అద్వైత్ ఇండియా-30

0
1

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఉదయం ఆరు గంటలకు భద్రాచలం చేరి, రాఘవ ఇల్లు కనుక్కుని వెళ్తారు శాస్త్రిగారు. తలుపు తట్టిన చప్పుడికి తలుపు తీసిన రాఘవ శాస్త్రిగారిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ కల్సి నదిలో స్నానం చేసి ఆలయంలో సీతారాములని దర్శించుకుని వస్తారు. ఓ బ్రాహ్మణ హోటల్‍లో టిఫిన్ తిని, ఇంటికి చేరుతారు. దేవుడిని ఏం కోరుకున్నావని శాస్త్రి గారు రాఘవని అడిగితే, తన తల్లిదండ్రులను చంపినవారిపై పగతీర్చుకునే అవకాశం ఇవ్వమని కోరుకున్నట్టు చెప్తాడు. అది ఒక వ్యక్తి కాదు, దేశాన్నే శాసించే సంస్థ, గొప్ప దండు ఉందని హెచ్చరిస్తారు శాస్త్రిగారు. ఎంత నచ్చజెప్పినా రాఘవ వినడు. తన తండ్రులని చంపినదెవరో తనకి ఎలా తెల్సిందో చెప్తాడు. అతని పగకి పర్యవసానం తీవ్రంగా ఉండవచ్చని అంటారు శాస్త్రిగారు. తాను అన్నిటికీ సిద్ధమై ఉన్నానని జవాబిస్తాడు రాఘవ. చేసేదేం లేక శాస్త్రిగారు తిరుగుప్రయాణమవుతారు. సీతని జాగ్రత్తగా చూసుకోమని కోరుతాడు రాఘవ. లండన్‍లో అద్వైత్, ఇండియాలు నడుపుతున్న డాన్స్ స్కూలు బాగా వృద్ధిలోకి వస్తుంది. అతనికి మంచి పేరు వస్తుంది. ఇండియా తన భారతదేశపు అనుభవాలతో ఆంగ్లంలో ఒక నవలని రాస్తుంది. దాంట్లోని వ్యాకరణ దోషాలను మేరీ సరిదిద్దుతుంది. ఆ నవలని నరసింహశాస్త్రి గారికి అంకితం ఇస్తుంది. తనకి సహకారకర్తగా అద్వైత్‌ని పేర్కొంటూ అతని ఫోటో వేసి కృతజ్ఞతలు చెబుతుంది. ఆండ్రియా, మేరీలు – ఇండియాకు, అద్వైత్‌కు వివాహం జరిపించాలని భావిస్తారు. ఇండియా పుట్టినరోజు వస్తుంది. అద్వైత్ కోసం ఖరీదైన సూట్ కొంటుంది ఇండియా. మొదట వద్దని చెప్పినా, ఇండియా అభిమానానికి తలవంచుతాడు. పుట్టినరోజు పార్టీ ఘనంగా జరుగుతుంది. ఇండియాకు ఒక బంగారు ఉంగరం కానుకగా ఇస్తాడు అద్వైత్. పార్టీ ముగిసి తన గదికి వెళ్ళిన తరువాత ఇండియా రాసిన నవలని చదువుతూంటాడు అద్వైత్. కాసేపటికి ఇండియా ఆ గదిలోకి వచ్చి అతనికి తన కానుకగా తన వేలికున్న ఉంగరాన్ని తీసి అతని వేలికి తొడుగుతుంది. కాసేపు మాట్లాడుకున్నాకా, తన గదికి వెళ్ళిపోతుంది ఇండియా. ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రకి ఉపక్రమిస్తాడు అద్వైత్. – ఇక చదవండి.]

అధ్యాయం 59:

[dropcap]సీ[/dropcap]త.. గర్భవతి అని తెలిసిన కొన్ని రోజుల్లోనే ఆ వూరిలోని వారి బంధువులను, సన్నిహితులను ఓ రోజు పిలిపించి సీతకు అద్వైత్‍కు వివాహం జరిగిందని చెప్పి.. వారి చేత తీపిని తినిపించారు శాస్త్రిగారు.

సీతను ఆ యింట్లోని అందరూ.. ఎంతో ప్రేమాభిమానాలతో చూస్తూ వున్నా.. నెలలు గడిచేకొద్దీ, సీత మనస్సున – కనబోయే ముందే తన బావ తన వద్ద వుండాలనే కోరిక బలమయింది. అంతవరకూ అద్వైత్ వ్రాసిన ఉత్తరాలు శాస్త్రిగారి పేర వచ్చినందున, నరసింహశాస్త్రిగారు చదివి.. వినిపించేవాడు. అందరూ పడుకొన్న తర్వాత సీత ఆ ఉత్తరాలను తీసికొని ఒకటికి రెండుసార్లు చదువుకొనేది.

వాటిలో అద్వైత్.. మామూలుగా తన తల్లి తండ్రికి అనుమానం కలగకుండా ముక్తసరిగా ‘సీత బాగుందని తలుస్తాను. స్కూలుకు వెళుతున్నది కాదా!.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకొనమని చెప్పండి. ఆమెకు నా ఆశీర్వచనములు శుభాశీస్సులు.. తెలపండి. అమ్మకు సాయంగా వుండమని చెప్పండి’ అని మాత్రమే వ్రాసేవాడు.

ఒకటికి రెండుసార్లు ఆ వాక్యాలను చదువుకొని సీత.. ‘ఓ నా వెర్రి బావా!.. నేను ఇప్పుడు పాత సీతను కాను. నీ ప్రతిరూపాన్ని మోస్తున్నాను. నీవు దాచి వుంచమని చెప్పిన విషయం బట్టబయలయింది. అత్తా మామలు నన్ను ఏమీ అనలేదు. ఎంతో ప్రేమగా చూచుకొంటున్నారు. కానీ.. నా మనస్సు నిండా నీవే.. ప్రతిక్షణం గుర్తుకు వస్తూ వుంటావు.. నీవు త్వరగా రావాలి. నా చెంతన వుండాలి..’ అనుకొనేది.

తన విషయం.. అందరికీ తెలిశాక.. తనే స్వయంగా అన్ని విషయాలను విపులంగా వ్రాసి.. ‘బావా!.. త్వరగా రావాలి. నేను నీ కోసం ఎందురు చూస్తున్నాను..’ తన కోర్కెను విశదీకరించి ఉత్తరాన్ని వ్రాసి.. పోస్టు చేసింది.

రాఘవ.. తన చెల్లికి చెప్పిన ప్రకారంగా అద్వైత్‍కు లెటర్ వ్రాయలేకపోయాడు. కారణం.. తన తల్లిదండ్రులను చంపింది రిచ్చర్డ్.. రాబర్ట్ సోదరుడని తెలిసినప్పటి నుంచి.. అతన్ని ఎలా చంపాలి అనే ఆలోచన తప్ప.. అతని మనస్సు వేరే ఏ విషయాన్ని గురించి ఆలోచించలేకపోయింది. ప్రతీకార వాంఛ ప్రబలింది. గంటన్న దొరతో తన నిర్ణయాన్ని మరోసారి తెలియజేశాడు. “సాయం చేయకలిగితే సాయం చెయ్యి లేకపోతే పూరుకో.. కానీ నన్ను నిరోధించకు..” అని చెప్పాడు.

గంటన్న కూతురు వెన్నెల మీద రిచ్చర్డ్ పెట్టిన గురి తప్పలేదు. గూడెంలో గంటన్న లేని సమయంలో.. అడవిలో మేకలను మేపుకొంటూ తిరుగుతున్న వెన్నెల తలపై వెనుక నుంచి ముసుగు వేసి.. నోట్లో గుడ్డను కుక్కి సాయంత్రం ఆరు గంటలకు తన నిలయానికి ఎత్తుకొని వచ్చి.. తన కామదాహాన్ని తీర్చుకొన్నాడు. ఎదురు తిరిగిన వెన్నెల గుడ్డలను చీల్చి ముక్కలు చేశాడు. ఏడు గంటలకు తన టెంటు నుంచి వెన్నెలను బయటికి తోశాడు.

అభిమానవతి.. కన్నె పిల్ల వెన్నెల.. తనకు జరిగిన అన్యాయానికి ఎంతగానో ఏడ్చింది. మిట్టమీదికి ఎక్కి.. క్రింద ప్రవహించే నదిలో దూకి చనిపోయింది.

మేకలు ఇల్లు చేరాయి. కానీ వెన్నెల చేరనందున ఆమె తల్లి.. తోటి గూడెం వాళ్ళతో కలసి వెన్నెల కోసం వెతికింది. రాత్రి సమయం.. ఆమె తోటివారు.. ఎంతగా వెదకినా.. పిలిచినా.. నదిలో రాళ్ళ మధ్యన తల పగిలి చనిపోయిన వెన్నెల నుండి వారికి జవాబు లేదు. బోరున ఏడుస్తూ అందరూ గూడెం చేరారు.

రాత్రి బాగా పొద్దుపోయాక.. గంటన్న గూడెం చేరాడు. విషయాన్ని విని.. ఆశ్చర్యపోయాడు. అన్నెంపున్నెం ఎరుగని బిడ్డ ఏమైపోయిందోనని అతనూ బోరున ఏడ్చాడు.

ఆ రాత్రి ఆ గూడెం వాసులకు కాళరాత్రి.. వుదయాన్నే అందరూ కలసి వెన్నెల కోసం వెదకసాగారు. రిచ్చర్డ్ వారిని చూచి సమీపించాడు. విషయం ఏమిటని అడిగాడు. గంటన్న.. వెన్నెల రాత్రి నుండి కనబడలేదని చెప్పాడు.

వెన్నెలను పులి తరమడం.. తాను చూచాననీ.. పులి గాండ్రింపులకు భయపడి వెన్నెల పారిపోయిందని చక్కటి కథనాన్ని వినిపించాడు రిచ్చర్డ్.

లోయలో ప్రవహించే నది ఒడ్డున కొంత దూరం నడిచాక.. వారికి వెన్నెల శవం కనుపించింది. పెద్దగా ఏడుస్తూ అందరూ వెన్నెల శవాన్ని చుట్టుముట్టారు.

పది గంటలకు ఆ ప్రాంతానికి వచ్చిన రాఘవ.. వెన్నెల పులి మూలంగా నదిలో పడి చనిపోయిందని విని ఆశ్చర్యపోయాడు. రిచ్చర్డ్ వెన్నెలను పులి తరమడం చూచాడట అన్నమాట విన్నాక.. రాఘవకు అతనిపై అనుమానం కలిగింది.

రిచ్చర్డ్ టెంటు వద్దకు వెళ్ళాడు రాఘవ. వంటవాడు ఒక్కడే వున్నాడు. రాఘవను చూడగానే వాడు బెదిరిపోయాడు. వాడి వాలకాన్ని చూచిన రాఘవకు వెన్నెల మరణానికి రిచ్చర్డుకు సంబంధం వుండి వుంటుందనే అనుమానం దృఢమయింది. వంటవాణ్ణి దగ్గరకు పిలిచాడు. వాడు భయంతో తల దించుకొన్నాడు. వాణ్ణి సమీపించి చొక్కా పట్టుకొని..

“నిన్న ఇక్కడ ఏం జరిగింది?..” అడిగాడు రాఘవ.

వాడు వణుకుతూ.. “ఏం జరగలేదు సార్!..” అన్నాడు.

ఎడం చేత్తో రెండు చెంపలను కసిగా నాలుగు సార్లు వాయకొట్టి..

“ఇప్పుడు.. నిజం చెప్పు!..”

వాడు ఏడుస్తూ వంగి రాఘవ కాళ్ళు పట్టుకొని బలంగా ముందుకు లాగాడు. రాఘవ నేలపై పడ్డాడు. వాడు పరుగు ప్రారంభించాడు.

పడ్డ రాఘవ లేచి.. ఆవేశంతో వాడి వెనకాలే పరుగు తీశాడు. చెట్ల చాటున వాడు అటూ ఇటూ తిరుగుతూ.. రాఘవకు అందకుండా పరుగెత్త సాగాడు.

దూరాన.. పులి గాండ్రింపు..

ముందు పోవలసిన వాడు ఆ అరుపును విని ఆగిపోయాడు. సింహంలా రాఘవ వానిపై దూకి జుట్టు పట్టుకొన్నాడు.

“నిజం చెప్పరా గాడ్డె కొడకా!..”.

ఎడం చేత్తో శక్తి కొలది డొక్కలో ఒక పిడిగుద్దును గుద్దాడు రాఘవ.

“సామీ!.. కొట్టకు కొట్టకు నిజం చెబుతా..” ఏడ్చాడు వాడు.

“చెప్పు..” గద్దించాడు రాఘవ.

రిచ్చర్డ్ వెన్నెలను తెచ్చి.. తనను వెళ్ళిపొమ్మని చెప్పాడని.. తాను వెళ్ళిపోయానని.. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని.. బోరున ఏడుస్తూ చెప్పాడు వాడు.

రాఘవ.. అనుమానం.. నిజం అయింది.

“రిచ్చర్డ్ ఎక్కడ?..”

“గంట ముందు రాజమండ్రికి వెళ్ళాడు సార్..” కన్నీళ్ళతో చెప్పాడు వాడు.

“ఎప్పుడు వస్తాడు!..”

“రేపు..”

రాఘవ వాణ్ణి ‘వెళ్ళి పో’ అన్నట్లు చేతితో సౌజ్ఞ చేశాడు. తాను గూడెం వైపుకు నడిచాడు. వెన్నెల ఊరేగింపు ముందుకు సాగింది.. వల్లకాటిలో వెన్నెల పవళించింది.

ఆ రాత్రి.. గంటన్న బృందం.. వెన్నెలను తలచుకొని ఏడ్చారు. వారి హృదయవిదారక శోకాన్ని చూచిన రాఘవ కూడా ఏడ్చాడు.

కొంతసేపటి తర్వాత.. గంటన్న చేతిని తన చేతిలోనికి తీసికొని పైకి లేపాడు. భుజంపై చెయ్యి వేసి ప్రక్కకు నడిపించాడు తనతో.

“గంటన్నా!.. వెన్నెల మరణానికి కారణం రిచ్చర్డ్.. వంటవాడు చెప్పాడు!..”

“దొరా!..” ఆశ్చర్యపోయాడు అమాయకపు గంటన్న.

“నేను చెప్పింది సత్యం గంటన్నా!..”

గంటన్న కళ్ళు ఎఱ్ఱబడ్డాయి. ఆ కళ్ళ నుండి కన్నీరు..

“వాణ్ణి నేను చంపాలి దొరా!..”

రాఘవ బిగ్గరగా నవ్వాడు.

“ఏంటి దొరా ఆ నవ్వు!..” ఆశ్చర్యంతో అడిగాడు గంటన్న.

“వాణ్ణి యమపురికి పంపాల్సింది నేను గంటన్నా. మరిచావా!.. వాడే నా తల్లిదండ్రులను చంపినవాడు!..” ఆవేశంగా చెప్పాడు రాఘవ.

“నా బంగారు కూనను చంపింది వాడే కదయ్యా!..”

“అవును.. నీ కూన నాకు చెల్లి.. తల్లిదండ్రులను చెల్లిని చంపినవాణ్ణి నేను చంపాలి.. చచ్చిన నా వారికి ఆత్మశాంతి కలగాలి. వాడు రేపు యిక్కడికి తిరిగి వస్తాడట. మనం దారి కాయాలి.. మనతో మరో నలుగురిని తీసికొని వెళదాం. వాడితో ఎంతమంది వున్నా సరే!.. వాణ్ణి మనం పట్టుకొని చంపి తీరాల్సిందే..” ఆవేశంగా చెప్పాడు రాఘవ.

“అవునుదొరా!.. మీరు చెప్పినట్లుగానే చేయాలి.. పాపం.. పుణ్యం తలవకూడదు”

“మనకు నమ్మకమైన నలుగురు కావాలి గంటన్నా!..”

“ఈ గూడెంలో వుండే ప్రతి ఒక్కరు మన కోసం ప్రాణాలిచ్చే వాళ్ళే.. చూచారు గదా దొరా!.. వాళ్ళ ఏడుపుని!..”

“అవును.. చూచాను..”

“మనం ఎప్పుడు బయలుదేరాలి దొరా!..”

“మరో అరగంటలో!..”

“అట్టాగే దొరా!..”

“గంటన్నా!.. వాడు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. బహుశా జీప్‍లో రావచ్చు. మనం ఒక చోట రోడ్డును అడ్డంగా త్రవ్వి గుంటగా చేయాలి. మనం చెట్ల చాటున దాగి గమనించాలి. గుంటను చూచి వాడు జీపు ఆపుతాడు. ఆ సమయంలో మన వాణ్ణి ముట్టడించాలి. వాడి ప్రాణం తియ్యాలి..”

“సరే దొరా!..”

ఇరువురూ అందరూ వున్న చోటికి వచ్చారు. నాలుగుర్ని పేర్లతో పిలిచాడు గంటన్న. వారు అతన్ని సమీపించారు. వారి చెవుల్లో ఏదో చెప్పాడు గంటన్న. అందరూ తలలాడించారు.

పావుగంటలో అందరూ కలసి బయలుదేరారు. ముగ్గురు ఒకవైపు.. మరో ముగ్గురు ఒక వైపున రోడ్డున నడవసాగారు. దట్టమైన అడవి ప్రాంతానికి గంటలో చేరారు. తెచ్చిన పలుగులతో రోడ్డుకు అడ్డంగా గంటలో కాలవలా తీసారు. చెట్ల చాటున పొంచి కూర్చున్నారు.

పది గంటల ప్రాంతంలో జీపు అక్కడికి వచ్చింది. ముందున్న లోతు కాలవను చూచిన డ్రయివర్ కారును ఆపాడు. రిచ్చర్డ్.. మరొకతను.. డ్రయివర్ జీప్ నుంచి దిగారు. చెట్ల చాటున వున్న ఆరుగురూ వారిపై పడ్డారు. వారు తాగి వున్నందున వీరు కొట్టిన దెబ్బలకు పడిపోయారు. ముగ్గురినీ జీప్‍లో వేసుకుని.. రాఘవ డ్రైవ్ చేసి.. యిరవై నిముషాల తర్వాత ఓ మలుపులో ఆపాడు.. ఆరుగురూ దిగి జీపును లోయలో తోసేశారు.

మరుసటి దినం.. పశువులను మేపుకొనే పాతికేళ్ళ ఇద్దరు వ్యక్తులు లోయలో పడిపోయిన కారు చూచి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు లోయలో దిగి చచ్చిన ముగ్గురినీ చూచారు. వారు ఫారెస్టు ఆఫీసర్ రిచ్చర్డ్‌ను గుర్తు పట్టారు. శవాలను పైకి తీసి పోస్టుమార్టంకు పంపారు. డాక్టర్ పరీక్షించి.. త్రాగి జీప్‍ను నడిపినందు వలన.. టర్నింగ్‍లో మైకంలో తోలిన డ్రైవర్ కారణంగా.. జీప్ లోయలో పడిపోయిందని.. ఆ కారణంగా ముగ్గురూ మరణించారని రిపోర్టును తయారు చేశారు.

మూడవరోజు విషయం.. రాబర్ట్‌కు తెలిసింది. మార్చురీలో వున్న శవాలను చూచి తన తమ్ముడు రిచ్చర్డ్‌ను గుర్తుపట్టాడు. బోరున ఏడ్చాడు రాబర్ట్.

మూడు శవాలూ భూ స్థాపితం చేయబడ్డాయి. రాబర్ట్ మనస్సున ఏదో అనుమానం. రిచ్చర్డ్‌కు వంట చేసే వాడికోసం తన మనుషులను పంపి తోటే తీసికొని రమ్మన్నాడు. వెళ్ళిన రాబర్ట్ దూతలు ఆ వంట మనిషి కోసం వారం రోజుల తర్వాత వచ్చి కనుపించడం లేదని రాబర్ట్‌కు చెప్పారు.

అక్కడ రేంజర్‍గా పని చేస్తున్న రాఘవ రాబర్ట్‌కు గుర్తుకు వచ్చాడు. రాబర్ట్.. భద్రాచలం వచ్చి రాఘవను పిలిపించాడు.. రిచ్చర్డ్ మరణాన్ని గురించి విచారించాడు. రాఘవ వినయంగా సమాధానం చెప్పాడు. రిచ్చర్డ్ చాలా మంచి వ్యక్తని పొగిడాడు. అతని మరణానికి తన సంతాపాన్ని తెలియజేశాడు.

రాఘవ మాటలను రాబర్ట్ నమ్మాడు. అతన్ని వెళ్ళిపొమ్మన్నాడు. రాఘవ వెళ్ళిపోయాడు. రాబర్ట్ రాజమండ్రికి చేరాడు.

రాఘవ చేత చావు దెబ్బలు తిన్న రిచ్చర్డ్ వంటమనిషి గోవిందు తన బావమరది భద్రయ్యతో సారా పాక దగ్గర కల్లు తాగుతూ మైకంలో రిచ్చర్డ్.. వెన్నెలను పాడుచేసింది.. ఆ రోజు రాఘవ రిచ్చర్డ్ టెంటుకు వచ్చింది.. అతన్ని గురించి అడిగింది.. తన్ను చావగొట్టి.. తన చేత విషయాన్ని బయటికి కక్కించిన విషయాన్ని భద్రయ్యకు చెప్పాడు.

అతని మాటలను విన్న భద్రయ్యకు.. రాఘవ మీద.. ఆ గూడెం వారి మీద అనుమానం కలిగింది. రాబర్ట్ మెప్పును సంపాదించి అతని దగ్గర డబ్బును వసూలు చేయాలని నిర్ణయించుకొన్నాడు. రాజమండ్రి వెళ్ళి.. రాబర్ట్ అనుచరుడు (డ్రైవర్) కరీమ్‌ను కలసికొన్నాడు భద్రయ్య. రిచ్చర్డ్ మరణానికి కారణం రాఘవ.. గూడెం వారేనని చెప్పాడు.

కరీమ్.. భద్రయ్యను గురించి రాబర్ట్‌కు తెలియజేశాడు. అతన్ని పిలిచి విచారించాడు కర్నల్ రాబర్ట్. వెన్నెల నదిలో దూకి చనిపోయిందని.. ఆ కారణంగా పగతో గూడెంవారు రాఘవను కలసి తన తమ్ముణ్ణి ప్లాన్ వేసి చంపారనే నిర్ణయానికి వచ్చాడు. పోలీసులను పిలిపించాడు. భద్రయ్యను చూపి.. వీణ్ణి జైల్లో త్రోయండి. వెళ్ళి రాఘవ గంటన్నను నిర్భందించి తీసికొని రమ్మని శాసించాడు. బహుమానం.. రాబర్ట్ యిస్తాడని కొండంత ఆశతో తనకు తెలియని.. తాను చూడని.. వూహాగానాలను రాఘవపైన.. గూడెం వాసుల పైనా చెప్పినందుకు శిక్షగా.. భద్రయ్య జైలు పాలైనాడు. తప్పు చేశానని బోరున ఏడుస్తూ జైల్లో కూర్చున్నాడు.

పోలీసులు.. భద్రాచలం వచ్చి.. గూడెంలోని గంటన్నను కలిసి.. రాబర్ట్ దొర రమ్మంటున్నారని చెప్పారు. అదే సమయానికి అక్కడకు వచ్చిన రాఘవకు కూడా అదే మాట చెప్పారు.

వచ్చిన నలుగురు పోలీసులతో రాఘవ.. ఎంతో గౌరవంతో మాట్లాడాడు.

“మా బాస్ రిచ్చర్డ్ చనిపోక ముందు రెండు రోజుల క్రిందట గంటన్న కూతురు వెన్నెలను పులి తరిమి ఆమె చావుకు కారణం అయింది. ఆమె చనిపోయి యింకా పది రోజులు కూడా కాలేదు. మీ యజమాని రాబర్ట్.. గూడెం వారిని నన్ను అనుమానించడం పొరపాటు. మీతో మీరు రావాలంటే.. నేను వస్తాను. ఎంతో బాధలో వున్న గంటన్నను ఏమీ అనకండి. వెన్నెల మరణం కారణంగా గూడెంలోని అందరూ ఎంతో ఆవేదనతో వున్నారు” అనునయంగా చెప్పాడు రాఘవ. వచ్చిన నలుగురులో ఇద్దరు తెల్లవారు.. ఇద్దరు మనవారు.. రాఘవ మాటలకు మనవారు మెత్తబడ్డారు. కానీ తెల్లవారు గంటన్న రావాల్సిందేనని పట్టుబట్టారు.

రాఘవ.. వారిని బ్రతిమాలాడు గంటన్న విషయంలో.. కానీ ఆ తెల్ల పోలీసులు తుపాకులను చూపి గంటన్నను బెదిరించి తమతో రమ్మన్నారు.

చుట్టూ వున్న ఆటవీకులకు ఆవేశం వచ్చింది. ఆ నలుగురినీ చుట్టు ముట్టి వారి చేతుల్లో వున్న తుపాకులను లాక్కొన్నారు. పెనుగులాట ప్రారంభం అయింది. తెల్లవాడు ఒక్కడు తప్పించుకొని పారిపోయాడు. స్థానబలం వున్న గూడెం జనం ఆవేశంతో ముగ్గురిని స్పృహ కోల్పోయేలా తన్నారు. కూతురు పోయిన వేదనతో వున్న గంటన్న.. ఆ ముగ్గురినీ.. విషపు కత్తితో పొడిచి చంపేశాడు. వీర ఆవేశంతో వారిని యీడ్చుకుని వెళ్ళి వెన్నెల సమాధి ప్రక్కన పడేసి కిరోసిన్ చల్లి కాల్చి పారేశారు. అస్థికలను, బూడిదను నదిలో పారేశారు.

పగకు.. విచక్షణ.. వివేకం వుండదు. కేవలం.. ఆవేశం.. తప్ప ముందు ఏం జరగబోతుందో అనే ఆలోచన లేకుండా గంటన్న సారధ్యంలో ఆటవీకులు ఆవేశంతో అమానుషంగా ప్రవర్తించారు. రాఘవ వారించినా.. గంటన్న అతని అనుచరులు.. అతని మాటలను వినిపించుకోలేదు.

నాలుగు గంటల్లోపల అంతా.. ముగిసిపోయింది. ఆవేశం చల్లారిన గంటన్న రాఘవను సమీపించాడు.

“దొరా!.. ఇక మీదట మీరు యీడ వుండొద్దు. దూరంగా.. ఏడకన్నా ఎల్లిపోండి. త్వరలో రాబర్ట్ పోలీసులు.. యీడికి చచ్చినోళ్ళను ఎతుక్కొంటా వస్తరు. వారు మిమ్మల్ని అనుమానిస్తారు. మేము ఏమైపోయినా ఫరవాలేదు. మీలాంటి మంచోళ్ళు మాలాంటి వాళ్ళకు సాయంగా మీ జీవితాంతం వుండాలి దొరా!.. అందుకుగాను మీరు ఏ చిక్కుల్లోనూ.. ఇరుక్కోకూడదు. వెంటనే ఈ అడవి నుంచి ఎల్లిపోండి!..” దీనంగా చెప్పాడు గంటన్న.

“నా మీద ఎంతో అభిమానం వున్న మిమ్మల్ని వదలి నేను ఎక్కడికీ వెళ్ళను. మీతోనే వుండి వచ్చే సమస్యలు ఎదుర్కొంటాను. నా కథ ముగింపు నాకు తెలుసు” విరక్తిగా నవ్వాడు రాఘవ. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూచారు.

అధ్యాయం 60:

ఇండియా ఉదయపు డాన్స్ క్లాస్ శిక్షణను అద్వైత్‌తో కలసి ఇచ్చి.. ఇంట్లోకి ప్రవేశించింది. ఆండ్రియా కోర్టుకు వెళ్ళింది.

మేరీ హాల్లో కూర్చొని వచ్చిన స్త్రీ అతిథితో మాట్లాడుతూ వుంది. ఆమెకు ‘బై’ చెప్పి అతిథి వెళ్ళిపోయింది. ఇండియా తన గదిలో ప్రవేశించబోతూ వుండగా మేరీ.. “ఇండియా!..” అని పిలిచింది.

“వాట్ గ్రానీ!..” మేరీని సమీపించింది ఇండియా.

“సిట్..” అంది మేరీ,

ఇండియా కూర్చుంది.. మేరీ ముఖంలోకి చూచింది.

“మొన్న నీ బర్త్ డే రాత్రి.. నీ నిర్ణయాన్ని అద్వైత్‌కు చెప్పావా!..”

“నో..”

“వై యు హ్యావ్ నాట్ టోల్డ్ హిం!..”

ఇండియా జవాబు చెప్పకుండా మౌనంగా కిటికీ గుండా బయటికి చూడసాగింది.

“ఇండియా!.. ఆన్సర్ మీ..”

“ఐ ఫీల్..”

“ఫీల్..”

“నెర్వస్.. నెర్వస్ గ్రానీ!.. ఇఫ్ హి సే నో.. ఐ కాంట్ టాలరేట్..” విచారంగా చెప్పింది ఇండియా.

“ఓ.. యు హ్యావ్ ఫియర్..”

“యస్!..” మెల్లగా చెప్పింది ఇండియా.

“ఆర్ యు రియల్లీ లవింగ్ హిం?..”

అవునన్నట్లు సాలోచనగా తల ఆడించింది ఇండియా.

“ఓకే.. ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ బేబీ!..”

“హౌ గ్రానీ!..” ఆశ్చర్యంతో అడిగింది ఇండియా.

“యు హ్యావ్ టు.. డ్రస్ లైక్ సీత!..”

“వెన్!..”

“టు నైట్..”

“దెన్.. వాట్ విల్ హ్యాపెండ్!..”

“వాట్ ఐ ఫీల్ దట్ విల్ హ్యాపెండ్!.. ఆఫ్టర్ డిన్నర్ యు హ్యావ్ టు గో హిజ్ రూమ్ అండ్ కాల్ హిమ్ లైక్ సీత.. షి యూజ్ టు కాల్ హిమ్.. కాల్ హిమ్ యాజ్.. యాజ్..” ఆలోచించసాగింది మేరీ.

“బావా!..” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“యస్.. యస్.. బావా!.. యు హ్యావ్ టు కాల్ హిమ్ బావా!.. అండ్ సే హిమ్.. ఐ లవ్ యు బావా!.. వుయ్ విల్ మ్యారీ.. దెన్ సీ.. హౌ హి విల్ రియాక్ట్!..” నవ్వుతూ చెప్పింది మేరీ.

ఇండియా మేరీ చెప్పిన మాటలను గురించి ఆలోచించసాగింది. ‘సీతలా చీర రవికతో అలంకరించుకొని ‘బావా!’ అని పిలవగానే అద్వైత్ నన్ను తన హృదయానికి హత్తుకొంటాడా!.. ‘ఐ లవ్ యు’ చెబితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడో.. ఆనందంగా అదే పదాన్ని ‘ఐ టూ లవ్ యు ఇండియా..’ అంటాడా!.. లేక నన్ను అసహ్యించుకొంటాడా!.. అతను అలా చేస్తే నేను తర్వాత అతనికి నా ముఖాన్ని చూపించలేను. అతను నన్ను కాదంటే నేను భరించలేను. అద్వైత్ ప్రేమను అభిమానాన్ని నేను పొందాలి. అద్వైత్ శాశ్వతంగా నావాడిగా వుండాలి.. నాతోనే వుండాలి. నన్ను పెళ్ళి చేసికోవాలి.. అతనితో భావిజీవితాన్ని జీవితాంతం ఆనందంగా అనుభవించాలి. నేను అతనితో మాట్లాడే తీరును.. చూపించే అభిమానాన్ని.. యిచ్చే గౌరవాన్ని చూచిన అద్వైత్ నన్ను గురించి ఏమనుకొంటున్నాడో!.. అతని మనస్సులో తనకు స్థానం వుందో లేదో.. తాను సీతను పెండ్లి చేసికోవాలనుకొంటున్నాడా!.. అతని మనస్సులో ఏముందో.. తెలుసుకోవాలంటే గ్రానీ చెప్పినట్లు చేసి.. అద్వైత్‌కు నా నిర్ణయాన్ని చెప్పి తీరాలి. అది ఎప్పుడో కాదు ఈ రాత్రికే..’, తన పుట్టినరోజు రాత్రి అద్వైత్ నా చేతిలో తన చేతిని వుంచి.. చేసిన ప్రామిస్ గుర్తుకు వచ్చింది ఇండియాకు. ‘ఆ ప్రామిస్ తోనే అద్వైత్‍ను నా వాడిగా చేసికోవాలి..’ ఆ నిర్ణయానికి వచ్చిన ఇండియా చిరునవ్వుతో లేచి తన గదికి వెళ్ళిపోయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here