Site icon Sanchika

అద్వైత్ ఇండియా-15

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[సుమతి.. పాండురంగల వివాహం ఘనంగా జరుగుతుంది. అందరూ ఆ దంపతులను మనసారా దీవిస్తారు. రాఘవ మరుసటిరోజున వెళ్ళిపోతాడు. ఇండియాఆ వివాహ సన్నివేశాలనన్నింటినీ ఫోటోలు తీసి, ఆల్బంగా తయారు చేసి తీసికొని వచ్చి గురువుగారికి అందిస్తుంది. ఫోటోలను చూచి అందరూ ఎంతగానో సంతోషిస్తారు. రెడ్డి రామిరెడ్డిగారు పదివేల రూపాయలను నరసింహశాస్త్రిగారికి అందించి ఆ దంపతులను దక్షిణదేశ విహారయాత్రకు పంపవలసిందిగా కోరుతారు. ఆ ప్రకారమే సుమతీ పాండురంగ విహార యాత్రకు వెళ్ళివస్తారు. రైలు మార్గాలు సరిచేయబడడంతో, కాశీ ప్రయాణానికి ఏర్పాటు చేస్తారు రెడ్డి రామిరెడ్డిగారు. సుమతీ పాండురంగల వివాహం అయ్యాకా, బయల్దేరిన రాఘవ భద్రాచలం వెళ్ళకుండా విశాఖపట్టణం వెళ్తాడు. ఇద్దరు మిత్రులతో కల్సి చింతలపల్లి అడవిలోకి వెళ్లి – అల్లూరి సీతారామరాజును కలుస్తారు. మొదట కోయదోరలు అనుమానించి ఆపినా, వారిలోని నిజాయితీని గ్రహించి, అల్లూరి సీతారామరాజు వద్దకు తీసుకువెళ్తారు. రాఘవ తన గురించి పరిచయం చేసుకుని, అల్లూరి వారితో పాటు ఉంటానని అడిగితే, ఆయన సున్నితంగా వారించి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చమని, ఆంధ్రావనికి పేరు తెచ్చేలా నడుచుకోమని చెప్పి వాళ్ళని పంపేస్తారు. మర్నాడు కాశీకి బయల్దేరుతారనగా, నరసింహశాస్త్రి పంచాగాన్ని, అద్వైత్ జాతకాన్ని చేతికి తీసికొని పరిశీలిస్తారు. ఆయన ముఖంలో ఏదో కలవరం ద్యోతకమవుతుంది. ఈలోపు సుల్తాన్ భాయ్ వచ్చి శాస్త్రి గారికి నమస్కరిస్తాడు. మేరీ మేడమ్ పంపింది కదా అని అడుగుతారు. అవునంటాడు సుల్తాన్ భాయ్. అద్వైత్‌ను వారితో లండన్‌కు పంపుతానని వారికి చెప్పమంటారు శాస్త్రి గారు. ఆ మాట విన్న సావిత్రి విస్తుబోతుంది. దుఃఖంతో లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మగారికి ఇష్టం లేకుండా అద్వైత్‍ని పంపవద్దని సుల్తాన్ అనబోతుంటే, అదంతా దైవేచ్ఛ అని అంటారు శాస్రి. సుల్తాన్ వెళ్ళిపోయాకా, సావిత్రి వచ్చి భర్తని నిలదీస్తుంది. అద్వైత్‍ని అడిగారా అని అంటే, అవసరం లేదు, వాడు నా మాట కాదనడని అంటారు శాస్త్రి. పైగా ఇది దైవ నిర్ణయం అని అంటారు. సావిత్రి బాధపడుతుంటే, ఎదిగిన బిడ్డల మీద అతిగా మమకారాన్ని పెంచుకోకూడదని అంటారు శాస్త్రి. – ఇక చదవండి.]

అధ్యాయం 29:

[dropcap]రె[/dropcap]డ్డి రామిరెడ్డి.. బావమరది శేషారెడ్డి వచ్చారు. నరసింహశాస్త్రికి రేపటి వారి కాశీ ప్రయాణాన్ని గురించి రైలు బయలుదేరే సమయాన్ని గురించి వివరించి, నరసింహశాస్త్రి, వారి అక్క వసుంధర, సావిత్రీల టిక్కెట్లను శాస్త్రిగారికి అందించారు. వారి గొంతు విని సావిత్రి కాఫీ గ్లాసులతో వరండాలోకి వచ్చి.. ముగ్గురికీ అందించింది. సావిత్రికి కూడా మరో మారు రెడ్డిగారు రేపటి కాశీ ప్రయాణ వివరాలను వివరించారు.

చిరునవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది సావిత్రి.

రెడ్డిగారి తండ్రికి రెండు వివాహాలు. మొదటి భార్య రెడ్డిగారి తల్లి.. వారి వయస్సు ఆరేళ్ళ ప్రాయంలో గతించగా.. ఆమె చెల్లెలినే రెడ్డిగారి తండ్రికి ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. రెడ్డిగారి పినతల్లికి యిద్దరు కొడుకులు, ఒక కూతురు. వయస్సు మీరిన తర్వాత రెడ్డిగారి తండ్రి ఆస్తిపాస్తులను నాలుగు భాగాలుగా విభజించి వీలునామా వ్రాసి రిజిష్టర్ చేయించారు.

రెడ్డిగారి తల్లి.. తల్లికి యిద్దరూ ఆడపిల్లలే అయినందున నోటి మాటగా తన ఆస్తి ఇరువురు ఆడపిల్లలకు చెరిసగం అని చెప్పి ఆమె కన్ను మూసింది.

తన అక్క రెడ్డిగారిని ఒక్కడినే కని చనిపోయిన కారణంగా.. తన పుట్టింటి ఆస్తి యావత్తు తనకే సొంతం అని రెడ్డిగారి.. పినతల్లి భాగం పంచి యివ్వలేదు.

యీ వ్యవహారం కోర్టుకు ఎక్కి ఐదేళ్ళయింది. రెడ్డిగారి తరఫున శాస్త్రిగారి మామ గోపాలశర్మ గారు ఆ కేసుని వాదిస్తున్నారు. సాక్ష్యాలు వారికి అనుకూలంగా వున్నాయని.. త్వరలో జడ్జిమెంటు వస్తుందని.. రెడ్డిగారు నరసింహశాస్త్రికి వివరించి, ఆ ఆస్తిలోని తమ భాగం సంక్రమించిదంటే బంగారు లక్ష్మమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు.

అధ్యాయం 30:

సాయంత్రానికి ముందు అద్వైత్ సీతలు.. గోపాల్రావుగారి ఇంటి నుండి వసుంధర.. వారు వచ్చిన అరగంటలో సుమతీ పాండురంగలు యింటికి చేరారు. పిల్లలు నలుగురూ కలిసి పెద్దలైన నరసింహశాస్త్రి, సావిత్రి, వసుంధర బట్టలను బ్యాగుల్లో సర్దారు. వసుంధర షుగర్ మాత్రలను ఓ చిన్న డబ్బాలో వేసి ఆమెకు సావిత్రికీ చూపించి ఓ సంచిలో వుంచారు. అందరూ కలసి భోంచేశారు.

సావిత్రి.. సుమతీ వంట యింటిని చక్కబెడుతుండగా..

“అమ్మా సుమతీ!..”

“ఏం పెద్దమ్మా!..”

“నేను తిరిగి వచ్చేవరకూ యీ ఇంటి బాధ్యతను నీవు నిర్వహించాలి. అద్వైత్.. సీతా స్కూలు వెళతారు. పాండు మీ పెదనాన్నలా పనుల మీద బయటి వెళుతుంటారు. ఆదికి, సీతకు.. ఏ ఏ సమయాల్లో ఏం కావాలో జాగ్రర్తగా చూచి అమర్చవలసిన బాధ్యత నీ మీద వుంది. జాగ్రత్త!..”

“పెద్దమ్మా!.. మీరేం భయపడకండి. వారి విషయం నేను జాగ్రర్తగా చూచుకొంటాను. మీరు ఆనందంగా వెళ్ళి రండి” చెప్పింది సుమతి.

వసుంధర తుమ్ముతూ.. వంటింట్లోకి వచ్చింది. సుమతి చెప్పడం ఆపింది.

సావిత్రి.. సుమతీ ద్వారం వైపు చూచారు.

సుమతి నవ్వుతూ.. “ఆఁ.. పెద్దమ్మా!.. మీరు ఇక్కడి వారిని గురించి ఆలోచించకండి.. ఆనందంగా వెళ్ళి తండ్రి కాశీ విశ్వేశ్వరుని తల్లి అన్నపూర్ణమ్మనూ దర్శించి పరమానందంగా తిరిగి రండి..” అంది.

“అలాగే తల్లీ!.. నీవు వున్నందువలన నాకు సీతను గురించిన దిగులు లేదు.” నవ్వుతూ అంది వసుంధర.

సీత వచ్చింది.. “అత్తయ్యా!.. ఏదైనా సాయం చేయాలా!..”

“ఏయ్ సీతా!.. యిలా చూడు నీవు.. సుమతీ ఒకే వయస్సు వాళ్ళు. కానీ.. నేను వూర్లో లేని సమయంలో యీ యింటి పెత్తనం అంతా సుమతిదే. దానికి కాస్త సాయంగా వుండు. మీ బావను అదే నా కొడుకును వూరికే సతాయించకు. వాడికి కాస్త వయినంగా చక్కెర వేసి కాఫీ యివ్వు. సరేనా!..”

“చక్కెర.. చక్కెర.. అబ్బా.. అబ్బా.. ఏమి తల్లీ కొడుకులో.. ఏదో.. ఒకసారి పొరపాటున చేసిన దాన్ని పట్టుకొని నన్ను.. నన్ను..” బుంగమూతి పెట్టి కళ్ళు పైకెత్తి సావిత్రి ముఖంలోకి చూచింది సీత,

“నిన్ను.. నిన్ను.. మేము ఏమీ అనలేదు తల్లీ.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి అని చెబుతున్నాను. అంతే” నవ్వుతూ అంది సావిత్రి.

సీత.. సావిత్రిని సమీపించి ఆమె భుజాలను పట్టుకొని “అత్తయ్యా!.. నీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను” అందంగా నవ్వింది.

మిగతా ముగ్గురూ.. ఆనందంగా నవ్వారు. సుమతీ.. సీత వసుంధర వారి వారి గదులకు వెళ్ళిపోయారు. సావిత్రి అద్వైత్ గదిని సమీపించింది.

“నాన్నా!.. చెప్పినవన్నీ గుర్తువున్నాయిగా.. వుంచుకో.. జాగ్రత్త..” నరసింహశాస్త్రి కంఠం వినబడింది.

తలుపు త్రోసి ఆగిపోయింది సావిత్రి.. అది ఆమె సంస్కారం, వయస్సు వచ్చిన కొడుకు.. తండ్రి మాట్లాడుకొనే సమయంలో.. అది ఏ విషయమో.. తనకు సంబంధించి వుంటే వారు తప్పక పిలిచి వుండేవారు.. అని తలచి జోక్యం కలిగించుకోకుండా వుండడం స్త్రీ మూర్తికి గౌరవప్రదం. ఆ భావనతోనే సావిత్రి ఆగిపోయింది.

ఆమె రాకను గమనించిన నరసింహశాస్త్రి తల త్రిప్పి..

“సావిత్రి.. వాకిట్లోనే ఆగిపోయావే. మేము మాట్లాడుకొనేది నీవు వినకూడని విషయాలు కాదు. రా” నవ్వుతూ పిలిచాడు నరసింహశాస్త్రి.

సావిత్రి గదిలో ప్రవేశించింది.

“ఆది.. మీ నాన్నగారు నీకు ఏం చెప్పి వుంటారో నేను వూహించుకోగలను. నీవు యీ యింటి బిడ్డవు. నీతో మరో ముగ్గురు మనవారు వుంటారు. వారినందరినీ జాగ్రత్తగా చూచుకో నాన్నా!..”

“నాన్నగారు చెప్పిందీ యిదేనమ్మా.. తప్పకుండా జాగ్రత్తగా చూచుకొంటాను.”

ఆ దంపతుల ముఖాల్లో చిరునవ్వు. ఆ నవ్వుతో ఇరువురూ గది నుంచి బయటికి నడిచారు.

అధ్యాయం 31:

ఆ రోజు ఉదయం ఏడున్నరకు కాశీ ప్రయాణీకులంతా స్టేషన్‍కు చేరారు. వారిని సాగనంపేదానికి అద్వైత్.. సీత.. పాండురంగ.. సుమతీ స్టేషన్‍కు వచ్చారు. వారంతా రైలు ఎక్కారు. పరుగిడుతూ జనాన్ని తప్పుకుంటూ ఇండియా వచ్చింది. తన గురువుగారిని సమీపించి నమస్కరించింది. హ్యాండ్ బ్యాగ్ తెరచి పదివేలు తీసి వారి చేతిలో వుంచింది.

“గురూజీ!.. ఇది లంచం కాదు.. గురుదక్షిణ కాదు. మీరు మీ శిష్యుల శిష్యురాండ్రు పేర్లు చెప్పి ఆ పవిత్ర కాశీ క్షేత్రంలో పేదలకు పంచండి. ఆ దేవుని.. మీ.. ఆశీస్సులతో మేమంతా బాగుంటాం” తనకు సహజమైన చిరునవ్వుతో మృదుమధురంగా చెప్పింది ఇండియా.

రెడ్డిగారు, వారి యిల్లాలు.. బావమరిది, వారి యిల్లాలు.. వారి అత్తగారు.. వసుంధర.. సావిత్రి ఆశ్చర్యపోయారు.

నరసింహశాస్త్రి ముఖంలో ఎంతో ఆనందం..

“అలాగేనమ్మా!.. నీవు చెప్పినట్లుగానే చేస్తాను” నవ్వుతూ చెప్పారు నరసింహశాస్త్రి.

ఆ రోజు.. అక్కడ.. ఆ క్షణంలో సావిత్రి తన భర్తగారి నోటి వెంట ఒక కొత్త పదాన్ని విన్నది. అది.. ‘నీవు చెప్పినట్లుగానే చేస్తాను’.. అన్నది. వారి వద్దకు ఎందరో ఏవేవో సమస్యలతో వస్తారు. వారు చెప్పిన విషయాలను విని శాస్త్రిగారు.. వారికి ఉచిత సలహాలను ఇచ్చేవారు. అంతవరకూ ఆ యింట తన యిరవై ఎనిమిదేళ్ళ కాపురంలో.. శాస్త్రిగారి నోట వినని ఆ పదం.. ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని.. ఇండియా పట్ల ఎంతో అభిమానాన్ని కలిగించాయి.

ఇండియా భుజాలను పట్టుకొని దగ్గరకు తీసికొని.. “నీవు మా జాతిలో పుట్టి వుంటే నిన్ను నా కోడలిగా చేసికొని వుండేదాన్నమ్మా. నీలోని మానవతావాదం నన్ను మురిపించిందమ్మా!..” ఎంతో సంతోషంతో చెప్పింది ఆ మాటలను సావిత్రి.

ప్రక్కనే వున్న సీత ముఖం విలవిలబోయింది. కంపార్టుమెంటు దిగి క్రింద నిలబడింది.

సావిత్రి అన్న ఆ మాటల వలన ఇండియా పట్ల ఆమెకు వున్న ప్రేమ అభిమానం అందరికీ అర్థం అయింది.

“సావిత్రి!.. ఆవేశపడ్డావు కదూ!..” చిరునవ్వుతో అన్నాడు నరసింహశాస్త్రి.

సావిత్రి వారి కళ్ళల్లో క్షణంసేపు చూచి తలదించుకొంది.

గార్డ్ విజిల్ వేశాడు. అందరికీ నమస్కరించి ఇండియా కంపార్ట్‌మెంటు దిగింది.

రైలు మెల్లగా కదిలింది. లోని వారు కిటికీ గుండా చేతులను బయటికి సాచి ఆడించారు.

క్రింద వున్నవారూ.. అదే పని చేశారు.

రైలు వేగం హెచ్చింది.. దూరం పెరిగింది.

“మీ అమ్మగారు అన్న మాటను విన్నావా బావా!..” అద్వైత్‌ను సమీపించి అడిగింది సీత.

“ఏదో అభిమానంతో మాట వరస కన్నది పెద్దమ్మ అంతే సీతా!..” అనునయంగా చెప్పింది సుమతి.

“మనస్సులోలేందే మాట బయటికి వస్తుందా..” కసిరినట్లు అడిగింది సీత.

సీత కోపం తారాస్థాయిలో వుందని గ్రహించిన సుమతి మౌనం వహించింది.

అద్వైత్ తనకేం సంబంధం లేనట్లు ముందుకు నడిచాడు. పాండురంగ అతని ప్రక్కకు వచ్చి.. “బావా నీవేం మాట్లాడవేం!..” అడిగాడు.

“అనువు కాని చోట అధికులమనరాదు..” సీత వైపు చూచి నవ్వుతూ చెప్పాడు.

“ఏయ్!.. ఇండియా.. నీవు మా వెనకాలే ఎందుకు వస్తున్నావ్?..” అడిగింది రోషంగా సీత.

“సీతా డియర్.. నేను నీ వెనకాల రావడం లేదు. ప్లాట్‌ఫామ్ మీద నడుస్తున్నాను” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

‘దీనికి చాలా పొగరు’.. అనుకొంది సీత. అందరికన్నా వేగంగా ముందుకు నడిచింది.

ఇండియా అద్వైత్‍ను సమీపించింది.

“సార్!..”

అద్వైత్ ఇండియా ముఖంలోకి చూచాడు.

“యీ రోజు ఏం వారం!..”

“ఆదివారం..”

“స్కూలు వుందా!..”

“సండే స్కూలు వుంటుందా!..”

“ఏమో మీరు సండే కూడా వెళుతుంటారుగా!..”

“యీ రోజు వెళ్ళవలసిన అవసరం లేదు.”

“మా గ్రాండ్ మదర్ మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు!..”

“ఎందుకు?..”

“మీతో ఏదో మాట్లాడాలట..”

“విషయం ఏమిటో నీకు తెలుసా!..”

“తెలీదు సార్..” కళ్ళు పెద్దవి చేసి అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇండియా.

పాండు.. సుమతి వారి సంభాషణను వింటూ ముందుకు నడుస్తున్నారు.

వారికంటే ముందు సీత నడక. వెను తిరిగి చూచింది. ఇండియా అద్వైత్ ప్రక్క ప్రక్కన నడవడం చూచి ఆగిపోయింది.

సీతను దాటి సుమతీ పాండురంగలు ముందుకు వెళ్ళారు.

నిలబడి వున్న సీతను చూచి.. “ఏం సీతా! ఆగిపోయావ్!..” అడిగాడు అద్వైత్.

“ఆ పెండ్లి నడకేంది బావా!.. వేగంగా నడవకూడదూ!..” అంది సీత.

ఇండియా సీత మాటను విని నవ్వింది. సీత మూతి ముడుచుకొంది.

“నన్ను మేడమ్ పిలిచారట. నేను వెళ్ళి వస్తాను. నీవు వారితో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అమ్మా నాన్నా తిరిగి వచ్చేవరకూ నీ బాధ్యత నాది.”

సీత.. రుసరుసలాడుతూ సుమతీ పాండు రంగలను అనుసరించింది.

***

ఇండియా కారును పోర్టికోలో ఆపింది. అద్వైత్ ఇండియాలు కారు దిగారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆండ్రియా మేరీలు..

“కమాన్ జంటిల్‌మన్.. కమాన్..” అద్వైత్‌ను చూచి అంది మేరీ.

“గుడ్ మార్నింగ్ మేడమ్..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“గుడ్ మార్నింగ్ మిస్టర్ అద్వైత్..” అంది మేరీ.

ఆండ్రియాను చూచి విష్ చేశాడు అద్వైత్.. ఆమె నవ్వుతూ బదులు చెప్పింది. “టేక్ యువర్ సీట్..” అంది మేరీ.

“థ్యాంక్యూ!..” నవ్వుతూ కూర్చున్నాడు అద్వైత్.

“ఫాదర్.. మదర్.. కాశీకి వెళ్ళారుగా!..” అడిగింది ఆండ్రియా

“హేయ్ మై డార్లింగ్. టాక్ ఇన్ ఇంగ్లీష్. ఐ షుడ్ అండర్‌స్టాండ్ యు నో!..” అంది మేరీ.

“యట్ లాస్ట్ యువర్ ఫాదర్ అగ్రీడ్!..” నవ్వింది మేరీ.

“ఫర్ వాట్ మేడం!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“యు ఆర్ విజిటింగ్ లండన్ విత్ అజ్..”

“వాట్..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“యస్ సార్!..” ఆనందంగా నవ్వుతూ చెప్పింది ఇండియా.

“హి నెవర్ టోల్డ్ మీ!..” సాలోచనగా అన్నాడు అద్వైత్.

“హి హ్యాడ్ గాన్ టు కాశీ యు నో.. ఆన్ రిటన్ హి విల్ టెల్ యు..” చిరునవ్వుతో చెప్పింది ఆండ్రియా.

“ఐ విల్ గెట్ సమ్ కాఫీ!..” ఇండియా లోనికి వెళ్ళింది.

“సీ.. మిస్టర్ అద్వైత్!.. దేర్ అయాం రన్నింగ్ ట్వల్వ్ స్కూల్స్. త్రీ థవుజండ్ స్టూడెంట్స్ గర్ల్స్.. బాయిస్ ఆర్ దేర్. యు హ్యావ్ టు టీచ్ దెమ్ డాన్స్.. నాట్ ఫార్ ఆల్.. ఇంటరెస్టెడ్ చిల్రన్. బోర్డింగ్ లాడ్జింగ్. కన్వెయన్స్. ప్రీఫర్నిష్ డ్ క్వార్టర్.. గుడ్ శ్యాలరీ విల్ బి ప్రొవైడెడ్ టు యు. ది ఆర్ట్ వాట్ యునో ప్లీజ్ షేరి ఇట్ విత్ ది ఇన్‌ట్రెస్టెడ్ వన్స్. యు విల్ గెట్ నేం, ఫేం, మనీ” నవ్వుతూ చెప్పింది మేరీ.

“ఓకే మేడం.. లెట్ మై ఫాదర్ బ్యాక్. ఐ విల్ డు యాజ్ పర్ హిజ్ విష్!..” మెల్లగా చెప్పాడు అద్వైత్.

ఇండియా కాఫీ కప్పులతో వచ్చింది. ట్రేని టీపాయ్ పై వుంచి ముగ్గురికీ అందించింది. తానూ చేతికి తీసుకొంది.

“యీజ్ మిస్టర్ రాబర్ట్ సార్ నాట్ ఇన్ టౌన్?..”

“హి హ్యాజ్ గాన్ టు కల్కత్తా!..” చెప్పింది ఇండియా,

“మిస్టర్ అద్వైత్!.. అతని ముఖంలోకి చూచింది ఆండ్రియా.

“ఫర్ సమ్ టైమ్ అయాం ఆల్సో గోయింగ్ టు లండన్. యు నో అయాం రన్నింగ్ వన్ ఆశ్రమ్. ఐ మే బ్యాక్ బై త్రీ టు ఫోర్ మంత్స్. డ్యూరింగ్ దట్ పిరీయడ్.. సమ్ గుడ్ మ్యాన్ ఆర్ లేడీ.. షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆశ్రమ్. ఐ విల్ ప్రొవైడ్ ఫండ్ ఫర్ ఆశ్రమ్ అండ్ గుడ్ శ్యాలరీ ఫర్ ది పర్సన్. హి ఆర్ షి హ్యావ్ కైండ్ హార్ట్.. అండ్ హ్యుమానిటీ. కెన్ యు ఫయిండ్ అవుట్ సమ్ వన్ ప్లీజ్!..”

“ఓకే మేడమ్.. ప్లీజ్ గివ్ మి టు ఆర్ త్రీ డేస్ టైం. ఐ విల్ ఇంట్రడ్యూజ్ యు ఎ గుడ్ పర్సన్”

“థ్యాంక్యూ మిస్టర్ అద్వైత్!.. నౌ, వు ఆర్ గోయింగ్ టు ఆశ్రమ్.. టుడే సండే.. కెన్ యు కమ్ విల్ అజ్..” అడిగింది ఆండ్రియా.

అద్వైత్ మనస్సులో చాలాకాలం నుంచి ఆ ఆశ్రమాన్ని చూడాలనే కోరిక. కుదరలేదు. యీ రోజు కలిసి వచ్చింది.

“ఓకే మేడం ఐ విల్ కమ్..”

నలుగురూ కార్లో కూర్చున్నారు. ముందు ఇండియా అద్వైత్ వెనుక ఆండ్రియా.. మేరీ.

గంటలో కారు ఆశ్రమంలో ప్రవేశించింది. నలుగురూ కారు దిగారు. అక్కడ వార్డ్‌నర్‌గా వున్న రంగమ్మ వారికి ఎదురు వచ్చి నమస్కరించింది. ఆఫీస్ గదిలోకి ఆండ్రియా.. మేరీ ప్రవేశించారు.

“సార్.. నాతో రండి. అశ్రమం చుట్టూ తిరిగి చూద్దురుగాని..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.

ఆ స్థలం వైశాల్యం రెండు ఎకరాలు ఉంటుంది. నైరుతీ మూలలో తూర్పు ద్వారంగా ఆశ్రమం నిర్మించబడింది. దాదాపు మూడు వందల మంది అనాథ బాల బాలికలు.. ఆశ్రయం లేని ఆడవారు కొందరు అక్కడ వున్నారు. ఇండియా అద్వైత్‍లు ఆశ్రమ భవంతి చుట్టూ తిరిగారు. ఇండియా ఏదో చెబుతూ వుంది. దాన్ని వినిపించుకొనే స్థితిలో లేడు అద్వైత్.

అతని మనస్సులో సమాజ ఉద్ధరణకుగా జన్మించిన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు.. శ్రీ వివేకానంద స్వామీజీ వారు.. సుచరిత్రలు మెదిలాయి.

‘సర్వేశ్వరుడు కొందరిని సంఘసంస్కర్తలుగా పుట్టిస్తాడు. వారు వారి జీవిత విధానాన్ని చక్కదిద్దుకొనే దానికన్నా సమాజ అభ్యున్నతికి ఎంతగానో పాటుబడతారు. యీ ఆండ్రియా మేడం కూడా ఆ కోవకు చెందినదే అని చెప్పాలి. ఎక్కడో పుట్టి.. యీ దేశానికి వచ్చి.. యిక్కడి పీడిత పసిబిడ్డలకు.. అనాథలకు ఆశ్రయాన్ని కల్పించి.. ఆశ్రమాన్ని నడుపుతూ వుందంటే.. ఆమె అందరిలాంటిది కాదు. ఆమెలో వుంది గొప్ప ప్రత్యేకత’ అనుకొన్నాడు అద్వైత్.

“సార్!.. ఏ విషయాన్ని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నారు?..” అడిగింది ఇండియా.

“మీ అమ్మగారిని గురించి..”

“మా అమ్మ మంచిదా చెడ్డదా అనా!..”

“కాదు.. వారిలో వున్న మంచి.. మానవత్వాన్ని గురించి..”

“షి యీజ్ అడ్వికేట్.. జీవితంలో కష్టాల్లో వున్న సాటివారికి సహాయం చేసి రక్షించాలనేది ఆమె సిద్ధాంతం.. నాతో ఎప్పుడూ ఆ విషయాన్ని గురించే చెబుతూ వుంటుంది” అందంగా నవ్వింది ఇండియా.

“నీవు చాలా అదృష్టవంతురాలివి ఇండియా!..”

“ఎందువల్ల!..”

“అలాంటి మంచి తల్లి కడుపున నీవు పుట్టినందుకు.. మరి మీ నాన్నగారు!..”

“చాలా ముర్ఖుడు.. స్వార్థపరుడు.. దయ అనే పదానికి అర్థం తెలియనివాడు. అహంకారి..” కసిగా చెప్పింది ఇండియా.

ఆశ్రమం కాంపౌండు గోడ ప్రక్కన రంగు రంగుల పూల మొక్కలు అరటి.. మామిడి.. జామ చెట్లు క్రమంగా నాటబడి వున్నాయి. అన్నీ ఏపుగా పెరిగి.. అందంగా పూలతో వున్నాయి. అంతా చూచి ఇరువురూ ఆఫీస్ గదికి వచ్చారు.

వారిని కూర్చోమని చెప్పింది ఆండ్రియా. ఇరువురూ కూర్చున్నారు.

“మిస్టర్ అద్వైత్!.. యిప్పుడు మీరు చూచింది నేను నా ఆనందం కోసం ఏర్పరచిన చిన్న సామ్రాజ్యం. ఎలా వుంది?..” తెలుగులోనే అడిగింది ఆండ్రియా.

“చాలా బాగుంది మేడం.. డబ్బు కొందరి దగ్గర వుంటుంది. కానీ దాన్ని పదిమందికి ఉపయోగపడే రీతిగా ఆలోచించి సద్వినియోగం చేసే మనస్సు మీలాంటి ఏ కొందరికో వుంటుంది. నా జీతంలో.. యీ నెల నుంచీ పదోవంతు మీ ఆశ్రమానికి ఇస్తాను” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

ఆండ్రియా అక్కడి వారినందరినీ అద్వైత్‍కు పరిచయం చేసింది. అందరూ అద్వైత‌కు సగౌరవంగా నమస్కరించారు. అతనూ అదే పని చేశాడు.

“నేను చెప్పిన వ్యక్తిని త్వరలో మీరు ఏర్పాటు చేయాలి సార్..” అంది ఆండ్రియా.

“తప్పకుండా మేడం..”

తర్వాత ఆ నలుగురు వారి వెనకాల ఆశ్రమంలో వున్న పెద్దలు, వార్డ్‌నర్ అన్ని గదులను.. అందులో వున్న చిన్న అనాధ పిల్లలనూ చూచారు. వారికి చాక్లెట్లను పంచారు. తన జేబులో వున్న.. ఐదు వందలను ఆండ్రియాకు అందించి.. “ఇది వీరికి నా చిన్న కానుక..” అన్నాడు.

వార్డ్‌నర్‌కి చెప్పవలసిన మాటలు చెప్పి నలుగురూ కార్లో బయలుదేరారు.

(ఇంకా ఉంది)

Exit mobile version