అదృశ్య సూతకం…??

0
3

[dropcap]సూ[/dropcap]తకం అనే శబ్దం మన జీవితంలో అటు పుట్టుకతో ఇటు చావుతో సంబంధం కలిగి ఉందనే చెప్పాలి. పుట్టుకతో వచ్చే సూతకాన్ని పురుడు లేదా పుణ్య పురుడు అనే పేరుతో పిలుస్తారు. అటు బాలింతలు, ఇటు బిడ్డకు విశ్రాంతిని ఇచ్చే ఉద్దేశంతో మన పెద్దలు ఇలా ఏర్పాటు కూడా చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా పదకొండవ రోజు పంచగవ్య సేవనంతో, పుణ్యాహవాచనంతో ఇల్లు, బాలింత మరియు బిడ్డ శుద్ధి పొందుతారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రక్త సంబంధం కలిగిన, బంధువర్గానికి సంబంధించిన వ్యక్తి చావుతో ఏర్పడే సూతకం అశుభకరమైనదిగా పరిగణిస్తాం. పుట్టుక మరియు చావు రెండింటిలోనూ సూతకం ఛాయలను ఉన్నప్పటికీ జన్మతో కూడిన అశౌచమును దుఃఖకరమైనదిగా కాకుండా శుభకరమైన సూతకం లేదా అశౌచం అని అంటారు

‘సూతకం’ అనే పదం మనలో భావనాత్మక మైన ఆలోచనలను కలిగిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మరణం వల్ల ఏర్పడే సూతకపు ఛాయలు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్లు, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన వారు కావడం వల్ల వారిలో ఏ ఒక్కరిని కోల్పోయిన కూడా ఆ దుఃఖము వర్ణించలేనిది. మృత్యువు తప్పనిసరి, దానిని జయించలేము అన్న సత్యము అని మనకందరికీ తెలిసినప్పటికీ మన దగ్గర వారి మృత్యు పీడను మరియు దుఃఖాన్ని భరించడం మనకు, మనసుకు కష్టతరమే. సూతకం కేవలం తోడపుట్టిన వారికి మాత్రమే వర్తించదు. దాయాదులు కూడా సూతకపు నియమాలను పాటిస్తూ ఉంటారు. కొన్ని సార్లు మనకు అత్యంత సన్నిహితులైన స్నేహితుల మృత్యువు కూడా చాలా ఇదే పాటి దుఃఖాన్ని కలిగిస్తుంది.

సూతకం అనేది మనిషి మరణానంతరం మాత్రమే వర్తిస్తుంది అని మనకు తెలుసు. కానీ వర్షం రాక ముందే ఆకాశంలో నల్లని మబ్బులు మేఘావృతం అయినట్టు, మన జీవితాలలో కూడా కుటుంబం లోని వ్యక్తి లేదా రక్త సంబంధం ఉన్న వ్యక్తి మరణించక ముందే నేడు మనం సూతకపు ఛాయలను అనుభవిస్తూ ఉన్నాము. ఆ ఛాయలు అదృశ్య రూపంలో ఉండడం వల్ల కొంత గందరగోళంగా అనిపిస్తూ ఉంది. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ తనదైన రీతిలో బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో నేను నా కుటుంబం అనే లెక్కలో జీవితాన్ని జీవించడానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. తెల్లవారింది మొదలు తమ తమ పనులతో బిజీగా ఉండే మన జీవితాల్లో ప్రవేశించిన ఈ అదృశ్య సూతకం గురించి ఆలోచించే ఓపిక గానీ తీరిక గానీ ఎవరికీ లేదు.

సూతకం ఉన్న ఇంటిలోనికి ఎవరూ వెళ్లారు, సూతకం ఉన్న వ్యక్తిని ఎవరూ తాకరు, వారి ఇంటిలో భోజనం చేయరు. అలాగే అదృశ్య సూతకం ఛాయలో భాగంగా నేడు తోబుట్టువుల మధ్య దూరం పెరిగిందనే అనిపిస్తుంది. వారు నివసించే ప్రాంతం, దేశం ఏదైనా అయి ఉండవచ్చు, అది ఒక వైపు ఉంటే, దానికన్నా బలమైన మానసిక దూరం పెరుగుతూ ఉందనే చెప్పాలి. ఇది ఒక రకంగా అదృశ్య సూతకంగా భావించవలసి వస్తుంది. బ్రతికి ఉన్న తోబుట్టువు గురించి ఆలోచించను సమయం లేదు. కానీ మనసులో వారి మీద బోలెడంత ప్రేమ ఉంది, మమకారం ఉంది కానీ దాన్ని చూపించే సమయం లేదు. కానీ సమయానికి నిలకడ లేదు కదా అది నిరంతరం వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది.

ఒకనాడు హఠాత్తుగా ఆ తోబుట్టువు చనిపోయింది అని తెలిసి, బోరున ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ సూతకపు నియమానుసారం మూడు రోజులు, పది రోజులు ఇలా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నం మనమందరం చేస్తూ ఉన్నాము. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడరాదు అన్న నియమాన్ని మనమందరమూ పాటిస్తూ ఉన్నాము. పదమూడవ రోజు జరిపే వైకుంఠ సమారాధనలో భాగంగా తన తోబుట్టువు లేదా బంధువు గుణగణాలను గుర్తుకు తెచ్చుకొని వారిని ప్రశంసిస్తూ ఉంటాము. ప్రతి ఒక్క మనిషిలో మంచి-చెడు రెండూ ఉంటాయి. కానీ ఆనాడు అతని లోని చెడుని విస్మరిస్తూ అతని లోని సుగుణాలను గుర్తు చేసుకొని కన్నీరు కారుస్తాము. కానీ ఆ మృత వ్యక్తికీ బ్రతికి ఉన్నప్పుడు మాత్రం, మనం కాసింత సమయం, తన గురించి ఒక మంచి మాట, ఒక బహుమతి ఇవ్వలేకపోవడం అనేది అదృశ్య సూతకం లోని మొదటి లక్షణంగా అనిపిస్తుంది. పైన నేను గొప్ప, నువ్వు గొప్ప అనే భావన కన్నా, ఎవరు ఎంత గొప్ప అనే దాని కన్నా వారిరువురి మధ్య సంబంధం ఎంత గొప్పది అన్నది ఆలోచిస్తే అలాంటి అపోహలకు తావుండదు కదా. ప్రతి రోజూ మనం ఒకరికి ఒకరు కలువలేము, మాట్లాడనూ లేము కనీసం పండుగ సందర్భం లోనో, శుభ కార్యాలు లోనో కలిసి నేనున్నాను అన్న భరోసా ఇవ్వలేని రోజు అదృశ్య సూతకం పూర్తి స్థాయిలో ఆవరించింది అనే అనుకోవాలి. ఇటువంటి సూతకపు ఛాయలను పుణ్యాహవాచనం ద్వారా కాకుండా కేవలం పరస్పర క్షమాగుణం, ప్రేమ, ఆదరణల ద్వారా పూర్తిగా శుద్ధీకరించవచ్చు అని నా అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here