Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-17

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కొత్తగూడెంలో కొత్త ఎఫ్.ఎమ్. స్టేషను:

[dropcap]1[/dropcap]989 జనవరి. కొత్త సంవత్సర సంబరాలు ముగిసాయి. నేను రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తూ డైరక్టరేట్‌లో చీఫ్ ప్రొడ్యూసర్‌ – స్పోకెన్ వర్డ్స్ గాను, ట్రైనింగ్ సెంటర్‌లో డిప్యూటి డైరక్టర్ గాను పరుగులు తీస్తున్నాను. ఒకానొక సాయంత్రం జనవరి ఆఖర్లో నన్ను హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్‍కు మారుస్తున్నట్టు, అదనపు బాధ్యతలుగా కొత్తగూడెం ఎఫ్.ఎమ్. కేంద్ర డైరక్టరుగా నియమిస్తూ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు వచ్చాయి.

నేను 1987 జూన్‌లో ఢిల్లీకి కాపురం మార్చాను. ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు. పిల్లల చదువులు విద్యా సంవత్సరం మధ్యలో వున్నాయి. హైదరాబాద్ నుండి కొత్తగూడెం 12 గంటల రైలు ప్రయాణం. డైరక్టరేట్ వాళ్ళకి ఇండియా మ్యాప్‌లో రెండు అంగుళాల దూరంలో కనిపించినట్లుంది. ఏం చేయాలో తోచలేదు.

రెండు రోజుల తర్వాత ఒక ఉద్యోగి కుమారుని వివాహ విందుకు సతీ సమేతంగా వెళ్ళాను.  ఆ విందుకు మా డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే వచ్చారు. దంపతులిద్దరం నమస్కారం పెట్టాం. “హైదరాబాద్ వెళ్తున్నందుకు సంతోషంగా ఉందా?” అని ఆయన మా ఆవిడతో అన్నారు.

వెంటనే అప్రయత్నంగా ఆమె “డేఢ్ సాల్ భీ నై హోగయా, అభీ ట్రాన్స్‌ఫర్ క్యోం?” (మేం వచ్చిన ఒకటిన్నర సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే బదిలీయా) అంది. ఆయన చాలా పట్టుదల మనిషి. కోపగించుకుంటాడేమోనని నేను మా ఆవిడ చెయ్యి గిల్లి – ఎక్కువ మాట్లాడావని మందలించినట్లు చూశాను.

సూప్ తీసుకుంటున్న షిండే – “యూ గో టు కొత్తగూడెం. గెట్ ఇట్ ఇనాగరేటెడ్ అండ్ కమ్ బ్యాక్” అని వెంటనే అనేశారు.  ‘మీరు వెళ్ళి కొత్తగూడెం స్టేషన్ ప్రారంభించి రండి!’ అనడంతో దంపతులిద్దరం సంబర పడుతూ భోంచేశాము.

మర్నాడు షిండే గారిని డైరక్టర్ జనరల్ కార్యాలయంలో కలిసాను. “మొన్నటి రోజు ఓ ఆంధ్రా మంత్రి – పరిశ్రమల శాఖామంత్రి జలగం వెంగళరావు నన్ను పిలిపించి మార్చిలో కొత్తగూడెం ఎఫ్.ఎమ్. ప్రారంభమయ్యేలా చూడమన్నారు. మీరైతే ఆ పనిని పూర్తి చేయగలరు. మీరు ప్రాజెక్టు ఇంజనీరు పి.టి. లేఖిని కలవండి. రెండు నెలల్లో పని పూర్తి చేసి ఢిల్లీ వచ్చేయండి” అని హితోపదేశం చేశారు.

థర్డ్ ప్లోర్‌లో ఉన్న చీఫ్ ఇంజనీర్‌ని కలిసాను. ఆయన తన టేబుల్ మీద వున్న అతి పెద్ద ఇండియా మ్యాప్‍లో ‘కొత్తగూడెం’ ప్రదేశాన్ని వెదుకుతున్నాడు. నేను పరిచయం చేసుకోగానే – “ఏదండీ మీ కొత్తగూడెం?” అన్నారు.

“భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ కొత్తగూడెం” అన్నాను.

ఆయన ఊపిరి పీల్చుకున్నాడు.

డైరక్టరేట్ నుండి విడుదల కావల్సిన రకరకాల శాంక్షన్ ఆర్డర్లు, టి.ఏ. అడ్వాన్సు తీసుకుని హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ టి.ఎన్. గణేశన్‌ని కలిశాను. అక్కడికి హుటాహుటిన కొందరు ప్రోగ్రామ్ సిబ్బందిని, ఒక అకౌంటెంటును, మిగతా ఆఫీసు సిబ్బందిని తాత్కాలిక బదిలీ ఆర్డర్లు ఆయన చేత ఇప్పించాను. విజయవాడ వెళ్ళి అక్కడి డైరక్టర్ పి.యు.ఆయూబ్‌ని కలిసి ఒక జీపును రెండు నెలల పాటు అడిగి తీసుకుని కొత్తగూడెం బయలుదేరాను.

ఆ బయలుదేరిన శుభ ముహూర్త బలం వల్ల అనుకొన్న పనులన్నీ చకచకా సాగిపోయాయి. కొత్తగూడెం వెళుతూ ఖమ్మంలో జిల్లా కలెక్టరు ఐ.వై.ఆర్.కృష్ణారావును కలిశాను. నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో ఆయన ఇంటర్ విద్యార్థి. “రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సదుపాయాలు ఇంటాయనీ, కేంద్రాన్ని ప్రారంభించే పనులు చూడండి! మా జాయింట్ కలెక్టర్ శ్యాంబాబుతో తరచూ మాట్లాడుతుండండి” అన్నారు.

కొత్తగూడెం ఫిబ్రవరి నెల మొదటి వారంలో చేరుకున్నాను. ఊరికి చివర స్మశానం పక్కన స్టూడియో భవనాలు, క్వార్టర్లు రెండేళ్ళుగా ఖాళీగా ఉన్నాయి. మొండి గోడలు, యంత్ర పరికరాలు తప్ప మరెవరూ లేరు. నేను కూర్చునే కుర్చీని కూడా ఇన్‍స్టలేషన్ ఆఫీసర్ జయరాజ్ ఉదారంగా సమకూర్చాడు.

ఆఫీసు సిబ్బంది ఒకరొకరుగా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆల్విన్ కంపెనీ శాస్త్రి గారిని సంప్రదించి అరువు పద్ధతిపై ఆఫీసు ఫర్నిచర్ కొన్నాము. ఆయన సతీమణి కర్నాటక సంగీత గాయని. నేను బస చేయడానికి వసతి కావాలి. రామవరంలో ఊరికి దూరంగా ఆకాశవాణి ఉంది.

సింగరేణి కాలరీస్ కొత్తగూడెంలో ప్రధాన పబ్లిక్ సెక్టార్ హెడ్ ఆఫీసు ఉంది. అక్కడ మేనేజింగ్ డైరక్టర్‌గా వి. గోవిందరాజన్ ఉన్నారు. వారిని కలిశాను. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. కారణం వారి తండ్రిగారు వరదరాజ అయ్యంగార్ గారు హైదరాబాద్ ఆకాశవాణిలో సంగీతం ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. నేను బస చేయడానికి అద్దె చెల్లింపు పద్ధతిపై సింగరేణి వారి గెస్ట్ హవుస్ అలాట్ చేశారు. అక్కడ ఏ.సి. రూమ్, భోజన వసతి నాకు రెండు నెలలు పని ఒత్తిడిని, ఎండ వేడిమిని తొలగించాయి.

ఫిబ్రవరి నెల మొదటివారంలో ఖమ్మం పర్యటనకు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జలగం వెంగళరావు వచ్చారు. ప్రెస్ మీట్‌లో ఒక విలేకరి ఆయనను “కొత్తగూడెం ఎఫ్.ఎమ్. రేడియో రెండేళ్ళుగా ప్రారంభం కాలేదు. కారణం?” అని ప్రశ్నించాడు. వెంటనే ఆయన తన సెక్రటరీ కె.వి.రావుతో – “వచ్చె నెల మార్చి 24న మనం ఖమ్మం వస్తాం గదా! అప్పుడు రేడియో స్టేషన్‌ని ప్రారంభిద్దాం. సరేనా?” అన్నారు.

మర్నాడు పత్రికల్లో మార్చి 24న  రేడియో స్టేషన్ ప్రారంభమని – జిల్లా ఎడిషన్లలో పతాక శీర్షికలో వచ్చింది.

30 రోజులకు సరిపడే కార్యక్రమాలు వుంటే తప్ప ప్రారంభం చేయడం భావ్యం కాదు. యుద్ధ ప్రాతిపదికన స్థానిక కళాకారులతో రికార్డింగులు మొదలు పెట్టాం. పెళ్ళి ముహుర్తం (మార్చి 24, 1989) కుదిరింది గాని పెళ్ళి పత్రిక తయారు చేయడం.. ఆహ్వానపత్రిక – ఆలస్యమవుతోంది. కారణం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి – ముఖ్యమంత్రి -రావాలి. ఆయనని అడగకుండా తేది నిర్ణయమైంది.

హైదరాబాద్ డైరక్టర్‌తో ఫోన్‍లో మాట్లాడాను. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి, నా హితైషులు అయిన పి.ఎల్. సంజీవరెడ్డితో ఫోన్‌లో మాట్లాడాను. మా స్టేషన్ డైరక్టర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. తేదీ ఎవరినడిగి నిర్ణయించారనే ఎదురు ప్రశ్న వచ్చింది. వెంగళరావు – యన్.టి.రామారావుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న రోజులవి.

మధ్యేమార్గంగా సంజీవరెడ్ది ముఖ్యమంత్రికి ఓ సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కారుపాటి వివేకానంద హాజరవుతారని సారాంశం. మార్చి 21 సాయంకాలానికి ఈ నిర్ణయం జరిగింది. 22న సాయంకాలానికి హైదరాబాద్ నుంచి మాకు ఆహ్వాన పత్రికలు అందాయి. అందరికీ పంచాము. ఎం.ఎల్.ఎ. వెంకటేశ్వరరావుకు నేనే స్వయంగా ఇచ్చి వచ్చాను. సమావేశానికి ఆయన రాలేదు సరికదా, “నాకు రేడియో వాళ్ళు ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు” అని పత్రికా విలేకరులకు చెప్పారు. అదృష్టవశాత్తు నేను వారి ఇంటికి వెళ్ళిన సమయంలో వారి మనవరాలి పుట్టినరోజు వేడుకల వీడియోలో నేను అందిస్తున్న ఆహ్వానం రికార్డయింది.

మార్చి 24:

ప్రారంభోత్సవం సంరంబం లాంఛనంగా స్టూడియో ద్వారం వద్ద రిబ్బన్ కత్తిరించి, స్టూడియోలో వెంగళరావు ప్రసంగం రికార్డింగుకు ఏర్పాటు చేశాము. సభా కార్యక్రమాలు మహిళా కళాశాల ప్రాంగణంలో జరిపేలా నిర్ణయించాము. ఢిల్లీ డైరక్టరేట్ నుండి ప్రోగ్రామ్ విభాగానికి చెందిన డి.ఢి.జి. టి.ఆర్. మలాకర్, ఇంజనీరింగు విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీరు కె.పి. రామస్వామి ముందురోజే వచ్చారు. మినట్ టు మినట్ ప్రోగ్రామ్ తయారు చేశాము. మదరాసు ప్రాంతీయ కార్యాలయం నుండి వచ్చిన చీఫ్ ఇంజనీరు యం.జె. విశ్వనాధం స్టేజి మీద తానూ కూర్చోవాలని పట్టుబట్టారు. స్వాగతం మలాకర్, వందన సమర్పణ రామస్వామి చెప్పాలి. మరి విశ్వనాధం ఏం చెయ్యాలి? ప్రాజెక్టు గురించి రెండు మాటలు చెప్పే అవకాశం కల్పించాం.

మలాకర్ తన ప్రసంగం ఇంగ్లీషులో మా స్టెనో కుర్రవాడికి డిక్టేట్ చేశారు. అది టైప్ చేసి సాయంకాలం ఆయనకు అందివ్వాలి. ఆ కుర్రాడు మాయమయ్యాడు. వానికి షార్ట్‌హ్యాండ్ అరకొరగా వచ్చు. తప్పులు హెచ్చు. వాడు భయపడి పారిపోయాడు. సాయంకాలం ప్రోగ్రామ్ గూర్చిన వివరాలు సమీక్షించాం. మరో 20 నిమిషాలలో సభా ప్రాంగణానికి వెళ్ళబోతున్నాం.

ఆ ఆఖరి క్షణంలో మా డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఓ మాట అన్నారు. “దీపప్రజ్వనల వెంగళరావు, వివేకానంద ఇద్దరూ చేస్తారు గదా!”. దీపప్రజ్వలన ముందుగా అనుకున్న లిస్టులో లేదు. “20 నిముషాల్లో దీపస్తంభం, నూనె, వొత్తులు, క్యాండిల్ సృష్టించే మాయాజాలం నాకు లేదు సార్!” అన్నాను వినయంగా.

నా పక్కనే ఉన్న స్థానిక ఇంజనీరు – “మీరు అక్కడికి రండి! నేను ఆ ఏర్పాట్లు చేస్తాను” అని భరోసా ఇచ్చారు. మేం వెళ్ళేసరికి అవి సమకూర్చారు.

రిబ్బన్ కత్తిరింపు:

సాయంకాలం ఐదు గంటలకు వెంగళరావు వచ్చారు. మరో ఐదారు నిముషాల్లో కారుపాటి వివేకానంద వచ్చారు. జనం తోసుకుంటూ స్టూడియో లోపలికి రావడానికి ముందుకొచ్చారు. పోలీసులు నిరోధించారు. అందులో మా హైదరాబాద్ డైరక్టర్ గణేషన్ ఉన్నారు. నేను వెళ్ళి ఆయనను ముందుకు తెప్పించేందుకు పోలీసు డి.యస్.పి.ని కోరాల్సి వచ్చింది.

లాంఛనంగా ప్రారంభ కార్యక్రమం స్టూడియోలో ముగించుకుని, కార్ల కాన్వాయ్‌లో మహిళా కళాశాల ప్రాంగణం చేరాము. సభ నిండుగా ఉంది. గంట సేపు సభ జరిగింది. మంత్రులిద్దరూ మాట్లాడారు.

“భారతదేశంలోనే తొలి స్వతంత్ర్య ఎఫ్.ఎమ్. కేంద్రం ఇది. మిగతా జిల్లా కేంద్రాల వలె రిలే కేంద్రం గాక, అన్ని కార్యక్రమాలు ఉత్పత్తి చేసే స్వయంప్రతిపత్తి గల కేంద్రం. ఖమ్మం జిల్లా అంతటికీ కార్యక్రమాలు అందిస్తుంది. ఆరు కిలోవాట్ల ప్రసారశక్తి గల కేంద్రం” అని వెంగళరావు తమ ప్రసంగం కొనసాగించారు. ఆ రాత్రి 150 మందికి సింగరేణి గెస్ట్ హవుస్‌లో విందు ఏర్పాటు చేశాం. ప్రసారాలు ప్రారంభించాం.

***

మర్నాడు ఉదయం వెంగళరావు కొత్తగూడెం ఆర్ అండ్ బి గెస్ట్ హవుస్‌లో బస చేసి ఉండగా దాదాపు 50మంది స్థానిక ప్రజలు ఆయనకు ఒక మహాజరు సమర్పించారు. “వెంటనే కొత్తగూడెం కేంద్ర ప్రసారాలు ఆపివేయండి” అని సారాంశం.

కారణం స్టేషన్‌కు సమీపంలో కిలోమీటరు దూరం వరకు వాళ్ళ కేబుల్ టి.వీ.లు పనిచేయడం లేదు. వెంటనే మా చీఫ్ ఇంజనీర్‌ని పిలిపించారు మంత్రి.

“షాడో జోన్ సార్” అని ఆయన సర్ది చెప్పబోయారు.

“వారం రోజుల లోపల అది సరిచేసి నాకు చెప్పండి!” అని ఆయన ఆదేశించారు. అలానే సాంకేతిక మార్పులు చేసి ఆ ఇబ్బంది తొలగించారు.

1989 ఏప్రిల్ మూడవ వారంలో నేను తిరిగి ఢిల్లీ చేరుకున్నాను.

గత 30 సంవత్సరాలుగా కొత్తగూడెం దిగ్విజయంగా పనిచేస్తోంది.

దాని ప్రారంభోత్సవ డైరక్టరుగా పనిచేసే అవకాశం నాకు లభించింది.

(సశేషం)

Exit mobile version