[dropcap]శ[/dropcap]బ్దం నిశ్శబ్దాల మధ్యనున్న
సన్నటి దారమే జీవితం.
ఉమ్మనీటిని విదుల్చుకొని కెవ్వు మన్నావానాడు.
కర్మ బంధాల్ని విదుల్చుకొని
ఆఖరి శ్వాస విడుస్తావీ నాడు.
ఈ మధ్య కాలంలోనే అనుబంధాల చట్రంలో
ఇరుక్కొని ఆత్మీయ లతలు పెనవేసుకుంటుంటే
ఒక బలీయమైన నిట్టూర్పుతో
ఎటు పోతున్నామో తెలియని అగమ్య గమనంలో
జీవిత నౌకను నడిపిస్తావు.
ప్రస్థాన గోచరం గాని స్థితిలో తిరుగాడుతూ
చీకటి వెలుగుల దోబూచులాట ఊబిలో
తేజో విహీన నిస్తేజ రూపాన్ని అద్దుకొని
అర్థంలేని వెంపర్లాటల వెంటబడి
పడుతూ లేస్తూ చీకటి ప్రయాణాన్ని చేస్తుంటావు.
ఓ మనిషీ….!
ఏ పరమార్ధం కోసమీ ప్రస్థానం..?
ఏ వెలుగుల కోసం ఈ ఆరాటం…?
ఖర్చయిన జీవితమెంతో లెక్కలేసి, హెచ్చ వేసి
తీసివేతలతో కూడుకొని చూడు..