ఐశ్వర్య రహస్యం-5

0
2

[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]

ఆలోచనలతో నిండిన మీ మెదడే మీ జీవితాలని శాసిస్తోంది.

[dropcap]ఈ[/dropcap] సందర్భంగా మీకొకటి చెప్పాలి. అరిజోనా ప్రాంతంలో నేనొక సారి ఒక అతి పెద్ద ట్రక్కుని చూడటం జరిగింది. అనేక టన్నుల కంకర, మట్టి లోడ్ వేసుకుని ఆ పెద్ద ట్రక్కు సుమారు నలభై యాభై కిలోమీటర్ల వేగంతో ముందుకు భారంగా వెళుతోంది. భయం గొల్పే ఆకారంతో పెద్ద మోత చేస్తూ ఉన్న ఆ అతి భారీ ట్రక్కుని పీలగా ఉన్న ఓ మనిషి స్టీరింగ్ వీల్ ముందు కూర్చుని సునాయాసంగా ఆ ట్రక్కుని తాను కోరుకున్న దిశలో లాఘవంగా నడుపుకుంటూ వెళుతున్నాడు.

నా కార్‌ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళానే కానీ నా ఆలోచనలన్నీ ఆ ట్రక్కు చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ ట్రక్కుకి మనిషి మేధస్సుకి నాకు పోలిక కనిపించింది.

అంతటి మహత్తరమైన శక్తి మీ అదుపాజ్ఞలలో ఉన్న పక్షాన మీరు ఏమీ పట్టించుకోకుండా నిర్లిప్తంగా దాని పాటికి దాన్ని వదిలేసి అది ఏ గోతిలోకో పడేట్టు చేసుకుంటారా? లేదా ఆ పెద్ద మిషన్ తాలూకు శక్తి సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగిచుకుంటూ మీకు కావాల్సిన పెద్ద పెద్ద పనులు చక్కబెట్టుకుంటారా?

ఇది పూర్తిగా మీ ఇష్టం.

మీరే రథ సారథి. మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు.

ఇక్కడే చిత్రమైన ప్రకృతి నియమం ఉంది. మన ఆలోచనలని సరిగ్గా ఉపయోగించుకుంటే అవి మనకి అమితమైన ఐశ్వర్యాన్ని, విజయాలని, సంపదలని కట్టబెడతాయి. లేదా అవి మనల్ని అధఃపాతాళానికి లాక్కువెళతాయి. అంటే మన ఆలోచనలు రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి అని ఒప్పుకుంటారా?

మన ఆలోచనలని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

ఇదే నేను చెప్పదలచుకున్న ఒక అద్భుత రహస్యం. ఇదే ప్రపంచంలోకెల్లా అద్భుత ఐశ్వర్య రహస్యం.

అందరికీ తెలిసిన ఈ చిన్న విషయాన్ని పట్టుకుని నేను అద్భుతమని, పైగా రహస్యం అనీ ఎందుకంటున్నానో మీకు అర్థం కాలేదు కద.

నిజానికి ఇది అద్భుతమూ కాదు, రహస్యం అంతకన్నా కాదు.

మన పూర్వీకులు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. అనేక మత గ్రంథాలలో కూడా ఇదే విషయన్ని పదే పదే చెప్పటం జరిగింది. అయినప్పటికీ అతి తక్కువ మంది దాని గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేశారు, ఇంకా తక్కువ మంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.

అందుకే మన ఆలోచనల తాలూకు శక్తి అనే విషయం ఒక అద్భుతంగా మిగిలిపోయింది. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికి అది ఒక రహస్యంగా మిగిలిపోయింది.

మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. మీరేమి చేస్తారంటే, ఇప్పటికిప్పుడు మీరు బయలుదేరి వెళ్ళి మీ ఊళ్ళో ఎవర్నైనా సరే అడిగి చూడండి ‘విజయ రహస్యం ఏమిటి? విజయం ఎలా సాధించాలి?’ అని. మీకు ఒక్కడు కూడా తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోవచ్చు. ‘మీ ఆలోచనలే మీ విజయానికి మూలం’ అనే విషయాన్ని మహా అంటే వేలల్లో ఒకరేమైనా చెబుతారేమో.

ఇది నిజానికి అత్యంత విలువైన సమాచారం కద. కేవలం మనకొక్కళ్ళకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి, మన సంస్థలో పని చేసే ఉద్యోగులకి, మనతో జీవితాల్ని పెనవేసుకుని ఉన్న మిత్రులకి అందరికీ కూడా ఈ విలువైన సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక జీవితం అనేది ఒక గొప్ప సాహస క్రీడగానూ ఉల్లాసభరితంగాను ఉంటుంది. బోర్ కొట్టడం అనేది ఇక మీ జీవితంలో ఉండదు సుమా.

జీవితం నిత్యం ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఉండాలి. మన జీవితానికి ఒక సరి అయిన దిశ ఉంటే, ఉదయాన్నే పక్క మీద నుంచి లేవటమే గొప్ప స్ఫూర్తితో ఉల్లాసంగా లేవగలం.

మనకి ఇష్టమైన పనిని ఎన్నుకోవడంలోనే ఇమిడి ఉంది రహస్యం అంతానూ. మనకిష్టమైన పనిని మన వృత్తిగా ఎప్పుడైతే ఎన్నుకుంటామో మనం ఆ పనిని ఆనందంగానూ అత్యంత సమర్థవంతంగానూ చేస్తాము.

మాజీ పత్రికాధిపతి గ్రోవ్ పాటర్సన్ తన ఉపన్యాసంలో చెప్పిన మాటల్ని నేను ఎన్నడూ మరిచిపొలేను.

ఆయన మాటల్లో చెప్పాలంటే “పత్రికాధిపతిగా నాకు ఎంతో మంది మనుషులని అతి దగ్గరగా చూసే అవకాశం లభించింది. మనుషులు అందరూ స్వభావసిద్ధంగా అతి మంచి వాళ్ళూ. మనం అందరం ఎక్కడి నుంచో వస్తాము, ఎక్కడికో వెళతాము. అయితే ఒకటి మాత్రం నిజం, భగంతుడు ప్రతి ఒక్కరినీ ఒక ప్రత్యేక కారణంతో సృష్టింఛాడు. అందరూ కూడా కారణజన్ములే. భగవంతుడిని మనం గొప్ప ఆర్కిటెక్ట్ అనుకుంటే, ఆయన మన ముందున్న ప్రతి ఒక్క దారిని ఒక ప్రత్యేక కారణంతో సృష్టించాడు. మనం ఎందుకు ఏమిటి అని అనవసర ప్రశ్నలతో కాలయాపన చేయకుండా మన ముందున్న దారిలో ఆనందంగా సాగిపోవడమే. ఆపై అంతా మంచే జరుగుతుంది.”

మత గ్రంథాలు చెప్పేది కూడా ఇదే కద. “పూర్తి విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటే, నీకు మంచి ఆలోచనలే కలుగుతాయి, ఆ మంచి ఆలోచనలే నీకు మంచి చేస్తాయి.”

‘యద్భావో తద్భవతి’ సారం ఇదే కద.

ఈ ప్రపంచంలోకెల్లా ఒక అద్భుత రహస్యాన్ని చెబుతాను అన్నాను, చెప్పేశాను వివరించాను కద. ఇక ఈ రహస్యాన్ని ఉపయోగించుకుని మన జీవితాలలో గొప్ప గొప్ప మార్పులు ఎలా తీసుకురావచ్చో వివరిస్తాను.

మీరు ఈ రహసాన్ని మీ జీవితాలలో ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగింఛుకోవచ్చో, ఎలా లాభపడవచ్చో మీకు స్టెప్ బై స్టెప్ చెబుతాను ఇప్పుడు.

ముఫై రోజుల పరీక్ష:

ఒక ముఫై రోజుల పరీక్షకి సిద్ధమేనా మీరు?

నా మాట నమ్మండి ఇది చాలా సులభం. మీరు దీన్ని పూర్తి విశ్వాసంతో అమలు చేస్తే మీ జీవితాలలో మునుపెన్నడూ లేనంతటి ఐశ్వర్యాన్ని, ఆనందాలని మీరు చవి చూస్తారు. పదిహేడవ శతాబ్దంలో న్యూటన్ మహాశయుడు ప్రతిపాదించిన నియమాలలో మూడో నియమం మీకు గుర్తు ఉండే ఉంటుంది.

“ఫర్ ఎవరీ ఆక్షన్, దేర్ ఈస్ ఏన్ ఈక్వల్ అండ్ ఆపోసిట్ అమౌంట్ ఆఫ్ రియాక్షన్ “

అంటే ప్రతి చర్యకి, అంతే పరిమాణంలో వ్యతిరేక చర్య ఉండటం ఈ సృష్టిలో సహజమే అని కదా ఆ నియమం యొక్క సారాంశం.

దీన్ని మన జీవితాలకి అన్వయించేలా చెప్పాలి అంటే ప్రతి కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఏ పని చేయకుండా నిర్వ్యాపారంగా కూర్చుంటే ఏ విజయం లభించదు.

మనం మొదలెట్టబోయే ముఫై రోజుల ప్రయోగం మొక్క ఫలితాలు మీరు ఎంత మేరకు మీ శ్రమని జోడిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

ఒక ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలి అంటే, అతను అనేక సంవత్సరాలు వైద్య విద్యని అభ్యసించాల్సి ఉంటుంది కద.

ఒక వ్యక్తి సేల్స్ రంగంలో రాణించాలంటే అతను ఎంత మేరకు ఆ రంగంలో కష్టపడితే అంత మేరకు అతనికి లాభాలు వస్తాయి. నిజానికి తమ ఆలోచనలతో ఇతరులని ప్రభావితం చేసే వారందరూ సేల్స్‌లో ఉన్నట్టే లెక్క.

చక్కటి జీవితాన్ని పొందాలంటే మనం చెల్లించాల్సిన మూల్యం ఎమిటి?

1) మళ్ళీ మొదటికే వస్తున్నాను. మొదట చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతాను. అదేనండి, మీ ఆలోచనలే మీ చక్కటి జీవితానికి మీరు చెల్లించాల్సిన మూల్యం. ప్రతి విజయం మొదట ఆలోచనలో పుడుతుంది. “ఏదైతే విత్తుతామో అదే పంట పొందుతాము”

2) ఆ తరువాత మనం చేయాల్సిన మొదటి పని మన మెదడులోంచి అనుమానాలన్నింటినీ తొలగించుకుని మన ఊహలకి రెక్కలిద్దాము. అనుమానాలు అనే పెనుభూతాలు మన మెదడులో లేకుంటే ఇక అక్కడ నిండినదంతా దైవత్వమే కద. మిమ్మల్ని మీరు అనుమానిస్తూ కూచోవటమే మీ విజయాలన్నింటికీ పెద్ద అవరోధం. మీరు ఊహించలేనన్ని అవకాశాలు మీ ముందు ఈ క్షణమే సిద్ధంగా మీ ముందే ఉన్నాయి. మిమ్మల్ని మీరు కించపరచుకోవడాల నుంచీ, అపోహల నుంచీ, అనుమానాల నుంచీ బయట పడి ఎదగడమే మీ ముందున్న మొదటి సవాల్.

3) మూడవది అతి ముఖ్యమైనదీ ఏమిటయ్యా అంటే, మీ సమస్యల పట్ల మీరు సానుకూల దృక్పథంతో పరిష్కారాల దిశగా ఆలోచించటం మొదలెట్టాలి. దీనికి ఎంతో ఓర్పు, ధైర్యం కావాలి కద. మీ సమస్య పరిష్కారం దిశగా మీరు న్యూట్రల్‌గా ఆలోచించాలి. వీలయినన్ని పరిష్కారాలు ఆలోచించగల్గాలి.

ఆ తరువాతి అంకం. స్పష్టమైన గోల్స్ (లక్ష్యాలు) ఏర్పరచుకోవాలి. మీ గోల్స్‌ని సాధించే దిశగా ఏ అనుమానాలకి తావివ్వకుండా మీ మెదడు యొక్క అద్భుతమైన ఊహా శక్తికి రెక్కలిచ్చి మీ గోల్స్ అఛీవ్ అయినట్టు బలగం ఊహించుకుంటూ ఉండండి.

ఒకటి చెపుతాను. మిమ్మల్ని నడిపించే ఒక శక్తి మీ వద్ద ఉంది. అది ఏమిటో చెప్పనా. రస్సెల్స్ క్రోం వెల్ తన పుస్తకం ‘ఏకర్స్ ఆఫ్ డైమండ్స్’ లో వ్రాసినట్టు మీరు విజయం సాధించినట్టు, అంతు లేని ఎకరాల కొద్దీ వజ్రాల వంటి ఐశ్వర్యం నడుమన మీరు ఉన్నట్టు బలంగా ఊహించండి, బలంగా విశ్వసించండి. ఆ ఊహే మిమ్మల్ని నడిపిస్తుంది.

నాలుగవ నియమం. మీరు సంపాయించే దాంత్లో పదవ వంతు ఖచ్చితంగా పొదుపు చేస్తూ దాచుకోండి.

మీ జీవితం విజయాలతో నిండాలన్నా, అత్యంత ఐశ్వర్యం మీ స్వంతం కావాలన్నా నాలుగు నియమాలు పాఠించాలని చెప్పాను కద. ఆ నాలుగు నియమాలు ఏమిటో ఒక సారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం.

ఒకటో నియమం: మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే పొందుతారు.

రెండవ నియమం: మీ ఊహలకి రెక్కలివ్వండి. ఎంత బలంగా ఊహించగలుగుతారో అంత ఖచ్చితత్వంతో మీ కలలు నిజం అవుతాయి

మూడవ నియమం: ధైర్యం. మీ కలలన్నీ నిజం అయినట్టు ధైర్యంగా నిరంతరం కల గనండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీ గోల్స్‌ని మరువకండి

నాలుగవ నియమం: మీరు సంపాయించే దాంత్లో నియమబద్ధంగా పది శాతాన్ని పొదుపు చేసి దాచుకోండి

అయిదవ అత్యంత ముఖ్యమైన నియమం: ఆచరణ. అవునండీ ఆచరణలో పెట్టని ప్రణాళికలు, కలలూ కేవలం గాలిలో మేడలకన్నా గొప్పవేమి కావు.

30 రోజుల ఛాలెంజ్ గూర్చి ఇప్పుడు మీకు చెబుతాను వివరంగా. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ముఫై రోజుల ఛాలెంజ్ తీసుకొని మీరు నిబద్ధతతో పూర్తి చేస్తే మీకు అపరిమితమైన లాభాలే తప్ప ఇసుమంత కూడా నష్టం ఉండదు సుమా.

మనలో ప్రతి ఒక్కరికి సంబంధించిన రెండు నిజాల్ని ఇక్కడ చెబుతాను.

1) మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప విజయం సాధించాలని కలగంటారు

2) మనలో ప్రతి ఒక్కరూ ఏవో గుర్తు తెలియని భయాలతో సతమతమవుతుంటారు

మీకొక చిన్న పని చెబుతాను. ‘మీరు జీవితంలో సాధించదలచుకున్న అతి గొప్ప విషయం ఏమిటీ?’ అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు సంపాయిస్తున్న ధనానికి రెట్టింపు సంపదన కావచ్చు. లేదా ఏదైనా ఒక ఖచ్చితమైన మొత్తం అది కొన్ని లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు – ఇలా ఏదో ఒక పెద్ద మొత్తంలో గొప్ప ధనం సంపాయించాలని మీరు గోల్గా పెట్టుకుని ఉండవచ్చు. ఒక చక్కటి స్వంత ఇల్లు పొందటం మీ కల అయి ఉండవచ్చు. లేదా ఒక గొప్ప ఉద్యోగం పొందటం మీ కల కావచ్చు. లేదా మంచి గుర్తింపు పొందేలా సమాజంలో ఒక గొప్ప స్థానంలో మీరు నిలబడాలి అనేది మీ స్వప్నం కావచ్చు. మీ స్వప్నం ఏదైనా కావచ్చు. ఆ స్వప్నాన్ని చక్కగా స్పష్టమైన పదాలతో ఒక కార్డ్ పై వ్రాయండి.

మీరు ఒక చిన్న కార్డ్ తీసుకొండి. ఒక పెన్నో మార్కరో తీసుకుని దానిపై మీ స్వప్నాన్ని చక్కటి పదాలతో వ్రాయండి.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక గొప్ప విజయం సాధించాలని కలగంటారు

ఒక కార్డ్ తీస్కుని చక్కటి పదాలతో ఒక మార్కర్తోనో పెన్నుతోనో మీ స్వప్నాన్ని స్పష్టంగా వ్రాయండి. ఆ కార్డ్ సైజు ఒక విజిటింగ్ కార్డ్ సైజులో ఉంటే మరీ మంచీ. వ్రాశాక దాన్ని చక్కగా లామినేట్ చేయించి మీ పర్సులో పెట్టుకోండి.

సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా మీ కలని ఒక లక్ష్యం (గోల్) లాగా వ్రాయండి. మీరు దానిని ఎవ్వరికీ చూపనక్కరలేదు కూడా. నిజానికి ఎవ్వరికీ చూపకుంటేనే మంచిది కూడా.

మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్డ్‌ని మీతో తీసుకెళ్ళటం మరచి పోకండి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ కార్డ్‌ని చూడటం మరచిపోకండి. ఒకే ఒక గోల్ వ్రాసుకోండి అది కూడా స్పష్టాతిస్పష్టంగా వీలైనంత సూటిగా ఉండేలా ఆ గోల్‌ని వ్రాసుకోండి.

ప్రశాంతమైన మనసుతో చిరునవ్వుతో నిండిన వదనంతో కళ్ళు మూసుకుని, మీ మనసు తెరపై, మీరు ఆ లక్ష్యాన్ని అందుకున్నట్టు, ఆ గోల్ చేరుకున్న తరువాత మీ జీవితంలో జరగబోయే మార్పులన్నిటిని ఆనందంగా ఆస్వాదిస్తున్నట్టు తరచు ఊహించుకోండి.

ఉదాన్నే నిద్ర లేవంగానే ప్రసాంతమైన మనసుతో హాయిగా మీ గోల్‌ని గుర్తు తెచ్చుకోండి. మీ మనసంతా ఆ గోల్ తాలూకు ఆలోచనలతో నింపుకోండి.

ఆ గోల్ని అందుకునే దిశగా ఈ రోజు మీరు చేయాల్సిన పనులు అవి ఎంత చిన్నవైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా వ్రాసుకొండి. ఆ పనులు చేయటానికి సిద్ధపడిపోండి. చూశారా మీరు ఉత్సాహంగా నిద్ర లేవటానికి సరి అయిన కారణం ఇప్పుడు ఉంది. హాయిగా పనులు చేసుకుంటూ సాగిపోవటానికి ఒక లక్ష్యం అంటూ స్పష్టంగా ఏర్పడింది.

పగలంతా కూడా మీ గోల్ కార్డ్‌ని తరచు తీసి చూసుకోండి. మీ గోల్‌ని వీలయినన్ని సార్లు పదే పదే చదువుకోండి.

ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు దేనిగూర్చి ఆలోచిస్తారో దానినే పొందుతారు. మీరు ఇప్పుడు మీరు మీ గోల్ గూర్చే ఆలోచిస్తునారు. మీరు ఖచ్చితంగా మీ గోల్‌ని అందుకుంటారు. ఇది తథ్యం.

ఎప్పుడైతే మీరు మీ కలలని, మీ ఆశల్ని, ఆశయాల్ని ఒక గోల్ రూపంలో పెన్ను తీస్కుని కార్డ్ పైకి ఎక్కించారో ఆ క్షణం నుంచే మీ కలలు అన్నీ నిజం అవటం అనే ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. ఇది నిజం. ఇది నిజం. ఇది నిజం. ఇదే నిజం. ముమ్మాటికి ఇది నిజం.

మీరు చేస్తున్న వృత్తిలో, లేదా వ్యాపారంలో ఎన్నెన్ని విస్తృత అవకాశాలు అనంతమైన సంపదలు సంపాయించటానికి అవకాశాలు ఉన్నాయో ఒక సారి ఓపెన్ మైండ్‌తో చూడండి. అపరిమితమైన ఐశ్వర్యాన్ని, సమృద్దితో కూడిన జీవిత విధానాన్ని పొందటానికి మీకు అన్ని విధాలా అర్హత ఉందని మీరు ఎందులోనూ ఎవరికంటే కూడా తక్కువ కాదని గుర్తుంచుకోండి.

ఆ దిశగా మీరు ప్రయత్నించటమే ఆలశ్యం.

ఇక మన లక్ష్య సాధనలో అతి కఠినమైన అంశానికి వచ్చేశాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here