[జీవితంలో మనసు పోషించే అజ్ఞాత పాత్రని వర్ణిస్తూ శ్రీ చందలూరి నారాయణ రావు అందిస్తున్న కవితా సీరిస్. ఇది మొదటి భాగం.]
[dropcap]అ[/dropcap]ద్భుతమైన నటన మనసుది
***
1.
ఇష్టాన్ని గర్భం దాల్చిన మనసు
అమెను నొప్పులు పడుతుంది.
రెండు వాక్యాలతో
ఒక కవితకు జన్మనివ్వాలని..
2.
మాటమాటకు పొంగే ఊహ
మనసు అంచుపై
ఉరుకు తీసే
అందమైన అనుభవమే ప్రేమ.
3.
మనసులోనికోచ్చినప్పుడల్లా
ఖర్చుయ్యే కాలం
జ్ఞాపకాల తేనెపట్టు..
ఊహాల్లో తరుగులేని బంగారమే..
4.
ఎన్ని పగళ్లను అప్పడిగి
రాత్రుళ్ళు కలల పంటను వేయను?
నిద్ర కరువై కళ్ళలో
కన్నీటిని తీయగా తొడను?
5.
కవితల చెట్టుపై
వాలినదే ఏమి తోచదు..
ఆలోచన నిశబ్దముతో గలగలలాడనిదే
మెలుకువ రాదు..
6.
పాతపడినా
పాతుకుపోయి ఇష్టం
ముడిపడిన ఊహాలతో
దాగుంటుంది కంటికందాలని
7.
జవాబు లేని ప్రశ్నకు
జ్ఞాపకాలు కొట్టుకుపోతాయా?
మబ్బులుగా అభిమానం ముసిరి
మనసును నిండకపోతుందా?
8.
తీపి బాధ.. చేదు నిజం
అనే రెండు పాత్రల బతుకు నాటకంలో
అజ్ఞాత పాత్రలా
అద్భుతమైన నటన మనసుది
9.
మాటలొద్దు
మనసు మెలిగితే చాలు..
కనపడొద్దు
నిజం మెదిలితే చాలు..
10.
పెదవి చాటున
మౌనం తొంగిచూస్తోంది.
రాత్రి కొంగున దాచిన
తీపిని పెదవికద్దాలని
11.
నిద్ర లేమితో
చిత్తడైన మనసుతో నలిగే పక్కకు
యిప్పుడు తెలిసింది
ఆమె ఎంత లోతో..
12.
వాటేసుకున్నా
కళ్ళు తెరిచి నిద్రపోతాడు
అలిగిన ప్రేయసి
పాదాల వద్ద మెలుకువతో
13.
తొలి రేయికి ఎంత ఇష్టమో
మారాం చేస్తుంది
ఇద్దరూ కలిసి
తనను ముద్దాడాలని
(మళ్ళీ కలుద్దాం)