[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[చామంతి రాజమండ్రి చేరి, తన పుట్టింటికి వెళ్లి తల్లీ తండ్రీ మామయ్యలకు తాను ఎంతో ప్రయాసతో తెచ్చిన శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని చూపిస్తుంది. వారు ఆమె సాహసాన్ని మెచ్చుకుంటారు. బాలయ్య, రంగయ్యలు రామిరెడ్డిగారిని కలసి మాత విగ్రహాన్ని వారికి అప్పగించి, చామంతి చెప్పిన వివరాలు తెలియజేస్తారు. రామిరెడ్డి గారు సుల్తాన్‍తో కలిసి, శాస్త్రిగారింటికి వచ్చి విగ్రహం దొరికిందని చెప్పగా, ఆయన ఎంతో సంతోషించి చామంతి సాహసాన్ని అభినందిస్తారు. తల్లి దశదిన కర్మను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తాడు అద్వైత్. రాబర్ట్ ఇచ్చిన 15 రోజుల గడుపు సమీపిస్తుండడంతో సీత ఓ రాజు రాత్రి కుటుంబ సభ్యులందరినీ పిలిచి, తాను జైలుకి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని, మావగారి బదులు తను కూర్చుంటానంటేనే, రాబర్ట్ మామగారిని విడిపించడానికి ఒప్పుకున్నాడనీ చెబుతుంది. సీత బదులుగా తాను వెళ్తానని అద్వైత్ చెప్తాడు. ఆ రాత్రి పాపకి భవాని అని పేరు పెడతాడు అద్వైత్. మర్నాడు రాబర్ట్ దగ్గరకి వెళ్ళి సీత బదులు తాను వచ్చానని చెప్తాడు. రాఘవ గురించి అడిగితే, తనకు తెలియదంటాడు అద్వైత్. ఈ రోజుకి వెళ్ళి రేపు రా అని అంటాడు రాబర్ట్. ఆ రాత్రి సీత లండన్ విశేషాలను అడుగుతూ, ఇండియా ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు హఠాత్తుగా ఇండియా, సీతకి ఇవ్వమని తనకిచ్చిన కానుక గుర్తొస్తుంది అద్వైత్‌కు. గబగబా బ్యాగ్ నుంచి ఆ బాక్సుని తీసి సీతకి ఇచ్చి – తమ షిప్ బయల్దేరేముందు నీకివ్వమని ఇండియా ఇచ్చిందని చెప్తాడు. తెరిచి చూస్తే, అందులో ఒక బంగారు గొలుసు ఉంటుంది. మర్నాడు రాబర్ట్ రాఘవ గురించి ఏమి అడుగుతాడో అని దిగులు పడుతుంది సీత. రాఘవ మంచివాడే గాని ఆవేశం అతని చెడ్డ గుణమని చెప్తాడు అద్వైత్. రాఘవ ఆలోచనలతోనే నిద్రిస్తారు ఇద్దరూ. – ఇక చదవండి.]
అధ్యాయం 77:
[dropcap]అ[/dropcap]ద్వైత్.. మరుసటి రోజు వుదయాన్నే రాబర్ట్ కార్యాలయానికి బయలుదేరాడు.
దార్లో అతనికి సుల్తాన్ కొడుకు అంజాద్ ఎదురైనాడు. వాడి తత్వం తెలిసి వున్న అద్వైత్.. చూడనట్లు నేరుగా ముందుకు పోబోయాడు.
అంజాద్.. “అరే అద్వైత్!.. ఆగరా!..” అంటూ అద్వైత్ ముందుకొచ్చి నిలబడ్డాడు.
“ఏమిటి అంజాద్!”
“ఓ సాలా!.. నీ బామ్మరిది రాఘవ ఎక్కడరా!..”
“ఎక్కడ వున్నాడో నాకు తెలియదు..”
“నీకు తెలియకుండా వాడు ఏడవుంటాడ్రా!..”
“నేను అబద్ధం చెప్పను..”
“అట్టాగా!..” వెటకారంగా అన్నాడు అంజాద్.
“అవును..” గట్టిగా చెప్పాడు అద్వైత్. రెండు క్షణాల తర్వాత..
“చూడు అంజాద్!.. నీ మాటల తీరు నాకు నచ్చదు. నీతో వాదించడం నాకు యిష్టం లేదు. నీ దారిన నీవు వెళ్ళు.. నా దారిన నన్ను వెళ్ళనీ!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.
“ఏడకి పోతావుండావ్!..”
“మిస్టర్ రాబర్ట్‌ను కలవడానికి..”
“విషయం ఏమిటో..” వ్యంగ్యంగా నవ్వాడు అంజాద్.
“అది నీకు అనవసరం!..”
“పో.. పో.. ఇక తిరిగి రావులే!..” వికటంగా నవ్వాడు అంజాద్.
అద్వైత్ అతని ముఖంలోకి తీక్షణంగా చూచి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.
అద్వైత్ రాబర్ట్ కార్యాలయాన్ని చేరాడు. దాని ముందు ఒక వ్యాన్ నిలబడి వుంది. వెనక క్యాబిన్‌లో ముగ్గురు వ్యక్తులు వున్నారు. గడ్డాలు మీసాలతో వారి ముఖాలు కళావిహీనంగా వున్నాయి.
అద్వైత్ రాబర్ట్ గదిలో అతను పిలవగా ప్రవేశించాడు. అక్కడ ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ నిలబడి వున్నాడు. “హి యీజ్ ద ఫెలో. పుట్ హిం హండ్‍కఫ్స్” కర్కశంగా చెప్పాడు రాబర్ట్. ఇన్‌స్పెక్టర్ అద్వైత్ చేతులకు సంకెళ్ళు వేశాడు. అద్వైత్ ఆశ్చర్యపోయాడు.
“టేక్ హిమ్ టు అండమాన్..” శాసించాడు రాబర్ట్.
ఇన్‌స్పెక్టర్ అద్వైత్‌ను ఆ వ్యాన్లో ఎక్కించాడు. వ్యాన్ కదలి ముందుకు వెళ్ళిపోయింది.
రాబర్ట్ చర్య.. అర్థంకాని అద్వైత్ ఏమీ మాట్లాడలేక పోయాడు.
“టెక్ హింటు అండమాన్..” అన్న మాట వల్ల అద్వైత్‌కు అర్థం అయింది.
రాఘవ వారికి దొరకనందున.. నిన్న తియ్యగా మాట్లాడి యీరోజు తనకు యీ శిక్షను విధించాడని అనుకొన్నాడు అద్వైత్.
దార్లో సుల్తాన్ కనుపించడంతో.. తన చేతులకున్న బేడీలను పైకెత్తి ‘సుల్తాన్ భాయ్..’ అని అరిచాడు అద్వైత్. అతని గొంతు విన్న సుల్తాన్ తన్ను దాటి ముందుకు దూసుకు పోయిన వ్యాన్‌ను.. అందులో వున్న అద్వైత్‌ను చూచాడు. నేరుగా స్టేషన్‌కు వెళ్ళాడు. సబ్ ఇన్‌స్పెక్టర్‌ను అద్వైత్‌ను గురించి అడిగాడు.
“అతని బావమరది.. రాఘవ హంతకుడు. అతనికి సంబంధించిన వివరాలు అడిగితే.. అద్వైత్ గాని.. అతని తండ్రిగాని.. నిజాన్ని దాచి.. మాకు తెలియదన్నారు. ఆ కారణంగా అద్వైత్‌ను ప్రభుత్వ ద్రోహిగా పరిగణించి అండమాన్ కారాగారానికి పంపారు మా తెల్లదొరలు. రాఘవ మాకు చిక్కిన నాడే.. అద్వైత్‌కు విముక్తి. వాడు దొరక్కపోతే.. వీరు జీవితాంతం అండమాన్ జైల్లో కృంగి.. కృశించి చావవలసిందే!..” వికటాట్టహాసంతో నవ్వాడు సబ్ ఇన్‌స్పెక్టర్.
సుల్తాన్‌కు విషయం పూర్తిగా అర్థం అయింది. అతని ముఖం విలవిలబోయింది. బదులు మాట్లాడలేని స్థితి మౌనంగా స్టేషన్ నుండి రామిరెడ్డిగారి యింటి వైపుకు నడిచాడు.
అద్వైత్ బేడీలతో వ్యాన్ ఎక్కేటప్పుడు చూచిన పాల విక్రయదారుడు సోము చూశాడు. నరసింహశాస్త్రిగారి ఇంటికి వెళ్ళి తాను చూచిన దృశ్యాన్ని గురించి శాస్త్రిగారికి చెప్పాడు. శాస్త్రిగారు ఆ వార్తను విని.. కన్నీటితో వరండాలో కుర్చీలో ఒరిగిపోయారు.
రామిరెడ్డి సుల్తాన్ చెప్పిన విషయాన్ని విని.. రాబర్ట్ కార్యాలయానికి సుల్తాన్‌తో కలిసి వెళ్ళాడు.. పూర్వపు మాదిరే.. రాబర్ట్ వారితో మాట్లాడేదానికి నిరాకరించాడు. వారికి వినపడేటట్లుగా..
“టేక్ దోస్ ఫెలోస్, కమ్ విత్ రాఘవ..” ఆవేశంగా బిగ్గరగా అరిచాడు.
కుటుంబంలో ఎవరైనా ఒకరు చేయరాని నేరాన్ని చేస్తే దాని ప్రభావం.. ఆ కుటుంబ సభ్యుల మీద ఎలా పరిణమిస్తుందనే దానికి రాఘవ చర్య.. అద్వైత్‌కు రాబర్ట్ వేసిన శిక్ష ప్రత్యక్ష సాక్ష్యాలు.
సావిత్రమ్మ మరణంతో.. ఎంతో వేదనతో వున్న నరసింహశాస్త్రి గారికి యీ విషయాన్ని ఎలా తెలియజేయాలని.. రామిరెడ్డి.. సుల్తాన్లు ఎంతగానో మథనపడ్డారు. కానీ.. తమకు తెలిసిన విషయాన్ని వారికి చెప్పకుండా ఎంతకాలం దాచగలం!?.. ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్ళిన అద్వైత్ రెండు మూడు గంటల్లో ఇంటికి చేరకపోతే.. శాస్త్రి గారు.. సీత.. పాండు ఏమనుకొంటారు?.. ఎంతగా బాధపడతారు?.. యీలోగా మరెవరన్నా విషయాన్ని వారికి చెప్పి వుంటే.. వారు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నారు!.. విషయం తెలిసిన వారిని ఓదార్చే వారెవరు? వూరడించే వారెవరు?..
ప్రశ్నలతో సతమతమౌతూ రామిరెడ్డి.. సుల్తాన్లు శాస్త్రిగారి ఇంటిని సమీపించారు. లోన ప్రవేశించారు. వారిని చూడగానే.. శాస్త్రిగారు..
“సుల్తాన్.. రెడ్డిగారూ.!.. మా ఇంటికి గ్రహణం పట్టింది..” గద్గద స్వరంతో కన్నీటితో చెప్పారు శాస్త్రిగారు. వారి మాటల వలన.. సుల్తాన్ రెడ్డిగార్లు.. వారి చెవికి విషయం చేరిందనుకొన్నారు.
వీరి రాకకు పది నిముషాల ముందు బయట పనికి వెళ్ళి వచ్చిన పాండుతో విషయం శాస్త్రి గారు చెబుతూ వుండగా విన్న సీత ‘బావా!..’ అంటూ కుప్పలా నేల కూలింది. సుమతి.. పాండు ఆమెను గదికి చేర్చారు.
“శాస్త్రిగారు.. తమరు అన్నీ తెలిసినవారు.. మీకు మేము చెప్పేటంతటి వాళ్ళము కాము. మీరన్నట్లు ప్రస్తుతం మీకిది గ్రహణ కాలమే!.. ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవలసిన సమయం. కాలచక్రభ్రమణతో.. మార్పులు సహజం కదా స్వామీ!.. దుఃఖాన్ని మీరు దిగమ్రింగి సీతమ్మకు మీరే ధైర్యాన్ని చెప్పాలి.. ఆ బాధ్యతను మీకన్నా వేరెవరూ సవ్యంగా నెరవేర్చలేరు” ఎంతో అనునయంగా రెడ్డిగారు చెప్పారు. శాస్త్రిగారు కళ్ళు మూసుకొని తల ఆడించారు.
అధ్యాయం 78
రాఘవ రాబర్ట్ మనుషులకు దొరకని కారణంగా.. ఆలోచించి.. రాబర్ట్ అద్వైత్‌ను దోషిగా చేసి అండమాన్ జైలుకు పంపాడు.
ఆ సన్నివేశం జరిగిన మరుదినం నుండీ సుల్తాన్ తెల్లదొరల కొలువుకు స్వస్తి చెప్పి నరసింహశాస్త్రితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. తనకు తెలిసిన వేదాంతాన్ని వారికి చెప్పేవాడు. వుదయం సాయంత్రం తప్పనిసరిగా శాస్త్రిగారిని కలిసేవాడు. త్వరలో గ్రహణం విడిపోయి మంచి రోజులు వస్తాయనీ.. చిన్న బిడ్డ తల్లి సీతను, మనమందరం జాగ్రర్తగా చూచుకోవాలని ఆమెకు ధైర్యం చెప్పి, పరిస్థితికి ఎదురు నిలిచేలా చేయాలని.. ప్రస్తుత తమరి కర్తవ్యం అదేనని శాస్త్రిగారికి ఎంతో సౌమ్యంగా చెప్పేవాడు సుల్తాన్.
నేరం చేసి.. దూరంగా వెళ్ళిపోయిన రాఘవ.. మన ఇంటి పరిస్థితులను తెలుసుకొంటే తెగించి ఎక్కడ వున్నా.. మీ అందరి ఆనందం కోసం.. తన బావను అండమాన్ జైలు నుంచి విడిపించేటందు కోసం.. తప్పక వస్తాడని.. రెడ్డిగారు ఎంతో ఆశాజనకంగా శాస్త్రి గారికి చెప్పేవాడు.
వారిరువురి భవిష్యత్తు జాతకరీత్యా తెలిసిన నేను.. సావిత్రి ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసిన విషయాన్ని ఆమెకు చెబితే తట్టుకోలేకపోతుందని చెప్పలేకపోయానని.. నన్ను ఎదిరించి ఎదురు ప్రశ్నలు వేయడం తెలియని సావిత్రి.. తన ఆవేదనంతా హృదయంలోనే దాచుకొని.. నేను జైలు పాలు కావడంతో గుండె ఆగి చనిపోయిందని.. ఆమె మరణానికి నేనే కారకుడనని శాస్త్రిగారు వాపోయేవారు.
ఎంతో ప్రీతిగా అనునయ వాక్యాలను చెప్పి రెడ్డిగారు సుల్తాన్ వారిని ఓదార్చేవారు.
సీత.. జీవితం.. అంధకార బంధురమయింది. సుమతి ఆమెను అనుక్షణం వెంటవుండి.. అన్నయ్యను రాబర్ట్ త్వరలో విడిపిస్తాడని అతను తిరిగి వస్తాడని ఓదార్చేది.. పాపను సీతను తన ప్రాణ సమానంగా ఎంతో ప్రీతిగా చూచుకొనేది.
పాండురంగ.. తన మామగారి వద్ద చిన్నతనం నుండి నేర్చుకొని ధర్మసూక్తులు.. మానవ నిర్ణయాలు.. దానికి పరమేశ్వరుని తీర్పులను గురించి చెబుతూ.. “అన్నీ తెలిసిన మీరు ఇలా వుండే.. మేమంతా ఏం కావాలి మామయ్యా!.. మాకు దిక్కు దైవం మీరే కదా!.. మా కోసం మీరు గతాన్ని మరచి.. మాకు మంచీ చెడ్డా చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించవలసిన వారు.. మీరే కదా!..” అని దీనంగా శాస్త్రిగారి కళ్ళల్లోకి చూచేవాడు. ఇద్దరూ పాపలను వారికి చూపిస్తూ.. “అమ్మలూ.. మీ తాతయ్య గారురా.. వారిని చూడండి.. మాట్లాడండి..” అని చెప్పేవాడు.
ఆ బోసినవ్వుల పాపల అమాయక ముఖాలను చూస్తూ.. వారిని ఎత్తుకొని.. వారితో ముచ్చట్లు ఆడుతూ శాస్త్రిగారు.. తన హృదయ వేదనను మరిచేవారు.. అది తాత్కాలికమే.. అయినా.. సర్వం తెలిసిన తాను.. హృదయభారంతో మౌన ముద్రతో కూర్చుండిపోతే.. సీత పరిస్థితి ఏమిటి?.. ఆమెను అనునయించడం.. ధైర్యం చెప్పడం.. తన బాధ్యత కాదా!.. ‘ఆమెకు నేను కాక.. దగ్గరగా మరెవరున్నారు. సీత నా యింటి కోడలు.. ఆమె ఆనందంగా వుండేలా చేయడం నా ధర్మం. పరిస్థితులకు నేను ఎదురు నిలవాలి. నాతో వున్న నా వారికి.. నా మాటలతో ధైర్యాన్ని.. పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కల్పించాలి.. కాలచక్ర గమనంలో మార్పులు తథ్యం.. సహనంతో నిబ్బరంతో సమస్యను ఎదుర్కోవాలి..’
ఆ నిర్ణయానికి వచ్చిన శాస్త్రిగారు సీతను పిలిచారు. సీత వారి దగ్గరకు వచ్చింది. సీత దీనంగా వారి ముఖంలోకి చూచింది.
“కూర్చో అమ్మా!..”
వారు కూర్చున్న కుర్చీ ప్రక్కన నేల కూర్చుంది సీత.
శాస్త్రిగారు లేచి.. ఆమె చేతిని పట్టుకొని లేపి.. “తల్లీ!.. నీవు నా చెల్లెలి బిడ్డవు.. నాకు కోడలివే కాదు.. కూతురుతో సమానం.. నన్ను జాగ్రర్తగా చూచుకొనవలసిన బాధ్యత నీ మీద ఉంది.. కుర్చీలో కూర్చో..” అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.
సీత కుర్చీలో కూర్చుంది. విచారంతో తల దించుకుంది.
“సుమతీ!..” పిలిచారు శాస్త్రిగారు.
“ఏం పెదనాన్నా!..” పరుగున వచ్చింది సీత.
“నా పెద్ద మనుమరాలు!..
“నిద్రపోతూ వుంది..”
“చిన్న తల్లి!..
“మేల్కొని వుంది..”
ఆమెను ఇలా తీసుకురామ్మా!..
సుమతి లోనికి వెళ్ళి సీత పాపను తీసికొని వచ్చి.. శాస్త్రిగారికి అందించింది.
“అమ్మా!.. భవానిరా!..” నవ్వుతూ పాపను అందుకొన్నారు శాస్త్రిగారు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి.. “నా బంగారు తల్లి!..” అంటూ సీత ముఖంలోకి చూచాడు.
సీత క్షణంసేపు వారి కళ్ళల్లోకి చూచి తల దించుకొంది. “అమ్మా సీతా!..”
“చెప్పండి మామయ్యా!..”
“యీమె ఎవరమ్మా!..”
“మీ మనుమరాలు..”
“కాదు..”
సీత ఆశ్చర్యంతో శాస్త్రిగారి ముఖంలోకి చూచింది.
శాస్త్రిగారు నవ్వుతూ.. “ఈ ఇంటికి వారసురాలు.. మా అమ్మ.. ఈమెను జాగ్రర్తగా చూచుకొంటూ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత. చూడు ఎంత అందంగా నవ్వుతూ వుందో నా చిట్టి తల్లి.. పాపను చేతికి తీసుకో..” అన్నారు.
సీత వారి చేతుల నుండి తన చేతుల్లోకి పాపను తీసుకొంది..
“అమ్మా!.. పరిస్థితుల ప్రభావం ఎప్పుడూ ఒకే రీతిగా వుండదు. మార్పు జరుగుతుంది. నీ భర్త త్వరలో తిరిగి వస్తాడు.” చెప్పి కళ్ళు మూసుకొన్నారు శాస్త్రిగారు.
సీత వారి ముఖంలోకి చూచింది ఆశగా.
“తప్పక వస్తాడు తల్లీ!.. నా మాట నమ్ము. నీవు రేపటి నుంచి స్కూలుకు వెళ్ళు. ఆ సమయంలో పాపను నేను.. సుమతీ చూచుకొంటాము. మంచి వ్యాపకం.. మనస్సుకు శాంతిని కలిగిస్తుంది”
“అలాగే మామయ్యా! మీ మాట ప్రకారమే నడుచుకొంటాను” అంది.
పాప ఏడ్వడంతో పాలు ఇచ్చే దానికి పాపతో సీత ఇంట్లోకి వెళ్ళింది.
సుల్తాన్ రావడంతో.. శాస్త్రిగారు సుల్తాన్ గోదావరీ నది ఒడ్డుకు వాహ్వాళికి బయలుదేరారు.
సీత మరుసటిరోజు నుంచీ స్కూలుకు వెళ్ళడం ప్రారంభించింది. తొమ్మిది గంటలకు స్కూలుకు వెళ్ళి ఐదు గంటలకు తిరిగి వచ్చేది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చి.. భోంచేసి రెండు గంటలకల్లా స్కూలుకు వెళ్ళేది. ఆమె స్కూలుకు వెళ్ళి సమయంలో పాపను సుమతి.. శాస్త్రిగారు చూచుకొనేవారు.
కాలచక్రం వేగంగా తిరగసాగింది.. అటు స్కూలు.. ఇంటికి వచ్చాక పాపతో కాలక్షేపం.. సీతకు వేరే ఆలోచనలకు తావు లేకుండా చేశాయి. కానీ.. రాత్రి పాప నిద్రపోయిన తర్వాత సీత.. అద్వైత్‌ను తలచుకొంటూ కన్నీరు కార్చేది.
పన్నెండు నెలలు మహా భారంగా గడచిపోయాయి. ఆండ్రియా స్థాపించిన అనాథ బాలబాలికలు ఆశ్రమానికి సుల్తాన్ పాండురంగతో కలసి మూడుసార్లు వెళ్ళి చూచాడు. తన శేష జీవితాన్ని ఆ అనాథ బాల బాలికల ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకొన్నాడు. అతని భార్య గతించి అప్పటికి పది సంవత్సరాలు. వుద్యోగాన్నీ విరమించుకొన్నాడు.
తన నిర్ణయాన్ని తెలియజేస్తూ సుల్తాన్ ఆండ్రియాకు వుత్తరం వ్రాశాడు. ఆ వుత్తరంలో సావిత్రమ్మ మరణాన్ని.. రాబర్ట్ అద్వైత్‌ను అండమాన్ జైలుకు పంపిన విషయాన్ని కూడా వ్రాశాడు.
(ఇంకా ఉంది)