అడుగులు ముందుకు…

5
2

[box type=’note’ fontsize=’16’] “తన జీవితానికే విలువ ఇచ్చుకోలేనివాడు మరొక వ్యక్తిని ప్రేమించలేడు” అంటున్నారు భీమరాజు వెంకటరమణఅడుగులు ముందుకు…” కథలో. [/box]

[dropcap]ఆ[/dropcap]రోజు ఆఫీసులో పెద్దగా పని లేదు. నాకూ ఎందుకనో కాస్త నీరసంగా కూడా ఉంది. పర్మిషన్ తీసుకొని ఇంటికొచ్చేశాను. తలుపు తాళంతీసి లోపలికి అడుగు పెడుతుండగా మొబైల్ మోగింది. వికాసం పత్రిక ఆఫీసునుండి. “సాహితి గారు! మీకిచ్చిన ప్రేమ కథల పోటీ తాలూకు కథలు చదవడం అయిపోయిందా?” సబ్ ఎడిటర్ శశికుమార్ గారి స్వరం.

“ఇంక కొన్నే ఉన్నాయండి! రేపటికల్లా చదవటం పూర్తి చేసి మీకు జాబితా తయారుచేసి పంపుతాను” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

వికాసం పత్రిక అధిపతి చక్రపాణి గారికి నేనంటే వాత్సల్యం, అభిమానం. మొదటిది నేను తన కూతురు వయసు దాన్నై ఉండటం వలన అనుకుంటాను. రెండోది నా రచనలు ఆయనకు నచ్చి ఉండటం వల్ల కావచ్చు. నూట యాభై పై చిలుకు కథలు వాయడం, నాలుగు సీరియళ్ళు ప్రచురణ, కొన్ని కథలకు బహుమతులు గెలుచుకోవడం జరిగాయి. పత్రిక వారు ఏర్పాటు చేసిన ఒక సాహిత్య సభకు నేనూ హాజరు కాగా అప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు.

నేను హైదాబాదుకి వచ్చి స్థిరపడటం, పత్రిక ఆఫీసుకు అప్పుడప్పుడూ వెళ్ళడంతో పరిచయం బాగా పెరిగింది. చిన్నతనంలోనే ఎక్కువ మంచి రచనలు చేశానని మెచ్చుకుంటూ ఆయన నన్ను అరుణకు బదులు సాహితీ అని పిలిచేవారు. నేనూ ఆ పేరుతోనే ప్రస్తుతం రచనలు చేస్తున్నాను, నాకూ కాస్త అజ్ఞాతం అవసరం అనిపించడంవలన.

అప్పుడప్పుడు కథల పోటీ పెట్టినపుడు నాకు కొన్ని కథలు పంపి, నా అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంటుంది.

కాఫీ కలుపుకొని వచ్చి టీపాయ్ మీద ఉన్న కథలను పరిశీలించాను. మరో పది కథలు చదివితే అయిపోతుంది. చదివిన వాటిమీద నా అభిప్రాయం మరో కాగితం మీద వుసి ఉంచాను. మిగిలినవి ఒక్కొక్కటీ తీసి చదవడం మొదలు పెట్టాను.

స్కూలు ప్రేమలు, కాలేజీ ప్రేమలూ, పక్కింటి ప్రేమలు, రకరకాల కథలు.

నా మనసు తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్ వైపు వెళ్ళింది. ఒకసారి ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చిన ప్రత్యేక సంచికలో నా కథకు బహుమతి రావడం, క్యాంపస్‌లో అందరూ నన్ను అభినందించడం గుర్తొస్తున్నాయి. ఉదయ్ మాటలు కూడా.

కాఫీ కప్పు ప్రక్కన పెట్టి మళ్లీ చదవడం మొదలు పెట్టాను.

ఆస్ట్రేలియా అమ్మయితో తెలుగబ్బాయి ప్రేమ కథ సరదాగా సాగింది. ఆ అమ్మాయికి భాష సంబంధమైన ఇబ్బంది, ఇక్కడి పెళ్ళి తంతు విషయమై అయోమయం, పెద్దవాళ్ళు అంగీకరించి శ్రద్ధగా సంతోషంగా పెళ్ళి జరిపించడం, తిరుమల వెంకన్నని దర్శించి ఆస్ట్రేలియా వెళ్ళిపోవడంతో కథ సుఖాంతంగా ముగుస్తుంది.

మరొకటి మరుగుజ్బు అబ్బాయితో చక్కటి పొడువాటి అమ్మాయి ప్రేమ కథ. కాస్త ఉద్వేగభరితంగా ఉంది.

ఆ అమ్మాయి మానసిక స్థితి బాగలేకనే అతన్ని ప్రేమించిందని అమ్మాయి తరఫున వాళ్ళు గొడవ చెయ్యటం, పంచాయితీలు పెట్టడం లాంటి సన్నివేశాలతో కథ నడిచింది. చివరకు వాళ్ళిద్దరూ పెద్దలకు చిక్కకుండా పారిపోయి పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తరువాత చిందర వందర చేతి రాతతో ఉన్న కథ చేతిలోకి తీసుకున్నాను. కథ పేరు “వీడ్కోలు”. కాగితాలన్నీ చివరిదాకా ఒకసారి చకచకా తిరగేశాను. మనసులో కొద్దిపాటి అలజడి.

కథ చదువుతూ ముఖ్య మనిపించిన వాక్యాలు మార్క్ చేస్తూ పోయాను. “పాణప్రదంగా ప్రేమించిన ప్రియురాలిని దూరం చేసుకున్న ప్రకాష్‌కు పెద్దల ద్వారా రవళి భార్యగా వచ్చింది. కానీ కాలం గడిచే కొద్దీ ఆమెకూ ఈ వివాహం ఇష్టం లేదని అతనికి అరమైంది. ప్రతి చిన్న విషయానికి ప్రకాష్‌తో ఘర్షణకు దిగేది. అసలే మానసికంగా కృంగిపోయి ఉన్న ప్రకాష్ ఆమె చేష్టలు భరించలేకపోయాడు. ప్రకాష్ రవళిల కాపురం నరకానికి మారుపేరులా మారిపోయింది.

పెళ్ళి జరిగి నాలుగేళ్ళు దాటినా పిల్లలు పుట్టలేదు. మీవాడిలో లోపముందంటే, మీ అమ్మాయిలోనే ఉందని రెండు కుటుంబాల మధ్య వాదనలు జరిగాయి. రవళి ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు వచ్చాయి. తన చుట్టూ ఉన్నవారంతా తన శత్రువులుగా భావించేది. ఏ నిముషంలో ఏం చేస్తుందో అనే ఆందోళన అందరిలోనూ ఉంది.

ఆమెను మానసిక వైద్యుడికి చూపించాలనే ఆలోచన కూడా ఆమె తల్లిదండ్రులకు కలిగింది. అలాంటి పరిస్థితిలో ఒకరోజు రవళి ఎంతో మంచిగా నటించి, సంతోషంగా మాట్లాడి విహారానికి మైసూరు వెళదామని ప్రకాష్‌ని ఒప్పించింది.

తనే కారు నడుపుతూ ఊరు దాటిన తరువాత వేగాన్ని విపరీతంగా పెంచింది. ప్రకాష్ కంగారుపడిపోతూ “రవళీ! ఏమిటీ స్పీడు? కాస్త నెమ్మదిగా పోనియ్, నువ్వుకూడా సీటు బెల్ట్ పెట్టుకో” అన్నాడు. అందుకు రవళి పెద్దగా నవ్వి “యాక్సిడెంట్ అయి చచ్చిపోతావని భయంగా ఉందా? మనసారా ప్రేమించిన వాళ్ళని నట్టేట ముంచిన దెయ్యాలం మనం. మనకు చావు ఉంటుందా? అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ వేగం ఇంకా పెంచింది. కారు అదుపు తప్పి చెట్టుకు గుద్దుకుంది.

దారినపోయే వాళ్ళు వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తుండగా రవళి దారిలోనే మరణించింది. ప్రకాష్‌కి బలమైన గాయాలు తగిలినా బ్రతికి బయట పడ్డాడు. అది ప్రమాదం కాదు ఆమే కావాలని చేసిందని అతనికి అర్థమైంది. కానీ నష్టం జరిగిపోయింది.

నెలరోజులకు ఆసుపత్రి నుండి మామూలు మనిషిగా బయటకొచ్చాడు ప్రకాష్. కానీ మానసికంగా ఇంకా కోలుకోలేదు. బ్రతికినందుకు బాధపడ్డాడు. ప్రాణాలు కోల్పోయిన రవళి గురించి ఎంతో వేదన పడ్డాడు. మరో వైపు తండ్రి తన గురించి పడుతున్న బాధను చూడలేకపోతున్నాడు

నిరాశ, నిస్పృహ అతన్ని పూర్తిగా ఆవహించాయి. బ్రతుకు మీద విరక్తి పుట్టించాయి. ఎంతో మానసిక వ్యధ తరువాత తన చావుకి తనే ముహూర్తం పెటుకున్నాడు. జనవరి పదవ తారీకు. తన ప్రియురాలితో చివరిసారిగా మాట్లాడిన రోజు. అదీ సాయంత్రం ఆరు గంటలకు.

భారంగా ఎదురుచూసిన పదవ తారీకు రానే వచ్చింది. రోజూలాగే తండ్రి ప్రక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళిందాకా వేచి చూసాడు. సమయం ఆరు కాగానే సీసాలోని నిద్రమాత్రలన్నీ చేతిలోకి తీసుకున్నాడు. తన ప్రియురాలిని తలుచుకున్నాడు. ఆమెకు మనసారా వీడ్కోలు చెబుతూ మాత్రలన్నీ నోట్లో వొంపేసుకుని మంచినీళ్ళి తాగాడు. మెల్లగా మంచం పై వాలి చమరుస్తున్న కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాడు.”

కథ అయిపోయింది.

* * *

కేలండర్ వైపు చూసాను. జనవరి పదో తారీకు. నాలో అలజడి మొదలైంది. ప్లేన్ టికెట్ కోసం ట్రావెల్ ఏజంట్‌కి ఫోన్ చేసి హడావిడిగా బయలుదేరాను.

విమానం దిగి టాక్సీలో ఆ ఇంటికి చేరే సరికి సమయం సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది. ఒక్క పరుగున తలుపు దగ్గరకు వెళ్ళాను. నిశ్శబ్దంగా ఉంది. జరగరానిది జరిగిపోయిందా? తలుపు గట్టిగా కొట్టడం మొదలు పెట్టాను. “ఉదయ్! నేను అరుణని వచ్చాను తలుపు తియ్యి!” అని పెద్దగా కేకలు పెట్టాను. చుట్టుప్రక్కల వారంతా చేరారు.

లోపల నుండి ఏ శబ్దమూ వినపడట్లేదు. తలుపు కొడుతూనే ఉన్నాను. నాలో శక్తి ఆవిరైపోతోంది. కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఉదయ్ నన్ను ఆశ్చర్యంగా చూసాడు. నమ్మలేని స్థితిలో విగ్రహంలా నిలబడిపోయాడు. దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకున్నాను. అతని కళ్ళలోకి చూశాను. అవి పేలవంగా ఉన్నాయి. ఒకప్పటి అతని మాటలు గుర్తుకొచ్చాయి.

“అరుణా! ప్రేమ గురించి నువ్వు రాసిన కథ చదివాను. ప్రేమ అనే పదం చాలా సున్నితంగా, అహ్లాదంగా అనిపిస్తుంది. కానీ దానిలో ధైర్యం ఓర్పు, క్షమ లాంటి బరువైన లక్షణాలు ఉంటాయి” అని వాసావు, ఆ మాట నాకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు యువతీయువకుల మధ్య ఉన్నదనుకుంటున్న ప్రేమలో చాలా వరకూ ఆకర్షణ, స్వార్థం, వేధింపులే ఎక్కువగా కనబడుతున్నాయి” అని కూడా రాసావు. నీమీద నా ప్రేమ కూడా అలాంటిదేనని అనుకుంటున్నావేమో అని నాకు భయమేస్తోంది. నువ్వు చెప్పింది నిజం కాదని మన పెళ్ళి ద్వారా నిరూపిస్తాను. అంతేకాదు నీ అంత బాగా కాకపోయినా ఎప్పటికైనా నేను కూడా మన ప్రేమ కథను రాస్తాను’.

ఉదయ్ చిన్నగా ఈలోకంలోకి వచ్చాడు. “అరుణా! నన్ను క్షమించు” అంటూ నా చేతులు నుదురుకేసి కొట్టుకుంటున్నాడు.

“తన జీవితానికే విలువ ఇచ్చుకోలేనివాడు మరొక వ్యక్తిని ప్రేమించలేడు” అన్నాను అతని కళ్ళలోకి చూస్తూ. అతను నా చేతులు వదిలేసాడు. అతని చేతిలోని నిద్రమాత్రలు ఉన్న సీసా క్రింద పడిపోయింది.

“ఉదయ్! ఏంట్రా ఏం జరిగింది?” అంటూ అతని తండ్రి హడావిడిగా లోపలికొచ్చాడు. నన్ను చూస్తూనే నిర్ఘాంతపోయాడు. జరిగిందంతా తెలుసుకోవడానికి ఆయనకి కాస్త సమయం పట్టింది.

ఆయన ముఖం చూస్తుంటే నాకు గగుర్పాటు కలిగింది.

గుమ్మం దాటి బయటకు వచ్చాను. ఉదయ్ తండ్రి వచ్చి ప్రాధేయపూర్వకంగా చేతులు జోడిస్తూ నా ముందు నిలుచున్నాడు. నేను ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను. అప్పటి ఆయన మాటలు:

“చూడమ్మాయ్! నీ తల్లిదండ్రులెవరో తెలియదు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి పుట్టావో తెలియదు. ఎవరో టీచర్ ఎక్కణ్నుంచో తెచ్చి పెంచుకున్నదని విన్నాం. ఈ తిరుపతిలో మా కుటుంబ గురించి నీకు తెలిసే ఉంటుంది. నీవేమీ గొప్ప అందగత్తెవి కూడా కాదు. అంతస్తులు పక్కన పెట్టడానికి. మావాడు బంగారు వన్నెగలవాడు, మరి నీవు?

అంతెందుకు! అసలు ఏ విషయంలో నూ మీఇద్దరికీ ఏ మాత్రం జోడీ కాదని నీకే అనిపించడం లేదూ? నిన్ను అవమానించాలని నా ఉద్దేశ్యం కాదు. వాస్తవాలు నీముందు ఉంచుతున్నాను. వాడు అసలే తల్లి లేనివాడు. ఈ ప్రేమ అనే రెండక్షరాల వల నుండి మా వాణ్ణి తప్పించి నచ్చచెప్పాను. విషయాన్ని పెద్దది చెయ్యకపోతే నీకే మంచిది. మావాడు ఇక నీకు కనపడడు’.

శూలాల్లా గుచ్చుకుంటూ నా చెవిలో మరోసారి మారుమోగాయి. ఆయన నన్నే చూస్తున్నాడు. నేను లోపల ఉన్న మంగళ సూత్రం తాడు పైకి కనపడేటు వేసుకున్నాను. ఆయన కళ్ళు పెద్దవి చేసి చూశాడు. గుటకలు మింగాడు. ముఖం పాలిపోయింది. “ప్రేమ అనేది రెండక్షరాల వల అనేది నిజమేనండీ! కాకపోతే మీకు తెలిసింది మరొక వ్యక్తిపై స్వార్థం కోసమో వ్యామోహంతోనో విసిరేది. నాకు తెలిసిన వల విశ్వాన్ని అక్కున చేర్చుకుని లాలించేది” అనే మాటలు నిదానంగా నా నోటి నుండి వెలువడ్డాయి. మెల్లగా ఆయన అడుగులు వెనక్కు పడ్డాయి. మా చుట్టూ చేరినవారంతా వింతగా చూస్తున్నారు. నేను వచ్చిన పని అయిపోయింది. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. నా అడుగులు ముందుకు పడ్డాయి, దాన్ని భంగపరుస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here