[శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ రచించిన ‘ఆదివారం కథలు’ అనే కథా సంపుటిపై సమీక్ష అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ణచివేతల ఆర్భాటాలు, నిరసనల నక్రాలు, అన్యాయపు కూతలు, ఏదో అన్యాయం అయిపోతోందన్న ఆక్రందనలు, ద్వేషాలు, తిట్లు, సంప్రదాయ దూషణలు, దేశ వ్యతిరేక భావనలు వంటివేవీ లేకుండా శుభ్రమైన, చక్కటి ఆహ్లాదకరమైన కథలు, మంచి చెప్పే కథలు చదవాలనుకునేవారికి చక్కని సంతృప్తినిచ్చే కథల సంపుటి ‘ఆదివారం కథలు’. సి.ఎన్. చంద్రశేఖర్ రచించగా ‘ఈనాడు’ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథల సంపుటి ఇది. మొత్తం పదకొండు కథలున్నాయి ఈ సంపుటిలో. అన్నీ ఆరోగ్యకరమైన ఆనందాన్నిచ్చేవే. అన్నీ ఆరోగ్యకరమైన ఆలోచనలను కలిగించేవే. అత్యంత వేగంగా చదివింపజేస్తూ ఉత్సాహాన్ని, ఉత్కంఠనూ కలిగిస్తూ, కథ చివరిలో ఒక అనూహ్యమైన మలుపు తిరిగి పాఠకుడిని ఆనందింపజేయటమే కాదు, ఆలోచింపజేయటం ఇందులోని కథల లక్షణం.
సి.ఎన్. చంద్రశేఖర్ గతంలో 9 కథా సంపుటాలు వెలువరించారు. కథన చాతుర్యం తెలిసినవారు. కథ అంటే ఏమిటో తెలిసి, కథ చెప్పే లక్షణం తెలుసుకుని, కథన చాతుర్యాన్ని సాధించిన రచయిత. అందుకే ఈ సంపుటిలో ఏ కథను ఆరంభించినా పూరయ్యే వరకూ పాఠకుడు కథను వదలలేడు. కథ పూర్తయిన తరువాత కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ కూడా ఆలోచించకుండా ఉండలేడు. ఒక ఆహ్లాదకరమైన భావనతో మనసు నిండగా ‘ఎన్నాళ్ళయింది ఇలాంటి పాజిటివ్ ఆలోచనలను పంచే కథలు చదివి!’ అనుకుంటాడు.
తెలుగు కథల ప్రపంచంలో ‘ఈనాడు’ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమయ్యే కథలు కొన్ని విలువలకు కట్టుబడి ఉంటాయి. ఆ విలువలను పాటిస్తూ రచించిన అందమైన కథలు ఇవి. ఈ కథలలో దుష్ట పాత్ర ఉండదు. దౌష్ట్యం మానవ మనస్సులో, ప్రవర్తనలో ఉంటుంది. కథ పూర్తయ్యే సరికి ఆయా పాత్రలు తమ పొరపాట్లు గ్రహించి పొరపాటును సరిదిద్దుకుంటారు.
ఈ సంపుటిలోని కథలన్నిటిలోకీ ఉత్తమమైన కథ అనదగ్గ కథ ‘చందూ’. ఈ కథ చదివిన తరువాత చందూ పాత్రను మరిచిపోలేక పోవటమే కాదు, ఇలాంటి మనిషి మనకు పరిచయస్థుడై ఉంటే ఎంతో బాగుంటుంది అనుకుంటాం. ‘సుందరం’, ‘పెద్దన్నయ్య’, ‘బాలు’ వంటి కథలు చదివిన తరువాత కూడా ఆయా సంఘటనలను, పాత్రలను అంత తర్వరగా మరిచిపోలేము. ‘వస్తువు’కు ప్రాధాన్యం ఇచ్చి, కథనం, పాత్రపోషణ వంటి వాటిని విస్మరించే యువ కథకులకు – వస్తువుతో పాటూ కథనానికి, పాత్ర చిత్రణకూ ప్రాధానం ఇస్తే కథలు ఎంత చక్కగా ఉంటాయో, ఉదాహరణగా చూపేందుకు ఈ సంపుటిలోని కథలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా నలిగిన అంశాలనే నవ్యంగా, ఆకర్షణీయంగా, మనసుకు హత్తుకునే రీతిలో చెప్పటం బోధపరుస్తాయీ కథలు. ఇందుకు ‘పిత్రార్జితం’ కథ చక్కటి ఉదాహరణ.
తండ్రి పోయిన తరువాత ఆస్తి వెంటబడి తల్లిని సరిగ్గా చూడని అలవాటయిన సంతానం కథనే చక్కగా మంచి చెప్తూ, మానవత్వపు విలువల ప్రాధాన్యాన్ని చెప్పేలా మలచారు. అక్రమ సంబంధాలు, విశృంఖల వ్యవహారాలు మాత్రమే అభ్యుదయాలు, స్వేచ్ఛ పొందటానికి నిదర్శనమంటూ ప్రచార కథలు రాసే (పేరుకు మాత్రమే) పెద్ద రచయితలందరూ తప్పనిసరిగా చదవాల్సిన కథ ‘శుభ సంకల్పం’. ఈ కథలో రెండు పాత్రల నడుమ ఈ సంభాషణ చదవండి:
“నా దృష్టిలో సరోజ చేసింది తప్పుకాదు. భర్త లేనంతమాత్రాన స్త్రీకి కోరికలు ఉండకూడదా? ఆ కోరికలు తీర్చుకోకూడదా? సెక్స్ ఈజ్ ఎ బయలాజికల్ నీడ్. మనిషికి ఆహారం ఎంత అవసరమో, సెక్స్ కూడా అంతే అవసరం.”
“నిజమేకానీ.. దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. నీకు నెక్లెసో, గాజులో కొనాలని ఆశగా ఉందనుకో. వాటిని ఎలా కొంటావు?”
“నా జీతం డబ్బుల్లోంచి కొంటాను లేదా బ్యాంకు లోను తీసుకుంటాను.”
“గుడ్. అంతేతప్ప, షాపులో దొంగతనం చేసి తెచ్చుకోవు కదా. ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఓ మార్గం ఉన్నట్లే, ఈ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఓ మార్గం ఉంది. అదే పెళ్ళి.”.
ఇదే కథలో మరో సందర్భంలో “అఫైర్లు పెట్టుకునేందుకు ఉన్న ధైర్యాన్ని జీవితంలో స్థిరపడటానికి ఉపయోగించవచ్చు కదా!” అంటుందో పాత్ర.
సమాజంలోని సందిగ్ధాలకు పరిష్కారాలు సూచిస్తూ, మంచి విలువలు, ఉత్తమ ఆలోచనలు, సచ్చీలం వంటి ఆలోచనలను సమాజంలో విస్తరింప చేయటం సృజనాత్మక కళాకారుడి కర్తవ్యం అని నమ్మి, ఆచరిస్తున్న రచయిత సి.ఎన్. చంద్రశేఖర్ అని ఈ సంపుటి లోని కథలు నిరూపిస్తాయి. అయితే ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో చెడు, విధ్వంసపుటాలోచనలు, ద్వేష భావనలను ప్రదర్శించే రచయితలకు లభించే ప్రచారం, అలాంటి రచనలకు లభించే ప్రశంసలకు ఉత్తమ విలువలతో ఉన్నత లక్ష్యంతో సృజించే రచనలను లభించటం లేదు.
అందుకే, ఉత్తమ విలువలతో కూడిన రచనలను మెచ్చే వారందరూ ఈ సంపుటి లోని కథలు చదివి, వాటి గురించి విస్తృతంగా చర్చించి ‘మంచి’ కథకు మంచి ప్రచారం ఇస్తారని ఆశించటం దురాశ కాదు కదా? మంచికి ప్రచారం ఇవ్వటం అంటే మన భవిష్యత్తు తరాల కోసం, ‘మంచి సమాజం’ ఏర్పాటు కోసం మనం సైతం మన వంతు బాధ్యత నిర్వహిస్తున్నట్టు.
***
ఆదివారం కథలు (కథాసంపుటి)
రచన: సి.ఎన్. చంద్రశేఖర్
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్,
పేజీలు: 136
వెల: ₹ 180/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: ఫోన్ – 9492378422
~
శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-c-n-chandrasekhar/