమయపాలనము చేయుటకు గృహకర్తవ్యమును చేయుటకు కష్టపడి చదువుకొనుటకును మాటిమాటికి వెంటబడి ప్రేరణ చేయడము చాలా అవసరము. ఇది చాల ముఖ్యమయిన పద్ధతి.
చక్కగా పాఠమును అర్థవంతముగా ఆహ్లాదకరముగా చదువగల్గుట ఉత్తమాధ్యాపకుని మంచి లక్షణము. ఆ విధముగా చదువుకొనుటకు విద్యార్థులు ప్రోత్సాహితులు కావాలి. చదువుకొనుటలోని ఆనందమును విద్యార్థులు అనుభవించునట్లు చేయగల్గుట ఉత్తమ లక్షణము.
అవసరమయిన చోట బొమ్మ గీచి గాని కార్డ్‌బోర్డ్‌తో కట్ చేసి గాని చూపించడం కూడా అవసరం. కాని తెలిసినదానికి గూడ బోర్డ్ మీద వ్రాసి గాని వస్తువును తెచ్చి గాని చూపించడం తెలివితక్కువ అగును. ఉదాహరణకి చిన్న క్లాసులలో పిల్లలకు కుందేలును తెలియజేయాలి, అపుడు బోర్డ్ మీద గీయడం కంటె కుందేలు బొమ్మని తీసుకొని రావడం, అంతకంటె కుందేలునే పట్టుకొని రావడం మంచిది. సాక్షాత్ ప్రణాళి (Direct Method) ప్రధానం కదా అని కుక్కను, పిల్లిని కూడా తేవలసిన అవసరం లేదు. సాక్షాత్ ప్రణాళికను, బద్ధకంతో అవలంబింపిక ‘Hare= खरगोश =కుందేలు లేక చెవులపిల్లి’ అని బోర్డ్ మీద వ్రాసినచో చాలదు. అది అనువాదం మాత్రమే. Hare అను శబ్దానికి అర్థము వాస్తవముగా ఉన్న కుందేలు మాత్రమే. అనువాదము (translation) సాక్షాత్ ప్రదర్శనమునకు సాటిరాదు.
అని కదా అని గ్రాములు కిలోగ్రాముల గూర్చిన పాఠములో ఒకదానికొకటి పదిరెట్లు అని చెప్పి కిలోగ్రాము రాతిని పగలగొట్టి వందగ్రాముల రాతి ముక్క సరిగా రాక అవస్థ పడరాదు. ఇక్కడ కావలసినది ఉద్దేశము (Concept). దానిపై విలువలు ఏర్పడినవి. పది రూపాయల నోటును పది ముక్కలు చేసి ఒక ఒక్క ముక్క ఒక్క రూపాయి అనుకొనేటట్లు చేయరాదు. ఎక్కడ ఏ పద్ధతి అవసరమో అక్కడ దానిని తెలుసుకొని వాడవలయును.
బోధనము నోటితో చేయడము చాలదు, అవసరమైన చోట చేతులతో చేయడము నేర్పవలె. ప్రాక్టికల్స్ చేయించవలె. చక్కని దస్తూరి నేర్పవలె. శిక్షణమును అనుదాని కిదియే అర్థము. మంచము అల్లడము మొక్కలు పెంచడం వడ్రంగం మున్నగు చేతిపనులు – శిక్షణము వల్ల వచ్చును. ఉపన్యాసము దంచితే తెలియదు.
హృదయమునకు హత్తుకొనునట్లు కళ్ళకు కట్టినట్లు వర్ణన చేసి శిష్యుల హృదయంలో మరపురాని మధురానుభూతిగా నిలబడు బోధనము అపూర్వమైన కళ. దానిని సొంతము చేసుకొన్న శిక్షకుడు శిష్యులకు ఆరాధ్యుడయిన గురువు కాగల్గును.
ఒక గురువు చాల గొప్ప విద్యావంతుడు మరియొకడు అంత పండితుడు గాకున్నను బోధన పద్ధతిలో అందె వేసిన చేయి. ఈ ఇరువురి కంటే మంచి పండితుడయి బోధనములో శిక్షణములో కూడ ఆరితేరినవాడు ఉత్తమాధ్యాపకుడని కాళిదాసు అంటాడు.
శ్లో: సూచకః ప్రేరకశ్చైవ వాచకః దర్శకస్తథా
శిక్షకః బోధకశ్చైవ షడేతే గురవః స్మృతాః
అను శ్లోకమును గుర్తుపెట్టుకొన్నచో పై చెప్పిన విషయాలు చాల భాగము అవగాహనముకు వచ్చి గుర్తుంచుకోగలము.
మరియు ఎనిమిది విధములు అధ్యాపన పద్ధతిలో కలవు.
1. అనిశ్చితాత్ వినిర్ణీతమ్ – నిశ్చయముగా ఇదమిత్థమని తెలియని పరిస్థితిలో మనస్సును లగ్నము చేయుటకు నిర్ణీతమైన ప్రతీకములను విద్యార్థుల ముందు చూపెట్టవలయును. ఉదా. భగవద్గీతలో, భగవంతుడు సర్వత్ర్ర ప్రకాశమానుడని చెప్పక చాలక్ అతని గుర్తించుటకు విభూతి యోగము చెప్పబడినది. నక్షత్రములలో నేను చంద్రుడను ఇత్యాదిగా ధ్యానయోగ్యమయినవి చెప్పబడినవి. శ్రేష్ఠమయిన వస్తువులను వ్యక్తులను దేవుని అంశములనుగా గుర్తించుట ఒక పద్ధతి అయి ఉన్నది.
2. పూర్ణాదాంశికమేవచ – ఒక ఉద్దేశ్యమును పూర్తిగా ముందుగా ఇచ్చి దానిలోని భాగముగా ప్రస్తుత ప్రయోగమును గుర్తు పట్టవలెను. ఉదా. ప్రథమ పురుషలో మూడు వచనములను మధ్యమ పురుషలో మూడు వచనములను, ఉత్తమ పురుషలో మూడు వచనములను ప్రతి లకారములో ప్రతి ధాతువునకు సంభవమగును – అని సాకల్యముగా నేర్పవలయును. తరువత దానిలోని అంశముగ ‘వసామి’ – అనగా అహం వసామి – ఇది వస ధాతువు. పరస్మై పది లట్ ఉత్తమ పురుష ఏక వచన రూపము అని గుర్తించు సామర్థ్యము వచ్చును. లేనిచో అభిజ్ఞాన దక్షత (cognitive domain) సంభవము కాదు.
3. అంశాత్ అవయ విజ్ఞానమ్ – కొన్ని చోట్ల అంశమును ముందుగా తెలియుట అవసరము, అప్పుడే దానితో ఏర్పడిన పూర్ణరూపమును సార్థకమ్గా గుర్తింపజేయగలము. ఉదా. యథా – అనునది అవ్యయీభావ సమాసము – అవ్యయమును కలుపుకొని ఏర్పడినది గనుక యథాశక్తి – అనునది కూడ అవ్యయమగును. మరియు గురు లఘువులను ముందుగా తెలియజేయవలయును. అటుపైన వానితో ఏర్పడిన య, మ, త, ర, జ, భ, న, స అను గణములను నేర్పగలము.
హెచ్చరిక:- అధ్యాపకులు ఎక్కడ పూర్ణమునుండి అంశమునకు రావలెనో, ఎక్కడ అంశము నుండి పూర్ణానికి వెళ్ళవలెనో జాగ్రత్తగా గమనించవలయును.
4. సరళాత్ జటిలం జ్ఞానమ్ – సరళముగా ముందు కనబడు ఉదాహరణము నుండి జటిలమయిన విషయములోనికి ప్రవేశమును విద్యార్థికి కల్పింవవలయును. ఉదా. క్లాసులో క్లాసులీడరు అట్లే మొత్తం స్కూలుకు స్కూలు ప్యూపిల్ లీడరు ఉండును కదా, అట్లే చిన్న ఊరికి పంచాయితి బోర్డ్ దానికి ప్రెసిడెంటు. అట్లే జిల్లాకు జిల్లా బోర్డు ప్రెసిడెంటు, అలాగే మునిసిపాలిటి, దాని ఛైర్మను, కార్పోరేషను అయితే మేయరు – ఇత్యాదిగా పిల్లలకు చెప్పవలయును.
5. స్థూలాత్ సూక్ష్మం తథైవచ – స్థూలమయిన విశాలమయిన విషయము లేక వస్తువు నుండి సూక్ష్మమును గుర్తించవలెను. దాని అస్తిత్వమును ఒప్పుకొనవలయును. స్థూలము విశాలమయిన మర్రిచెట్టుకు ఊడలు, వేళ్ళు, మూలములు. వానికి అంకురము మూలము. అంకురమునకు దాని బీజము మూలము. దానికి దానిలోని క్రోమోజోమ్స్ అను సూక్ష్మ పదార్థము మూలము. ఇట్లే ప్రతి వస్తువు విషయములో పరమాణువులున్నవని తెలియజెప్పవలయును. అవి కనబడునవి గాకున్నను ఒప్పుకొనవలయును. అట్లే వాయువును ఆకాశమును సూక్ష్మ భూతములనుగా (కన్పించక వ్యాపకము లయిన వానివిగా) గుర్తింప జేయవలయును.
6. నానుభూతా దసంగతిః – అనుభవములో ఉన్నదానికి యుక్తియుక్తముగా లేదు అసంగతము – అన్న మాటలు పనికిరావు. ఉదా. జడమునుంచి చేతనము పుట్టుచున్నది. ఉదా. పేడ నుంచి పురుగులు పుట్టుచున్నవి. భూమికి ఆకర్షణశక్తి కలదు – కనబడకపోయినను అను భావము వల్ల, తెలివికి బలము నిచ్చి, ఒప్పుకొనవలసినవి ఇత్లే చాల ఉన్నవి.
7. పూర్వం జ్ఞాతా దవిజ్ఞాతమ్ – ఇంతకు పూర్వము తెలిసియున్న ఒకదానిని ఆధారముగా, తెలియని దానిని తెలిసికోవడము. ఉదా. గో సదృశః గవయ – గ్రామంలో ఉన్న గోవును జూచి ఉన్నవానికి అడవిలో గవయ మృగము అర్థము కాగలదు. గోవును పోలినది గవయమను వన్యమృగము అని వినియుండుట దీనికి అవసరము.
8. లక్ష్యాత్ లక్షణ సంగతిః – లక్ష్యములు అనగా ఉదాహరణములు. లక్షణములనగా నిర్వచనములు. లక్షణములను బట్టీ పట్టించి ఉంచేవాళ్ళు. తర్వాత లక్ష్యములను గుర్తించుట శ్రమకరము అయ్యేది. అట్లు గాక ఉదాహరణములను చూపి, వానిలో సాధారణ ధర్మమును గుర్తింపజేసి లక్షణమును నిర్మింపజేసికొనుట ఆసక్తికరముగా ఉండును. దీనినే inductive method అనుచున్నారు. ఉదా. బాల్యము, యౌవనము, వార్ధక్యము – వీనిలో బాల, కుమార, యువ, వృద్ధ అను పదాలు కనుబడుచున్నవి. బాల స్వభావః బాల్యమ్, కుమార స్వభావ కౌమారమ్, యూనో భావః యౌవనమ్, వృద్ధస్య భావ వార్థకమ్ – వీనిలో ఒక పదము నుండి మరియొక పదము ఉత్పన్నమగుచున్నది. దీనిని తద్ధితము, ఇంగ్లీషులో secondary suffix అన్నారు. Boy -boyhood, town – township, stupid – stupidity etc., ఉదాహరణములుగా ఇంగ్లీషులో abstract nouns సంస్కృతములో తద్ధితములగును అని పోల్చి చెప్పవలెను.
దేనితో బాటు దేనిని జోడించి ఎక్కువ జ్ఞానాన్ని ప్రసంగవశాత్తు పిల్లలకు అందజేయవచ్చునో తెలిసిన ఉపాధ్యాయునికి చాతుర్యమున్నది. కుమ్మరి వాని కుండలను జూపించి కుండలు మట్టియే మృత్తికేత్యేవ సత్యమ్ అని వేదాన్తాన్ని బోధించవచ్చు. సందర్భశుద్ధి లేకుండా ఆడపిల్ల గాజులు వేయించుకోడానికి వచ్చినపుడు గాజల బత్తుడు “ఉండమ్మా, నీ చేతి రేఖలు చూస్తాను నాకు సాముద్రికం వచ్చును” అంటే బాగుండునా? – దీనిని ఎరిగి ప్రవర్తించితే శిక్షకుడు ధన్యుడు.
“ప్రాచీన కాలంలో గురువులు శిష్యులను కఠినంగా శిక్షించే వాళ్లు. ఎంతో పొగరుబోతులుగా ఉండేవాళ్లు” అనుకునేవాళ్లు కొందరు కనబడుతున్నారు.
అది సరికాదు. తైత్తిరీయంలో గురువులు చెప్పిన మాటలలో ఎంత వినయమున్నదో చూడండి:-
“యాన్యస్మాకం సుచరితాని తాని త్వయో పాస్యాని నో ఇతరాణి” – “నాయనా, గురుకులవాసం చేసే రోజులలో మా వద్ద చెడు గుణాలను చెడు అలవాట్లను చూచినావేమో, వానిని ఆదర్శంగా పెట్టుకోవలదు. మా వద్ద ఉన్న సత్కర్మలనే నీవు గుర్తు పెట్టుకోవాలి సుమా” అని గురువులు సహవర్తనంలో శిష్యునికి హెచ్చరిక చేస్తున్నారు.
సహనావవతు – ఈ అధ్యయనము నిన్ను నన్ను చెడు నడవడిక నుండి రక్షించుగాక, సహనౌభునక్తు – మన ఇద్దరి ప్రవర్తనాశీలములను అధ్యయనము పాలించుగాక, సహవీర్యం కరవావహై – మనము చేరదలచిన లక్ష్యము సాధించుటలో మనమిర్వురము నిరంతర ప్రయత్నము చేయుదముగాక, తేజస్వినావధీతమస్తు – మన ఇద్దరి అధ్యయనము ప్రకాశవంతము అగునుగాక, మా విద్విషావహై – మనము ఇద్దరము పరస్పరము ద్వేషించుకొనరాదు – ఈ వాక్యములలో education is bipolar process అనీ, teach each other అనియు తెలియుచున్నది కదా!
“ప్రభవతి శుచిః బింబగ్రాహే మణిర్న మృదాదయః” అని భవభూతి అంటున్నాడు. మట్టిబుర్రకు చదువు ఎక్కదు కదా!
అందరకును అన్ని తెలియవలె రావలె అను నియమము సృష్టిలో లేదు – ఈ సత్యమును కప్పిపుచ్చుకొని విద్యార్థులు తప్పినచో ఉపాధ్యాయులకు ముప్పు వచ్చుచున్న ఈ రోజులలో మాస్టర్లు కేవలము బానిసలయినారు కదా! “Where the knowledge is without fear” అని చెప్పిన రవీంద్రనాథ టాగూర్‌ను మనము అర్థం చేసికొన్నామా? లేదు.
పోనీ, పాశ్చాత్య దేశములనుండి మంచిని గ్రహించి పాటించుచున్నామా? రష్యా దేశములో అయిదేండ్ల కొకసారి అవసరమయితే text books మారుస్తారట. అంతవరకు క్రింద తరగతి విద్యార్థులకు తమ పుస్తకాల సెట్టును నీటుగా ఉంచి అప్పగించి, పై తరగతికి పిల్లలు వెళ్ళి తమకంటె పై క్లాసు పిల్లల పుస్తకాలను తీసికొందురట. ఏడు ఏండ్ల వరకు పిల్లలను, దేహపుష్టి మనోధైర్యము బలపడునట్లు హాయిగా పెంచుతున్నారట.
లండన్‌లో డ్రిల్ మాస్టరు విడిగా ఉండడు. ప్రతి ఒక్క టీచరు ఆటలలోనూ, శరీర వ్యాయమములోనూ సుశిక్షితుడై ఉండితీరును. 5వ పిరియడ్‍లో లెక్కల మాస్టరు 1½ నిమిషములో విద్యార్థులతో పాటు యూనిఫారమ్ మార్చుకుని బాస్కెట్‌బాల్ కోర్టుకు వెళ్ళి పిల్లలతో బాటు ఆటలాడి వాళ్ళకు నేర్పి, మరల ఆ పిరియడ్ (అంతరం) కాగనే 1½ నిమిషములో క్లాసు యూనిఫారమ్‌లోనికి వచ్చి పిల్లలను అటుపై టీచరుకు అప్పగించుచున్నాడు. దానిని నేర్చుకోవాలి. దేహపుష్టిని సమయపాలనను లండను నుండి మనం నేర్చుకొనవలయును కదా? తప్పేమి? అట్లు చేయడం లేదేమి?
ఇట్లు లక్ష్య శుద్ధి లేని చదువులలో అనవసరమైన తప్పుడు పద్ధతులు వచ్చినవి. ఉదా. jumbling the letters – అక్షరాలను జోడించి పదాలను సృష్టి చేయండి – ABTEL. పిల్లవాడు – Table అని వ్రాయగలగాలి. కాని Atble ఒక పదం ఎందుకు కారాదు? అని వాని బుర్రలో ప్రశ్న అలాగే ఉండిపోతుంది. ఏది తప్పో Abtel etc బడిపిల్లలకు నేర్పరాదు.
మరియు వ్యతిరేక పదములను కనుగొనుట సృష్టి చేయుట ఒక పెద్ద సమస్య కాకూడదు. పదజాలమును వృద్ధిపరచుటకు
క్రూరుడు x సౌమ్యుడు
దుర్జనుడు x సజ్జనుడు – ఇలాంటివి అప్పుడప్పుడు ఉపయోగపడగలవు. అంతేకాని తెలుపు x నలుపు కాబట్టి ఆకుపచ్చ x ఎరుపు కాదు పసుపు? అన్న ప్రశ్న రాకూడదు. అది ముఖ్య విషయము కారాదు.
మరియు correct the following అనునది ప్రశ్నపత్రములో రాకూడదు. విద్యార్థుల మనసులో సాధుశబ్దములు చేరవలెను గాని అసాధు పద ధ్యానము రారాదు. సాధ్వసాధు నిర్ణయము యుక్తులతో పొసగునది కాదు.
ఉదా. Go to home – దీనిని Go home అని దిద్దుటకు ప్రశ్న రాకూడదు. Go to school లాగా go to home ఎందుకు కాదు? అని పిల్లవాని మదిలో ప్రశ్న మిగిలిపోవును. శిక్షకుని నోటి నుండి వచ్చినది అపశబ్దము కారాదు. అట్లే ప్రశ్నపత్రములో వచ్చినది సాధుపదమే కావాలి. Correction చేయుట అధ్యాపకుని పని. దానిని పిల్లలకు మీదు మిక్కిలిగా శాస్త్రోక్తముగా అప్పగించరాదు.
సహవీర్యం కరవావహై – అనుదని అర్థమును పిల్లల జీవితములో పాదుకొల్పవలెను. Teachers’ Day నాడు సహనావవతు… అను మంత్రమును పిల్లలు చెప్పడం అధ్యాపకులు వారిని అనుకరించడం పనికిరాదు. ఇది గురువుల గౌరవానికి హాని!
పరమాచార్యుడయిన వేదవ్యాసుని గురుపూర్ణిమ నాడు స్మరించడము గురుర్ బ్రహ్మ శ్లోకము చెప్పడము పిల్లలకు నేర్పవలయును. విద్యాలయ ప్రారంభములో ప్రార్థనా సమయంలో శ్లో. ‘సాగరక్షాళిత పదామ్ హిమాలయ కిరిటీనీమ్ భుక్తి ముక్తి ప్రదానాఢ్యాం వన్దే భారతమాతరమ్’ అను శ్లోకమును ఉచ్చరింప జేయుటయు, శిక్షణ పద్ధతులలో మొట్టమొదటిది, చివరిది కావలయును. అగును గాక!