[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[రాత్రి ఎనిమిదింటికి అద్వైత్, సీత, సుల్తాన్‍లు రాజమండ్రికి చేరుతారు. పాండురంగకీ, సుమతికీ అక్కడి విశేషాలను చెప్తారు. మర్నాడు విశాఖపట్నం నుంచి తల్లిదండ్రులకు – తాము భద్రాచలం వెళ్ళి రాఘవని చూసినట్టు, సీతారాముల దర్శనం చేసుకున్నట్టు చెప్తాడు అద్వైత్. రెండు రోజుల తర్వాత అద్వైత్ లండన్ ప్రయాణం. పాండు, సుమతి, సీత కలిసి అతని సామాన్లు జాగ్రత్తగా సర్దుతారు. ఆండ్రియా, మేరీ ఇండియా, నరసింహశాస్త్రికి వీడ్కోలు పలికేందుకు వస్తారు. అద్వైత్‍ను తమతో పంపుతున్నందుకు కృతజ్ఞతలు చెబుతారు. ఇండియా భారతీయ సంస్కృతిని గొప్పగా అలవర్చుకుందని, గొప్ప వ్యక్తిత్వం ఉన్న యువతి అని అంటారు శాస్త్రి గారు. ఆండ్రియా, మేరీ మరోసారి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతారు. ఈలోపు రామిరెడ్డిగారు వచ్చి లక్ష్మీదేవి బంగారు ప్రతిమ సిద్ధమయిందనీ, వెళ్ళి చూసొద్దామని చెప్తారు. వచ్చే గురువారం వెళ్దామని అంటారు శాస్త్రి గారు. ఇండియా లోపలికి వెళ్ళి సావిత్రికి, వసుంధరకి నమస్కరించి వీడ్కోలు పలికుతుంది. సీతకీ, సుమతికి బై చెప్తుంది. శాస్త్రి గారి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. తాను గౌరీ మేడమ్‍ని కలిసి లండన్ వెళ్తున్నట్టు చెప్పాలనీ, ఒకసారి వెళ్ళొస్తానని అంటాడు అద్వైత్. అతనితో పాటు సీత, ఇండియా కూడా బయల్దేరుతారు. గౌరీ మేడమ్‍ని కలిసి ఆమెకి తమ ప్రయాణం గురించి బయల్దేరుతారు. దారిలో గోదావరి ఒడ్డున కాసేపు కూర్చుని మాట్లాడుకుంటారు సీత, అద్వైత్‍లు. త్వరలో తమ ఇంట ఓ పసిబిడ్డ రానున్నదన్న వార్త ఆ రాత్రి అందరికీ చెబుతుంది సుమతి. తాను అంతకుముందు అద్వైత్ కోసం చేసిన లడ్డూలతో అందరి నోటిని తీపి చేస్తుంది సీత. ఆ రాత్రి నిద్రపోయే ముందు – అద్వైత్ లండన్ నుంచి తిరిగి వచ్చాకా, సీతకీ, అద్వైత్‍కీ వివాహం చేయాలని శాస్త్రి గారూ, సావిత్రీ నిర్ణయించుకుంటారు. – ఇక చదవండి.]
అధ్యాయం 41:
[dropcap]వే[/dropcap]కువన నాలుగు గంటలకు నరసింహశాస్త్రి గారు అద్వైత్ పాండురంగలతో నదికి వెళ్లి స్నానం చేసి వచ్చి.. పూజా మందిరంలో కూర్చొని శ్రీ శివసహస్ర నామార్చన.. శతనామావళి ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. అద్వైత్.. పాండురంగలు వారి ప్రక్కన కూర్చొని నామాలను పలికారు. వారు నదికి వెళ్ళగానే.. సావిత్రి స్నానం చేసి దేవుని నైవేద్యానికి పులుసన్నం.. వడలు.. పాయసం తయారు చేసి ఆరుగంటల కల్లా వాటిని పూజగదికి చేర్చింది.
సీత.. సుమతీలు కూడా స్నానం చేసి.. ఆ గదిలో ప్రవేశించి కూర్చున్నారు. వసుంధర కూడా వచ్చి వారి ప్రక్కన కూర్చుంది. మంత్రపుష్పం.. ముగిసింది.. నివేదన జరిగింది.
నరసింహశాస్త్రి అందరికీ తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. నివేదన పదార్థాలను సావిత్రి ఓ టిఫిన్ క్యారియర్లో సర్ది అద్వైత్ లగేజ్ ప్రక్కన వుంచింది.
రెడ్డిగారు కారును పంపారు.. అద్వైత్ లగేజ్‍ని పాండురంగ, సీతలు కారు డిక్కీలో డ్రైవర్ సాయంతో వుంచారు. సుల్తాన్.. ఆండ్రియాను మేరీని ఇండియాను రైల్వే స్టేషన్లో దించి.. ఆండ్రియా మాట ప్రకారం అద్వైత్‍ను తీసికొని వచ్చేటందుకు బయలుదేరాడు.
తల్లితో.. ఇండియా తాను సుల్తాన్‌తో వెళతానంది.. కానీ ఆండ్రియా అందుకు సమ్మతించలేదు. సుల్తాన్ వెళ్ళిపోయాడు.
“మమ్మీ!.. నన్ను ఎందుకు వెళ్ళవద్దన్నావ్!..” అడిగింది ఇండియా.
“డార్లింగ్.. వారందరికీ నీవంటే ప్రాణం.. నిన్ను చూస్తే వారు.. వారికి దూరంగా వెళ్ళిపోతున్నావని బాధపడతారని.. వద్దన్నాను”
తల్లి చెప్పిన మాట నిజమేననిపించింది ఇండియాకు. తల ఆడించి మౌనంగా వుండిపోయింది.
అద్వైత్ తయారై.. తల్లిదండ్రులకు.. తన పెద్ద మేనత్తకు నమస్కరించాడు. వారు.. హృదయపూర్వకంగా అద్వైత్‍ను ఆశీర్వదించారు.
సుల్తాన్ కారును ఇంటి ముందు ఆపి.. వరండాను సమీపించాడు. అందరూ వరండాలోకి వచ్చారు. సుల్తాన్.. నరసింహశాస్త్రి గారికి నమస్కరించాడు.
“రెడ్డిగారు కారును పంపాడు చూచావుగా సుల్తాన్ భాయ్!..” అన్నారు శాస్త్రిగారు.
“చూచానయ్యా!.. అమ్మగారికి ఆ విషయం తెలియదు కదా!.. నన్ను పంపారు” అద్వైత్ వైపు చూచి.. “బాబూ.. రైలు మరో అరగంటలో వస్తుందట. తమరు బయలుదేరుతారా!..”
అలాగే అన్నట్లు అద్వైత్ తల ఆడించాడు.
పాండూను సమీపించి అతని భుజంపై చెయ్యి వేసి.. “పాండూ ఆశ్రమ వ్యవహారాలను జాగ్రత్తగా చూచుకో. అమ్మా నాన్న అత్తయ్యలను..”
“బావా!.. మీరు నాకు చెప్పాలా!.. నేను అందరినీ.. అన్ని విషయాలను జాగ్రర్తగా చూచుకొంటాను. మీరు లేని కొరత వారికి లేకుండా వర్తిస్తాను. మీరు సంతోషంగా వెళ్ళి.. మంచి పేరుతో త్వరగా తిరిగి రండి..” చిరునవ్వుతో చెప్పాడు పాండు.
అద్వైత్ అందరి ముఖాలను కలయజూచాడు. మౌనముద్రతో అందరి వదనాలు ఎంతో గంభీరంగా వున్నాయి. ప్రక్క ప్రక్కనే నిలబడి వున్న తల్లిదండ్రులను సమీపించి..
“అమ్మా!.. నాన్నా!.. నేను వెళ్ళి వస్తాను.. త్వరలో వచ్చేస్తాను” మెల్లగా చెప్పాడు అద్వైత్.
“మంచిది నాన్నా వెళ్లిరా!..” గంభీరంగా చెప్పారు శాస్త్రిగారు.
“నాన్నా జాగ్రత్త..” మెల్లగా చెప్పింది సావిత్రి.
సీత.. సుమతి సింహద్వారం ప్రక్కగా నిలబడి దీనంగా అద్వైత్‍ను చూస్తున్నారు.
“అలాగేనమ్మా!.. సీత..” చెప్పదలచుకొన్నది చెప్పలేక పోయాడు అద్వైత్.
“బావా పిలిచారా!..” ముందుకు వేగంగా రాబోయింది సీత,
‘లేదు’ అన్నట్లు చేతిని ఆడించాడు సీత ముఖంలోకి చూస్తూ. సీత ఆగిపోయింది. కన్నీళ్ళతో.. తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
అద్వైత్.. వేగంగా కారువైపుకు నడిచాడు. సుల్తాన్ అతన్ని అనుసరించాడు.
అద్వైత్ కార్లో కూర్చున్నాడు. వరండాలో అందరూ విచార వదనాలతో నిలబడి వున్నారు. సుల్తాన్ కారును కదిలించాడు. రెండు కార్లూ వెళ్ళిపోయాయి.
సీత.. తన గదికి వెళ్ళి మంచంపై వాలిపోయింది. దుఃఖం పొంగి పొరలింది. ఏడుస్తూ తలను దిండు క్రింద దాచుకొంది.
సావిత్రి.. వసుంధర వారి వారి గదులకు వెళ్ళిపోయారు.. సావిత్రి వదనంలో ఎంతో విచారం..
‘ఒక్కగానొక్క బిడ్డ.. వాడిని వీరు ఎందుకోసం లండన్‍కు పంపాలని నిర్ణయించుకొన్నారు!.. తండ్రి చెప్పగానే ఆది ఎందుకు అంగీకరించాడు!.. వాడు ఏనాడూ యింతవరకూ వారి మాటకు ఎదురు చెప్పి ఎరుగడు. బహుశా వాడి వరకూ అదే కారణం కావచ్చునేమో!.. అయిదారు నెలల్లో వస్తానన్నాడు.. ఇప్పుడే సమయం ఎంతో భారంగా నడుస్తున్నట్లనిపిస్తూ వుంది. ఆరు మాసాలు ఎలా సాగుతాయో!.. తండ్రీ!.. సర్వేశ్వరా.. అన్ని విషయాలకు నా బిడ్డకు నీవే అండదండ. వాడిని క్షేమంగా త్వరలో ఇంటికి చేర్చు తండ్రి!..’ సర్వేశ్వరుని వేడుకొంది సావిత్రి అశ్రునయనాలతో. సుమతి.. సీత గదిలో ప్రవేశించింది. మంచంపై కూర్చొని.. ఆమె వీపుపై చేయి వేసింది.
“సీతా!.. అన్నయ్య వెళ్ళిపోయాడని బాధపడుతున్నావు కదూ.. త్వరలో తిరిగి వస్తానని చెప్పాడుగా.. ఇది నీవు ధైర్యంగా వుండవలసిన సమయం. అన్నయ్య!.. నీ కోర్కెను నెరవేర్చారని నీవే చెప్పావు.. ఎక్కడికి వెళ్ళినా.. త్వరలో నీ కోసం తిరిగి వస్తారు. పెదనాన్నా పెద్దమ్మా!.. కూడా బాధపడుతున్నారు. నీవు యీ రీతిగా వాళ్ళ కంటబడితే వారు ఎంతగానో బాధపడతారు. నీకు నేను తోడు వున్నాను. ఆరు నెల్లే కదా!.. త్వరగా జరిగిపోతాయి. మనం పూర్వం కంటే ఆ పెద్దలకు ఎంతో సన్నిహితంగా వుండాలి. సరదా మాటలతో వారి మనస్సుకు ఆనందాన్ని కలిగించాలి. ఇందులో నీ పాత్ర చాలా కీలకమయింది. కారణం.. నీవు యీ యింటి కోడలివి. నీకు లేని హక్కు వేరెవరికీ లేదు. లే.. కూర్చో.. కళ్ళు తుడుచుకో.. అలా శివాలయానికి వెళ్ళొద్దాం పద.. నా మాట విను” అనునయంగా చెప్పింది సుమతి. పావుగంటసేపు వరండాలో కూర్చొని అద్వైత్ తలపులతో కళ్ళు మూసుకొన్న నరసింహశాస్త్రికి సావిత్రి గుర్తుకు వచ్చింది. ‘యీ పాటికి రైలు కదిలి మద్రాస్ వైపుకు బయలుదేరి వుంటుంది. ఆదిని గురించిన ఆలోచనలతో సావిత్రి బాధపడుతూ వుంటుంది. ఆమెను అనునయించడం.. వర్తమానంలో నా ధర్మం..’ మెల్లగా లేచి తన గదివైపుకు నడిచారు శాస్త్రిగారు.
సుమతి.. సీతలు సీత గదినుండి బయటికి వచ్చారు. శాస్త్రిగారిని చూచి నవ్వారు. వారిని చూచిన నరసింహశాస్త్రి.. ‘బాధను దిగమ్రింగి నవ్వుతున్నాను..’ అనుకొన్నాడు.
ఏడ్చిన కారణంగా సీత ముఖం కందినట్లు శాస్త్రిగారికి కనుపించింది.
“అమ్మా సీతా!..” పిలిచారు శాస్త్రిగారు.
హుషారుగా నడిచి వారిని సమీపించి.. “ఏం కావాలి మామయ్యా..” చిరునవ్వుతో అడిగింది సీత. “మీ అత్తయ్యను జాగ్రర్తగా చూచుకోవలసిన బాధ్యత నీ మీద వుందమ్మా!..”
“అవును మామయ్యా!.. తప్పక చూచుకొంటాను. మా అత్తయ్య చాలా మంచిది మామయ్యా!..” నవ్వింది సీత.
“మరి నేను..”
“చాలా చాలా మంచివారు..”
“మీ అత్తయ్య గదిలో ఏం చేస్తుందో చూడు..”
“అలాగే మామయ్యా..”
సీత శాస్త్రిగారి గది ద్వారాన్ని సమీపించి లోనికి తొంగి చూచింది.
“అత్తయ్యా!.. మామయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు..” చిరునవ్వుతో చెప్పింది సీత.
సావిత్రి తలను త్రిప్పి సీత ముఖంలోకి చూచింది.
“అత్తయ్యా!.. యీ మాటలు మీరు నాకు చెప్పినవే. ఆడపిల్ల తిరిగితే చెడిపోతుంది.. మొగవాడు తిరక్కపోతే చెడిపోతాడు అని.. నా బావ మొగవాడు కదా అత్తయ్యా!.. వారు తీసికొన్ని నిర్ణయం మంచిదే కదా!.. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసికోవాలి కదా అత్తయ్యా!.. అదే పని నా బావ చేశాడు. కొత్త దేశాన్ని చూచి.. ఎందరితోనో పరిచయాన్ని ఏర్పరచుకొని.. మంచి పేరు.. కీర్తితో నా బావ వీరుడుగా తిరిగి వస్తాడు. అది.. నాకు.. మీకు మామయ్యగారికి.. మన అందరికీ ఆనందకరమైన విషయం కదా అత్తయ్యా!..” అనునయంగా చెప్పింది సీత. సీత మాటలకు.. సుమతి.. శాస్త్రిగార్లకి ముఖంలో చిరునవ్వు…
గదిలోని సావిత్రి లేచి ద్వారాన్ని సమీపించింది.. సీత ముఖంలోకి చూచింది.
“అత్తయ్యా!.. కాఫీ యివ్వనా!.. నేను ఇప్పుడు కాఫీ చాలా బాగా తయారు చేయగలను. నేర్చుకొన్నాను.”
“అమ్మా!.. మేము వరండాలో కూర్చుంటాం.. నీవు కాఫీ తీసుకురా!..” అన్నారు నరసింహశాస్త్రిగారు.
“చెప్పారుగా మీ మామయ్య.. తీసుకురా!..” అంది సావిత్రి భర్త ముఖంలోకి చూస్తూ.
“ఐదు నిముషాల్లో వస్తాను. మీరు వరండాలో కూర్చోండి” సీత వంట ఇంటి వైపుకు నడిచింది. సుమతి ఆమెను అనుసరించింది.
“రా సావిత్రి.. వరండాలో కూర్చుందాం!..” నరసింహశాస్త్రిగారు వరండా వైపుకు నడిచారు. సావిత్రి వారిని అనుసరించింది. ఇరువురూ వరండాలో కూర్చున్నారు.
“ఏమండీ!..”
“చెప్పు సావిత్రి..”
“సీతకు ఆదికి వివాహం చేయాలండి!..”
“ఆదిని.. తిరిగి రానీ.. తప్పకుండా జరిపిస్తాము”
“సీత చాలా మంచిదండి.. వాడంటే దానికి ప్రాణం!..”
“ఆ విషయం నాకు తెలీదనుకున్నావా సావిత్రీ!..” నవ్వారు నరసింహశాస్త్రి, “నాకు మనవడినో.. మనవరాలినో ఎత్తుకోవాలని వుంది..”
“నీ త్వరలో నెరవేరబోతూ వుందిగా!..”
“ఎలా!..”
“మన సుమతి..” నవ్వారు శాస్త్రిగారు.
సీత కాఫీ కప్పుతో వరండాలోకి వచ్చి ఇరువురికీ అందించి.. “త్రాగి చెప్పండి ఎలా వుందో!..” నవ్వుతూ చెప్పింది సీత.
ఇరువురూ త్రాగారు.. ఆత్రంగా ఏం చెబుతారోనని చూస్తూ వుంది సీత. “సీతా!.. నన్ను మించిపోయావే!..” ఆనందంగా చెప్పింది సావిత్రి.
“అవునమ్మా!..” నవ్వుతూ చెప్పారు శాస్త్రిగారు.. సీత ముఖంలో పున్నమి వెన్నెల.
అధ్యాయం 42:
మద్రాస్ నుండి.. ఇండియా, ఆండ్రియా, మేరీ, మిస్టర్ మూన్.. అద్వైత్‍లు స్టీమరలో లండన్‍కు బయలుదేరారు. పదిహేను రోజుల వారి నౌకా ప్రయాణం.. అందరికీ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా సాగింది.
రాత్రి సమయంలో అందరూ పడుకొన్న తర్వాత.. అద్వైత్ లేచి స్టీమర్ పైకి వచ్చి నలుదిశలూ పరికించేవాడు. చుట్టూ సాగరం.. జలమయం.
తల్లి.. తండ్రి.. సీత.. రాఘవ.. పాండు.. సుమతి.. వసుంధర తన వారంతా గుర్తుకు వచ్చేవారు. మనస్సులో మూగబాధ. ‘నాన్నగారు ఏ కారణంగా నన్ను లండనకు పంపాలని నిర్ణయించుకొన్నారు?.. నా కీర్తి ప్రతిష్ఠల కోసమా!.. మేరీ మేడం కోరినందుకా!.. డబ్బు కోసమా!.. కారణం ఏమిటో నా వూహకు అందని విషయం.
ఏది ఏమైనా.. ఇది నాకు గొప్ప అదృష్టం.. అందరికీ లభించనిది.. కలసి వచ్చిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసికోవాలి.. నా నాట్య సామర్థ్యాన్ని.. పదిమందికి పంచాలి.. మంచి పేరు.. గౌరవాన్ని సంపాదించాలి. డబ్బునూ సంపాదించాలి. ‘ధనమూల మిదం జగత్’.. నేటి ప్రపంచంలో డబ్బు వుంటే.. అందరూ అభిమానులే అవుతారు. ఎందరో ఆ డబ్బును ఎన్నో అక్రమాలను చేసి సంపాదిస్తున్నారు. నేను నా స్వశక్తితో.. నాకు ఆ దైవం ప్రసాదించిన కళ ద్వారా నీతి.. నిజాయితీగా సంపాదించాలి. నా ఆర్జనలో కొంత పేదలకు తిరిగి వచ్చాక పంచాలి. నా వారి అందరి కోరికలను తీర్చి వారిని ఆనంద పరచాలి.
పాపం.. సీత. అమాయకురాలు.. నన్ను ఎంతగానో ప్రేమించింది. ఆరాధించింది. తన సర్వస్వాన్ని నాకు అర్పించింది. మనస్సున తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కన్నీటితో నన్ను సాగనంపింది. జీవితాంతం ఆమెకు ఆనందాన్ని కలిగించాలి. నా ప్రతి చర్య వలనా ఆమెకు సంతోషం కలగాలి. నా తల్లిదండ్రులు.. బంధుమిత్రులు సమక్షంలో ఆమెను మరోసారి నేను పెండ్లి చేసికోవాలి. పండంటి బిడ్డలను కనాలి. వారిని చూచి మా అమ్మా నాన్న మురిసిపోవాలి. జీవితాన్ని స్వార్థానికి అతీతంగా పరమార్థంతో గడపాలి. సత్కీర్తిని సంపాదించాలి..’ అనుకొన్నాడు అద్వైత్.
ఇండియా అక్కడికి వచ్చింది. ఆమె రాకను అద్వైత్ గమనించలేదు. మెల్లగా అతన్ని సమీపించింది. తదేకంగా కనుచూపు మేర వరకూ నిశ్చలంగా కనుపించే సాగరాన్ని చూస్తున్నాడు అద్వైత్.
“సార్!..” పిలిచింది ఇండియా.
అద్వైత్ వెను తిరిగి చూచాడు.
“గురువుగారు.. అమ్మ గుర్తుకు వచ్చారా!..”
“అవును.”
“వారు చాలా మంచివారు.. నాకూ పదే పదే గుర్తుకు వస్తున్నారు!..” అంది ఇండియా.
“నిద్ర పోలేదేం ఇండియా!..”
“రాలేదు, అందుకే యిలా వచ్చాను. మిమ్మల్ని చూచాను..”
“వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుంది కదూ ఇండియా!..”
“అవును సార్!.. రాత్రి సమయం కదా.. చాలా ప్రశాంతంగా వుంది..” చిరునవ్వుతో చెప్పింది ఇండియా.
“అమ్మా!.. గ్రాండ్ మదర్ నిద్ర పోయారా!..”
“వారు నిద్రపోయి చాలాసేపయింది..”
“అలా చూడు.. పెద్ద పెద్ద చేపలు ఎలా పైకి ఎగిరి మరలా నీళ్ళల్లో మునిగిపోతున్నాయో!..”
ఇండియా ఆ వైపు చూచింది. అద్వైత్ చూచిన దృశ్యం ఆమెకూ గోచరించింది.
“సార్!.. ఆ చేపల జీవితంలో ఎంతో ప్రశాంతత నిండి వుంటుంది కదూ!..”
“సృష్టిలోకి ప్రతి జీవికీ.. ఆకలి దప్పుల వలన ఎల్లప్పుడూ ప్రశాంతత వుండదు. కడుపు నిండిన తర్వాత ఏ కొద్దిసేపో ఆ స్థితి. ఆకలైతే మరలా కడుపు నింపుకొనే దానికి మథన.. అదే ఆరాటం.. మన మాదిరే!.. చాలా పొద్దుపోయింది. పద పడుకొందాం!..” అన్నాడు అద్వైత్.
ఇండియా సాలోచనగా తల ఆడించింది. ఇరువురూ వారివారి పడకలకు చేరారు.
(ఇంకా ఉంది)