రెండు లఘు చిత్రాలు “ఆఫ్టర్‌గ్లో”, “బాంబే మిరర్”

1
2

[dropcap]ఒ[/dropcap]క మనిషికి ప్రాణాంతకమైన వ్యాధి (terminal illness) వస్తే, అతని పరిస్థితీ, అతన్ని చూసుకునే భార్య పరిస్థితులు ఎలా వుంటాయి? అనుకున్నట్టుగానే అతని మరణం తర్వాత ఆ సంఘటనకు ఆమె స్పందించిన తీరూ, సమాజం స్పందించే తీరూ ఎలా వుంటాయి? జీవితమూ, మృత్యువూ రెండింటినీ ఎలా స్వీకరించాలి అన్నది మన చేతుల్లోనే వుంటుంది. ఇలాంటి అతి సామాన్యంగా కనబడే, కాని లోతైన తాత్త్వికత కలిగిన అంశాన్ని చాలా చక్కగా పట్టుకున్నది ఈ లఘు చిత్రం “ఆఫ్టర్‌గ్లో”.

సొహ్రాబ్ అర్ధేషిర్ (నటుల పేర్లే, పాత్రల పేర్లు కావు) కి అనారోగ్యం. అతని భార్య అనాహిత ఉబెరాయ్ అన్నట్టు అతని కిడ్నీ పాత BEST bus ఇంజన్ లా మారిపోయింది. తిరిగి బాగుపడే అవకాశం లేదు. హాస్పిటల్లో నర్సులు అతనికి స్పంజ్ బాత్ ఇవ్వడానికి వస్తే రచ్చ చేస్తాడు, చిన్న పిల్లాడిలా. అతని వీపుకు ఉన్న బెడ్ సోర్స్ ని టర్కీ టవల్ తో సున్నితంగా తుడవాల్సింది పోయి మీరు గిన్నెలు తోమినట్లు పరపరా తుడుస్తున్నారు, తప్పుకొండి అంటూ అనాహిత తనే చేస్తుంది. ఇంటికి వచ్చాక కూడా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అవసరమైనప్పుడు కోప్పడుతుంది. అతను దేనికీ కోపం తెచ్చుకోడు, పైగా తన దగ్గర వున్న వాక్మన్ లో అవన్నీ రికార్డ్ చేస్తాడు. గడ్డీ గాదం రుచించట్లేదని కూరలూ, మందులూ బెడ్ పేన్ లో పడేస్తాడు. అతన్ని వొక పక్క కోప్పడుతూనే నాన్ వెజ్ చేసి పెడుతుంది. తనకు నచ్చిన సంగీతం (వెస్టర్న్ వెర్డి లాంటివి) వింటూ, భార్యతో సరదాగా వుంటూ గడుపుతాడు. అతని మరణం గురించీ, మరణానంతరం చూడటానికి వచ్చే జనాల మాటల గురించీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. ధృవం అయిన విషయాన్ని వాళ్ళు ఎంత గ్రేస్ఫుల్ గా స్వీకరించారో చెప్పలేను. అనుకున్నట్టుగానే అతని మరణం తర్వాత ఆమె పేపర్ లో “నివాళులు అర్పించే కార్యక్రమం” (condolence meet) లేదని వేయిస్తుంది. అయినా దగ్గరివాళ్ళు కొంతమంది వస్తారు. ఒక పెద్దావిడ వచ్చి తన సొంత గోల చెప్పుకుంటుంది, తన భర్త పోయినప్పుడు ఎంతో మంది వచ్చారని, కుర్చీలు కూడా పక్కింట్లోంచి అరువు తీసుకోవాల్సి వచ్చిందనీ వగైరా. బెడ్రూం లో దీపం చూసి ఇది నాలుగు రోజుల ప్రార్థనల అనంతరం ఆర్పేయాలనీ, లేదంటే ఆ ఆత్మ అక్కడక్కడే తచ్చాడుతూ నరకం అనుభవిస్తుందనీ చెబుతుంది. అనాహిత వినదు. అక్కడ కనిపించిన పెళ్ళి తలపాగా (పాగరి) చూసి ఇలాంటివి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గనుక, దీన్ని దాచెయ్యి లేదంటే ఫలానా వాళ్ళింట వాళ్ళబ్బాయి పెళ్ళి వుంది దగ్గరలో, చూస్తే అడుగుతారు అంటుంది. ఆమె వెళ్ళిపోయాక అనాహిత వాళ్ళకు ఫోన్ చేసి తన దగ్గరున్న తలపాగా ను ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు అంటుంది. ఆ తర్వాత వచ్చిన ఒకావిడ లొడ లొడా తన సుత్తే కొడుతుంది. కూడా చదువుకునే కొడుకును తెచ్చింది, మర్యాద కాకపోయినా. ఇంట్లో వదిలితే ఎలాంటి ప్రమాదాలు వుంటాయో అంటూ కొన్ని జరిగిన కథలు చెబుతుంది. తర్వాత సొహ్రాబ్ గురించి అడుగుతుంది. వేరే డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? ఈ రోజుల్లో డాక్టర్లు చేయలేనిది లేదు. చైనా లో ఒకతను ఆవేశంలో తన పురుషాంగాన్ని కోసి పారేసినా, అతనికి వో కృత్రిమ పురుషాంగం చేసి అతికించారు అంటుంది. ఇలాంటి సొల్లు చాలా, నివాళులు అర్పించి సాంత్వన అందించడానికి వచ్చినావిడ చెబుతుంది. అప్పుడే ఆ యువకుడు తలపాగా తీసుకోవడానికి వస్తాడు. ఈ ఇద్దరు స్త్రీల నిరసనను పక్కన పెట్టి తలపాగా తీసి ఇస్తుంది అనాహిత. మిమ్మల్ని నా పెళ్ళికి పిలవ్వొచ్చా అని జంకుతూ అడుగుతాడు అతను. భర్తను పోగొట్టుకుని నాలుగు రోజులే అయ్యాయి కాబట్టి. తప్పకుండా వస్తానంటుంది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దీపంలో నూనె అడుక్కి వచ్చింది. కొంత అసమంజసం తర్వాత దాంట్లో పొయడానికని ఎత్తిన నూనె గ్లాసును పక్కన పెట్టేస్తుంది అనాహిత.

ఇది రొహింటన్ మిస్త్రి వ్రాసిన condolence meet అనే కథ ఆధారంగా తీసిన చిత్రం. కౌశల్ ఓఝా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చాలా బాగున్నాయి. ప్రశాంత్ పరబ్ ఆర్ట్ డిరెక్షన్ మెచ్చుకోవాలి. closed spaces లో అయినా ఆ పార్సీ వాతావరణాన్ని, సరైన ప్రాప్స్ తో బాగా సృష్టించాడు. మనీష్ మాధవన్ చాయాగ్రహణం కూడా బాగుంది. జొహేన్స్ హెల్స్బెర్గ్ సంగీతం, మధ్య మధ్యలో వచ్చే జుసెఫ్పే వెర్డి, షూబర్ట్, యోహాన్ పకల్బెల్ ల సంగీతం సినెమా కి వొక మంచి బలాన్నిస్తుంది. సొహ్రాబ్ కి నచ్చిన సంగీతం అది. FTII నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది. తప్పక చూడండి.

మనం వాట్సాప్ కాలంలో వున్నాము. నిజం వార్తలూ, కట్టుకథలూ చాలా తొందరగా వ్యాప్తి చెందుతున్నాయి, అడవిలో మంటలకన్నా వేగంగా. అంతే వేగంగా మనుషుల మనోభావాలని ప్రభావితం చేస్తున్నాయి, ఆవేశాలను రెచ్చగొడుతున్నాయి. స్నేహాలను శత్రుత్వాలుగా మార్చడానికి ఎంతో సమయం పట్టడం లేదు. ఇస్లామోఫోబియా సహస్ర ఫణి గా తాండవిస్తున్న ఈ రోజుల్లో ఈ చిత్రం చాలా రెలవంట్. ఇంతా చేసి ఈ చిత్రం నిడివి 3 నిముషాలు. బాంబే మిరర్ అనేది వొక వార్తా పత్రిక. వొక సలూన్ లో షకీల్ (రాజ్ కుమార్ రావు) గడ్డం గీయించుకోవడానికి వస్తాడు. తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వుంది. రమేష్ (వినోద్ రావత్) గడ్డానికి ఉపక్రమిస్తూ మాటల్లో పడతాడు. వాళ్ళ మాటల వల్ల ఇద్దరి మధ్యా చనువు వుందనీ, స్నేహం లాంటిది వుందనీ, పరస్పర కుటుంబాల మధ్య కూడా పరిచయాలున్నాయనీ తెలుస్తుంది. ఏదో వీడియో చూపించమంటాడు రమేష్, టైం లేదంటాడు షకీల్. క్రితం రాత్రి సలీం ని పోలీసులు పట్టుకుని అతని చేత శిక్షగా గుంజీళ్ళు తీయించారని నవ్వుతూ చెబుతాడు. ఇంతలో బయట ఎవరో వచ్చి బయటకు రావద్దు అని చెప్పి వెళ్ళి పోతాడు. ఆ వెంటనే వో హిందూ కుర్రాడిని ముగ్గురు ముస్లిం మగవాళ్ళు వెంటపడి మా వాళ్ళ అమ్మాయి మీద కన్నేస్తావా అని తిడుతూ కత్తి తీసి పొడిచి చంపేస్తారు. ఇది రమేశ్, షకీల్ ఇద్దరూ చూస్తారు. గడ్డానికి షేవింగ్ క్రీం వున్న రాజ్ కుమార్ కళ్ళల్లో వొక నీటి చుక్క, కణతల నుంచి జారుతున్న చెమట చుక్కలు. రమేశ్ ముఖంలో కోపం కనిపిస్తుంది. అతని రేజర్ రాజ్ కుమార్ గొంతు దగ్గరే వుంది. క్షణంలో అది అతని మెడను కోసేస్తుంది. బయట కేకలు. డైరెక్టర్ కట్ అన్నాడు. ఆ పడ్డ కుర్రాడు లేస్తాడు. అది వొక సినెమా షూటింగ్ అని అర్థమవుతుంది. కానీ ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భయం కమ్మగా రమేశ్ షట్టర్ ను లోపలినుంచి దించేస్తాడు. ఇదంతా మూడు నిముషాల్లోనే. శ్లోక్ శర్మ దర్శకత్వం బాగుంది. రాజ్ కుమార్, వినోద్ రావత్ ల నటన కూడా. ఇది కూడా చూడాల్సిన చిత్రమే. రెండూ యూట్యూబ్ లో వున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here