[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]
[dropcap]ముం[/dropcap]బాయి. 1999 వ సంవత్సరం.
తెల్లవారు ఝాము సమయం.
ఇంకా చిరు చీకట్లు తొలగలేదు.
బాగా పొడవుగా ఉన్న ఒక వ్యక్తి ఆ చిరు చలిలో నెమ్మదిగా అయినా హుందాగా నడుస్తు ఒక పెద్ద రాజ ప్రాసాదంలాంటి బంగళా తాలూకు గేటు ముందు నిలబడ్డాడు.
నేం ప్లేట్ పై ఉన్న అక్షరాలు ఆ భవనం తాలూకు గోడపై ఆ చిరు చీకట్లో స్పష్టాస్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘యష్ చోప్రా’.
“ఏయ్ ఎవరది. జావ్ జావ్” అనబోతున్న సెక్యూరిటి గార్డు నోట మాట పెగల్లేదు. అతని మాటలు అతని నోట్లోనే ఉండిపోయాయి
“సర్ మీరు.. మీరు.. ఈ సమయంలో ఇక్కడ?” అంటూ తన కళ్ళని తానే నమ్మలేని వాడిలా నెమ్మదిగా గేటు తెరిచి ఆ పెద్ద మనిషిని లోపలికి ఆహ్వానించాడు.
బాగా బ్రతికి చితికిపోయిన చక్రవర్తిలా ఉన్న ఆ పెద్ద మనిషి నెమ్మదిగా విజిటర్స్ ఛాంబర్‌లో కూర్చున్నాడు
స్వయంగా టీ తీసుకు వచ్చి అందించాడు యష్ చోప్రా.
“అమితాబ్ జీ మీరు స్వయానా వచ్చి అడగాలా? నేను మీకు ఇదిగో ఈ బ్లాంక్ చెక్కు ఇస్తున్నాను. ఎంత కావాలంటే అంత వ్రాసుకోండి – మీ అప్పులన్నీ తీర్చేయ్యండి”
టీ కన్న తియ్యగా ఉన్నాయి యష్ చోప్రా మాటలు.
ఇంకొకరు ఇంకొకరూ అయితే ఎగిరి గంతేసి ఆ చెక్కుని అందుకుని చక్కా వెళతారేమో.
మృదువుగా తిరస్కరించాడు అమితాబ్ బచ్చన్. తన సహజ గంభీరమైన కంఠంతో స్థిరంగా చెప్పాడు “నాకు ఆర్థిక సాయం అక్కరలేదు. పని ఇప్పించండి చాలు.”
అప్పటికి రెండు రోజుల క్రితమే అమితాబ్ ధీరూబాయి అంబాని నుంచి వచ్చిన ఇలాంటి ఆర్థిక సాయాన్ని తిరస్కరించి ఉన్నాడు.
బహుశా ఇంకొకరూ మరొకరూ అయితే ఆ మాట కూడా చెప్పి తమ అహాన్ని ప్రదర్శించుకునే వారేమో. అంబానీ విషయాన్నే ప్రస్తావించకుండా యష్ చోప్రా గారి ప్రేమని గుర్తించినట్టు సున్నితంగా ఆయన అరచేతి మీద తన చేతితో నెమ్మదిగా తడుతూ “ఈ కంఠంలో ఇంకా వాడి ఉంది, ఈ కాయంలో ఇంకా వేడి ఉంది, ప్రజల గుండెల్లో నాపై ప్రేమ ఉంది. లేనిది నా వద్ద డబ్బు ఒక్కటే. నాకు మీలాంటి నిర్మాతలు, దేవుళ్ళ లాంటి ప్రేక్షకులు ఉన్నారు. ఇక భయం ఎందుకు? నాకు పని ఇప్పించండి చాలు.”
అంతులేని ఆత్మ విశ్వాసం, దృఢమైన ఆత్మగౌరవం ఆయన పలుకుల్లో కనిపిస్తున్నాయి.
“నాకు పని ఇప్పించండి చాలు” ఇదే ఆయన నోటి నుంచి పదే పదే వస్తున్న మాట. ఇంచుమించు ఆయన స్థితి ఒక ధ్యాన నిమగ్నుడైన ముని స్థితి లాగా ఉంది.
ఆయన నమ్మింది ఒక్కటే కర్మ చేయటం.
అమితాబ్ టీ త్రాగటం పూర్తయ్యేలోగా యష్ చోప్రా ‘మొహబ్బతే’ సినిమా తాలూకు ప్రణాళిక రచించేశాడు. అదే మాట చెప్పేశాడు. అమితాబ్ హుందాగా నవ్వి కరచాలనం చేసి బయటికి కదిలాడు. యష్ చోప్రా గారు కారు పంపిస్తామన్నా సున్నితంగా తిరస్కరించి బయటికి వచ్చేసాడు.
తనని ఎవ్వరూ గుర్తు పట్టకుండా మంకీ కాప్‌ని నుదుటి పై కళ్ళ దాకా లాక్కున్నాడు. మఫ్లర్‌ని మొహం కనపడకుండా చుట్టుకుని కదిలాడు బయటికి అమితాబ్.
అదీ ప్రారంభం.
ఆ తరువాత చక్కటి వాక్చాతుర్యం ఉండి హిందీ ఇంగ్లీష్ లలో మాట్లాడగలిగే వ్యక్తి కోసం స్టార్ టీవి వాళ్ళు అన్వేషిస్తున్నారని తెలిసి అంతే నిశ్శబ్దంగా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళ ఎదురుగా కుర్చున్నాడు.
సునామీ లాంటి విజయపరంపరలకి నాందీ వాక్యం పలికిన మరో ఘట్టం అది.
వాక్చాతుర్యం, గాంభీర్యం, ప్రజాదరణ, స్టార్‌డమ్ అన్నీ ఉన్న సూపర్ స్టార్ వాళ్ళకి వరం లాగా దొరికాడు.
‘కౌన్ బరేగా కరోడ్‌పతీ’ ఒక తిరుగులేని ప్రోగ్రామ్‌గా స్థిరపడటానికి అక్కడ అంకురార్పణ జరిగింది.
ఆ తరువాత ఆయన కనపడని ప్రకటన లేదు. బూట్ల పాలీష్ నుంచి అప్పడాల వరకు అంతటా ఆయనే.
ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ ఆయన తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకున్నాడు.
ఎక్కడ అయితే పొగొట్టుకున్నాడో అక్కడే అంతకు వంద రెట్లు ఎక్కువ సంపాయించాడు. అదీ అతి తక్కువ సమయంలో. అదీ అరవైలు దాటిన వయస్సులో. అదీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉన్న స్థితిలో.
ఏమిటి ఈ విజేతని నడిపే ఇంధనం?
ఈ రచన పూర్తిగా చదివితే మీకే అర్థం అవుతుంది.
మీరు బిలియనీర్లు అవటం అసాధ్యం కాదు నన్ను నమ్మండి.
***
సిద్ధార్థ్ రాజశేఖర్ అనే పేరు మీలో ఎంత మంది విన్నారో నాకు తెలియదు.
ఇతని సంవత్సర ఆదాయం నాలుగు వందల కోట్ల పై మాటే. గూగుల్‌లో చూసి మీరు ఖరారు చేసుకోవచ్చు. పోనీ ఇతను ఏదన్నా పెద్ద పరిశ్రమ నడుపుతున్నాడా అంటే లేదు. మరి ఏమి చేస్తాడు ఇతను అంటే ఇతను ఒక కోచ్. మామూలు పదాలలో చెప్పాలంటే ఇతను ట్రెయినర్. అవునండి అతను కేవలం ఒక ట్రెయినర్. ఆన్‌లైన్‌లో మాత్రమే చెబుతాడు.
అతనికి ఆఫీస్ అంటూ లేదు. ఒక పెద్ద పరిశ్రమలాంటి సెటప్ ఏమీ లేదు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ మాత్రమే ఉపయోగించి అతను ఈ స్థితికి చేరాడు.
అది ఎలా సాధ్యమయింది?
అతని జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. అతను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. సంగీతంలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది. ఏవో చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం, సంగీతం ఆధారంగా చిన్న చిన్న ప్రకటనలకి జింగిల్స్ చేయటం వీటి ద్వారా ఏదో తిప్పలు పడేవాడు.
అతనికి జీవితంలో మలుపు ఆన్‌లైన్‌లో అఫీలియేట్ మార్కెటింగ్ చేయటం ద్వారా వచ్చింది. అతని గురువు ‘విక్’ అనే పాశ్చాత్యుడు. అతని ద్వారా ఆన్‌లైన్ కోచింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విక్ వద్ద శిక్షణ తీసుకోవడానికి అవసరమైన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆ దశలో భార్య గాజులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అతనిది.
అతనికి విక్ నేర్పిన అనేకానేక పాఠాలలో ఒకటి ప్రతి ఉదయం, సాయంత్రం ఒక ఆడియో ప్రసంగం వినటం. ఈ ఆడియొ ప్రసంగం దాదాపు ముప్ఫై నాలుగు నిమిషాలు ఉంటుంది.
‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అన్న రీతిలో విక్‌ని నమ్ముకున్న మన రాజశేఖర్ తూచ తప్పకుండా ఆ ఆడియో ప్రసంగాన్ని నిత్యమూ వినటం ప్రారంభించాడు. ఇప్పటికీ వింటున్నాడు.
ఆ తరువాత జరిగింది అంతా ఒక చరిత్ర. ఈ రోజు సిద్దార్థ్ రాజశేఖర్ దేశంలోనే నెంబర్ వన్ ట్రెయినర్. అతని ఆస్థుల విలువ బహిర్గతం అవ్వాల్సి ఉంది.
అతని సంవత్సర ఆదాయం కనీసమంటే సంవత్సరానికి నాలుగు వందలకోట్ల పై మాటే.
అలాగని ఈ సిద్ధార్థ్ రాజ శేఖర్ ‘డబ్బు డబ్బు డబ్బు ‘ అంటూ డబ్బు ఒక్కటే లోకం అన్నట్టు మాట్లాడడు.
అతని టీచింగ్స్ మనలో సంస్కారాలని జాగృతం చేస్తాయి. ధర్మం పట్ల గౌరవం కలగజేస్తాయి. “ఒకరికి ఇస్తేనే నీకు సంపద పెరుగుతుంది” అంటాడు ఈయన.
ఇక పోతే, తన వద్దకి శిక్షణకి వచ్చే ప్రతి వ్యక్తికి తనను ప్రభావితం చేసిన ఆడియో ప్రసంగాన్ని వినమని సిఫార్సు చేస్తాడు ఈయన.
నాకు మొదటి సారి ఆ ఆడియో గూర్చి ఇతని ద్వారానే తెలిసింది.
ఆ ఆడియో ప్రసంగ పాఠం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’. అది 1956లో ఎర్ల్ నైటింగేల్ అనే అనే వ్యాపారవేత్త తన ఇన్స్యురెన్స్ కంపెనీ ఉద్యోగులని ఉత్తేజపరచటానికి యథాలాపంగా చేసిన ప్రసంగం. ఈ ఎర్ల్ నైటింగేల్ ఒక రచయిత, రేడియోలో ఉత్తేజభరిత ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. ఆ తరువాత అదే ప్రసంగం అమెరికన్ రేడియోలో ప్రసారం అయ్యి కొత్త రికార్డులని నమోదు చేసుకుంది.
అప్పటి దాకా పాటల రికార్డులు, మ్యూజిక్ రికార్డులు కొనటం మాత్రమే తెలిసిన అమెరికన్ యువత వేలం వెర్రిగా ఆ రికార్డు కావాలని రేడియో స్టేషన్ వారిని వేధించసాగారు. అలా మొదలయ్యింది ప్రభంజనం.
అద్భుతం జరుగుతుంది అని ముందరే తెలీయదు.
అది జరిగాకా అది అద్భుతం అని చెప్పాల్సిన పనే లేదు. అలాగే జరిగింది. ఈవేళ అమెరికాలోని అనేక మంది మిలియనీర్లు, బిలియనీర్లు తమకి ప్రేరణ ఈ ఆడియో ప్రసంగం అని చెబుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావాన్ని.
అందుకే నేను దీన్ని తెలుగులో మన సంచిక పాఠకుల కోసం సులభమైన పద్దతిలో వ్రాసాను.
కాకపోతే నాకు ఇది అలవాటు లేని అవపోసన. అంటే ఇప్పటి దాకా భావుకత్వంతో నిండిన కథలు, మంచితనంతో సందేశాలు అందిచే కథలు, హారర్ కథలు, సినిమా రివ్యూలు వ్రాసిన నాకు, ఇలా ఒక అనువాదం లాంటి రచన చేయటం ఇదే మొదటిసారి.
ఒకసారి చూచాయగా ఈ విషయంలో నాకు ఆసక్తిగా ఉంది వ్రాయమంటారా అని కస్తూరి మురళీ కృష్ణ గారిని అడిగితే ఆయన అందించిన ప్రొత్సాహం నాకు కొత్త శక్తిని ఇచ్చింది.
ఇది ఇంగ్లీష్ వాక్యాలకి అనువాదమే అయినా వీలయినంత వరకు ఆ ఛాయలు పడకుండా తెలుగు రచనే చదువుతున్నాము అని మీకు అనిపించేలా వ్రాసే ప్రయత్నం చేశాను. అనేక ఇంగ్లీష్ పుస్తకాల అనువాదాలు చదివి ఇదివరకు నేను తలకొట్టుకున్న సందర్భాలు అనేకం. అందుకే ఈ విషయంగా ఒక పాఠకుడిలా ఆలోచిస్తూ వ్రాసే ప్రయత్నం చేశాను.
ఇంకో ముఖ్యమైన సంగతి, ఒరిజినల్ ప్రసంగంలో బైబిల్ లోని వాక్యాలు, జీసస్ గూర్చి ప్రస్తావన, కొండ మీద ప్రసంగం తాలూకు ప్రస్తావనలు ఉంటాయి ఎక్కువగా. నేను రచయిత యొక్క కోణంలో ఆలోచించాను. ఆయనా పాశ్చాత్యుడు, చదివింది తెలుసుకుంది అక్కడే, ఆయన భావాల్ని అర్థం చేసుకుంటూనే, దైవం అన్న ప్రతి దగ్గరా నేను కొలిచే దైవాన్ని, నేను నమ్మే ధర్మాన్ని వ్రాయటం జరిగింది.
ఇక్కడ మీరు సిద్ధార్థ్ రాజశేఖర్ యొక్క ఉద్దేశాలని అనుమానించాల్సిన పని లేదు. నేను మొదట ఈ కోణంలో కూడా చూశాను. ఇదేమన్న క్రైస్తవ మత ప్రచారానికి కొత్త రకం పద్దతా అని నేను అనుమానపడ్డాను కూడా. సిద్ధార్థ్ రాజశేఖర్ గారు పదహారణాల శ్రీ వైష్ణవ బ్రాహ్మణుడు, ఇస్కాన్ సభ్యుడు. తన ట్రెయినింగ్స్‌లో భాగంగా ఒక్కోసారి పెద్ద పెద్ద ఆఫ్‌లైన్ ఈవెంట్స్ నిర్వహించి ఆ వేదికల మీద ఇస్కాన్ గురువులని ఆహ్వానించి సన్మానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నా వరకు నేను నిర్మొహమాటంగా క్రైస్తవ మత ప్రచార ఛాయలు పడకుండా ప్రసంగపాఠంలోని ఆత్మ దెబ్బ తినకుండా మన నేటివిటీకి తగ్గట్టు వ్రాశాను. ఈ ప్రసంగపాఠం యూట్యూబ్‌లో ఉచితంగా లభిస్తుంది. నేను ఈ రచనని కేవలం విద్యా వ్యాప్తికై చేస్తున్నను కాబట్టీ, స్వేచ్ఛానువాదం కాబట్టి నేను హాయిగా ఈ అనువాదాన్ని కొనసాగించాను. ఆ విధంగా తీసుకుంటే ఈ రచనలో 60-70% అసలు వక్త తాలూకు ప్రసంగ పాఠం, మిగతా వాక్యాలు ఉదాహరణలు ఇతరత్రా నావి. కానీ ఎక్కడా కూడా అసలు ప్రసంగం యొక్క ఆత్మ మాత్రం నేను దెబ్బ తీయలేదు. వీలైన చోటల్లా మెరుగులు దిద్దాను.
ఈ రచన చదువుతూ ఉంటే, మీకు ఇంకో విషయం కూడా అనిపించవచ్చు. ఇది ఒక క్రమ పద్దతిలో భావాల్ని ఏర్చి కూర్చి వ్రాసినట్టు అనిపించదు. కారణం సుస్పష్టం. అసలు వక్త యథాలాపంగా తనకి తోచింది తోచినట్టు తోచింది చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ భావాల్లో సాంద్రత ఉండటం వల్ల లాక్షణీకులు విమర్శకులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
మీరు కూడా పెద్ద మనసు చేసుకుని చదవాలి.
ఏమిటి ఈ విజేతలని నడిపే ఇంధనం?
ఈ రచన పూర్తిగా చదివితే మీకే అర్థం అవుతుంది.
మీరు బిలియనీర్లు అవటం అసాధ్యం కాదు నన్ను నమ్మండి.
(మళ్ళీ కలుద్దాం)