[జీవితంలో మనసు పోషించే అజ్ఞాత పాత్రని వర్ణిస్తూ శ్రీ చందలూరి నారాయణ రావు అందిస్తున్న కవితా సీరిస్. ఇది రెండవ భాగం.]
14.
తుళ్ళిపడ్డప్పుడు
నీవు నాలో తూలి లేపడం చూసి
మల్లెలు విరగబడి నవ్వడం
జీవితమంతా తలచుకునే సిగ్గు.
15.
మనసుకు వయసు కాపలా..
అందానికి ప్రేమ పహారా..
జీతంలేని ఉద్యోగాలకి
ప్రేమానురాగాలే జీతభత్యాలు
16.
మనలో మెలగని రోజును
పూలతో ముడిచి కొప్పులో దాచినా
కొంటె ముసురులో ఒరిగి,
ఒదిగేది నా ఎదనేగా
17.
నా నుదురటద్దంగా
చూసి చెప్పవా?
నీ ముఖారవిందంలో
నేనెక్కడో పోల్చుకుంటాను
18.
పడగ్గదిలో ప్రేమలేఖ
చెవులు రిక్కరించి వింటుంది..
పెళ్లి తరువాత ప్రేమను
చెప్పుకుంటున్నారో.. లేదోనని
19.
పెళ్లిచూపులో
అందం దొంగతనానికి
మొదటి రాత్రే జీవిత ఖాదీగా
కౌగిలే కారాగార శిక్ష.
20.
చీర ఎంత ఖరీదైనా
ఏకాంతమందు
స్వచ్ఛందంగా విలువకి పక్కనెట్టి
చేతులు కట్టుకుంది
21.
ఎన్నేళ్లయినా కోరికలు మొగ్గలే.
మరోమారు మధుపర్కాలను
దంపతులుగా పంచుకుంటే
విచ్చుకోవాలని ఉబలాటం.
22.
మనసు రహస్యఅల్లికలో
కన్నీటి కేరింతపు
అనివార్యమైన వింతలతో
కాలం ముంగిట
మనిషి ఓ చిక్కుముడి
23.
సమానంగా ప్రేమను
తూచి ఇవ్వగల మనసొకటి ఉంటే
రాత్రికి లోకువ కాము
పగటికి చులకనుండదు.
24.
ద్రావకంలో
కన్ను కలమై
కలకు వ్రాసే లేఖే
ప్రేమాంకురం.
25.
అక్కడ నీవు.. ఎక్కడో నేను
ఇరుకులోనూ ఇష్టానికి క్షణం చాలు
నీ హృదయం ముందు భూమి చిన్నదే
నీ కంటి లోతుకు సముద్రం కురచే.