వినోదాత్మకం : ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

3
2

[box type=’note’ fontsize=’16’] “గొప్ప సినెమాలు అప్పుడప్పుడే వచ్చినా, ఇలాంటి వినోదాత్మక చిత్రాలు తరచుగా రావాలని భావిస్తాను” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]అ[/dropcap]య్‌బాబోయ్ వరసపెట్టి మూడు తెలుగు సినెమాలు చూసేశానేంటి, అని వొక సారి నన్ను నేను గిల్లుకున్నా. అయ్‌బాబోయ్ ఇందులో యాట్టరందరూ తెలుగు బాగా మాట్టాడేస్తున్నారేటీ అని రెండోసారి. రెండు సార్లూ నెప్పెట్టింది.

గొప్ప సినెమాలు అప్పుడప్పుడే వచ్చినా, ఇలాంటి వినోదాత్మక చిత్రాలు తరచుగా రావాలని భావిస్తాను. అప్పట్లో, అంటే కృష్ణ తదితరుల రోజులలో గూఢచారి చిత్రాలు బాగా వచ్చేవి. అందులో మంచి పాటలు కూడా వుండేవి. బాగా ఆడేవీనూ. తర్వాత పెద్ద వ్యవధి తర్వాత మళ్ళీ ఆ జానర్ చిత్రాలు వస్తున్నాయి. ఈ మధ్యే వచ్చిన అడివి శేష్ చిత్రం “గూఢచారి” వొక ఉదాహరణ.

సినెమాల గురించిన కనీసావగాహన కూడా లేకుండా పెద్ద డిటెక్టివె అయిపోవచ్చు అనే కలలు కూడా తప్పని నమ్మే ఏజంటుగా పిలువబడే సాయి స్రీనివాస ఆత్రేయ (పొలిశెట్టి నవీన్) కి గురువులు షెర్లాక్ హోంస్ తదితరులు. అతని పాఠ్య గ్రంథాలూ, చిత్రాలూ అలాంటివే. తన దగ్గర శిష్యురాలిగా చేరిన శిష్యురాలికి (స్నేహ గా శృతి శర్మ) కూడా అవే పాఠాలను సిలబస్ గా ఇస్తాడు. మొదటి నుంచే అర్థమైపోతుంది ఇది చిరంజీవి చంటబ్బాయి లాంటి కామెడీ మిళిత గూఢచర్యం అని. సస్పెండర్లు వున్న పంట్లాము, నెత్తిన టోపీ, చేతిలో కాఫీ కప్పు, మొబైల్ లో జేంస్ బాండ్ 007 థీమ్ మ్యూజిక్ రింగ్ టోను వగైరాలు వేసి గమ్మత్తైన వేషం కడతాడు ఏజంటు. దానికి తోడు అతని నియమ నిష్ఠలు కూడా : కారులో వున్నంత సేపూ పని గురించి మాట్లాడకూడదు, కాలక్షేపం కబుర్లు తప్ప; కారు దిగాక కాలక్షేపం కబుర్లు చెప్ప కూడదు పని గురించి తప్ప. ఇలాంటివెన్నో. అతను ఒక్కొక్కటే ఆమెకు నేర్పుతూ వుంటే మనకి మాత్రం మంచి కాలక్షేపం. FBI అని బోర్డు పెట్టుకున్నా (అతని మొదటి ప్రేమ ఫాతిమా గుర్తుగా ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అతని గతి చెట్టు కింద ప్లీడర్ గతే. వో గట్టి కేసు కోసం నిరీక్షణ.

ఒకటీ అరా చిల్లర కేసుల అనంతరం ఏజంటుకు వున్న జర్నలిస్టు మిత్రుడు వో విషయం చేరవేస్తాడు. అది యేమిటంటే ఈ మధ్య రైల్వే ట్రాకుల దగ్గర గుర్తులు తెలియని (unidentified) శవాలు చాలా దొరుకుతున్నాయి అని. అలాంటి వో శవాన్ని చూడటానికి వెళ్తే తననే అనుమానితుడుగా అరెస్టు చేస్తారు. అక్కడి నుంచి కథ చాలా మలుపులు తిరిగి అసలు ఆ శవాల పంచాయితీ యేమిటో మన ముందు పెడుతుంది కథ. ఇది చూడవలసిన చిత్రం, చదవవలసింది కాదు కాబట్టి కథ ఇంతవరకే.

సినెమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నవీన్ పొలిశెట్టి గురించి. చాలా మంచి నటన. అంతే మంచి ఉచ్చారణ. కాసేపు నెల్లూరు యాసలో, కాసేపు సూపర్ బజార్ వగైరా ప్రాంతాలలో మనకు తారసపడే పుస్తకాలవీ అమ్మే కుర్రాళ్ళ లా బాగా పలికాడు. అయితే వొకటే అతను ముందు ముందు గుర్తు పెట్టుకోవలసింది. సంభాషణ అనేది గుసగుస నుంచి అరుపు దాకా యెన్నో షేడ్స్ ( పోనీ ధ్వనులు అందాం) లో వుంటుంది. భోజనం చేశావా అన్న వాక్యమే వంద రకాలుగా అన్నప్పుడు ప్రతిసారీ గొంతు నుంచి అది వేర్వేరు volumesలో వెలువడుతుంది. ఇంత చక్కగా సంభాషణలు చెప్పగలిగినవాడు ఇది ఠక్కున అర్థం చేసుకోగలడు. రెండో మనిషి దర్శకుడు స్వరూప్. చక్కగా రెండున్నర గంటల పాటు కుర్చీకి కట్టేసి మరీ కథ చెప్పాడు, యెక్కడా విసుగనిపించకుండా. ఇద్దరూ ఈ చిత్రంతో తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. రెండూ గుర్తు పెట్టుకోతగ్గ పేర్లే.

మార్క్ రాబిన్ సంగీతం గూఢచారి చిత్రానికి తగ్గట్టుగా వుంది. ఇంగ్లీష్ (బహుశా బాండ్) సినెమా పాట లాంటి పాటొకటి వుంది. చాలా బాగుంది అది. సన్ని కూరపాటి చాయాగ్రహణం కూడా బాగుంది. ఇంకో విషయం యేమిటంటే నాకు చాలా మంది పాత్రధారుల పేర్లు తెలీదు, కాని వాళ్ళందరి నటనా బాగుంది. యెక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక కథా స్థలం నెల్లూరు కాబట్టి యాస మొత్తం నెల్లూరు యాసలో వుండాలి కదా లాంటి ప్రశ్నలొద్దు. కర్నాటకా నుంచి వచ్చిన బుల్లి ఏజెంటు కన్నడ యాసలో తెలుగు మాట్లాడాలి కదా లాంటి సందేహాలు వద్దు. వొక మంచి చిత్రం చూసి సంతోషించామా లేదా అని చూడాలి. నేనైతే ఈ చిత్రం స్థాయి తెలుగు చిత్రానికి కనీస స్థాయిగా వుండాలని కోరుకుంటాను. స్వరూప్ ఇంకా మంచి చిత్రాలతో మన ముందుకొస్తాడని వొక నమ్మకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here