Site icon Sanchika

అద్వైత్ ఇండియా-5

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[సాయంత్రం ఐదు గంటలకి అద్వైత్ స్కూలు నుంచి ఇంటికి వచ్చి, కాళ్ళు ముఖం కడుక్కుని, తన గదిలోకి డ్రెస్ మార్చుకుంటాడు. కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఎవరో అతని కళ్లని మూస్తారు. ఎవరని అడిగితే, కనుక్కోండి అనే జవాబు వస్తుంది.. ఆ చేతులను తన కళ్ళ మీద నుంచి తొలగించి వెనక్కి తిరుగుతాడు అద్వైత్. అక్కడ తన అత్త కూతురు సీత ఉంటుంది. కుశల ప్రశ్నలు అయ్యాకా, పరీక్షలు ఎలా రాశావని అడుగుతాడు. బాగా రాశానని చెప్తుంది. బియ్యసీ రిజల్ట్ వచ్చాకా, ఏం చేద్దామనుకుంటున్నావని అడిగితే, తర్వాత చెబుతాను, ముందు నీకు కాఫీ ఇవ్వమంది అత్తయ్య అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తయారు చేసి తెస్తుంది. కాఫీ తాగాకా, ఓ ప్రశ్న అడిగితే, నిజం చెప్తావా అని అడిగి, ఆ తెల్లపిల్ల నాకంటే అందంగా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది. ఇండియా విషయం సీతకెలా తెలిసిందా అని ఆలోచనలో పడతాడు. ఇంతలో వసుంధర, సావిత్రి అక్కడికి రావడంతో, అక్కడ్నించి వెళ్ళిపోతుంది సీత. వాళ్ళని పలకరిస్తాడు అద్వైత్. తనకు కాఫీలో చక్కెర వేయద్దొని సీతకు చెప్పావా అని తల్లిని అడుగుతాడు. మర్చిపోయింటదని అంటుంది తల్లి. కాసేపయ్యాకా, సీతని అక్కడికి తీసుకువచ్చిన ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది వసుంధర. నరసింహశాస్త్రి వద్ద నాట్యంలో సీతకి శిక్షణ ఇప్పించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. నాన్నాగారిని అడగండి అని చెప్తాడు అద్వైత్. కాసేపటికి నరసింహశాస్త్రి, పాండురంగ వస్తారు. అక్కయ్య వసుంధరనీ, మేనకోడలు సీతని ఆప్యాయంగా పలకరిస్తారు. మీ కోడలు మీ వద్ద నాట్యాన్ని అభ్యసిస్తుందట అని చెప్తుంది సావిత్రి. సరేనంటారాయన. కాసేపటికి వాళ్ళ ఇంటి ముందు కారు ఆగుతుంది. సుల్తాన్, ఆండ్రియా, ఇండియా దిగి లోపలికి వస్తారు. అందరికీ నమస్కరిస్తారు. నరసింహశాస్త్రి గారెక్కడ అని అడిగితే, లోపలున్నారు వస్తారు, కూర్చోండని చెప్తాడు అద్వైత్. నరసింహశాస్త్రి గారు వచ్చి కూర్చున్నాకా, తన కూతురు ఇండియాకి నాట్య నేర్పమని కోరుతుంది ఆండ్రియా. అయితే తాను వాళ్ళ బంగళాకి రానని, అమ్మాయే నేర్చుకోవడానికి ఇక్కడికి రావాలని చెప్తారాయన. ఆండ్రియా అంగీకరిస్తుంది. ఆ రోజు నుంచి మూడో రోజు సాయంత్రం ఆరు గంటలకు పంపమని చెప్తారు. వాళ్ళు అంగీకరించి సంతోషంతో వెళ్ళిపోతారు. విషయం తనకి అర్థం కాకపోతే, తమ్ముడిని అడిగి తెలుసుకుంటుంది వసుంధర్. అనుకున్నట్టుగానే నాట్యం నేర్చుకోడానికి వస్తుంది ఇండియా. సీతకి పూర్వానుభవం ఉండడంతో నరశింహశాస్త్రి గారు చూపించే భంగిమలను అతి సునాయాసంగా చేసేది. తాను సీతలాగా చేయలేకపోతున్నానని బాధపడిన ఇండియా, పట్టుదలగా సాధన చేసి, మూడు నెలల్లో సీతకు పోటీగా నాట్యం చేసే స్థాయికి వస్తుంది. ఓ రోజు ఇద్దరూ నృత్యం చేస్తుండగా అక్కడికి వచ్చిన రాఘన, చాటుగా నిలబడి చూస్తాడు. నాట్యం ముగిసాకా, చప్పట్లు కొడుతూ బయటకు వచ్చి ఇండియాని అభినందిస్తాడు. ఏంటిలా హఠాత్తుగా వచ్చావని అద్వైత్ అడిగితే, తనకి ఫారెస్ట్ రేంజర్‍గా ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ చూపిస్తాడు. ఇండియా అతన్ని అభినందించి వెళ్ళిపోతుంది. సీత ఆమె పట్ల అసూయ పడుతోందని గ్రహించిన రాఘవ – సీతకి నచ్చజెప్తాడు. – ఇక చదవండి.]

అధ్యాయం 9:

[dropcap]ఆ[/dropcap] రోజు సాయంత్రం ఐదుగంటల ప్రాంతం. అద్వైత్ రాఘవ గోదావరి నది ఒడ్డుకు చేరారు.

“రాఘవా!.. నీవు భద్రాచలానికి బయలుదేరేది రేపే కదూ!..”

“అవును బావా!..”

“డ్యూటీ విషయంలో జాగ్రర్తగా వుండు. అనేక రకాల మనుషులు నిన్ను కలుస్తారు. నీతో మాట్లాడుతారు. వారి మాటలు కొన్ని నీకు నచ్చకపోవచ్చు. ఆవేశపడకు. నీకు ధర్మంగా తోచింది వారికి వేరే రీతిగా తోచవచ్చు. ప్రస్తుత వ్యవస్థలో.. మనిషి ఎలాగైనా బ్రతకాలి.. తనను నమ్మి తన పైనే ఆధారపడి వున్న వారిని సంరక్షించాలనే తాపత్రయంతో తప్పు.. అని తెలిసి కూడా తప్పులనే చేసేవారు కొందరున్నారు. వారికి ముఖ్యం మనుగడ.. ధర్మాధర్మాలు కావు”

“బావా!.. నేనొకటి అడగనా!..”

“అడుగు..”

“సింహం ఆకలిగా వుందని గడ్డిని తింటుందా!..”

“తినదు..”

“అధర్మాన్ని ఆశ్రయించి బ్రతికేవాడు.. ధర్మాన్ని గురించి ఆలోచించడు. కానీ.. ధర్మాన్ని నమ్మినవాడు.. ఆ ధర్మాన్ని మరిచి ఏనాడు ఏ విషయంలోనూ వర్తించడు. అవునా!..” చిరునవ్వుతో అద్వైత్ ముఖంలోకి చూచాడు రాఘవ. “నీవు అన్నది నిజమే రాఘవా!.. కానీ పరిస్థితుల ప్రభావానికి పంచమవేదం.. మహాభారత నాయకులు.. పంచపాండవులు పదమూడేళ్ళు అరణ్యవాసం.. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఏ రీతిగా సాగించారో నీకు బాగా తెలుసు. అది ద్వాపరయుగం. నాడు.. ధర్మం నాలుగు పాదాలతో నడిచిందంటారు పెద్దలు. ఆ యుగంలో.. ఎవరెవరు ఏమేమి చేసారో.. చివరకు దానికి తగిన ఫలితాన్ని అనుభవించారు.. యీ విషయమూ నీకు తెలుసు. ఇది కలియుగం.. నేటి మన దేశం.. మన ప్రజలు.. మన పాలకులు ఏఏ స్థాయిలో వున్నారో.. నీకు తెలియంది కాదు. కాలం కలసి రానప్పుడు.. సహనంతో.. శాంతంతో.. జీవితాన్ని ముందుకు నడిపించడం వివేకవంతుల లక్షణం. అంటే లౌక్యంతో మనుగడను సాగించాలని అర్థం. అర్థం అయిందా!..” చిరునవ్వుతో అడిగాడు అద్వైత్.

“బాగా అర్థం అయింది బావా!.. మీ మాటలను శిరసావహిస్తాను.” నవ్వాడు రాఘవ.

“రాఘవా!..”

“ఏం బావా!..”

“మరొక మాట..

“చెప్పు బావా!..”

“అటవీశాఖ ఉద్యోగం అన్ని ఉద్యోగాల్లాంటిది కాదు. కొందరు వ్యక్తులు దొంగతనంగా అడవుల్లో వుండే టేకు వృక్షాలను.. గంధపు చెట్లను నరికి వ్యాపారం సాగిస్తూ వుంటారు. తమ కార్యాలు యథావిధిగా సాగేదానికి వారు అధికారులను డబ్బుతో తమ గుప్పెట్లో పెట్టుకొంటారు. నీవా నిజాయితీకి మారు పేరు.. ఆవేశమూ నీకు అధికం.. కాబట్టి, నీవు చాలా జాగ్రత్తగా నీ ఉద్యోగంలో వర్తించవలసి వుంటుంది”

“అంటే!..”

“అలాంటి దృశ్యాలు.. వ్యక్తులు తటస్థపడితే.. సహనంతో వివేకంతో ఆవేశపడకుండా నడచుకోవాలని చెబుతున్నాను”

“రౌతు కొద్ది గుర్రం అన్నట్లు.. బావా!.. మనం వుండే పద్ధతులను బట్టి.. ఎదుటివారు వారి తత్వాలను మార్చుకోవలసి వస్తుందని నా అభిప్రాయం. అవునా కాదా!..” అద్వైత్ వెంటనే జవాబు చెప్పలేదు. కొన్ని క్షణాలు రాఘవ ముఖంలోకి పరీక్షగా చూచాడు.

చిరునవ్వు నవ్వి రాఘవ.. “బావా!.. కాకిలా ఎంతో కాలం బ్రతికే కన్నా.. కోకిలలా కొద్దికాలం బ్రతికినా అది గొప్ప గౌరవం కదా!.. నీ అమూల్యమైన సలహాలకు నా ధన్యవాదాలు.

నీవు చెప్పినట్లుగానే జాగ్రర్తగా.. నడుచుకొంటాను నేను. అనవసరంగా ఎవరి జోలికీ వెళ్ళను. నన్ను గెలికితే.. వూరుకోను. నేను నిన్ను ఒక మాట అడగనా!..”

“అడుగు..”

“ఇండియాను గురించి నీ అభిప్రాయం ఏమిటి?..”

“ఏ విషయంలో!..”

“తత్వం..”

“చాలా మంచి తత్వం”

“అంటే!..”

“చిన్నా పెద్దల యందు గౌరవం.. తెలివితేటలు.. చక్కటి గ్రహణశక్తి.. స్నేహచింతన.. పరమత అభిమానం.. ఆమెలోని యీ గుణాలు నాకు బాగా నచ్చాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే.. శాపవశాత్తుగా ఆ జాతిలో పుట్టిందని నాకు అనిపిస్తుంది”

“బావా!.. నిజం చెప్పాలి!..”

“నేను చెప్పిందంతా నిజమే!..”

“ఆ విషయంలో కాదు..”

“మరే విషయంలో!..”

“ఇప్పుడు నేను అడగబోయే విషయంలో..”

“ఏమిటది?..”

“సీత స్థానంలో ఇండియా నా చెల్లెలుగా వుండి వుంటే.. ఆమెను నీవు వివాహం చేసికొనే వాడివా…” చిరునవ్వుతో అడిగాడు రాఘవ.

“నా వివాహం నా తల్లిదండ్రుల ఇష్టానుసారంగా జరగాలనేది నా ఆకాంక్ష రాఘవా!..”

“అయితే.. ఈ విషయంలో నీ ప్రమేయం ఏమీట లేదన్న మాట!..”

“అవును.. అదే నా నిర్ణయం..”

“ఈ మాట నిజమేనా బావా!..”

“ముమ్మాటికి ముమ్మాటికి..”

“ఓకే బావా!.. నీవు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. నీవు చెప్పిన మాట కారణంగా నాకు చాలా సంతోషం..” నవ్వాడు రాఘవ.

“ఎందుకురా నవ్వుతావ్!..”

“మనస్సులో ఆనందం. అందుకే నవ్వాను. నవ్వడం కూడా తప్పా బావా!..”

“తప్పు కాదు ఒప్పే.. ఒరే రాఘవా.. మరో మాట!..”

“ఏమిటి బావా!…”

“అడవుల్లో లంబాడీ కోయ తండలు వుంటాయట. లంబాడీ స్త్రీలు తెల్లగా అందంగా వుంటారట. నీవా అపారమైన మాటకారివి. పైగా అందగాడివి. ఏ భామ వల్లో పడకుండా జాగ్రర్తగా తిరుగు.” నవ్వాడు అద్వైత్.

“బావా!.. నీవన్నట్లు అలాంటిదేదైనా తగిలిందంటే.. నీకు చూపించి.. నీ సమ్మతితో పెండ్లి చేసుకొంటా. కులాలు.. మతాలు.. సంస్కృతి.. సాంప్రదాయం అని మెట్ట వేదాంతాలను చెప్పకుండా పెండ్లి జరిపిస్తావుగా!..”

“నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా సరే.. పెళ్ళి పెద్దగా ముందు నిలబడి నీ పెళ్ళి నేను జరిపిస్తానురా!..”

“ఆ పిల్ల నీవన్నట్లు లంబాడీ భామే అయితే!.. పెండ్లి జరిపిస్తావా!..”

అద్వైత్ కొన్నిక్షణాలు ఆలోచించి.. “జరిపిస్తాన్రా!..” అన్నాడు.

“కొంతసేపు ఆలోచించావ్!.. ఏ విషయాన్ని గురించి బావా!..” నవ్వుతూ అడిగాడు రాఘవ.

“నీ గురించేరా!..” చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్.

“సంతోషం బావా!.. పద ఇంటికి బయలుదేరుదాం” ఇరువురూ నవ్వుకొంటూ.. నది ఒడ్డు నుండి ఇంటివైపుకు బయలుదేరారు.

అధ్యాయం 10:

రాఘవ మరుదినం ఉదయం ఎనిమిదిన్నరకు భద్రాచలంలో డ్యూటీలో చేరేదానికి నరసింహశాస్త్రి, సావిత్రి. వసుంధర.. ఆశీర్వచనాలను తీసుకొని బయలుదేరాడు. అతని తోటే అద్వైత్ స్టేషన్‍కు వచ్చాడు. వారిరువురూ స్టేషన్‍లో ఇండియాను చూచారు. ఇండియా నవ్వుతూ వారిని సమీపించింది.

“ఇండియా!.. మీరు ఎక్కడికి వెళుతున్నారు?” అడిగాడు రాఘవ.

“మీకు సెండ్ ఆప్ చెప్పేదానికి వచ్చాను బ్రదర్…” అందంగా నవ్వుతూ అంది ఇండియా.

ఇండియా మాటలకు ఆశ్చర్యంతో రాఘవ అద్వైత్.. ముఖంలోకి క్షణంసేపు చూచి.. ఇండియా వైపు తిరిగి.. “ఓ.. థాంక్యూ వెరీ మచ్..” నవ్వుతూ చెప్పాడు.

“థ్యాంక్యూ..” అంది ఇండియా.

రైలు కూత వినిపించింది.

“బండి కదలబోతూ వుందిరా రాఘవా!.. ఎక్కు!..” అన్నాడు అద్వైత్.

“అలాగే బావా!..” అద్వైత్‍ను సమీపించి గట్టిగా కౌగలించుకొన్నాడు. “సీతను జాగ్రర్తగా చూచుకో బావా!..” మెల్లగా చెవి దగ్గర చెప్పాడు.

“ఆ మాట నీవు నాకు చెప్పాలా!.. బండి కదిలింది. ఎక్కు..” అన్నాడు అద్వైత్. రాఘవ కపార్టుమెంటులో ఎక్కాడు.

“నేను చెప్పిన విషయాలను మరువకు. జాగ్రర్త..”

“అలాగే బావా బై..” ఇండియాను చూచి.. “ఇండియా బై..” చిరునవ్వుతో చెప్పాడు రాఘవ.

బండి వేగం పెరిగింది..

వెళుతున్న రైలును చూస్తూ చేతులను పైకెత్తి.. అద్వైత్ ఇండియాలు రాఘవకు టాటా, చెప్పారు.

కంపార్టుమెంటు ద్వారం దగ్గర నిలబడి రాఘవ చేతిని విసురుతున్నాడు. బండి మలుపు తిరిగింది. వేగంగా ముందుకు సాగింది.

సాలోచనగా ఆ దిశనే చూస్తూ కొన్నిక్షణాలు అద్వైత్ నిలబడ్డాడు. అతని ముఖంలో వేదన..

అద్వైత్ వాలకాన్ని గ్రహించిన ఇండియా అతన్ని సమీపించి.. “సార్…” మెల్లగా అంది.

ఆమె గొంతు విని అద్వైత్ త్రోటుపాటుతో ఆమె ముఖంలోకి చూచాడు.

“రాఘవ సార్ వెళ్లినందుకు మీకు బాధగా వుంది కదూ!.. నాకూ వుంది. అన్నయ్య చాలా మంచివాడు” ఇండియా సాలోచనగా చెప్పింది.

అద్వైత్ క్షణంసేపు ఇండియా ముఖంలోకి చూచాడు. ఆమె కూడా తనలాగే బాధ పడుతూ వుందని గ్రహించాడు. “ఇండియా!.. రాఘవ చాలా మంచివాడు. వాడంటే నాకు ఎంతో ఇష్టం..”

“నాకూ అంతే..”

“సరే పద వెళదాం..”

ఇరువురూ స్టేషన్ బయటికి వచ్చారు.

“నేను స్కూలుకు వెళుతున్నాను ఇండియా..”

“నాతో రండి.. నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను”

“స్కూలు దగ్గరే.. ఐదు నిముషాల నడక. మీరు ఇంటికి వెళ్ళండి. నేను నడచి వెళతాను”

“నేను మీ స్కూలును చూడాలి సార్. కార్లో కూర్చొండి. ప్లీజ్..” చిరునవ్వుతో కోరింది ఇండియా.

‘ఇక ఈ పిల్ల వదలదు, వాదన అనవసరం’ అనుకొని కార్లో కూర్చున్నాడు అద్వైత్. ఇండియా డ్రైవర్ స్థానంలో కూర్చుని కారును స్టార్ట్ చేసింది.

“సార్..”

“ఏమిటి ఇండియా..”

“నేను త్వరలో లండన్ వెళ్ళాలనుకొంటున్నాను. మా అమ్మమ్మకు నన్ను చూడాలని వుందట. మీరు.. నాతో లండన్‍కు వస్తారా..” అడిగింది ఇండియా..

“నేను మీతో లండన‌కు రావడమా…” ఆశ్చర్యంతో నవ్వాడు అద్వైత్.

“అవును..”

“కుదరదు..”

“కారణం..”

“మా నాన్న అమ్మ అంగీకరించరు.. పైగా..” అద్వైత్ పూర్తి చేయక మునుపే.. ఇండియా.. “వారు అంగీకరిస్తే.. వస్తారా..” అంది.

“నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి..”

“అడగవలసిన ప్రశ్ననే అడిగారు. నేను మీ నాట్య సామర్థ్యాన్నిగురించి మా అమ్మమ్మ మేరీకి లెటర్ వ్రాశాను. జవాబుగా ఆమె ఆ అబ్బాయిని తీసికొనిరా.. ఇక్కడ మనం నాట్య స్కూల్‍ను ప్రారంభిద్దాం.. అని వ్రాసింది. ఆమె రిటైర్డ్ ప్రొఫెసర్, ఎందరో శిష్యులు. చాలా మంచిపేరు ప్రఖ్యాతులు వున్న వ్యక్తి, పైగా ఆమెకు నాట్యం అంటే ఎంతో పిచ్చి. ఆమె నన్ను నాట్యాన్ని నేర్చుకోమని.. చెప్పిన కారణంగానే నేను మీవద్ద నాట్యాన్ని నేర్చుకొంటున్నాను” గలగలా నవ్వింది ఇండియా.

నప్పుతున్న ఆమె ముఖంలోకి క్షణంసేపు చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు అద్వైత్.

‘రాఘవా!.. నీ మాట నిజమేరా.. ఇండియా నవ్వితే.. చూచిన వారికి మతి చెలిస్తుంది..’ అనుకొన్నాడు. కారు స్కూలును సమీపించింది.

“ఆపండి ఇండియా, నేను దిగుతాను”

“కారులోకి రాకూడదా!..”

“రావచ్చు.. నేను యిక్కడ దిగి నడిచి వెళతాను”

“నేను చెప్పిన మాటను మరచారా!..”

“ఏమిటది?..”

“నేను.. మీ స్కూలును చూడాలన్నానుగా!..”

“సరే.. లోనికి పోనీయ్యండి..”

ఇండియా గేటును దాటి కుడివైపున వున్న వేపచెట్టు క్రింద వున్న హెడ్ మిసెస్ గారి కారు ప్రక్కన తన కారును ఆపింది.

హెడ్ మిసెస్.. పేరు గౌరి.. గౌరి కుటుంబానికి నరశింహశాస్త్రి కుటుంబానికి బాంధవ్యం వుంది. ఇరువురూ కారు దిగారు.

“మీ హెడ్ మాస్టర్ పేరేమిటి?..” అడిగింది ఇండియా.

“మాకున్నది హెడ్ మిసెస్.. పేరు గౌరి..”

“నేను వారిని కలవవచ్చా!..”

“ఎందుకు?..”

“స్కూలును చూచేటందుకు పర్మిషన్ అడిగేదానికి. మీ గురించి మంచిగానే చెబుతాలే..” చిరునవ్వుతో ఓరకంట అద్వైత్ ముఖంలోకి చూస్తూ అంది ఇండియా.

“నా గురించి మీరు వారితో ఏమైనా చెప్పవచ్చు. నాకు అభ్యంతరం లేదు”

“ఓకే సార్…” నవ్వుతూ అంది ఇండియా.

ఇరువురూ హెడ్మిసెస్ గదిని సమీపించారు. దార్లో ఎదురైన పిల్లలు అద్వైత్‍‌కు ఎంతో వినయంగా ‘గుడ్ మార్నింగ్ సార్..’ చెప్పారు. అద్వైత్.. వారికి అదే మాటను వారిని ప్రీతిగా చూస్తూ చెప్పాడు.

‘స్టూడెంట్సు అందరూ వీరిని చాలా గొప్పగా గౌరవిస్తున్నారు.. నో డౌట్.. మై మాస్టర్ అద్వైత్ యీజ్ నోబుల్ మ్యాన్..’ స్వగతంలో నవ్వుకుంది ఇండియా.

అద్వైత్ ముందు.. వెనుక ఇండియా హెడ్మిసెస్ గదిలో ప్రవేశించారు.

“గుడ్ మార్నింగ్ మేడమ్..”

తలను ఎత్తి గౌరి అద్వైత్‌ను చూచింది.. నవ్వుతూ..

“ఆది.. గుడ్మార్నింగ్. రాఘవ భద్రాచలం వెళ్లిపోయాడా!..”

“వాణ్ణి రైలు ఎక్కించి వస్తున్నాను మేడమ్..”

“గుడ్ మార్నింగ్ మేడమ్..” చేతిని పైకెత్తి విష్ చేసింది ఇండియా. గౌరి ఆశ్చర్యంతో ఇండియా ముఖంలోకి చూచి వెంటనే అద్వైత్‍ను చూచింది.

“ఈమె నాన్నగారి వద్ద నాట్యాన్ని అభ్యసిస్తూ వున్నారు. మీరు వినే వుంటారు రాబర్ట్ రెవిన్యూ అధికారిగారి కూతురు. మన స్కూలును చూడాలని వచ్చారు”

గౌరి కుర్చీ నుంచి లేచి ఇండియాను సమీపించింది. ప్రీతిగా భుజంపై చెయ్యి వేసి.. “వాట్ ఏ బ్యూటీ!.. డార్లింగ్!… వాట్ యీజ్ యువర్ నేమ్?..” ఆప్యాయంగా అడిగింది గౌరి.

“ఇండియా..” చిరునవ్వుతో చెప్పింది.

“ఇండియా!..” ఆశ్చర్యపోయింది గౌరి

“యస్ మేడమ్.. మైనేమ్ యీజ్ ఇండియా.. ఇరవై మూడు సంవత్సరాల క్రిందట నేను కలకత్తాలో పుట్టాను. మా అమ్మకు యీ దేశం అంటే చాలా ఇష్టం. ఆ కారణంగా నాకు ఆ పేరును పెట్టారు.”

“వాట్ ఎ వండర్.. వాట్ ఎ వండర్… నీవు ఇంత చక్కగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నావు?..” ఆశ్చర్యంతో అడిగింది గౌరి.

“అంతా వీరి ప్రభావం..” చిలిపిగా అద్వైత్ ముఖంలోకి చూస్తూ చెప్పింది ఇండియా.

మూడవగంట మ్రోగింది. పిల్లలందరూ తరగతి గదుల నుంచి ప్లే గ్రౌండ్ నుంచి వచ్చి క్రమంగా క్లాస్.. సెక్షన్, వారిగా ప్రార్థనా స్థలంలో నిలబడ్డారు.

ఆయా క్లాస్ టీచర్స్.. వారి వారి పిల్లల ప్రక్కన నిలబడ్డాడు. గౌరికి చెప్పి.. అద్వైత్ తన క్లాస్ పిల్లలను సమీపించాడు.

“ఇండియా!..”

“యస్ మేడమ్..”

“టు డే యు ఆర్ మై గెస్ట్..”

“థ్యాంక్యూ మేడమ్.”

“నీవు నాతో రా!..”

“ఓకే మేడమ్..”

ఆ ఇరువురూ.. పిల్లల ముందున్న వేదికను చేరారు. హెడ్ మిసెస్ రాగానే పిల్లలందరూ గప్‍చిప్ అయిపోయారు. ఇరువురు బాలికలు వేదికను సమీపించారు. ప్రార్థన గీతాలు పాడారు.

తర్వాత.. అందరూ వరుసగా ఒకరి వెనకాల ఒకరు వారి వారి తరగతి గదులకు వెళ్ళిపోయారు. వారి వెనకాలే టీచర్లు క్లాస్ రూముల్లో ప్రవేశించి పాఠాలను చెప్పడం ప్రారంభించారు.

గౌరి.. ఇండియా అన్ని తరగతి గదులను వరసగా చూచుకొని హెడ్ మిసెస్ గదిని సమీపించారు.

“మేడమ్!..”

“నాకు చాలా ఆనందంగా వుంది..” నవ్వుతూ చెప్పింది ఇండియా

“కారణం!..”

“నేను అడగక ముందే.. మీరు నా ఉద్దేశాన్ని గ్రహించి అన్ని తరగతి గదులను నాకు చూపించినందుకు.”

“నేను చేసిన పనిలో నా స్వార్థం వుంది ఇండియా!..”

“మీకు స్వార్ధమా!..”

“అవును..”

“నేను నమ్మను..” నవ్వింది ఇండియా.

“అవునమ్మా!.. ఈ స్కూల్లో ఐదు వందల మంది బాల బాలికలు చదువుతున్నారు. వారికి లైబ్రరీ.. ల్యాబ్.. స్పోర్టు టూల్స్ తగినంతగా లేవు. నీవు మీ నాన్నగారికి చెప్పి కొంత విరాళాన్ని స్కూలుకు డొనేట్ చేసేలా చూడగలవా!..” అభ్యర్ధనగా అడిగింది గౌరి.

ఆమె మాటలను విన్న ఇండియా.. కొన్ని క్షణాలు ఆలోచించి..

“తప్పకుండా మేడమ్.. ఐ విల్ డు యిట్” తన నిర్ణయాన్ని నిస్సంకోచంగా చెప్పింది ఇండియా.

“థ్యాంక్యూ మా.. థ్యాంక్యూ వెరీ మచ్..” ఆనందంగా చెప్పింది గౌరి.

“మేడం.. వన్ రిక్వస్ట్..”

“చెప్పమ్మా!..”

“ఐ వాంట్ టు లిజన్ మిస్టర్ అద్వైత్ సార్ టీచింగ్..” మెల్లగా చెప్పింది ఇండియా.

“ఈజ్ ఇట్ సో!..”

“యస్ మేడం.”

“హి యీజ్ యిన్ లెవంత్ ఎ సెక్షన్..” అని చెప్పి, “హిమామ్!..” పిలిచింది గౌరి.

హిమామ్.. అటెండర్ పరుగున వచ్చాడు.

“మేడమ్‌ను లెవన్త్ ‘ఎ’ సెక్షన్‍కు తీసుకొని వెళ్ళి టీచరుకు నేను చెప్పానని చెప్పి.. క్లాస్‌లో కూర్చోపెట్టు” అంది గౌరి. ఇండియా నవ్వుతూ థ్యాంక్యూ చెప్పింది.

“క్యారీ ఆన్ ఇండియా!..” చెప్పి గౌరి తన గదిలోనికి వెళ్ళింది. ముందు హిమామ్ నడువగా.. ఇండియా అతన్ని అనుసరించింది. ఇరువురూ సెక్షన్ గదిని సమీపించారు. హిమామ్ లోకి వెళ్ళి గౌరి చెప్పిన మాటలను అద్వైత్‍కు చెప్పాడు. అతను ఆశ్చర్యంతో గది ద్వారం వైపు చూచాడు.

ఇండియా చిరునవ్వుతో నిలబడి వుంది.

కొన్నిక్షణాలు పరీక్షగా ఆమెను చూచి.. “ప్లీజ్ కమిన్..” అన్నాడు.

ఇండియా గదిలో ప్రవేశించింది. ఆడపిల్లలు కూర్చున్న వైపున ఖాళీగా వున్న బెంచ్‍పై కూర్చుంది. తలలు త్రిప్పి పిల్లలందరూ ఇండియాను ఆశ్చర్యంగా చూచారు. అద్వైత్ కూడా క్షణకాలం అదే పని చేశాడు. తర్వాత దృష్టిని పిల్లల వైపు మళ్ళించి..

“బాయిస్ అండ్ గర్ల్స్.. బాల బాలికలారా!.. ఈ రోజు మీ క్లాస్ టీచర్ రానందున నేను వచ్చాను. నేను మిమ్మల్ని మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతాను. మీరు జవాబు చెప్పాలి. అడిగిన వారు చెప్పలేకపోతే తెలిసినవారు చేతిని పైకి ఎత్తాలి. నేను పిలిచిన వారు నా ప్రక్కకు వచ్చి నిలబడి జవాబును అందరికీ వినిపించేలా బిగ్గరగా స్పష్టంగా చెప్పాలి..”

“నా మొదటి ప్రశ్న.. తెలుగు నెలలు ఎన్ని.. వాటి పేర్లు ఏమిటి?..”

ఒక బాలుని వైపు చూచి.. చూపుడు వ్రేలిని చూపాడు.

అతను లేచి.. “తెలీదు సార్.. సారీ!..” తల దించుకొన్నాడు.

“ఎవరికైనా తెలుసా!..” అడిగాడు అద్వైత్.

ఒక బాలుడు.. బాలిక లేచి నిలబడ్డారు. బాలికను తన ప్రక్కకు.. రమ్మని పిలిచాడు. ఆమె అద్వైత్ను సమీపించింది.

“నీ పేరు!..”

“సుమిత్ర సార్!…”

“మంచిపేరు.. తెలుగు నెలల పేర్లు చెప్పమ్మా!..”

సుమిత్ర.. చెప్పడం ప్రారంభించింది.

“చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. యీ పన్నిండింటినీ తెలుగు మాసములని చెప్పబడును”

చెప్పడం ఆపి సుమిత్ర.. అద్వైత్ ముఖంలోకి చూచింది.

“చాలా బాగా తడబడకుండా చెప్పావమ్మా. సుమిత్రా!.. వెరీ గుడ్..” చిరునవ్వుతో.. “ధన్యవాదములు సార్..” చెప్పి తన సీటును చేరి కూర్చుంది.

“ఎవరు ఎంత పెద్ద చదువులు చదివినా.. ఏ యితర దేశాలకు ఉపాధి రీతిగా వెళ్ళినా.. స్వజాతిని.. స్వభాషను.. మరువకూడదు. స్వభాష అన్నది మనకు మరో తల్లి అన్న విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సుమిత్ర చెప్పిన తెలుగు నెలల పేర్లను నేను బోర్డు మీద వ్రాస్తాను. అందరూ వ్రాసుకొండి. ఒకటికి పదిసార్లు చదివి ఆ పేర్లను గుర్తు పెట్టుకోండి”

అద్వైత్ చాక్‍పీస్‌తో తెలుగు నెలల పేర్లను బోర్డు మీద వ్రాశాడు. పిల్లలందరూ వ్రాసుకున్నారు.

ప్రక్కన వున్న అమ్మాయిని కాగితాన్ని పెన్నును అడిగి ఇండియా కూడా వ్రాసుకుంది.

“అందరూ వ్రాసుకొన్నారా!..” అడిగాడు అద్వైత్.

“వ్రాసుకున్నాము సార్…” పిల్లలందరూ ఏకకంఠంతో చెప్పారు.

“నేనూ వ్రాసుకున్నాను సార్!..” చివరగా ఇండియా లేచి చిరునవ్వుతో చెప్పింది.

ఆమె చెప్పిన తీరుకు అద్వైత్‍కు నవ్వు వచ్చింది. ‘సరే’ అన్నట్లు తల ఆడించి చేత్తో కూర్చోమని సైగ చేశాడు. ఇండియా కూర్చుంది.

“మన ఆ పన్నెండు నెలలూ.. ఆంగ్ల మాసాల్లో ఏది ఏ ఆంగ్ల మాసంలో వస్తుందో ఎవరికైనా తెలుసా!..” ఒక్కరూ.. జవాబు చెప్పలేదు. కొన్నిక్షణాల తర్వాత..

“నేను మన తెలుగు మాసాలకు ఎదురుగా ఆంగ్లమాసాలను వ్రాస్తాను. జాగ్రర్తగా వ్రాసుకోండి”  అన్నాడు అద్వైత్.

బోర్డుపై..

వ్రాసి.. తను వ్రాసిన ఆంగ్లమాసములను చదివి పిల్లలకు వినిపించాడు. వ్రాసుకోమని చెప్పాడు.

అందరు పిల్లలూ.. ఇండియా.. అద్వైత్ బోర్డు మీద వ్రాసిన తెలుగు మాసములకు ఎదురుగా వున్న ఆంగ్ల మాసముల పేర్లను వ్రాసుకున్నారు. వ్రాసుకున్నట్లు చెప్పారు.

“మంచిది.. ఇప్పుడు మీలో ఎంతమందికి మన తెలుగు సంవత్సరముల పేర్లు తెలియునో చేతులు ఎత్తండి..” అన్నాడు అద్వైత్.

పిల్లలందరూ అతని ముఖంలోకి క్షణంసేపు చూచి తలలు దించుకొన్నారు.

“మనం తెలుగు వారమయ్యుండి.. మనకు మన తెలుగు సంవత్సరముల పేర్లు తెలియదంటే.. అది మనకు.. మీకు.. అవమానం కాదా!.. నేను బోర్డు మీద వ్రాస్తాను వ్రాసుకోండి”

నెలల పేర్లను తుడిపి క్రమంగా తెలుగు సంవత్సరముల పేర్లను బోర్డు మీద వ్రాయ ప్రారంభించాడు అద్వైత్. ‘సంవత్సరముల పేర్లు కాల చక్రశమనానికి ప్రతీకలు’.. అని వ్రాసి క్రింద..

1.ప్రభవ 2. విభవ 3. శుక్ల 4. ప్రమోదూత 5. ప్రజోత్పత్తి 6. ఆంగీరస 7. శ్రీముఖ 8. భావ 9. యువ 10. ధాత 11. ఈశ్వర 12. బహుధాన్య 13.ప్రమాది 14. విక్రమ 15. వృష 16. చిత్రభాను 17. స్వభాను 18. తారణ 19. పార్థివ 20. వ్యయ 21. సర్వజిత్ 22. సర్వధారి 23. విరోధి 24. వికృతి 25. ఖర 26. నందన 27. విజయ 28. జయ 29. మన్మథ 30. దుర్ముఖి 31. హేవిళంబి 32. విళంబి 33. వికారి 34. శార్వరి 35. ప్లవ 36. శుభకృత్ 37. శోభకృత్ 38. క్రోధి 39. విశ్వావసు 40. పరాభవ 41. ప్లవంగ 42. కీలక 43. సౌమ్య 44. సాధారణ 45. విరోధికృత్ 46. పరీధావి 47. ప్రమాదీచ 48. ఆనంద 49. రాక్షస 50. నల 51. పింగళ 52. కాళయుక్తి 53. సిద్ధార్థి 54. రౌద్రి 55. దుర్మతి 56. దుందుభి 57. రుధిరోద్గారి 58. రక్తాక్షి 59. క్రోధవ 60. అక్షయ. ఈ అరవై నామములు తెలుగు సంవత్సరముల పేర్లు. వ్రాయడం ముగించి అద్వైత్.. “జాగ్రర్తగా అక్షరదోషం లేకుండా వ్రాసుకోండి. ఏదైనా అక్షరం తెలియకపోతే అడగండి.. చెబుతాను.” అన్నాడు.

ఆ పిరీడ్ నిర్ణీత సమయం పూర్తయింది. గంట మ్రోగింది. అద్వైత్.. ఇండియా క్లాస్ గదిలో కూర్చొని వున్న సంగతిని మరచి రూమ్ నుండి బయటికి నడిచాడు. సంవత్సరముల పేర్లలను ప్రక్క బాలికను అడిగి ఆంగ్లములో వ్రాసుకొంటున్న ఇండియా.. అద్వైత్ వెళ్ళి పోవడాన్ని గమనించలేదు. పూర్తిగా వ్రాసుకొని తల ఎత్తి చూచింది. అద్వైత్ కనుపించలేదు. వ్రాసుకొన్న కాగితాన్ని చేత పట్టుకొని ప్రక్కన వున్న అమ్మాయికి ‘థ్యాంక్స్’ చెప్పి వేగంగా క్లాస్ గది నుండి బయటికి వచ్చింది.

అదే సమయానికి రెండవ పిరీడ్ లెక్కల మాస్టర్ వీరభద్రయ్య గది ద్వారాన్ని సమీపించాడు. తనకు ఎదురైన ఇండియాను చూచి.. గుడ్లప్పగించి నిలబడ్డాడు. క్షణంసేపు అతని ముఖంలోకి చూచి ఇండియా వేగంగా హెడ్ మిసెస్ గది వైపుకు నడిచింది.

అదే వరసలో.. మూడవ గదిలో వున్న అద్వైత్‌ను చూచింది. గది ద్వారం ముందు నిలబడి గొంతు సవరించింది. అద్వైత్.. ద్వారం వైపు చూచాడు. చిరుకోపంతో ఇండియా బుంగమూతి పెట్టి నిలబడి వుంది.

అప్పుడు గుర్తు వచ్చింది అద్వైత్‍కు.. తాను ఇండియా క్లాస్ గదిలో వున్న సంగతిని మరచి గంట వినిపించగానే బయటికి వచ్చానని.

చిరునవ్వుతో.. వాకిలిని సమీపించి..

“సారీ!.. ఇండియా.. నీవు క్లాసులో వున్న సంగతే మరచి బయటికి వచ్చాను” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు.

అతను చెప్పిన తీరు.. ఇండియాకు నవ్వు వచ్చేలా చేసింది. ఆమె చిరుకోపం మాయమయింది. నవ్వుతూ..

“సార్!.. మీ కారణంగా నేను క్రొత్త విషయాలను తెలిసికోలిగాను. మీకు నా ధన్యవాదాలు. మేడమ్‍కు చెప్పి నేను ఇంటికి వెళతాను. సాయంత్రం నాట్యాభ్యాసానికి వస్తాను” అంది.

“అలాగే..”

“థ్యాంక్యూ సార్…” చెప్పి ఇండియా హెడ్‍ మిసెస్ గదికి వెళ్లి గౌరికి చెప్పి.. తన కార్లో కూర్చొని ఇంటికి బయలుదేరింది.. పదిహేను నిముషాల్లో ఇంటికి చేరింది.

వరండాలో మూన్.. తన తల్లి ఆండ్రియా కూర్చొని మాట్లాడుకొంటున్నారు.

ఇండియా కారు దిగి మూన్‍ని చూచి సంతోషంగా అతన్ని సమీపించి చక్కిలిపై ముద్దు పెట్టింది.

“హౌ ఆర్ యు అంకుల్…” ప్రీతిగా అడిగింది.

“ఫైన్ బేబీ!.. హౌ అబౌట్ యు డార్లింగ్..”

“వెరీ వెరీ ఫైన్ అంకుల్..”

“యిప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు ఇండియా!..” ఆంగ్లంలో అడిగింది ఆండ్రియా.

“మమ్!.. నేను నా బ్రదర్ రాఘవకు సెండ్ ఆఫ్ ఇచ్చి.. అద్వైత్ సార్‍తో వారి స్కూలుకు వెళ్ళాను. వారి హెడ్ మిసెస్ గౌరిని కలిశాను. ఆమె చాలా మంచిది. నన్ను ఎంతో ప్రీతిగా పలకరించింది. స్కూలు అవసరాలకు కొంత సొమ్మును డొనేట్ చేయమని కోరింది. నేనూ.. చేయాలని నిర్ణయించుకొన్నాను. పిల్లలు చదివే స్కూలుకు డొనేషన్ ఇవ్వడం చాలమంచి పని కదా మమ్!..”

ఆండ్రియా.. ఇండియా మాటలకు కొన్ని క్షణాలు ఆమెను పరీక్షగా చూచింది.

“అంకుల్ మీరు చెప్పండి. నా నిర్ణయం మంచిదా!.. చెడ్డదా!..” మూన్ ముఖంలోకి చూస్తూ అడిగింది ఇండియా.

“వెరి గుడ్ డెషిషన్ బేబీ!.. ఐ విల్ గివ్ యు ట్వన్టి థౌజండ్. ప్లీజ్ పే టు ది స్కూల్..” నవ్వుతూ చెప్పాడు మూన్.

“మమ్!.. మీరు!..”

“ఐ విల్ ఆల్సో గివ్ ద సేమ్!.. ఆర్ యు హ్యాపీ!..” నవ్వుతూ అడిగింది ఆండ్రియా.

“థ్యాంక్యూ మమ్!.. అయాం సో హ్యాపీ.. అంకుల్… విత్ యువర్ పర్మిషన్, ఐ హ్యావ్ టు టేక్ బాత్ ప్లీజ్..”

నవ్వింది ఇండియా

“క్యారీ ఆన్ బేబీ!.. వై మై పర్మిషన్!..”

నవ్వుతూ ఇండియాలోనికి వెళ్ళిపోయింది.

“మిస్టర్ మూన్!..”

“రాబర్ట్ బికమింగ్ డె బై డే క్రూయల్…”

“ఐ నో దట్ ఆండ్రియా!.. హి వాట్స్ ప్రమోషన్.. పవర్.. మనీ.. టు అఛీవ్ దట్.. హి యీజ్ రడీ టు డు ఎనీథింగ్!..” జిజ్ఞాసగా చెప్పాడు మూన్.

“ఐ హేట్ హిజ్ క్వాలిటీస్ మిస్టర్ మూన్!..”

“ఐ టూ.. బట్.. హి యీజ్ యువర్ హజ్బెండ్. యు హ్యావ్ ‍టు అడ్జెస్ట్..”

“హౌ లాంగ్!..” నవ్వింది ఆండ్రియా.

ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు మూన్. శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత.. “లైఫ్ యీజ్ కాంప్రమైజ్.. వితౌవుట్ కాంప్రమైజ్.. దేరీజ్ నో లైఫ్.. ఆండ్రియా!..” మెల్లగా చెప్పాడు.

“విత్ హిం అయాం నాట్ హ్యాపీ మిస్టర్ మూన్!..” విచారంగా చెప్పింది ఆండ్రియా.

“సో!..”

“కెన్ యు మ్యారీ మీ!.. ఐ విల్ డైవర్స్ హిమ్..” తన నిశ్చితాభిప్రాయాన్ని మెల్లగా చెప్పింది ఆండ్రియా. మూన్ కొన్నిక్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూచాడు. తర్వాత..

“వాట్ అబౌట్ ఇండియా!..”

“ఐ విల్ సెండ్ హర్ టు మై మదర్..”

“అయాం ఆస్కింగ్ అబౌట్ హర్ ఫ్యూచర్..”

“కాంట్ యు మేక్ హర్ ఫ్యూచర్ బ్రయిట్..”

“ఆండ్రియా!.. బి పేషన్స్.. ఎవ్విరీ థింగ్ విల్ బి స్మూత్ సూన్.. ఐ విల్ టాక్ విత్ రాబర్ట్” అనునయంగా చెప్పాడు మూన్

ఆండ్రియా మౌనంగా వుండిపోయింది. కొన్నిక్షణాల తర్వాత..

“ఆండ్రియా!.. టు బి ఫ్రాంక్ అయాం నాట్ హ్యాపీ అబౌట్ అవర్ గ్రూప్.. అండ్ దేర్ పాలసీస్.. ది వే హౌ దే ఆర్ ట్రీటింగ్ దీస్ పూర్.. ఆనెస్ట్ ఇండియన్స్.. దె మే బీ బ్లాక్ యిన్ కలర్.. బట్.. దైర్ హార్ట్స్ ఆర్ వైట్.. ఇన్నోసెంట్.. సమ్ టైమ్స్ ఐ ఫీల్.. బెటర్.. టు గో అవర్ కంట్రీ.. యిఫ్ ఐ గో!..” మూన్ పూర్తి చేయక ముందే..

“కెన్ యు టేక్ మి విత్ యు యాజ్ యువర్ లైఫ్ పాట్నర్ మిస్టర్ మూన్..” అభ్యర్థనగా అడిగింది ఆండ్రియా. మూన్ పెదవులపై చిరునవ్వు..

“ఆండ్రియా!.. ఆర్ యు స్టిల్ లౌవింగ్ మీ!..”

“యస్!.. దట్ ఫీల్ ఐ విల్ హ్యావ్.. టిల్ మై డెత్ మూన్..”

“ఓకే!.. లెటజ్ హోప్ ఫర్ ది బెస్ట్.. బి హ్యాపీ..” అని కుర్చీ నుంచి లేచి..

“ఆండ్రియా!.. ఐ విల్ మూవ్ నౌ!.. అన్నాడు మూన్.

ఆండ్రియా లేచి అతన్ని సమీపించి అతని నొసటన ముద్దు పెట్టింది.

మూన్ నవ్వుతూ.. “థ్యాంక్యూ..” వెళ్ళి కార్లో కూర్చున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version