[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘అది అపురూపబంధం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]పురూపమైనది స్నేహబంధం
తరగని నిధి జీవితాంతం!
నాకు స్నేహమనే విత్తు లభించినపుడు
నా యింటి తోటలో నాటుకున్నాను
దానికి ప్రేమతో నీరుపోశాను
అభిమానంతో ఎరువును వేసాను
మొలక వచ్చి చిగురులు వేస్తే మురిసిపోయాను
నన్నునేను మరిచాను
కొమ్మలతో రెమ్మలతో పూలు పూచి
పరిమళాలు వెదజల్లుతోంది.
అనుబంధాలు ఆత్మీయతలు
కనుమరుగు అవుతున్న కాలమిది
ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఈ లోకంలో
స్నేహమనే తోడు విలువైనది
మనసుకు గాయమైతే ఓదార్పునిస్తుంది
కన్నీటి విలువ తెలిసినది
ఎంత ఖర్చుచేసినా దొరకనిది.
ఒకసారి బంధం అంటూ ఏర్పడితే వీడిపోనిది
అసూయ ఎరుగనిది
ఆలంబనగా నిలిచేది
అక్కున చేర్చుకునేది
రాగద్వేషాలకు అతీతం అయినది
కల్లాకపటం తెలియనిది
అంతరంగమే చూసేది
అరమరికలు లేనిది
అపురూపమైనది
ఉపశమనం కలిగిస్తుంది
ఊరడిస్తుంది
ఊసులెన్నో చెబుతుంది
నేను వున్నానని భరోసా కలిగిస్తుంది.
ముందుకు నడిపిస్తుంది
మంచిమాటలు చెబుతుంది
మానసిక ధైర్యం కలిగిస్తుంది
జీవితకాలం తోడుగావుంటుంది
ఆదరంతో అక్కునచేర్చుకుంటుంది
స్నేహం అమూల్యం
విలువ కట్టలేని ప్రతిఫలం కోరని
గొప్ప అనుబంధం
స్నేహితులు వున్నవారు
ఎప్పుడూ ఆనందంగా వుంటారు
ఇది నిజం!