[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభారావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవి బాధ్యతలు నిర్వహించారు. బహుగ్రంథకర్త. పండితులు. పలు బహుమతుల గ్రహీత. తన అపారమైన అనుభవాలను ఆయన పాఠకులతో ఆకాశవాణి పరిమళాలు శీర్షికన నెల నెలా పంచుకుంటున్నారు.[/box]
ఆకాశవాణి ఉద్యోగంలో నేను చేరడం చిత్రవిచిత్రం. ఇదేదో సినిమా కథ కాదు. నిజం కథ. 1964 నాటి మాట. నేను బి.ఎ. రెండో సంవత్సరం నెల్లూరు వి.ఆర్. కాలేజీలో చదువుతున్నాను. అప్పుడు నా వయస్సు నూనూగు మీసాల 16 దాటి పదిహేడో ఏడు. తెలుగు స్పెషల్ చదవడం వల్ల పద్యం పోకడ, నడక, సొంపు అప్పుడప్పుడే రుచి చూస్తున్నాను.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ‘సరసవినోదిని’ సమస్యాపూరణం పేర ఒక కార్యక్రమం రాత్రిపూట ప్రసారం చేసేవారు. అందులో ప్రతి వారం ఒక సమస్య ఇచ్చేవారు. దానిని పూరించి ‘కార్డు’ మీద వ్రాసి విజయవాడకు పోస్టు చెయ్యాలి. అందులో ఎంపిక చేసిన పూరణలు దాదాపు ఓ 20- 15 నిమిషాల వ్యవధిలో చదివేవారు. ఆ వారం ఓ సమస్య ఇచ్చారు. నేను వ్రాసుకొని పూరించి పంపాను. సమస్య ఇది – ‘కన్యకు నేడు కన్నులట కల్పకవల్లికి కన్నతల్లికిన్’.
కన్యకు నేడు కన్నులని ఒక అర్థం. కన్యకు ఏడు (7) కన్నులని మరో అర్థం. తొలిసారిగా నా పేరు రేడియోలో విని పొంగిపోయాను. పూరణ ఇలా కొనసాగింది. 1964 నవంబర్ 25 రాత్రి ప్రసారమైంది.
ఉ. మాన్య రమాకుమారి కడ మన్ననలందుచునుండు భారతీ
కన్యకు, లోకపావనియు కామితదాయినియౌ సముద్రరాట్
కన్యకు, ఫాలలోచనుని కామినియైన ధరాధరాధిరాట్
కన్యకు, ఏడు కన్నులట కల్పకవల్లికి కన్నతల్లికిన్.
దీనికి ముగ్గురు దేవతామూర్తులైన లక్ష్మీ సరస్వతీ పార్వతులతో సమన్వయం చేసి అర్ధనారీశ్వరియైన పార్వతికి మూడు కన్నులు+2+2=7 అనే అర్థంలో పూరించాను.
అది మొదలు నేను రేడియోకు వారం వారం (బుధవారం) అంటుకుపోయి రకరకాల సమస్యలు పూరించాను. మా తెలుగు అధ్యాపకులు సుప్రసిద్ధ పండితులు శ్రీ పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి గారు. “ఫలనా సమస్య ఇచ్చారు సార్ ఈ వారం” అంటే ఆయన కూడా పూరణలు పంపారు.
అలా అలా ఆకాశవాణి ప్రసారాల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లో ఆకాశవాణి ఒక్కటే ప్రసార మాధ్యమం. నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో 1967 డిసెంబరులో తెలుగు అధ్యాపకుడిగా 20 ఏళ్ళు నిండాయనగా చేరాను. అప్పుడు కూడా రేడియో శ్రోతనే.
అప్పట్లో ‘వాణి’ అనే పక్షపత్రిక వచ్చేది. అందులో ఆకాశవాణి తెలుగు కేంద్రాలలో ఆ 15 రోజులలో ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలను ప్రచురించేవారు. ఒకటి, రెందు ప్రసంగపాఠాలు, ప్రసంగకర్తల ఫోటోలు ప్రచురించేవారు. తొలినాళ్ళలో ఆచంట జానకీరామ్ గారు దాని సంపాదకులు. మదరాసు నుంచి ప్రచురించేవారు. తరువాత విజయవాడకి తరలించారు – రజని గారి చొరవతో. వాణి పత్రిక వెల పావలా.
నేను కొని, ముఖ్యమైన కార్యక్రమాలను ‘నోట్’ చేసుకొని వినేవాడిని. అలా ఆకాశవాణి శ్రోతృ వ్యససం అంటుకుంది. సాహిత్య కార్యక్రమాలు, చర్చలు, నాటకాలు, ధర్మసందేహాలు, బావగారి కబుర్లు విని ఆనందించేవాడిని. నాటకాల ప్రసారంలో విజయవాడ పేరు సంపాదించింది. నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు అక్కడ నాటక విభాగంలో ‘డ్రామా వాయిస్’లు.
1972లో ననుకొంటా! నా సమస్యా పూరణ ‘వాణి’లో ప్రచురితమైంది. అది నా తొలి ప్రచురణ. అదే సంవత్సరం చివరలో వాణిలో ఒక ప్రకటన వెలువడింది. తెలుగులో ‘సీనియర్ స్క్రిప్ట్ రైటర్’ ఉద్యోగానికి దరఖాస్తులు పంపుకోవచ్చనని సారాంశం. విజయవాడలో ఖాళీ. నేను మా ఆఫీసు ద్వారా అప్లికేషన్ విజయవాడ స్టేషన్ డైరక్టర్ గారికి పంపాను.
రెండు మూడు నెలల్లో ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. అప్పుడు కాలేజీలో నా బేసిక్ జీతం 250 రూపాయలు. డి.ఎ., హెచ్.ఆర్.ఎ. అదనం. ఆకాశవాణికి ఉద్యోగానికీ అదే జీతం. రేడియో మీద మోజుతో అప్లయి చేశాను. మరో నాలుగు రోజుల్లో ఇంటర్వ్యూ.
ఓ సాయంకాలం కందుకూరు జనార్ధనస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు హరికథ చెప్పడానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వయోలిన్ విద్వాంసులు శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారు వచ్చారు. సహాధ్యాపకులు ఆర్.ఎస్. సుదర్శనాచార్యుల వారి ఇంట్లో ఆ రాత్రికి వారు బస చేశారు. నేను వారిని కలిసి నా ఇంటర్వ్యూ లెటర్ చూపాను. ఆయన నవ్వారు. నాకర్థం కాలేదు. “ఇంటర్వ్యూకి వెళ్ళడం మంచిదే. కాని ఆ ఉద్యోగం మా ఆఫీసులో క్రిందిస్థాయిలో జూనియర్ స్క్రిప్ట్ రైటర్‍కు ప్రమోషన్ కింద ఇస్తారని విన్నాను. మీ యిష్టం” అన్నారు. విజయవాడ వెళ్ళడం మానేశాను.
మా కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు జంధ్యాల లక్ష్మీ నారాయణ శాస్త్రి ప్రోత్సాహంతో నేను 1969లో అష్టావధానం చేయడానికి ఆకాశవాణి సరసవినోదిని పరోక్ష కారణం. విజయవాడ కేంద్రం నుంచి ఏదైనా సాహిత్య ప్రసంగం చేయాలని ఆలోచన వచ్చింది. ఒకటి, రెండు ప్రసంగాలు వ్రాసి పంపితే త్రిప్పి పంపారు. నేను పి.హెచ్.డి. కోసం కందుకూరి రుద్రకవి రచనలు ఎంచుకుని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య జాస్తి సూర్యనారాయణ పర్యవేక్షకులుగా పరిశోధన 1973లో మొదలుపెట్టాను.
‘రుద్రకవి రచనలు’ అనే అంశంపై ఆరు పేజీల ప్రసంగ పాఠం విజయవాడ కేంద్రానికి పంపాను. శంకరమంచి సత్యం ఆ రోజుల్లో ప్రసంగశాఖని నిర్వహించేవారు. ‘సాహిత్యమంజరి’ అనే ఓ సాహిత్య కార్యక్రమంలో నా ప్రసంగాన్ని షెడ్యూల్ చేశారు.
1974 మే లో రికార్డింగ్‌కు రమ్మని ఆకాశవాణి కేంద్రం నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. నేను విజయవాడ కెళ్ళి మిత్రులు జంధ్యాల మహతీ శంకర్ (సత్యనారాయణపురం) ఇంట్లో దిగాను. వారే నన్ను రేడియో స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఆ రోజు బుద్ధపూర్ణిమ. కేంద్ర కార్యాలయాలకు సెలవు. స్టూడియోలో నా కోసం రికార్డింగ్ కెదురుచూస్తున్నారు. ఆయనే కొప్పుల సుబ్బారావు అనౌన్సర్.
స్టూడియోలో మైక్ ముందు కూచోబెట్టారు. ‘నాలుగు వాక్యాలు చదవండి’ అన్నారు. ఆ తర్వాత ‘ఓ.కె. మొదలుపెట్టండి’ అన్నారు. అలా నా ఆకాశవాణి అరంగ్రేటం ఆనాడు మొదలైంది. కొప్పుల సుబ్బారావు తర్వాత న్యూస్ రీడర్‌గా చేరి మంచి పేరు సంపాదించారు. ఇటీవలే మరణించారు.
ఆఫీసుకు సెలవు కావడం వల్ల శంకరమంచి సత్యం గారిని కలవలేకపోయాను. అయితే తర్వాత కొద్ది నెలల్లో ఆయన మా కళాశాల సభలో మాట్లాడడానికి వచ్చినప్పుడు కలిశాను. కంచు కంఠం. ఆయన వ్రాసిన ‘హరహర మహాదేవ’ నాటకం విజయవాడ కేంద్రంలో తయారైనా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాలు ప్రసారం చేశాయి. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ఆయన వ్రాసిన అమరావతి కథల సంపుటికి లభించింది. ఆయన వంశపారంపర్యంగా అమర లింగేశ్వరాలయం పూజారి కుటుంబానికి చెందినవారు. లా పట్టా పొంది ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‍గా తొలినాళ్ళలో 60వ దశకంలో చేరారు. స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది విదేశీ ప్రసారాల విభాగం ఢిల్లీలో పనిచేస్తూ అకాల మరణం పొందారు. ఆయన వ్రాసిన అమరావతి కథలు దూరదర్శన్ జాతీయ ప్రసారాలలో సీరియల్‌గా ప్రసారమయ్యే కార్యక్రమ ఎంపికలో నేనూ భాగస్వామిని.
ఒక ప్రసంగం ప్రసారం కాగానే మరికొద్ది నెలలలో యువవాణికి మరో ప్రసంగ పాఠం పంపాను. నేను సెలవల్లో ‘గోవా’ పర్యటించి వచ్చాను. ఆ యాత్రా విశేషాలు తెలుపుతూ – ‘యాత్రాస్థలంగా గోవా’ అనే ప్రసంగం పంపాను. రెండో నెలలోనే నాకు రికార్డింగ్ లెటర్ వచ్చింది. దానికి మూల కారణం – యువవాణి విభాగ కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గోపాల్. ఆయన గోవా ఆకాశవాణిలో పనిచేసి విజయవాడకి బదిలీ అయి వచ్చారు. ఆ విధంగా అయనకు గోవా అంటే ఇష్టం. నా రికార్డింగ్ తేదీకి నేను రేడియో స్టేషన్ కెళ్ళాను. సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు ‘లైవ్’ ప్రోగ్రాం. యథాతథంగా ప్రసారం. నాకూ భయం భయంగా వుంది. 10 నిమిషాలు గిట్టించాను. స్టూడియో గదిలోనుండి బయటకి రాగానే ‘బాగా చదివారు’ అన్నారు శ్రీ గోపాల్. అలా అందరినీ మెచ్చుకోవడం ఆకాశవాణి సిబ్బంది అలవాటని తర్వాత తర్వాత తెలిసి వచ్చింది.
శ్రీ గోపాల్ గారి పరిచయాన్ని పురస్కరించుకొని ‘యువవాణి’లో నేను స్థాపించిన ‘రచయిత సంఘం – కందుకూరు’ ఆధ్వర్యంలో 30 నిమిషాల కదంబ కార్యక్రమానికి సరిపడే రచనలు పంపాను. ఆయన ఆమోదముద్ర వేసి రికార్డింగ్ కోసం కందుకూరికి కొప్పుల సుబ్బారావు బృందాన్ని 1975 ఆగస్టు నెలలో పంపారు. మిత్రులు బి.వి.వి.హెచ్.బి. ప్రసాదరావు, కరణం సుబ్బారావు, నేను, మరికొందరం అందులో పాల్గొని రికార్డింగ్ చేశాం. తర్వాతి వారం అది ప్రసారమైంది. ఆ విధంగా రేడియోలో నేను చేరకముందే మూడు ప్రోగ్రాంలు చేశాను.
ఇక్కడే ఉంది మలుపు. 1974 ఏప్రిల్‌లో ‘వాణి’లో ప్రొడ్యూసర్ స్పోకెన్ వర్డ్ అనే ఉద్యోగ ప్రకటన చూశాను. రేడియోలో ప్రవేశించాలనే తహతహ వుంది. ‘Through Proper Channel’ అంటారు. మా కళాశాలకు హైదరాబాదులోని డైరక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధిపతి. వారి కార్యాలయం ద్వారా నా అప్లికేషన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర డైరక్టరుకు నిర్ణీత గడువులోపే చేరింది.
1974 పూర్తి అయింది. అప్లికేషన్ పంపి సంవత్సరం పూర్తి అయింది. నేను, ఆకాశవాణి వాళ్ళు ఆ విషయం మరిచిపోయామనుకుంటున్న తరుణంలో 1975 జూన్ నెలలో హైదరాబాద్ కేంద్రం నుండి ఓ ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. జూలై 1 న హైదరాబాదు ఆకాశవాణి డైరక్టర్ కార్యాలయంలో నా విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరు కమ్మని తాఖీదు. ఔరా! మరచిపోయారనుకొన్న విషయం ఇలా పరిణమించింది.
(సశేషం)