Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-12

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

1983:

[dropcap style=”circle”]స్టే[/dropcap]షన్ డైరక్టర్ ఎవరూ లేరు. నేను – శివశంకర్ బండిని నడిపిస్తున్నాం. ఇతర కేంద్రాలతో సమన్వయం, కార్యక్రమ రూపకల్పన సజావుగా సాగిపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వం రామారావు నాయకత్వంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొంది. రూపాయకు కిలో బియ్యం పథకానికి ప్రమాణ స్వీకారం కాగానే శ్రీకారం చుట్టారు. గ్రామాధికారుల వ్యవస్థను రూపుమాపు చేశారు.

యన్.జి.ఓ.ల సమ్మె:

యన్.జి.ఓ.లు సుదీర్ఘ కాలం సమ్మె చేశారు. ముఖ్యమంత్రి ఆ సమ్మెను కాంగ్రెసు పార్టీ వారు ప్రోత్సహిస్తున్నారని ఒక రేడియో సందేశంలో ప్రకటించారు. యన్.జి.ఓ.లు సమ్మె విరమించి ఉద్యోగాలలో చేరాలని కోరారు. ఆ మరుసటి రోజు కాంగ్రెస్ నాయకులు గోవర్ధన రెడ్డి నాయకత్వంలో ఆకాశవాణికి వచ్చి తమ ప్రసంగం రికార్డు చేయాలని బలవంత పెట్టారు. ‘ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే అలా సందేశం రికార్డు చేసే అవకాశం వుందనీ, మీ ప్రకటనలు వార్తలలో ప్రసారం చేస్తామ’నీ చెప్పాను. లేదా ‘కేంద్రంలో మీ ప్రభుత్వమే గాబట్టి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చేలా చూడమ’ని నిర్ద్వందంగా చెప్పాను. వారు ఢిల్లీకి ఫోన్లు చేశారు గాని, సానుకూలం కాలేదు.

అది జరిగిన రోజు రాత్రి పది గంటలకు మా స్టేషన్ ఇంజనీరు దాస్ గారు నాకు ఫోన్ చేశారు. “రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం పది గంటలకు స్టూడియోకి వస్తారు. సమ్మె విరమించమని కోరుతారు. సమాచార శాఖ జాయింట్ డైరక్టరు సి.వి. నరసింహారెడ్డి ఫోన్ చేశారు” అన్నారు. నేను వెంటనే ఢిల్లీలోని ఆకాశవాణి డైరక్టర్ ఆఫ్ పాలసీ కేశవ్‌పాండేకు ఫోన్ చేశాను. కాంగ్రెస్ వారి వాదన కూడా వివరించాను.

“రేపు ఉదయం 10 గంటలలోపు మీకు ఏ విషయం చెబుతాను” అన్నారు కేశవ్‌పాండే.

నేను, టి.యస్.జి. దాస్ ఉదయం 10 గంటలలోపు ముఖ్యమంత్రిని స్వాగతించడానికి స్టూడియోకి వెళ్ళాము. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. “సమ్మె మూలంగా సి.యం. మీ స్టూడియోకు శాంతిభద్రతల మూలంగా రాలేరు. మీరే రికార్డింగ్ యూనిట్‌తో సెక్రటేరియట్‌కు రండి!” అని సారాంశం. అప్పటికే 11 గంటలైంది.

డైరక్టరేట్ సీను:

అది సోమవారం. ఆఫీసు వేళ 10 గంటలు. కేశవ్‌పాండే తన రూమ్‌లో కూర్చుని ఉన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన డిప్యూటీ డైరక్టర్ జనరల్ యం.డి. గైక్వాడ్ తన గదిలోకి వెళుతూ, సాదరంగా ఆయనను పలకరించడానికి లోపలికి అడుగుపెట్టారు. అదే సమయంలో నేను కేశవ్‌పాండేకి ఫోన్ చేసి ఆదేశాలు కోరాను.

నేను ఫోన్‍లొమాట్లాడుతున్న సమయంలోనే యాదృచ్ఛికంగా డైరక్టర్ జనరల్ పాండే రూమ్‌లోకి తొంగి చూశారు. వినడానికి కథలా ఉన్నా జరిగింది వాస్తవం.

నాతో మాట్లాడుతున్న కేశవ్‌పాండే తన చేతిలోని ఫోను డైరక్టర్ జనరల్ కిచ్చి ఆర్డర్లు ఇవ్వమన్నారు.

“I am DG speaking. Do not record on” అన్నారు.

నాకు కాళ్ళు, చేతులు వణికాయి.

“సరిగా వినబడడం లేదు సార్!” అన్నాను. మళ్ళీ బిగ్గరగా ఆ వాక్యాలు పలికారు.

నేను వెంటనే న్యూస్‌రూమ్‌కి వెళ్ళాను. అప్పట్లో ‘టెలెక్స్’ సౌకర్యం వుండేది. ‘డైరక్టర్ జనరల్ ఆదేశించినట్టు సిం.యం. రికార్డింగ్ చేయడం లేదు’ అని టెలెక్స్ పంపాను. దాని కాపీ నా వద్ద వుంచుకొన్నాను.

నాటకీయ పరిణామాలు:

ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయమని మా ఇంజనీరు దాస్‌తో చెప్పాను. సెక్రటేరియట్ ముందు యన్.జి.ఓ.ల సమ్మె ఉధృతంగా వున్నందున రికార్డింగ్ యూనిట్ సెక్రటేరియట్‌కు రాలేదని చెప్పారు.

10 నిముషాలలో సమాచార డైరక్టరు శ్రీమతి ఎ. వనజాక్షి వచ్చారు. ఆగ్రహోదగ్రురాలు అయ్యారు. ఆ రోజు ఉదయమే పత్రికలన్నింటిలో ముఖ్యమంత్రి రాత్రి 8 గంటలకు ఆకాశవాణి నుండి సమ్మె గురించి ప్రసంగిస్తారని ఒక అడ్వర్టయిజ్‌‍మెంట్ కూడా ఇచ్చారు. మీరు క్షేమంగా రావడానికి పోలీసు బందోబస్తు ఇస్తామని, రాకపోతే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ  హెచ్చరించారు.

సమాచార శాఖ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్వయంగా నాతో ఫోన్‌లో మాట్లాడి సెక్రటేరియట్‌కు వచ్చి రికార్డు చేయించమని సున్నితంగా చెప్పారు. పరిస్థితి విషమించే దశకు వచ్చింది.

టి.యస్.జి. దాస్ రూంలో కెళ్ళాను. “మీరు హెడ్ ఆఫీసు. మీరే సి.యం. సెక్రటరీకి ఫోన్ చేసి ‘రాలేం’ అని చెప్పమన్నాను.

ఆయన ఫోన్‌లో ఆ మాటలే చెప్పారు.

సెక్రటేరియట్‌లో:

ముఖ్యమంత్రి సహజంగా కోపగించారు. ఉన్నతాధికారులతో సంప్రదించారు, పార్టీ నాయకులతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రికి జరిగిన ఘోర అవమానంగా భావించి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీకి సుదీర్ఘమైన నిరసన టెలెక్స్ ద్వారా తెలియజేశారు. అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఆమె దృష్టికి ఆ విషయం వచ్చింది.

ఆమె వెంటనే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి హెచ్.కె.ఎల్. భగత్‌ను సంజాయిషీ కోరింది. ఆయన సెక్రటరీ ‘గిల్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘వెంటనే వెళ్ళి యన్.టి.రామారావును రికార్డు చేయండి’ అని ఆదేశించారు. నేను ఉరుకులు, పరుగుల మీద ఆటోలో ఆఫీస్ కెళ్ళాను.

న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు చేత సి.యం. ఇంటికి ఫోన్ చేయించాను. “పది నిమిషాల్లో రికార్డింగ్ యూనిట్ మీ అబిడ్స్ ఇంటికి వస్తుంది” అని చెప్పాము.

“సి.యం. విశ్రాంతి తీసుకొంటున్నారు. ఇప్పుడు రికార్డింగ్ కుదరదు” అని సమాధానం వచ్చింది.

వెంటనే ఆ విషయం నేను డి.జి.కి ఫోన్‌లో చెప్పాను.

“అయితే రాత్రి 8 గంటల సమయంలో ప్రసారం చేయలేకపోతున్నామనీ, ముఖ్యమంత్రి అంగీకరించకపోవడమే కారణమని ప్రకటించండి” అని డి.జి. సమాధానమిచ్చారు.

“అది మరీ ప్రమాదం సార్! 8 గంటలకు ప్రసారం చేస్తున్నామని ప్రసార విశేషాలలో చెప్పలేదు. అందువల్ల ఏ ప్రకటన అవసరం లేదు” అన్నాను.

“సరే” అని ఫోన్ పెట్టేశారు.

మర్నాడు ఉదయం అన్ని దినపత్రికలలో పతాక శీర్షికలలో ‘ముఖ్యమంత్రి సందేశాన్ని నిరాకరించిన ఆకాశవాణి’ అన్న వార్త వచ్చింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ప్రసార మాధ్యమాలలో చర్చ సుదీర్ఘంగా కొనసాగింది. పార్లమెంటు ఉభయసభలలో ప్రశ్నలు సంధించారు. రాజ్యసభలో పర్వతనేని ఉపేంద్ర సంధించిన ప్రశ్న ‘starred question’ అయ్యింది.

పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు:

ఈ విషయమై లోక్‌సభలో చర్చ నాలుగు గంటలు కొనసాగింది. సమాధానం తయారు చేసేందుకు నన్ను ఢిల్లీ హుటాహుటిన రమ్మని ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ విమానం టికెట్లు కొన్నాను. తెల్లవారి వెళ్ళాలి. కాని ఢిల్లీలో ఒక పెద్ద ఆఫీసరు ‘మీరు రావద్ద’ని రాత్రి 12 గంటలప్పుడు మిత్రుడు ఏ.వి.రావ్ చౌదరి ద్వారా ఫోన్‌లో కబురు పంపారు. అంతర్గతగా ఆకాశవాణిలో జరుగుతున్న కుమ్ములాటకి అది నిదర్శనం.

లోక్‌సభలో సమాచార ప్రసారశాఖ మంత్రి హెచ్.క్.ఎల్. భగత్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. హైదరాబాదులో సమ్మె కారణంగా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రసారం చేయలేకపోయామన్నారు. ప్రతిపక్షాల వారు విరుచుకుపడ్డారు.

రాజ్యసభలో ఉపేంద్ర సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విస్పష్ట ప్రకటన చేశారు.

“రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నిసార్లయినా ప్రసారం చేయవచ్చుననే ఆదేశాలు అమలులో ఉన్నాయ”ని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకొన్న అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌పై తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు.

వెంటనే కమ్యూనిస్టు పార్టీ నాయకుడు లేచి – “ఉద్యోగిని శిక్షించడం సమంజసం కాదు” అని ఖండించారు.

ఈ తతంగం జరిగిన కొద్ది రోజుల్లో నన్ను ఈశాన్య ప్రాంతాలకు మారుస్తారేమోననే భయం వెంటాడింది.

కొద్ది రోజుల తర్వాత కేంద్ర సమాచార సెక్రటరీ గిల్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. నేను నమస్కరించగానే – “అది మీ పొరపాటు కాదు” అని సున్నితంగా చెప్పారు.

ఆ విధంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఉదంతం తర్వాత ఆకాశవాణిలో నన్ను ‘హీరో’ లా చూడసాగారు.

వెంటనే డైరక్టరేట్ నుండి కేశవ్‌పాండేను హైదరాబాద్ కేంద్ర డైరక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన చాలా సీనియరు. జూన్ నెలలో వచ్చారు. అక్టోబర్ 31న ప్రమోషన్ మీద దూరదర్శన్‌లో డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా వెళ్ళిపోయారు. లీలా బవడేకర్ అనే  మహిళను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. కొత్త అధ్యాయం ప్రారంభం.

(సశేషం).

Exit mobile version