Site icon Sanchika

అగ్ని సాక్షిగా..

[dropcap]“బే[/dropcap]టా! జావేద్! నువ్వింకొన్నాళ్ళు అక్కడే ఉంటే మంచిది. మళ్ళీ మేం చెప్పినప్పుడు బయలుదేరి వచ్చెయ్. సరేనా?! “

ఈ మాటలు చెప్తోంది అబ్బా జానేనా అని సందేహం కలిగింది జావేద్‌కి.

“అమ్మీ జాన్ బానే ఉందా అబ్బా? మీరు బాగానే ఉన్నారా?” ఆందోళనగా అడిగాడు జావేద్.

మరో రెండు వారాల్లో తన పుట్టిన రోజు పెట్టుకుని తనని దుబాయ్ లోనే ఇంకొన్నాళ్ళు ఉండమని నాన్న ఎందుకు చెపుతున్నాడో అర్థం కాలేదు జావేద్‌కి.

“అంతా బాగానే ఉన్నాం బేటా..”అన్న మాటల్లోనే తెలుస్తోంది తొట్రుపాటు.

“అమ్మీ, చోటీమా అందరూ బాగానే ఉన్నాం. నువ్వేం కంగారు పడకు. నీకు విషయం వచ్చాక చెపుతాను. ఛోటా బాబాకు చెప్పి నీకు ఇంకొన్ని డ్రెస్సులు, డబ్బులు తీసివ్వమని చెప్తాను. మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాను” అని ఠక్కున ఫోన్ పెట్టేసాడు సలీం.

విషయం పూర్తిగా అర్థం కాకపోయినా పరిస్థితి ఏదో ఆందోళనకరంగానే ఉందని అర్థమవుతోంది జావేద్‌కి. తానేం చిన్న పిల్లాడేం కాదు. బాబాయ్‌తో కలిసి దుబాయ్‌కి వచ్చినా తిరిగి ఒక్కడే తన సిటీకి వెళ్లేంత హుషారైన కుర్రాడు. మరో రెండు వారాల్లో తన పుట్టిన రోజు. తనకు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బైక్‌ను పుట్టిన రోజు బహుమతిగా కొనిస్తానని తన బాబాయ్, అబ్బా జాన్‌ని ఒప్పించి తీసుకొచ్చాడు దుబాయ్‌కి.

ఇంకో రెండు రోజుల్లో బైక్‌ని ఇండియాకి బుక్ చేసి బయల్దేరాల్సిన తాను ఇలా ఉండి పోవాల్సొస్తుందని అనుకోలేదు. ఉవ్వెత్తున ఎగసిన మంటల్లాంటి ఉత్సాహాన్ని ఇలా చల్లారుస్తారని అస్సలు ఊహించ లేదు జావేద్.

***

“అమ్మాయి పెళ్లి కోసం దాచినం కదా సత్యా. అది తీసేద్దాం లే. డబ్బు లియ్యక పొతే షాపు ఖాళీ చెయ్య మంటుండు ఓనరు. లేకపొతే మనం ఇప్పటికిప్పుడు షాపు ఎలా వెతుక్కుంటం. ఒక వేళ ఇంకో షాపు దొరికినా సెటప్పుకే అయితది లచ్చ పైన. దాని బదులు చైను అమ్మితే ఒకటికి తక్కువ రాదు. అర్వైఅయిదు పోయినా మిగిలింది పిలగాడి కాలేజీ ఫీజులకి పోను బియ్యం బస్తా కూడా తేవచ్చుఁ.”

మల్లేశం మాటలకి సత్యమ్మకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కూతురు పెళ్లి దాదాపు ఖరారైనట్లేనని సంబరపడి రెండు రోజులైనా కాలేదు. ఇంతలోనే మొగుడు ఇలా పిడుగు లాంటి వార్త చెప్తాడని కల్లో కూడా అనుకోలేదు సత్యమ్మ.

“నేనొచ్చి మీ ఓనర్‌తో అడుక్కుంటా లెయ్యా! పిల్ల పెళ్లి కానిచ్చి డబ్బులిస్తాం అని.” సత్యమ్మ బతిమాలుతోంది మల్లేశాన్ని. ఆమె గుండె మంటలు చల్లార్చేదెవరు?

***

“మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేసిన్రు.. సారూ. రేపట్లోపల చలాను కట్టకుంటే బుల్డోజరు పంపిస్తామంటున్నరు. గ మల్లేశం తప్ప అందరూ ఓకే అన్నారు. సాయంత్రానికి మూడు లచ్చ్చలూ రెడీ అయితది. ఆడొక్కడూ ఇస్తే పొద్దున్నే ఎల్లి చలాను గట్టేస్తే ఒక పని అయిపోతది. జర గట్టిగ జెప్పరాదే మల్లేశానికి. మొత్తం అమౌంట్ సమర్పించుకోనిదే చలాను కట్టించుకోరు సారూ”.. వీరూ యాదవ్ చెప్తున్నాడు గంగిరెడ్డికి.

వింటున్నాడో లేదో తెలీదు యజమాని గంగిరెడ్డి. వీరూ యాదవ్ మాత్రం చెప్తూ ఉన్నాడు. వీరూ యాదవ్, గంగిరెడ్డికి కృష్ణ దేవరాయలికి మహామంత్రి తిమ్మరుసు అంత. ఏం చెయ్యాలన్నా వీరు యాదవ్ సలహా తీసుకోనిదే అడుగు ముందుకు వెయ్యడు.

అతడిచ్చిందే ఈ ఐడియా.

గంగిరెడ్డి ఒక వీధి రౌడీ స్థాయి నుండి కార్పొరేటర్ టిక్కెట్‌కి పోటీ పడే అంత ఎదిగిన యజమాని. అతని అనుచరుడు వీరు యాదవ్. సిటీలో చాలానే ఇళ్లున్నాయి. బాడుగలే నెలకు పది లక్షల పైన వస్తాయ్. ఇక మామూళ్ల సంగతి సరేసరి.

అంబర్‌పేటలో ఆరంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. బాగా పాతదే అయినా సెంటిమెంటు కొద్దీ అమ్మకుండా అట్టే పెట్టుకున్నాడు.

గత వారమే నోటీసు వచ్చింది. అనుమతికి మించి కట్టిన ఆరో అంతస్తుకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేదని. నెల రోజుల్లోగా అది తెచ్చుకోకపోతే ఆరో అంతస్తుని కూల్చేస్తామని కార్పొరేషన్ వాళ్ళ నోటీసు. అంత వరకూ అయితే పర్లేదు. దాన్ని కూలగొట్టడానికి బుల్డోజర్ రావాలన్నా ఇసుమంత జాగా లేదు. అనుమతికి, అలాగే రెగ్యులరైజేషన్‌కే లక్షల్లో అవుతోంది. ఇల్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే వీరూ యాదవ్ ఆపద్బాంధవుడిలా వస్తాడు.

“సారూ, బిల్డింగ్‌లో ఉన్నోల్లందరూ పదేళ్లకు పైనే ఉంటున్నరు. ఒక్కొక్కరు లచ్చ ఇఛ్చినా మన పని అయిపోతది సారూ. అంత గనంగ అయితే పైనోళ్ళకి కొంచం డిస్కౌంట్ ఇద్దాం. ఇది మన సెంటిమెంటల్ బిల్డింగ్ సారూ. పైగా ఇది మన ప్రెస్టీజు ఇష్యూ. అంబర్‌పేట లోనే కాదు సిటీలో మనలాంటోళ్ళ అందరికి నోటీసు లొచ్చినయ్. నిప్పు లేందే పొగ రాదంటరు గానీ.. గా సలీం బిల్డింగ్‌లో షురూ ఐన పొగ… నిప్పులా మనందరి కింది కొచ్చింది సారూ. జర సోచాయించుండ్రి.”

అంతే.. పాదరసం లాంటి బుర్ర లోంచి వచ్చిన ఐడియాకి గంగిరెడ్డి లాంటి కరుకైన గుండె తోడైతే పుట్టేది కార్చిచ్చు కాక మరేంటి..?

***

ఆ రోజుకి ఆరో రోజు. మంటలు అప్పుడప్పుడే అదుపులోకి వచ్చి.. అట్లు వెయ్యడానికి రెడీగా ఉన్న పెనంలా చుర చుర కాలి పోతున్నాయి మదీనా స్పోర్ట్స్ వేర్ కాంప్లెక్స్ లోని ఆరంతస్తులూ. ఆర్రోజులుగా రావణ కాష్టంలా మండి బూడిద కుప్పలతో స్మశానాన్ని తలపిస్తోందా భవనం. క్లూస్ టీం వచ్చి అగ్ని ప్రమాదం ఎలా మొదలైందో అంచనా వెయ్యడంలో తలమునక లయింది. ప్రభుత్వ అధికారులు నష్టాన్ని అంచనా వెయ్యడానికి నానా పాట్లూ పడుతున్నారు. నాలుగు రోజులుగా మంటలార్పడానికి అహోరాత్రాలూ ఇరవైకి పైగా ఫైరింజన్లతో కష్టపడ్డ అగ్నిమాపక సిబ్బంది అయితే ఊపిరి పీల్చుకున్నారు. కానీ చుట్టూ నివసిస్తోన్న జనాలు మాత్రం పీల్చుకుందామన్నా ఊపిరాడనంత నున్నటి మసి ముక్కుల్ని అదర గొడుతోంది. ఆ భవనం పక్కనే ఆ భవనాన్ని కాపలా కాస్తూ ఉండడానికి వాచ్‌మన్ నాలుగు తడికలతో కట్టుకున్న పూరిల్లు, మంట లార్పడానికి కుమ్మరించిన నీళ్లతో తడిసి కూలిపోయింది.

భవనంలో నైట్ డ్యూటీ చేసే ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు.

నీరయినా, నిప్పయినా హద్దులు దాటితే తన తోటి పంచభూతం.. నేల.. అన్నీ తనలో కలిపేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.. కానీ నీలో కలిపేసుకునేది ప్రపంచం మాత్రమే.. ..ప్రాణం మా దగ్గరికి రావాల్సిందే అని గాలి, ఆకాశం కూడబలుక్కుని చెప్పినట్లు.. ఉంది ఆ ప్రాంతమంతా..

***

సలీం, అతని ఇద్దరు భార్యలతో అజ్ఞాతం లోకి వెళ్లి పోయాడు. జావేద్ పుట్టిన రోజు రానే వచ్చింది. అమ్మా, నాన్న లేకుండానే దుబాయ్ లోనే బాబాయ్ వాళ్ళతో పుట్టిన రోజు జరుపుకున్నాడు. కానీ తనకిష్టం లేని స్పోర్ట్స్ బైక్‌ని నిందిస్తూ..

సత్యమ్మ, మల్లేశం తమ కూతురికి తమ స్తోమతకి తగిన ఇంకో సంబంధం చూసి పసుపు తాడుతో తాళి కట్టించి పెళ్లి చేశారు.

ఆర్నెల్లు తిరక్కుండానే, గంగిరెడ్డి భవనంతో సహా ఆరంతస్తుల భవనాలన్నీ సక్రమ నిర్మాణాలని సర్టిఫికెట్‌లు సంపాదించు కున్నాయి.

బూడిదయిన ఆరంతస్తుల మదీనా కాంప్లెక్స్ భవనం స్థానంలో మరో ఏడంతస్తుల మేడకి అంకురార్పణ జరిగింది. అది సక్రమమే అని అగ్ని సాక్షిగా మళ్ళీ ఎప్పుడో నిరూపించ బడుతుంది..

***

(ఇలాంటి ప్రమాదాల్లో అసువులు బాసిన, బలై పోయిన జీవితాలకి అంకితమిస్తూ బాధా తప్త హృదయంతో.. – రచయిత)

Exit mobile version