ఆకాశవాణి పరిమళాలు-11

    0
    5

    [box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

    భాగ్యనగర ప్రవేశం:

    1982 అక్టోబరు 4న కడప ఆకాశవాణి కేంద్రంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ప్రొడ్యూసర్‌గా నేను కాలిడి ఆకాశవాణిలో ‘అ – ఆ’లు నేర్చుకొన్నాను. వీడ్కోలు సమావేశంలో మిత్రుడు ఆరవేటి శ్రీనివాసులు ఇలా అన్నాడు: ‘అ – అంటే అనంత పద్మనాభరావు; ఆ-అంటే ఆకాశవాణిగా చెప్పవచ్చు’. కడప మిత్రులందరూ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. అక్టోబరు 5న భాగ్యనగరంలో అడుగుపెట్టాను – ఉద్యోగరీత్యా. అది మొదలు నేటి వరకు ఈ నగరం నన్ను అక్కున చేర్చుకొంది.

    అసెంబ్లీ కెదురుగా పాత భవనాలలో ఆకాశవాణి వుంది. అక్కడికెళ్ళి స్టేషన్ డైరక్టర్, మృదు స్వభావి అయిన యస్. రాజారాం గారికి రిపోర్టు చేశాను. ప్రతిరోజూ 11 గంటలకు జరిగే ప్రోగ్రామ్ మీటింగ్‌లో డైరక్టరు నన్ను ఇతర అధికారులకు పరిచయం చేశారు. చాలామంది నాకు పూర్వపరిచితులే. ఆకాశవాణి అన్ని కేంద్రాలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ప్రోగ్రామ్ మీటింగ్ తప్పనిసరిగా జరుగుతుంది. స్టేషన్ డైరక్టర్ పర్యవేక్షణలో కార్యక్రమ నిర్వహణాధికారులందరూ పాల్గొంటారు. ఒక సీనియర్ అధికారిని ప్రోగ్రామ్ ఆఫీసర్ – కోఆర్డినేషన్ (సమన్వయం)గా పిలుస్తారు.

    ఆ మీటింగులో నిన్నటి కార్యక్రమాలు ఏం జరిగాయో ఎలా జరిగాయో, పొరపాట్లు, విద్యుచ్ఛక్తి అంతరాయాలు అన్నీ డ్యూటీ ఆఫీసర్ ఆ రోజు ‘క్యూ షీట్’లో వ్రాస్తారు. ప్రసంగం చేసిన వ్యక్తుల సంభాషణా శైలికి గ్రేడింగు ఇస్తారు. బి, బి హై, ఏ – గ్రేడ్‌లు ఇస్తారు. బాగా చదివిన వారికి ‘ఏ’ గ్రేడు లభిస్తుంది.

    అప్పట్లో దాదాపు 14 మంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. డైరక్టరుతో బాటు ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్లు – యం.కె. శివ శంకరన్ (కేరళ), నేనూ – పని చేస్తున్నాము. నాకు ముందు పని చేస్తున్న శివశంకరన్ పక్కనే వున్న రూమ్ కేటాయించారు. చాలా రోజులుగా రెండో అసిస్టెంట్ డైరక్టర్ పోస్టు ఖాళీ. నాకు బ్యారక్స్‌లో ఉన్న ఒక రూమ్ కేటాయించారు. కడపలో వంటగదిలో నుంచి బ్యారక్స్‌లోకి మారాను.

    విధుల కేటాయింపు:

    ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్లకు బాధ్యతల కేటాయింపు సాధారణంగా డైరక్టర్ ఒక ఆదేశం ద్వారా చేస్తారు. కానీ రాజారాం గారు ‘మీరు ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఒక కాగితం మీద వ్రాసి పట్టుకురండి’ – అన్నారు. శివశంకరన్ నాకన్నా బాగా సీనియర్. తెలుగు ప్రసంగ శాఖ, వ్యవసాయ, కార్మిక, మహిళా, నాటక విభాగాలు నన్ను పర్యవేక్షించమన్నారు. మేం చర్చించుకొన్న విషయాలు యథాతథంగా రాజారాం ఆమోదించారు.

    అప్పట్లో హేమాహేమీలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లుగా హైదరాబాదులో చిరకాలంగా పనిచేస్తున్నారు. వారిలో ప్రధానంగా వి.వి.శాస్త్రి, యస్. పి. గోవర్ధన్, ఏ.వి.రావ్ చౌదరి, రావూరి భరద్వాజ (ప్రొడ్యూసర్), కె.వి. సుబ్బారావు (వ్యవసాయం), టి.ఆర్.జి. కృష్ణకుమారి, యస్.సి. నరసింహాచార్యులు, తురగా జానకీరాణి, సునందినీ ఐపీ, మొదలి అరుణాచలం, హెచ్. హనుమంతరావు.

    వీరంతా దాదాపు పది సంవత్సరాలు తమ క్యాడర్‌లలో పని చేస్తున్నారు. క్రింది క్యాడర్ అయినా డ్యూటీ ఆఫీసర్లుగా పది సంవత్సరాలు పని చేశారు. వయసులోనూ, అనుభవంలోనూ, లౌక్యంలోనూ నాకంటే సీనియర్లు. వీరిని కలుపుకొని ముందుకు నడవడం నా బాధ్యత.

    అసిఫ్‌నగర్ సమీపంలోని దత్తాత్రేయ కాలనీలో అద్దె ఇంట్లో చేరాము. కాపురం, మా పుస్తకాల కట్టలు ఇంటికి చేరుకొన్నాయి. మా ముగ్గురు పిల్లల్ని విజయనగర్ కాలనీలోని ‘లయోలా స్కూల్’లో చేర్చాము. అమ్మాయి (11), అబ్బాయి (9), అబ్బాయి (7) వయస్సుల్లో ఉన్నారు.

    క్రమంగా ఆఫీసు అజమాయిషీ అలవాటు పడింది. తెలంగాణలోని పలువురు కవిపండితులు, రాజకీయ నాయకులు, అధికారులు రికార్డింగుకు వచ్చేవారు. వారిని సాదరంగా ఆహ్వానించి రికార్డు చేయించి పంపేవాళ్ళం. 1982 చివర్లో సాధారణ ఎన్నికలు ప్రకటించారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రసంగాలను రికార్డు చేసే గురుతర బాధ్యత హైదరాబాదు కేంద్రంపై పడింది. శివశంకరన్ (ఎ.ఎస్.డి) మలయాళీ. ఆయనకు తెలుగు చదవడం రాకపోవడం వల్ల ప్రసంగ పాఠాలు సరిచూసే బాధ్యత రావూరి భరద్వాజకు, నాకు పడింది. కాంగ్రెస్, కాంగ్రెసేతర పార్టీల నాయకులంతా ముందుగా ప్రసంగ పాఠాలు పంపేవారు. వాటిని మాతో బాటు కొందరు ప్రముఖ వ్యక్తుల కమిటీ ఆమోదించేది. ఏవైనా అభ్యంతరకర వ్యాఖ్యలుంటే వాటిని తొలగింపజేసే బాధ్యత లౌక్యమెరిగిన భరధ్వాజ భుజస్కందాలపై పెట్టాము. ‘బావా!’, ‘మామా!’ అంటూ ఆయన వాటిని పెన్సిల్‌తో కొట్టి వేసేవాడు. ఎవరూ పెద్దగా అడ్డు పడలేదు.

    ఎన్నికల ఫలితాలు:

    ఎన్నికల ఫలితాలు ఆకాశవాణి వార్తా విభాగం వారు తమకు ఎన్నికల అధికారి నుండి అందిన వివరాల ఆధారంగా సాయంకాలం వరకు ప్రకటించారు. నగరంలో ఒక నియోజక వర్గం నుండి బి.జె.పి. అభ్యర్థి అత్యథిక ఓట్లు సంపాదించారు. కాని, కొన్ని సాంకేతిక అభ్యంతరాల కారణంగా రాష్ట్ర ఎన్నికల ఆఫీసరు తుది ఫలితం ప్రకటించలేదు. తదనుగుణంగా ఆకాశవాణి వార్తలలో ఆ ఫలితం వెలువడలేదు. అది సాయంకాలం ఐదు గంటలు. నేను నా గదిలో, స్టేషన్ డైరక్టర్ పక్క రూమ్‍లో కూర్చుని ఉన్నాము.

    బి.జె.పి. అభ్యర్థితో పాటు ఆయన అనుచరులు నలుగురు ఉద్రేకంగా నా రూమ్ లోకి వచ్చారు. ఎన్నికల ఫలితాల ప్రస్తావన తెచ్చారు. ‘డైరక్టర్ గారితో మాట్లాడుదాం రండి!’ అని రాజారాం గదిలోకి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. బి.జె.పి. అభ్యర్థి దూషణ పూర్వకంగా మాట్లాడుతూ – ‘మీరు కాంగ్రెస్ తొత్తులు’ అన్నాడు. ‘న్యూస్ రూమ్‌ కెళదాం రండి’ అని ఆయన వాళ్ళను న్యూస్ రూమ్‌కి తీసుకెళ్ళారు.

    నర్రావూరు సుబ్బారావు అప్పుడు రీజనల్ న్యూస్ ఎడిటర్. నిరంతరం చేతిలో చుట్ట ప్రత్యక్ష్యం. రాజారాం ఆయనకు విషయం వివరించారు. అనవసరంగా కోపంతో బి.జె.పి. అభ్యర్థి స్టేషన్ డైరక్టర్ చెంప మీద దెబ్బ వేశాడు. అందరం నివ్వెరపోయాము. వెంటనే ఎవరో డి.జి.పి. ఆనంద్‌రామ్‌కి ఫోన్ చేశారు. బి.జె.పి. వారు వడివడిగా వెళ్ళిపోయారు. అది జనవరి మొదటి వారం.

    దాదాపు 33 సంవత్సరాలు అకుంఠిత దీక్షా దక్షతలతో పని చేసిన ఆయనకు అలా జరిగినందుకు అందరం బాధ పడ్డాం. ఆయన నిగ్రహంతో వున్నారు. మర్నాడు ఉదయం మదరాసులోని కళాక్షేత్రం డైరక్టరు రుక్మిణీదేవి అరండేల్ రాజారాంకు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రాజారాం మీద ఆమెకు వాత్సల్యం. జనవరి 31న రాజారాం పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం రాజారాం కళాక్షేత్రం ప్రిన్సిపాల్‌గా ఐదారేళ్ళు పనిచేశారు.

    కొత్త ముఖ్యమంత్రి:

    జనవరి మొదటి వారంలో రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతనాధ్యాయానికి తెర లేచింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. జనవరి 9వ తేదీన లాల్‌బహాదూర్ స్టేడియంలో వైభవోపేతంగా జరిగిన మహా సభలో ముఖ్యమంత్రిగా యన్.టి.రామారావు తొమ్మిది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రివర్గంలో కడపలో నాకు బాగా పరిచితులైన యస్. రామమునిరెడ్డి ఆరోగ్య శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కడపలో ఆకాశవాణి మిత్రులలో కలసి ‘షటిల్’ ఆడేవారు.

    ప్రమాణస్వీకారం ముగియగానే నేరుగా ముఖ్యమంత్రి తమ సందేశం రికార్డు చేయడానికి సకల రాజ లాంఛనాలతో ఆకాశవాణి స్టూడియోకు వచ్చారు. ముందుగా ప్రసంగపాఠం పంపడం ఆనవాయితీ. వారి ఆఫీసుకు ఫోన్ చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి తెస్తున్నారని సమాధానం వచ్చింది.

    ముఖ్యమంత్రి కార్యదర్శిగా అప్పుడే చేరిన మోహన్ కందా వెంటరాగా రామారావు స్టూడియోకు వచ్చారు. డైరక్టరు రాజారాం, నేను, ఇతర అధికారులు వారిని సాదరంగా స్వాగతించి స్టూడియోలోకి తీసుకెళ్ళాం. ‘ప్రసంగ పాఠం సార్’ అంటూ మోహన్ గారిని అడిగాం. “ఆయన చేతిలో వుంది. రికార్డింగ్ మొదలెట్టండి” అన్నారు.

    మేఘ గంభీర స్వరంతో రామారావు ‘వాయిస్ టెస్ట్’ అన్నారు. ప్రసంగం మొదలుపెట్టారు. “మనకు స్వాతంత్ర్యం వచ్చి 45 సంవత్సరాలైనా మనం సాధించింది ఏముంది?” అని ప్రసంగం మొదలుపెట్టారు. నాలుగు వాక్యాలు పూర్తయిన తర్వాత ‘కట్ కట్’ అన్నారు సినీ ఫక్కీలో. ఒక్కో పేరా ఐదారుసార్లు చదివారు.

    తొలిసారి ‘కట్’ అనగానే నేను, రాజారాం రికార్డింగ్ రూమ్‌లోకి వెళ్ళి మోహన్ కందా చెవిలో “తొలి వాక్యం కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించినట్లు అర్థం వస్తుంది. మార్చాలి” అన్నాం. ఆ మాటలు కర్ణాకర్ణిగా విన్న రామారావు ‘ఎందుకు మార్చాలి?’ అన్నారు బిగ్గరగా.

    “‘మనకు స్వాతంత్ర్యం వచ్చి 45 సంవత్సరాలైనా మనం సాధించవలసింది ఇంకా ఎంతో వుంది’ అని చెప్పండి సార్!” అన్నాను. మోహన్ కందా సర్దుబాటు ధోరణిలో ‘వారి ఇబ్బందులు వారికుంటాయి సార్!’ అన్నారు.

    “సరే బ్రదర్! ఒప్పుకుంటున్నాం. ఇంక మరే వాక్యమూ మార్చబోం” అన్నారు సుయోధన వాగ్ధోరణిలో.

    పేరా, పేరా ఐదారుసార్లు చదువుతూ, ఓ నలభై నిముషాల రికార్డింగ్ చేశారు. దాని ఎడిటింగ్ పూర్తి చేసి 14 నిముషాల ప్రసంగాన్ని ఆ రాత్రి ఆంధ్రదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి.

    1983 జనవరి 31న రాజారాం రిటైరయ్యారు.

    ఆయన స్థానంలో మూడు, నాలుగు నెలలు మరెవర్నీ బదిలీ చేయలేదు. శివశంకరన్ నాకంటే సీనియర్. ఆయన ప్రోగ్రామ్ హెడ్‌గా, సూపరిండెంట్ ఇంజనీరు టి.యన్.జి. దాస్ స్టేషన్ హెడ్‌గా యంత్రాంగం కొనసాగుతోంది. తెలుగు భాష తెలిసినవాడిని నేనే కావడం వల్ల అధికభారం నాపై పడింది.

    (సశేషం).

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here