అద్వైత్ ఇండియా-29

0
2

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[భద్రాచల ప్రాంతపు అడవుల్లో రాఘవకి బాస్ ఫారెస్టు ఆఫీసర్ రిచ్చర్డ్. ఇతను రాబర్ట్ తమ్ముడు. స్థానికులను గుప్పిట్లో పెట్టుకుని కలపని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేవాడు. గిరిజన స్త్రీలను బెదిరించి లోబరుచుకునేవాడు. అతడి కన్ను గూడెం నాయకుడు గంటన్న కూతురు వెన్నెలపై పడుతుంది. దళారుల ద్వారా ఆమెకు కబురు పంపుతాడు. చీదరించుకుని, ఆ విషయాన్ని తండ్రికి చెబుతుంది. గంటన్న రాఘవకి చెప్తాడు. రాఘవ, గంటన్న కలిసి – రిచర్డ్‌కి బుద్ధి చెప్తామని వెళ్తారు. ఆ సమయంలో అతను సహచరులతో మద్యం తాగుతూ, గతంలో తాను బండిలో వెళ్తున్న భార్యాభర్తలని కాల్చి చంపానని, తన గురి ఎన్నటికీ తప్పదని అంటాడు. ఆ మాటలు విన్న రాఘవ, అతను చంపినది తన తల్లిదండ్రులనే అని గ్రహిస్తాడు. తాను రిచర్డ్‌ని చంపుతానని గంటన్నని చెప్తాడు. వాడు తన తల్లిదండ్రులని చంపాడని గంటన్నకి చెప్తాడు. ఆ రాత్రి గంటన్న ఇంట్లో ఏడుస్తూ పడుకుండిపోతాడు. మర్నాడు ఉదయం బయల్దేరుతుంటే, రిచర్డ్ సంగతి తనకి వదిలేయమని, కోపతాపలకు పోయి కష్టాలపాలవ్వద్దని చెప్తాడు గంటన్న. సరేనని రాఘవ తన ఇంటికి వచ్చేస్తాడు. మనవరాలు సీత ఎవరికీ తెలియకుండా అద్వైత్‍ను పెళ్ళి చేసుకుందని బాధపడిన వసుంధర – కనీసం రాఘవ వివాహమైనా తన చేతుల మీదుగా చేయించాలని అనుకుంటుంది. రాఘవకి కల్యాణ యోగం ఎప్పుడూ జాతకంలో చూసి చెప్పమని శాస్త్రిగారిని అడుగుతుంది. జాతకం చూసిన శాస్త్రిగారు విస్తుపోతారు. రాఘవకి మృత్యుగండం ఉన్నట్టు తెలుస్తుంది. రాఘవని హెచ్చరించాలని వెంటనే ఆయన భద్రాచలం బయల్దేరుతారు. – ఇక చదవండి.]

అధ్యాయం 57:

[dropcap]భ[/dropcap]ద్రాచలానికి ఉదయం ఆరుగంటలకు చేరారు నరసింహశాస్త్రి. విచారించి రాఘవ నిలయానికి చేరారు. తలుపు తట్టిన సవ్వడిని విని లేచి రాఘవ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడి వున్న నరసింహశాస్త్రిగారిని చూచి ఆశ్చర్యపోయాడు.

“మామయ్యా!.. మీరా!..”

అవునన్నట్లు తల పంకించారు శాస్త్రిగారు.

“పద రాఘవా!.. నదికి వెళ్ళి స్నానం చేసి సీతారామచంద్రమూర్తులను.. వీర హనుమానుల వారిని దర్శించి వద్దాం..” అన్నారు శాస్త్రిగారు.

ఇరువురు గోదావరీ నది సమీపించి, స్నానం చేసి.. ఆలయంలో ప్రవేశించి ఆ దేవతా మూర్తులను దర్శించి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలను చేసి.. తీర్థ ప్రసాదాలను స్వీకరించి వెలుపలికి వచ్చి పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించి మెట్లు దిగి వీధిలో ప్రవేశించారు.

బ్రాహ్మణ హోటల్లో అల్పాహారాన్ని సేవించారు. రాఘవ నిలయానికి చేరారు ఆ మామ అల్లుళ్ళు.

కుర్చీలో కూర్చున్నారు నరసింహశాస్త్రి. రాఘవ ముఖంలోకి పరీక్షగా చూచారు.

“మామయ్యా!.. ఏమిటి వింతగా చూస్తున్నారు?.. యీ ముఖాన్ని తీర్చిదిద్దింది మీరే కదా!..” చిరునవ్వుతో అడిగాడు రాఘవ.

“రాఘవా!..”

“చెప్పండి మామయ్యా!..”

“ఆలయంలో దేవుణ్ణి ఏమని వేడుకొన్నావు నాయనా!..”

“నా కోర్కెను నెరవేర్చమని కోరుకున్నాను..”

“ఏమిటి నీ కోరిక!..”

“పగ తీర్చుకోవడం మామయ్యా!..”

“పగ!..” ఆశ్చర్యంతో అడిగారు శాస్త్రిగారు.

“ఎవరి మీద?..”

“నా తల్లిదండ్రులను చంపిన వారి మీద..”

“అది ఒక వ్యక్తి కాదు. పెద్ద సంస్థ. దేశాన్నే శాసించే అధికారం వున్న గొప్ప దండు”

“దండు ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు మామయ్యా!.. కానీ నా తల్లిని తండ్రిని కాల్చి చంపినవాడు ఒక్కడేగా!..”

“ఆ ఒక్కడిని నీవు ఎలా వెతకగలవు రాఘవా!..” ఆశ్చర్యంతో అడిగారు నరసింహశాస్త్రి.

“నేను వెదకవలసిన అవసరం లేదు మామయ్యా!.. వాడు నా ముందే వున్నాడు..”

“అంటే వాడు..”

“నా బాస్ రిచ్చర్డ్.. ఫారెస్ట్ ఆఫీసర్.. రాబర్ట్ తమ్ముడు!..”

“నేను యిక్కడికి ఎందుకు వచ్చానో అడగలేదే రాఘవా!..”

“మిమ్మల్ని నేను అలాంటి ప్రశ్నను ఎలా అడగగలను మామయ్యా!…”

“పాపం.. శ్రీ అల్లూరి సీతారామరాజుగారిని..”

“తెల్లరాక్షస గుంపు కాల్చి చంపేశారు..” శూన్యంలోకి చూస్తూ విచారంగా చెప్పాడు రాఘవ.

“వారి మరణానికి కారణం ఏమిటో నీకు తెలుసా!..”

“ఆటవీకులకు అండగా నిలచి.. వారి స్వాతంత్య్ర జీవనాన్ని వారికి ప్రసాదించాలని ప్రయత్నించినందుకు..”

“ఆ పోరాట పర్యవసానం.. వారి మరణం.. అవునా!..”

“అవును..”

“నీవు సాగించాలనుకొన్న ప్రయత్నపు పర్యవసానం.. నీకు అనుకూలం కాదు రాఘవా!..”

“మామయ్యా!… లక్ష్యవాదికి.. ముఖ్యం లక్ష్యం.. లక్ష్యంలేనివాడు లక్ష్యవాది కాలేడు మామయ్యా!.. శ్రీ అల్లూరి సీతారామరాజుగారు ఎంతో గొప్ప లక్ష్యవాది.. జీవితపు చివరి ఘడియల వరకూ వారు.. వారి లక్ష్యాన్ని విడువలేదు. తెల్లకోతులకు భయపడలేదు. మీకు తెలియనిది అంటూ లేదు. యీ సృష్టిలో పుట్టిన ప్రతి జీవరాశి ఏదో ఒకనాడు నేల రాలిపోవలసిందే. ఒక లక్ష్యసాధనా పోరాటంలో అంతం అయ్యే దానికి.. తలలు మార్చి బ్రతుకుతూ అంతం అయ్యేదానికి వున్న వ్యత్యాసం.. యీ భూమికి ఆ ఆకాశానికి వున్నంత. ద్వాపరయుగ గాథ.. మహాభారత కథ.. మన పంచమవేదంలోని దానవీరశూరకర్ణుడు.. నిన్నటి సింహ కిశోరం శ్రీ అల్లూరి సీతారామరాజుగారు.. జీవిత గాథ ముగిసింది వారి లక్ష్యసాధనా పోరాటంలోనే.. అందుకే వారు అమరులు.. యీ దేశ సుచరిత్రలో వారి త్యాగం సువర్ణాక్షరాలతో మెరస్తూ ముందు తరాల వారికి లక్ష్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతాయి” ఆవేశంగా చెప్పిన రాఘవ ఆగిపోయాడు.

తల నుండి కాళ్ళ వరకూ.. రాఘవను పరీక్షగా చూచారు నరసింహశాస్త్రి గారు.

“మామయ్యా!.. మరొక్కమాట. సత్యం ధర్మం న్యాయం నీతి నిజాయితీలను గురించి చెప్పే మీలాంటి వారిని నేటి సమాజంలో కొందరు పిచ్చివాళ్ళ క్రింద జమ కట్టేస్తున్నారు. చిన్నచూపు చూస్తున్నారు. వారు ఎరిగి పాటించే స్వార్థం ద్వేషం కుట్ర కుతంత్రం మోసం, జీవిత గమనానికి సరైన మార్గాలని ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ లక్షణాలన్నీ మనవారు తెల్లవారి నుండి అభ్యసించినవే.. మొదటి ఐదు లక్షణాలు.. ప్రేమను స్నేహాన్ని సౌధాత్రాన్ని ఏకతను సృష్టిస్తే.. రెండవ ఐదు లక్షణాలు పగ.. ప్రతీకారాలను సృష్టిస్తున్నాయి. నేడు దేశంలో మొదటి వర్గం కంటే రెండవ వర్గం అధికం.. రెండవ జాతి లక్షణాలకు మొదటి వర్గ లక్షణాలు కల జాతి, భయపడుతూ వుంది. అది అలాగే కొనసాగితే ఆ లక్షణాలు మనుషుల్లో నశించిపోతాయి.. అవి గొప్పగా బ్రతకాలి.. అంటే.. మొదటి వర్గం నుండి జాతిని జాగృతి పరచేటందుకు ఒక వ్యక్తి ముందుకు రావాలి. ఆ పైశాచిక లక్షణాలున్న వారిలో ఒక్కణ్నైనా అంతం చేయాలి. ఆ సంఘటన.. ఆ రెండవ వర్గం వేగం తగ్గేదానికి ఆస్కారం అవుతుంది. అప్పుడప్పుడూ అలాంటి సంఘటన, ప్రతిఘటనలు జరగకపోతే మంచికి మానవత్వానికి ప్రతిరూపాలయిన మానవుల మనుగడ దుర్భరమౌతుంది. వీరూ.. బ్రతుకు జీవుడా అని వారిలా మారిపోవలసిన స్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితి నా జాతికి పట్టడం నాకు యిష్టంలేదు..” రాఘవ ఆపాడు.

“అంటే!..” ఆశ్చర్యంతో అడిగారు నరసింహశాస్త్రిగారు.

“మామయ్యా!.. నా దృష్టిలో రిచ్చర్డ్ ద్రోహి.. వాడిని అంతం చేయడం నా లక్ష్యం!..”

“రాఘవా!.. నీ లక్ష్యం మారదా!..”

“క్షణాల్లో మారే సంకల్పం.. లక్ష్యం ఎలా అవుతుంది మామయ్యా!.. నాది దృఢ లక్ష్యం.. అది కార్యరూపం దాల్చిన నాడే దానికి శాంతి”

“యీ నీ లక్ష్యసాధనలో నీవు..” ఆగిపోయారు నరసింహశాస్త్రిగారు.

“మరణించినా.. నాకు ఆనందమే మామయ్యా!..” నవ్వాడు రాఘవ.

“రాఘవా!.. నేను చెప్పిన మాట నీకు అర్థం అయిందా!..”

“అయింది మామయ్యా!.. చచ్చిపోబోతానంటారు మీరు.. లక్ష్యసిద్ధికి చచ్చిపోవడంలో ఎంతో ఆనందం వుంటుంది మామయ్యా!..” చిరునవ్వుతో నిర్లక్ష్యంగా చెప్పాడు రాఘవ.

నరసింహశాస్త్రిగారు నిట్టూర్చి కళ్ళు మూసుకొన్నారు.

కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడచిపోయాయి.

నరసింహశాస్త్రిగారు కుర్చీ నుండి లేచారు.

“రాఘవా!.. నేను బయలుదేరుతున్నాను..” మెల్లగా చెప్పారు నరసింహశాస్త్రిగారు.

“మామయ్యా!.. సీతను జాగ్రత్తగా చూచుకోండి..”

నరసింహశాస్త్రి తల ఆడించి ముందుకు నడిచి వీధిలో ప్రవేశించారు. రాఘవ వారి వెనకాలే వీధిలోనికి వచ్చారు. పది అడుగులు వేసి శాస్త్రిగారు వెను తిరిగి చూచారు. రాఘవ చేతిపై కెత్తి “మామయ్యా.. సీత.. జాగ్రత్త..” అన్నాడు. క్షణం సేపు రాఘవను చూచి వేగంగా ముందుకు నడిచారు శాస్త్రిగారు.

అధ్యాయం 58:

అద్వైత్.. లండన్ వెళ్ళి ఎనిమిది నెలలు అయింది. అక్కడ అతనికి ఎందరో అభిమానులు శిష్యులు శిష్యురాండ్రు ఏర్పడ్డారు. దినానికి పన్నెండు నుంచి పదహారు గంటలు శ్రమించి నాట్యాన్ని నేర్చుకొన వచ్చిన వారికి నాట్యాన్ని నేర్పించేవాడు. ఇండియా గడచిన ఎనిమిది నెలల్లో అతనికి ఎంతో సన్నిహితురాలయింది. అతని కార్యకలాపాల్లో అన్ని విధాలా సాయంగా వుండేది. టైమ్ ప్రకారం భోజనం.. కాఫీ.. టిఫిన్‌ను అందించేది. అద్వైత్ ఆ కుటుంబ సభ్యులలో ఒకడిగా మారిపోయాడు.

ఇండియా.. ‘నేను చూచిన ఇండియా’ అను పేర ఆంగ్లంలో ఒక నవలను వ్రాయసాగింది. పగలు తీరిక లేనందున రచనను రాత్రి ఒంటిగంట వరకూ సాగించేది. ఆమె రచనకు అద్వైత్ ఎంతగానో సహకరించి మన హైందవ పద్ధతులను పాటించే ధర్మాలను.. ఆచార వ్యవహారాలను భిన్నత్వంలో ఏకత్వంతో సహజీవనం చేస్తున్న మన దేశవాసుల మనస్తత్వాలను.. మన అద్వైత సిద్ధాంతాలను విధానాలను ఇండియాకు చెప్పేవాడు. ముందు అద్వైత్ చెప్పేటప్పుడు రఫ్ వ్రాసుకొని.. తర్వాత ప్రశాంతంగా నిశీధి సమయంలో నవలను వ్రాయసాగింది.

ఆ నవలలో తన నాట్యాభ్యాసాన్ని గురించి.. తన గురూజీ నరసింహశాస్త్రి గారిని గురించి.. అద్వైత్ సీతలను గురించి.. సావిత్రి వసుంధరలను గురించీ వారంతా తనతో ఏ రీతిగా ఎంతో అభిమానంగా.. నడచుకొన్నదీ.. ఆంగ్లపాలకుల అరాచక పాలనా విధానాలను గురించీ.. విశదంగా వ్రాసింది ఇండియా.

అమ్మమ్మ మేరీ.. ప్రొఫెసర్ కాబట్టి ఇండియా వ్రాసిన దాన్ని చదివి ఎక్కడైనా భాషా దోషం.. సన్నివేశ వివరణం ఆమెకు సరిగా లేదని తోచిన చోట మార్చి వ్రాసి ఇండియాకు యిచ్చేది.

ఆ పుస్తక రచన నెలరోజుల ముందుగా ముగిసింది. ముగింపు అద్వైత్‌తో తాను లండన్ చేరి డాన్స్ స్కూలు ప్రారంభించేంత వరకూ పుస్తక ప్రచురణ జరిగింది. వెయ్యి కాపీలు అచ్చువేయబడ్డాయి. చివరన అంకితం క్రింద తన గురూజీ నరసింహశాస్త్రి గారి గుణగణాలను విశ్లేషించి.. వారి దివ్యపాదపద్మాలకు అని వ్రాసింది ఇండియా.

ప్రచురించబడ్డ పుస్తకాన్ని చూచి అద్వైత్.. ముందు పేజీలోనే వున్న తన తండ్రిగారి ఫోటోను.. వారిని గురించి ఇండియా వ్రాసిన మాటలను చదివి ఆశ్చర్యపోయాడు.

పేజీ త్రిప్పగా.. తన ఫోటోను క్రింద నవలా రచన సహకారకర్తగా తన పేరును వ్రాసి తన గుణగణాలను విశ్లేషించి వ్రాసిన తీరుకు అద్వైత్‍కు ఎంతో ఆనందం కలిగింది.

ఆండ్రియా మేరీలకు.. ఇండియా అంటే పంచప్రాణాలు. అద్వైత్ ఇండియాలకు వివాహం చేయాలని వారి సంకల్పం.. ఆ అభిప్రాయంతోనే అద్వైత‌ను లండన్‌కు తీసికొని వెళ్ళిన మేరీ.. వారిరువురి సన్నిహిత చర్యలను చూచి పరమానంద భరితులరాలయింది.

మేరీ.. సమయం చూచి తన నిర్ణయాన్ని అద్వైత్‍కు చెప్పమని ఇండియాకు సలహా యిచ్చింది.. లండన్‌లో అద్వైత్ ఇండియాలు కలిసి తిరగడం.. నాట్యపు స్కూలును నడపడం.. అతని సలహాలతో తాను ‘నేను చూచిన ఇండియా’ నవలను వ్రాయడం.. దానికి సాటి సమాజంలో ఎంతో ఆదరణం లభించడం.. కారణంగా అద్వైత్.. ఇండియా మనస్సున బలంగా తిష్ట వేశాడు. అద్వైత్ లోని ఓర్పు నేర్పు.. పెద్దల యందు అతను చూపే గౌరవం.. ఎంతో సౌమ్యంగా మాట్లాడే విధానం.. అన్ని విషయాలలో అతనికి ఉన్న పరిజ్ఞానం.. ఇండియాను ఎంతగానో ఆకర్షించాయి. తగిన సమయం చూచి తన నిర్ణయాన్ని అద్వైత్‍కు తెలియజేయాలని నిర్ణయించుకొంది ఇండియా.

అద్వైత్.. తండ్రిగారి దగ్గర నుంచి ఉత్తరాన్ని చదివిన రోజున అక్కడి వారందరినీ తలుచుకొనేవాడు కొంతసేపు. సీతను కూడా అలాగే తలచుకొనేవాడు. త్వరగా వెళ్ళి సీతను అందరినీ కలవాలనుకొనేవాడు. దినచర్యను ప్రారంభించిన తర్వాత.. అతని దృష్టి అంతా తన కర్తవ్య నిర్వహణ పట్లనే వుండేది.. తన మూలంగా ఇండియాలో సీతకు ఎదురైన సమస్య అతనికి తెలియని కారణంగా వారిరువురి మధ్యన ఏర్పడిన బంధాన్ని తలచుకొని నవ్వుకొనేవాడు.

‘సీతా!.. నన్ను నీవు గెలుచుకొన్నావ్!..’ అనుకొనేవాడు. ధనము.. పేరు ప్రఖ్యాతులు.. లభించాయి అద్వైత్‍కు ఇండియా కుటుంబీకుల సహకారంతో..

ఆ రోజు.. ఇండియా పుట్టినరోజు. ఆండ్రియా స్నేహితులను బంధువులను ఆహ్వానించింది. సాయంత్రం.. ఏడు గంటలకు అందరూ వచ్చారు.

ఆ ముందురోజు ఇండియా అద్వైత్‍ను ఓ పెద్ద షాప్‍కు తీసికొని వెళ్ళి ఖరీదైన సూట‌ను కొనిచ్చింది. వాటిని చూచి..

“ఇండియా!.. ఇప్పుడు నాకు ఇంత ఖరీదైన దుస్తులు అవసరమా!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“నాకు అవసరం..”

“అయితే ఇవి నీకా!..” నవ్వాడు అద్వైత్.

“నావారికి..”

“అలాగా!..”

“అవును..”

“వారెవరో తెలుసుకోవచ్చా!..”

“ఇప్పుడు కాదు రేపు..” అందంగా నవ్వింది ఇండియా ప్రీతిగా అతని ముఖంలోకి చూస్తూ.

“నీవు అలా నవ్వితే నా మతిపోతూ వుంది ఇండియా”

“ఎక్కడికి పోతూ వుంది?..”

“ఎక్కడెక్కడికో!..”

“నన్ను దాటి పోలేదు..” మరోసారి అందంగా నవ్వింది ఇండియా.

అద్వైత్ ఆశ్చర్యంతో ఇండియా ముఖంలోకి చూచాడు.

“చూచింది చాలుగానీ.. గురూజీ నడవండి..” సూట్ కవర్లను చేతికి తీసుకొని షాపు నుండి కాపువైపుకు నడిచింది ఇండియా. అద్వైత్ ఆమెను అనుసరించాడు.

పార్టీకి వచ్చిన వారికందరికీ ఆండ్రియా అద్వైత్‍ను పరిచయం చేసింది. తన స్నేహితులకు మిస్టర్ మూన్ పరిచయం చేశాడు. వారంతా అద్వైత్ ఫొటోను దినపత్రికల్లో చూచినవారే. కొందరి పిల్లలు అద్వైత్ నృత్యశిక్షణ పొందుతున్న కారణంగా ఆయా పిల్లల తల్లిదండ్రులకు అద్వైత్ సుపరిచితుడే. ఇండియా కొన్న సూట్లో అద్వైత్ అండరి కళ్ళకు ఎంతో సుందరంగా కనుపించాడు.

అందరూ అద్వైత్‍ను ప్రీతిగా పలకరించారు. కరచాలనం చేశారు. దొరల పార్టీ.. అందరూ విస్కీ సేవితులే ఆడ.. మగ.

ఆండ్రియా చెప్పగా.. ఇండియా అద్వైత్‍ను సమీపించింది.

“సార్!.. చిన్నమాట..”

“ఏమిటది?..”

“నేను.. కేక్ కట్ చేయడానికి సాయం చేస్తారా!..”

“ఒకటి కాదు వంద కట్ చెయ్యి. నీ ప్రక్కనే వుంటాను..”

ఇరువురూ టేబుల్‍ను సమీపించారు. ఇండియా చేతికి అద్వైత్ కత్తిని అందించాడు. ఇండియా కేక‌పై కత్తిని వుంచింది.

“సాయం చేస్తానన్నారుగా!..” అంది ఇండియా అద్వైత్ ముఖంలోకి చూస్తూ..

అద్వైత్ నవ్వుతూ కత్తి పై తన చూపుడు వ్రేలిని వుంచి నొక్కాడు. కేక్ కట్ అయింది.

“ముక్కలను మీరు చేయాలి..” అంది ఇండియా.

నవ్వుతూ ఆమె చేతిలోని కత్తిని అందుకొని కేక్‍ను ముక్కలుగా చేశాడు అద్వైత్.

ఇండియా నోటిని తెరచింది.

అద్వైత్ కేక్ ముక్కను ఇండియా నోటవుంచి చప్పట్లు కొడుతూ

“మెనీ మెనీ రిటన్స్ ఆఫ్ ద డే.. ఇండియా..” స్వచ్ఛమైన నవ్వును నవ్వాడు అద్వైత్. “హృదయపూర్వక ధన్యవాదములు..” చిరునవ్వుతో అంది ఇండియా.

కొందరు ఆశ్చర్యంతో ఇండియాను చూచారు.

వారి చూపులను గమనించిన అద్వైత్.. “నథింగ్ వండర్.. ఐ యాం ఎ తెలుగు మ్యాన్ ఫ్రమ్ ఇండియా. షి హాజ్ కన్వేడ్ థ్యాంక్స్ ఇన్ తెలుగు.. షి లెర్న్‌డ్ తెలుగు ఫ్రం మీ..” నవ్వుతూ చెప్పాడు అద్వైత్.

అందరి కరతాళ ధ్వనులూ.. ఆ హాలులో మారుమ్రోగాయి.

ఆండ్రియా మూన్ మేరీలు కేక్ ముక్కను ఇండియా నోటికి అందించారు.

ఇండియా ప్రీతిగా.. అద్వైత్ ముఖంలోకి చూచి కేక్‍ను అతని నోటికి అందించింది. చిరునవ్వుతో స్వీకరించాడు అద్వైత్.

“హి యీజ్ మై స్మాల్ గురూజీ!..” అందరినీ చూస్తూ చెప్పింది ఇండియా.

అందరూ కలసి ‘హ్యాపీ బర్త్ డే’ పాటను లయబద్ధంగా పాడారు.

నౌకర్లు.. అందరి చేతికి గ్లాసులను అందించారు. ‘ఛియర్స్’ చెప్పు కొని ఆడమగ ఆనందంగా త్రాగడం ప్రారంభించారు.

ఆండ్రియా ఇండియా ముఖంలోకి చూచింది. ఆమె అభిప్రాయాన్ని గ్రహించిన ఇండియా అద్వైత్‍ను సమీపించి.. “మీరు.. త్రాగుతారా!.. ఇది అమ్మమాట!..”

“మీ అమ్మ నిన్ను చూచినప్పుడు.. నేను వారి ముఖాన్ని చూచాను. నీవు త్రాగుతావా!..”

“మీరు త్రాగితే..”

“నేను త్రాగను. నాకు కూల్‍డ్రింక్ కావాలి”

“ఒక్కక్షణం..” వేగంగా వెళ్లిపోయి.. కొన్ని క్షణాల్లో రొండు గ్లాసులతో ఇండియా అద్వైత్‍ను సమీపించి గ్లాసును అందిస్తూ..

“సీకరించండి మహారాజా!…” నవ్వుతూ చెప్పింది.

అద్వైత్ గ్లాసును అందుకొని.. “నేను మహారాజును కాదు, ఇండియా!.. మీ అతిథిని..”

“నా దృష్టిలో మీరు మహారాజే.. రాజాధిరాజు..” ఓరకంట చూస్తూ చెప్పింది ఇండియా.

“నీ తెలుగు భాష ఉచ్చారణ.. నా మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇండియా!..” ఆనందంగా నవ్వాడు అద్వైత్.

“ఈ ఆనందకర సమయంలో గిఫ్ట్ మీరు నాకు ఏమి యిస్తారు” జేబునుంచి చిన్న పాకెట్ తీసి ఇండియాకు నవ్వుతూ అందించాడు అద్వైత్.

“ఇందులో ఏముంది?..”

“నీ మీద నాకు వున్న అభిమానం.. గౌరవం. విప్పి చూడు..”

ఇండియా పాకెట్‌ను విప్పి అందులో వున్న బంగారు రింగ్‍ను చేతికి తీసికొంది. అరచేతిలో వుంచుకొని.. “చాలా బాగుంది.. మీలాగే..”

“నేను నల్లవాణ్ణి.. అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం.. దానికి నాకూ పోటీయా…” నవ్వాడు అద్వైత్.

“దీన్ని నేను ఏం చేయాలి!..”

“ఉంగరాన్ని అందరూ ఏం చేస్తారు?..”

“వేలికి పెట్టుకొంటారు..”

“అదే పని నీవు చేయాలి..”

“ఆ పని మీరు చేస్తే నాకు ఎంతో ఆనందం..” అంది ఇండియా వెంటనే.. ఆమె చేతిలోని ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకొన్నాడు అద్వైత్.

ఆమె తన ఎడమ చేతిని వ్రేళ్ళను ముందుకు సాచింది. అద్వైత్ ఇండియా నాల్గవ వ్రేలికి వుంగరాన్ని ఎక్కించాడు. వ్రేలిని వదిలాడు. ఇండియా తన వ్రేలి వుంగరాన్ని చూస్తూ.. “ఇది నా జీవితాంతం నా దగ్గర మీ గుర్తుగా వుంటుంది” ప్రీతిగా అతని ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇండియా. ఆండ్రియా మేరీలు ఇండియాను సమీపించారు. వారికి ఇండియా తన వ్రేలిన వున్న ఉంగరాన్ని చూపించింది. వారు తృప్తిగా నవ్వారు. కొందరు ఇండియా బాల్య స్నేహితులు ఆమెను చుట్టుకొన్నారు. పరస్పర కుశల ప్రశ్నలతో.. జవాబులతో ఆనందంగా నవ్వుకొన్నారు. అందరి మధ్యన వున్నా.. దూరంగా వున్న అద్వైత్ వైపే ఆమె చూపులు..

బఫే డిన్నర్ ప్రారంభం అయింది. త్రాగుతూ కొందరు భోజనాన్ని ఆరగించడం ప్రారంభించారు.

అద్వైత్.. దగ్గరకు రమ్మని ఇండియాకు సౌజ్ఞ చేశాడు. తన చుట్టూ వున్నవారి మధ్య నుండి ఇండియా అద్వైత్‍ను సమీపించింది.

“ఇక నే వెళతాను ఇండియా..”

“ఎక్కడికి!..”

“నా గదికి..”

“సార్!.. మరి భోజనం!..”

“యిక్కడ అంతా నాన్‍వెజ్ ఏమో!..”

“మీ కోసం నేను వెజ్ తయారు చేయించననుకొన్నారా!..”

“అది కాదు..”

“ఏది కాదు.. మీతో పరిచయం అయిన తర్వాత.. ఇండియాలోనే నేను వెజిటేరియన్‍గా మారిపోయాను.”

“ఎందుకు మారావ్…”

“స్థిమితంగా ఆలోచించండి సమాధానం మీకే దొరుకుతుంది.. రండి భోం చేద్దురుగాని..”

తన కుడి చేతితో అతని ఎడమ చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ ముందుకు తీసికొని వెళ్ళింది ఇండియా. “కూర్చోండి.. ఐదు నిముషాల్లో వస్తాను..”

అద్వైత్ కూర్చున్నాడు.

ప్రక్క టేబుల్స్‌పై  కొందరు కూర్చొని భోజనాన్ని ఆరగిస్తున్నారు. కొందరు అద్వైత్‍ను విచిత్రంగా చూస్తున్నారు. ప్లేట్లో చపాతి కుర్మా.. మరో ప్లేట్లో పెరుగన్నంతో ఇండియా వచ్చి వాటిని టేబుల్ పైన వుంచి.. స్పూన‌ను అద్వైత్‍కు అందించింది.

“చపాతీని స్పూన్ తినాలా!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

అతని చేతిలోని స్పూన్ ఇండియా లాక్కొంది.

“సారీ!.. అంతా మీ వల్లే.. నాకు ఏదో కన్ఫ్యూజన్!..”

“నేను ఏం చేశాను..”

“భోం చేయకుండా వెళ్ళిపోతానన్నారుగా!..” బుంగమూతితో చిరుకోపాన్ని ప్రదర్శించింది ఇండియా.

“ఓ.. సారీ ఇండియా.. నిన్ను నొప్పించాలని నేను అలా అనలేదు. ఇవన్నీ నీవు ఏర్పాటు చేశావని నాకు తెలీదు కదా!.. యిక నేను తినవచ్చా!..” నవ్వాడు అద్వైత్.

“తినండి సార్!.. నేనూ తెచ్చుకొంటాను. మీకు కంపెనీ యివ్వాలిగా!..” వేగంగా వెళ్ళి అద్వైత్‍కు తాను ఇచ్చిన వాటిని తెచ్చుకొని.. అతనికి ఎదురుగా కూర్చొంది. పార్టీకి వచ్చిన వారిని గురించి మాట్లాడుకొంటూ భోజనాన్ని ముగించారు. ఆండ్రియా మేరీలకు చెప్పి అద్వైత్ తన గదికి వెళ్ళిపోయాడు.

ఇండియా వ్రాసిన “నేను చూచిన ఇండియా’ పుస్తకాన్ని చేతికి తీసికొన్నాడు. మంచంపై వాలాడు. నూట యాభై పేజీల ఆ పుస్తకంలో నూరు పేజీలు ఇంతకు ముందు చదివాడు. మిగతా పేజీలను చదవడం ప్రారంభించాడు.

ఇండియా.. తన తల్లికి.. అమ్మమ్మకు ‘గుడ్‌నైట్’ చెప్పి తన గదికి వెళ్ళి పడుకొంది. ఆమె మనస్సు నిండా అద్వైత్‌ను గురించిన ఆలోచనలు.. తన మనస్సులోని నిర్ణయాన్ని అద్వైత్‍కు ఎలా తెలియజేయాలి. నేరుగా చెప్పడమా!.. లేక కాగితంపై వ్రాసి ఇవ్వడమా!.. తెగని ఆలోచన.. పావుగంట తర్వాత.. వెళ్ళి అద్వైత‌‍ను కలవాలనుకొనే నిర్ణయానికి వచ్చింది ఇండియా. తన గది నుండి బయటికి వచ్చి అద్వైత్ వుండే అవుట్ హౌస్‍లో ప్రవేశించింది. వరండా వైపున వున్న కిటికీ గుండా లోనికి చూచింది. దీక్షగా పుస్తకాన్ని చదువుతున్నాడు అద్వైత్.

ఇండియా మెల్లగా తలుపును తోసింది. అది తెరచుకుంది. లోన ప్రవేశించింది. అద్వైత్ను చూస్తూ నిలబడింది. ప్రక్కకు తిరిగాడు అద్వైత్. ఇండియాను చూచాడు.

“ఇండియా!.. పడుకోలేదా!..”

“పడుకొన్నాను.. కానీ నిద్ర రావడం లేదు.. అందుకే..”

“నీకు ఎంతో యిష్టమైన వారిని తలచుకొంటూ కళ్ళు మూసుకొంటే హాయిగా నిద్ర పడుతుంది..” నవ్వాడు అద్వైత్.

“ఎందుకు నవ్వుతున్నారు..”

“నీ వాలకాన్ని చూచి..”

“ఏం బాగాలేనా!..”

“నీకేం తక్కువ.. చాలా బాగున్నావు..”

“బాగు అంటే!..”

“అందంగా అని..”

“మరి మీరు!..”

“నా గురించి నేను ఎలా చెప్పగలను!..”

“నేను చెప్పనా!..”

“వద్దు..”

“ఎందుకు వద్దన్నారు..”

“నన్ను నీవు పొగుడుతావు. పొగడ్తలు నాకు నచ్చవు!..”

“అవి యథార్థాలయితే!..”

“అయినా నాకు నచ్చవు..”

“నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా!..”

“చెప్పావుగా నిద్ర రాలేదని..”

“అది మాత్రమే కాదు..”

“మరి.. వేరే ఏమిటి!..”

ఇండియా అతన్ని సమీపించింది.

“మీ చేతిని సాచండి..”

“ఎందుకు?..”

“ప్లీజ్!…”

అద్వైత్ చేతిని సాచాడు.

తన ఎడం చేత్తో అద్వైత్ చేతిని పట్టుకొని.. తన వ్రేలికి వున్న ఉంగరాన్ని తీసి అతని వ్రేలికి తొడిగింది.

“మీరు నాకు ఉంగరాన్ని బహుమతిగా యిచ్చారు. నేను మీకు ఏదైనా యివ్వాలిగా.. అదే ఇది..” అందంగా నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూచింది ఇండియా.

అద్వైత్ క్షణంసేపు ఆమె కళ్ళల్లోకి చూచి.. తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“మాట్లాడకుండా తలను ప్రక్కకు త్రిప్పుకోవడం మీకు న్యాయమా!..”

“నేను ఎవరి విషయంలోనూ అన్యాయంగా వర్తించను ఇండియా!..”

“అంటే!..”

“నా తత్వాన్ని ఎరిగిన నీకు.. నేను ప్రత్యేకంగా చెప్పాలా!..”

“నా ఎరుక వేరు.. మీరు చెప్పడం వేరు కదా!.. ఉంగరం ఎలా వుందో చెప్పండి..” చిరునవ్వుతో అడిగింది ఇండియా.

“బదులుకు బదులుగా నీవు నాకు యివ్వడం.. నాకు నచ్చలేదు ఇండియా!..”

“మీకు నేను ఎప్పుడూ గుర్తు వుండాలని అలా చేశాను. సారీ!..” విచారంగా తల దించుకొంది ఇండియా. అద్వైత్ నవ్వాడు.

తలను పైకెత్తి అద్వైత్ కళ్ళల్లోకి క్షణంసేపు చూచి తలను దించుకొంది ఇండియా.

“నీవు అలా విచారంగా తలను దించుకొని వుంటే నేను నిన్ను చూడలేకున్నాను ఇండియా!..”

“మీరు చూడాలంటే నేను ఏం చేయాలి!..”

“సంతోషంగా నవ్వాలి!..”

“నవ్వితే.. నేను బాగుంటానా!..”

“ఎంతో.. ఎంతో.. బాగుంటావు..” నవ్వుతూ చెప్పాడు అద్వైత్.

“అంత బాగుంటానా!..”

“అవును.. అవును.. అవును..”

“మీ యిష్టప్రకారం నేను నవ్వితే నాకేమిస్తారు!..”

“నీవు కోరింది.. నా దగ్గర వున్నది..”

“తప్పకుండా!..”

“యీ అద్వైత్‌కు మాట తప్పే అలవాటు లేదు ఇండియా!..”

ఇండియా తన కుడి చేతిని సాచి.. “ప్రామిస్!..”

“యస్.. ప్రామిస్!..” అద్వైత్ తన కుడిచేతిని ఆమె చేతిలో వుంచాడు. ఇండియా అందంగా నవ్వింది.

“ఇండియా!.. నీవు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ వుండాలి..”

“మీరు.. ఇలాగే.. ఎప్పుడూ నా ఎదుట వుంటే.. నేను ఆనందంగా నవ్వుతూనే వుంటాను..”

“అది నాకు సాధ్యమా!..”

“మీరు తలచుకొంటే.. సాధ్యం కానిదంటూ లేదు..”

“మన అనుబంధం చాలా చిత్రమయింది!..” కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ చెప్పాడు అద్వైత్.. ఇండియా పరవశంతో అతన్నే చూస్తూ వుంది.

“నవలను చాలా అద్భుతంగా వ్రాశావు ఇండియా!..”

“ఆ నవలకు నాయకులు మీరే!.. ”

“చాలా పొద్దుపోయింది ఇండియా!.. వెళ్ళి పడుకో”

నవ్వుతూ ప్రీతిగా అద్వైత్ ముఖంలోకి చూచింది కొన్నిక్షణాలు.. “గుడ్‍నైట్..” చెప్పి వెళ్ళిపోయింది ఇండియా. అద్వైత్ ఆమెను గురించి ఆలోచిస్తూ పడకపై వాలాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here