అద్వైత్ ఇండియా-38

0
3

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[కలకత్తాలో ఇల్లు సర్దుతున్న చామంతికి ఓ తెలుగు దినపత్రికలో చుట్టి ఉన్న లక్ష్మీదేవి బంగారు విగ్రహం కనబడుతుంది. మూడు వారాల క్రితం తమ ఊరి నుంచి వచ్చిన తండ్రీ, మావయ్యలు చెప్పిన దాని ప్రకారం ఆ విగ్రహం తమ ఊరి గుడిలోనిదేనని తలుస్తుంది. ఆ దినపత్రిక రాజమండ్రి నుంచి ముద్రితమైనది కావడంతో, తన అనుమానం నిజమని భావిస్తుంది. మర్నాడు విగ్రహాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా రైలెక్కి, రాజమండ్రికి బయల్దేరుతుంది. శాస్త్రి గారు జైల్లో, సావిత్రి ఆసుపత్రిలో ఉండి మూడు రోజులు గడుస్తాయి. నాల్గవరోజు సావిత్రి చనిపోతుంది. రెడ్డిరామిరెడ్డి గారు జైలుకి వెళ్ళి, అధికారులతో మాట్లాడి శాస్త్రి గారికి ఈ వార్త తెలియజేసి ఆయనను బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అయితే రాబర్ట్ అనుమతిస్తేనే విడుదల చేస్తామని అధికారులు చెప్తారు. రాబర్ట్ ఒప్పుకోడు. సీత సుల్తాన్‍తో కలిసి వెళ్ళి శాస్త్రిగారిని విడుదల చేయమని, ఆయనకి బదులుగా రెండు వారాల తరువాత తానే వచ్చి జైల్లో కూర్చుంటానని అంటుంది. సరేనంటాడు. సిగరెట్ పాకెట్ మీద -శాస్త్రిగారిని విడుదల చేయమని రాసి సంతకం పెట్టి ఇస్తాడు. దాంతో శాస్త్రిగారు జైల్లోంచి బయటకు వస్తారు. అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతాయి. ఈలోపు అద్వైత్ అక్కడికి చేరుకుంటాడు. తన ఇంటి వైపు నడుస్తున్న అద్వైత్‌కి, వీధిలోని స్త్రీలు సావిత్రి చనిపోయిందన్న విషయం చెప్తారు. చేతిలో ఉన్న సంచులక్కడే పడేసి పరిగెత్తుతాడు. ఆ స్త్రీలు ఆ సంచుల్ని శాస్త్రి గారింటికి చేరుస్తారు. కొడుకుని చూసిన శాస్త్రిగారు దుఃఖిస్తారు. అద్వైత్ వేదనకి అంతుండదు. సీతని పలకరిస్తాడు, పాపను చూస్తాడు. చివరికి తల్లి అంత్యక్రియలు సజావుగా పూర్తి చేస్తాడు.]

అధ్యాయం 75:

[dropcap]చా[/dropcap]మంతి రాజమండ్రి చేరింది. తన పుట్టింటికి వెళ్లి తల్లీ తండ్రీ మామయ్యలకు తాను ఎంతో ప్రయాసతో తెచ్చిన శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని చూపించింది.

ఆమె చెప్పిన మాటలను విని వారు ఆశ్చర్యపోయారు. ఆమె చేసిన సాహసాన్ని మెచ్చుకొన్నారు.

బాలయ్యా.. రంగయ్యలు రామిరెడ్డిగారిని కలసి మాత విగ్రహాన్ని వారికి అప్పగించారు. తమకు చామంతి చెప్పిన మాటలను వారు రెడ్డిగారికి చెప్పారు. ఆ సమయంలో అక్కడ వున్న సుల్తాన్..

“అయ్యా!.. చూచారా!.. నా అనుమానం నిజం అయింది..” అన్నాడు.

“పద సుల్తాన్!.. విషయాన్ని శాస్త్రిగారికి చెబుదాం. పుట్టెడు దుఃఖంలో వున్న వారు యీ విషయాన్ని వింటే.. కొంత వరకూ సంతోషిస్తారు.” అన్నాడు రెడ్డిగారు.

నలుగురూ శాస్త్రిగారి ఇంటికి వెళ్ళారు. విషయాన్ని చెప్పారు. విగ్రహం దొరికినందుకు వారు ఎంతగానో సంతోషించారు. చామంతి ధైర్యసాహసాలను గొప్పగా మెచ్చుకొన్నారు.

ఆనాటి నుంచీ సుల్తాన్.. కరీమ్, చలమయ్యలను పట్టుకోవాలనే ప్రయత్నంలో నిమగ్నుడైనాడు.

సుల్తాన్ కొడుకు అంజాద్.. అతని బృందం.. రాఘవ కోసం.. గాలిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.

అద్వైత్.. తన తల్లి సావిత్రి కర్మ క్రతువులను ఎంతో శ్రద్ధా భక్తితో నిర్వహించాడు. అన్ని విషయాలకు ఆ తండ్రీ కొడుకులను రెడ్డిరామిరెడ్డి గారు అండగా నిలబడి ఎంతో సాయం చేశారు. అది వారికి ఆ కుటుంబం మీద వున్న ప్రేమాభిమానాలకు తార్కాణం.

సీత రాబర్ట్‌కు చెప్పిన పదిహేను రోజుల గడువు రేపటితో తీరిపోతుంది. అంటే రేపు వుదయం తొమ్మిది గంటలకు సీత రాబర్ట్ సమక్షంలో వుండాలి.

ఆ రాత్రి.. సీత అందరినీ హాల్లోకి రమ్మని పిలిచింది. అందరూ హాల్లో సమావేశం అయినారు. సీత ఏం చెప్పబోతుందోనని అందరూ ఆమె ముఖంలోకి ఆత్రుతగా చూస్తున్నారు. అందరి ముఖాల్లోకి ఒక్కసారి చూచి.. “మామయ్యా!.. నేను మిమ్మల్ని జైలు నుండి విడిపించేటందుకు రాబర్ట్‌ను కలిశాను. అతను ఒక కండిషన్ చెప్పాడు. మిమ్మల్ని విడిపించేటందుకుగాను, నేను ఆ కండిషన్‌కి అంగీకరించాను.”

“ఏమిటమ్మా ఆ నిబంధన!..” అడిగారు శాస్త్రిగారు.

“మిమ్మల్ని విడిపించాలంటే.. నన్ను జైల్లో కూర్చోమన్నాడు..” ఎంతో గంభీరంగా చెప్పింది సీత.

“సీతా! దానికి నీవు అంగీకరించావా!..”.

“అంగీకరించాను బావా!..”

“తప్పు చేశావమ్మా!..” విచారంగా చెప్పారు శాస్త్రిగారు.

“నేను అంగీకరించి వుండకపోతే.. వాడు మిమ్మల్ని ఒదిలేవాడు కాదు మామయ్యా..” మెల్లగా చెప్పింది సీత.

“మామయ్యా.. సీతకు బదులుగా.. నేను వెళతాను..” అన్నాడు పాండు.

అద్వైత్.. సుమతులు పాండు.. ముఖంలోకి చూచారు.

“నాకేం భయం లేదు బావా!..”

“పాండూ!..” పిలిచాడు అద్వైత్.

“చెప్పండి బావా!..”

“వెళ్ళవలసింది నీవు కాదు.. నేను!..” నిశ్చలంగా చెప్పాడు అద్వైత్.

సీత అతని ముఖంలోకి చూచింది. చిరునవ్వు నవ్వాడు అద్వైత్.

ఆ నవ్వులో సంతోషం లేదు, విరక్తి,

“నేను చెప్పే మాటను అందరూ వినండి. మీరు చిన్నపిల్లలు.. మీ భార్యా బిడ్డలకు దగ్గరగా వుండవలసిన సమయం. వారికి మీ అవసరం ఎంతో వుంది. కాబట్టి.. నేను వచ్చిన పని పూర్తయిందిగా!.. నేను వెళతాను. అదే న్యాయం..” చెప్పారు శాస్త్రిగారు.

“నాన్నగారూ!.. గడచిన సంవత్సరం రోజుల్లో మీ శరీర తత్వంలో ఎంతో మార్పు. మీరు బాగా తగ్గిపోయారు. పైగా మీకు వయస్సు అవుతూ వుందిగా!.. ప్రశాంతమైన వాతావరణంలో మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. రేవు నేను వెళ్ళి రాబర్ట్ గారితో మాట్లాడుతాను. గత పదిహేను రోజులుగా అందరి శరీరాలు ఎంతగానో అలసి వున్నాయి. వెళ్ళి ప్రశాంతంగా పడుకొండి” ఎంతో అనునయంగా చెప్పాడు అద్వైత్.

కొన్నిక్షణాలు అద్వైత్ ముఖంలోకి పరీక్షగా చూచి శాస్త్రిగారు తన గదికి వెళ్ళిపోయారు.

పాండు, సుమతి వారి గదికి చేరారు.

అద్వైత్.. సీత తమ గదిలోనికి నడిచారు.

అది మంచంపై కూర్చొని నిద్రపోతున్న పాప ముఖంలోకి చూచాడు. ఆమె తలపై తన చేతిని వుంచాడు. ‘అందరూ అంటున్నట్లు యీమె ముమ్మూర్తులా నా పోలికే!..’ ఆ భావన మదిలోకి రాగానే పెదవులపై చిరునవ్వు.. అతని ముఖంలోకి చూచింది సీత..

“మీ ముఖంలో ఆ చిరునవ్వును చూచి పదమూడు మాసాలయింది బావా!..” ప్రక్కన కూర్చొని ప్రీతిగా అతని కళ్ళల్లోకి చూచింది.

నవ్వుతూ సీత ముఖంలోకి చూచాడు అద్వైత్.

“మీ వియోగంతో గడచిన కాలంలో నేను చాలా నేర్చుకొన్నాను బావా!..”

“ఏం నేర్చుకొన్నావు?..”

“శాంతి.. సహనం.. సౌభ్రాత్రం..”.

“ఊఁ.. పాపకు పేరేం పెట్టారు?..”.

“ఇంకా బాలసారె జరగలేదు. మీరు వచ్చాక బాలసారె జరుపుకొందాం అని మామయ్యతో చెప్పాను.”

“మా అమ్మ ‘భవానీ’ పుట్టిందని సంబరపడిపోయారు” నవ్వుతూ చెప్పింది సీత.

అద్వైత్ పాపను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఆ చిన్నారి మేలుకొని బోసినవ్వులతో అది ముఖంలోకి చూచింది.

“అమ్మా!.. నిద్ర లేచావా.. పద నీకు పేరు పెడతాను. సీతా రా?..” పాపతో ఇరువురూ పూజ గదికి వెళ్ళారు. “ఈ గదిలోనే మనం నమ్మిన దైవల ముందు నీ మెడలో నేను మాంగల్యాన్ని కట్టాను. అలాగే యీనాడు.. నా చిట్టి తల్లికి నామకరణాన్ని చేస్తున్నాను.”

పాప చెవి దగ్గరకు తన నోటిని చేర్చి.. “భవానీ.. భవానీ.. భవానీ..” నవ్వుతూ మూడు సార్లు చెప్పాడు.

“బావా!.. ఆ పేరు నాకు ఎంతో యిష్టం” నవ్వింది సీత.

“నాక్కూడా సీత..” చిరునవ్వుతో పాప నొసటన ముద్దు పెట్టాడు అద్వైత్

అధ్యాయం 76

మరుదినం వుదయం తండ్రికి.. సీతకు చెప్పి అద్వైత్ రాబర్ట్ కార్యాలయానికి వెళ్ళాడు. రాబర్ట్‌ను కలిశాడు.

“ఓ ఆదీ!.. ఎప్పుడొచ్చావ్ లండన్ నుంచి..”

“వచ్చి రెండు వారాలయింది సార్!..”

“పాపం.. మీ అమ్మగారు.. చచ్చిపోయారటగా!..”

“అవును..”

“నీ వైఫ్ పేరు.. పేరు..”

“సీత..”

“ఆ సీత!..” నవ్వాడు రాబర్ట్.. “వెరీ డైనమిక్ లేడీ!..” మరలా నవ్వాడు.

“యస్..” అన్నాడు అద్వైత్ ముక్తసరిగా.

“వేర్ ఈజ్ షీ.. షీ ఈజ్ సపోస్డ్ టు కమ్ అండ్ రిపోర్టు టు మీ!..”

“ఆమెకు బదులుగా నేను వచ్చాను..” ఆంగ్లంలో చెప్పాడు అద్వైత్.

“మీన్.. యు విల్ సిట్ ఇన్ ద జైల్..”

అద్వైత్ కొన్నిక్షణాలు మౌనంగా వుండిపోయాడు.

“ఆన్సర్ మీ.. ఆర్.. టెల్ మీ వేర్ ఈజ్ యువర్ బ్రదర్-ఇన్-లా రాఘవ?..”

“ఐ డోంట్ నో అబౌట్ హిం..”

“బట్.. హీనోస్ అబౌట్ యు నో!..”

“అఫ్‌కోర్స్”

“ఏయ్ !.. ఆదీ.. యు గో టుడే.. ఎంజాయ్ విత్ వువర్ వైఫ్. కం టుమారో బై ద సేమ్ టైమ్!..”

“థాంక్యూ!..” చెప్పి అద్వైత్ ఇంటికి వెళ్ళిపోయాడు.

జరిగిన సంభాషణను తండ్రికి సీతకు చెప్పాడు. వారు మౌనంగా విన్నారు.

ఆ రాత్రి సీత.. లండన్ విశేషాలను అడుగుతూ, “బావా!.. ఇండియా ఎలా వుంది?..” అంది.

ఇండియా జ్ఞప్తికి రాగానే..

ఆ పేరు వినగానే.. అద్వైత్ ఆలోచన ఇండియా వైపుకు మరలింది.

“ఏంటి బావా ఆలోచిస్తున్నారు?..”

“మరచిపోయాను సీతా..” మంచంపై నుంచి వేగంగా లేచి తన లగేజ్‌లో ఒక బ్యాగ్‌ను తెరచి తాను షిప్ ఎక్కే ముందు ఇండియా ఇచ్చిన చిన్న బాక్సును సీతకు అందించాడు అద్వైత్.

“బావా!.. ఏమిటిది?..”

“లోపల ఏముందో నాకూ తెలీదు. విప్పి చూడు. నీవు గర్భవతివన్న మాట విన్నాక.. నేను బయలుదేరే ముందు ‘నా సిస్టర్ బిడ్డకు నా చిన్న కానుక’ అని చెప్పి నాకు యిచ్చింది ఇండియా..”

సీత పాకెట్ విప్పి చూచింది. బంగారు గొలుసు, చేతికి తీసుకొంది పరిశీలనగా చూచింది.

“చాలా బాగుంది బావా!..”.

“నిజంగానా!..”

“అవును.. ఇండియా మనస్సు స్వచ్ఛమైన బంగారం..”

“ఇండియా మనస్సు అంత స్వచ్ఛమా..”.

“అవును..” క్షణం తర్వాత.. “సంవత్సరం రోజులు ఆమెతో కలసి వున్నావు కదా.. ఆమె మనస్తత్వం నీకు అర్ధం కాలేదా!..” అడిగింది సీత.

నవ్వాడు. అద్వైత్..

“ఏమిటా నవ్వు!..”

“అలాంటి ఆలోచనలు చేసే దానికి నాకు అక్కడ సమయం దొరకలేదు సీతా!..”

“యీ మాటను నేను నమ్మాలా!..”.

“ఇప్పుడు నీలో నాకు ఎవరు కనిపిస్తున్నారో తెలుసా!..”.

“ఇండియానా!..” నవ్వింది సీత.

“కాదు.. సంవత్సరం క్రిందటి నా మరదలు సీత..”

సీత మనస్సులో రాబర్ట్ ప్రవేశించాడు.

“బావా!.. రేపు నిన్ను రాబర్ట్ ఏమడుగుతాడు?..”

“ఏమైనా అడగవచ్చు. వాడు ఎన్ని రకాలుగా అడిగినా రాఘవను గురించే కదా!..”

“అవును. అన్నయ్య ఎక్కడున్నాడో.. ఎలా వున్నాడో!..” సీత ముఖంలోని ఆనందం స్థానంలో ఆవేదన నిండుకొంది.

“నేను ఎన్నో విధాల వాడికి చెప్పాను.. ఆవేశాన్ని తగ్గించుకోరా అని.. నా మాటలను లెక్క పెట్టలేదు” విచారంగా చెప్పాడు అద్వైత్.

“బావా!.. మా అన్నయ్య మంచివాడా చెడ్డవాడా!..”.

“చాలా మంచివాడు సీత.. వాడిలో వున్న చెడ్డ గుణం.. ఆవేశం..”.

“అన్నయ్య మీద నీకు కోపం లేదా!..”.

“లేదు సీతా!.. వాడి మీద నాకు కోపం ఎన్నటికీ రాదు”

రాఘవ ఆలోచనలు.. ఆ ఇరువురి మనస్సులను కలచి వేశాయి. మౌనంగా పడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here