Site icon Sanchika

అద్వైత భావన – సత్కర్మాచరణ

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘అద్వైత భావన – సత్కర్మాచరణ’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]గవద్గీత, 2వ అధ్యాయం – సాంఖ్య యోగంలో 24వ శ్లోకం ఈ విధంగా వుంది.

~

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః

ఆత్మ యొక్క అమరత్వాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు ఈ శ్లోకం వర్ణిస్తుంది. ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింప శక్యము కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా అన్ని వేళలా ఉండేది, మార్పులేనిది, పరివర్తన లేనిది, మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క ఈ పరిపూర్ణమైన లక్షణాలన్నీ కూడా అది భగవంతుని యొక్క అంశ అని చెప్పకనే చెబుతోంది.

వేదాలు భగవంతుడిని దహించడం, కరిగించడం, ఎండబెట్టడం దహించడం అసాధ్యం అని స్పష్టం చేసాయి. మరియు భగవంతుడు సనాతనుడు అని, శాశ్వతుడు, సర్వవ్యాపి అని మార్పు లేనివానిగా వర్ణించాయి. భగవంతునికి పంచభూతాలతో నిర్మితమైన దేహం లేదు లేదా కంటితో కనిపించేది, అనూహ్యమైనది మరియు దోషరహితమైనది అని కూడా పిలుస్తారు. భగవంతుడు ఆత్మతో విడదీయరాని రూపంలో నివసిస్తున్నాడు కాబట్టి, ఆత్మ నాశనం కూడా చేయలేనిది. జీవాత్మ, పరమాత్మ రెండూ ఒక్కటే. జీవన చక్రం నడిపించడానికి, జీవాత్మ ఈ భువిపైకి వచ్చి ఒక శరీరం ధరించి, ఆ శరీరంతో సంచిత, ప్రారబ్ధ కర్మలను అభుభవించి, తిరిగి తాను వచ్చిన పని పూర్తయ్యాక, ఆ శరీరాన్ని త్యజించి తిరిగి పరమాత్మ సన్నిధికి చేరుకుంటుంది. అదియే జనన మరణ చక్రభ్రమణం. కుమ్మరి మట్టిని మలిచి కుండగా మార్చక ముందు మట్టి మట్టిగానే వుంటుంది. కుమ్మరి మట్టికొక రూపాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని ‘కుండ’ అంటున్నాం. రూపాన్ని ధరించక ముందు అది మట్టి మాత్రమే. కుండ పగిలి ముక్కలైనాక అది ఏ మట్టి నుంచి వచ్చిందో అందులోనే కలిసిపోతుంది. కుండ పగిలిపోతే మిగిలేది రెండు ఆకాశాలు కాదు, ఒక ఆకాశమే. ఇది జీవాత్మ పరమాత్మలకు చెందిన అద్వైత భావన, నిజానికి రెండింటి మధ్య లవలెశమైనా బేధం లేదు, రెండు ఒక్కటే, రెండింటికీ మూలం ప్రకృతే అని ఆది శంకరులు అద్వైత భాష్యం ద్వారా జనన మరణ చక్రభ్రమణం గురించి తెలియజేసారు.

ఆదిశంకరులు ఆత్మ తత్వాన్ని ప్రతిఫలించే కొన్ని ప్రాథమిక ఉపనిషత్ సూత్రాలను ప్రతీ మానవుడు తమ జీవితంలో పాటించాలని బోధించారు.

  1. ‘సర్వం ఖల్వ ఇదం బ్రహ్మ’ – ఈ సృష్టి సర్వం బ్రహ్మమే
  2. ‘అహం బ్రహ్మాస్మి’ – నేను బ్రహ్మను
  3. ‘అయం ఆత్మ బ్రహ్మం’ – ఈ ఆత్మ నిశ్చయంగా బ్రహ్మమే
  4. ‘తత్-త్వం-అసి’ – నేను ఆ పరమాత్మ అంశాన్నే.

మానవుడు బుద్ధిజీవి గనుక పరమాత్మను సేవించి, ఆయన అనుగ్రహానికి పాత్రుడై నిరంతరమూ పరమాత్మ సన్నిధిలోనే ఉండేలా చూసుకోవాలి. పాపకృత్యాల వల్ల మనిషి పరమాత్మకు దూరమవుతాడు. కనుక, సత్కర్మాచరణమే పరమావధిగా జీవించాలి.

Exit mobile version