Site icon Sanchika

అది సుమో కాదు… సుమో కారు కాదు

శశాంక్ బాల్యం – ఒక జ్ఞాపకం

[dropcap]మా[/dropcap] అబ్బాయి పేరు శశాంక్ శేఖర్. ఇప్పుడు బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

వాడి గూర్చి కొన్ని ముచ్చట్లు చెప్పాలనిపిస్తోంది ఈ వేళ. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పే ముచ్చట్లు వాడి చిన్ననాటి ముచ్చట్లు.

వాడు మాట్లాడుతు ఉంటే ఇంత చిన్న వయసులో వీడికి ఇంత యోచనా శక్తి ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్య పడేవారు.

వాడికి మూడు ఏండ్ల వయసున్నప్పుడు మేము దిల్‌సుఖ్‌నగర్లో ఉండేవారం. అప్పట్లో వాడి మాటలు వినటానికే మా ఇంటి ఓనర్ ఆవిడ వీలున్నప్పుడల్లా వాడ్ని తీస్కు వెళ్ళి కబుర్లు చెప్పించుకునేది.

నాకు బాగా గుర్తు ఉండిపోయిన కొన్ని కబుర్లు చెబుతాను ఈవేళ వాడి గూర్చి.

***

అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి వాడికి.

టీవీలో యానిమల్ ప్లానెటో, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెలో ఏదో చూస్తూ ఉన్నాము. పులి ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళి జింకలను వేటాడే కార్యక్రమం వస్తూ ఉంది.

ఆ పులి అలాగే వెళ్ళి ఒక జింక పిల్లని నోట కరచుకుని వెళ్ళిపోతుంది.

మా ఆవిడ ఒడిలో కూర్చుని ఛానెల్‌ని చూస్తూ, అప్పుడు వాడు అన్న మాటలు మా అందరినీ కదిలించి వేశాయి. అమాయకత్వంతో నిండిన పెద్ద కళ్ళతో వాడు ఆమెని గట్టిగా పొదివి పట్టుకుని “అమ్మా! చూడమ్మ, ఆ జింక పక్కనే వాళ్ళ అమ్మ ఉన్నా కూడా ఆ పులి ఎలా తీసుకువెళ్ళీ పోతోందో. అలా అమ్మ ఉన్నా కూడా తీస్కు వెళ్ళిపోతుందా అమ్మా!” అని భయం భయంగా అడిగాడు.

కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాము మేము.

నాకు ఆ క్షణంలో అబ్రహాం లింకన్ గారు స్కూల్ మాస్టార్‍కి వ్రాసిన లెటర్ గుర్తు వచ్చింది అప్రయత్నంగా.

నేను అయిదవ తరగతిలో చదువుకున్న గౌతమ బుద్దుడి పాఠం గుర్తు వచ్చింది. గౌతమ బుద్ధుడు మొదటి సారిగా విగతజీవుడిని చూసి విచలితుడు అయిన వైనం అసంకల్పితంగానే గుర్తు వచ్చింది ఆ క్షణంలో.

ఈ ప్రపంచం తాలూకు చేదు నిజాలు తెలియాల్సిన సమయం వచ్చింది వాడికి. ఈ ప్రపంచాన్ని తొలిసారిగా వాడు కొత్త కోణంతో చూడబోతున్నాడు.

అమ్మ ఒడిలోని భద్రత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో క్రూరత్వం కూడా ఉంది. ప్రపంచం తాలూకు క్రూరత్వం, అదే ప్రపంచం తాలూకు మంచితనం – నాణేనికి బొమ్మ బొరుసు రెండూ ఉన్నట్టే, పడుగు పేకల్లా కలిసే ఉంటాయని చెప్పాల్సిన తరుణం అది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఒక్కసారిగా వాడిని పొదివి పట్టుకుని మా ఆవిడ భోరున ఏడ్చేసింది. అది ఆమె అసంకల్పిత చర్య. ఆ తరువాత ఆమె స్థిరత్వం చిక్కించుకుని చెప్పింది. “తల్లి జింకకున్న శక్తి పరిమితం నాయన. అది అందుకే జాగ్రత్తగా ఉంటుంది పులి కండ్ల పడకుండా. దురదృష్టవశాత్తు ఈ జింక పిల్ల పులికి చిక్కిందే కానీ, చాలా సందర్భాలలో అది వేగంగా పరిగెత్తి పోయి తప్పించుకుంటుంది. ఆ జింక పిల్లకి వేగంగా పరిగెత్తే శక్తి వచ్చే వరకువాళ్ళ అమ్మ మాట వినాల్సిఉంటుంది. అది అలా కాకుండా అజాగ్రత్తగా ఉండటం వల్ల అలా చిక్కింది.”

అలా ఏదో వాడిని సముదాయించాము కానీ, వాడికి ఏర్పడిన షాక్ అర్థం చేసుకోగలము.

తల్లి దగ్గర సంపూర్ణ రక్షణ లభిస్తుంది అన్న భరోసాతో ఉంటారు కద చిన్నపిల్లలు. అలాంటిది, ఈ ఘటన వాడిని బాగా కలచి వేసిందో లేదో కానీ మేము మాత్రం చాలా విచలితులయ్యాం.

***

సరె ఇది ఇలా ఉంచండి. ఆ రోజుల్లోనే జరిగిన ఇంకో ముచ్చట చెబుతాను.

ఆ రోజుల్లో ఒక సారి కారేసుకుని బాసరకి వెళ్ళాము. అదే మొదటి సారి బాసర వెళ్ళటం. మా వాడికి అప్పటికి అయిదారు ఏళ్ళు ఉంటాయి.

ఆటోమొబైల్స్ గూర్చి ఎక్కువ ఆసక్తి చూపేవాడు చిన్నతనం నుంచి. అందుకే వాడికి రకరకాల కార్ల కంపెనీల గూర్చి కబుర్లు చెప్పేవాడిని. ఆ వివరాలు ఆసక్తిగా వినేవాడు. ఎలాంటి కార్ కంపెనీ బ్రాండ్‍ని అయినా లోగో చూసి చిటికెలో కనిపెట్టేసేవాడు.

సరస్వతి దేవి దర్శనం చేసుకుని వచ్చి మధ్యాహ్నం భోంచేసి విశ్రాంతిగా కాటేజి వరండాలో కూర్చుని పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటు ఉన్నాను.

ఇంతలో పక్క కాటేజి ఆయన కూడా వచ్చి మాతో కబురులు చెబుతూ “ఈ వేళ ఉదయం సుమో కార్లో వచ్చాం సర్” అంటూ చెట్టు కింద ఆగి ఉన్న వాళ్ళ వాహనాన్ని చూపిస్తూ చెప్పాడు.

అప్పుడు మా వాడు మెల్లిగా నా చెవి దగ్గర నోరు పెట్టి కంప్లైంట్ చేస్తున్న ధోరణిలో వాపోయాడు “నాన్నా! అది ఫిరోడియా కంపెనీ వాళ్ళ తూఫాన్ ఎంయూవీ. అది సుమో కాదు. పైగా సుమో కారు కాదు, (ఎంయూవీ కద!)”

“సరేలేరా! నువ్వు గమ్మనుండు” అని వాడిని సముదాయించాల్సి వచ్చింది.

అప్పట్నుంచి మా ఇంట్లో, ఒక మాట వాడుకలోకి వచ్చింది అది ఏమిటంటే, ‘అది సుమో కాదు, పైగా సుమో కార్ కాదు’ అన్న మాట అది. ఎవరైనా ‘రుధిరం’లాగా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే ఈ ఇడియం వాడతారన్నమాట మా పిల్లలు.

***

మా ఆవిడ కళ్ళు కాస్తా పెద్దవి. తాను నన్ను వారించాలి అనుకున్నప్పుడు విశాలమైన తన కళ్ళని మరి కాస్త పెద్దవి చేసి ఏదైనా సైగ చేస్తే నేను టక్కుమని ఆగిపోతాను ఇప్పటికీ.

పిల్లలు అల్లరి చేస్తే, తల్లులు కోపంగా చూడటం సహజమే కద. మా వాడు ఏదైనా అల్లరి పని చేసినప్పుడు, ఇదే విధంగా మా ఆవిడ తన కళ్ళని పెద్దవి చేసి మా వాడి వంక చూస్తే వాడు బెదిరిపోవడం మాట అటుంచి, ఓ ప్రశ్న వేసేవాడు – “చంద్రముఖిలా అలా చూస్తావేమిటి?” అని

అంతే ఇక కోపం గీపం అన్నీ పక్కన పెట్టేసి నవ్వాల్సి వచ్చేది మాకు.

***

మా వాడ్ని చిన్నప్పుడు “ఇదిగో అలా చెస్తే దెబ్బలు పడతాయి చూడు” అనలేకపోయేవారం.

ఎందుకంటే, వాడు అప్పుడు ఇక ప్రశ్నోత్తరాల శీర్షికకి నాంది పలికేవాడు.

“ఎలా కొడతావు?

చేత్తో కొడతావా,

కట్టెతో కొడతావా,

మెల్లిగా కొడతావా, గట్టిగా కొడతావా,

నొప్పి అయ్యేలా కొడతావా, నొప్పి కాకుండా కొడతావా,

ఇప్పుడే కొడతావా, ఆ తరువాత కొడతావా?”

ఇలా వాడు ముద్దు ముద్దుగా అడిగే తీరు చూసి ఇక కోపానికి తావెక్కడ ఉంటుంది?

***

సరే ఇది ఇలా ఉంచండి. ఆ రోజుల్లోనే జరిగిన ఇంకో ముచ్చట చెబుతాను.

వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి యాదృచ్ఛికంగా మా ఇంట్లో లక్ష్మీ అనే పేరుతో పని అమ్మాయిలు ఉండేవారు. వాడికి అది మైండ్ లో బాగా ముద్రించుకుపోయింది అనుకుంటా.

మాకు ఇద్దరు పిల్లలు. వీడు రెండవ వాడు. వాడి అక్కయ్య వాడికంటే మూడేండ్లు పెద్దది. ఆటల్లో భాగంగా వాడు చీటికి మాటికీ వాళ్ళ అక్కని కొడుతు ఉంటే “నాన్నా తప్పురా, అక్క అంటే లక్ష్మీ రా. ఏడిపించకూడదు” అనే ధోరణిలో వాళ్ళ అమ్మమ్మ వాడికి నచ్చజెప్పిందో సారి.

అందర్నీ నివ్వెరపరుస్తూ వాడు ఇలా చెప్పాడు “లక్ష్మి అయితే, వెళ్ళి పాత్రలు తోముకోమను, నన్ను ఏడిపించవద్దు అని చెప్పు”

తుపాకి తూటాలా అలా చివ్వున వచ్చిన వాడి సమాధానం మాకు ఎవ్వరికీ అర్థం కాలేదు కాసేపు.

ఆ తర్వాత అర్థం అయింది వాడి దృష్టిలో లక్ష్మీ అనే పదం పని అమ్మాయి అనే పదానికి సమానార్థమయిన పదం అని.

***

“అంత చిన్న చిన్న ఇళ్ళలో వాళ్ళు ఎలా ఉంటారమ్మా” అని అడిగాడు వాడు ఒక రోజు మేము కార్లో వెళుతూ ఉండగా.

“ఏవి కన్నా” అని అడిగితే, వాడు అప్పుడు చూపిన వాటిని చూసి నవ్వలేక ఇబ్బంది అయింది మాకు.

మేము అప్పుడు మాసబ్ టాంక్ దాటి, ఎడమ వైపు మలుపు తిరిగి బంజారా హిల్స్ వెళుతున్నాము. అక్కడ రోడ్డుకి ఎడమవైపున్న స్మశానంలోని సమాధులని చూసి వాడు అలా అడిగాడు వాటిని చిన్న చిన్న ఇళ్ళనుకుని.

***

ఆ రోజుల్లోనే, ఒక సారి మేమంతా చిలుకూరి బాలాజీని చూద్దామని బయలు దేరాం.

అది వినాయక చవితి నిమజ్జనం రోజు. మేమా సంగతి విస్మరించాము. శెలవు దొరికిందే సందని కారేసుకుని బయలుదేరామన్న మాట.

పొద్దున ఎనిమిది గంటల ప్రాంతాలలో బయలు దేరాము. వెళ్ళేటప్పుడు ఏమీ ఇబ్బంది కాలేదు. తిరిగి మేము దిల్‌సుఖ్‍నగర్ చేరుకోవాలి. కానీ తిరుగు ప్రయాణంలో మేము పడ్డ తిప్పలతో ఒక పెద్ద కథ వ్రాయవచ్చు. మేము మెహదీపట్నం సిగ్నల్ వరకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు దాటింది.

మేము మాసాబ్ టాంక్ వరకూ కూడా రాలేక పోయాము.

ట్రాఫిక్ పోలీసులు అకస్మాత్తుగా రోడ్డు బ్లాక్ చేసేసి, ‘ఇలా వెళ్ళండి’ అని ఏదో ఒక గల్లీలోకి తోసేస్తున్నారు తప్పనిచ్చి, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఆ గల్లీలో వెళితే మేము గమ్యం చేరుకోగలమా లేదా అన్నది ఏ మాత్రం ఆలోచించకుండా మమ్మల్ని డైవర్ట్ చేసేస్తున్నారు. మాకు సిటీ రూట్స్ పెద్దగా తెలియవు అప్పటికి. అప్పటికి ఇంకా పీవీ నరసింహరావు ఎలివేటేడ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి రాలేదు. స్మార్ట్ ఫోన్స్, గూగుల్ మాప్స్ అందుబాటులో లేని రోజులు అవి. నోకియా కంపెనీది కీ పాడ్ ఫోన్ ఒకటి ఉండేది నా వద్ద.

ఎన్నడూ చూడని, చిన్న చిన్న గల్లీలు, ఇరుకైన సందులు, పూర్తి ముస్లిం డామినేటెడ్ ఏరియాల గుండా ప్రయాణించి చివరికి నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద తేలాము. కానీ అక్కడి నుండి సిటీలోనికి రానివ్వటం లేదు ట్రాఫిక్ పోలీసులు. వెళితే కర్నూలుకి వెళ్ళాలి, లేదా జూ పార్క్ లోపలికి వెళ్ళాలి. అది పరిస్థితి.

సరే ఏమయితే అదయిందని చెప్పి కర్నూలు రూట్‌లో ముందుకు వెళ్ళి వాళ్ళనూ వీళ్ళనూ దారి అడుగుతూ, పోలీసులు ‘అయిసే ఝావ్, ఉధర్ ఝావ్, ఇధర్ ఝావ్’ అంటే మలుపులు తిరుగుతూ ఆరాం ఘర్ చౌరస్తా వరకూ చేరుకున్నాము. ఆ జంక్షన్ పేరు అదని కూడా తెలియదు అప్పుడు మాకు.

సరే అక్కడ నుండి మలుపు తిరిగి, చాంద్రాయణ గుట్ట మీదుగా,డీఆర్‍డీవో, మిధానీ, ఓవైసీ హాస్పిటల్, బైరామల్ గూడా, ఎల్ బీ నగర్, దాటుకుని దిల్‌సుఖ్‍నగర్‍కి చేరుకున్నాం.

ఈ ప్రయాణం కూడా ఏమంత సుఖంగా జరగలేదు. ప్రతి పదడుగుల దూరానికి ఒక వినాయక విగ్రహం ఊరేగింపు రావడం, పోలీసులు మమ్మల్ని చూసి, చిరాకు పడిపోతు కారు ఆపేయడం ఇలా సాగింది మా ప్రయాణం.

ఉన్నంతలో రిలీఫ్ ఏమిటంటే వెనుక సీట్లో పిల్లలు నిద్ర పోతున్నారు.

“పోనీలే పిల్లలు నిద్ర పోతున్నారు. లేకుంటే టెన్షన్ పడేవారు” ఊపిరి పీల్చుకుని అంది నా శ్రీమతి.

అప్పుడు మా వాడు “నేను నిద్రపోలేదు” అని ప్రకటించాడు

వాతావరణాన్ని తేలిక పరుస్తూ మా శ్రీమతి “ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాం కద నాన్నా” అని అంది

అప్పుడు మా వాడు బాంబు పేల్చాడు “ఇదంతా ఎంజాయింగ్ కాదు. దారి తప్పడం అని నాకు తెలుసు” అని. అంతే కారంతా ఒక్కసారి నవ్వులతో నిండి పోయింది.

***

మా వాడు మాట్లాడటం వచ్చిన కొత్తల్లో చాలా రోజులు కొన్ని విచిత్ర పద ప్రయోగాలు చేసేవాడు.

వాటిలో ‘చమట దద్దమ్మ’ ఒకటి.

నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియం కావటం వల్లనుకుంటాను, స్వచ్ఛమైన తెలుగు పదాలు వినే అవకాశం ఉండదు కద. అలా చవట అనే పదం వాడి పదజాలంలో చేరలేదు అనుకుంటా. అందువల్ల ఏదో సినిమా పాత్రలు పలికిన మాట ‘చవట దద్దమ్మ’ అనే దాన్ని పలుకుతూ ‘చమట దద్దమ్మ’ అన్నాడు.

వాడికి పరిచయం ఉన్న పదం చమట. ఈ చవట అనే పదం వాడికి కొత్త. అందుకే తనకు తెలిసిన పదంతోనే అర్థం చేసుకుని అలాగే పలికాడు. అదన్న మాట సంగతి.

సవరించామనుకోండి. అయినా చాలా రోజులు నవ్వుతూ ఉండిపోయాము.

***

చిన్నప్పుడు ఒక సారి ఏదో వీడియో గేమ్ టీవి మానిటర్‍కి అనుసంధానించి మీటలు నొక్కుతూ ఆడుతున్నాడు.

ఆ గేం ని చూస్తున్న మా అన్నయ్య, ఆ గేమ్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, “ఒరే ఆ వైపు వెళ్ళకు, అక్కడున్న ఆడ మనిషి అందర్నీ కొడుతోంది” అని హెచ్చరించారు వాడిని

అప్పుడు మా వాడు నింపాదిగా “ఆవిడ పద్ధతి గల ఆవిడ. ఆవిడ జోలికి వెళితేనే కొడుతుంది. మన దారిన మనం వెళితే ఏమి చేయదు. భయపడవద్దు” అని తత్వ బోధ చేసే యోగిలా చెప్పుకుపోతూ ‘ఆ పద్దతి గల ఆవిడ’ పక్కనుంచి ముందుకు దారితీసి పాయింట్లు సాధించాడు.

మళ్ళీ అందరం నవ్వులలో మునిగిపోయాము.

“నేను ఏమి మాట్లాడినా నవ్వుతారు ఎందుకు” అని ఉడుక్కున్నాడు మా వాడు.

***

ఇంకో ముచ్చట చెబుతాము.

మిత్రుల కుటుంబాలతో కలిసి మూడు కార్లలో ఒకసారి మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళుతున్నాం.

మా మిత్రుడి తల్లిగారు “పిల్లలంటే నాకిష్టం. నేను మీ కార్లో కూర్చుని పిల్లలకు కథలు చెబుతాను” అని ప్రకటించి మా కారెక్కి కూర్చున్నారు.

కోరి రిస్క్ తీస్కుంటున్న ఆమెని చూసి జాలిగా నవ్వటం మినహా ఏమీ చేయలేకపోయాను.

కార్ వేగంగా వెళుతోంది.

“అప్పుడు పట్టువదలని విక్రమార్కుడు, చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని తీసుకుని భుజాన వేసుకుని …..”

అందరు పిల్లల్లా కథ వింటే మా వాడి ప్రత్యేకత ఏముంది?

“అది కాదు అమ్మమ్మా! చచ్చిన శవం చచ్చినట్టు పడి ఉండకుండా కథ చెపుతాను అనటం ఏమిటీ, సమాధానం చెప్పకుంటే తల వేయి వక్కలు అవుతుంది అని బెదిరించటం ఏమిటి నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు మొదట ఆన్సర్ కావాలి, ఆ తరువాత కథ వింటాను” అని ముందు కాళ్ళకి బంధం వేసేశాడు. అప్పటికి వాడి వయసు మహా అంటే ఆరేడేళ్ళు.

ముందు సీట్లో కూర్చున్న మాకు ఆ మాటలు వినపడ్డాయా లేవా అని అనుమానంగా చూశారు ఆ పెద్దావిడ.

మేము ఏమీ వినపడనట్టే నటించాము.

ఆవిడ టాపిక్ మార్చేసి, బయట ఉన్న ప్రకృతి దృశ్యాలని గూర్చి మాట్లాడటం మొదలెట్టారు.

ఇవి ఇప్పటి దాకా గుర్తు ఉన్న ముచ్చట్లు. ఇంకా బోలేడు ఉన్నాయి. గుర్తు వచ్చినప్పుడు చెబుతాను.

Exit mobile version