[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నరహరి రావు బాపురం గారి ‘అద్వైతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మా[/dropcap] నాన్నమ్మకు మేమంటే ఎంతో ప్రేమ.
మాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఆమె రూపం ఒకే విధంగా ఉంది.. తెల్లగా పొట్టిగా చీర తలపైన నుండి చుట్టుకొని ఉండేది.
మా తాతను మేము పిల్లలం ఎవరం చూడలేదు.. మా నాన్న పెళ్ళికి ముందే చనిపోయారు.
కానీ మా తాత నల్లగా ఉండేవారంట.
పెళ్ళప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ నాన్నగారు ఇచ్చిందేమీ లేదు.. ఇంత పెరుగన్నం కట్టించిచ్చారంటంతే!
తొమ్మిదేళ్ళ వయస్సులో కట్టుకున్న పెళ్లి చీర, రెండు జతల బట్టలు తప్పితే ఇంకేమీ లేకుండా మా తాత వెంట వచ్చింది మా నాన్నమ్మ!
పన్నెండేళ్ళ వయస్సులో మొదటి బిడ్డను కనింది. ఆ తర్వాత ఏడుగురు పిల్లలను కనింది. మధ్య మధ్యలో నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారంట!
మా తాత బ్రిటిష్ వాళ్ళ కాటన్ కంపెనీలో పని చేస్తూ ఊరూరా తిరిగేవారు.. ఉత్తర భారతదేశంలో కూడా!
పిల్లలతో పాటు మా నాన్నమ్మ ఒక్కతే బాడుగ ఇండ్లలో ఉంటూ ఉండేది.
మా నాన్నమ్మ అన్న అనంతపురంలో ఉండేవారంట.. ఏదైనా సహాయానికి ఉంటుందని అదే ఊరిలో పిల్లలను పెట్టుకొని వారిని చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది మా నాన్నమ్మ.
మా తాత మా నాన్నమ్మను ఎంతో ప్రేమగా చూసుకొనేవారంట.
మగ పిల్లలు కాలేజీ చదువుకు వచ్చే పాటికి అనంతపురంలోనే సొంత ఇల్లు కట్టించారు మా తాతయ్య.
సెలవులకు వచ్చేవారంట.. అప్పుడే ఒక్కోసారి రెండు మూడు నెలలు ఉండేవారంట.
మా తాతయ్య పిల్లలతో గడపడం అప్పుడే ఎక్కువ!
సంవత్సరం అంతా ఉద్యోగం పని పైనే మహారాష్ట్ర అటువైపే ఎక్కువగా తిరగడం, వచ్చినా రెండు మూడు రోజులకే వెళ్ళిపోయేవారంట.
కొన్ని కొన్ని సంఘటనలు మా అత్తావాళ్ళు.. మా నాన్న కంటే పెద్దవారు.. చెబుతుంటే మేం ఆశ్చర్యంగా వినేవాళ్ళం.
ఒకసారి మా నాన్నమ్మ ఎందుకో అలిగి ‘బావిలో పడి చస్తాను’ అందట.
అంతే! సాయంకాలం నుండి ఆ రాత్రంతా సొంత ఇంట్లో వెనుక వైపు ఉన్న బావి దగ్గరే పొద్దున అయేంతవరకూ కాపలాగా కూర్చున్నారంట మా తాతయ్య.. కోపంతో మా నాన్నమ్మ అన్నంత పనీ చేసేస్తుందన్న భయంతో!
తరచి చూస్తే ఆ భయం వెనుక ఎంత ప్ర్రేమో కదా!?
ఇంకో సారి మంత్రాలయంకు వెళ్ళినప్పుడు తుంగభద్ర నదిలో స్నానం చేసి వస్తున్నారంట.
మిట్టమధ్యాహ్నం అక్కడ బండలు, ఇసుక అంతా కాలిపోతూ ఉంటే నాన్నమ్మ నడచి రావడానికి తడిచిన చీర, పంచలను ఒకదాని తర్వాత మరొకటి పరుస్తూ వచ్చారంట!
పెద్దత్తయ్య ఈ సంఘటన గురించి చెబుతూ అమ్మది అప్పుడు రాజభోగం!.. ‘అహో రాజమాత వేంచుస్తున్నారహో!!’.. అన్నట్లు ఉండిందంట!!
చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా వీళ్ళవైపు చూస్తున్నా అవేవీ పట్టించుకోకుండా తాతయ్య బట్టలను ఒకటి తర్వాత ఒకటి ముందుకు పరుస్తూ వచ్చారంట!
నిజంగా ఎంత ప్రేమ ఉండి ఉండాలి తాతయ్యకు నాన్నమ్మ మీద!?
ఇటువంటి సంఘటనలు ఏవైనా విన్నప్పుడంతా ‘అరే! ఆ ప్రేమైక మూర్తిని చూడలేకపోయామే!?’ అన్న విషయం మమ్మల్ని, ముఖ్యంగా నన్ను బాధ పెట్టేది!
ఎప్పుడూ దేనికీ అరచుకోలేదంటే నాన్నమ్మ తాతయ్యల మధ్యన ఉన్న బాండింగ్ ఎంత ఉత్కృష్టమో కదా!?
నువ్వూ.. నేనూ.. అని పంతాలకు పోకుండా నువ్వే నేను, నేనే నువ్వు అన్న ఏకీకృత భావనను ఎంత చక్కగా తమ తమ జీవితంలో ఆచరించి చూపారో ఆ జంట!
***
తరువాత తరం మా పెదనాన్న, పెద్దమ్మ దంపతులు.
వారిదీ అన్యోన్య దాంపత్యం!
మా పెదనాన్న పెద్దమ్మకు చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు!
పెదనాన్న వెటర్నరీ డాక్టర్‌గా పనిచేసేవారు.. బదిలీల మీద ఊళ్ళన్నీ తిరిగేవారు.
చాలా మటుకు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి సెలవుల్లో వెళ్ళేవాళ్ళం.. చిన్నప్పుడు అంతా!
నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసిన తర్వాత మా చిన పెదనాన్న ఇద్దరు కూతుళ్లు.. అంటే మా అక్కలతో కలసి ఆళ్ళగడ్డ దగ్గర బనవాసికి వెళ్ళడం నాకు బాగా గుర్తు.
అమ్మానాన్నలు లేకుండా మేం ముగ్గురం పిల్లలమే వెళ్ళాం అప్పుడు.
పెద్దమ్మ చేసే వంటకాలన్నీ ఇష్టంగా తినడం.. సాయంత్రాలు సినిమాలకు వెళ్ళడం.. అక్కడ ఉన్నన్ని రోజులూ హాయిగా గడిపేసాం.
పెద్దమ్మ, పెదనాన్నలు ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారు. ఏ విషయంలోనైనా ఇద్దరిదీ ఒకే మాట.. అదే ఆశ్చర్యం అనిపించేది నాకు!
ఇంకో పెదనాన్న సివిల్ సర్జన్. పెద్దమ్మ అప్పట్లోనే బెంగళూరులో మహారాణి కాలేజీలో డిగ్రీ చదివారు.
ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు.
ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతే ఆ ఊర్లకన్నిటికీ ఒకసారన్నా అందరం వెళ్ళి వచ్చేవాళ్ళం.
కడపలో ఉన్నప్పుడు మా పెదనాన్న సెలవులు వచ్చినప్పుడు నన్ను కడపకు పిలుచుకొని వెళ్ళారు.
వారం రోజులు ఉన్నానేమో అక్కడ!
ఇంట్లో పెద్దగా వాతావరణాన్ని గమనించలేదు అప్పుడు.. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాననుకుంటాను. సరిగ్గా గుర్తుకు లేదు.
దగ్గరలో ఉన్న కృష్ణ థియేటర్ కు వెళ్ళాం సినిమాకు.. థియేటర్ పేరు కృష్ణనే అనుకుంటాను, ఇప్పుడు డౌట్ వస్తోంది నాకు.
టెంపుల్స్‌కు వెళ్ళాం. దేవుని కడప, గండి దేవాలయాలు చూసి వచ్చాం. ఆ వయసులో దేవాలయాలను చూడటం ఒక వింత ఆధ్యాత్మిక అనుభవం.
తర్వాత పెదనాన్న చిత్తూరులో ఉన్నప్పుడు అక్కడకు వెళ్ళాను నేను.. మా పెదనాన్నే అనంతపురంకు ఏదో పనిమీద వచ్చినపుడు వెళ్తూ వెళ్తూ నన్నూ పిలుచుకెళ్ళారు.
అక్కడే ఓ పదహైదు రోజులున్నట్లు గుర్తు.
రోజూ పొద్దున్నే పెదనాన్న లేచి బాయిలర్‌లో నీళ్లు పోసి స్నానానికి కాచేవారు. ఫిల్టర్‌లో కాఫీ డికాషన్ వేసి ఉంచేవారు. ఆ తర్వాత పెద్దమ్మ వచ్చి కాఫీ కలిపి ఇచ్చేవారు.
పెదనాన్న, పెద్దమ్మ ఇద్దరూ కాఫీ తాగుతూ హిందూ పేపర్ చదివేవారు. అందులోని వార్తలను గురించి ఇంగ్లీషులోనే మాట్లాడుకునేవారు. నన్నెదుకో ఆ దృశ్యం బాగా ఆకట్టుకుంది.
‘భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని ఉంటే ఎంత అడ్వాంటేజ్ కదా’ అని అనిపించేది.
మా ఇంట్లో కూడా అమ్మా నాన్న చదువుకున్నవారే!
కానీ కాఫీ తాగుతూ ఇంగ్లీష్ పేపర్ చదవడం, వార్తల గురించి మాట్లాడటం అనేది మా ఇంట్లో జరగడానికి అవకాశమే లేదు.
మా ఇంట్లో పేపర్ తెప్పించేవాళ్ళం కాదు.
అదీకాక అమ్మ కాఫీ కలిపి ఇస్తే నాన్న ఆఫీసులో కూర్చుని తాగేవారు.. ఏవో కేస్ ఫైల్స్ అవి చూసుకుంటూ!
మా నాన్న ప్రైవేట్‌గా లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు.
అమ్మా నాన్న కలసి కూర్చుని కాఫీ తాగడం నేను ఇంట్లో చూడనేలేదని చెప్పాలి.
మా పెదనాన్న డాక్టర్‌గా పని చేస్తున్నా ఇంట్లో చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ ఉండటంనాకు బాగనిపించేది.
ప్రేమను ప్రకటించడం అనేది ఆ విధంగా చేయొచ్చని గమనించేవాడిని.
మా పెదనాన్న నల్లగా ఉండేవారు.. మా పెద్దమ్మ తెల్లగా ఉండేది.
‘వీళ్ళకు అచ్చు మా నాన్నమ్మ, తాతయ్య పోలికలున్నాయి రంగు విషయంలో’ అని ఆ వయసులో నేననుకునేవాడిని.
ప్రేమను పొందడానికి కానీ, ప్రేమను పంచడానికి కానీ రంగు రూపాలతో పనిలేదు.. మనసులు కలవాలి, ఇరువురి మధ్యన అండర్‌స్టాండింగ్ ఉండాలన్న విషయం అవగాహనకొచ్చింది నాకు.
పెదనాన్న, పెద్దమ్మలు వ్యక్తులుగా ఇద్దరైనా మానసికంగా ఒక్కరే అని నాకనిపించేది.
ఇక మా అమ్మ నాన్న విషయానికి వస్తే..
నాన్న అక్క కూతురునే పెళ్లి చేసుకున్నారు.
అంటే అమ్మమ్మ నాన్నమ్మ కూతురే!
అందుకే నాన్నమ్మకు మా పైన ఎక్కువ ప్రేమ ఉండేదేమో!?.. ముఖ్యంగా నా పైన ఎక్కువ ప్రేమ చూపించేది నాన్నమ్మ.
నాకలా అనిపించేది.. అదే నిజం అని మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మరింతగా ఖరారయింది.
నాది బి. ఎడ్ అయిన తర్వాత ఒకసారి డి.ఎస్సీ రాసినా రాలేదు.
ఎందుకో నాకు అటువైపు ధ్యాస మళ్ళలేదు. వేరే వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వ్రాసేవాడిని.. జాబ్ కోసం.
ఏవీ రావడం లేదు.. మా కంటే ఎక్కువగా మా నాన్నమ్మ చింతించేది.
‘నీకొక జాబ్ వస్తే చాలు..అది చూసి పోతాను’ అనేది నాన్నమ్మ.
నాకు పోస్టల్‌లో జాబ్ వచ్చి మైసూరులో ట్రైనింగ్ కని వెళ్ళగానే ఇక్కడ నాన్నమ్మ చనిపోయింది.. ఎనభై ఏడేళ్ల వయసులో!
అంటే నా జాబ్ కోసం తన ప్రాణాలను ఉగ్గబెట్టుకొని ఉండిందనిపిస్తుంది.
మా అమ్మ పెళ్ళికి ముందు గుంతకల్‌లో రైల్వే స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేసేది.. అప్పటికే దక్షిణ భారత హిందీ ప్రచార సభ కింద ప్రథమ శ్రేణి హిందీప్రచారక్‌గా పనిచేస్తుండటం వల్ల ఆ స్కూల్లో టీచర్‌గా అవకాశం సులభంగా వచ్చిందనే చెప్పాలి.
అమ్మ అన్ని విషయాల్లో ఏకసంథాగ్రాహి అవడం వల్ల ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. పెళ్ళైన తర్వాత టీచర్ జాబ్ మానేసి ఇంటికే అంకితమయింది మా అమ్మ!
అమ్మా నాన్న ఇంట్లో ప్రేమగా మాట్లాడుకోకపోయినా మేం ఎదిగే కొద్దీ వారి మధ్యనున్న ప్రేమ నాకు అవగతమయ్యేది.
ప్రేమను పనికట్టుకొని ప్రదర్శించవలసిన పని లేదు.. వాళ్ళ వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకుని ఉంటే చాలని అర్థమైంది కూడానూ!
కానీ ఇప్పటి రోజుల్లో తరాలు మారే కొద్దీ ఆ భావన బలంగా ఉన్నా కూడా ప్రేమను మనకిష్టమైన వారి మీద ప్రదర్శించాలి.. అప్పుడప్పుడైనా!
లేదంటే ప్రతి దాన్నీ మసి పూసి మారేడుకాయ చేస్తున్న నేటి పరిస్థితుల్లో చూపించుకోలేని ప్రేమ అసలు ప్రేమే కాదన్న నిజానికి స్థిర పడిపోయింది.
ఇంట్లోనే ప్రేమ యొక్క బహురూపాలను నేను గమనించడం వలన నాకు ప్రేమ పట్ల ఒకవిధమైన ఇష్టం ఏర్పడింది.
మనం ప్రేమగా ఉంటే మన చుట్టూ ప్రేమ నెలకొని ఉంటుందని నమ్మకం ఏర్పడింది నాకు.
పెరిగే కొద్దీ ఆలుమగల మధ్యన ఉండేది.. ఉండవలసినదీ ఒక్క ప్రేమ ఒక్కటే కాదు, అంతకు మించి ఏదో ఉంది అనే నమ్మకం బలపడింది నాలో!
ఇక నా విషయానికి వస్తే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. మా దూరపు బంధువుల అమ్మాయిని!
ప్రేమించినా అది ఇరువైపులా ఇంట్లో చెప్పి అందరి ఒప్పందాలు తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నాను.. శాస్త్రోక్తంగా! అంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట!
తను గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తుంది.
నేను ఇంటి వద్దే ఉంటూ బిజినెస్ చేస్తున్నాను.. అగరబత్తి, పూజాద్రవ్యాల డీలర్ షిప్ తీసుకుని!
ప్రొద్దున తను లేచి హడావుడిగా పనికి.. ప్రస్తుతానికి మా ఊరు నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెలోని పాఠశాలకు.. వెళ్ళాలి.
అందుకే ప్రొద్దున ముప్పాతిక భాగం ఇంట్లో పనులు నేనే చేస్తాను.
భార్యామణిని బస్ స్టాప్‌లో దింపడం.. ఇద్దరు పిల్లలను స్కూల్లో దించి రావడం.. ఆ తర్వాత నా బిజినెస్ చూసుకోవడం. సాయంత్రం తను స్కూల్ నుంచి వచ్చేపాటికి నేను పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చేస్తాను.
పిల్లలిద్దరూ వాళ్ళ హోమ్ వర్క్ లు అవీ చేసుకుంటారు. పాప ఆరవ తరగతి, బాబు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు కాబట్టి వారి పనులు వారు స్వంతంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
ఇద్దరం కలసి సాయంత్రం వంట చేస్తాం. నేను బయటకు వెళ్ళినపుడు మాత్రం తనే చేసేస్తుంది.
శనివారం సాయంత్రం, ఆదివారాలు ఎక్కడికో ఒకచోటుకు వెళ్తుంటాం కాబట్టి బయట తినడమే!
ఇలా తనకు నేనూ.. నాకు తనూ!
తానే నేనూ..నేనే తానూ!!
ఇద్దరం వేరే వేరే కాదు.. ఒక్కరమే!!!
దేహాలు వేరైనా ఆత్మలు ఒకటేనని కవులు రచయితలు వ్రాస్తుంటారు కదా!?
అదీ నిజమై ఉండవచ్చు.. కానీ మా విషయంలో ఇద్దరి శరీరాలు వేరైనా మనసులు ఒకేవిధంగా స్పందిస్తుంటాయని చెప్పవచ్చు.
అలా అని మనస్ఫర్థలూ అవి రానే రావని కాదు!
అవేవి వచ్చినా వాటిని పెరిగి రాద్ధాంతం చేసుకోకుండా మొగ్గలోనే త్రుంచేసుకుంటాం.. ఇద్దరం ఏదో విధంగా కూడబలుక్కొని ప్రయత్నిస్తూ!
అయినా ఆడాళ్ళు సున్నిత మనస్కులంటారు కానీ వారు దృఢచిత్తులని కూడా నేనంటాను.
నాణేనికి రెండు వైపులున్నట్లు వారు దృఢంగా ఉంటారు.. సున్నితంగానూ ఉంటారు.
మగవారే పైకి దృఢంగా ఉన్నట్లు కనిపించినా లోలోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు.. ఏదో విధంగా మానసికంగా ఆడవారిపైనే ఆధారపడి ఉంటారు.
ఇది నేను గమనించి నా వరకూ నేను నిర్ధారణకు వచ్చిన విషయం.. అంతే!
ఇది అందరి పట్లా వర్తిస్తుందని కానీ, అందరికీ ఆమోదయోగ్యమని చెప్పను.. చెప్పలేను. అలా నమ్మడానికి నా కారణాలు నాకున్నాయి.
నాన్నమ్మ తరం నుంచి పెద్దమ్మలు, అమ్మలను గమనిస్తూ వస్తున్నాను కదా!
స్త్రీలు సాధారణంగా పునిస్త్రీలలాగా పోవాలనుకుంటారు కానీ తాము మొదట వెళ్ళిపోతే బలహీన మనస్కులైన మగవారు తాము ఇంట్లో లేకుండా ఏదీ చేయలేరు.. అందుకే పరోక్షంగా దీనికి వ్యతిరేకంగా కోరుకుంటారేమో!?
తాతయ్య మొదట పోయారు.. తర్వాత నాన్నమ్మ!
పెదనాన్నలు ఇద్దరూ మొదట పోయారు.. పెద్దమ్మలు ఉన్నారు.
నాన్న పోయారు.. అమ్మ మాతో పాటు ఇంట్లో ఉంటుంది.
తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు.. మొదట్నుంచీ తమ్ముడి దగ్గరే ఉండటం వలన అమ్మ ఇప్పటికీ అక్కడే ఉంటుంది.
ఇక లోకం వదలి పోవడం గురించి మా దంపతుల వరకైతే మా ఆలోచనలు వేరు!
ఎవరు ముందు పోతారు!?
ఎవరు తర్వాత పోతారన్నది తెలీదు.
తెలియని వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పట్నుంచీ బెంగపడటం అనవసరం అని మేమిద్దరం క్లారిటీగా ఉన్నాం!
ఎవరు ఎప్పుడు పోయినా దాన్ని అలాగే స్వీకరించాలే కానీ బాధ పడుతూ కూర్చోకూడదని ప్రాక్టికల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం.
కానీ పోయేదేదో పిల్లలు చేతికి అందివచ్చి వారు సెటిల్ అయిన తర్వాతనే జరిగితే మంచిదనీ.. సినిమాటిక్‌గా ఇద్దరం ఒకేసారి పోతే ఇంకా మంచిదనీ.. మనసులో ఏ మూలనో చిన్న భావన మెదులుతూనే ఉంటుంది.
నాన్నమ్మ.. తాతయ్య, పెద్ద పెదనాన్న.. పెద పెద్దమ్మ, చిన పెదనాన్న.. చిన పెద్దమ్మ, అమ్మ.. నాన్న, అన్ని జంటలలో ప్రతిఫలించిన ఏకీకృతభావన.. అద్వైతం.
ఇప్పుడు తను.. నేనులో కూడా ప్రతిఫలించాలనీ, మా జీవితాల కడదాకా ప్రతిబింబిస్తూ ఉండాలనే ఆశే నాది!