[dropcap]సృ[/dropcap]ష్టిలో కనిపించే పదార్థాలెన్నో అసంఖ్యాకంగా ఉన్నట్టు కనిపిస్తాయి. దానినే భిన్నత్వం అంటారు. అయితే లోతుగా తర్కించి చూస్తే అన్నీ కలిసి ఒకే ఒక పదార్థం. అది ఏదో గాదు నా నీ స్వరూపమే. ఇదీ అద్వైతమనే మాటకర్థం. ద్వైతం కానిదేదో అది అద్వైతం. ద్వైతమంటే ఒకదానికొకటి వేరుగా అన్యంగా కనిపించేదంతా ద్వైతమే. ఒకటి అనే సంఖ్య దాటి ఇక ఎన్ని పరిగణించినా అది ద్వైతమే. ఉదాహరణకు జీవాత్మ, పరమాత్మ రెండు వేరు వేరు అంటుంది ద్వైతం. కాని జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అని, రెండు కూడా ఒకే బ్రహ్మ పదార్థంలోని భాగమని అంటుంది అద్వైతం.
అద్వైతం జీవుడనీ జగత్తనీ ఈశ్వరుడనీ ప్రకృతి అనీ ఇన్ని పదార్ధాలను ఒప్పుకోదు. పరస్పరం భిన్నంగా కనిపించే ఇవన్నీ అసలు లేనే లేవు. ఉన్నదొకే ఒక తత్వం. అది నిరాకారమూ సర్వ వ్యాపకమూ అయిన పరిశుద్ధమైన జ్ఞానం. జ్ఞానం గనుక నేను నేను అనే స్ఫురణ ఎప్పుడూ ఉంటుంది దానికి. దానికి అంటున్నాను. దానికి గాదు అని నేనే. అది నా స్వరూపమే ఆత్మే నేనే. తెలుగులో నేనంటే సంస్కృతంలో దాన్నే ఆత్మ అన్నారు.
సత్యమైన వస్తువు ఒకటి ఉన్నది. అయితే ఈ లోకంలో వున్న అన్ని వస్తువులను మన కన్నులు చూస్తూ ఉన్నాయి. ‘లోకమంతా సత్యమైన వస్తువు’- అని అద్వైతం చెబుతోంది. మనకు నానా వస్తువులుగా కనబడేది అంతా మిధ్య. సత్యమైన వస్తువు ఒక్కటే సత్యం. ఆ సత్యమే ఈశ్వరుడు. అంతా ఈశ్వరుడే అయితే మనము మాత్రము వేరా? మనలను కూడా ఆ ఈశ్వరునిలోనే కలుపుకొనాలి. అప్పుడు రెండవ వస్తువు లేదు. మన దృష్టి ఎప్పడూ వేర్వేరుగా ఉంటూ ఉన్నది అంతా ఈశ్వరమయంగా చిన్మయంగా చూచుటయే సత్యదృష్టి ఈ అద్వైత దృష్టి అలవరుచుకొన్నవాడు మన కందరకు ఆనందమే కలుగుతుంది.