Site icon Sanchika

అద్వైత్ ఇండియా-11

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఇండియా వెంట మావయ్య, బావలు కారులో వెళ్ళిపోవడం సీతకు నచ్చదు. తనకు ఆ ప్రదర్శన బోరుగా ఉందంటూ తల్లినీ, అత్తయ్యనీ బయల్దేరదీసి ఇంటికి వచ్చేస్తుంది. ఇండియా వెంట వాళ్ళలా వెళ్ళడం తనకి నచ్చలేదని సీత అంటే, ఆమె తల్లి వంతపాడుతుంది. ఆ అమ్మాయి ఆ సమయంలో ఒంటరిగా వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని సావిత్రి అంటుంది. కాసేపటికి నరసింహశాస్త్రి, అద్వైత్‍లు ఇంటికి వస్తారు. శాస్త్రి గారు నేరుగా స్నానాలగదిలోకి వెళ్ళి స్నానం చేసి, వేరే పంచ ధరించి వస్తారు. అద్వైత్ పెరట్లోని బావి దగ్గర స్నానం చేసి వస్తాడు. అందరూ భోజనాలు చేస్తారు. అద్వైత్ రాఘవ రాసిన ఉత్తరానికి బదులు రాస్తూంటాడు. ఈలోపు సీత అక్కడికి వచ్చి అతన్ని అల్లరి పెడుతుంది. ఆమెని కష్టం మీద ఆమె గదికి పంపుతాడు. ఆమె వెళ్ళాకా, రాఘవకి రాస్తున్న ఉత్తరం పూర్తిచేస్తాడు. మంచం మీద వాలి సీత గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. తన గదిలో సీత కూడా అద్వైత్ గురించే ఆలోచిస్తూ నిద్రపోతుంది. తమ గదిలో నరసింహశాస్త్రి దంపతులు ఇండియా వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటారు. ఆ పిల్లే మన జాతిలో పుట్టి ఉంటే అని సావిత్రి అడిగితే, మన కోడలిగా చేసుకునేవాడినంటారు శాస్త్రి. సీత, అద్వైత్‍ల పెళ్ళి కి ముందు జాతకాలు ఎప్పుడు చూస్తారని వదినగారు అడిగారని చెప్తుంది సావిత్రి. కాశీ యాత్ర అనంతరం చూస్తానని అక్కకి చెప్పమని అంటారాయన. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు పెడుతున్న సందర్భంగా, తనకీ దీపాలు పెట్టాలని ఉందని ఇండియా నరసింహశాస్త్రితో చెప్తే, ఆయన లోపలికి వెళ్ళి సావిత్రిని కలిస్తే, నీ కోరిక తీరుతుందని అంటారు. సావిత్రిని కలిసి మీతో పాటు దీపాలని పెట్టాలని ఉందని, గురువుగారు మిమ్మల్ని అడగమన్నారని చెప్తుంది. సావిత్రి సరేననడంతో, సీతతో కలిసి దీపాలు వెలిగిస్తుంది. దీపాలను తనకు తెలిసిన ఓ డిజైన్‍లో అమర్చి సావిత్రికి చూపిస్తుంది. పెద్దలందరూ మెచ్చుకుంటారు. సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇండియా. – ఇక చదవండి.]

అధ్యాయం 20:

[dropcap]ప[/dropcap]దిరోజుల్లో రాబర్ట్ మామూలు మనిషైనాడు. ఇండియా ఆండ్రియాలు అతనికి.. నరసింహశాస్త్రిగారు చేసిన సహాయాన్ని గురించి చెప్పారు. అంతా విన్న రాబర్ట్..

“హి యీజ్ నాట్ గాడ్.. జీజస్ సేవ్‌డ్ మి..” తన మామూలు ధోరణితో నరసింహశాస్త్రి పట్ల అతనికి వున్న ద్వేషాన్ని వ్యక్తం చేశాడు.

చెవిటివాడి ముందు శంఖం వూదినా ప్రయోజనం లేదని.. ఆ తల్లీ కూతుళ్ళు అతని ఎదుట నుంచి లేచి వెళ్ళిపోయారు.

రాబర్ట్ తన కార్యాలయానికి వెళ్ళాడు. ఆఫీస్ మ్యానేజర్ రైతుల శిస్తుల విషయం.. అంటే ఆ మొత్తాన్ని ఇండియా చెల్లించి పశువులను విడిపించిందని చెప్పాడు.

రాబర్ట్ వెర్రి ఆవేశంతో వూగిపోయాడు. రెండు గంటలు ఆఫీస్‌లో వుండి ఇంటికి తిరిగి వచ్చాడు. వరండాలో కూర్చొని ఇండియాను బిగ్గరగా పిలిచాడు. ఇండియా వచ్చి ప్రక్కన నిలబడింది. ఆమె వెనకాలే రాబర్ట్ ఇండియాను పిలిచిన తీరును విన్న ఆండ్రియా వరండాలోకి వచ్చింది.

ఆంగ్లంలో వారి సంభాషణ సాగింది.

“నా సంపాదనతో ఆవులను గేదెలను ఎలా విడిపించావ్?..” గద్దించినట్లు అడిగాడు రాబర్ట్ ఇండియా ముఖంలోకి తీక్షణంగా చూస్తూ.

“అది మీ సంపాదనకాదు. నా సంపాదన..” ఆండ్రియా జవాబు.

క్షణం తర్వాత.. “రాబర్ట్.. మీ చర్యవల్ల నాకు ఎంతో అవమానం..” అంది ఆండ్రియా.

“పేద రైతులు మీ పేరు చెబుతూ జిందాబాద్ అని ఆనందంగా అరిచారు. మీకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా వినలేక పోయారు” వ్యంగ్యంగా చెప్పింది ఆండ్రియా.

“వాళ్ళ జిందాబాద్ నాకు అనవసరం.”

“మేము మీతో కలసి వున్నందున.. మీ గురించి పదిమంది మంచిగా చెప్పుకోవడం మాకు అవసరం” ఆండ్రియా చెప్పింది.

“నా ఆఫీస్ వ్యవహారాల్లో మీ ఇరువురూ తలదూర్చడం తప్పు!..”

“మీ నిర్ణయం తప్పయినప్పుడు మేము అందులో జోక్యం చేసికోవడంలో తప్పు లేదు డాడ్!..” అనునయంగా చెప్పింది ఇండియా. క్షణం తర్వాత.. “డాడ్!.. మీ ప్రభుత్వం పట్ల యీ దేశ ప్రజలు నిరసన చూపుతున్నారు. మీ డివైడింగ్ రూలింగ్ యీ దేశంలో ఎందరినో నాశనం చేసింది.. చేస్తూ వుంది. యీ మీ విధానం.. మీ రాజ్యాంగానికి మన వారందరికీ మంచిది కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం యీ దేశపు మహాశక్తి. వీరంతా అహింసావాదులు. మీరు హింసావాదులు. యీ దేశ జనచైతన్యం.. ఒకనాడు మీ పాలనా విధానాన్ని గడగడలాడిస్తుంది. మీ పైవారి మెప్పు కోసం మీరు మానవత్వాన్ని మరువకండి. ఈ దేశవాసులంతా మనలాంటి మనుషులేనని భావించండి” ఆవేశంగా చెప్పింది ఇండియా.

“నేనెవరో!.. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందు పుట్టిన దానివి.. నీవు నాకు నీతులు నేర్పుతావా!..” గద్దించి అడిగాడు రాబర్ట్.

“ఇండియా!.. ఇక నీవు మాట్లాడకు.. పద మనం శరణాలయానికి వెళదాం” అంది ఆండ్రియా.

ఆండ్రియా కలకత్తా నుంచి అక్కడికి వచ్చిన తర్వాత ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించింది. ఆరు నెలల్లో ఆ ఆశ్రమంలో వంద మంది చేరారు. ప్రస్తుతం అందులో రెండు వందల యాభై మంది వున్నారు. తన తల్లి మేరీ.. పంపే నిధులతో ఆండ్రియా ఆ ఆశ్రమాన్ని నడుపుతూ వుంది. ఆండ్రియాతో ఇండియా కూడా తరచుగా.. అక్కడికి వెళ్ళి అక్కడ వున్న బాలబాలికలను క్రమంగా పెంచే విషయంలో తల్లికి సాయపడుతుంటుంది ఇండియా. మిస్టర్ మూన్ లాంటి కొందరు ఆశ్రమానికి నిధులను యిస్తూ వుంటారు. పిల్లలకు ఆంగ్ల బోధన.. క్రమశిక్షణ అక్కడ కార్యనిర్వాహకులుగా వున్న తెలుగు స్త్రీలు చేస్తూ వుంటారు. ఆండ్రియా మంచి రచయిత్రి.. ‘నేను చూస్తున్న ఇండియా’ అనే శీర్షికతో వ్యాసాలు వ్రాసి తల్లి మేరీకి పంపుతుంటుంది. మేరీ వాటిని పత్రిక రూపంలో లండన్‍లో ప్రచురిస్తూ వుంటుంది. ఇండియాలో ఆండ్రియా నడుపుతున్న ఆశ్రమానికి ఆమె ధన సహాయం చేస్తూ వుంటుంది. భర్తతో వాదోపవాదాలు జరిగిన ప్రతిసారీ అక్కడికి ముఫై కిలో మీటర్ల దూరంలో గోదావరీ నది ఒడ్డున వున్న అనాథాశ్రమానికి వెళ్ళి విశ్రాంతిని.. శాంతిని పొందడం ఆండ్రియాకు అలవాటు. ప్రశాంతమైన ఆ వాతావరణంలో కూర్చొని ఆమె తన రచనను సాగిస్తుంది. తల్లి కూతుళ్ళు కలిసి వెళ్ళినప్పుడు తల్లి చెప్పగా.. ఇండియా వ్రాస్తుంది,

ఆండ్రియా.. ఇండియా కారెక్కి వెళ్లిపోయారు. రాబర్ట్.. వారి మాటలకు చర్యకు ఆశ్చర్యపోయాడు. ఆవేశంతో వూగిపోయాడు. కర్నల్ కార్యాలయం నుంచి ఒక సిపాయి రాబర్ట్ ఇంటికి వచ్చాడు. కలకత్తా నుంచి ఆఫీసర్ వచ్చాడని.. మిమ్మల్ని రమ్మన్నారని వారికి ఆ సిపాయి తెలియజేశాడు. సిపాయి వచ్చిన కార్లో రాబర్ట్ కర్నల్ కార్యాలయానికి వెళ్ళాడు.

ఆశ్రమం విషయంలో రాబర్టు.. ఆండ్రియాకు అనేకసార్లు వాదన జరిగింది. ఆశ్రమాన్ని ఆండ్రియా స్థాపించడం.. రాబర్ట్‌కు ఇష్టం లేదు. కానీ.. ఆండ్రియా అతని మాటలను లెక్కచేయలేదు. తాను చేయదలచుకొన్న మంచి పనిని యథావిధిగా నిర్వర్తించింది. ఆశ్రమానికి మంచి రూపురేఖలను సంతరింపజేసింది. ఎందరో అనాథ బాలబాలికలకు ఆశ్రయాన్ని కల్పించింది.

ఈ కలియుగంలోనూ గడిచిన కృత, త్రేతా, ద్వాపర యుగాలలో వలె భిన్నతత్వాలతో మనుషులు వున్నారు. తెల్లవారిలోనూ మంచివారు.. చెడ్డవారూ వున్నారు. డబ్బు.. పదవి.. ఆక్రమణాది ఆశలు.. లక్ష్యాలు కొందరివి. వీరు మొదటి వర్గం. మనుషులంతా ఒక్కటే.. తెలుపు.. నలుపు.. చీకటి.. వెలుగు అంతా ఆ దైవ నిర్ణయమే అని నమ్మిన వారూ వున్నారు. వీరు రెండవ వర్గం. భేదం ఎక్కడంటే.. రెండవ వర్గం కన్నా.. మెజారిటీ మొదటి వర్గందే. రాబర్ట్ మొదటి వర్గం.. ఆండ్రియా రెండవ వర్గం.

అధ్యాయం 21:

ఆ రోజు.. కార్తీకమాసపు కడపటి సోమవారం..

రాబర్ట్.. ఆండ్రియా ఐదు గంటలకు లేచి ఇండియా గదికి వెళ్ళారు. ఆమె గదిలో లేనందున వేగంగా ఇంటి తలుపు తెరచి ముంగిట చూచారు. ఇంటి ముందరి లాన్లో పూలమొక్కల మధ్య ఇండియా వారికి కనిపించలేదు. పోర్టికోలో కారు లేదు. రాబర్ట్ ఒంట్లోకి ఆవేశం వచ్చింది.

“ఇంత వుదయాన్నే నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది?..” ఆండ్రియా ముఖంలోకి చూచి అడిగాడు.

“ఆమె నీకూ కూతురే, మరచావా!..”

వారి సంభాషణ ఆంగ్లంలో సాగుతూ వుంది.

“చెప్పకుండా కారు తీసికొని ఎక్కడికి వెళ్ళినట్లు!..”

“వస్తుందిగా.. వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి.” భర్త ప్రశ్నలు నచ్చని ఆండ్రియా ఇంట్లోకి వెళ్ళిపోయింది.

అప్రసన్నంగా రాబర్ట్ వరండాలో కూర్చున్నాడు.

కారు గృహ ఆవరణంలో ప్రవేశించి.. పోర్టికోలో ఆగింది. ఇండియా సుల్తాన్‌లు కారు దిగారు.

“గుడ్మార్నింగ్ సార్!..” రాబర్ట్‌ని చూసి విష్ చేశాడు సుల్తాన్.

“నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు?..” గద్దించినట్లు అడిగాడు రాబర్ట్.

సుల్తాన్ బిక్కముఖంతో ఇండియా ముఖంలోకి చూచాడు.

“నదికి వెళ్ళి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి వస్తున్నాము డాడ్!..” తనకు సహజమైన చిరునవ్వుతో చెప్పింది

“ఎప్పుడు వెళ్ళారు..”

“వేకువన నాలుగు గంటలకు..”

“శివాలయంలో మీకేం పని!..”

“నేడు కార్తీక సోమవారం.. చాలా విశేషమైన రోజు..”

“నీకు ఆ మాటను ఎవరు చెప్పారు?..”

“మా గురువుగారు..”

“అంటే.. ఆ నల్ల నరసింహనా!..”

“వారు నలుపే కావచ్చు.. కానీ వారి మనస్సు ఎంతో తెల్లన.. లైక్ ఫుల్ మూన్..”

“మనం క్రైస్తవులమన్న మాట మరిచావా!..”

“లేదు..”

“ప్రోటెస్టెంట్ క్రైస్తవ వంశంలో జన్మించి.. హిందువుల ఆలయానికి వెళ్ళి నీవు పెద్ద తప్పు చేశావ్. ఏసుప్రభువు నిన్ను క్షమించడు” ఆవేశంగా అన్నాడు రాబర్ట్.

“ఆ ప్రభువు నాకు వేసే శిక్షను నేను ఆనందంగా అనుభవిస్తాను డాడ్!..”

ఇండియా గొంతు విని ఆండ్రియా వరండాలోకి వచ్చింది.

“బేబీ!.. నీవు లోనికి వెళ్ళు..”

“థ్యాంక్యూ మమ్మీ!..” చెప్పి ఇండియా లోనికి వెళ్ళింది.

“మిస్టర్ రాబర్ట్..”

తీక్షణంగా ఆండ్రియా ముఖంలోకి చూచాడు రాబర్ట్..

“ఇండియా వయస్సు వచ్చిన పిల్ల, ఏది మంచో ఏది చెడో తనకు బాగా తెలుసు. అనవసరంగా నా బిడ్డ మీద మీరు మీ ఆవేశాన్ని ప్రదర్శించకండి. ఈ దేశస్థులు మనకంటే ఎంతో మంచివారు. ఆ మంచితనం నాకు నా బిడ్డకు నచ్చింది. ఆ కారణం గానే మేము నీతో కలిసి ఇక్కడ వుంటున్నాము. అమాయకులైన ఈ దేశ వాసులను గురించి తప్పుగా మాట్లాడకు. నీవు చేసే ఆ తప్పుకు జీజస్ ఒకనాడు తప్పక నీవు వూహించని శిక్ష వేస్తాడు. మంచిని మంచి దృష్టితో చూడ్డాన్ని నేర్చుకో!.. నీకూ వయస్సు అవుతూ వుంది.. మరిచిపోకు” ఆవేశంగా చెప్పి ఆండ్రియా లోనికి వెళ్ళింది.

ఆండ్రియా తనను అన్ని మాటలంటుందని రాబర్ట్ వూహించలేదు. బిత్తరపోయాడు. అతని వాలకాన్ని చూచిన సుల్తాన్..

‘ఉదయాన్నే వీడికి ఆ మహాతల్లి పొట్టనిండా పెట్టేసింది’ అనుకొని లోన నవ్వుకున్నాడు.

“ఇంటికి వెళ్ళి ఎనిమిది గంటలకు రా.. కర్నల్‌ను కలిసేదానికి వెళ్ళాలి..” సుల్తాన్‌ను చూస్తూ అన్నాడు రాబర్ట్.

“యస్.. సర్..” చెప్పి సుల్తాన్ వెళ్ళిపోయాడు. రాబర్ట్ ఖిన్నుడై కూర్చున్నాడు.

అధ్యాయం 22:

యజ్ఞానికి నరసింహశాస్త్రి.. రెడ్డిరామిరెడ్డిగారు.. లాయర్ గోపాలశర్మగారు.. మరికొందరు ఆ ప్రాంతీయులు.. కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. యాగ నిర్వహణ బాధ్యత మొదట రెడ్డిగారు చెప్పినట్లుగానే నరసింహశాస్త్రిగారు స్వీకరించారు. విజయనగరం నుండి వేదపండితులు యజ్ఞనిర్వాహకులు వచ్చారు.

విశాలమైన తాటి ఆకు పందిరి వేయబడింది. దాని క్రింద దాదాపు ఐదారువేల జనాభా కూర్చొని యజ్ఞాన్ని వీక్షించే రీతిగా పందిరిని సంతరించారు.

యాగం ప్రారంభ దినానికి.. చుట్టుప్రక్కల గ్రామప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా జనం అక్కడికి చేరారు. వచ్చిన వారు ఏ యిబ్బంది పాలు కాకుండా వుండే రీతిగా అన్నపానీయాలు.. తదితర అవసర వసతులకు కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు చేసింది.

తొలిదినం.. ఉదయం ఆరున్నరకు ప్రారంభించి యజ్ఞప్రక్రియ మధ్యాహ్నం ఒకటిన్నరకు ముగిసింది. అందరికీ అన్నదానం జరిగింది.

అదే రీతిగా మరో రెండు రోజులు మొత్తం మూడు రోజులు యజ్ఞ కార్యక్రమాలు వేదపండితుల ఆధ్వర్యంలో ఎలాంటి లోపమూ జరగకుండా భక్తి ఏకాగ్రత దీక్షతో నరసింహశాస్త్రి సావిత్రీ దంపతులు తమ బాధ్యతలను నిర్విహించారు. మూడవరోజు కార్యక్రమం రెండు గంటలకు ముగిసింది. విజయనగరం నుంచి వచ్చిన బ్రాహ్మణులకు ఎంతో గౌరవ మర్యాదలతో సంభావనాదులను యిచ్చి.. ఆ పెద్దల ఆశీస్సులను యజ్ఞ నిర్వాహక కార్యకర్తలందరూ పొందారు. సమయం ఐదు గంటల ప్రాంతం. అందరూ భోంచేశారు. ఆకశాన మేఘాలు క్రమ్ముకొన్నాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురియసాగింది.

ఇండియా.. ప్రతిరోజూ యజ్ఞం జరిగే ప్రాంతానికి వచ్చిన ఆ కార్యక్రమాన్నంతా ఫోటోలు తీసింది. అందరితో కలసి భోం చేసింది. మూడవరోజు ఆండ్రియా కూడా ఇండియాతో కలిసి వచ్చి కార్యక్రమాన్ని చూచి.. యజ్ఞ ప్రసాదాన్ని బంతిలో కూర్చొని భోంచేసింది.

ఆ తల్లికూతుళ్ళకు.. యజ్ఞాన్ని వీక్షించ వచ్చిన వారందరినీ ఆశ్చర్యానందాలు కలిగేలా ‘విధాత’ వర్షాన్ని కురిపించాడు. కొందరు యువతీ యువకులు ఆనందంతో వర్షంలో తడుస్తూ సర్వేశ్వరునికి జేజేలు పలికారు. వారిలో ముఖ్యులు.. అద్వైత్.. రాఘవ.. పాండురంగ వారి మిత్రులు, సీత. వారిని చూచి ఇండియా కూడా వారి మధ్యకు చేరి పరమానందంగా నాట్యం చేసింది.

ఇండియా.. తమ మధ్యకు రావడం.. నాట్యం చేయడం నచ్చని సీత.. ఆమెను చీడ పురుగును చూచినట్లు చూచి.. గొణుక్కుంటూ ప్రక్కకు పోయింది.

ఇండియా ఆనంద నాట్య విన్యాసాలను చూచి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. నరసింహశాస్త్రి ఆమె నాట్య భంగిమలను చూచి పరమానందం పొందారు.

నాట్యాన్ని ముగించి ఇండియా.. తను గురుదేవుని సమీపించి మోకాళ్ళపై కూర్చొని వంగి వారి పాదాలకు నమస్కరించింది.

అపరిమిత ఆనందంతో నరసింహశాస్త్రి.. తన చేతులతో ఆమె భుజాలను పట్టుకొని పైకి లేపి.. తన కుడిచేతిని ఆమె తలపై వుంచి..

“సర్వేశ్వరుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూస్తాడు. నీవు.. నా శిష్యురాలిపై నందుకు.. ఈనాడు నీవు ప్రదర్శించిన నాట్య భంగిమలను చూచిన తర్వాత.. నాకు ఎంతో గర్వంగా వుందమ్మా!..” పరవశంతో చెప్పారు నరసింహశాస్త్రి.

ఇండియా.. ఆండ్రియాలు వారికి నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా, మరుదినం పూర్తిగా కుంభవర్షం కురిసింది. ఎండి బీటలు వారిన భూమాత తాపం తీరింది.

ప్రతీ ఒక్కరికీ.. ఎదుటివారి మీద.. వారికివున్న జ్ఞానంతో వారు చేసే మంచి చర్యల మీదా నమ్మకం వుండాలి. మంచి అనేది సత్ఫలితానికి నాంది.

ఒకే తత్వం.. నమ్మకం వున్న మనుషుల మధ్యన ఐక్యతాభావన పరస్పర గౌరవాభిమానాలు వుంటాయి. ఆ సంకల్పంతో సహచరత్వాన్ని సాగించే వారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.

రెడ్డిరామిరెడ్డిగారు.. నరసింహశాస్త్రి.. ఆ ఇరువురి మిత్రులు.. అందరూ కలసి ఏకభావనతో యజ్ఞాన్ని జరిపించారు. వారి ఆ చర్యలో స్వార్థం లేదు. పరమార్థం వుంది. వారికి పై వారి కరుణాకటాక్షం సిద్ధించింది. వర్షం కురిసింది. అందరూ పరమానంద భరితులైనారు.

నరసింహశాస్త్రికి.. సావిత్రికి.. సోమయాజులు.. సోమిదేవమ్మ అనే గౌరవ ప్రదమైన బిరుదులు లభించాయి. అది వారి హితులకు కుటుంబ సభ్యులందరికీ ఆనందం.

ఇండియా.. మూడు రోజులు జరిగిన కార్యక్రమాలను ఫొటో తీసింది. తన గ్రాండ్ మదర్‍కు పంపింది. ఆమె మేరీకి వ్రాసిన లేఖలో హైందవుల నమ్మకాలను గురించి.. వారి కార్యాచరణలను గురించి.. వారి మనస్తత్వాలను గురించి.. ఎదుటివారు ఎవరైనా సరే.. వారిని గౌరవించి అభిమానించే సద్భావనలను గురించి.. తన గురువుగారైన నరసింహశాస్త్రి గారిని గురించి.. ఆ కుటుంబ సభ్యులను గురించి.. వారంతా తన్ను ఎంతగా గౌరవించి అభిమానిస్తున్నారనే విషయాన్ని గురించి.. విపులంగా వ్రాసింది. తాను వ్రాసిన సుదీర్ఘమైన లేఖను తల్లి ఆండ్రియాకు చదివి వినిపించింది. ఆ తల్లి, తన కుమార్తెలో వున్న సద్గుణాలకు సంతసించి కౌగలించుకొని నొసటన ముద్దు పెట్టింది.

(ఇంకా ఉంది)

Exit mobile version