[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]
[dropcap]ఒ[/dropcap]క అద్భుత రహస్యం గూర్చి ఇక్కడ మీకు చెబుతాను. ఇది ప్రపంచంలోని ఆశ్చర్యకరమైన విషయాలన్నిటికన్నా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని ఘంటాపథంగా చెప్పగలను.
“డాక్టర్ గారూ! మనుషులందరూ ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య ఏమిటి?” ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు సాలోచనగా చూసి, తల తాటించి, ఒకే ముక్కలో ఇలా సమాధానం చెప్పారు నోబుల్ ప్రైజ్ గ్రహీత డాక్టర్ ఆర్నాల్డ్ ష్వైట్జర్.
“మనుషులు ఆలోచించటం మానేశారు”.
***
ఇదిగో సరిగ్గా ఈ విషయం గూర్చే మీకు ఇక్కడ చెప్పబోతున్నాను.
నిజానికి మనం జీవిస్తున్న ఈ సమయం ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. కంప్యూటర్లు, ఇంటర్నెట్టు, ఆర్టిఫిష్యల్ ఇంటెలిజెన్సు, అత్యాధునిక వాహనాలు, అత్యంత సుఖవంతమైన జీవితం ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాము.
ఆది మానవుడి దశ నుంచి మానవుడు ఈ స్థితికి వచ్చాడంటే అది ఒక గొప్ప విజయం. ప్రతి దశలో మానవుడు ఎంత కష్టపడి ఉండాలి.
వేల సంవత్సరాలుగా ఎదురు చూసి, ఆ దిశగా కృషి చేసి మానవ సమాజం నిజం చేసుకున్న ఒక అందమైన కల మనం జీవిస్తున్న ఈ స్వర్ణ యుగం.
చాలా మంది తాము జన్మించే సమయానికే ఈ స్వర్ణ యుగం కళ్ళ ముందు ఉండటం వల్ల దీని విలువ తెలియక దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. భూమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా గతంలో ఎన్నడూ లేనంత సుఖవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవనం మనిషి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇదివరకు ఎన్నడూ లేనన్ని విస్తృత అవకాశాలు మన అందరి ముందు ఉన్నాయి ఈ భూమి మీద.
ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం:
ఇరవై అయిదు సంవత్సరాల వయసున్న వంద మంది యువతీ యువకులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని అనుకుందాం. ఓ నలభై ఏళ్ళ తరువాత, అంటే వారికి అరవై అయిదు ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వారు తమ తమ జీవితాలలో ఏమి సాధిస్తారని మీరు అనుకుంటున్నారు?
సరే ఈ లోగా వారిని కూడా అడిగి చూద్దాం. వారందరూ నిస్సందేహంగా తాము జీవితంలో గొప్ప గొప్ప విజయాలని సాధించగలమని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతారు కూడా. వాళ్ళు తమ జీవితాన్ని ప్రారంభించటానికి అమితోత్సాహం చూపుతారు. వాళ్ళ కళ్ళలో కలలతో కూడిన గొప్ప వెలుగు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు నిటారుగా ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా కనిపిస్తారు మనకి.
జీవిత ప్రయాణం అనంగానే గొప్ప సాహస క్రీడగా భావిస్తూ ఉత్సాహంతో ఉరకలెత్తుతూ ఉంటారు వారందరూ.
ఇక వాస్తవానికి వస్తే, నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళలో కేవలం ఒక్కరు మాత్రం ఐశ్వర్యవంతుడిగా స్థిరపడి కనిపిస్తారు.
మహా అంటే ఒక నలుగురు ధనవంతులుగా కనిపిస్తారు. ఒక అయిదుగురు ఇంకా కష్టపడి పని చేస్తూ పొట్టపోసుకుంటూ ఉంటారు.
మిగిలిన వారందరూ కూడా జీవితంలో అన్ని విధాలుగా వైఫల్యం చెంది తమ తమ కనీస అవసరాల కోసం ఇతరుల మీద ఆధార పడి జీవిస్తూ దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు.
దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వందమంది బృందంలో కేవలం అయిదు శాతం మంది మాత్రమే తమ కలల్ని నిజం చేసుకునే విషయంలో పాస్ మార్కులు సంపాయించారు.
మిగతా వారందరూ ఎందుకు విఫలం అయ్యారు?
ఇరవై అయిదో ఏట వాళ్ళ కళ్ళలో ఉన్న ఆ మెరుపులు ఏమయ్యాయి?
వాళ్ళ కలలూ, ఆశలు, ప్రణాళికలు ఏమయిపోయాయి?
వాళ్ళు నిజం చేసుకోవాలనుకున్న స్వప్నాలకి, వాస్తవానికి మధ్యన ఎందుకంత అంతరం ఏర్పడింది?
వాళ్ళలో కేవలం 5% మాత్రమే విజయం సాధించారు అన్నాను కదా ఇందాక, అసలు విజయం అంటే ఏమిటో నిర్వచనం చెప్పుకుందాం మొదట.
విజయం అనే పదానికి ఇంతకంటే అద్భుతమైన నిర్వచనం నాకు ఇంత వరకు ఎక్కడా దొరకలేదు. మీరు కూడా చదవండి. మీక్కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.
“Success is the progressive realization of a worthy ideal.”
ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం గొప్ప ఆశయాలని సాధించుకుంటూ వెళ్ళటమే విజయం అంటే.
ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే వైపుగా ఒక వ్యక్తి పని చేసుకుంటూ వెళుతున్నాడంటే ఆ వ్యక్తి విజేత అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
అలా చేయని వాడు ఓడిపోయినవాడిగా చెప్పుకోవచ్చు.
ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ రోలా మే తన ‘The Man’s Search for himself’ (తనని తానే అన్వేషిస్తున్న మనిషి) అన్న పుస్తకంలో ఇలా చెపుతారు.
సాహస ప్రవృత్తి అనే పదానికి వ్యతిరేకపదం పిరికితనం కాదు, నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఉండిపోవటం సాహస ప్రవృత్తి లేకపోవటం. భిన్నమైన ఆలోచనాధోరణి లేకపోవటం, నలుగురిలాగా తానూ మూసపోసినధోరణీలో ఆలోచించటం ఇవన్నీ సాహస ప్రవృత్తిలేకపోవటం కిందకే వస్తాయి.
సమస్య మొత్తం ఇలాంటి మూసపోసిన ధోరణి వల్లే వస్తోంది.
తాము ఎందుకు అలా చేస్తున్నామో ఎక్కడికి వెళుతున్నామో అన్న ఆలోచన కూడా లేకుండా పక్క వాడు ఎలా చేస్తే తానూ అలా చేస్తూ మూసపోసిన పద్ధతిలో మనిషి జీవించటం మొదలు పెట్టాడు.
మనము ఇప్పుడు ఉన్న సమాజంలో చూస్తూ ఉన్నాం కదా.
అందరూ వేలం వెర్రిగా ఇంజినీరింగ్ చదవటమో, మెడిసిన్ కోర్స్ కోసం ప్రిపేర్ అవటమో, ఒక దాని వెంబడి ఒకటి వెళ్ళే గొర్రెల లాగా సాఫ్ట్‌వేర్ జాబ్స్ వంక గుడ్డిగా వెళ్ళిపోవడమో చేస్తూ ఉన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 1956లో అమెరికా విషయానికి వస్తే, ఒక కోటీ ఎనభై లక్షల మంది వయోవృద్ధులు ఉన్నారు. వారి వయస్సు అరవై అయిదుకి పైనే ఉంటుంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే వారిలో చాలా మంది జీవితంలో ఓడిపోయిన వారే. జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవటానికి వారు ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ బ్రతుకు వెళ్ళదీస్తున్నారు.
***
సాధారణంగా మనం ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి చదవటం వ్రాయటం నేర్చుకుని అక్షరాశ్యులు అని అనిపించుకుంటున్నాము.
ఇరవై అయిదో ఏడు వచ్చేటప్పటికి చిన్నదో చితకదో పని వెదుక్కుని మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం చేస్తుంటాము. మన కాళ్ళ మీద మనం నిలబడటమే కాదు, కొందరం అయితే సంసారాన్ని కూడా పోషించే పరిస్థితిలో ఉంటాము.
అయినప్పటికీ అరవై అయిదో ఏడు వచ్చే సరికి ఆర్థిక స్థిరత్వం ఏర్పరచుకోవటంలో అనేక మంది ఈ ఆధునిక ప్రపంచంలో కూడా విఫలం అవుతున్నారు అంటే విడ్డూరం కాకుంటే మరేమిటి?
ఏవి కోరుకున్నా అవి అందుకోగలిగేలాంటి అనుకూలమైన వాతావరణం మనకు ఉంది. మానవ సమాజం ఎన్నడూ లేనంతగా శాస్త్ర సాంకేతికతల కారణంగా సుఖంగా జీవించటానికి అనుకూలంగా అభివృద్ధి చెందింది.
అయినా ఎందుకు ఇన్ని కోట్ల మంది ఇంకా కష్టాలలో ఆర్థిక ఇబ్బందులతో, వైఫల్యం చెందిన వారిలాగా మిగిలిపోతున్నారు?
అందుకు ఒకే ఒక కారణం కనిపిస్తుంది.
మూసపోసిన ఆలోచనాధోరణులు.
విజేతలుగా ఎదుగుతున్న 5% మంది లాగా వైవిధ్యంగా ఆలోచించటం మానేసి, మిగిలిన 95% మంది ఒకే రకమైన మూస ధోరణిలో ఆలోచిస్తూ పరాజితులుగా మిగిలిపోతున్నారు.
ఎందుకు జనం ఇలా మూసపోసిన ధోరణులకి అలవాటు పడి బ్రతుకుతున్నారు?
నిజానికి వారికి కూడా తెలియదు తాము అలా గొర్రెలలాగా మూసధోరణిలో బ్రతుకు ఈడ్చుకుంటు వెళుతున్నామని.
తమ జీవితాలు పరిస్థితుల కారణంగా అలా తెల్లారుతున్నాయని వారు బలంగా విశ్వసిస్తారు. తమ ప్రమేయం లేకుండానే బయటి నుంచి ఏవో కొన్ని అదృశ్య శక్తులు తమ జీవితాలని శాశిస్తున్నాయని వారు మనసా వాచా నమ్ముతారు.
ఒకసారి ఒక సంస్థ ముందుకు వచ్చి సశాస్త్రీయంగా ఒక సర్వే నిర్వహించింది.
అనేక మంది ఉద్యోగస్థులని ఈ సర్వే సంస్థ వారు ప్రశ్నించారు –
“మీరు ఉదయాన్నే ఎందుకు నిద్ర లేస్తారు?”
“మీరు ప్రతి రోజు ఆఫీసుకు పనికి ఎందుకు వెళతారు?”
20 మందిలో 19 మంది “మాకు తెలియదు” అనే సమాధానం చెప్పారు. నమ్మశక్యంగా లేదు కదూ.
మరింత గుచ్చి గుచ్చి అడిగితే వారు చెప్పిన సమాధానాలు మరింత చిత్రంగా ఉన్నాయి.
“అందరు పని చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఏదో ఒక పని చూసుకుని ఇలా పని చేసుకుంటున్నాము”
అదన్న మాట అసలు సంగతి, అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా పని చేస్తున్నాము.
ఇప్పుడు మనం మళ్ళీ విజయం అన్న పదానికి మొదట చెప్పుకున్న నిర్వచనం చూద్దాం.
“Success is the progressive realization of a worthy ideal.”
“ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం గొప్ప ఆశయాలని సాధించుకుంటూ వెళ్ళటమే విజయం అంటే.”
విజేతలు ఎవరు?
పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని ఆరేడంకెల ప్యాకేజీ తెచ్చుకునేవాడు మాత్రమే విజేత అని భావిస్తూ ఉన్న మనుష్యుల మధ్య జీవిస్తున్నాం మనం.
ఇప్పుడు ఏది ట్రెండింగ్‌లో ఉంది? అనే మాట కూడా వినిపిస్తూ ఉంటుండి.
ఇంజినీరింగ్‌లో చేరే ముందు, అనుభవజ్ఞులు అని చలామణిలో ఉన్న వారు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి.
‘అబ్బే ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి డిమాండ్ లేదు’
‘మెకానికలా, వద్దు వద్దు. పెద్దగా ఉద్యోగాలు దొరకవు’
‘సాఫ్ట్‌వేర్ మేలేమో’
‘మార్కెటింగ్ జాబా? అమ్మో కష్టం’
‘గవర్నమెంట్ ఉద్యోగమైతే భేషుగ్గా ఉంటుంది, పై సంపాదన కూడా పట్టవచ్చూ’ అని కన్ను గీటి చాలా చమత్కారంగా మాట్లాడినట్టు వాళ్ళను వాళ్ళే భావించుకునే మేధావులు.
ఇదిగో ఇది మన చుట్టూ ఉన్న వాతావరణం.
***
మరి నిజమైన విజేతలు ఎవరు? నిజమైన విజయం అంటే ఏమిటీ? అదిగో అక్కడికే వస్తున్నాను.
తను ఎంచుకున్న లక్ష్యం వైపు నిరంతరం అడుగులు వేస్తూ, ఆ మార్గంలో చిన్న చిన్న గోల్స్‌నీ సాధించుకుంటూ వెళుతూ ఉన్న వ్యక్తిని నిస్సందేహంగా విజేతగా ఎదుగుతాడు.
“ఇదిగో నేను ఫలానా లక్ష్యాన్ని చేరుకోబోతున్నాను” అని చెప్పి మరీ ఇలాంటి వ్యక్తులు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
విజేతలంటే ఎవరో మీకు అర్థమయ్యేలా మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
తాను టీచర్ అవ్వాలి అని గట్టిగా నిర్ణయించుకుని, టీచర్ ఉద్యోగం సంపాయించి, స్కూల్లో పాఠాలు చెప్పుకుంటున్న టీచర్ ఒక విజేత.
ఒక చక్కటి గృహిణిగా అవ్వాలనుకుని అదే లక్ష్యంతో పెళ్ళి చేసుకుని, ఒక తల్లిగా, భార్యగా తన పాత్రని అద్భుతంగా పోషిస్తూ ఆనందంగా ఉన్న గృహిణి ఒక విజేత.
వీధి చివర పెట్రోల్ స్టేషన్ నడుపుతున్న వ్యక్తి అదే స్వప్నంతో తన వృత్తి జీవితాన్ని ఆరంభించి పెట్రోల్ బంకు పెట్టుకున్నాడనుకోండి, అపుడు ఆ పెట్రోల్ బంకు యజమాని ఒక విజేత.
సేల్స్ రంగంలో ఎవ్వరూ చూడనంత ఎత్తులకి ఎదగాలి అన్న లక్ష్యంతో సేల్స్ రంగంలో తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి తన స్వప్నాన్ని నిజం చేసుకున్న సేల్స్‌మన్ ఒక విజేత.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టరో, కోటీశ్వరులో వీరు మాత్రమే విజేతలు అని మనం ఎన్నడూ అనుకోరాదు.
తమ వృత్తి జీవితం పట్ల ఒక స్పష్టమైన గోల్‌తో ముందే నిర్ణయించుకున్న మార్గంలో ప్రయాణం మొదలు పెట్టి ఆయా లక్ష్యాలని అందుకున్న ప్రతి ఒక్కరూ విజేతలే.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరవై మందిలో కేవలం ఒక్కరే అలా స్పష్టమైన గోల్‌తో తమ వృత్తి జీవితాల్ని మొదలు పెడతారు, వారే విజేతలుగా మారతారు.
ఇక్కడ జిం రాన్ చెప్పిన ఒక వాక్యం చెబుతాను – “ఒక మనిషి మూసపోసిన ధోరణులలో ఇమిడిపోయి పెద్దదో చిన్నదో ఉద్యోగం చేయటానికి ఈ వ్యవస్థలో ఒక మర మనిషిలాగా బ్రతకడానికి ఈ స్కూలు, కాలేజీ విద్య రూపుదిద్దబడింది.”
విద్య అవసరమే. విద్య లేని వాడు వింత పశువు అని కూడా చెప్పవచ్చు. కేవలం అక్షర జ్ఞానానికై, అర్హతలకై విద్యని అభ్యసించాల్సిందే. కానీ తనకి ఏ రంగంలో అభిరుచి ఉందో గమనించి ఆ రంగంలో తనదైన అధ్యయనాలతో స్వంతంగా విద్యని పొందుతూ, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళేవాడు ఆయా రంగాలలో ధృవతారగా ఎదుగుతాడు.
95 శాతం మంది జనం మూసపోసిన జీవితాల్లో ఇమిడిపోవడానికి, దొరికిన దాంతో రాజీపడి జీవించటానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నిజానికి పోటీ అన్నది ఎక్కడా లేదు.
మనతో మనం పోటీ పడటం మొదలెట్టి, మనల్ని మనం మెరుగ్గా తీర్చి దిద్దుకోవచ్చు.
ఈ విషయంలో ఆకాశమే మనకు హద్దు.
(మళ్ళీ కలుద్దాం)