[dropcap]ఉ[/dropcap]దయం ఎనిమిది గంటలు అయింది. నా రీడింగ్ రూంలో ఆ రోజు దినపత్రిక చూస్తూ కూర్చున్నాను. ఆ రూంకి నాలుగుపక్కలా అద్దాల తలుపులతో ఉన్న అలమరాల నిండా పుస్తకాలు వరుసగా పేర్చి ఉన్నాయి. ఒక పక్క కంప్యుటర్, మరో పక్క పడకుర్చీ రైటింగ్ పాడ్ ఉన్నాయి. ఆ గదిని నా అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాను. నాకు ఎప్పటినుంచో ఒక కల. సొంత ఇల్లు ఏర్పాటు కట్టుకోవాలని, ఇలా ఒక రీడింగ్ రూం ఏర్పాటు చేసుకుని, ఇంటి చుట్టూ పూలమొక్కలు పెంచుకోవాలని. పిల్లలు పెద్దయ్యేదాక అది సాధ్యపడలేదు. వాళ్ళ చడువులకి, ఇంటి ఖర్చులకి ఎప్పటి సంపాదన అప్పుడు సరిపోయేది.
పెద్దబ్బాయి శ్రీకాంత్‌కి బ్యాంక్‌లో ఉద్యోగం రాగానే లోన్ పెట్టుకుని ఇల్లు కట్టే ప్రయత్నం చేసాడు. అది దాదాపు పూర్తి అయ్యేటప్పుడు చిన్నవాడు సామంత్‌కి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలసి ఎన్నాళ్ళనుంచో ఉన్న నా కల నెరవేర్చారు. ఇప్పుడు పెద్దబ్బాయికి పెళ్ళయి మూడేళ్ళ పాప. చిన్నవాడికి పెళ్లి చేయాలి. ఇద్దరూ నన్ను ఎంతో గౌరవిస్తారు. కోడలు కూడా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడుతుంది.
ఇంతలో సుగాత్రి ఆ గదిలోకి వచ్చి “ఏమండీ! టిఫెన్ రడీ అయింది. డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారా! ఇక్కడికి తీసుకురమ్మంటారా!” అని అడిగింది. “అక్కడికే వస్తాను పద! అందరం కలిసి తినవచ్చు” అన్నాను. అప్పటికే శ్రీకాంత్, సామంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సింక్‌లో చేతులు కడుక్కుని నేను కూడా కూర్చున్నాను. కోడలు ఎదురుగా ఉన్న కిచెన్‌లో వేడివేడిగా అట్లు వేసి ఇస్తూంది. సుగాత్రి అందరికీ వడ్డిస్తూంది.
“చిన్నవాడికి పూరీలు ఇష్టంకదా! పూరీలు చేయకపోయావా!” అడిగాను.
“మాదేముంది నాన్నగారూ! తినాలనిపిస్తే బయట హోటల్‌లో తినేస్తాం. మీకు ఆయిల్ ఫుడ్స్ సరిపడవు. మీకిష్టమైనవి చేయించుకోండి. దోసెల్లో కూడా ఆయిల్ ఉంటుందనుకోండి. కానీ చాలా తక్కువ” అన్నాడు సామంత్.
ఆ మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల సంతోషం గురించే ఆలోచిస్తారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకుండా, వృద్ధాశ్రమాలలో వదిలివేస్తున్నారనీ, రకరకాల కధలు వింటూ ఉంటాము. కానీ నా పిల్లలు అలా కాదు. మమ్మల్ని ఎంతో అభిమానంగా చూస్తారు. రోజూ ఉద్యోగం నుంచీ రాగానే నా దగ్గరకు వచ్చి కుర్చుని ఒక పదినిమిషాలు కబుర్లు చెప్పి వెళతారు. వాళ్ళ ఆఫీస్ విషయాలు కానీ, ఫ్రెండ్స్ విషయాలు కానీ ఏమైనా.. అవన్నీ నాకు చెప్పటం అనవసరం కూడా! ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అది చాలు అనిపిస్తుంది. తల్లి దగ్గరకు వెళ్లి “అమ్మా! నాకు అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు” గారాలు పోతారు. పెద్దవాడికి ఇరవై ఎనిమిదేళ్ళు. చిన్నవాడికి ఇరవై నాలుగు. అయినా ఇంకా చిన్నపిల్లల లాగా అనుకుంటూ మురిసిపోతుంది సుగాత్రి. నాకు ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉంది.
మనవరాలు డైనింగ్ టేబుల్ మీద ఎక్కి “నేను వడ్డిస్తా!” అని మారాం చేస్తూ స్పూన్‌తో చెట్నీ ముగ్గురికీ వేస్తూంది. “ముందు తాతయ్యకి, తర్వాత బాబాయికి, ఆఖరికి డాడీకి” అని చెబుతూంది. “నీకు చేతకాదు తల్లీ! నేను వడ్డిస్తాను. నువ్వు కూడా ఇక్కడ కుర్చుని తిను” సుగాత్రి బుజ్జగిస్తూ అన్నది. “ఫర్వాలేదు. కింద పోతేపోయింది. చిట్టితల్లి చేత్తో పెడితేనే బాగుంటుంది. వడ్డించమ్మా!” అన్నాడు సామంత్.
టిఫెన్ ముగించిన తర్వాత సింక్‌లో చేతులు కడుక్కుంటూ ఉంటే “ఏమండీ! చిన్నాడి పెళ్లి వారం రోజుల్లోకి వచ్చేసింది. ఈ ఊళ్ళో ఉన్నవారికి మీరే స్వయంగా వెళ్లి శుభలేఖ ఇచ్చి వస్తే బాగుంటుంది” అని గుర్తుచేసింది సుగాత్రి.
“బంధువులందరికీ పోస్ట్‌లో పంపావా కాంతూ!” అని అడిగాను. “పంపాను నాన్నగారూ! ఫోన్ చేసి కూడా చెప్పాను” అన్నాడు శ్రీకాంత్. నేను బైక్ మీద వెళటానికి గోడకు తగిలించిన తాళం తీస్తూంటే “ఇవాళ ఆదివారమే కదా నాన్నగారూ! నేను ఖాళీనే. కారులో వెళదాం. మీరు ఎండలో బైక్ నడపలేరు” అని తను కూడా బయలుదేరాడు శ్రీకాంత్.
కారులో డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు శ్రీకాంత్. పక్కనే కూర్చున్నాను నేను. ఈ ఊళ్ళో బంధువుల కుటుంబాలు మూడు, నాకు వాకింగ్‌లో కలిసే స్నేహితులు నలుగురైదుగురు ఉన్నారు. వాళ్లకి శుభలేఖలు ఇచ్చిరావాలి. నేను దారి చెబుతూంటే కారు పోనిస్తున్నాడు శ్రీకాంత్. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటిముందు ఆగాము. ఆ ఇల్లు నా స్నేహితుడు రామారావు ఇల్లు.
నన్ను చూడగానే “రండి రండి వేణుగోపాలరావు గారూ!” అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. లోపలికి వచ్చి సోఫాలో కుర్చుని శ్రీకాంత్‌ని పరిచయం చేసాను. రామారావు వాళ్ళది పెద్ద ఇల్లు. విశాలమైన హాల్. ఎదురుగా షోకేస్ లో టీ.వి., రకరకాల బొమ్మలు, పుస్తకాలు ఉన్నాయి. టీ.వి., పైన వాళ్ళ అబ్బాయిది కాబోలు ఫోటో ఉన్నది. రామారావు భార్య చిన్నగా నడవలేక నడుస్తూ వచ్చి పలకరించింది. ఇద్దరికీ అరవైఏళ్ల పైనే ఉంటుంది. చేతిలో శుభలేఖ పెట్టాను. “ఈ నెల పద్దెనిమిదిన మా చిన్నబ్బాయి వివాహం. మీరు తప్పకుండా రావాలి” అన్నాను. “అలాగే!” అన్నాడు కార్డు అందుకుంటూ.
“కాఫీ తీసుకువస్తాను. కూర్చోండి” అయన భార్య కిచెన్ లోకి వెళ్ళింది. కిచెన్ లో ఆమె కాఫీ కలపటం దూరంనుంచీ కనబడుతూనే ఉంది. “ఇంట్లో మీ ఇద్దరే ఉంటున్నారా!” చుట్టూ చూస్తూ అడిగాడు శ్రీకాంత్. “అవును బాబూ! ఒక్కడే అబ్బాయి. అమెరికాలో ఉంటున్నాడు. అయిదేళ్ళ క్రితం ఇండియా వచ్చాడు. అప్పుడు కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టి స్కూల్‌కి కూడా వెళుతున్నదట. పాప ఎలా ఉంటుందో ఇంతవరకూ మేము చూడలేదు” చెప్పాడు రామారావు.
“కంప్యూటర్‌లో చూడవచ్చట. స్కైప్ అట. ఏమిటో, అదంతా మాకు తెలియని వ్యవహారం. కళ్ళారా ఎప్పుడు చూస్తామో, ఏమిటో!” అందరికీ కాఫీ అందిస్తూ అన్నది ఆమె.
“స్కైప్ లోనా! దానిదేముంది? ఈ సారి మా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను.” అన్నాడు శ్రీకాంత్.
“అది సరే! సడన్‌గా ఏదైనా అనారోగ్యం వస్తే మీకు తోడు ఎవరు?” అడిగాను.
“ఒకరికొకరం తోడు. ఆ పైన భగవంతుడే ఉన్నాడు” అన్నాడు రామారావు. నేను మాట్లాడలేదు. కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాను. కొంచెం సేపు కుర్చుని లేచి నిలబడ్డాము నేను, మా అబ్బాయి. కారులో కూర్చుంటూ “కాంతూ! కొత్తపేటలో పెద్దత్తయ్య వాళ్ళు ఉంటున్నారు. అక్కడికి వెళదాం” అన్నాను. “అలాగే నాన్నగారూ!” డ్రైవ్ చేస్తూ అన్నాడు శ్రీకాంత్.
కొద్దిసేపటి తర్వాత కారు ఒక ఇంటిముందు ఆగింది. గేటు తీసుకుని లోపలకి వచ్చాము. గేటు తీసిన చప్పుడికి మా పెద్దమ్మ కూతురు జయమ్మ వచ్చి తలుపు తీసింది. ఆమెకు సుమారు అరవై అయిదేళ్ళు ఉంటాయి.
“బాగున్నావా అక్కా!’ అడిగాను. “నువ్వా! రా! రా! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు?” నవ్వుతూ ఆహ్వానించింది. ఆమె చెవికి వెనకవైపు చెవిటి మిషన్ పెట్టుకుని ఉంది. లోపలకి వచ్చి శుభలేఖ అందించి విషయం చెప్పాను. కవర్ తెరిచి చూసింది.
“ఈ నెల పద్దెనిమిదినా! ఈ ఊళ్లోనేగా! తప్పకుండా వస్తాను” అన్నది. “బంటీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అక్కా! అమెరికా లోనేనా!” అడిగాను. “అవును. అక్కడే!” అన్నది. “అప్పుడప్పుడు వస్తూ ఉంటాడా!” మళ్ళీ అడిగాను.
“రెండేళ్ళు పైనే అయింది. సెలవు దొరకదు, వీలుకాదు అంటాడు. ఫోన్‌లో కూడా మాట్లాడటం తక్కువే! ఏదో పనిలో ఉన్నాను అని చెబుతాడు. కన్నతల్లిని చూడాలని ఉంటే నిజానికి ఇవన్నీ అడ్డం అవుతాయా! ఏమిటో అంతా నా ప్రారబ్దం!” నిర్వేదంగా అన్నది.
“మరి ఇప్పుడు నీకు తోడు ఎవరు? ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా, చేసినా..”
“పై పోర్షన్ అద్దె కిచ్చాను. ఒకామె ఉంటున్నది. ఆమె కూడా నా లాగానే వంటరిది. ఒకరికొకరు తోడుగా ఉంటాము. అయినా మరీ మంచాన పడే పరిస్థితి వచ్చినప్పుడు నీలాంటి పుణ్యాత్ముడు ఎవరో ఒకరు చూడకపోతారా అనే ఆశతో బ్రతుకుతున్నాను” అన్నది.
“తప్పకుండా వస్తాను. నీకు అలాంటి పరిస్థితి రాకూడదు. నీకు ఎప్పుడు తోచకపోతే అప్పుడు నా ఇంటికి రా అక్కా! రెండురోజులు ఉందువుగానీ, బంటీతో నేను కూడా మాట్లాడతాను”
“ఒక్కగానొక్క కొడుకు. చిన్నతనంలోనే భర్త పోయినా, వాడిమీదే ప్రాణాలు పెట్టుకుని పెంచి పెద్దచేశాను. నిన్ను వదలి దూరంగా ఉండలేనురా! దగ్గరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకో! అని చెప్పాను. నా భవిష్యత్‌కి అడ్డు పడతావా అని ఏమేమో అన్నాడు. ఇంకేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు పెళ్లికైనా ఏదో నలుగురు మనుషులు కనబడతారని, కాస్త కాలక్షేపంగా ఉంటుందని వస్తున్నాను. ఆ కూరలు, భోజనాలు నేను తినలేను. అరిగి చావవు” అన్నది.
నా మనసంతా ఎలాగో అయిపోయింది. నేను వద్దాన్నా వినకుండా నడవలేక, నడవలేక వంటగదిలోకి వెళ్లి టీ పెట్టుకుని వచ్చింది. టీ తాగి శ్రీకాంత్, నేను బయటికి వచ్చాము.
ఇంకా తెలిసిన వాళ్ళు అయిదారు ఇళ్ళవాళ్లకి వెళ్లి శుభలేఖలు ఇచ్చివచ్చాను. అందరి ఇళ్ళల్లో ముసలి వాళ్ళే వంటరిగా ఉంటున్నారు. ఎవరి మాటల్లో చూసినా నిరాశానిస్పృహలు కనిపిస్తున్నాయి. ఎవరి ముఖంలోనూ సంతోషం కనబడదు, ఏదో ఇలా బ్రతుకీడుస్తున్నాం అన్నట్లు ఉన్నారు.
ఇంటికి తిరిగివస్తూంటే నా మనసంతా మూగబోయినట్లు ఉన్నది. శ్రీకాంత్ డ్రైవ్ చేస్తుంటే మౌనంగా కూర్చున్నాను.
ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకున్నాను. ఆలోచనలు ఏటో పోతున్నాయి. ఎవరిని అడిగినా వాళ్ళ పిల్లలు అమెరికా లోనో, ఆస్త్రేలియా లోనో ఉన్నారు అని చెబుతారు. వాళ్ళకి చదువు చెప్పింది మన విద్యాసంస్థలు, మన గురువులు. వాళ్ళకి అన్నం పెట్టింది మన రైతులు, వాళ్ళకి రక్షణ కల్పించింది మన సైనికులు. కానీ వారి సేవలు మాత్రం విదేశాల వారికి అందిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? దేశసౌభాగ్యం అయిన యువతరం అంతా ఇలా విదేశాలకు వెళ్ళిపోతే దేశం ఏం కావాలి? దేశం సంగతి ఎలా ఉన్నా, ముందు కన్న తల్లిదండ్రులను ఆదరించవలసిన అవసరం లేదా! బిడ్డలను విదేశాలకు అప్పగించి, ఏకాకి బ్రతుకు బ్రతకటానికా ఇంత కష్టపడి వాళ్ళని పెంచి, విద్యాబుద్ధులు చెప్పించింది? ఈ మాట ఎవరైనా వింటే పిల్లల కెరీర్‌కి అడ్డుపడతావా, నీ స్వార్ధం చూసుకుంటావా అని అంటారు. జయమ్మ అక్క కూడా అదే చెప్పింది. వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకోవటం మాత్రం స్వార్ధం కాదా! వాళ్ళ మనసు తప్పొప్పులు చెప్పదా!.. ఏమిటో! నా మనసంతా ఏదోలా అయిపోయింది.
సుగాత్రి వచ్చి పక్కనకూర్చుంది. “ఏమిటండీ అలా ఉన్నారు?” అని అడిగింది. ఇప్పుడు నేను చూసి వచ్చిన ఇళ్ళల్లో వారి గురించి చెప్పాను. నేను మాట్లాడుతూ ఉండగానే శ్రీకాంత్, సామంత్, కోడలు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు.
“కాంతూ! నేను మీ ఫ్యూచర్‌కి అడ్డుపడకూడదని నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమని చెప్పాను. కానీ నువ్వు ససేమిరా అంగీకరించలేదు. ఇక్కడ మాత్రం ఫ్యూచర్ ఉండదా, మమ్మీని, మిమ్మల్ని వదలివెళ్ళను అన్నావు. అలా ఎందుకు అన్నావో అప్పుడు అర్థం కాలేదు కానీ, ఈరోజు రామారావు గారినీ, జయమ్మ అత్తనీ, మిగతా అందరినీ చూసిన తర్వాత నేనెంత అదృష్టవంతుడనో అర్థం అయింది. మీరిద్దరూ కళ్ళ ఎదురుగా ఉండబట్టే ఇప్పుడు నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను. లేకపోతే వాళ్ళకిలాగా నిరాశతో బ్రతుకీడుస్తూ, చావుకోసం ఎదురుచూస్తూ ఉండవలసివచ్చేది” అన్నాను.
“అదేమిటి నాన్నగారూ! కనీ, అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించటం బిడ్డల ధర్మం. మా పసితనం మీ ఒడిలో ఎలా గడిచిపోయిందో, మీ వృద్ధాప్యం కూడా మా నీడలో అలా నిశ్చింతగా గడిచిపోవాలి. మీ ఖర్మకి మిమ్మల్ని వదిలేసి, మా స్వార్థం మేము చూసుకుంటే మనుషులం అనిపించుకునే అర్హత ఉంటుందా!” అన్నాడు సామంత్.
ఆ మాట వినగానే నా మనసంతా ప్రేమతో నిండిపోయింది. “నేను పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటాను. అందుకే మీలాంటి గుణవంతులైన కొడుకులు పుట్టారు” అన్నాను వాడి తలవంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ.
సుగాత్రి సంతృప్తిగా, చిరునవ్వుతో వాళ్ళ వంక చూసింది.