Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-10

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]ది 1982వ సంవత్సరం.

అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టు కాలేదనే బాధ, ఏదో సాధించాలనే కసీ నాలో మిగిలిపోయాయి. కడప ఆకాశవాణిలో పనిచేస్తూ ఉన్నాను. ఇంతలో ఒక ప్రకటన వెలువడింది.

కేంద్ర సాహిత్య అకాడమీ: మా గురువర్యులు ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో పనిచేస్తూ ఒక వేసవిలో తిరుపతి సమీపంలో వారి బంధువుల ఇంటికి నడిచి వెళ్తూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ ఖాళీలోకి కేంద్ర సాహిత్య అకాడమీ మదరాసు కార్యాలయంలో ప్రాంతీయ కార్యదర్శిగా డా. చల్లా రాధకృష్ణ శర్మ ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు మద్రాసు రీజినల్ సెక్రటరీ పదవికి దరఖాస్తులు కోరుతూ పత్రికా ప్రకటన హిందూలో ఇచ్చారు. డాక్టరేట్ ఉండాలని కోరారు. నేను మా డైరక్టర్ జనరల్ కార్యాలయం ద్వారా అప్లికేషన్ పంపాను.

1982 ఫిబ్రవరిలో అనుకుంటాను. మద్రాసులో ఇంటర్వ్యూకి ఆహ్వానం అందింది. నేను ఉత్సాహంగా వెళ్ళాను. అప్పటికే సాహిత్య అకాడమీలో పనిచేస్తున్న డి. సుబ్బారావు, కృష్ణమూర్తి తదితరులు 30 మంది దాకా ప్రాంతీయ కార్యాలయంలో ఇంటర్వ్యూకి  హాజరయ్యారు. సాయంకాలం 3 గంటల ప్రాంతంలో నా ఇంటర్వ్యూ మొదలైంది.

ఇంటర్వ్యూ బోర్డులో హేమాహేమీలున్నారని తర్వాత తెలిసింది. సాహిత్య అకాడమీ అధ్యక్షులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత – డా. ఉమాశంకర్ జోషీ ఇంటర్వ్యూ బోర్డు అధ్యక్షులు. ఉపాధ్యక్షులైన ఆచార్య వి.కె. గోకక్, ఆచార్య కె.ఆర్. శ్రీనివాస అయ్యంగార్ సభ్యులు. అకాడమీ కార్యదర్శి ఆర్. యస్. కేల్కర్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

40 నిముషాల సేపు నన్ను వివిధాంశాలపై ప్రశ్నించారు. “ఆకాశవాణిలో మంచి ఉద్యోగం వదులుకుని ఎందుకు వస్తున్నార”ని అధ్యక్షులు సూటిగా ప్రశ్నించారు. యు.పి.యస్.సి.లో  నేను సెలెక్ట్ కాలేదని, ఈ ఉద్యోగం స్కేల్ మా స్టేషన్ డైరక్టర్ స్కేలు సమానమైన రూ.1100/- బేసిక్ అనీ, రేడియోలో ప్రోత్సాహం లేదని ఖండితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను.

“అకాడమీ కార్యకలాపాలు దక్షిణాదిన ఎలా ప్రాచుర్యానికి తెస్తార”ని శ్రీనివాస అయ్యంగార్ అడిగారు.

“బెజవాడ గోపాలరెడ్డి గారు నాకు పరిచితులనీ, నాకు తమిళం మాట్లాడడం వచ్చుననీ, ఆకాశవాణి పరిచయాలతో సంస్థ ప్రగతికి కృషి చేస్తాన”నీ హామీ ఇచ్చాను.

కార్యదర్శి కేల్కర్ సూటిగా ప్రశ్నించారు.

“ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే రిలీవ్ కావడానికి ఎంత కాలం పడుతుంది?” అని.

“బహుశా రెండు నెలలు పడుతుంది. మీరు చొరవ చూపితే నాకు త్వరగా లీన్ (lean) వస్తుంద”నీ చెప్పాను.

“మీ డైరక్టర్ యం. యన్. రాయ్ చౌధరి నాకు తెలుసు. త్వరలోనే ఈ ఆర్డర్లు తెప్పిస్తాను లెండి” అని కేల్కర్ హామీ ఇచ్చారు.

ఇంటర్య్వూ పూర్తయ్యింది.

ఆ సాయంకాలం ట్రిప్లికేన్‍లోని పార్థసారథి కోవెలకు వెళ్ళాను. పక్కనే కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ ఇల్లు అని తెలిసింది. బెరుగ్గా వెళ్ళి వారిని కలిశాను. ఆయన సౌమ్యమూర్తి.

“We have selected you. Be prepared” అన్నారు.

కడపకు వెళ్ళిపోయాను.

నెలరోజుల్లో మదరాసుకు పోస్టింగు ఇస్తున్నట్టు అకాడమీ నుండి ఉత్తర్వులు వచ్చాయి. మదరాసు వెళ్ళి అద్దె ఇల్లు మాట్లాడుకుని వచ్చాను.

నాకు ‘లీన్’ కోసం మా డైరక్టర్ జనరల్ కార్యాలయానికి లెటర్ పెట్టాను. కేల్కర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్డర్లు వచ్చేలా చూశారు. ఏప్రిల్ నెలలో ఆర్డర్లు వచ్చాయి. అందులో ఒక క్లాజు పెట్టారు.

సంవత్సరం పాటు లీన్ ఇస్తూ, నా తరఫు నుండి ‘పెన్షన్ కాంట్రిబ్యూషన్’ కట్టాలని షరతు పెట్టారు. అంటే దాదాపు నెల నెలా నేను 250 రూపాయలు కట్టాలి. సంవత్సరం తర్వాత నేను చేరదలచుకుంటే తిరిగి ఆకాశవాణిలో చేరవచ్చు. నేను సందిగ్ధంలో పడ్డాను. గోపాలరెడ్డి గారిని నెల్లూరులో సుదర్శన్‌మహల్‌లో కలిశాను. “అకాడమీలో పుస్తకాలు అమ్ముకొనే ఉద్యోగం గదయ్యా! ఆకాశవాణిలోనే ఉండిపో” అని చెప్పారు.

మా నాన్నగారి షష్టిపూర్తి: వేసవి సెలవల్లో 1982 మే 27 న మా స్వగ్రామం చెన్నూరులో నాన్నగారి షష్టిపూర్తి మహోత్సవాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిపాము. మా పెదనాన్న కుమారుడు సీతారామారావుకు, మా మేనమామ కుమార్తె రుక్మిణితో వివాహం కూడా అందులో భాగంగా జరిపాము. భక్తిశ్రద్ధలతో ఆ కార్యక్రమం జరిపానని నా నమ్మకం.

ఆ సందర్భంగా ‘శారదా మంజీరాలు’ అనే పేర షష్టిపూర్తి సంచిక వేశాను. మా తల్లిగారి పేరు శారదాంబ. ఆ సంచికకు కేంద్ర హోం శాఖ మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్, ఎక్సైజ్ శాఖా మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, చేనేత శాఖ మంత్రి అగిశం వీరప్ప, పార్లమెంటు సభ్యులు డి. కామాక్షయ్య, వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య యం.వి. రామశర్మ, బెజవాడ గోపాలరెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, పి. పార్థసారథి, డా. పి. యల్. సంజీవరెడ్డి, డా. ఇలపావులూరి పాండురంగారావు సందేశాలు విశేషంగా పంపారు. పైడిపాటి సుబ్బరామశాస్త్రి, దాశరథి, పోతుకూచి సాంబశివరావు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, వి.వి.యల్. నరసింహారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, యస్. రాజన్న కవి, డా. సి. నారాయణ రెడ్డి, డా. సి. వి. సుబ్బన్న శతావధాని, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, బి.వి.వి. ప్రసాదరావు, ములుమూడి లక్ష్మీనరసింహం గారలు పద్య కుసుమాంజలి సమర్పించారు.

విచిత్రం: వేసవి సెలవలు నేను మా స్వగ్రామంలో గడుపుతుండగా మా పోస్ట్‌మ్యాన్ ఒక రిజిస్టర్డు లెటర్ తెచ్చి యిచ్చాడు. అందులో సారాంశం – “గతంలో మేము మీరు అసిస్టెంట్ డైరక్టర్‌గా సెలెక్టు కాలేదని తెలియజేశాం. పునఃపరిశీలనానంతరం మిమ్ములను ఆ పదవికి ఎంపిక చేశామని” యు.పి.యస్.సి. వారు కడపకి పంపిన టెలిగ్రాంను మా ఆకాశవాణి వారు నాకు పంపారు.

తర్వాత విచారిస్తే తెలిసిన అంశం – యు.పి.యస్.సి. – చరిత్రలోనే తొలిసారిగా అలా జరిగింది. రిగ్రెట్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్షన్ జరగడం ఆరో వింత. వివరాలలోకి వెళితే మా ఇంటర్వ్యూల హంగామా పూర్తి అయిన నెలలోనే ఆకాశవాణి వారు మరో 15 అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు పదవులు ఖాళీ ఉన్నాయని, ఇంటర్వ్యూలు జరపమని యు.పి.యస్.సి. కి పంపారు. సెలెక్షన్ ప్యానల్‌లో వున్న మరో 15 మందికి నాతో బాటు అలా సెలెక్షన్ వచ్చింది.

కిం కర్తవ్యం: ఇప్పుడు నాకు ఓ పెద్ద ప్రశ్న వచ్చింది – మదరాసు వెళ్ళి సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శిగా చేరాలా? లేక జీతం తక్కువ అయినా  (రూ. 900/- బేసిక్) ఆకాశవాణిలో ప్రమోషన్ తీసుకోవాలా? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.

విజయవాడ కేంద్ర డైరెక్టర్ పి. శ్రీనివాసన్ గారిని హైదరాబాదులో కోఆర్డినేషన్‍ మీటింగులో కలసినప్పుడు అడిగాను.

“మీరు బయటకి వెళ్ళి రెండేళ్ళ తర్వాత ఆకాశవాణికి వచ్చి చేరే బదులు ఇందులోనే ప్రమోషన్ తీసుకోండి” అని సలహా ఇచ్చారు.

“అదేమో రూ.1100/- బేసిక్. మా స్టేషన్ డైరక్టర్ స్కేలు. నాకు మరో ఐదేళ్ళకు గానీ ఆ పోస్టు రాదు. కిం కర్తవ్యం?”

ధైర్యం చేసి సాహిత్య అకాడమీ వారికి సున్నితంగా వ్రాశాను ‘నేను చేరడం లేదు’ అని. వారు మరుసటి నెలలోనే ప్రకటన ఇచ్చారు. మా మిత్రులు పి. యస్. గోపాలకృష్ణ సెలెక్టు అయ్యారు. ఆయన రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఆకాశవాణి పంచకు చేరారు.

ఆకాశవాణి వారు నాకు పోస్టింగ్ ఇవ్వాలి. హైదరాబాదులో స్టేషన్ డైరక్టర్‌గా యస్. రాజారాం ఉన్నారు. ఆయన కడపకు వచ్చారు. “నేను హైదరాబాద్ వస్తాను సార్!” అన్నాను.

“డైరక్టరేట్ ఏం చేస్తుందో చూద్దా”మన్నారు. హైదరాబాదులో అప్పటికే కేరళీయుడు యం.కె. శివశంకరన్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో ఖాళీ కూడా ఉంది.

కడపలో ప్రమోషన్ తీసుకోవడం నాకిష్టం లేదు. కడప పార్లమెంటు సభ్యులు యం.డి. రహంతుల్లా ద్వారా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు ఉత్తరం పంపాము – ‘పద్మనాభరావు మంచి ఆఫీసరు. కడపలోనే ఉంచండి’ అని.

నేను కడప అడిగితే డైరక్టరేటువారు మరో ఊరు తప్పనిసరిగా ఇస్తారని నా నమ్మకం. నా నమ్మకం వృథా పోలేదు.

1982 సెప్టెంబర్ నెలాఖరులో నన్ను ఆకాశవాణి హైదరబాదు కేంద్రంలో రెండో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా నియమిస్తూ ఆర్డర్లు వచ్చాయి.

శుభం భూయాత్.

Exit mobile version