[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[గూడెంలో గొడవ జరిగినప్పుడు పారిపోయిన పోలీసు మూడు రోజుల తరువాత వెళ్ళి రాబర్ట్‌ను కలిసి అడవిలో జరిగిన విషయాలను చెప్తాడు. రిచర్డ్ మరణానికి గూడెం మనుషులు, రాఘవ కారణమని చెప్తాడు. ఆ గూడెం జనంపై.. రాఘవపై ఆగ్రహం కలుగుతుంది రాబర్ట్‌కి. దాదాపు వందమంది పోలీసులతో రాబర్ట్ ఆ గూడేన్ని చేరుకుంటాడు. కానీ అప్పటికే గంటన్న, రాఘవ అక్కడ్నించి తప్పించుకున్నారు. వారి గురించి గూడెంలో ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు. సీతారామరాజు గారి హత్యతో ఆంగ్లేయులపై చెలరేగిన విమర్శల దృష్ట్యా హింసకు దిగవద్దని – నేరస్థులను, తిరుగుబాటుదారులను పట్టుకుని అండమాన్ జైల్లో వేయాలని ఆదేశాలున్నందున, మౌనంగా ఉంటాడు రాబర్ట్. కానీ రాఘవని, గంటన్నని చంపితీరాలని మనసులో నిర్ణయించుకుని, వారిద్దరినీ వెతికి పట్టుకుని తన ముందుకు తెమ్మని ఆంతరంగికులకు ఆదేశాలిస్తాడు. సీతకు పాప పుడుతుంది. తమ తల్లిగారే మళ్ళీ పుట్టారని సంతోషిస్తారు శాస్త్రి. మూడు గంటల తర్వాత సీతను వార్డుకు చేరుస్తారు. అందరూ వెళ్ళి పాపని చూస్తారు. అద్వైత్ జాబు వ్రాసాడా అని సీత నెమ్మదిగా శాస్త్రిగారిని అడుగుతుంది. త్వరలోనే వస్తాడని చెప్తారాయన. పాప ఏడుపు మొదలుపెట్టడంతో, మగవాళ్ళని బయటకు పంపి, పిల్లకి పాలివ్వమని సీతకు చెప్తుంది సావిత్రి. అద్వైత్‍ను చూడాలని సీత మనసు పరితపిస్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 65:
రెడ్డి రామిరెడ్డిగారు.. సీత ప్రసవించక ముందు వారం రోజుల క్రిందట నరసింహశాస్త్రిగారిని కలిశారు. దక్షిణ దేశపు యాత్రలకు బయలుదేరుతున్నామని.. మీరు కుటుంబంతో రావలసిందని శాస్త్రిగారిని కోరారు.
ఇంట్లో నెలల బిడ్డ తల్లి.. నిండు చూలాలు సీత వున్న కారణంగా తాను సావిత్రి రాలేమని చెప్పి.. ‘నేను వెళతానురా’ అన్న వసుంధరను వారితో పంపారు శాస్త్రిగారు.
అప్పటికి రెడ్డిగారి కుటుంబం.. వసుంధర యాత్రకు బయలుదేరి వెళ్ళి ఒక వారం అయింది. వారు బయలుదేరి వెళ్ళిన మూడవ రోజే సీత ప్రసవించింది. మూడవ రోజుల తర్వాత పాపతో సీత తన ఇంటికి చేరింది.
ఆ నోటా యీ నోటా పడి రాబర్ట్ ఆండ్రియాకు విడాకులు యిచ్చాడన్న విషయం.. అతను లిల్లీని వివాహం చేసికొన్న విషయం.. అతని తమ్ముడు ఫారెస్టు ఆఫీసర్ రిచ్చర్డ్ రాత్రి సమయంలో తోటి యిద్దరితో సహా జీప్ ప్రయాణంలో లోయలో పడి చచ్చిపోయాడన్న విషయం సుల్తాన్‌కు తెలియగా అతను శాస్త్రిగారికి తెలియజేశాడు.
తాను రాఘవను భద్రాచలంలో కలసినప్పుడు రాఘవ తనతో చెప్పిన మాటలు.. ఆతని మూర్ఖపు నిర్ణయం.. శాస్త్రిగారికి గుర్తుకు వచ్చాయి.
“అయ్యా!.. తమరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట చెప్పాలని వుంది..” వినయంగా చెప్పాడు సుల్తాన్.
“చెప్పు సుల్తాన్!.. నీవు మా శ్రేయోభిలాషివి కదా!..”
“మరేం లేదయ్యా!.. అనుమానంతో రాబర్ట్ మన రాఘవను వుద్యోగంలో నుంచి డిస్మిస్ చేశాడట. అతని స్థానంలో ‘గిల్ట్’ అనే అతన్ని రేంజర్‍గా పంపాడట” చెప్పాడు సుల్తాన్.
“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగారు శాస్త్రిగారు.
“అవునయ్యా!..” విచారంగా చెప్పాడు సుల్తాన్.
“సుల్తాన్! నీవు నాకు ఓ సహాయం చేయగలవా!..” సాలోచనగా అడిగారు శాస్త్రిగారు.. రెండు క్షణాల తర్వాత..
“భద్రాచలం వెళ్ళి నీవు రాఘవను నీతో తీసుకొని రాగలవా!..”
“అయ్యా!.. మరో మాట..”
“ఏమిటది?..”
“ఆ గూడెం దొర గంటన్న.. మన రాఘవ బాబు పరారులో వున్నారట. రాబర్ట్ ఆ గూడెం చుట్టూ వీరిని పట్టుకొనేటందుకుగాను నూరు మంది పోలీసులను ఆయుధాలతో కాపలా వుంచాడట. యిలాంటి పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళినా రాఘవ బాబును కలవలేనేమోనయ్యా!..”
“అదా విషయం?..”
“అవునయ్యా!..”
“సుల్తాన్!.. నీవు భద్రాచలం వెళ్ళు. సీత కన్నదని పాప పుట్టిందనే విషయం.. రాఘవ ఇంటి యజమానికి చెప్పిరా!.. అతను రాఘవకు విషయాన్ని అందచేయగలడు. ఏమంటావు సుల్తాన్!..” ప్రాధేయపూర్వకంగా అడిగారు శాస్త్రిగారు.
“అయ్యా!.. మీరు చెప్పడం.. నేను కాదనడమా!.. తప్పకుండా వెళ్ళి వస్తానయ్యా!..”
“మంచిది సుల్తాన్!..”
“నేను యీ రోజే బయలుదేరుతానయ్యా!..”
“జాగ్రత్తగా వెళ్ళిరా!..”
శాస్త్రిగారికి నమస్కరించి సుల్తాన్ బయలుదేరాడు.
రాఘవ చేసిన నిర్వాకం.. అతని కోసం పోలీసులు గాలింపు.. అతని వుద్యోగం వూడిపోవడం.. పరారులో వుండడం.. నరసింహశాస్త్రిగారికి ఎంతో ఆవేదనను కలిగించాయి. తనకు తెలిసి యీ నిజాలను వారు.. సావిత్రితో కాని.. సీతతో కాని.. పాండురంగ సుమతులతో కానీ చెప్పలేరు. ఒకరిపట్ల ఒకరికి ఎంతో అభిమానం. విషయాన్ని విన్న వారు బాధపడతారు. ముఖ్యంగా సీత.. బాలింత.. తన అన్న పరిస్థితి యిలా మారిందని వింటే.. తట్టుకోలేదు. ఆమె మనస్సు అద్వైత్ రాక కోసం ఎంతగా ఆరాటపడుతూ వుందో శాస్త్రిగారికి తెలియని విషయం కాదు. అద్వైత్.. జాతకాన్ని చూచిన శాస్త్రిగారికి.. అతను చిక్కుల పాలవుతాడని.. సమస్యల్లో కూరుకు పోతాడని.. వారి దృష్టికి గోచరించిన కారణంగా అద్వైత్‍ను లండన్‍కు పంపారు. ఆ సత్యాన్ని తాను తనలోనే దాచుకొన్నారు గాని.. ఎంతగా సావిత్రి అడిగినా చెప్పలేకపోయారు. చివరగా నెల రోజుల క్రిందట అద్వైత్‍కు వ్రాసిన ఉత్తరంలో.. సీత గర్భవతి అని.. అతన్ని వెంటనే బయలుదేరి రమ్మని కానీ.. వ్రాయలేదు. ఇక్కడ అద్వైత్ కాలు పెడితే.. జాతక గోచార ప్రకారం ఎక్కడ.. ఏ రీతిగా సమస్యల్లో చిక్కుకుంటాడో అనే భయం.. పుత్రవాత్సల్యం.. వారిని అలా మార్చేశాయి.
సమస్యాత్మక ఆలోచనలకు.. వేదనకు తట్టుకోలేక కళ్ళు మూసుకొని సర్వేశ్వర ధ్యానంలో గత సంవత్సరంగా వారు ఎంతో కాలాన్ని ఏకాంతంగా గడిపారు.
అర్ధాంగి.. సావిత్రి వారిలోని మార్పును గమనించి.. కారణం ఏమిటని తాను అడిగితే.. వారు యింకా బాధపడతారని.. ఆ యిల్లాలు జరుగుతున్నదాన్ని చూస్తూ తనూ మౌనంగా కాలాన్ని గడవపటం నేర్చుకొంది.
సుమతి.. ప్రసవానంతరం.. చిన్ని పాప ఏడ్పులు.. బోసి నవ్వులు వారికి కొంత వూరట కలిగించాయి. సీత గర్భవతి.. దానికి కారణం అద్వైత్ అన్న విషయం వారిరువురికి ఎంతో ఆవేదనను కలిగించినా.. వరసైనవారు.. ఒకరి పట్ల ఒకరికి వున్న ప్రేమాభిమానాలు వున్నవారు.. వయస్సు.. మనస్సుల రీత్యా అలా జరిగుంటుందని తమకు తాము సమాధానం చెప్పుకొని.. జరిగిన దాంట్లో ఎవరిదీ తప్పు లేదని.. అంతా దైవ నిర్ణయం అని భావించారు.
సీతకు సుఖ ప్రసవం జరిగి పాప పుట్టినందుకు సంతోషించారు. అద్వైత్ వస్తే బాగుంటుందని సావిత్రి.. వచ్చి చిక్కుల పాలౌతాడేమోనని నరసింహశాస్త్రి.. వేరు వేరు భావాలతో మనస్సు విప్పి మాట్లాడుకోలేక పోతున్నారు.
లండన్‍లో స్టీమర్ ఎక్కిన అద్వైత్ రోజులు లెక్క పెట్టుకొంటూ.. తన ఉత్తరం తాను ఇండియా చేరబోయే లోపల వారికి చేరుతుందని.. తన రాక కోసం వారు ఎదురు చూస్తుంటారని అనుకొన్నాడు. ఆ ఉత్తరం.. తాను పయనించే స్టీమర్లో తనతో పాటే పయనిస్తున్నదన్న విషయం అతనికి తెలియదు.
అధ్యాయం 66:
రాబర్ట్ కలకత్తాలో వున్న సుల్తాన్ కొడుకు అంజాద్‍ను పిలిపించాడు. తన పాత స్థానంలో వున్న తహసిల్దార్ మార్టన్‍తో, తన డ్రయివర్ కరీమ్‍తో.. అంజాద్‌తో కలిసి తన రెండు ఆశయాలను వారికి వివరించాడు.
మొదటిది.. రాఘవను చంపడం. ఆ బాధ్యతను అంజాద్‍కు అప్పగించాడు.
రెండవది.. శ్రీ మహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని అపహరించడం, ఆ పనికి కరీమ్‍కు ఆదేశాన్ని యిచ్చాడు. “యీ రెండు పనులూ మీరు సవ్యంగా చేస్తే.. మీకు హోదాను మార్చేస్తా.. జీతాన్ని పెంచుతా.. మీరు మా కార్యవర్గంలో ముఖ్యులౌతారు” తన నిర్ణయాన్ని గంభీరంగా నవ్వుతూ చెప్పాడు రాబర్ట్.
అంజాద్.. కరీమ్‍లు ఆనందంగా తలలు ఆడించారు. వారి సభ ముగిసింది.
అంజాద్.. నరసింహశాస్త్రిగారి ఇంటికి వచ్చాడు.
వరండాలో కూర్చొని యున్న నరసింహశాస్త్రిగారిని చూచి
“శాస్త్రీజీ!.. మీ రాఘవ ఎక్కడ?..” అడిగాడు అంజాద్ అతను ప్రశ్నించిన తీరు నచ్చని నరసింహశాస్త్రి..
“నీవు ఎవరు?..” అని అడిగారు.
“నేను ఎవరో మీకు తెలవదా!..”
“నిన్ను గుర్తుంచుకొనవలసినంత పరిచయం మన మధ్యన లేదే!.. ఎవరు నువ్వు?..”
“సుల్తాన్ భాయ్ కొడుకును..”
“నీవేనా కలకత్తాలో వుండేది?..”
“అవును..”
“రాఘవతో నీకేం పని?..”
“వాడే నాకు పని పెట్టిండు..” నవ్వాడు అంజాద్.
“నీ పేరేమిటి?”
“నా పేరు నీకు తెలవదా!..”
తెలీదన్నట్లు తల ఆడిస్తూ అంజాద్ ముఖంలోకి తీక్షణంగా చూచారు నరసింహశాస్త్రి.
“అంజాద్..” అని చెప్పి, “నేను అడిగిన ప్రశ్నకు నీవు జవాబు చెప్పలేదు” అన్నాడు.
కూర్చొని వున్న నరసింహశాస్త్రి లేచి నిలబడ్డారు.
“నా ప్రశ్నకు నీవు సరిగా సమాధానం చెప్పలేదు” అన్నాడు అంజాద్
“ఏమిటి నీ ప్రశ్న!..” కొన్ని క్షణాల తర్వాత..
“రాఘవతో నీకేం పని?..”
“క్షణం క్రింద విన్నదాన్ని మరచిపోయావా? నాతో ఎకచికాలుగా మాట్లాడితే.. ఇబ్బందుల పాలౌతావ్!..”
“బెదిరిస్తున్నావా!..”
“కాదు హెచ్చరిస్తుండా..” వికటంగా నవ్వాడు అంజాద్.
నరసింహశాస్త్రి వరండా మెట్లు దిగాడు. అతని వాలకాన్ని చూచిన అంజాద్.. వెనక్కు రెండు అడుగులు యాంత్రికంగా వేశాడు.
“నీకు పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలీదా!.. నీ వయస్సు ఎంత?.. నా వయస్సు ఎంత?.. పెద్దా చిన్నా అనే విచక్షణా జ్ఞానం నీకు లేదురా!.. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదురా!.. పశువా! వెళ్ళు.. మర్యాదగా గేటు దాటి వెళ్ళు..” గర్జించారు నరసింహశాస్త్రి.
వారు.. ఆ రీతిగా ఎవరితోనూ మాట్లాడింది.. సావిత్రిగాని.. పాండురంగ కాని.. సుమతికాని యింతవరకూ వినలేదు. వారి గొంతు విని.. ఆ ముగ్గురూ సింహద్వారాన్ని సమీపించారు.
అంజాద్ బెదిరిపోయాడు. తమాయించుకొని.. “దీని ఫలితం.. చాలా తీవ్రంగా వుంటుంది. అనుభవిస్తావ్!..” వెనక్కు నడుస్తూనే చెప్పాడు అంజాద్.
“ఆ తండ్రి కడుపున చెడబుట్టావు కదరా!.. నీవు నన్ను బెదిరిస్తున్నావా!.. హు.. నీ బెదిరింపులకు యీ నరసింహశాస్త్రి బెదరడురా మూర్ఖ!..” నరసింహశాస్త్రి మెట్లు దిగారు.
అంజాద్ భయంతో వీధిలోకి పారిపోయాడు.
“ఏమండీ!..” పిలిచింది సావిత్రి.
వెనక్కు తిరిగి చూచారు నరసింహశాస్త్రిగారు.. వెను తిరిగి వరండాలో ప్రవేశించారు.
“ఏమిటండీ ఇది.. వాడెవడు?..”
“సుల్తాన్ కొడుకు.. రాబర్ట్ తొత్తు..”
“వాడితో మీరు..” ఆగిపోయింది సావిత్రి.
“ఆపేశావేం!.. చెప్పు సావిత్రీ!..”
“మేక వన్నె పులులను ఆశ్రయించి బ్రతికే నక్కలు ఇలాగే వుంటాయి. ఆ వెధవకు.. మీతో ఎలా మాట్లాడాలనే జ్ఞానం వుందా!.. అటువంటి బుద్ధిహీనుడికి మీ మాటలు ఎలా అర్థమౌతాయి!..” ఆవేశంగా చెప్పింది సావిత్రి.
కొన్నిక్షణాలు సావిత్రి ముఖంలోకి చూచి.. నిట్టూర్చి శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు. కళ్ళు మూసుకున్నారు. సీత పాప ఏడుపు విని సావిత్రి లోనికి వెళ్ళింది.
సుల్తాన్ వారిని సమీపించి నమస్కరించి నమస్కరించాడు. అతని ముఖంలో కాంతి లేదు. అతన్ని చూచిన శాస్త్రిగారు..
“సుల్తాన్ భాయ్!.. కూర్చో!..” అన్నారు.
సుల్తాన్ కూర్చున్నాడు.
“భద్రాచలం వెళ్ళావు కదూ!..”
“వెళ్ళానయ్యా!.. మీరు చెప్పిన మాటలను రాఘవ గారి ఇంటి యజమానికి చెప్పాను. పదిహేను రోజులుగా రాఘవ ఇంటికి రాలేదన్నాడు..” విచారంగా చెప్పాడు సుల్తాన్.
“కాలు గంట క్రిందట నీ కొడుకు అంజాద్ వచ్చాడు..” సాలోచనతో శూన్యంలోకి చూస్తూ చెప్పారు శాస్త్రిగారు.
“అయ్యా!..” ఆశ్చర్యంతో అన్నాడు సుల్తాన్.
“అవును సుల్తాన్!..”
“వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడయ్యా!..”
“రాఘవను గురించి తెలుసుకోడానికి వచ్చాడు”
“బద్మాష్!..” ఆవేశంగా అన్నాడు సుల్తాన్. క్షణం తర్వాత.. “అయ్యా.. వాడు మీతో అనాగరీకంగా మాట్లాడి వుంటే.. వారి తరఫున నేను మీకు క్షమాపణ చెబుతున్నానయ్యా!..” దీనంగా చెప్పాడు సుల్తాన్.
“సుల్తాన్!.. వాడి తరఫున నీవు నాకు క్షమాపణ చెప్పడం ఏమిటయ్యా!.. వాడు రాబర్ట్ మనిషి కదా!.. పెద్దాచిన్నలను ఎలా గౌరవించి అభిమానించాలో ఆ రాబర్ట్‌కే తెలియనప్పుడు.. అతనికి వంతపాడే వారికి అవి ఎలా తెలుస్తాయి?..” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి.
“వాడికి నేను బుద్ధి చెబుతానయ్యా!..”
“సుల్తాన్!.. మొక్కగా వున్నప్పుడు వంగనిది.. మానయ్యాక వంగుతుందా..”
అవునన్నట్లు సుల్తాన్ దీనంగా తలదించుకొని ఆడించాడు.
రాబర్ట్ కారు డ్రయివర్ కరీమ్.. కారులో వచ్చి నరసింహశాస్త్రి గారి యింటి ముందు ఆపి దిగి లోనికి వచ్చాడు.
వాడిని చూచి సుల్తాన్.. “కరీమ్!.. ఇక్కడికి ఎందుకు వచ్చావు?..” అన్నాడు.
“శాస్త్రిగారితో మాట్లాడాలి..”
“విషయం ఏమిటి?..”
“రాబర్ట్ దొర.. మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు..”
“ఎందుకు?..”
“వారు నాతో చెప్పలేదు..”
“అవసరం ఎవరిది?..”
“నాకు తెలియదు..”
“అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు నీతో అవసరం వుంటే నేను నీ యింటికి రావాలి. నీకు నాతో అవసరం వుంటే నీవు నా యింటికి రావాలి. ఇది మర్యాద”
“వారు దొరలు..”
“ఎవరికి?..”
“మనందరికీ!..”
“కాదు.. నీ వరకు.. పోయి నీ దొరకు చెప్పు. తాను నాతో మాట్లాడాలనుకొంటే.. యీ సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయానికి రమ్మను. ఆ సమయాన నేను అక్కడ వుంటాను.”
“అయ్యగారు చెప్పింది అర్థం అయిందా!..” సుల్తాన్ కరీమ్‌ను చూస్తూ అడిగాడు.
వాడు తల ఆడించాడు.
“అయితే ఇక వెళ్ళు..” అన్నాడు సుల్తాన్.
కరీమ్ మౌనంగా వెళ్ళిపోయాడు.
“సుల్తాన్!.. కరీమ్ నీకు బంధువా?..’
“కాదయ్యా!.. తెలిసినవాడు..”
“అతని తత్వం ఎలాంటిది?..”
“ఎలాగైనా బ్రతకాలనే తత్వం..”
“అంటే నీకు పూర్తి విరుద్ధం..” నవ్వారు శాస్త్రిగారు.
అవునన్నట్లు తల పంకించాడు సుల్తాన్. శూన్యంలోకి చూస్తూ.
“సుల్తాన్!.. ఏదో ఆలోచనలో వున్నట్లు వున్నావు!..”
“అవునయ్యా!..”
“విషయం ఏమిటి?..”
“తమరిని గురించే ఆలోచిస్తున్నానయ్యా!..”
“నా గురించా! “
“అవును..”
“నాకు సంబంధించిన ఏ విషయంలో!..”
“రాబర్ట్‌ను మీరు శ్రీ మహాలక్ష్మి గుడి వద్దకు రమ్మన్నారు కదా!..”
“అవును.. అతనికి నాతో మాట్లాడాలని వుంటే!..”
“అతను మీతో మాట్లాడబోయే విషయం ఏమిటో తమరు వూహించారా!..”
“రాఘవను గురించి..”
“మీ వూహ నిజమయ్యా!.. వారు రాఘవను గురించి అడిగితే తమరు ఏం చెబుతారు?..”
“ఎక్కడ వున్నాడో నాకు తెలియదని చెబుతాను.. అదే కదా నిజం!..”
“అవునయ్యా!..” విచారంగా చెప్పాడు సుల్తాన్.
“సుల్తాన్!.. ఎదిగిన వారు మనవారైనా.. పరాయి వారైనా మనం చెప్పిన మంచి మాటలను అర్థం చేసికొని వారి తత్వాన్ని మార్చుకొనే రోజులు పోయాయి. ఎవరి నిర్ణయం వారిది.. యీ తరం వారిలో చాలా మందికి విచక్షణా జ్ఞానం నశించిందని నా భావన..” విచారంగా చెప్పారు నరసింహశాస్త్రి.
“అవునయ్యా!.. తమరు చెప్పిన మాట సత్యం..” క్షణం తర్వాత
“అయ్యా!.. నేను వెళ్ళి వస్తాను..” చెప్పాడు సుల్తాన్.
“మంచిది..”
సుల్తాన్ శాస్త్రిగారికి నమస్కరించి వెళ్ళిపోయాడు.
నరసింహశాస్త్రి లేచి తన గదికి వెళ్ళిపోయాడు రాఘవను గురించి ఆలోచిస్తూ.
కరీమ్.. రాబర్ట్ వద్దకు వెళ్ళి శాస్త్రిగారు చెప్పిన జవాబును నటన పూర్వకంగా.. అతనికి తెలియజేశాడు.
కర్నల్ రాబర్ట్‌కు శాస్త్రిగారు.. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు ఎంతో ఆవేశం కలిగింది. ప్రతీకార వాంఛ ప్రబలింది.
“కరీమ్!.. యీ రోజు అమావాస్య. ఆలయం నుంచి బంగారు విగ్రహాన్ని లేపెయ్యాలి, ఆ పని నీవు చేయకపోతే రేపు నిన్ను కాల్చి పారేస్తాను” శాస్త్రిగారి మీద వున్న కోపాన్ని కరీమ్ పై చూపించాడు రాబర్ట్.
కరీమ్ బెదిరిపోయి.. “సార్!.. భార్యాబిడ్డలు కలవాణ్ణి. నా మీద దయ చూపండి. యీ రాత్రికి విగ్రహాన్ని ఎలాగైనా లేపేస్తాను” అన్నాడు.
“వెళ్ళు.. కావలసిన ఏర్పాట్లు చేసికో..” వెయ్యి రూపాయిలను కరీమ్‍కు అందించాడు.
డబ్బును అందుకొని కరీమ్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
ఐదు గంటల నుండి.. ఆరున్నర గంటల వరకూ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శాస్త్రిగారు శ్రీమద్భాగవతాన్ని చదివి.. శ్రోతలకు మూడు వారాలుగా వినిపిస్తున్నారు. శ్రీమన్నారాయణుని దివ్యలీలలను వివరిస్తున్నారు. ఆ రోజూ వారు ఆలయంలో అదే కార్య నిమగ్నులై వున్నారు. ఆరున్నరకు రాబర్ట్ శకటం వచ్చి.. ఆలయం ముందు ఆగింది.
అతని కారు దిగి ఆలయం వైపు చూచాడు. వయస్సు మళ్ళిన వాళ్ళు వంద మందికి పైగా స్త్రీ పురుషులు శాస్త్రిగారు చెప్పే పురాణాన్ని వింటున్నారు. వారి ప్రసంగం ముగిసింది.
అర్చకుడు మాతకు నైవేద్యాన్ని పెట్టి.. హారతి వెలిగించాడు. అందరూ లేచి ఆ జగన్మాత ముందు చేతులు జోడించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాబర్ట్‌ను చూచి బెదిరి ఒకరి వెనుక ఒకరు ఆలయం నుండి బయటికి నడిచారు.
పూజారి.. నరసింహశాస్త్రిగారి ముఖంలోకి దీనంగా చూచాడు.
“అతను వచ్చింది నాకోసం.. నీవు భయపడకు. నీ పనిని నీవు సాగించు..” చెప్పి.. శాస్త్రిగారు రాబర్ట్‌ను సమీపించారు.
“గుడ్ యీవినింగ్ మిస్టర్ రాబర్ట్.. యువర్ పంచువాలిటీ యీజ్ యక్స్‌లెంట్” చిరునవ్వుతో చెప్పాడు శాస్త్రిగారు.
ఆ సమయంలో రాబర్ట్ చూపులు ఆలయంలో దేదీప్యమానంగా మెరుస్తున్న శ్రీ మహాలక్ష్మి విగ్రహం మీద వున్నాయి.
‘టుమారో మార్నింగ్ దట్ స్టాచ్యు విల్ రీచ్ మి..’ అనుకొన్నాడు అతని చూపు వున్న దిశను చూచి –
“మాతకు నమస్కరించు మిస్టర్ రాబర్ట్.. నిన్ను చల్లగా చూస్తుంది” చిరునవ్వుతో చెప్పాడు శాస్త్రిగారు ఆంగ్లంలో.
“వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ విత్ మీ నరసింహా!.. వై షుడ్ ఐ వర్షిప్ దట్ స్టాచ్యూ!..”
“ఫర్ యువర్ బెటర్‌మెంట్..”
క్షణం తర్వాత..
“లైఫ్‌లెస్ స్టాచ్యూ విల్ ప్రొవైడ్ బెటర్‌మెంట్..” ఆశ్చర్యంతో వికటంగా నవ్వాడు రాబర్ట్.. “నౌ కమ్ టు ది పాయింట్..”
“వాట్ యీజ్ దట్ పాయింట్’?..”
“వేర్ ఈజ్ యువర్ సన్-ఇన్-లా రాఘవ?..”
“ఐ డోంట్ నో..”
“డోన్ట్ సే లై..”
“వై షుడ్ ఐ!..”
“యు నో విత్ హూమ్ యు ఆర్ టాకింగ్..”
“విత్ మిస్టర్ రాబర్ట్..”
“నో.. బ్రిటీష్ కర్నల్ రాబర్ట్..” ఆవేశంగా చెప్పాడు రాబర్ట్.
“సో వాట్..”
“యు ఆర్ టాకింగ్ టూ మచ్..”
“యువర్ టాక్స్ ఆర్ యిల్-ట్రీటింగ్ మీ మిస్టర్ రాబర్ట్..” అనునయంగా చెప్పాడు శాస్త్రిగారు.
“ఐ యాం గివింగ్ వన్ వీక్ టైమ్!.. యు హ్యావ్ టు కమ్ అండ్ మీట్ మీ విత్ యువర్ సన్-ఇన్-లా. మేక్ ఏ నోట్..” శాసించాడు రాబర్ట్.
“ఇఫ్ ఐ సే నో!..”
“యు విల్ బి పనిష్డ్..”
“యు కాంట్ పనిష్ మీ వితౌట్ ఎ రీజన్!.. డోన్ట్ టాక్ ఇన్‌డీసెంట్ వే!..”
“వాడ్ డు యు మీన్ అబౌట్ కర్నల్ రాబర్ట్..”
“ఐ నో వెల్ హు యీజ్ రాబర్ట్!..”
“యు డోన్ట్ నో మీ!..” వికటంగా నవ్వాడు రాబర్ట్. కొన్నిక్షణాల తర్వాత.. “డు వాట్ ఐ సెడ్ టు యు!..”
“ఇప్ నాట్..”
“ఐ విల్ ఫుట్ యు బిహైండ్ ద బార్స్!..”
“మై అంకుల్ యీజ్ సీనియర్ అడ్వకేట్ మిస్టర్ గోపాలశర్మ.. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ బి అవుట్ ఆఫ్.. దెన్, యువర్ లైఫ్ విల్ బీ యిన్ గ్రేట్ మిజరీ.. యు మే బీ వైట్ మ్యాన్ విత్ పవర్.. అయాం ఏ బ్లాక్ మ్యాన్ విత్ విల్ పవర్!.. యువర్ బులెట్ పవర్ కాంట్ షేక్ మై విల్ పవర్.. యనఫ్.. ప్లీజ్ గో..” వ్యంగ్యంగా చెప్పారు శాస్త్రిగారు.
“యు సెడ్ టు మీ గెటౌట్..” ఆశ్చర్యంతో అడిగాడు రాబర్ట్.
“యస్!..” చెప్పి నరసింహశాస్త్రి ఆలయం వైపుకు నడిచారు.
రాబర్ట్.. నోటికి మాటలు కరువైనాయి. ఆశ్చర్యంతో వెళుతున్న నరసింహశాస్త్రి గారిని చూస్తూ నిలబడ్డాడు. కొన్నిక్షణాల తర్వాత తేరుకొని.. “యు డర్టీ బ్లాక్ ఫెలో.. యు ఆర్ ఛాలెంజింగ్ విత్ మీ!.. ఐ విల్ టీచ్ ఎ లెసన్!.. ఐ విల్ టీచ్ ఎ లెసన్..” బిగ్గరగా అంటూ.. ఆవేశంగా కారును సమీపించి కూర్చొని స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు రాబర్ట్.
ఆలయంలో ప్రవేశించి నరసింహశాస్త్రిని చూచి పూజారి..
“అయ్యా!.. వారితో మీరు ఇంగ్లీష్‍లో అంతసేపు మాట్లాడింది ఏమిటి?..”
నరసింహశాస్త్రి విరక్తిగా నవ్వి.. “వారి రాజ్యాంగ వ్యవహారాలను గురించి.. నేను ఇంటికి బయలుదేరుతున్నాను. తలుపులు మూసి మీరు ఇంటికి వెళ్ళండి” శాస్త్రిగారు ఆలయం నుండి బయలుదేరారు.
(ఇంకా ఉంది)