అడుగడుగున గుడి ఉంది – పుస్తక సమీక్ష

1
3

[dropcap]’భ[/dropcap]గవంతునికి, భక్తునికి, భక్తికి అంకితం’ ఇచ్చిన ఈ పుస్తకం చూడగానే, ఈ రచన రచయిత కలం నుంచి కాదు, హృదయం లోలోతుల్లోంచి జాగృతమైన జన్మజన్మల సంస్కారం, ప్రాచీన భారతీయ సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాల వారసత్వపుటనంతమైన సంపదల ప్రభావంలో మనస్సుతో సృజించిన రచన ఇది అన్న భావన కలుగుతుంది. ఏ రచయిత అయినా తన సమకాలీన సామాజిక పరిస్థితులకు స్పందిస్తాడు. సమకాలీన సామాజిక, రాజకీయ, ధార్మిక పరిస్థితులకు రచయిత అంతరంగ సంస్కార స్పందన ఫలితం ‘అడుగడుగున గుడి ఉంది’. ఇది పర్యాటక పుస్తకం కాదు, దేవాలయ దర్శనాల పుస్తకం కాదు. రచయిత మాటల్లోనే చెప్పాలంటే “గుడి ఒక అనుభూతి. గుడిలోకి వెళ్ళగానే మనసు యుగాబ్దాల వెనక్కు వెళ్తుంది. శతాబ్దాల ముందుకు వెళ్తుంది. జనన మరణ చక్రాలను దాటి, ఆలోచన ఆధాత్మికం వైపు పరుగులు తీస్తుంది. స్వార్థం, దైన్యం, సంకుచిత్వం, క్షమతారాహిత్యం, క్షుద్ర భావనలను అధిగమించి అధిదైవికం వైపు పురోగమిస్తుంది”.

అంటే రచయిత దృష్టిలో గుడి ఒక కట్టడం కాదు. క్యూలో నుంచుని కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తోసుకుంటూ విగ్రహం ముందుకెళ్ళి ఓ దండం పెట్టుకొని ‘హమ్మయ్య, ఓ పనైపోయింది’ అనుకుని, మామూలు ప్రపంచంలో పడటం కాదు. తీర్థం, ప్రసాదం, స్పెషల్ దర్శనాలు, ఇన్‍ఫ్లూయెన్స్ ఉపయోగాలు కాదు. గుడి అంటే క్యూలు, అశుభ్రం, రకరకాల ఫీజుల వసూళ్ళు, దక్షిణల గుంజుళ్ళ స్థలం కాదు. అంధ విశ్వాసాల ప్రదర్శనలకాలవాలం కాదు.

భారతీయ సమాజంలో గుడి అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, భారతీయ సమాజానికి గుండె వంటిది గుడి. గుడి కేవలం విగ్రహాన్ని ఉంచే కట్టడం కాదు. గుడి ఒక విద్యాశాల. గుడి ఒక వైద్యశాల. గుడి ఒక మానసిక వైద్యశాల. గుడి ఆధ్యాత్మిక పాఠశాల. గుడి సమాజ ఆర్ధికాభివృద్ధికి సోపానం. పరమపదసోపానంలో తొలి మెట్టు. భారతదేశ చరిత్రకు సాక్షి. ఆధునిక కాలంలో ‘గుడి’ అన్న భావన దుర్వ్యాఖ్యానాలకి గురై, అపోహలకు, అపార్థాలకు గురయి, అసలు అర్థాన్ని కోల్పోతున్న తరుణంలో ‘భారతీయ సమాజపు మహాయాత్రలో మందిరాల స్థానం అమేయం, అద్భుతం. ఆ వైవిధ్యాన్ని, ఆ విలక్షణతను కొండను అద్దంలో చూపినట్టు కొంచెంగా చూపించటమే’ లక్ష్యంగా చేసిన ఒక రచన వెలువడటం ఆనందించదగ్గ విషయం మాత్రమే కాదు, సరైన సమయంలో ‘మందిర’ భావనను సరైన దృక్కోణంలో ప్రదర్శిస్తూ, భారతీయ జీవన విధానంలో ‘మందిరం’ ప్రాధాన్యాన్ని సరళంగా వివరించే పుస్తకం వచ్చిందని ‘సెలెబ్రేట్’ చేసుకోవాల్సిన విషయం.

‘అడుగడుగున గుడి ఉంది’ పుస్తకంలో మొత్తం 25 పరిచయ వ్యాసాలు ఉన్నాయి. ఈ పరిచయం మామూలు పర్యాటక వివరాలకు పరిమితమైనది కాదు. ‘ఆయా గుడులకు వెళ్ళినప్పుడు రచయిత మనసులో కలిగిన భావావేశానికి అక్షర రూపం’. ఈ వ్యాసాల ద్వారా వ్యక్తి గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి మానసిక సంసిద్ధత అవసరమో సున్నితంగా ప్రదర్శిస్తారు రచయిత. ప్రతి గుడి గురించి సూక్ష్మంలో ఆ గుడి చరిత్ర, కాస్త వర్ణన, భారతీయ సామాజిక, ధార్మిక, రాజకీయ చరిత్రలో ఆ గుడి ప్రాధాన్యం వంటి విషయాలను చిన్న చిన్న వ్యాసాలలో, అతి సులువుగా అర్థమయ్యే తేలిక పదాలతో వివరిస్తారు రచయిత.

హరిశ్చంద్ర గఢ్ శివమందిరం గురించిన వ్యాసం ప్రారంభ వాక్యాలే ‘సహ్యాద్రి కనుమల కొండ ముడుతల్లో పాము పడగ విప్పినట్టు ఉంటుంది కొంకణ కడా కోన’. ‘కొండ ముడుతలో పాము పడగ’ అన్న వాక్యం కళ్ళ ముందు అద్భుతమైన దృశ్యాన్ని సృజిస్తుంది. ‘ఘాటేశ్వర మందిరం’ వ్యాసంలో ప్రారంభ వాక్యాలు ‘చరిత్రను వీపున మోసి మోసి సొలసినట్టుండే ఆ బండరాళ్ల గుట్టపైకి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి చేరుకుంటే…’ చదవగానే మనసులో ఓ చిత్రం మెదలుతుంది. చివరలో ‘తరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ విశిష్ట దేవాలయం ఇప్పుడు అవహేళనకు గురై అజ్ఞాతంలో మగ్గుతోంది… అచ్చు మన సంస్కృతి లాగే’ అంటూ ముగిసే ఈ వ్యాసం పార్లమెంట్ భవన నిర్మాణానికి స్ఫూర్తినిచ్చిన మందిరం గురించి. ఈ భావన వ్యాసం పూర్తయ్యేసరికి మనసును బరువు చేస్తుంది.

మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో క్రీ.శ. 1140 నుండి ఒంటరిగా ఉన్న వినాయకుడి విగ్రహం గురించి రాస్తూ ‘ఆ ఊరి అప్పటి ఎంపిటిసి పార్వతమ్మ ఎన్నికల ప్రచారం ఈ గుండు గణేశుడి ముందు కొబ్బరికాయ కొట్టే మొదలుపెట్టిందట. ఆమె గెలిచింది. గణేశుడు మాత్రం సగటు భారతీయ ఓటరులా ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు’ అని వ్యాఖ్యానిస్తారు రచయిత. ఈ వ్యాఖ్య పాఠకుడి మనస్సుకు శరాఘాతంలా తాకుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా లోదే సలేశ్వరం అన్న మందిరం చరిత్రను వర్ణిస్తూ ‘జాబిల్లి వెలుగులు ఆకుల మీద, కొండల మీద పడి మిలమిల మెరిసి, గలగల మురిసి, కిందకు జాలువారి వెన్నెల నదిలా, వన్నెల నిధిలా మారుతున్న వైనం చూస్తే వనమే విభూతి రాసుకుంటోందా అనిపిస్తుంది’ అంటాడు రచయిత. ఇది చదవగానే ఇంతకాలం మనసులో అస్పష్టంగా ఉన్న భావం స్పష్టమవుతుంది. ఈ రచయిత కవి. వచనాన్ని ముక్కలు గొట్టి కవిత్వంగా చలామణీ ఆధునిక గొప్ప కవులు చేస్తుంటే ఈ రచయిత కవిత్వాన్ని వచనంగా రాస్తున్న అసలు ‘సుకవి’ అనిపిస్తుంది. హైదరాబాద్‍కి 35 కిమీ దూరంలో ఉండి, గూగులమ్మకి సైతం తెలియని వేణుగోపాల స్వామి గుడి గురించి రాస్తూ ‘హిందువులు ముస్లింలు ఎంతగా ఒక్కటై పోయారంటే, ముస్లింల హుస్సేన్, హిందువుల సాగరంతో కలిసి హుస్సేన్ సాగర్ అయింది. తెలుగువారి గొల్ల, ఉర్దూ కిటికీ తో కలిసి గొల్లఖిడికీ అయింది. ఇస్లామిక్ ఇబ్రహీం తెలుగు పట్నంతో పెనవేసుకుపోయి ఇబ్రహీం పట్నం అయింది. హిందువులు ముస్లింలు ఒక్కటైపోతే మతోన్మాద ఔరంగజేబుకి నిద్రపడుతుందా?’ అంటూ గుడి నిర్లక్ష్యానికి గురయిన చరిత్రను సవ్యాఖ్యానంగా బోధిస్తారు.

ఇలా చెప్తూ పోతే దాదాపు మొత్తం పుస్తకాన్ని తిరిగి రాయాల్సి ఉంటుంది. మన ఎదురుగానే ఉన్న, మనం పట్టించుకోని అనేక అద్భుతమైన చారిత్రక, సామాజిక, రాజకీయ, ధార్మిక అంశాలను వివరిస్తూ అడుగడుగున ఉన్న అతి అపురూపమైన గుడుల పరిచయం అత్యంత లోతుగా అనుభవిస్తూ హృదయంతో చేసిన పరిచయాలు ఈ పుస్తకంలోని వ్యాసాలు.

చివరగా ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. మన లక్ష్యం మంచిదయినప్పుడు, మనం నిజాయితీగా లక్ష్యసాధనకు కృషి చేస్తే ప్రకృతి మొత్తం మన లక్ష్య సాధన సంపూర్ణం అవటంలో తోడ్పడుతుందంటారు. అలా ఈ పుస్తకంలో రచయిత రాతలలో, భావాలతో పోటీ పడుతూ, ఒకోసారి డామినేట్ చేస్తూ రచయిత వెలిబుచ్చిన భావనలను ఇనుమడింపజేస్తూ వేణుమాధవ్ గీసిన రేఖా చిత్రాలు ఈ పుస్తకం విలువను పదింతలు పెంచాయి అనటంలో సందేహం లేదు. ఆ చిత్రాలు ఈ పుస్తకంలో అమరిన తీరు బంగారానికి తావినిచ్చినట్టయింది.

నిజంగా, రచయిత ఒక్కో వ్యాసంలో అక్షరాల ద్వారా సృజించిన భావాలను చిత్రకారుడు తన చిత్రాలలో మరింత ప్రస్ఫుటం చేశారు. పుస్తకంలో ప్రతి పేజీ రూపొందించిన తీరు ఈ పుస్తకం తయారీ ఎంత శ్రద్ధతో, ప్రాచీన కాలంలో మందిరాన్ని శిల్పులు ఎలా దైవానికి అంకితం చేస్తున్న భావనతో తీర్చిదిద్దేవారో అలా తీర్చిదిద్దారని అనిపిస్తుంది.

‘అడుగడుగున గుడి ఉంది’ అనే ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులు ఒక ‘గుడి’ ద్వారంలా భావించి పఠించాలి. ఇంట్లో మందిరంలో ఉంచి అధ్యయనం చేయాలి. ఇతరులకి దైవ విగ్రహాన్నిస్తున్నట్టు బహుమతిగా ఇవ్వాలి. ఈ పుస్తకం చదివిన తరువాత గుడికి వెళ్ళటం ఒక యాంత్రిక చర్య కాక ధార్మిక, ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, చారిత్రిక సత్య దర్శనంద్వారా వ్యక్తి చేసే అంతరంగ దర్శనం అన్న గ్రంపుతో చేసే ప్రయాణం అవుతుంది..

***

అడుగడుగున గుడి ఉంది
రచన: కస్తూరి రాకా సుధాకర రావు
పేజీలు: 146
వెల: ₹100/-
ప్రతులకు:
ప్లాట్ నెంబరు 79, వీ.ఆర్.ఆర్. ఎన్‌క్లేవ్,
దమ్మాయిగూడ, హైదరాబాద్ -83
ఫోన్: 9000875952

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here