Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-14

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

వాణిజ్య ప్రసారాలు:

[dropcap]నే[/dropcap]ను 1985 జనవరి 31న వాణిజ్య ప్రసార విభాగం (సిబిఎస్) అధిపతిగా హైదరాబాదులో చేరాను. సినీ సంగీతంతో శ్రోతల్ని అలరించే కార్యక్రమమది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మధ్యాహ్నం 11 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు అనేక కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ప్రకటనల ద్వారా మేం రెవెన్యూ సంపాదించేవాళ్ళం.

మేము నేరుగా ప్రకటనలు స్వీకరించం. కొంతమంది వ్యక్తులకు లైసెన్సు వంటివి ఇచ్చేవారం. వారిలో మూడు రకాలు. మొదటి వర్గం రిజిస్టర్డు. రెండవది రికజ్నైడ్. మూడవది అక్రిడిటెడ్. ఈ మూడో వర్గం వారి నుంచి ముందుగా ప్రకటనల రుసుం వసూలు చేయం. 45 రోజుల లోపు వారు ఆ మొత్తం జమ చేయాలి. నా దగ్గర ముగ్గురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‍లు ఉన్నారు. ఒకరు చల్లా ప్రసాదరావు, రెండవవారు జి.కె. మరార్ (ఈయన తర్వాత దూరదర్శన్‌ డైరక్టర్‍గా రిటైరయ్యారు. మంచి క్రికెట్ కామెంటేటర్. మూడవవారు రామానుజం. ఈయన చిన్నవయసులోనే మరణించారు.

మా ఆఫీసు ఏ.సి. గార్డ్స్ లోని ప్రభుత్వానికి సంబంధించిన అద్దె భవనంలో ఉండేది, శాంతినగర్ సమీపంలో. 1986 చివర్లో ఆకాశవాణి నూతన భవనాలలోకి, అసెంబ్లీకి ఎదురుగా ప్రస్తుత్తం ఉన్న చోటికి మారాము. 1985 మార్చి నెలలో మా అడిషనల్ డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. వారిని మా ఆఫీసుకు రమ్మని కోరాను. ఆయన చేత తరంగ అడ్వర్టయిజర్ సుబ్రహ్మణ్యానికి నా ఆ రోజు నా చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇప్పించాను. ఇప్పుడు సుబ్రహ్మణ్యం బాగా పేరున్న ప్రకటనదారుడు. సినిమాలు కూడా తీశాడు. మాకు కొందరు అక్రిడిటెడ్ ఏజంట్లు ఉన్నారు. వారు 45 రోజులలోపు డబ్బు జమ చేయకుండా ఉండటానికి అలవాటు పడ్డారు. చూసీ చూడనట్లు నాకు ముందున్న ఆఫీసరు సర్దుబాటు ధోరణిలో ఉండేవాడు. ఎక్కువమంది విజయవాడ వారు. నేను వారి విషయంలో నిక్కచ్చిగా ఉన్నాను. వారికది గిట్టక ఏదో పిటీషన్లు పెట్టారు.

ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి అరగంట సేపు ‘జనరంజని’ పాటల కార్యక్రమం ఉండేది. అందులో కొత్తగా విడుదల కాబోయే సినిమా సంఘటలన ఆడియో 15 నిముషాలు స్పాన్సర్ చేసేవారు. అలా రోజుకు రెండు అలాట్ చేసేవాళ్లం. బాగా పాపులరై ఎక్కువ మంది ఆ టైమ్ స్లాట్ కావాలని ఒత్తిడి తెచ్చేవారు. వేరే మార్గం లేక ‘జనరంజని’ని 9 గంటల నుండి 10 గంటల వరకు పొడిగించాం. అలా నలుగురికి అవకాశం లభించింది. ఒక సంవత్సరానికి సరిపడా ముండే కొందరు బుక్ చేసుకున్నారు.

ఈ అరగంట పొడిగింపుకు స్టేషన్ డైరక్టరేట్‍లోని మా వాణిజ్య విభాగ డైరక్టరు అనుమతి కోసం నేను 1986 మార్చిలో టెలిగ్రాం పంపాను. ఉత్తరం కూడా వివరంగా వ్రాశాను. ఆదాయం పెంచుతున్నామన్న ధైర్యంతో ఏప్రిల్ మొదటివారం నుండి అరగంట పొడిగించాం.

తమకు టైమ్ స్లాట్ దొరకని కొందరు అసంతృప్తివాదులు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండియా టుడే (ఇంగ్లీషు) హైదరాబాద్ రిపోర్టరుగా అమర్‌నాథ్ మీనన్‌ ఉండేవారు. ఆయన మా ఆఫీస్‌కి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి – జనరంజని ధనరంజని అయ్యిందని ప్రశంసిస్తూ బాగా వ్రాసారు. అది ఢిల్లీలోని ప్రసార మంత్రిత్వశాఖ డైరక్టర్ యం. కె. రామస్వామి కంటపడింది. ఆయన తమిళుడు. ఆయన నాకు ముందుగా తెలియజేయకుండా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. బహుశా ఇదేదో నా మీద ఎంక్వయిరీకని నా నమ్మకం.

ఆ రోజుకు రెండు రోజుల ముందే బొంబాయిలోని సెంట్రల్ సేల్స్ యూనిట్ డైరక్టరు డి.పి. రామచంద్ర వచ్చి పలువురు ప్రకటనదారులు చేసిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నారు. ఆయన వేసిన మొదటి ప్రశ్న – “డైరక్టరేట్ చెప్పకుండా తొందరపడడం ఎందుకు?” ఎవరు కూడా నా మీద లంచగొండితనం ఆరోపించలేదు. మాకు అవకాశాలు రావడం లేదనేది ఒకటే ఫిర్యాదు.

ఇదే సమయంలో యం. కె. రామస్వామి ఢిల్లీ నుండి వచ్చారు. ముందు రోజు సాయంకాలం హైదరాబాద్ జుబ్లీ హాల్‌లో (అసెంబ్లీ హాల్ పక్కన) ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ పక్షాన ఒక జాతీయ సదస్సు – మత సామరస్యంపై ఏర్పాటు చేశాం. ఆ సంస్థలో ప్రధానపాత్ర పోషిస్తున్న నేను కూడా వేదిక మీద ఉన్నాను. డి.పి. రామచంద్ర (బొంబాయి) కూడా ఆ సభలో ప్రేక్షక స్థానంలో ఉన్నారు. వేదికపై మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, గవర్నర్ కుముద్‌బెన్ జోషి, పోలీసు ఉన్నతాధికారి యం.వి. నారాయణరావు ఆసీనులయ్యారు. సంఘంలో నాకున్న గౌరవాన్ని కళ్లారా చూశారు రామచంద్ర.

మరునాడు ఉదయం యం. కె. రామస్వామి మా ఆఫీసు విజిట్ చేశారు. చేతిలో ఇండియా టుడే పత్రిక ఉంది. “రావ్! మీరు చక్కగా ఆదాయం పెంచారు. ఇదే విధంగా అన్ని వాణిజ్య కేంద్రాలు కొత్త కార్యక్రమాలు చేపట్టాలని మంత్రిత్వశాఖ నుంచి ఆదేశిస్తున్నాం” అంటూ ప్రశంసించారు. రెండు రోజులుగా మా రిజిస్టర్లలో రంధ్రాన్వేషణ కొనసాగించి, ఏమీ పట్టుచిక్కని రామచంద్ర – “ఐ ఆల్సో అగ్రీ సర్” అంటూ రామస్వామితో వంత గలిపారు.

నేను రెండేళ్ళు – 31 జనవరి 1985 నుంచి 30 ఏప్రిల్ 1987 వరకు వాణిజ్య ప్రసార విభాగంలో పనిచేశాను. ఆ కాలంలో ప్రముఖ సినీతారల నందరినీ స్టూడియోకి రప్పించి ఇంటర్వ్యూలు చేశాం. 1987 జనవరి 1 న వివిధ ప్రముఖ తారల సందేశాలు రికార్డు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రసారం చేశాం. అందులో అక్కినేని నాగేశ్వరరావు, జమున వంటి ప్రముఖులున్నారు.

ఈ సందర్భంగా ఒక క్లిష్ట సమస్య వచ్చింది. నెల రోజులలో విడుదల కాబోయే ఒక సినిమా గూర్చి రోజూ అందులో డైలాగులు అరగంట సేపు స్పాన్సర్డ్ కార్యక్రమం కింద ప్రసారం చేసే అగ్రిమెంట్ కుదిరింది. ఏజంట్ ద్వారా ఒక ప్రముఖ కంపెనీ అది బుక్ చేసింది. అ రోజు ప్రసారం కాబోయే డైలాగులు వారి దినపత్రికలో ముందుగా వేసేవారు.

ఆ కార్యక్రమాల టేపును ముందుగా విని ఆమోదించే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ చల్లా ప్రసాదరావు రెండు రోజుల ముందు ఆదుర్దాగా నా రూమ్‌లోకి వచ్చారు. “ఈ విడత ప్రోగ్రామ్‍లో కొన్ని అశ్లీల పదాలు ఉన్నాయి సార్! వాటిని తొలగించమని ఏజెంట్ ద్వారా ప్రకటనదారుకు తెలియజేసాను. కానీ ససేమిరా ఒక్క పదం తీసివేయబోమంటున్నారు అన్నాడు తాపీగా. ప్రసాదరావు చాణక్యుడు. ఈ గొడవలోంచి మా సార్ ఎలా బయటపడతాడో చూద్దామనే కించిత్ వేడుక గలవాడు.

నాకు ఏమీ తోచలేదు. ఏజెంటును పిలిపించాను. “కుదరదంటున్నారు సార్, కోర్టు కెళతామంటున్నారు” అని బెదిరించడానికి ప్రయత్నించాడు. మా డైరక్టరేట్‌ను సంప్రదిద్దామని అనుకున్నాను.  కాని వాళ్ళు ఆకు కందకుండా పోకకు దక్కకుండా సమాధానాలు ఇస్తారు. అందువల్ల తీవ్రంగా ఆలోచించాను. ఆ నిర్మాతకు ఆకాశవాణిలో సన్నిహిత మిత్రుడొకరున్నారు. ఆయనను అడిగాను. ‘అబ్బో! ఆయన చాలా పట్టుదల మనిషి. ఆయన జోలికి పోవద్దు. ఈ దఫాకు వదిలెయ్! చూచీ చూడనట్టు వెళ్ళాలి బ్రదర్’ అన్ నా భుజం తట్టాడు.

నా దృష్టికి రాకుండా వుండి వుంటే అది వేరే రకం. కానీ, వచ్చిన తర్వాత, నలుగురు చర్చించిన తర్వాత ఈ విషయాన్ని వదిలిపెట్టడం నాకిష్టం లేదు. ఆ సినీ నిర్మాతతో నేరుగా నేనే వెళ్ళి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. రేపు ప్రసారం. ఈ సాయంకాలం 4 గంటలకు వాళ్ళ కార్యాలయ భవనంలో ఆ నిర్మాతను కలిశాను. ఆయన పక్కనే ఆయన ఆంతరంగిక సలహాదారు కూడా ఉన్నారు.

నేను ఒక్కడినే వెళ్ళాను. నాతో ఎవరినీ తీసుకెళ్ళకపోవడానికి కారణం – నిర్మాతకు నాకు మధ్య జరిగిన సంభాషణ లోకానికి టాంటాం వెయ్యనవసరంలేదు.

నేను ఆ నిర్మాత రూమ్ లోకి వెళ్ళగానే ఆయన మర్యాద పూర్వకంగా నించొని నాకు సీటు చూపించారు. ఆయన రాష్ట్రంలో బాగా పలుకుబడిగల రాజకీయ సన్నిహితులున్న వ్యక్తి. మర్యాదపూర్వకంగా కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. మా సంభాషణ ఇలా కొనసాగింది.

నిర్మాత: మీ సమస్య ఏమిటండీ?

నేను: అందులో కొన్ని వాక్యాలు అశ్లీలంగా ఉన్నాయి. వాటిని దయచేసి తీసివేయమని మీ సిబ్బందికి చెప్పండి.

నిర్మాత: నాకు తెలియక అడుగుతాను. కేంద్ర సెన్సార్ బోర్డు మీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని దేనా?

నేను: అవును

నిర్మాత: సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సంభాషణలు రేడియోకి అశ్లీలమా?

నేను: చిన్న తేడా ఉంది. రేడియో, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యే సినిమాలకు వేరే బోర్డు ఉంటుంది. దానికి కారణం – సినిమాకు కుటుంబ సమేతంగా మనం ఇష్టపడి వెళ్తాం.

నిర్మాత: మీ అభ్యంతరం ఏమిటి?

నేను: అందులో డైలాగు ఇలా వుంది (సినిమా వేశ్యాగృహాల మీద ఆధారపడి నడిచింది. అందులో వేశ్యాగృహం మేనేజర్‌కు, వేశ్యకు మధ్య జరిగిన సంభాషణ ఇది). “ఈ వారంలో బావా! సింగిల్ షోలు ఎన్ని? ఫుల్ నైట్లు ఎన్ని?”

నిర్మాత: సన్నివేశానికి అవసరమైన డైలాగులు అవి.

నేను: కాదనడం లెదు. మీరు రేడియో పెట్టి వింటున్నారు. మీ మనవడో, మనవరాలో మీతో బాటు వింటున్నారనుకొందాం. “తాతయ్యా! సింగిల్ షో అంటే ఏమిటి?” అని అడిగితే సమాధానం చెప్పలేము కదా!

నిర్మాత: ఈ విషయం మీతో కాదు లెండి. వేరే చర్చించాలి.

నేను: మీరు పార్లమెంటులో చర్చించేలా చూడండి. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న చిత్రాలు దూరదర్శన్‌లో యథాతథంగా ప్రసారం కావచ్చని తీర్మానించేలా చూడండి. మీరనుకొంటే అసాధ్యం కాదు.

నిర్మాత: మీరు గడుసరివారే. నేను మా సిబ్బందికి చెబుతాను, ఆ వాక్యాలు తీసేస్తారు.

అంతటితో ఆ వివాదం సమసిపోయింది.

(సశేషం)

Exit mobile version