అహ నా పెళ్లంట

0
3

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో వసుమతి ఉడుప రచించిన ‘అహనన్నమదువెయంతె’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]ప[/dropcap]నిమనుషులకు నాకు సమన్వయం కుదరటం లేదని మరోసారి ఋజువయ్యింది. ఏవేవో కారణాల చేత, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పనిమనుషులు మారుతూండటం పరిపాటి అయ్యింది. ఎప్పటిలాగే ఆ రోజూ ఎనిమిది గంటలకొచ్చింది పని మనిషి కాంతి. ఇంటి బయట నీళ్లు జల్లి, ముగ్గు వేయటానికని చీపురు, బకెట్టు చేతబుచ్చుకొని, ఎల్లాంటి ఉద్వేగం, సంతోషమూ లేకుండా. తన సహజమైన ధోరణితోటే అంది కాంతి – “అమ్మగారూ నాకు పెళ్లి కుదిరిందండి” అని.

“ఔనేమే, పిల్లాడి వైపు వాళ్లు నిన్ను చూసి వెళ్లారా? ఒప్పుకున్నారా?”

“నిన్న మాపుటేల ఆరు మంది వచ్చిండ్రు. ఎంత బైగిరైతే అంతే బేగిరంగా పెల్లి సేసెయ్యండి అన్నారు అమ్మగారు.”

“బాగున్నాడేమే అబ్బాయి.”

ఇపుడు కాంతి ముఖం కొంచంగా వికసించింది.

“ఊ. బాగుండాడు అమ్మగారు.” అంది.

పైపైకి సంతోషాన్ని వ్యక్తపరచినా, మనసు విచలితమయ్యింది. ఔను, నా బాధ నాది. ఇక మొదలౌతుంది కొత్త పనిమనిషి కోసం వేట. అదో గ్రహచారమో గాని, నాకు నచ్చినట్టుగా వాళ్లు పని చెయ్యరు. వాళ్లు చేసే తీరు నాకు నచ్చదు. పని మనిషి నే చెప్పే టైంకి వచ్చేదిగా ఉండాలి. చేయి, నోరు శుద్ధంగా ఉండాలి. నే చెప్పింది వినాలి. చెప్పా పెట్టకుండా మూడ్రోజులకోసారి పనికి ఎగనామం పెట్టి నాకు బి.పి. పెంచేదిగా ఉండరాదు. నెల తిరక్క ముందే జీతం డబ్బుల్లో కొంత ఇవ్వండి అని అడగరాదు. ఇంకా… ఇంకా… నా జాబితాలో డూస్ అండ్ డోంట్స్ చాలా వున్నాయి. ఉన్న దాంట్లో కాంతి కొంచం నచ్చిన పనిమనిషే, వేరే వాళ్లతో పోలిస్తే. అదరా బాదరాగా పని ముగించుకొని పరుగెత్తక సావకాశంగా పని చేసే మనిషి అని మెచ్చుకోవచ్చు. ఏమంటే చెప్పిందే పది సార్లు చెప్పి పని చేయించుకోవాలి దీని చేత. సుమారు నాలుగేళ్ల బట్టి మా ఇంటికి అతుక్కుపోయింది కాంతి. అది మా ఇంట్లో ఓ మెంబర్‌గా మారిపోయింది. అది నాకు ఆత్మీయురాలు గాను కావటానికి కారణం దానిపై నాకేర్పడిన ఓ సానుభూతి. దాని ఆరోగ్యం గుఱించే నా ఆందోళన. దాని సరైన వయసెంతో దానికే తెలియకపోయే. దాని వయసు ఇంత అని నిర్ణయించడానికే వీలు లేదు. ఎండిపోయిన వెదురులా పొడవుగా ఎదిగిందే కాని ఆరోగ్యభాగ్యం దానికబ్బలేదు. తల నొప్పి కంప్లయింటే దాని కెప్పుడూను. గట్టిగా తలకి కట్టు కట్టుకొని వచ్చి “అమ్మగారూ…. ఓ లోటా ఏడి కాఫీ” అని అడగగానే దాని పరిస్థితి నాకర్థమయిపోయేది.

“మళ్లీ ప్రారంభమయ్యిదేమే ఈ పీడ నీకు” అని అంటునే స్ట్రాంగ్ కాఫీ దానికియ్యగానే, అది గోడకి చేరగిలబడి నిదానంగా తాగేది. అయిపోయిం తర్వాత ప్రారంభమయ్యేది దాని దినచర్య. అదొకటే కాక ఇంకా ఏదో శారీరక సమస్యలున్నాయనేనా అనుమానం. ఆ నా అనుమానానికి కారణం కూడా లేకపోలేదు. ఇరవై ఐదు లేదా ముప్ఫై ఏళ్ల వయసులో వున్న కాంతికి ఇంకా పెళ్లి కాకుండా పోవటమే. అయ్యే లక్షణాలు కూడా కన్పించేవి కావు. అయితే కాంతి చెల్లెలికి పెళ్లయి అప్పుడే ఇద్దరు బిడ్డల తల్లి కూడా అయ్యింది.

మా ఇంట్లో డైనింగ్ టెబిల్ పైన ఓ పెద్ద స్టీల్ డబ్బా ఉంది అంటే, అందులో తినడానికని ఏవో చిరుతిళ్లు వుంటాయనే కాంతి అందాజు. తన ఇంటికి తన చెల్లెలు పిల్లలు వచ్చినపుడు, తాను ఆ డబ్బాను చూడగానే, “అమ్మగారూ ఏమైనా తినేందుకు ఇయ్యండి అమ్మగారూ! ఇంటికి నా సెల్లెలు పిల్లలూ వచ్చినారు!” అని అడగటం దానికి అలవాటైన పని. ఇవ్వటం నాకూ అలవాటైపోయింది. అన్నీ సక్రమంగా జరిగిపోతున్నా కూడా, అక్కా చెల్లెండ్ర మధ్య ఒకరి పై ఒకరి పోటీ పడేవాళ్లని చూసిన నాకు కాంతికి ఉన్న ఈ విశేషతను చూస్తే ఆశ్చర్యం వేసేది. మానవునకున్న అరిషడ్వార్గాలలో మాత్సర్యమే ఎక్కువైనది అని భావిస్తున్న నాకు, ఇదెవతె, తద్విరుద్ధమైన ఆడది అని నేను భావించడంలో ఆశ్చర్యం లేదు. నేను కట్టి విడిచిన చీరలనిస్తే వాటిల్లో బాగున్న వాటిని చెల్లెలకి దానం చేస్తుంది కాంతి. అంతే కాదు దాన్ని గర్వంగానూ చెబుతుంది. “నీకని ఇచ్చానే కాంతి! నీ చెల్లెలికని తెలిస్తే ఇచ్చేదాన్నేకాదు!” అని అనేదాన్ని చిరుకోపంతో. దానికి అది “దానికి ఆశ ఎక్కువ అమ్మగారూ…” అని చెల్లెల్ని ఎనకేసుకుని వచ్చేది. దీని చెల్లెలేమీ పెళ్లి చేసుకుని సుఖసంతోషాలని జుర్రుకోటం లేదు. గారపని చేస్తూన్న మొగుడి సంపాదన తక్కువేమీ లేదు. అయితే ఎంత సంపాదించినా రాత్రి తాగుడుకే సరిపోయేది కాదు. వాడు తాగి వచ్చి కొట్టేకొట్టుడికి తాళలేక అది ఆ చెల్లెలు పుట్టింటికి పరుగెత్తి వచ్చేది. చిన్నపాటి పంచాయితీ జరగాక మళ్లా మొగిడింటికి వెళ్లటం. ఇవన్నీ నాకు కాంతి ద్వారానే తెలిసేవి. వీళ్లిద్దరి ఈ సంసార సుఖాన్ని చూసి కాంతికి పెళ్లంటే జుగుప్స వచ్చిందనకుంటే పొరపాటే. “తాక్కుండా ఉండే మగోడు ఎవడుంటాడు అమ్మగారూ”, అని అదంతా సర్వసామాన్యంగా జరిగేదే, మగాడికది ఓ క్వాలిఫికేషన్ అన్నట్లుగా తేలికగా అనేసేది కాంతి.

“నీ కంటే ముందుగా నీ చెల్లెలి కెందుకు చేశారే పెళ్లి?” అని అడిగా ఓసారి కుతూహలం తోటి.

“ఎప్పుడూ జూసినా ఏదో ఓ రోగమే నాకు అమ్మగారు. నన్నెవరు జేసుకుంటారు” అని సలీసుగా ఉత్తరం ఇచ్చేది కాంతి. తనకున్న దైహిక దౌర్బల్యాన్ని, న్యూనతనూ సహజంగానే ఒప్పేసుకుంటుందా కాంతి! దానికి పెళ్లి చేసే ఆలోచనే వాళ్లింటి వాళ్లకి లేదు అని నేననుకుంటూవుంటే… ఇదేంటిది కొత్త సంగతి చెబుతూ వుంది, ‘అమ్మగారూ నాకు పెళ్లి కుదిరింది’ అని.

***

పాపం, అందరిళ్లల్లోనూ పని చేస్తూనే ఈ పిల్ల ఆయుష్షు తీరిపోవాలో ఏమో! దానికీ సంసారం పిల్లలూ అక్కరలేదా? స్వార్థం దృష్టితో ఆలోచించటం తప్పు కదా! … తప్పు… తప్పు… మా ఇంటికి ఒదిగిపోయిన దాని గుఱించి క్రమేణా నా మనసు మెత్తబడసాగింది. మానవతా దృష్టితో ఆలోచించాను. మనుషుల స్వభావమే ఇల్లాంటిదా! తనకు సంబంధించి ఏవిషయమైన సరే దాన్నుంచే తన స్వార్థానికీ, సుఖసంతోషాలకీ ఎదురు దెబ్బ అనే దాన్ని గుఱించే ఆలోచిస్తూంది పాడు మనసు. ఒకవేళ వద్దంటే దాని పెళ్లి ఆగిపోతుందా! కాస్త విశాల హృదయంతో ఆలోచిస్తేనే వ్యక్తిత్వం మెఱుగుపడుతుంది. ఎన్నెన్నో దగ్గరి సంబంధాలే దూరమవుతున్న సందర్భాలు ఎదురవుతుంటే, కేవలం ఓ పనిమనిషి కోసం ఇంతగా తపనపడటం ఎందుకు. క్రమేణా మనసు ఆధీనంలోకి రాగానే వ్యావహారికంగా అన్నా “నీకు తెల్సున్న వేరే పనిమనిషి వుండే చెప్పు సరేనా!”

ఊ గొట్టింది కాంతి.

నెల గడిచిపోయింది కాని పెళ్లి సంగతి దాని నోట రాలేదు. అయినంత తొందరగా పెళ్లి చేసి ఇవ్వండని పిల్లవాడి వైపు చెప్పారని ఈ కాంతే కదా చెప్పింది. కుతూహలం పట్టలేక అడిగా “ఏమే పెళ్లికూతురా, ఎప్పుడే నీ పెళ్లి” అని .

“ఆదివారం వత్తావుండారు, పూలు ముడిసే దానికి” అంది అలుకుతూ.

“అంటే నిశ్చితార్థమేమే!”

“అంతేగదా మరి” అంది క్లుప్తంగా కాంతి.

చెప్పినట్టుగానే ఆ ఆదివారం పనికి రాలేదు కాంతి. ఇక దాన్నే అంటిపెట్టుకోక కొత్త పనిమనిషిని కుదుర్చుకోవాలి. తప్పదు. నిశ్చితార్థం అయిన పిల్లని, ఇంట్లో నాలుగు రోజులు ఉంచుకోక పనికి ఎందుకు పంపిస్తారు. తగిన పని పిల్ల దొరికేంత వరకూ నే రెక్కలు ముక్కలు చేసుకోక తప్పదు. కాంతి పనికి వస్తుందనే గ్యారంటీ లేదు. ఈ రోజు పని రేపటికి వాయిదా వేస్తే రేపటికది ద్విగుణీకృతమైతుందని తెల్సి పనిలో నిమగ్నమైపోయాను.

***

అయితే నేనూహించనట్టు జరగలేదు. మరుసటి రేజు టైంకి సరిగా హాజరయ్యింది కాంతి పనికి. కుతూహలంతో దాన్ని గమనించా. ఏదో కొత్తదనం కన్పించింది కాంతిలో. చెవికి చౌకబారు జుముకీలు వ్రేలాడుతున్నాయి. మెడలో పూసల దండ. చేతులకి ఆకుపచ్చని గాజులు. చేతుల, కాలి వ్రేళ్ల గోళ్లకి దిద్దిన రంగు. జడలో, వాడిపోయి వ్రేలాడుతున్న మల్లెపూల హారం. బహుశః రాత్రి పడుకోబోయేటప్పుడు వాటిని తీసివేసి ప్రొద్దుటే ముడుచుకొన్నట్టుంది.

“ఎప్పుడే పెళ్లి! తేదీ ఖరారు చేశారా.”

“రెండో కార్తీకం అమ్మగారు. ఆళ్లూ అరిజెంటు చేస్తే మాత్రం మా కాడ దుడ్లు వుండాలగదా అమ్మగారూ? ఇప్పుటికిప్పుడంటే అయ్యేది గాదు అని అనేసినారు మా అయ్య.”

అదెల్లాంటి రెండో కార్తీకమాసమే నాకైతే అర్థం అవలేదు. తెల్సుకోవాలనే ఉత్సాహమూ చూపలేదు. మాదేమైనా తేదీల లెక్కా. ఏది ఏమైనా ఇది పని చేయటానికి వస్తుంది. మనసు నెమ్మదించింది. నిశ్చితార్థమైన తర్వాత ఆడపిల్లలు తమ భవిష్యత్‌ను గూర్చి కలలు కంటూ కాలం గడుపుతూ ఉహాలోకాల్లో తేలిపోతూ వుంటారనే నా ఊహకి విరుద్ధంగా వుంది ఈ కాంతి ప్రవర్తన. ప్రతి రోజూలాగే ఏ పనిని మర్చిపోకుండా పూర్తి చేసింది. దాన్ని ఈ రోజు సూక్ష్మంగా గమనిస్తూనే వస్తున్నా. ఎల్లాంటి పరిస్థితిలోనైనా స్థితప్రజ్ఞతను ప్రదర్శించే దాని లాగా నాకు గోచరించింది కాంతి. పని ముగించుకొని కాంతి తన ఇంటికి వెళ్లిపోయిం తర్వాత, కాంతి చెప్పిన ఓ మాట నన్ను ఆలోచించేటట్టుగా చేసింది.

“ఆళ్లు అర్‌జెంట్ చేస్తే డబ్బులు కావాల్లగదా అమ్మగారూ” అని అన్న దాని మాట. ఎంత పేదరికపు పెళ్లయినా డబ్బుకావాలిగా! అందరి ఇళ్లల్లో చాకిరీ చేసిందే కాని, కాంతి ఓ పైసానూ వెనక వేసుకోలేదు. వచ్చిందంతా అమ్మ చేతిలో పెటి నమస్కారం చేసేది. చెల్లెలి మొగుడు ఇంటికి వచ్చినప్పుడు – వాడొక సిగ్గుమలిన వెధవ – తాగడానికని కాంతి దగ్గర చేయి చాస్తాడట. వాడు వచ్చేది, కాంతి జీతం తీసుకనే రోజునే. అంతో ఇంతో అమ్మ తన కిచ్చిన దాన్ని వాడికి సమర్పించేది. కాంతి తండ్రి కూడా గంతకి తగిన బొంతే. వాడు తాగుబోతు గాడే. తల్లి కూతురు – ఇంటింటా పని చేసి సంసారాన్ని నెట్టుకు వస్తున్నారు. ఇంతైనా ఎంతగా సమర్థిస్తుందో కాంతి తన వాళ్లని. “ఏ మగాడు తాగడు అమ్మగారూ” అని. దీనికి పెళ్ళయితే దీని గతీ ఇంతేనా – మూడ్రోజు కోసారి పుట్టింటికి రాక తప్పదా – ఛ… ఛ… దీని పరిస్థితి అలా కాకుండదు అని భగవంతుణ్ణి వేడుకున్నా.

రేపు దీని పెళ్లి నిశ్చయమైతే నా చేతనైనంత సహయం నేను చేసే తీరాలి, మూడు, నాలుగు వేలయినా గిఫ్ట్ రూపకంగా దానికిస్తూ. ఏంటి! కాంతి పట్ల నాలో సానుభూతి పెరిగినట్లుంది! ఉండవచ్చు నేమో!

***

కాంతి చెప్పినట్లుగా, అదేదో రెండో కార్తీకమాసం అదట్టుండనీ, కార్తీకమాసం పూర్తిగా సమాప్తమైనా దాని పెళ్లి మాటే ఎత్తడం లేదు అది. అడిగితే, అదే పాట పాడింది. డబ్బు కొఱత అని. ఇంకోసారి అంది “సంకురాత్రి తర్వాత సింపిల్‌గా ఓ గుళ్లో…” అని. ఇలా వాయిదాల మీద వాయిదాలుగా ముందుకెళుతున్న దానికి చీమ కుట్టినట్లయినా అనిపించక పోయేసరికి నాకెందుకో ఎనలేని తళమళం. కాని, కాంతి మాత్రం, ఆ రోజు – తనకు పూలు ముడుస్తారని చెప్పిన రోజు ధరించిన నకిలీ ఆభరణాలను మాత్రం వదలి పెట్టక వాటిని అలానే పెట్టుకుని ఉంది. ఇటీవల కొద్దిగా ఒళ్లు పట్టినట్టుగా కన్పిస్తూంది కాంతి. అదంతా నా భ్రమా లేదా పెండ్లే కాదన్న దానికి అనిరీక్షితంగా కుదిరిన పెళ్లి వల్లనా? బిల్డింగ్ కాంట్రాక్టరట కాబోయే పతిరాయుడు. వాడికెలాంటి చెడు అలవాట్లు లేకపోతే, కాంతి సుఖంగా సంసారాన్ని కొనసాగించగలదు. ఎవరి తలవ్రాత ఎలా వ్రాసాడో ఆ పై వాడికే తెలుసు.

***

ఒకటో తారీఖ రాగానే ఠంచన్‌గా జీతం పుచ్చుకునేందుకని, ఆ రోజు వచ్చే కాంతి ఈసారి పనికి రాకపోయింది. రాని నాడు, తాను రానని ముందుగానే చెప్పే గైరు హాజరయ్యేది. ఈ సారి అలా జరగలేదు. పెళ్లి రోజు దగ్గర పడుతోంది కదా – నే పడే కష్టాలు గుఱించి దానికేంటి చింత. ఇక మీదట పనికి రాకుండా పోయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఇక నాకు తప్పదు – అంట్లు తోమడానికని నడుం బిగించి రంగంలోకి దిగడానికి సిద్ధమౌతున్నప్పుడు మ్రోగింది కాలింగ్ బెల్.

‘లేటయినా పర్వాలేదు. పుణ్యాత్మురాలు. కనికరించింది’ అని అనుకుంటూ వాకిలి తీసేసరికి ప్రత్యక్షమయ్యింది కాంతి కాదు వాళ్ల అమ్మ.

“చెప్పాపెట్టకూండా పనికి చక్కర్ ఇచ్చింది కదా నీ కూతురు, ఓ మాట చెప్పాలని తెలీదా” అని అన్నా కోపంగా.

“అదో మూగెద్దు అమ్మగారు. దానికి జొరమొచ్చింది. ఒళ్లు నొప్పులంట. నెల జీతం అడిగేదానికి నేనే వచ్చినా” అంది కాంతి వాళ్ల అమ్మ.

కాంతికి రావాల్సిన నెల జీతం ఆమెకిస్తూ, “ఇంకేం పెళ్లి దగ్గర కొస్తూంది కదా త్వరగా కోలుకోమని చెప్పు” అన్నా మామూలుగా.

“పెళ్లా! ఎవరి పెళ్లి అమ్మగారూ” అని నోరు వెళ్లబెట్టింది ఆమె.

“ఇంకెవరి పెళ్లి, కాంతి పెళ్లంట గదా, సంక్రాతి తర్వాత… అదే చెప్పింది.”

భృకుటి ముడివడినట్లు, కాంతి వాళ్లమ్మ ముఖం గంటేసుకుని “దానికి మనువా… ఎవరు జేస్కుంటారమ్మా దాన్ని? రోగిష్టిది. దానికి దినానికో రోగం. దానికుండే రోగాల్ని మూసి పెట్టి మనువు జరిపిస్తే, మరుసటి దినానికే దాన్ని ఇంటికి దీసుకొచ్చి ఇడ్సి పోతరు…” అంది. నోరు తెఱచుకునే వంతు నాదయింది.

“పూలు ముడిచే శాస్త్రం కూడా అయ్యిందని చెప్పంది నాతో!”

“అదో తలతిక్కది. దానికి బుర్ర పాడయ్యింది.”

కాంతి వాళ్లమ్మ వెళ్లిపోయినా నేనలాగే వాకిలికి చేరబడి ఉండిపోయాను.

“అదో తల తిక్కది” అన్న మాట నిజమై వుంటుందా- మానసిక స్థితిని కోల్పోయి భ్రమలో ఉండిపోయి, ఆ భ్రమనే వాస్తవమని అనుకుంటూ వుండాలి కాంతి.

తేలికగా తీసి పారేయాల్సిన విషయం కాదిది అని కాంతి ఇంట్లో వాళ్ల మనసుకి నచ్చజెప్పే వాళ్లెవరు? వాళ్లు నా మాటల్ని కొట్టిపారేయక దాన్ని గంభీరంగా పరిగణిస్తే సరి, లేకుంటే… దీని పర్యవసానమేమిటి!… ఆలోచించే కొద్దీ నాకు పిచ్చి ఎక్కేటట్టుంది.

***

రోజులు దొర్లిపోయాయేగాని కాంతి మాత్రం పనికి రాలేదు. దానికి మనో వికలత్వమేదైనా తీవ్రమైవుండ వచ్చునా! మెఱసి మాయమయ్యే మెఱుపు తీగలాగా అప్పుడప్పుడు కలిగే కాంతి ఆలోచనల మధ్య కొత్త పనిమనిషిని కుదుర్చుకోవటమూ జరిగింది. వచ్చిన మొదటి రోజే, ఆ పని మనిషి చురక మనిపించే సమాచారాన్ని చెవిని వేసింది.

 “అమ్మగారూ… కాంతి,… అదే మీ ఇంట్లోన పని జేస్తుండేనె ఆ పిల్ల విషయం తెల్సా అమ్మగారు” అంది.

“ఏంటే అది?” అడిగా ఆతురతగా.

“ఎవ్రికీ సెప్పాపెట్టకుండా లేసిపోయి పెండ్లి జేస్కొనుండాది… ఎవర్నో తెల్సా అమ్మగారు.”

“ఎవర్నే?”

“సెల్లెలు మొగుణ్ణే.”

“నిజమే నేమే.”

“అపద్దం సెప్పడానికి నాకీ దానికీ పడదా ఏంటి అమ్మగారు.”

అయ్యో ఎల్లాంటి పని చేసింది కాంతి. పోయి, పోయి తాగుబోతు వెధవని చేసుకుని తన జీవితాన్నే కాక చెల్లెలి జీవితాన్ని కూడా పాడుచేసింది కదా. పెళ్లి పెళ్లి అంటూ… ఎవరితోనూ చెప్పకోని సత్యాన్ని తనలోనే దాచిపెట్టి కొన్నదెందుకు! పెళ్లి పట్ల కాంతికి ఇంత ఉత్సుకత ఉండేదని ఏనాడు నాకు తెలియకపోయింది. చెల్లెలి కాపురాన్ని తాను కళ్లారా చూసి కూడా ఇంతటి వ్యామోహానికి గురి అయ్యింది ఎందుకు? “మగవాళ్లు ఉండేదే అలాగా” అని తాను గమనించి, సహజంగానే దాన్ని స్వీకరించిందా కాంతి. రెండో పెళ్లి అని తెల్సినా ఎంత సునాయాసంగా ఒప్పుకోగలిగింది – ఇది మొదటే నాకు తెల్సి వుండినట్టయితే నేను నిరాకరించగలిగి ఉండేదాన్నేమో! ఆ అమాయకురాలిని గుఱించి నా మనసు ద్రవించి కళ్లు నీటితో నిండాయి.

కన్నడ మూలం: వసుమతి ఉడుప

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here