అద్వైత్ ఇండియా-4

0
3

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఆ సాయంత్రం అద్వైత్, రాఘవను గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్ళి, పాలకులకు ఎదురుతిరిగే ఆలోచనలను మానుకోమంటాడు. నీకెలా తెలిసిందని రాఘవ అడిగితే, సుల్తాన్ భాయ్ కొడుకు అంజాద్ చెప్పాడని అంటాడు అద్వైత్. తన లక్ష్యసాధనలో తను చనిపోవాల్సి వచ్చినా హాయిగా మరణిస్తానని అంటాడు రాఘవ. ఇంటికి తిరిగి వచ్చకా, వెంటనే విశాఖపట్టణం బయల్దేరుతానంటాడు రాఘవ. అద్వైత్, అతని సావిత్రి వారించిన మీదట, మర్నాడు ఉదయానికి ప్రయాణాన్ని వాయిదా వేస్తాడు. అద్వైత్‍తో ఇండియా గురించి ప్రస్తావిస్తాడు రాఘవ. రాత్రి భోజనాలయ్యాకా, అద్వైత్ గదిలోకి వచ్చిన రాఘవ తన చెల్లెలు సీతని పెళ్ళిచేసుకోమని అద్వైత్‍ని అడుగుతాడు. మర్నాడు ఉదయం రాఘవ వెళ్ళిపోతాడు. తెలుగు పాఠాలు నేర్పడానికి ఆదివారం నాడు రాబర్ట్ ఇంటికి వెళ్తాడ్ అద్వైత్. తాను కూడా తెలుగు నేర్చుకుంటానంటుంది ఇండియా. రాబర్ట్ అంగీకరించేసరికి, అద్వైత్ కూడా సరేనంటాడు. ఆ రోజుకి పాఠాలయిపోయాకా, తిరిగి వచ్చేస్తుంటే అద్వైత్‍కి ఫాదర్ జీజస్ ఎదురవుతారు. రాబర్ట్‌ని కలిసి అతని కొడుకు చేసిన తప్పుని వివరిస్తాడు. ఆ అమ్మాయికి, రాబర్ట్ కొడుకుకీ పెళ్ళి చేయమని చెప్తాడు జీజస్. రాబర్ట్ ఒప్పుకోడు. కొంత డబ్బిస్తాను, అమ్మాయికి అబార్షన్ చేయించి, వేరే ఎవరితోనైనా పెళ్ళి చేయించమని చెప్తాడు. కుదరదంటాడు జీజస్. అతన్ని హెచ్చరిస్తాడు రాబర్ట్. ఇంతలో అక్కడికి ఆండ్రియా వచ్చి ఏం జరిగిందని అడిగితే, చెప్పక తప్పదు కాబట్టి జరిగిన విషయాన్ని ఆమెకు చెప్తాడు రాబర్ట్. ఆమె కూడా వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయమనే చెప్తుంది. ఇంతలో అక్కడి సుల్తాన్ వచ్చి, కల్నల్ మూన్ కలవమన్నాడని రాబర్ట్‌కి చెప్తాడు. కల్నల్ మూన్ ఇంటికి వెళ్తాడు రాబర్ట్. అక్కడ ఉన్న జీజస్‍ని చూస్తాడు. రాబర్ట్ కొడుకుకీ, ఆ అమ్మాయికి పెళ్ళి చెయ్యమని చెప్తాడు మూన్. అంతలో అక్కడికి నరసింహశాస్త్రి.. రంగయ్య వస్తారు. వాళ్లతో మాట్లాడిన మూన్ – రాబర్ట్‌ని – కొడుకు పెళ్ళికి ఒప్పిస్తాడు. జీజస్ నిర్ణయించిన ముహూర్తానికి రాబర్ట్ మొదటి భార్య కొడుకు విన్సెంట్‌కు, రంగయ్య మేనకోడలు బాలయ్య కూతురు చామంతికి చర్చిలో వివాహం జరుగుతుంది.. – ఇక చదవండి.]

అధ్యాయం 7:

[dropcap]అ[/dropcap]ద్వైత్.. స్కూలు నుంచి ఐదు గంటలకు ఇంటికి వచ్చాడు. పాదరక్షలు వరండాలో మూల వదిలి.. దొడ్లోకి వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కొని తన గదిలోనికి వెళ్ళి డ్రస్ మార్చుకొన్నాడు. అద్దం ముందు కుర్చీలో కూర్చొని తల దువ్వుకోసాగాడు. రెండు చేతులు అతని కళ్ళను గట్టిగా మూశాయి. అద్వైత్ వులిక్కి పడ్డాడు.

“ఎవరు!..” అప్రయత్నంగా అన్నాడు.

“కనుక్కోండి!..”

చెవి దగ్గర ఆ మాటలు మెల్లగా వినిపించాయి.

గట్టిగా తన కళ్ళను మూసిన చేతులను తన చేతులతో ప్రక్కకు నెట్టి లేచి వెనుతిరిగి చూచాడు.

నేలు కూర్చొని క్రీకంట అద్వైత్ ముఖంలోకి చూస్తూ అందంగా నవ్వింది సీత. తన అత్త కూతురు. వరసైన మరదలు.

“సీతా!.. నీవా!..”

“అవును..” గలగలా నవ్వింది సీత

“ఎప్పుడు వచ్చావ్!..”

“పదకొండు గంటలకు..”

“ఒక్కదానివే వచ్చావా!..”

“లేదు. బామ్మ కూడా వచ్చింది.”

“అమ్మా బామ్మా ఏరి?”

“ప్రక్క వీధిలోని రామశర్మగారి యింటికి వెళ్ళారు. అరగంటలో వస్తామని చెప్పారు.”

“పరీక్షలు బాగా వ్రాశావా!..”

తలదించుకొని మౌనంగా వుండిపోయింది సీత.

“సీతా!.. పరీక్షలు గల్లంతా!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్. సీత జవాబు చెప్పలేదు.

తల వంచి అద్వైత్.. “సీతా!..” మెల్లగా పిలిచాడు.

సీత వేగంగా తలను పైకెత్తి.. “క్రింద కూలబడి వున్నానే.. చేయి అందించి లేపాలనిపించదా నీకు.. యక్ష ప్రశ్నలు వేస్తున్నావ్!..” సీత మూతి త్రిప్పుకొంది.

అద్వైత్ తన కుడిచేతిని చాచాడు. సీత అందుకొంది. నవ్వుతూ పైకి లేచింది.

“యిప్పుడు అడుగు, నీకేం కావాలి..”

“అదే సీతా!.. పరీక్షలు ఎలా వ్రాశావు?..” కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అద్వైత్.

“చాలా బాగా వ్రాశాను బావా!..”

“బియ్యసీ రిజల్ట్ రాగానే ఏం చేయాలనుకొంటున్నావ్!..”

“తర్వాత చెబుతాను. అత్తయ్య నాతో నీవు రాగానే కాఫీ కలిపి యిమ్మంది. ఆగు.. అయిదు నిముషాల్లో వస్తాను” సీత నవ్వుకుంటూ వంటింటి వైపుకు పరుగెత్తింది.

అద్వైత్.. సీతను చూచి దాదాపు సంవత్సరం అయింది. యీ సంవత్సరంలో.. సీతలో ఎంతో మార్పు. సన్నగా పెనుగాలికి ఎగిరిపోయేదానిలా వున్న సీత.. కొంచెం ఒళ్ళు చేసింది. సహజంగా తెల్లని ఛాయ. విశాలమైన నేత్రాలు తీర్చిదిద్దినట్లు కనుబొమ్మలు.. నిటారైన నాశిక.. చక్కటి పలువరస.. నెమలి పింఛం లాంటి పొడుగాటి జడ.. ఎప్పుడూ చిరునవ్వుతో వుండే ఆ ముఖం..

‘సీత యిప్పుడు చాలా అందంగా వుంది. ఇండియాకు సీతకు అందాల పోటీ పెడితే న్యాయ నిర్ణేతలు తీర్పు చెప్పడానికి జుట్టు పీక్కోవలసిందే!..’ నవ్వుకొన్నాడు అద్వైత్.

“బావా!.. యిదిగో కాఫీ!..” అద్వైత్‌ను సమీపించి గ్లాసును అందించింది నవ్వుతూ సీత.

“సీతా!.. నీవు తాగావా!..”

“నీవు తాగి మిగిలిస్తే.. నేను త్రాగుతాను.” కొంటెగా నవ్వింది సీత.

“ఆఁ..” ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అద్వైత్.

“బావా!.. నేను కాఫీ తాగానుగా!.. మరచిపోయావా!..”

“ఆ.. ఆ.. అవునవును.. నీవు కాఫీ తాగవుగా!..” చిరునవ్వుతో అన్నాడు అద్వైత్.

“బావా!.. ఒకటడగనా!..”

“అడుగు..”

“నిజం చెప్పాలి!..”

“నీ బావకు అబద్ధం చెప్పడం తెలియదుగా!..”

“ఔననుకో.. అయినా నా ప్రశ్నను బట్టి ‘ఆ’ ను అడవలసి వస్తుందేమోనని నా సందేహం!..” గలగలా నవ్వింది సీత. మల్లెల తెలుపును మైమరపించే ఆ సన్నని పలువరస క్షణంసేపు కనుపించి.. ఆమె తలను ప్రక్కకు త్రిప్పుకోవడంతో ఆ దృశ్యం.. అద్వైత్ చూపుల ముందు నుంచి తొలగిపోయింది.

“అడగదలచుకొన్నది అడుగు సీతా!..”

“నన్ను ఏమీ అనకూడదు!..”

“అనను..”

“విసుక్కోకూడదు!..”

“విసుక్కోను..”

“ముందు కాఫీ త్రాగడం ముగించు..” అద్వైత్.. కాఫీ త్రాగడం ముగించాడు. సీత ఖాళీ గ్లాసును అందుకొంది. ముఖం చిట్లించాడు.

“అడుగుతున్నా!..”

“అడుగు..”

“ఆ తెల్లపిల్ల నా కంటే అందంగా వుంటుందా..”

అద్వైత్.. ఆశ్చర్యపోయాడు. ‘ఇండియా విషయం సీతకెలా తెలుసు!’ ఆలోచనలో పడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత.. ‘రాఘవ చెప్పి వుంటాడా!..’ అనుకొన్నాడు.

“ఆ పిల్లను గురించి నీకు ఎవరు చెప్పారు సీతా!..”

“మీ మాటలు.. నా ప్రశ్నకు జవాబు కాదు బావా!..”

“ఓ.. నీకు ఎవరు చెప్పారా అని అడిగాను”

“ ‘మా అన్నయ్య’.. మరి నా ప్రశ్నకు నీ జవాబు!..” అద్వైత్ కళ్ళల్లోకి చూచింది సీత. ఆమెకు ఏం జవాబు చెప్పాలో తోచని అద్వైత్ తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.

“బావా!.. నేను ఏమీ అనుకోనులే.. నిజం చెప్పు!..”

“ఏమే సీతా!.. ఏం చేస్తున్నావ్?.. మీ బావ వచ్చాడా!..” బామ్మ వసుంధర కంఠం విని.. అద్వైత్ వరండా వైపుకు నడిచాడు.

“నాయినా అద్వైత్ బాగున్నావా!..”

“బాగున్నాను అత్తయ్యా!..’

“ఆదీ!.. సీత నీకు కాఫీ యిచ్చిందా!..” అడిగింది సావిత్రి

“అత్తయ్యా!.. మీరు చెప్పినట్లుగానే మా బావగారు రావడం తోటే కాఫీ గ్లాసును అందించాను. బావా!.. కాఫీ ఎలా వుందో చెప్పనేలేదు. మందు త్రాగినట్లు గుటగుటా త్రాగేశావు!..” అద్వైత్ ముఖంలోకి ద్వారం దగ్గర నిలబడి చూస్తూ అంది సీత.

వసుంధర.. సావిత్రి వరండాలోని కుర్చీలల్లో కూర్చున్నారు. వారి ప్రక్కన అద్వైత్ కూడా కూర్చున్నాడు.

“అమ్మా!..”

“ఏం ఆదీ!..”

“నాకు కాఫీలో చక్కెర వేయవద్దని సీతకు చెప్పావా అమ్మా!..” సీత ముఖంలోకి చూస్తూ అడిగాడు అద్వైత్.

ఆ మాటలు చెవికి సోకగానే.. అంతవరకూ ఆదిని చూస్తూ పళ్ళు యికిలిస్తున్న సీత.. ‘ఓసి మొద్దూ!.. కాఫీలో చక్కెర వేయలేదా!..’ అనుకొంటూ లోనికి పరుగెత్తింది.

ఆమె చర్యకు ఆ ముగ్గురూ నవ్వుకొన్నారు.

“వదినా!.. మనం లేని సమయంలో తన బావకు కాఫీ అందివ్వడం కదూ!.. భయంతో మరచిపోయి వుంటుంది సీత..” గట్టిగా నవ్వింది సావిత్రి.

“అవునే.. అదే కారణం అయ్యుండొచ్చు!..” వసుంధర కూడా నవ్వింది.

“ఆదీ!..”

“చెప్పండత్తయ్యా!..”

“సీత పరీక్షలు అమోఘంగా వ్రాసింది. ఐదేళ్ళుగా అక్కడ నారాయణి అనే డాన్సు మాస్టర్ దగ్గర నృత్యం నేర్చుకొంది నీవు.. నా తమ్ముడు.. నాట్య శిక్షణలో ఘనాపాటీలు కదా!.. మీ దగ్గర నాట్యాన్ని అభ్యసించాలని సీత యిక్కడికి వచ్చింది. నీ మరదలి కోర్కె తీరుస్తావు కదూ..” అడిగింది వసుంధర.

“తప్పకుండా అత్తయ్యా!.. నాన్నగారితో కూడా చెప్పండి”

“వాడు రావడంతోటే తప్పకుండా చెబుతాను”

అదే సమయానికి నరశింహశాస్త్రి.. పాండురంగ వీధి తలుపు తెరచుకొని లోన ప్రవేశించారు. వారిని చూచి సావిత్రి, అద్వైత్ లేచి నిలబడ్డారు.

నరశింహశాస్త్రి.. పాండురంగా వరండాను సమీపించారు. వసుంధర కూడా లేచి తమ్ముని సమీపించింది. “ఏరా నరసింహా!.. బాగున్నావా!..”

“అక్కయ్యా!.. నీ ఆశీర్వాద బలంతో అన్ని విధాలా బాగున్నాను. ఎప్పుడు వచ్చావు అక్కయ్యా!..” ప్రీతిగా అడిగాడు నరశింహశాస్త్రి

“వుదయం పదకొండు గంటలకురా!..”

“రాఘవ సీతా బాగున్నారా అక్కయ్యా!..”

“వారికి నీ ఆశీర్వాద బలం వుంది కదరా!.. బాగున్నారు..” నవ్వుతూ చెప్పింది వసుంధర.

“కాళ్ళు కడుక్కొని పది నిమిషాల్లో వస్తానక్కా, నీవు కూర్చో..” చెప్పి నరశింహశాస్త్రి పెరటు వైపుకు నడిచాడు. సావిత్రి వారిని అనుసరించింది. చెంబుతో నీళ్ళు అందించింది.

కాళ్ళూ ముఖం కడుక్కొని నరశింహశాస్త్రి పెరటి ద్వారాన్ని సమీపించాడు. సీత ముందుకు వెళ్ళి టవల్‍ను మామగారికి చిరునవ్వుతో అందించింది. టవల్‍ను అందుకొంటూ నరశింహశాస్త్రి..

“అమ్మా సీతా!.. నీవూ వచ్చావా!.. పరీక్షలు బాగా వ్రాశావా!..” ఆప్యాయంగా అడిగాడు.

“చాలా బాగా వ్రాశాను మామయ్యా!..” అంది సీత

“తర్వాత.. ఏం చేయాలనుకొంటున్నావు!..’

“బామ్మ.. మీరు ఏది చెబితే అది..”

“అంటే నేను మా అక్కతో మాట్లాడాలన్న మాట!..”

అవునన్నట్లు తల ఆడించింది సీత.

“మీ కోడలు.. మీ వద్ద నాట్యాన్ని అభ్యసిస్తుందట..” సీత ముఖంలోకి చూస్తూ చెప్పింది సావిత్రి.

“అవునా అమ్మా!..”

తల దించుకొని మెల్లగా.. “అవును మామయ్యా!.. మీరు ఎందరికో నాట్యాన్ని నేర్పించారు. నేర్పిస్తున్నారు. మరి.. నాకు నేర్పరా మామయ్యా!..” అభ్యర్థనగా అడిగింది సీత.

“నీకు నేర్చుకోవాలనే అభిలాష వుంటే.. నేను నీకు తప్పక నేర్పుతాను సీతా!..”

“మీ దగ్గర రెండు సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాతనే నేను నా అరంగేట్రాన్ని చేయాలనేది నా నిర్ణయం మామయ్యా!..”

“అలాగా!..”

“అవును..”

“సరే.. నీ నిర్ణయం నాకు ఆమోదం..” నవ్వుతూ నరశింహశాస్త్రి తన గదిలోనికి పోయాడు.

“ఏయ్ పిల్లా!.. నీవు నా కొడుక్కు యిచ్చిన కాఫీలో పంచదార వేయలేదా..” ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి. సీత.. తప్పు చేసిన దానిలా తల దించుకొని.. “క్షమించడత్తయ్యా!.. మరచిపోయాను” బుంగమూతి పెట్టి మెల్లగా చెప్పింది.

“చూచావా!.. నా కొడుకు ఎంత మంచివాడో!.. నీవు పంచదారను వేయకపోయినా.. నీవు యిచ్చిన కాఫీని త్రాగాడు..” గర్వంగా నవ్వుతూ సీత ముఖంలోకి చూచింది సావిత్రి.

“ఆయన మీ కొడుకే కాదు. నా బావ కూడా.. మా బావ బంగారం అని నాకు తెలుసత్తయ్యా!..” చిత్రంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది సీత.

“బావంటే నీకు యిష్టమేనా సీతా!..” ప్రీతిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సావిత్రి.

“మీకు అన్నీ తెలుసు కదా అత్తయ్యా!..” చిరునవ్వుతో చెప్పి సావిత్రి వెనకాలే హాల్లోకి వచ్చింది సీత. హాల్లో అద్వైత్ వున్నాడు. అతన్ని చూచి సావిత్రి వెనుకకు వెళ్ళి తల దించుకొంది సీత.

“అమ్మా!.. ఏమిటి విషయం!.. నిన్ను సీత ఆకాశానికి ఎత్తేస్తూ వుంది!..” నవ్వుతూ అడిగాడు అద్వైత్.

“నన్ను కాదురా.. నిన్ను!..”

“నన్నా!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.

“అవును. నీవు బంగారం అంట!..” నవ్వుతూ చెప్పింది సావిత్రి.

సీత క్షణంసేపు అద్వైత్ ముఖంలోకి చూచి తల దించుకొని ఓరకంట చూడసాగింది.

వాకిట్లో కారు ఆగిన శబ్దం. అద్వైత్ వెను తిరిగి చూచాడు.

కారు నుండి ఆండ్రియా.. ఇండియా దిగారు. సుల్తాన్ ముందు నడువగా.. వారిరువురు అతన్ని అనుసరించి ఇంటి వరండాను సమీపించారు.

వచ్చిన వారిని చూచి.. అద్వైత్, సావిత్రి ఆశ్చర్యంతో వరండాలోకి వచ్చారు. సీత తలుపు చాటుగా నిలబడి ఇండియాను పరిశీలనగా చూడసాగింది.

అద్వైత్ ముందుకు నడిచి నవ్వుతూ.. “వెల్కమ్ మేడమ్.. ప్లీజ్ కమ్..” వసుంధర కుర్చీ నుంచి లేచి తన ప్రక్కన నిలబడి వున్న సావిత్రితో.. “సావిత్రీ!.. ఏవరే వీరు?..” మెల్లగా అడిగింది.

“రెవిన్యూ ఆఫీసర్ గారి భార్య.. కూతురు.. వదినా!..” మెల్లగా చెప్పింది.

“గుడ్ యీవినింగ్ సార్…” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“ఆదీ!.. వేరీజ్ యువర్ ఫాదర్!..” అడిగింది ఆండ్రియా.

“లోన వున్నారు మేడమ్. రండి కూర్చోండి” ప్రీతిగా చెప్పాడు అద్వైత్. తల్లిని చూపి.. “మై మదర్ అండ్ షి యీజ్ మై ఆంట్.. ఫాదర్స్ సిస్టర్.”

“నమస్తే!..” సగౌరవంగా చేతులు జోడించింది ఆండ్రియా. వసుంధర ఆశ్చర్యంతో ఆ తల్లీ కూతుళ్ళ ముఖాలను పరిశీలనగా చూడసాగింది. సావిత్రి చిరునవ్వుతో చేతులు జోడించింది.

‘యీ తల్లీ కూతుళ్ళు నా యింటికి ఎందుకు వచ్చినట్లు!..’ అనుకొంటూ సుల్తాన్ ముఖంలోకి చూచింది.

ఆమె చూపును గ్రహించిన సుల్తాన్.. సావిత్రిని సమీపించి.. “అమ్మా!.. మీరు భయపడకండి. మన అయ్యగారి వద్ద ఇండియా డాన్సు నేర్చుకోవాలని వారి తల్లిని కోరింది. ఆ విషయాన్ని గురించి మాట్లాడాలని వారు వచ్చారు. మీరు లోనికి వెళ్ళి అయ్యగారిని పంపండి” మెల్లగా చెప్పాడు సుల్తాన్.

సావిత్రి లోనికి వెళ్ళిపోయింది. ఆండ్రియా కుర్చీలో కూర్చుంది. ఇండియా చిరునవ్వుతో అద్వైత్ ముఖంలోకి చూడసాగింది.

ఇండియా చూపులు ఏ వైపున వున్నదీ చూచిన సీత.. ‘దీనికేమైనా పిచ్చా!.. పళ్ళు యికిలించి బావను అలా చూస్తూ వుంది!.. రంగు నా కంటే ఎక్కువే.. కాని ముఖం నా ముఖంతో సరితూగలేదు’ అనుకొంది సీత. సావిత్రి చెప్పిన మాటలు విని.. నరశింహశాస్త్రి వరండాలోకి వచ్చాడు.

ఆండ్రియా కుర్చీ నుంచి లేచి చేతులు జోడించింది. ఇండియా నవ్వుతూ తల్లి వలెనే తన చేతులను కలిపింది.

“కూర్చొండి మేడం..” చిరునవ్వుతో చెప్పాడు నరశింహశాస్త్రి. ఆండ్రియా కూర్చుంది. మరో కుర్చీలో నరశింహశాస్త్రి కూర్చున్నారు.

ఆండ్రియా సుల్తాన్ ముఖంలోకి చూచింది. విషయాన్ని గ్రహించిన సుల్తాన్ నరశింహశాస్త్రిని సమీపించి.. “అయ్యగారూ!.. వాళ్ళ అమ్మాయికి మీ వద్ద నాట్యం అభ్యసించాలని కోరిక. ఆ విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని మేడంగారు వచ్చారు” చెప్పాడు సుల్తాన్.

సావిత్రి ముఖద్వారం మరో గడప వైపున నిలబడింది. అత్తా కోడలు.. వరండాలో వున్న వారి మధ్యన జరిగిన జరగబోతున్న సంభాషణని వినేదానికి ఎంతో ఆత్రంగా వారిని చూస్తూ వున్నారు.

“సార్… మై డాటర్..”

“యస్.. యస్.. సుల్తాన్ భాయ్ టోల్డ్ మీ..” ఆండ్రియా ముగించక ముందే చెప్పారు నరశింహశాస్త్రి సాలోచనగా.

“హోప్ యు హ్యావ్ నో అబ్జక్షన్ సార్!..”

కొన్ని క్షణాలు ఆ తల్లీ కూతుళ్ళ ముఖాలను పరీక్షగా చూచారు నరశింహశాస్త్రి.

“నో అబ్జక్షన్.. బట్..”

“బట్..” ఆశ్చర్యంతో అడిగింది ఆండ్రియా.

“యువర్ డాటర్ షుడ్ కమ్ హియర్..” మెల్లగా చెప్పారు నరశింహశాస్త్రి.

“నో ప్రాబ్లమ్ సార్. షి విల్ కమ్..” చిరునవ్వుతో చెప్పింది ఆండ్రియా.

వారి మధ్యన జరుగుతున్న సంభాషణ ముఖం చిట్లించి అర్థంకాక అయోమయ స్థితిలో వుంది వసుంధర.

“ప్లీజ్ సెండ్ హర్.. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో బై సిక్స్ పి.యం.. బీయింగ్ గుడ్ డే!..”

“ఓకే సార్… థాంక్యూ వెరిమచ్..” లేచి చేతులు జోడించింది ఆండ్రియా.

“సార్!.. థాంక్యూ.. థాంక్యూ!..” ఆనందంగా నవ్వుతూ చేతులు కలిపింది ఇండియా.

“నో మెన్షన్ ప్లీజ్!.. ఐ ఫీల్ దట్ యీజ్ మై డ్యూటీ!..” చిరునవ్వుతో చెప్పాడు నరశింహశాస్త్రి.

“బై సార్!..” చెప్పి, ముందు ఆండ్రియా, వెనుక ఇండియా వీధి వాకిటి వైపుకు నడిచారు. “వెళ్ళొస్తానయ్యగారూ!..” నమస్కరించి సుల్తాన్ వారిని అనుసరించాడు.

“సావిత్రి!..” పిలిచారు నరశింహశాస్త్రి.

పరుగున వారిని సమీపించింది సావిత్రి.

“ఆ అమ్మాయి కళ్ళను గమనించావా!..”

“నేను గమనించలేదండీ..” అమాయకంగా అంది సావిత్రి

“ఎక్కడ నేను కాదంటానో అనే భయం నాకు ఆ చిన్నారి కళ్ళల్లో గోచరించింది సావిత్రి. దైవ ప్రసాదితమైన కళను పది మందికి నేర్పడంలో వున్న ఆనందం.. అంతా యింతా అని నేను చెప్పలేను. అందుకే ‘సరే’ అన్నాను”

“మీరు ఏది చేసినా పూర్వాపరాలను యోచించే చేస్తారుకదండీ!..” అభిమానంగా నరశింహశాస్త్రి ముఖంలోకి చూస్తూ చెప్పింది సావిత్రి.

‘రెండు తెల్ల కోతులు మామయ్యను బుట్టలో పడేశాయి. యీ బావ.. దాన్ని చూస్తూ ప్రపంచాన్నే మరచిపోతున్నాడు. భగవాన్!.. దాన్ని నాకు పోటీగా తయారు చేయకు’ అనుకొంది సీత.

“ఒరే తమ్ముడూ!.. ఆ తెల్లదొరసాని గోడేంది రా!..” అడిగింది వసుంధర.

“వాళ్ళ అమ్మాయికి నాట్యాన్ని నేర్పమని కోరిందక్కా!..”

“నీవేమన్నావ్!.. సంభాషణ అంతా ఇంగిలిపీసులో జరిగే.. నాకేం అర్థం కాలేదురా!..”

“సరే అన్నానక్కా!..”

“అందుకేనా తల్లీ కూతుళ్ళు పళ్ళు యికిలించి నవ్వుతూ వెళ్ళిపోయారు!..”

“అవును బామ్మా!..”

అంతవరకూ మౌనంగా జరుగుతున్న సంభాషణను వింటూ వున్న సీత ఘనంగా చెప్పింది.

అందరి చూపులూ ఆమె వైపుకు మళ్ళాయి.

“వదినా!.. ఆ పిల్ల చాలా అందంగా వుంది కదూ!..” వసుంధరను సమీపించి అడిగింది సావిత్రి.

“ఆ.. నీవు అన్నమాట నిజమేనే!.. ఏ మాట కామాట అనుకోవాలి. నిజంగా పిల్ల బంగారు బొమ్మేనే!..” అమాయకంగా యథార్థాన్ని చెప్పింది వసుంధర.

వారి సంభాషణ రుచించని సీత.. మూతి త్రిప్పుకొంటూ ‘యిదేనేమో… పొరుగింటి పులుసుకూర రుచి అంటే!..’ అనుకొంది.

ఆమె ముఖ భావాలను గమనించిన అద్వైత్ తలుపును సమీపించి.. ఆమెను ఆట పట్టించేదానికి.. “సీతా!.. మరో కప్పు కాఫీ యిస్తావా!..” మెల్లగా అడిగాడు.

అతని మాటలను అందరూ విన్నారు. సీత తుర్రున లోనికి పరుగెత్తింది. ఆమె చర్యను చూచిన నరశింహశాస్త్రి ఆశ్చర్యపోయాడు. జరిగిన విషయాన్ని సావిత్రి నరశింహశాస్త్రికి చెప్పింది. ఆ ముగ్గురూ సీతను తలచుకొని ఆనందంగా నవ్వుకొన్నారు.

అధ్యాయం 8:

అద్వైత్ దగ్గర రాబర్ట్, ఇండియా తెలుగు నేర్చుకోసాగారు. రాబర్ట్ సీనియర్ విద్యార్థి కాబట్టి అద్వైత్ కంటే ముందు కొన్ని తెలుగు పదాలను తన స్టయిల్లో తీరిక సమయంలో ఇండియాకు నేర్పేవాడు.

ఇండియా చాలా తెలివైంది. కుశాగ్ర బుద్ధి కలది. ఉచ్చారణ విషయంలో శ్రద్ధగా విని పదాలను స్వచ్ఛంగా పలికేది. నెలరోజుల్లో తెలుగు అక్షరాలను నేర్చుకుంది. తెలుగు దినపత్రికను తెప్పించుకొని అక్షరాలను కూడపలుక్కొని చదివేది.

నరశింహశాస్త్రి.. సీతకు ఇండియాకు.. ఆండ్రియా సుల్తాన్‍ల వారి యింటికి వచ్చి వెళ్ళిన మరుసటి రోజు నుంచి నాట్యాన్ని నేర్పించసాగాడు.

సీతకు పూర్వ అనుభవం వున్నందున నరశింహశాస్త్రి గారు చూపించే భంగిమలను అతి సునాయాసంగా చేయకలిగేది. ఇండియాకు.. తాను సీతలాగా చేయలేక పోతున్నాను అనే బాధ. ఆ కారణంగా క్లాస్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి నిలువుటద్దం ముందు నిలబడి నాట్యం చేసేది. సాధన వలన సాధించలేనిదంటూ లేదు. ఆమె పట్టుదల, కృషి వలన మూడు నెలల్లో సీతకు పోటీగా నాట్యం చేయసాగింది.

ఇండియా ఏకాగ్రత.. పట్టుదల నరశింహశాస్త్రికి ఎంత ఆనందాన్ని కలిగించాయి. ఒక్కోసారి శెభాష్ అని ప్రశంసించేవాడు. వారు ఆ మాటను అన్నప్పుడల్లా సీత ముఖం విలవిలబోయేది. ఒక్కోసారి.. నరశింహశాస్త్రి బయట వూరికి పనిమీద వెళ్ళినప్పుడు.. అద్వైత్ వారికి నాట్య శిక్షణ యివ్వవలసి వచ్చేది. ఆ సమయంలో ఆ యిరువురు యువతుల మధ్యన అద్వైత్ సతమతమైపోయేవాడు. నిగ్రహంతో ఎంతో మెలకువగా వర్తించేవాడు. అద్వైత్ ఇండియాకు ఏదైనా సలహా యిచ్చేటప్పుడు.. సీత అతన్ని చూపులతోనే తినేసేలా చూచేది. తనకు సలహా యిచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా అతనికి చేరువై వినేది.

విద్యను తెలిసికోవాలని ఇండియాకు తాపత్రయం.. తనను కాదని ఇండియాకు సన్నిహితుడౌతాడేమోనని సీతకు భయం.. యిరువురి మనస్తత్వాలను గ్రహించిన అద్వైత్.. వారి నాట్య సాధన సమయంలో ఎంతో గంభీరంగా.. మిత భాషణ చేస్తూ వారికి నేర్పించేవాడు.

కొన్ని సందర్భాల్లో.. ఇండియా తాను నేర్చుకొన్న తెలుగు పదాలతోనే అద్వైత్తో మాట్లాడేది. ఆ సమయంలో సీత.. ‘ఒసే తెల్లకోతి.. మా తేనెలూరే తెలుగు భాషనెందుకే మర్డర్ చేస్తున్నావ్!.. నీ ఇంగిలిపీసులోనే అఘోరించరాదు!..’ అనుకొని వెటకారంగా నవ్వేది.

అలాంటి సమయంలో అద్వైత్ సీత ముఖంలోకి సీరియస్‍గా చూచి.. తలను ఆడిస్తూ ‘తప్పు’ అని సూచించేవాడు. సీత కొంటెగా నాలుకను బయటికి సాచి ఎగరేసి నవ్వుతూ తలను ప్రక్కకు త్రిప్పుకొనేది.

నరశింహశాస్త్రిగారు యింట్లోలేని సమయంలో సావిత్రి వసుంధర వచ్చి సీత.. ఇండియాలు అద్వైత్ ఆధ్వర్యంలో చేసే నాట్యాన్ని తిలకించేవారు. ఆ రోజు ఆ యిరువురూ పోటీతో చేసే నాట్యాన్ని చూచి..

“ఒసేయ్!.. సావిత్రీ!.. వీళ్ళను చూస్తుంటే నీకేమనిపిస్తూ వుందే!..” అడిగింది వసుంధర.

“ఇరువురూ సమబలులు అనిపిస్తూ వుంది వదినా!..” మెల్లగా చెప్పింది సావిత్రి.

వారి నృత్యాన్ని చూస్తూ కొన్ని నిముషాల తర్వాత.. ‘అవునే నీవు అన్నమాట నిజమేనే!..” అంది వసుంధర. అదే సమయానికి అక్కడి రాఘవ వచ్చాడు. దీక్షగా పోటీతో సీత ఇండియాలు చేసే నృత్యాన్ని వారి కంట పడకుండా చాటుగా నిలబడి వీక్షించసాగాడు.

ఆ యిరువురూ నాట్యాన్ని ముగించారు. రాఘవ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ముందుకు వచ్చాడు. అందరూ అతని వైపుకు తిరిగారు.

“బావా!.. నీ శిష్యురాండ్ర నాట్యం అద్భుతం!..”

సీత నవ్వుతూ తన అన్న ప్రక్కకు చేరింది. క్షణంసేపు ఆమె ముఖంలోకి ప్రీతిగా నవ్వుతూ చూచి, దృష్టిని ఇండియా వైపుకు మరలించి..

“మేడమ్!.. ఫెంటాస్టిక్ జాబ్.. సూపర్!..” అన్నాడు రాఘవ.

ఆ మాటలను విన్న సీత ముఖంలో రంగు మారింది. మూతి ముడుచుకొని తన మేనత్త సావిత్రి ప్రక్కకు జరిగింది.

“మేడమ్ కాదు.. నా పేరు ఇండియా!.. థాంక్యూ సార్!..” నవ్వుతూ చెప్పింది ఇండియా.

“మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారే!..” ఆశ్చర్యంతో ఇండియా ముఖంలోకి చూచాడు రాఘవ.

“ఏరా చెప్పాపెట్టకుండా వూడి పడ్డావ్!..” అడిగాడు అద్వైత్.

“నా మామగారి యింటికి నేను వచ్చేదానికి నాకు ఎవరి పర్మిషన్ అక్కరలేదని నీకు తెలీదా బావా!..” నవ్వుతూ అద్వైత్ భుజంపై చేయి వేశాడు.

“బావా!.. నాకు పారెస్టు రేంజర్‍గా వుద్యోగం వచ్చింది.” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

“నిజంగానా!..” ఆత్రంగా అడిగాడు అద్వైత్.

“నిజం బావా.. త్వరలో మన మకాం భద్రాచలంలో..”

“చాలా సంతోషంరా!..

“ఒరే!.. నీవు చెప్పేది నిజమేనా!..” అడిగింది వసుంధర.

“వదినా!.. వాడు నీతో అబద్ధం ఎప్పుడైనా చెప్పాడా!..”

“లేదనుకోవే.. ఒక్కోసారి ఏవేవో చెప్పి నన్ను ఆట పట్టించడం వీడికి అలవాటే!.. అందుకని..”

“అందుకని కాదు.. ఎందుకని కాదు. సందేహించకు” జేబు నుంచి కవర్ తీసి.. “యిదిగో చూడు ఆర్డర్..” సగర్వంగా అద్వైత్ చేతికి అందించాడు రాఘవ.

కవర్లోని కాగితాన్ని బయటికి తీసి చూచి.. అద్వైత్ “అత్తయ్యా!.. వాడు చెప్పిన మాట నిజం..” చిరునవ్వుతో చెప్పాడు. ఆనందంగా రాఘవ ముఖంలోకి చూచాడు.

ఇండియా నవ్వుతూ రాఘవ ముఖంలోకి చూచింది.

“సార్!.. మీకు జాబ్.. జాబ్..” తర్వాత పలకవలసిన తెలుగు పదం ‘వచ్చిందా’ ఇండియాకు గుర్తు రాలేదు. ఆలోచనతో.. కళ్ళు మూసుకుంది.

“వచ్చిందా!..” నవ్వుతూ చెప్పాడు రాఘవ.

“ఆ.. యస్ యస్.. వచ్చిందా!..” నవ్వుతూ అంది ఇండియా.

“వచ్చింది మేడమ్.. ఓ.. సారీ.. ఇండియా!..”

“కంగ్రాచ్యులేషన్!..” తన కుడిచేతిని ముందుకు నవ్వుతూ సాచింది ఇండియా.

రాఘవ తన చేతిని ఆమె చేతితో కలిపాడు అద్వైత్ ముఖంలోకి చూస్తూ, “విష్ యు గుడ్ లక్ సార్!..”

“థాంక్యూ!..”

“సార్!.. వెళతాను” అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇండియా.

“ఎప్పుడో పోవలసిన దానివి.. చాలు. యిక బయలుదేరు” వ్యంగ్యంగా అంది సీత.

సీత అన్న మాటలు సరిగా అర్థం కాని ఇండియా.. “థ్యాంక్యూ!..” నప్పుతూ చెప్పింది.

వసుంధరకు సావిత్రికి నమస్కరించి.. “బై..” అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పి.. ఇండియా వెళ్లిపోయింది.

“ఆదీ!.. ఆ పిల్ల చాలా మంచి పిల్లరా!.. ఎంతో మర్యాదో చూచావుగా!..” అంది సావిత్రి.

అద్వైత్ చిరునవ్వు నవ్వాడు.

“అత్తయ్యా!.. ఆమె ఎవరి శిష్యురాలు. సాక్షాత్ బహుకళా ప్రవీణుడైన మా యీ బావగారి శిష్యురాలు కదా!..”

“మీ బావగారికి యీ హోదా పార్ట్‌టైమే!.. అది మన మామయ్యగారి శిష్యురాలు.” అద్వైత్ ముఖంలోకి క్రీకంట చూస్తూ అంది సీత.

“సీతా!.. మంచిని, మంచి అని చెప్పుకోవడం తప్పు కాదు. నీ మాటల్లో మాకు..” సావిత్రి ముగించక మునుపే..

“ఆ పిల్ల మీద నీకు ద్వేషం అని మాకు తెలిసింది. సీతా!.. సాటి మనుషులను ద్వేషించకూడదమ్మా!.. అభిమానించాలి. అప్పుడే మనం మనుషుల మనిపించుకొంటాం.” సీత ప్రక్కకు జరిగి ప్రీతిగా ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాఘవ.

“రేయ్!.. దానికి నీకు ఐదేళ్ళ వ్యత్యాసం. నీ అంతటి జ్ఞానాన్ని అది సంపాదించాలంటే.. మరి కొంతకాలం పడుతుందిరా!.. నీవు అనుకొంటున్నట్లు నా కోడలు చెడ్డది కాదు. దాని మనస్సు వెన్న..” సీత ముఖంలోకి ప్రీతిగా చూస్తూ చెప్పింది సావిత్రి.

“సీతా!.. వేడిగా ఒక గ్లాసు కాఫీ యిస్తావా!..” బుంగమూతి పెట్టుకొని తలదించుకొని వున్న సీతను సమీపించి అడిగాడు అద్వైత్.

అతని గొంతు వినగానే.. నవ్వుతూ క్షణంసేపు అతని ముఖంలోకి చూచి.. సీత లోనికి పరుగెత్తింది. విషయం అర్థంకాని రాఘవ ఆశ్చర్యంతో అద్వైత్ ముఖంలోకి చూచాడు. అతను చెప్పిన సీత కాఫీ కథను విని.. అందరూ నవ్వుకొన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here