[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ఆ రాత్రి అద్వైత్ భోజనానికి వచ్చినప్పుడు ఇండియా సీతలా అలంకరించుకుని, అతనికి కొసరికొసరి వడ్డిస్తుంది. ఆ అలంకరణలో ఆమె అద్వైత్‍కు సీతలానే అనిపిస్తుంది. తిన్నాకా, అందరికీ గుడ్ నైట్ చెప్పేసి తన గదికి వెళ్ళి ఇండియా రాసిన నవలని చదువుతూంటాడు. ఉన్నట్టుండి వెన్నెల మాయమై, మబ్బులు కమ్ముకొచ్చి, వాన మొదలవుతుంది. తలుపు వేయడానికి వెళ్ళగా, గదిలోకి ఇండియా వస్తుంది.. ఐ లవ్ యు అంటూ హత్తుకుంటుంది. ఆమె చర్యని వ్యతిరేకించడు ఆది. ఇద్దరి మధ్య ప్రణయ సంగమం జరిగిపోతుంది. మర్నాడు ఉదయం నిద్ర లేచాకా, తప్పు చేసిన భావన కలుగుతుంది అద్వైత్‌లో. అదే మాట ఇండియాతో అంటే, తప్పేం చేయలేదని, తాము ఒకరి ఉంగరాలు ఒకరు మార్చుకున్నప్పుడే తమకి వివాహం జరిగిపోయిందని అంటుంది ఇండియా. అప్పుడు చెప్తాడు తనకు ఇదివరకే సీతతో అనుకోకుండా వివాహం జరిగిపోయిందని. అయినా, అద్వైత్ ఏమీ తప్పు చేయలేదని, బాధపడవద్దనీ అంటుంది. గతంలో ఓ కోయదొర తనకి రెండు పెళ్ళిళ్ళు జరుగుతాయని, ఒక పాప, ఒక బాబు పుడతారని చెప్పిన మాట గుర్తొస్తుంది. ఆదివారం నాడు అద్వైత్ విశ్రాంతిగా తన గదిలో ఉండగా, ఓ ఉత్తరం తీసుకుని వస్తుంది ఇండియా. మా మావగారు రాసినట్టున్నారు అంటుంది, కవరు తెరిచి చూసి, రాసినది సీత అని చెప్తాడు. తమ విషయం రహస్యంగా ఉంచలేకపోయానని, తన కడుపులో అద్వైత్ ప్రతిరూపం పెరుగుతున్నందున మాంగల్యాన్ని అత్తయ్యగారికి చూపించానని, ఆవిడ ద్వారా మావయ్యగారికీ తెలిసిందనీ, ఎవరూ కోపగించుకోలేదని, తనకు నవమాసాలు నిండాయని, త్వరలో ప్రసవమవుతుందని, వెంటనే బయల్దేరి రమ్మని రాసింది సీత. ఆ వివరాలన్నీ ఇండియాకు చెప్తాడు. వెంటనే బయల్దేరి భారతదేశానికి వెళ్ళమంటుంది ఇండియా. అది మీ ధర్మం అంటుంది. ఓడలో టికెట్ బుక్ అవుతుంది. ఆండ్రియాకి, మేరీకి చెప్పి బయల్దేరుతాడు. మూన్ కారులో హార్బరుకు బయల్దేరుతారు అద్వైత్, ఇండియా. హార్బర్ చేరుతారు. ఇంతలో పరిచయస్థుడెవరో కనబడితే, మూన్ అతనితో మాట్లాడుతూంటాడు. కారు దిగి మూన్‍కి కొంచెం దూరంగా నడుస్తారు ఇండియా, అద్వైత్. ఒకవేళ సీతకెదురయిన పరిస్థితే నాకూ వస్తే ఏం చేస్తారు అని అడుగుతుంది. వెంటనే బయల్దేరి వచ్చేస్తాను అంటాడు. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే, నువ్వే అక్కడికి వచ్చేయ్ అని చెప్తాడామెకు. స్టీమర్ బయల్దేరే సమయం అవుతుంది. అద్వైత్ ఎక్కబోతుంటే, అతన్ని ఆపి, సీతకు పుట్టబోయే బిడ్డకు తను కొన్న కానుకని ఇవ్వమని ఇస్తుంది ఇండియా. స్టీమర్ కనుమరుగయ్యాకా, మూన్, ఇండియా అక్కడ్నించి బయలుదేరుతారు. – ఇక చదవండి.]
అధ్యాయం 63:
[dropcap]పా[/dropcap]రిపోయిన రాబర్ట్ పోలీసు, మూడు రోజుల తర్వాత రాబర్ట్‌ను కలుసుకొన్నాడు. అడవిలో జరిగిన విషయాలను అతనికి తెలియజేశాడు.
భద్రాచలం అడవుల్లో వుండే ఆటవీకులు.. ఆ గూడెం జనులంతా రాఘవ మాట మీద నడుస్తున్నారని.. వారు అతన్ని ‘దొరా.. దొరా!..’ అని ఎంతో గౌరవంగా పిలుస్తున్నారని.. మీ తమ్ముడు రిచ్చర్డ్ మరణానికి.. వారే కారకులని చెప్పాడు ఆ పోలీస్ పీటర్.
తన వారిని.. ఆరుగురిని చంపిన ఆ గూడెం జనంపై.. రాఘవపై అతనికి కోపం.. ఆవేశం కలిగాయి.
మరో అల్లూరి సీతారామరాజుగా.. రాఘవ తయారు కాకూడదని గూడెం చుట్టు తన సిబ్బందిని కాపలా వుంచాలని నిర్ణయించుకొన్నాడు. దాదాపు వందమంది పోలీసులతో రాబర్ట్ ఆ గూడాన్ని చేరాడు.
పరిస్థితులు విషమించినందున.. గంటన్న.. రాఘవ గూడెంలో లేకుండా అడవిలో రహస్య స్థలాల్లో దాకున్నారు. గూడానికి వారికి మధ్యన వయస్సు మళ్ళిన ఆడవారు సమాచారాలను చేరవేసేవారు.
పోలీసులు ఆ గూడెంను.. ముట్టడించారు. మగవారిని పిలిచి.. గంటన్న రాఘవలను గురించి విచారించాడు రాబర్ట్. వారి వునికి మాకు తెలియదన్నారు వారు.
శ్రీ సీతారామరాజుగారి మరణంతో ఆంధ్రావనిలో చెలరేగిన విమర్శలు.. తెల్లవారితో కొందరు మనవారు.. సాహసవంతులు చేసిన సంభాషణలతో.. మనిషిని చంపడం మహానేరమే!.. అనే తత్వానికి వచ్చిన తెల్లవారు.. అలాంటి చర్యను కొనసాగిచే దానికి జంకారు. జనం.. తిరుగుబాటుతో తమ కార్యాలయాలను చుట్టి.. వారి దొరతనాన్ని విమర్శిస్తూ.. వారిపై ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం.. ఆంగ్లేయులను ప్రతీకార వాంఛారహితంగా ఆవేశాన్ని తగ్గించుకొనేలా చేసింది.
ఆ కారణంగా.. ఆవేశంగా బలగంతో వెళ్ళిన రాబర్ట్ గూడెం వాసులను హింసించేదానికి సాహసించలేదు. నేరస్థులను.. తిరుగుబాటుదారులను పట్టి అండమాన్ జైల్లో వేయాలని నిర్ణయించుకొన్న ఆంగ్ల పై అధికారక వర్గం నిర్ణయానికి కట్టుబడ్డాడు రాబర్ట్.
కానీ.. అతని హృదయంలో తన తమ్ముని చంపిన రాఘవ, గంటన్నలను మాత్రం చంపి తీరాలనే నిర్ణయానికి వచ్చాడు. వారిరువురిని వెదకి పట్టుకొని.. తన సన్నిధికి తీసుక రావలసిందిగా తన ఆంతరంగికులకు ఆదేశాన్ని ఇచ్చాడు.
అధ్యాయం 64:
సీతకు నొప్పులు ప్రారంభం అయినాయి. ఆమెను హాస్పటల్లో చేర్చారు నరసింహశాస్త్రి, సావిత్రి.
వసుంధర ఇంటి వద్ద వుండి సుమతి పాప మూడు నెలల శ్రీ మహాలక్ష్మిని చూచుకొంటూ వుంది. సుమతి సీతకు సాయంగా హాస్పటల్లో వుంది. పాండురంగ అటూ ఇటూ తిరుగుతూ వారికి కావలసిన వాటిని సమకూర్చేవాడు. సుల్తాన్ వచ్చి పరామర్శించి వెళ్ళేవాడు. ఆరుణోదయ వేళ శుక్రవారం నాడు సీత ప్రసవించింది. ఆ వార్త విన్న నరసింహశాస్త్రి.. “మా అమ్మ ‘భవానీ’ జన్మించింది సావిత్రి..” భార్య భుజాలను పట్టుకొని వూపుతూ పరమానంద భరితులైనారు.
వారి ఆనందంలో.. “అవునండి.. మా అత్తయ్యగారు పుట్టారు..” సంతోషంగా నవ్వుతూ పాలు పంచుకొంది సావిత్రి.
మూడు గంటల తర్వాత వార్డుకు చేర్చారు సీతను. నర్స్ వచ్చి.. మీరు వెళ్ళి పాపను సీతను చూడవచ్చని చెప్పింది.
సుమతి.. పాండురంగ.. నరసింహశాస్త్రి.. సావిత్రి.. సీత మంచాన్ని సమీపించారు. నవ్వుతూ వారిని చూచింది సీత. ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్లు అనిపించింది నరసింహశాస్త్రిగారికి.
“మామయ్యా!.. బావ జాబు వ్రాశాడా!..” మెల్లగా అడిగింది
సీత అడిగిన ఆ ప్రశ్నను వినగానే.. అంతవరకూ ఎంతో ఆనందంగా వున్న నరసింహశాస్త్రిగారి ముఖంలో గాంభీర్యం చోటు చేసికొంది. తన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండా మౌనంగా వున్న శాస్త్రి గారి ముఖంలోకి దీనంగా ఆ పచ్చి బాలింతరాలు సీత చూచింది.
ఇరువురి ముఖ భావాలను గమనించింది సావిత్రి.
“ఏమండీ!.. సీత ప్రశ్నకు జవాబు చెప్పరేం!..” అడిగింది సావిత్రి.
“వస్తాడు.. సావిత్రీ!..” అన్నారు శాస్త్రిగారు.
“ఎప్పుడు మామయ్యా!..” ఆత్రంగా అడిగింది సీత.
“త్వరలో వస్తాడమ్మా!..” అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.
“మీరు ఉత్తరం.. సీత గర్భవతిగా వున్నదని వ్రాశారుగా!..” సావిత్రి మరో ప్రశ్న.
ఆమె ముఖంలోకి చూచి అవునన్నట్టు తల ఆడించారు శాస్త్రిగారు. ఉయ్యాలలో వున్న బిడ్డ ఏడ్వసాగింది. సావిత్రి ఆ పాపను తన చేతుల్లోకి తీసికొని సీత ప్రక్కన పడుకోబెట్టింది.
“యిక మీరు బయటికి వెళతారా!..” అంది.
నరసింహశాస్త్రి.. పాండురంగలు బయటికి నడిచారు.
“పాపకు ఆకలి.. పవిట తొలగించి పాలు యివ్వు..” వంగి మెల్లగా చెప్పింది సావిత్రి.
సీత.. అద్వైత్‌ను గురించి ఆలోచిస్తూ పాపకు పాలు ఇవ్వసాగింది.
‘చిన్నీ.. నీవు నా కడుపులో వున్నావని.. నీవు బయటికి రాకముందే మీ నాన్నను రమ్మనమని నేను వ్రాశాను తల్లీ!.. ఆ మహానుభావుడికి ఉత్తరం చేరిందో లేదో!.. నీవు బయటికి వచ్చే నాటికి మీ నాన్న మన ముందుండాలన్నది నా కోరిక.. మీ నాన్న నా కోరికను తీర్చలేదు చిన్నీ!..’ ఎనిమిది గంటల ముందు పుట్టిన తన కూతురితో చెప్పుకొంది ఆ తల్లి సీత పాప తల నిమురుతూ విచారంగా.
సీత పవిటను సవరిస్తూ.. “బిడ్డకు పాలు యిచ్చేటప్పుడు ఎవరి కళ్ళూ పడకూడదు. పవిట జాగ్రర్తగా కప్పుకోవాలి సీతా!..” ప్రీతిగా చెప్పింది సావిత్రి.
“అలాగే అత్తయ్యా!..” అంది సీత.
అద్వైత్‍ను చూడాలని ఆమె మనస్సు పరితపిస్తూ వుంది.
(ఇంకా ఉంది)