[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ఆంగ్లేయులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తుపాకులు కీలకమని గ్రహించిన అల్లూరి సీతారామరాజు – వన్యవాసులతో కలిసి పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్తారు. తమ కార్యకలాపాలను ప్రక్క ప్రాంతాలకు కూడా విస్తరింపజేసి కృష్ణదేవుపేట, రాజవొమ్మంగి, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటారు. తమకు సింహస్వప్నంగా మారిన రాజుగారిని ఎలాగైనా మట్టుపెట్టాలని ఆంగ్లేయులు పథకాలు వేస్తారు. స్కాట్ కవార్డ్, హేటస్ నాయకత్వంలో ఒక దండును పంపగా, వారి రాకని ముందే తెలుసుకున్న రాజుగారు వారిపై మెరుపుదాడి చేసి ఆ ఇద్దరినీ హతమార్చారు. 1922 డిసెంబర్ నెలలో జరిపిన ఆకస్మిక దాడి నుంచి తప్పించుకుంటారు రాజుగారు. ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలని కలకత్తా నుంచి రూథర్‌ఫర్డ్‌ను రప్పించి ప్రత్యేక కమీషనరుగా నియమిస్తుంది ప్రభుత్వం. రూథర్‌ఫర్డ్ – రాబర్ట్‌ను కలిసి ఇప్పటిదాకా రాజుగార్ని ఎందుకు పట్టుకోలేకపోయారని అడుగుతాడు. రాబర్ట్ చెప్పిన కారణం అతనికి నచ్చదు. ఎలాగైనా పట్టుకుతీరాలని హెచ్చరిస్తాడు. తన సన్నిహితులను పిలిచి అల్లూరి సీతారామరాజుగారితో పరిచయమున్న వారిని పట్టుకుని వారి ద్వారా రాజుగారిని బంధించాలని అనుకుంటాడు రాబర్ట్. కరీమ్ అనే అనుచరుడు గుడిలో జరిగిన శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహ ప్రతిష్ఠను గురించి రాబర్టుకు చెప్తాడు. స్వర్ణ విగ్రహం అనే మాట రాబర్టుకు ఆశ్చర్యం కలిగించగా, వెంటనే కరీమ్‍తో పాటు గుడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి వస్తాడు. ఇంటికి వచ్చాకా, తనకా బంగారు విగ్రహం కావాలని, దాన్ని ఎలా అయినా తెచ్చి తనకివ్వమని కరీమ్‍ని ఆజ్ఞాపిస్తాడు రాబర్ట్. తెచ్చివ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం 51:
[dropcap]సీ[/dropcap]తకు తన పరిస్థితి వలన ఎంతో ఆందోళన.. భయం. విషయం దాచి పెడితే దాగేది కాదు. మరో నెలలో తన శరీరంలో ఏర్పడే మార్పులు.. వాటిని గమనించిన సావిత్రి, వసుంధర, నరసింహశాస్త్రి తనను గురించి ఏమనుకొంటారో!.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో!.. వారికి తాను ఎలాంటి బదులు.. జవాబు.. చెప్పగలదు!?..
‘ఇంతవరకూ విషయం తెలిసినవారు.. సుమతి.. పాండురంగ.. రాఘవ.. సుమతి తన వెంట వుంటూనే జాగ్రత్తగా గమనిస్తూ సాయం చేస్తూ వుంది. ఆమె.. కూడా ఒట్టి మనిషి కాదు. గర్భవతి, నాల్గవ మాసం.. నాకు రెండు మాసాలు పూర్తయినాయి. ఆ సర్వేశ్వరుని దయో.. ఏమో వాంతులు కాలేదు. అవి సంభవించి వుంటే.. నా గుట్టు అందరకీ తెలిసిపోయి వుండేది. అలా అని.. ఎంతకాలం నేను విషయాన్ని దాచకలను?!.. బావ వూర్లో వుండి వుంటే.. నేను ఇంతగా ఆందోళన చెందవలసి వుండేది కాదు. విషయాన్ని బావకు చెప్పితే.. ఆలోచించి తగిన సలహాను నాకు యిచ్చి వుండేవాడు.. తనే విషయాన్ని పెద్దలకు చెప్పి వుండేవాడు. ఆయన వూర్లో లేని కారణంగా నా పరిస్థితి అయోమయంగా వుంది. మాంగల్యాలు కనబడకుండా పవిటను మెడ చుట్టూ చుట్టుకొని తిరుగుతుంటే బామ్మ అడగనే అడిగింది, ‘చలిగా వుందా? ఏమిటే పవిటను మెడకు చుట్టుకొన్నావు!.. అని’. అవునన్నట్లు తల ఆడించి ఆమె బారి నుండి తప్పించుకొన్నాను.
ఇక.. సావిత్రి అత్తయ్య!.. బావ లండన్ వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు. మామయ్య మాటకు ఎదురు చెప్పలేక.. నాలాగే మౌనంగా వుండిపోయింది. కొడుకు మీద బెంగతో పూర్వంలా చలాకీగా తిరగడంలేదు. ఇంటి పనులు, వంటా వార్పులను నేను సుమతి చూచుకొంటున్నందున బామ్మ దగ్గర కూర్చొని భాగవత పారాయణాన్ని కొంతసేపు.. ఆపై కళ్ళు మూసుకొని పడుకోవడం ప్రస్తుతం అత్తయ్య దినచర్య. అత్తయ్యకు బామ్మకు ఇంతవరకూ ఎలాంటి అనుమానం రాలేదు.. కానీ వారికి అనుమానం వచ్చే రోజు అతి చేరువలో వుంది. ఈ పరిస్థితిని నేను ఎలా ఎదురీదగలను!.. భగవాన్!.. నేను ఇప్పుడు ఏం చేయాలి?.. ఏం చేయాలి?..’
సీత మనోవేదన.. కన్నీరుగా మారింది. సుమతి సీత గదిలోనికి వచ్చింది. ఆమెను పరీక్షగా చూచింది.
“సీతా!.. ఏమిటా కన్నీరు!..” అడిగింది సుమతి.
“నా పరిస్థితిని గురించి నాకు చాలా భయంగా వుంది సుమతి. ఇక ఎన్నో రోజులు విషయాన్ని దాచలేం కదా!..” ఆందోళనగా అడిగింది సీత.
“అవును సీత!.. నీవన్న మాట నిజమే!..”
“నేను యిప్పుడు ఏం చేయాలి సుమతీ!..” దీనంగా అడిగింది సీత
సుమతి కొన్ని క్షణాలు మౌనంగా వుండి.. తర్వాత..
“మనకు యిప్పుడు వుండేవి రెండే మార్గాలు..” సాలోచనగా చెప్పింది సుమతి.
“ఏమిటవి?..” అమాయకంగా అడిగింది సీత.
“సీతా!.. ముందు నా మాటకు జవాబు చెప్పు!..”
“అడుగు..”
“నీకు ఆ గర్భాన్ని నిలుపుకోవాలని వుందా.. లేక పోగొట్టుకావాలని వుందా!..”
సీత ఆశ్చర్యంతో సుమతి ముఖంలోకి చూచింది. కొన్ని క్షణాల తర్వాత
“నాకు.. వుంచుకోవాలని వుంది సుమతీ!..” మెల్లగా చెప్పింది సీత.
“అయితే.. విషయాన్ని మనం సావిత్రి అత్తయ్యకు చెప్పడం మంచిది. ఆమె మొదట ఆశ్చర్యపోయినా.. మన సాటి ఆడమనిషి.. మనకంటే పెద్దది.. ఎంతో జీవితానుభవం కలది.. నీ యీ స్థితికి కారణం తన కొడుకు కాబట్టి.. ఆమె విషయాన్ని సవ్యంగా అర్థం చేసికోగలదు. బామ్మ పెదనాన్నలతో చెప్పివలసిన రీతిలో చెప్పగలదు. నిన్ను ద్వేషించదు. విషయాన్ని విని సంతోషపడుతుంది. నాకు తెలిసినంతవరకూ అలా చేయడం నీకు మంచిది.. అది కుదరదు అని అనుకొన్నట్లయితే!..” చెప్పడం ఆపేసింది సుమతి.
“అబార్షన్ చేయించుకోవాలంటావు కదూ!..” దీనంగా అడిగింది సీత
“అవును.. అది తప్ప వేరే మార్గం లేదుగా!.. నన్ను తప్పుగా అనుకోకు సీతా!.. నీ సమస్యకు నాకు తోచిన సలహాను చెప్పాను..” అనునయంగా చెప్పింది సుమతి.
కొన్ని నిముషాలు వారి మధ్యన మౌనంగా గడచిపోయాయి. దగ్గరగా వేసి వున్న తలుపు కదిలింది. ఇరువురి చూపులూ తలుపు వైపుకు మళ్ళాయి.
“గాలికి కదిలినట్లుంది..” అంది సుమతి.. క్షణం తర్వాత..
“సీతా!.. ఏం నిర్ణయించుకొన్నావు?..” అడిగింది సుమతి.
“నాకు బదులుగా.. నీవు అత్తయ్యతో చెప్పగలవా!..” దీనంగా అడిగింది సీత.
“అంటే!..”
“నేను నా గర్భాన్ని.. నా బావ ప్రతిరూపాన్ని విచ్ఛిన్నం చేయను. నా కడుపులో బావ అంశతో ఎదుగుతున్న బిడ్డ నాకు కావాలి. విషయం తెలిసికొని.. ఎవరు ఏమనుకొన్నా నాకు భయం లేదు. బాధ లేదు. ఎవరు ఏమన్నా.. నన్ను ఎంతగా అసహ్యించుకొన్నా.. తిట్టినా కొట్టినా.. నేను భరిస్తాను. నా బావ కొరకు ఎదురు చూస్తూ వుంటాను. నా బావ మనస్సు నాకు తెలుసు. వారు నాతో చెప్పిన ప్రకారం నా కోసం త్వరలో వస్తారు.. నా బావ నా కోసం వస్తాడు..” ఆవేశంగా చెప్పింది సీత.
తలుపు తెరవబడింది.. సావిత్రి గదిలో ప్రవేశించింది.
ఆమెను చూచిన ఆ ఇరువురూ చేష్టలుడిగి అచేతనంగా ఆమెనే చూస్తూ నిలబడిపోయారు.
సావిత్రి.. వారిరువురినీ పరీక్షగా చూడసాగింది.
కొన్ని క్షణాల తర్వాత సీత.. తన మెడ చుట్టూ వున్న పవిటను విప్పి మెడలోని మాంగల్యాలు బయటికి తీసి సావిత్రికి చూపుతూ..
“అత్తయ్యా!.. దీన్ని నాకు ప్రసాదించింది నా బావా..” చెప్పి తల దించుకొని వంగి సావిత్రి పాదాలను తాకి మెల్లగా.. “నన్ను క్షమించండి అత్తయ్యా” అంది సీత.
సావిత్రి.. సుమతి ముఖంలోకి చూచింది.
“అన్నయ్య సీతను పెళ్లి చేసికొన్నాడు పెద్దమ్మా!..” తల దించుకొని మెల్లగా చెప్పింది.
నరసింహశాస్త్రి.. పాండురంగ ప్రక్క వూరికి వివాహాలను జరిపించే దానికి వెళ్ళి.. రాత్రి ఎనిమిది గంటలకు వచ్చారు.
అంతవరకూ వారి రాక కోసం తమ గదిలో కూర్చొని తను విన్న సీతా సుమతుల సంభాషణను.. తన్ను చూడగానే సీత తన మెడలోని మాంగల్యాన్ని చూపించి.. ‘అత్తయ్యా!.. దీన్ని నాకు ప్రసాదించింది నా బావ’.. అని చెప్పి తన కాళ్ళ మీద పడడం.. అన్నీ ఆమెకు అయోమయ స్థితిని కలిగించాయి.
‘నా అద్వైత్.. నాతో వారితో చెప్పకుండా సీత మెడలో తాళి కట్టడమా!.. అంటే.. వాడికి సీతను చేసికోవాలనే అభిప్రాయం వుండి వుంటే.. మాతో చెబితే.. మేము కాదని.. కూడదని అంటామని అభిప్రాయపడ్డాడా!.. ఇంతవరకూ మా ఏ మాటను జవదాటని ఆది.. మాతో చెప్పకుండా అలాంటి నిర్ణయాన్ని ఎలా తీసికోగలిగాడు?.. ఏదో బలమైన కారణం వుంది!.. అది ఏమిటి?.. ఏమయ్యుంటుంది.. వాడేమో లండన్ వెళ్ళిపోయాడు.. ఇక్కడ సీత ఇప్పుడు గర్భవతి.. ఎంతో గొప్పగా వాడి వివాహాన్ని జరిపించాలనుకొన్న నా ఆశయం.. అణగారిపోయింది. యీ విషయాన్ని వారికి ఎలా చెప్పాలి!.. కష్టంమ్మీద నేను చెబితే.. విని వారు.. ఎంతగా బాధపడతారో!.. వారికి చెప్పకుండా దాచే విషయం కాదు కదా ఇది?.. నా ఆది ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడు?!.. నమ్మశక్యం కాకుండా వుంది..’
ఆవేదనతో ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. గోపాలశర్మ గారి యింటికి వెళ్ళిన వసుంధర వచ్చింది. వరండాలో ప్రవేశించి కుర్చీలో కూర్చుంటూ..
“సావిత్రీ!..” పిలిచింది వసుంధర.
సావిత్రికి ఆమె పిలుపు వినపడలేదు. కానీ.. సీతకు సుమతికి వినిపించింది.
“బామ్మ వచ్చింది సీతా!.. పెద్దమ్మను పిలుస్తూ వుంది” ఆందోళనగా చెప్పింది సుమతి.
కన్నీటితో విచారంగా సుమతి ముఖంలోకి చూచింది సీత. తల దించుకొని.. “అత్తయ్యకు నా మీద కోపం వచ్చినట్లుంది. సుమతీ!..”
“అది కోపం కాదు..”
“కోపం కాక మరేమిటి?..”
“తాను వూహించని దృశ్యాన్ని చూచి పెద్దమ్మ షాక్ అయింది. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది..”
“అత్తయ్య మన సంభాషణనంతా విని వుంటుంది కదూ!..”
“ఏమో సీతా!.. నాకు..”
“అయోమయంగా వుందా!..”
“అవును..”
సీత విరక్తిగా నవ్వింది.
“ఎందుకు నవ్వుతున్నావు సీతా!..”
“పూర్తిగా నీట మునిగిన వానికి చలి వుండదట. ఇప్పటి నా పరిస్థితి అలాంటిదే!.. నాకు ఆనందమూ లేదు.. భయమూ లేదు..” పవిటతో కన్నీటిని తుడుచుకొంది సీత.
వసుంధర.. మరోసారి బిగ్గరగా.. “సీతా!.. సుమతీ!..” పిలిచింది.
“నేను వెళ్ళి బామ్మకు ఏం కావాలో కనుక్కొని వస్తాను”
సీత తన ఆలోచనలో మౌనంగా వుండిపోయింది.
సుమతి గది నుండి బయటికి వచ్చి వరండాలో ప్రవేశించింది.
సుమతిని చూచిన వసుంధర.. “ఏం చేస్తున్నారే అంతా!.. మీ పెద్దమ్మ ఏదీ?.. పిలిస్తే పలకరేం!..” కాస్త నిష్టూరంగానే అడిగింది వసుంధర.
“పెద్దమ్మ వారి గదిలో వుంది.. మీకేం కావాలి బామ్మా!..”
“ఓ గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వు!.. మరి సీత ఎక్కడ?..”
“తన గదిలో వుంది..” చెబుతూ మంచి నీళ్ళు తెచ్చేదానికి లోనికి వెళ్ళింది సుమతి. కొన్ని సెకండ్లలో వరండాలోకి తిరిగి వచ్చి మంచినీళ్ళ గ్లాసును వసుంధరకు అందించింది సుమతి.
“వంట అయిందా!..”
“అయింది.. మీకు భోజనం వడ్డించనా!..”
“పాండు.. నరసింహ యింకా రాలేదుగా..”
“రాలేదు బామ్మా!..”
“యీ పాటికి వస్తూనే వుంటారు. వాళ్ళను రానీ!..”
మంచి నీళ్ళు త్రాగి గ్లాసును సుమతికి అందించింది వసుంధర.
నరసింహశాస్త్రి.. పాండురంగ కార్లో వచ్చి దిగారు. లగేజీని దించి డ్రయివర్ శాస్త్రిగారికి నమస్కరించి వెళ్ళిపోయాడు.
వారిని చూచిన వసుంధర ..
“ఒసేయ్.. సావిత్రీ!.. నా తమ్ముడు వచ్చాడే.. గదినుండి బయటికి రా!..” బిగ్గరగా పలికింది.
సామాగ్రిని పాండు వరండా లోనికి చేర్చి.. ఎదురుగా ముఖ ద్వారం వద్ద దిగులుగా నిలబడి వున్న సుమతి ముఖంలోకి చూచాడు. కళ్ళతో సౌగ్య చేసింది సుమతి. ఏదో జరిగిందనే అనమానం పాండుకు కలిగింది. సామాగ్రితో ఇంట్లోకి నడిచాడు. సుమతి వేగంగా సీత గదికి వెళ్ళింది. సీత అచేతనంగా మంచంపై పడుకొని.. పైన తిరుగుతున్న ఫ్యాన్ను చూస్తూ వుంది.
“సీతా!.. పెదనాన్నగారు వచ్చారు..”
సీత పలకలేదు. దగ్గరకు జరిగి భుజంపై తట్టి మరోసారి చెప్పింది.
సీత దిగులుగా సుమతి ముఖంలోకి చూచింది. విరక్తిగా నవ్వుతూ.. “పాండు కూడా వచ్చాడుగా!..”
“ఆ.. వారూ వచ్చారు..”
“అత్తయ్య ఎక్కడ వుంది?..”
“వారి గదిలో..”
“బామ్మ!..”
“వరండాలో..”
పాండు పిలుపు విని సుమతి అతన్ని సమీపించింది.
వసుంధర పొలికేకతో సావిత్రి వర్తమానానికి వచ్చింది. గది నుండి పవిటతో ముఖాన్ని తుడుచుకొంటూ సింహద్వారాన్ని సమీపించింది. ద్వారం దగ్గర నిలబడిన సావిత్రి ముఖంలోకి చూచారు నరసింహశాస్త్రి. ఆమె ముఖం.. వారికి ఎంతో విచారంగా వున్నట్లు గోచరించింది.
“ఏం సావిత్రీ!.. అదోలా వున్నావు?..” అడిగారు శాస్త్రిగారు.
ఏమీ లేదన్నట్లు తల దించుకొని ఆడించింది సావిత్రి.
“ఒంట్లో బాగలేదా!..”
“తలనొప్పిగా వుంటే పడుకొన్నానండి..” వంచిన తలను ఎత్తకుండానే మెల్లగా చెప్పింది సావిత్రి.
“సీతకు చెప్పి తైలమర్దనం చేయించుకోవలసిందిగా.. ఆమె చేతి మహిమతో నొప్పి గిప్పీ మాయమై వుండేది..” చిరునవ్వుతో చెప్పారు శాస్త్రిగారు.
తలపైకెత్తి క్షణంసేపు శాస్త్రిగారి ముఖంలోకి చూచి తలను దించుకొంది సావిత్రి.
“ఏరా తమ్ముడూ.. రెండు వివాహాలు బాగా జరిగాయా..?”
“అక్కా, యీ మధ్యకాలంలో అలాంటి వివాహాలను నేను చేయించలేదు. చాలా గొప్పగా ఖర్చు పెట్టారు. మనకూ సంభావనలు ఘనంగా యిచ్చారు. స్నానం చేసి వస్తానక్కయ్యా.. భోంచేస్తూ మాట్లాడుకొందాం..” శాస్త్రిగారు తన గదివైపుకు నడిచారు.
సావిత్రి వారి వెనకాలే నడిచింది.
శాస్త్రిగారు జుబ్బాను విప్పి.. పెరటు వైపుకు స్నానానికి బయలుదేరారు. దండెం మీది టవల్ను చేతికి తీసుకొని సావిత్రి వారిని అనుసరించింది.
శాస్త్రిగారు బావి దగ్గర చన్నీటి స్నానం చేశారు. సావిత్రి వారికి టవల్ అందించింది. వారు అందుకోక మునుపే సావిత్రి వదలడంతో టవల్ జారి క్రింద పడింది. త్రోటుపాటుతో వంగి టవల్ను చేతికి తీసికొని దులిపి.. శాస్త్రిగారికి అందించింది సావిత్రి.
“పరధ్యానంగా వున్నావు. కారణం ఏమిటి సావిత్రి!..” చిరునవ్వుతో అడిగారు శాస్త్రిగారు.
“క్షమించండి!.. మీరు పట్టుకొన్నారని వదిలేశాను..” మెల్లగా చెప్పింది సావిత్రి. “తలనొప్పి తగ్గిందా!..” తల తుడుచుకొంటూ అడిగారు శాస్త్రిగారు.
“ఆఁ.. పొద్దుపోయింది. భోజనం వడ్డిస్తాను. రండి..” చెప్పి సావిత్రి లోనికి నడిచింది. శాస్త్రిగారు తన గదికి వెళ్ళి దుస్తులు ధరించి భోజనానికి వచ్చారు. వసుంధర పాండురంగ సుమతీ కూడా వచ్చారు.
“పెద్దమ్మా!.. మీరు కూర్చోండి. నేను వడ్డిస్తాను..” అంది సుమతి.
అందరినీ చూచి.. “సుమతీ!.. నా కోడలు సీత ఎక్కడ?..” అడిగారు శాస్త్రిగారు.
సావిత్రి ఆశ్చర్యంతో వారి ముఖంలోకి చూచింది.
సుమతి.. క్షణంసేపు వారి ముఖాన్ని.. తర్వాత సావిత్రి ముఖాన్ని చూచి.. తల దించుకొని..
“సీత.. ఒళ్ళు నలతగా వుందని పడుకకొని వుంది పెదనాన్నగారూ!..” అంది మెల్లగా.. సావిత్రిని సమీపించి..
“పెద్దమ్మా!.. మీరు కూర్చోండి.. నేను వడ్డిస్తాను..” అంది సుమతి.
క్షణంసేపు సుమతి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచి సావిత్రి..
“నీవు వట్టి మనిషివి కాదు సుమతీ!.. నీవు కూర్చో, నేను వడ్డిస్తాను..” అంది.
ఆమె చూపులకు బెదరి సుమతి కూర్చుంది.
“పాండూ!.. వెళ్ళి సీతను.. నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురా!..” అన్నారు శాస్త్రిగారు.
“పాండూ!.. ఆగు. అది రాదు!..” అంది సావిత్రి.
పాండు ఆగిపోయాడు.
ఆశ్చర్యంతో శాస్త్రిగారు సావిత్రి ముఖంలోకి చూచారు.
“సేత.. నేను పిలిచినా రాదంటావా! సావిత్రి!..”
“సుమతి చెప్పింది కదండీ!.. దానికి ఒళ్ళు నలతగా వుందని!.. నేను తినేటప్పుడు లేపుకొచ్చి.. ఇద్దరం కలసి తింటాము. మీరు భోంచేయండి” ప్రాధేయపూర్వకంగా చెప్పింది సావిత్రి.
“ఏమే సుమతీ!.. నీవు నాతో చెప్పలేదు.. సీతకు ఒళ్ళు సరిగా లేదని..” పెద్దరికపు ప్రశ్న వేసింది వసుంధర.
“వదినా!.. మీరు స్థిమితంగా భోంచేయండి.. నేను చూచుకొంటాను..” అనునయంగా చెప్పింది సావిత్రి. ఆ నలుగురూ.. మౌనంగా భోంచేసి లేచారు. అందరికంటే ముందు సుమతి లేచింది. చేయి కడుక్కొని సీత గదివైపుకు పరుగెత్తింది..
“సీతా!! పెదనాన్న బహుశా నీగదికి రావచ్చు. జాగ్రత్త” అని చెప్పి వంట యింట్లోకి నడిచింది.
వసుంధర.. నరసింహశాస్త్రి భోజనాన్ని ముగించి.. నేరుగా సీత గదిలో ప్రవేశించారు
సీత ప్రక్కకు తిరిగి పడుకొని నిద్రపోతున్నట్లు నటించింది.
“సీతా!..” పిలిచారు శాస్త్రిగారు.
సీత కదలలేదు.
“ఒసేయ్! సీతా!..” పిలిచింది వసుంధర.
శాస్త్రిగారు తన చూపుడు వ్రేలిని తన నోటికి అడ్డంగా వుంచి అరవవద్దని వసుంధరకు సౌజ్ఞ చేశారు. తన చేతిని ఆమె నొసటన వుంచి కొన్ని క్షణాల తర్వాత తీశారు.
“అక్కా!.. జ్వరం తీవ్రంగా లేదు. అలసినట్లుగా వుంది. నిద్రపోతూ వుంది. పద.. సావిత్రి చూచుకొంటుందిలే..” ప్రక్కకు వచ్చి నిలబడిన సావిత్రి ముఖంలోకి చూచారు నరసింహశాస్త్రి.
‘సరే’ అన్నట్లు సావిత్రి తల ఆడించింది.
ద్వారం ప్రక్కన నిలబడి వున్న సుమతి.. పాండు వారిని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు.
ముందు.. నరసింహశాస్త్రి.. వెనుక వసుంధర.. వారి వెనుక సావిత్రి.. గది నుండి బయటికి నడిచారు. వారు వెను తిరిగినది చూచిన సుమతి పాండు వారి కంటే ముందు తమ గది వైపుకు నడిచారు. నరసింహశాస్త్రిగారు.. వసుంధర.. వారి వారి గదులకు వెళ్ళిపోయారు. పాండు.. సుమతి తమ గదిలో ప్రవేశించారు.
సావిత్రి వారి గదిని సమీపించి..
“సుమతీ!..”
“ఏం పెద్దమ్మా!..
“రా.. నాకు భోజనాన్ని వడ్డిద్దువుగాని!..” అంది.
“అలాగే పెద్దమ్మా!.. పదండి..” వంట ఇంటి వైపుకు నడిచింది సుమతి.
సావిత్రి ఆమెను అనుసరించింది.
ఆకు వేసి.. పదార్థాలను వడ్డించబోయింది సుమతి.
“సుమతీ!.. సీతను లేపి నేను పిలుస్తున్నానని చెప్పి తోటే తీసుకరా!..” అంది సావిత్రి.
“అలాగే పెద్దమ్మా!..”
సుమతి వంట ఇంటి ద్వారాన్ని సమీపించింది.
సీత.. ద్వారం ముందు నిలబడి వుంది.
సుమతి సీతను చూచి.. “సీత..” అప్రయత్నంగా ఆశ్చర్యంతో అంది.
సీత సావిత్రిని సమీపించింది. క్షణం సేపు సావిత్రి ముఖంలోకి చూచి తల దించుకొంది. ఆమె ముఖాన్ని చూచిన సావిత్రి ఏదో చెప్పబోయే లోపలే సీత..
“అత్తయ్యా!.. జరిగిన దాంట్లో బావ తప్పేమీ లేదు. తప్పంతా నాదే.. నాకు వాంతి వచ్చేలా వుంది అత్తయ్యా!.. ఏమీ తినాలని లేదు. మీరు భోంచేయండి..” సుమతి వైపు చూచి..
“సుమతీ!.. వడ్డించు..” అంది. క్షణం తర్వాత..
“అత్తయ్యా కళ్ళు మూసుకొని నిద్రపోవాలని వుంది.. వెళ్ళి పడుకోవాలని వుంది. నన్ను బలవంతం చేయకండి అత్తయ్యా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పి సీత.. తన గదికి వెళ్ళిపోయింది.
సుమతి భోజన పదార్థాలను వడ్డించింది.
సావిత్రి మౌనంగా కొద్దిగా తిని లేచి చేయి కడుక్కొంది. తన గదివైపుకు నడిచింది. సుమతి వంట ఇంటిని చక్కబెట్టి.. తన గదికి వెళ్ళిపోయింది.
సావిత్రి మనస్సులో మథనం.. విషయాన్ని శాస్త్రిగారికి ఎలా చెప్పాలనే ఆవేదన.
శాస్త్రిగారు మంచంపై పడుకొని వున్నారు. మంచం ప్రక్కన వున్న కుర్చీలో సావిత్రి కూర్చొంది.
‘నేను అద్వైత్‌ను గురించి తప్పుగా అనుకొంటానేమోనని.. సీత తప్పంతా తనదేనని చెప్పింది. దాని అర్థం.. అద్వైత్ సీతను..’
“సావిత్రీ!..” శాస్త్రిగారి పిలుపు ఆమె ఆలోచనకు అంతరాయం కలిగించింది.
తొట్రుపాటుతో వారి ముఖంలోకి చూచింది సావిత్రి.
“ఏదో విషయాన్ని గురించి మథనపడుతున్నట్లుగా వున్నావు. ఏమిటి విషయం?..” అడిగారు శాస్త్రిగారు. అంతవరకూ సావిత్రి.. హృదయంలో అణచి పెట్టుకొని వున్న ఆవేదన పైకి పొంగింది. ఏడ్వసాగింది. శాస్త్రిగారు లేచి కూర్చొని ఆశ్చర్యంతో సావిత్రిని సమీపించి..
“సావిత్రీ!.. ఎందుకు ఏడుస్తున్నావు!..” అడిగారు.
“మన ఆది!..” ఆగిపోయింది సావిత్రి.
“ఆదీ!..” ప్రశ్నార్థకంగా సావిత్రి ముఖంలోకి చూచాడు శాస్త్రిగారు.
“సీతను మనతో చెప్పకుండా వివాహం చేసికొన్నాడండీ..” భోరున ఏడ్చింది సావిత్రి.
“సావిత్రీ!..”
అవునన్నట్లు తల పంకించింది కన్నీటితో సావిత్రి. శాస్త్రిగారు ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూస్తూ.. “ఆ విషయం నీకు ఎలా తెలిసింది సావిత్రి!..” అడిగారు.
“సీత యిప్పుడు గర్భవతండీ!..”
“ఆఁ..” అంతులేని ఆశ్చర్యం..
“అవునండీ..” మెల్లగా చెప్పింది సావిత్రి.
‘నా కొడుకు నాకు తెలియకుండా వివాహం చేసికొన్నాడా!.. సీత గర్భవతా!..’ స్వగతంలో అనుకొన్నారు శాస్త్రిగారు.
‘ఆది అలా ఎందుకు చేశాడు!.. సీత ప్రోద్భలమా!.. లేక వేరే కారణం ఏమైయ్యుంటుంది!.. ఏనాడూ నన్ను సంప్రదించకుండా తనకు సంబంధించిన ఏ విషయాన్ని చేయని.. ఆది.. తన భావి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయంలో తల్లీతండ్రులమైన మా యిరువురికీ చెప్పకుండా.. మేము వూర్లో లేని సమయంలో అలా ఎందుకు చేశాడు?.. తాను మాతో సీతను పెండ్లి చేసికోదలచానని చెబితే.. వ్యతిరేకంగా కాదంటామని.. అంగీకరించమనీ.. అలాంటి నిర్ణయం తీసికొన్నాడా!..’ కళ్ళు మూసుకొని తెగని ఆలోచనలో మునిగి పోయారు శాస్త్రిగారు.
దుఃఖాన్ని దిగమ్రింగి.. పవిటతో కన్నీటితీని తుడుచుకొని సావిత్రి శాస్త్రిగారి ముఖంలోకి చూచింది. “ఏమండీ!..” మెల్లగా పిలిచింది.
కళ్ళు తెరచి సావిత్రి ముఖంలోకి చూచారు శాస్త్రిగారు..
“ఇప్పుడు మనం ఏం చేయాలండీ!..” దీనంగా అడిగింది సావిత్రి. కొన్ని క్షణాల తర్వాత శాస్త్రిగారు..
“సీతను జాగ్రత్తగా చూచుకోవాలి సావిత్రి!.. ఆమె భోంచేసిందా!..”
“వంటగదికి వచ్చి నాతో తనకు వాంతి వచ్చేలా వుందని.. ఆకలిగా లేదని.. నిద్ర పోవాలని.. చెప్పి తన గదికి వెళ్ళిపోయింది..”
“ఆమెను నీవు ఏమైనా అన్నావా!..”
“లేదండి..”
“హుఁ.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది!..” సాలోచనగా చెప్పారు శాస్త్రిగారు.
“తప్పంతా తనదేనని.. ఆది..” సావిత్రి పూర్తి చేయక మునుపే.. శాస్త్రిగారు..
“సవ్వడి రెండు చేతులు కలిస్తే కదా రాగలదు సావిత్రీ!..” విరక్తిగా నవ్వారు శాస్త్రిగారు.
“వదినగారికి విషయాన్ని..”
“చెప్పవలసిన రీతిలో నీవు చెప్పాలి.. అది ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది. సీతను దోషిగా చూడకు. ఆమె నీలాగే ఈ ఇంటి కోడలు.. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు మన వంశపు వారసత్వం..” ఎంతో గంభీరంగా చెప్పారు శాస్త్రిగారు. కొన్ని క్షణాల తర్వాత..
“నాకు ఒకసారి సీతను చూడాలని వుంది వస్తావా!..” అన్నారు.
“వస్తానండీ!..” అంది సావిత్రి.
ఇరువురూ సీత గదిలో ప్రవేశించారు. వెల్లికిలా పడుకొని ఆది ఫొటోను గుండెలపై వుంచుకొని నిద్రపోతూ వుంది సీత. ఆమె చెక్కిళ్ళపై కళ్ళనుండి కారిన కన్నీరు చారలుగా గోచరించాయి శాస్త్రిగారికి, సావిత్రికి. ఆమె ముఖాన్ని కొన్ని క్షణాలు చూచిన తర్వాత.. శాస్త్రిగారు..
“సీత.. నా చెల్లెలి తీపి గురుతు. ఆమె ఇకపై అత్తయ్యవు.. తల్లివి నీవే సావిత్రీ!..” అన్నారు. సావిత్రి తల ఆడించింది. ఇరువురూ తన గదివైపుకు నడిచారు.
అధ్యాయం 52:
మరుదినం ఐదు గంటలకు లేచి నరసింహశాస్త్రి.. పాండురంగలు గోదావరి నదీ స్నానానికి వెళ్ళారు. సావిత్రి.. సుమతి స్నానాలు చేసి దినచర్యకు వుపక్రమించారు.
స్నానానంతరం.. వుదయ భాస్కరునికి అర్ఘ్యాన్ని సమర్పించి విశ్వశాంతికి దైవాన్ని ప్రార్థించి నరసింహశాస్త్రి, పాండు ఇంటికి బయలుదేరారు.
గడచిన రోజు సాయంత్రం.. రాబర్ట్ సుల్తాన్‌ను పిలిపించి.. శ్రీ అల్లూరి సీతారామరాజు గారిని గురించి తెలిసినవారు.. నీకు ఎవరైనా తెలుసా అని అడిగాడు. నాకు తెలియదని సుల్తాన్ వారికి జవాబు చెప్పాడు. నరసింహశాస్త్రిగారికి.. అద్వైత్ రాఘవలకు తెలిసి వుండవచ్చా!.. అనీ అడిగాడు.. వారికీ తెలియదని సుల్తాన్ జవాబు చెప్పి రాబర్ట్ బారి నుంచి తప్పించుకొన్నాడు.
కానీ రాఘవ తత్వం తెలిసిన సుల్తాన్.. అతన్ని జాగ్రత్తగా వుండవలసినదిగా చెప్పేటందుకు నరసింహశాస్త్రిగారి ఇంటికి ఆరు గంటలకు వచ్చాడు. నదికి స్నానానికి వెళ్ళి వున్నారని సావిత్రి చెప్పడంతో వారిని కలిసి కొనేటందుకు సుల్తాన్ గోదావరి నది వైపుకు నడిచాడు. దైవధ్యానంలో వున్న నరసింహశాస్త్రి గారిని చూచి ఒడ్డున వారి రాక కోసం నిలబడ్డాడు.
తనను సమీపించిన నరసింహశాస్త్రి గారికి నమస్కరించాడు సుల్తాన్.
“సుల్తాన్!.. ఏం విశేషం.. వుదయాన్నే వచ్చావు?..” చిరునవ్వుతో అడిగారు శాస్త్రిగారు.
“స్వామీ!.. మీతో మాట్లాడాలని వచ్చాను..”
“ఏ విషయాన్ని గురించి..”
“మన రాఘవ బాబును గురించి..”
శాస్త్రిగారు పాండు ముఖంలోకి చూచాడు. ఆ చూపులోని అర్థాన్ని గ్రహించిన పాండు..
“మామయ్యా! మీరు సుల్తాన్ భాయ్ మాట్లాడి రండి. నేను వెళతాను” అన్నాడు.
“అలాగే.. నీవు పద..” చెప్పారు శాస్త్రిగారు.
పాండు వేగంగా ఇంటి వైపుకు నడిచాడు.
“స్వామీ!..”
“చెప్పు సుల్తాన్!..”
“తెల్ల నాయాళ్ళు ఎలాగైనాసరే శ్రీ అల్లూరి సీతారామరాజుగారిని పట్టుకోవాలని నిర్ణయించుకొన్నారు. రాబర్ట్ ఇంతవరకూ చేసిన ప్రయత్నాలు ఫలించనందున రూథర్‌ఫర్డ్ అనే మరో వ్యక్తిని కమీషనర్ నియమించి శ్రీ రాజుగారిని పట్టుకొనేటందుకు కలకత్తా నుండి పంపారు.”
“దానికి మనకు ఏమిటి సంబంధం సుల్తాన్!..”
“వుందయ్యా!..”
“ఏమిటది!..”
“శ్రీ సీతారామరాజుగారి ఉనికి, తెలిసికొనేటందుకు వారు ఇంతవరకూ చాలామందిని విచారించారు. మన రాఘవ బాబు.. మీద.. రాబర్ట్‌కు అనుమానం.. ఆ కారణంగా నన్ను పిలిపించి మన కుటుంబ సభ్యులకు శ్రీరాజు గారితో పరిచయం వుందా లేదా అని అడిగారు. నేను లేదని చెప్పాను”
“అందుకు వారు ఏమన్నారు!..”
“శ్రీరాజు గారికి పరిచయమున్న వారిని తమ వద్దకు తీసుకురమ్మన్నారు.”
“మన కుటుంబంలో ఎవరికీ శ్రీరాజు గారితో పరిచయం లేదే?..”
“మన రాఘవ బాబు.. తన స్నేహితులతో శ్రీరాజు గారి గురించి మాట్లాడడం నేను వినియున్నాను. కనుక.. మీరు మన రాఘవను ఆ విషయాల్లో తల దూర్చకుండా జాగ్రత్తగా ఉండమని భద్రాచలానికి ఉత్తరం వ్రాయండి.”
“రాబర్ట్‌కు ఇంకా మా మీద ద్వేషం పోలేదా సుల్తాన్!..”
“వాడు మనిషైతే మంచి మనుషుల తత్వాన్ని అర్థం చేసికోగలడు. వాడు రాక్షసుడు. మంచిని యీ జన్మలో వాడు అర్థం చేసికోలేడు. మీరు విశాఖపట్నం వెళ్ళియుండగా..” ఆవేశంతో చెప్పే సుల్తాన్.. ఆగిపోయాడు. నరసింహశాస్త్రిగారు పరీక్షగా సుల్తాన్ ముఖంలోకి చూచారు. సుల్తాన్ ఆందోళనతో తల దించుకొన్నాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడనే అభిప్రాయం నరసింహశాస్త్రిగారికి.. ఆవేశంలో నోరు జారానే.. అనే పశ్చాత్తాపం సుల్తాన్‌కు..
“మేము విశాఖ వెళ్లి వుండగా ఏం జరిగింది సుల్తాన్.. ఆపేశావేం! చెప్పు..”
‘వీరిముందు అబద్ధం చెప్పకూడదు. జారిన మాటకు సంబంధించిన విషయాన్ని వారికి పూర్తిగా చెప్పాలి’.. ఆ నిర్ణయానికి వచ్చిన సుల్తాన్..
“అయ్యా!.. రాబర్ట్ తనకు కర్నల్ ప్రమోషన్ వచ్చినందుకు తన ముఖ్యులకందరికీ పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి వాడు మన అద్వైత్ బాబుగారిని కూడా ఆహ్వానించాడు. మన బాబుగారు ఆ పార్టీకి హాజరైనారు. రాబర్ట్ గాడు బాబు చేత బలవంతంగా త్రాగించాడు. బాబు.. మైకంలో అందరి ముందూ.. రాబర్ట్‌కు అతనిలోని చెడ్డగుణాలను గురించి విశదీకరించి.. మంచిగా, మనిషిగా బ్రతకమని చెప్పారు. అలవాటు లేని పని చేసిన కారణంగా బాబుగారు కైపుతో స్పృహ కోల్పోయారు. నేను వారిని మన ఇంటికి కార్లో చేర్చాను. జరిగిన దాంట్లో మన బాబుగారి తప్పేంలేదు. స్వామీ.. తప్పంతా ఆ రాబర్ట్ గాడిదే!..” వినయంగా చెప్పాడు సుల్తాన్.
సుల్తాన్ మాటలు శాస్త్రిగారిని ఆశ్చర్యంలో ముంచేశాయి.
“విషయం అదా సుల్తాన్!..” సాలోచనగా శూన్యంలోకి చూస్తూ
ఇరువురూ శాస్త్రిగారి యింటిని సమీపించారు.
“విషయం అదా సుల్తాన్!..” సాలోచనగా శూన్యంలోకి చూస్తూ అడిగారు శాస్త్రిగారు మరోసారి.
అవునన్నట్లు తల ఆడించాడు. వెళ్ళి వస్తానని వారికి చెప్పి వెళ్ళిపోయాడు. శాస్త్రిగారి హృదయంలోని సందేహాలకు.. జవాబు దొరికింది.
వసుంధర.. ఆరున్నరకు లేచి దంతధావనానికి పెరటు వైపు వెళ్ళింది. వంట ఇంటి కిటికీ గుండా ఆమెను చూచిన సావిత్రి వసుంధరకు కాఫీ సిద్ధం చేసింది.
సీత మేల్కొంది. గోడ గడియారాన్ని చూచింది. ఆరు ముక్కాలు అయింది. ఆ రోజు స్కూలు రీఓపనింగ్. తొమ్మిది గంటలకు స్కూలుకు బయలుదేరాలి. మంచం దిగి హాల్లోకి వచ్చింది. అక్కడ ఎవరూ లేనందున ఎంతో ప్రశాంతంగా వున్నట్లనిపించింది.
‘అత్తయ్యకు మాంగల్యాన్ని చూపించి నా హృదయ భారాన్ని దించుకొన్నాను. నన్ను గురించి.. బావను గురించి తాను ఏమనుకొని వుంటుందో.. రాత్రి విషయాన్ని మామయ్యకు తాను తప్పక చెప్పి వుంటుంది. మామయ్య ఏ విషయంలోని త్వరపడి నిర్ణయాలు తీసికోరు. అంతేకాదు, ఎదుటి వారు చెప్పిన విషయాన్ని గురించి, వినడంతోనే వారి అభిప్రాయాన్ని బయటికి చెప్పరు. సావధానంగా ఆలోచించి.. న్యాయాన్యాయ విచక్షణ చేసి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. మరి.. తన విషయంలో ఎలాంటి నిర్ణయానికి వచ్చారో.. నన్ను గురించి బావను గురించి ఏమనుకొన్నారో!.. అత్తయ్యతో ఏమి చెప్పారో!.. నా వూహకందని విషయాలు..’
ఈ ఆలోచనలతో సీత వరండాలోకి వచ్చింది. వరండాను సమీపించ బోతున్న నరసింహశాస్త్రిగారిని చూచింది. ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కు తిరిగి లోనికి నడవబోయింది.
“అమ్మా!.. సీతా!..” అన్న నరసింహశాస్త్రి గారి పిలుపును విని ఆగిపోయింది.
నరసింహశాస్త్రిగారు వరండాలో ప్రవేశించారు. తనకు వీపును మళ్ళించి తలదించుకొని నిలబడివున్న సీతను పరీక్షగా చూచారు.
“నా వైపు తిరుగమ్మా!..” మెల్లగా చెప్పారు శాస్త్రిగారు.
వంచిన తలను పైకి ఎత్తకుండానే మెల్లగా వెనక్కు తిరిగింది సీత. ఆ క్షణంలో భయంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
“నేను నేరం చేశాను మామయ్యా!.. నన్ను క్షమించండి..” వంగి మోకాళ్ళ పైన కూర్చొని వారి పాదాలను తాకింది సీత.
ఆమె కళ్ళ నుండి కారిన కన్నీరు నరసింహశాస్త్రిగారి పాదాలపై పడ్డాయి. ఎంతో వేడిగా వున్న ఆ కన్నీరు స్పర్శకు నరసింహశాస్త్రిగారి ఒళ్ళు జలదరించింది. వంగి తన చేతులతో ఆమె భుజాలను పట్టుకొని పైకి లేపారు శాస్త్రిగారు.
“నాకు నీ మీదకాని.. ఆది మీద కాని.. ఎలాంటి కోపం లేదమ్మా!.. భయపడకు.. బాధపడకు. అంతా విధి నిర్ణయం. మనం నిమిత్తమాత్రులం.. విధిని ధిక్కరించే శక్తి యీ సృష్టిలో ఎవ్వరికీ లేదు.. అంతా ఆ దైవ నిర్ణయానుసారంగానే జరిగింది అనుకో!..” ఎంతో అనునయంగా చెప్పారు నరసింహశాస్త్రి గారు.
పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన వసుంధర శాస్త్రిగారి మాటలను విన్నది.
సీత మౌనంగా తన గదిలోనికి వెళ్లిపోయింది.
“ఏమిటిరా!.. నరసింహ నీవు అంటున్నది.. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు..” అంది.
“అక్కా!.. సావిత్రి నీతో ఏమైనా చెప్పిందా!..”
కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చిన సావిత్రి, వారి మాటను విని తల దించుకొంది.
నరసింహశాస్త్రి సావిత్రి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచారు.
“వదిన గారు పావుగంట ముందు లేచి పెరటివైపుకు వెళ్ళారు. నేను వంట యింట్లో వున్నానండీ.. కారణంగా..” చెప్పడం ఆపింది సావిత్రి.
‘సరే’ అన్ననట్లు తల ఆడించి నరసింహశాస్త్రిగారు.. “అక్కా.. నీ వాంఛ నెరవేరింది. మనం విశాఖపట్నం వెళ్లి వుండగా.. మన అద్వైత్ సీతలు.. వివాహం చేసికొన్నారు. మిగతా విషయాలు సావిత్రి చెబుతుంది.” భార్య ముఖంలోకి చూచి నరసింహశాస్త్రి తన గదికి వెళ్ళిపోయారు.
“ఏమిటీ!..” ఆశ్చర్యంతో దీర్ఘం తీస్తూ వసుంధర హాల్లోని కుర్చీలో కూలబడింది.
సావిత్రి ఆమెను సమీపించి కాఫీ గ్లాసును అందించి నవ్వుతూ వసుంధర ముఖంలోకి చూచింది.
(ఇంకా ఉంది)