[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
ఢిల్లీలో తొలి అడుగు:
[dropcap]1[/dropcap]987 ఏప్రిల్‍లో ఢిల్లీలో తొలిసారిగా ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగ బాధ్యతలతో అడుగుపెట్టాను. మా శిక్షణాసంస్థ ఆఫీసు ఢిల్లీ యూనివర్శిటీ క్యాంపస్ దాటి కింగ్స్‌వే క్యాంపు మీదుగా నిరంకారీ కాలనీలో వుంది. అక్కడికి ఆఫీసర్లు వెళ్ళడానికి ఒక మెటాడార్ వ్యాన్ ఉదయం పది గంటలకు బయలుదేరుతుంది. నేను వెళ్ళి పార్లమెంటు స్ట్రీట్ లోని ఢిల్లీ ఆకాశవాణి ముంగిట నిలబడ్డాను. పదేళ్ళ తర్వాత ఇదే ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‌గా ఆధిపత్యం చెలాయిస్తానని ఆనాడు ఊహించలేదు.
నేను జాయిన్ అయ్యేందుకు వెళ్ళిన మొదటి రోజు నాతో బాటు మరో అసిస్టెంట్ డైరక్టరు వి.జి. మాథ్యూ (కేరళ) ఆకాశవాణి ముందు ఎదురుచూస్తూ డ్రైవర్‍ని వెతుకుతున్నాడు. ఆ డ్రైవరు దేశముదురు. 12 గంటల ప్రాంతంలో వచ్చాడు. మమ్మల్ని నిరంకారీ కాలనీ తీసుకెళ్లాడు.
ఆకాశవాణి జాతీయ శిక్షణా సంస్థ భవనం మూడంతస్తుల విశాలం. అందులో రెండో అంతస్తులో ప్రోగ్రాం శిక్షణ, మిగతా రెండు అంతస్తులు టెక్నికల్ ట్రైనింగ్ సెంటరు. దానికి ఒక చీఫ్ ఇంజనీరు ఉన్నారు. కృష్ణన్ మాకు డైరక్టరు. మే, జూన్ నెలలలో ట్రైనింగులు పెట్టలేదు. వేసవి ఎండలు ఎక్కువ అని భావించారు.
ఆఫీసు కెదురుగా 200 గదుల హాస్టల్ ఉంది. ట్రైనీలకు వసతి, భోజనం అక్కడ ఏర్పాటు చేస్తారు. సాధారణ ఛార్జీలు వసూలు చేస్తారు. హాస్టల్ పక్కనే మా క్వార్టర్లు కడుతున్నారు. నాకొక ‘డి’ టైప్ క్వార్టర్ ఇస్తామన్నారు. కానీ, రెండు, మూడు నెలలు పడుతుందనీ, వేచి ఉండమని కోరారు. పెండేకంటి వారిని కలిసి చెబితే ఆయన హెచ్.కె.ఎల్.భగత్ (పట్టణాభివృద్ధి శాఖా మంత్రి)కి ఉత్తరం వ్రాసారు. అవుట్ ఆఫ్ టర్న్ కోటాలో నాకు ‘సి’ టైప్ క్వార్టర్ వారి దయతో కేటాయించబడింది. కాని అది ఆఫీసుకు దూరమని నేను చేరలేదు.
ఆఫీసులో చేరిన మర్నాడు మా డైరక్టర్ జనరల్ అమృతరావు షిండేను మర్యాదపూర్వకంగా కలిశాను. “When did you return from Kanpur?” అని ప్రశ్నించారు. నాకేమీ అర్థం కాలేదు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
“మీరు ట్రైనింగులు బాగా జరిపారని ఇక్కడి ట్రైనింగ్‌కు పిలిపించాను. అలాగే వాణిజ్య విభాగం బాగా చేశారు కాబట్టి కాన్పూరు వాణిజ్య విభాగం అవకతవకలు సరిదిద్దడానికి ఓ నెల టూరు మీద పంపుతున్నాను. అక్కడ సర్దుబాటు చేసి రండి” అన్నారు ఆదరంగా.
నేను మా ట్రాన్స్‌ఫర్లు చూచే భాటియా దగ్గరకు వెళ్ళి కాన్పూరు ఆర్డర్లు తీసుకున్నాను. దానికి కావలసిన అడ్వాన్సు డబ్బులు తీసుకుని కాన్పూరు వెళ్ళాను. ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ప్రసారశాఖామంత్రిగా ఉన్నప్పుడు తన స్వంత పట్టణమైన కాన్పూరులో రేడియో స్టేషన్ పెట్టించారు. అయితే అందులో కేవలం వాణిజ్య ప్రసారాలే వుంటాయి. అక్కడ విలాయత్ జాఫ్రీ అనే ఆఫీసరు డైరక్టర్‍గా మూడేళ్ళు పని చేసి బదిలీ మీద లక్నో వెళ్లారు.
దాదాపు నలభై మంది సిబ్బంది ఉన్న ఆ ఆఫీసులులో లంచగొండితనం పరాకాష్ఠ నందుకుంది. ఏజంట్లు పెట్టిన అప్పులు 40 లక్షల దాకా బాకీ వున్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చూచీచూడనట్లు పని చేస్తున్నారు. ఒక డ్యూటీ ఆఫీసర్ నిర్లక్ష్యంగా పనిచేసేవాడు.
నేను ఆఫీసు రూమ్‍లోనే బస చేసి అన్ని వేళలా పర్యవేక్షణ మొదలెట్టాను. రాష్ట్ర ప్రధాన కేంద్రమైన లక్నోలో జరిగిన స్టేషన్ డైరక్టర్ల కాన్ఫరెన్సులో ఏ ఏ కేంద్రం నుంచి ఎంతెంత బాకీలున్నాయో చెప్పి 30 రోజుల్లో కాన్పూరుకు వచ్చి లెక్కలు సరిచూసుకోమని హెచ్చరించాను.
వారణాసి, లక్నో తదితర కేంద్రాల నుండి సంబంధిత అధికార్లు వచ్చి ఏ ఏ అడ్వర్టయిజింగ్ కంపెనీ ఎంత బాకీయో తేల్చారు. ఒక ఏజన్సీ వారు 10 లక్షల దాకా బాకీ. అతణ్ణి పిలిచి మందలించాను. అతడు వెళుతూ వెళుతు నాకొక సూచన చేశాడు: Evening we will have a sitting in Raj Hotel sir” అంటూ.
నేను వెంటనే, – “I will not agree for any sitting or sleeping” అన్నాను నిర్ద్వంద్వంగా.
30 రోజుల్లో ఎవరెవరు ఎంత బాకీనో తేల్చి మూడు వంతుల బాకీలు కక్కించాను. అది సిబ్బందికీ, ఏజన్సీలకు నచ్చలేదు. జూన్ నెలలో నేను ఢిల్లీకి వెళ్ళి ఒక సమగ్ర నివేదికను డైరక్టర్ జనరల్‌కు సమర్పించాను. పాత డైరక్టర్ని ఆకాశవాణి నుంచి దూరదర్శన్‌కు మార్చారు. మిగతా ఇంజనీరు, అకౌంటెంట్లను బదిలీ చేశారు. అదొక ప్రసహనం.
జాతీయ శిక్షణ:
జూన్ నెలాఖర్లో నెను హైదరాబద్ వెళ్ళి కుటుంబాన్ని ఢిల్లీ తీసుకొచ్చాను. కాని క్వార్టర్లు తయరుగా లేవు. ఓ నెల రోజుల పాటు ఆత్మీయ మిత్రులు -న్యూస్ విభాగంలో రిపోర్టరు మల్లాది రామారావు క్వార్టర్లో లోధా కాలనీలో ఉన్నాం. వారి సౌహార్ద్రం మరువరానిది.
1987 జూలైలో నిరంకారీ కాలనీలోని క్వార్టర్లలోకి ప్రవేశించాం. అదే నేను తొలిగా క్వార్టర్స్‌లో చేరడం. అప్పటికింకా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. నీళ్ళ కనెక్షన్ లేదు. ఎదురింటి క్వార్టర్ల నుంచి తీసుకున్నాం. అలా ఒత్తిడి తెస్తే గాని క్వార్టరు పూర్తి చేయలేదు.
మా పిల్లలను ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటి స్కూలు, ఐటిఓ లో చేర్చాను. హెడ్మాస్టర్ విజయలక్ష్మి సీటు ఇవ్వడం గొప్ప వరం. పిల్లలకి ఢిల్లీ వాతావరణం కొత్త. రోజూ పొద్దుటే పొగమంచులో ఉదయం ఏడు గంటలకు నిరంకారీ కాలనీ నుండి 104 నెంబరు బస్సులో వెళ్ళేవారు. గంట ప్రయాణం. అలానే తంటాలు పడి వెళ్ళారు. జనవరిలో విపరీతమైన చలి. మే నెలలో ఎక్కువ ఎండ, వేడి గాడ్పులు. అలానే మూడేళ్ళు నెట్టుకొచ్చాం.
కొత్త డైరక్టరు:
కృష్ణన్ కొద్ది రోజులలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ ప్రొమోషన్ మీద డైరక్టరేట్‌కు వెళ్ళారు. ఆయన స్థానంలో ఢిల్లీ స్టేషన్ డైరక్టర్‍గా పని చేసిన యస్.కె.శర్మ వచ్చి చేరారు. ఆయన చాలా సున్నితమైన ఆరోగ్యం గలవాడు. నేనూ, మాథ్యూ, మనోజ్ సిన్హా ఇతర అధికారులం.
1987-88, 1988-89, 1989-90 మూడు ఆర్థిక సంవత్సరాలు అనేక ట్రైనింగులు పెట్టాము. దేశవ్యాప్తంగా ఉన్న ప్రోగ్రాం అధికారులు, అసిస్టెంట్ డైరక్టర్లకు శిక్షణ ఇచ్చాము. Asian Institute of Broadcast Development మలేషియా వారి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు శిక్షకులు వచ్చి మాకు ట్రైనింగు ఇచ్చారు. అదొక గొప్ప అనుభూతి.
ఆ సంస్థ ఆధ్వర్యంలోనే కోట (రాజస్థాన్)లో లోకల్ రేడియోలో పనిచేసే అధికారులకు మూడు వారాల శిక్షణ ఇచ్చాము. అలానే అహ్మదాబాదులో DECU (ఇస్రో)లో రెండు వారాలు శిక్షణ ఇచ్చాము. నాగర్‌కోయిల్‍లో జిల్లా రేడియో కేంద్రాల వారికి శిక్షణ ఏర్పాటు చేశాం. మా డైరక్టర్ శర్మ నా పనితనాన్ని మెచ్చుకొని బయట నగరాల శిక్షణకు నన్ను పంపేవారు. దేశవ్యాప్తంగా ఎందరో అధికారులు, నా వద్ద శిక్షణ పొందారు.
డైరక్టర్‌గా ప్రమోషన్:
1988 జూన్‌లో యు.పి.యస్.సి. ద్వారా నేను స్టేషన్ డైరక్టరుగా ఎంపికయ్యాను. మళ్ళీ నాకు రెండు పదవులు తప్పలేదు. డైరక్టరేట్‌లో స్పోకెన్ వర్డ్ డైరక్టరుగా వ్యవహరిస్తూ, టైనింగ్ సెంటర్లో డిప్యూటీ డైరక్టరుగా బాధ్యతలు అప్పగించారు. 1987 డిసెంబరులో జరిగిన ఇంటర్వ్యూలు ఆరు నెలలు మూలనబడి, 1988 జూన్ నాటికి 15 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నాతో బాటు ఆంధ్రుడైన ఆర్. వెంకటేశ్వర్లు, నోరిన్ నక్వీ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ తర్వాత డైరక్టర్ జనరల్ అయ్యారు.
1988 జనవరి – మార్చి మధ్య కాలంలో నిధులు లేని కారణంగా ఏ ట్రైనింగ్ నిర్వహించకూడదని ఆంక్ష విధించారు. పని లేకుండా కూర్చోలేని నేను డి.డి.జి. ఇన్‍స్పెక్షన్ డి.పి.రామచంద్రరావు వద్దకు వెళ్ళి నాకు పని అప్పగించమన్నాను. ఆయన వెంటనే న్యూస్ డివిజన్ (ఎన్.ఎస్.డి), విదేశీ ప్రసారాలు (ఇ.ఎస్.డి), ఢిల్లీ కేంద్ర సిబిఎస్ కార్యాలయాల ఇన్‍స్పెక్షన్ చేయమన్నారు. ఆ మూడు నెలలు కష్టపడి ఆ మూడు ఆఫీసులు ఇన్‍స్పెక్షన్ చేసి రిపోర్టులు ఇచ్చాను.
ఆల్‍రౌండర్:
నేను ఆకాశవాణిలో అన్ని విభాగాలలో పని చేశానని సగర్వంగా చెప్పగలను. చిన్న స్టేషన్ కడపలో ప్రొడ్యూసర్‌గా చేరాను. హైదరాబద్ మెయిన్ స్టేషన్‌లో అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరాను. వాణిజ్య విభాగం అధిపతిగా, ఐదేళ్ళు ట్రైనింగ్ సెంటర్లో, ఇన్‍స్పెక్షన్ యూనిట్లో, డైరక్టరేట్‍లో, ఢిల్లీ కేంద్రంలో, ఆ పైన ఆకాశవాణి డి.డి.జి, చివరి ఐదు సంవత్సరాలు 2001 – 2005 దూరదర్శన్‍లో ఇప్పటి హోదా అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా వ్యవహరించాను.
డైరక్టరేట్‌లో పాలసీ డైరక్టరు కీలకమైన పదవి. ఆ పదవి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. స్పోకెన్ వర్డ్స్, డ్రామా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ – ఇలా అన్ని విభాగాలలోనూ మూడేళ్ళు పనిచేశాను.
రెండు గుర్రాల స్వారీ 1988 జూన్ నుంచి 1990 అక్టోబరు వరకు కొనసాగింది. డైరక్టరేట్‌కు సోమ, బుధవారాలు వెళ్ళేవాడిని. మంగళ, గురు, శుక్ర వారాలు ట్రెయినింగ్ సెంటర్‌లో పని చూశాను. ప్రొడ్యూసర్‍గా పని చేసిన వ్యక్తి చీఫ్ ప్రొడ్యూసర్‍గా డైరక్టరుగా పనిచేయడం ఎలాంటిదంటే యూనివర్శిటీ లెక్చరర్ అదే విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సలర్ కావడం వంటిది. నా హయాంలో 1989లో ఆకాశవాణి కళాకారులకు ఇచ్చే ఫీజులు గణనీయంగా పెంచుతూ నా సంతకంతో ఆర్డర్లు వేశాను. సర్దార్ పటేల్ మెమోరియల్, రాజేంద్రప్రసాద్ మెమోరియల్ ప్రసంగాలు నిర్వహించాను. అదొక అపూర్వానుభూతి.
(సశేషం)