Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-18

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]ది 1990వ సంవత్సరం.

జూలై నెలాఖరులో ఓ సాయంకాలం డైరక్టరేట్‌లో పనిచేస్తున్న తెలుగువారైన గుంటూరు రఘురాం ఫోన్ చేసి “కంగ్రాజులేషన్స్” అన్నారు.

“ఏమిటి విశేషం?” అన్నాను.

“మిమ్మల్ని అనంతపురం స్టేషన్ డైరక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. సంతోషం. అది మా వూరు” అన్నారు రఘురాం.

గత కొద్ది నెలలుగా నేను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని మా డైరక్టర్ జనరల్‌ను అభ్యర్థించాను ఒకసారి రైల్వే కార్మిక నాయకుడు ఏ.వి.కె. చైతన్యతో కలిసి అప్పటి సమాచార ప్రసార శాఖా మంత్రి పర్వతనేని ఉపేంద్రను యథాలాపంగా కలిసినపుడు కూడా ‘ఢిల్లీ నుండి వెళ్ళిపోవాలని వుంది’ అన్నాను.

ఆయన మా డి.జి. అమృతరావు షిండేకి చెప్పినట్లున్నారు. నేను కలిసినప్పుడు ఆయన “మీ మినిస్టర్‌తో చెప్పారటగా!” అన్నారు కోపంగా.

“ఆంధ్రాకు వెళ్ళాలని ఉంది, పిల్లల చదువుల కోసం” అన్నాను.

ఏతావాతా జూలై నెలాఖరులో కొత్తగా పెట్టబోయే అనంతపురం స్టేషన్‌కి నన్ను మార్చారు. జూలై నెలలో మా పెద్దబ్బాయి రమేష్‌ను కోపర్‌గాం (షిరిడీ దగ్గర) ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాను. అమ్మాయి శైలజ బి.యస్.సి. మూడో సంవత్సరం. చిన్నవాడు జనార్ధన్ పదవ తరగతి పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ళ ఢిల్లీ వాతావరణం నుండి బయటపడి ఆగస్టు 8న అనంతపురంలో చేరాను.

లోగడ రాయలసీమలో 1975-78; 1980-82 మధ్య ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు అనంతపురం కవి పండితులు, కళాకారులు నాకు బాగా పరిచితులు. కలెక్టరాఫీసుకు ఎదురుగా కొత్తగా నిర్మించిన భవనాలలో అనంతపురం ఆకాశవాణి స్టూడియోలు, పక్కనే క్వార్టర్లు, గెస్ట్‌హౌస్ ఏర్పరిచారు.

ఒక అకౌంటెంట్ తప్ప మిగతా సిబ్బంది రాలేదు. కుర్చీలు, బెంచీలు, కావలసిన హంగులు మొదలుబెట్టాము.

మొదటిరోజు అరువు తెచ్చుకొన్న కుర్చీలో కూర్చున్నాను.

ఇంజనీరింగ్ విభాగంలో ఇన్‌స్టలేషన్ ఇంజనీర్లు పనులు పూర్తి చేస్తున్నారు. కొద్ది నెలల్లో స్టూడియో పనులు పూర్తి అయ్యాయి.

ముగ్గురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లు బదిలీ మీద వచ్చి చేరారు.

శైలజను అనంతపురం డిగ్రీ కాలేజీలో మూడో సంవత్సరం బియస్‌సిలోనూ, జనార్ధన్‌ను సాయిబాబా జూనియర్ కళాశాలలో ఇంటర్‌లోను చేర్చాను. అనంతపురం స్టేషన్ లోకల్ స్టేషను. అంటే కేవలం జిల్లాకు పరిమితం. ఎఫ్.ఎం. కేంద్రాలు ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుపతి, వరంగల్, అనంతపురం, కర్నూలు, నిజమాబాద్, మార్కాపురంలలో పెట్టాలని సంకల్పించారు. తిరుపతి, వరంగల్ ప్రారంభమయ్యాయి.

అనంతపురంలో కవులు, కళాకారులు చాలామంది వున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, పుట్టపర్తిలో సత్యసాయి విశ్వవిద్యాలయం (స్వయం ప్రతిపత్తి) 1981 నవంబరు నుండి పని చేస్తున్నాయి. ఆ రెండు విశ్వవిద్యాలయాలను ఒకే రోజు అప్పటి యు.జి.సి. చైర్మన్ మాధురీ షా ప్రారంభించారు. రెండిటి సమావేశాలను నేను కడపలో ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ రికార్డు చేసి రేడియో నివేదిక సమర్పించాను.

అనంతపురం కలెక్టర్‌గా యం.శ్యామ్యూల్, వైస్ ఛాన్స్‌లర్‌గా కె. వెంకట రెడ్ది (వారి కుమార్తె ప్రస్తుతం హైదరాబాద్ వాణిజ్య విభాగం అధిపతి డా. కె. విజయ), పుట్టపర్తి విశ్వవిద్యాలయానికి యస్. సంపత్ వ్యవహరిస్తున్నారు. వారిని కలిసి ఆకాశవాణికి సహకారం కోరాను.

మునిసిపల్ బంగాళా పరిధిలో క్వార్టర్సు నిర్మించారు. ప్రహరీ గోడ లేదు. అటువైపు కాలనీ ప్రజలు మా క్వార్టర్స్‌లోగుండా స్వేచ్ఛగా వెళ్ళేవారు. ప్రహరీ నిర్మాణం మొదలుబెడితే గొడవజేశారు. అప్పటి మునిసిపల్ ఛైర్మన్ నాతో సరదాగా మాట్లాడేవారు. ఆయన గ్రామ పెద్ద. ఆయనను పిలిపించి ఆయన సమక్షంలోనే ప్రహరీ పని పూర్తి చేశాము. అలానే వనమహోత్సవ సందర్భంగా పోలీసు డి.ఐ.జి వెంకయ్యను పిలిచి ఆఫీసులోనూ, క్వార్టర్స్‌లోనూ వంద చెట్ల మొక్కలు నాటాము. అవి ఈనాడు శాఖోపశాఖలై పెరిగి మొన్న నేను వెళ్ళినప్పుడు చెట్ల కొమ్మలు ఊగుతూ నాకు స్వాగతం పలుకుతున్నట్లు తోచింది.

వివిధ లోకల్ కేంద్రాలు:

1990 సెప్టెంబరు 9న నిజామాబాద్ కేంద్రాన్ని సమాచార ప్రసార శాఖా మంత్రి పర్వతనేని ఉపేంద్ర ప్రారంభించారు. 1990 ఫిబ్రవరి 17న ఉపేంద్ర వరంగల్ కేంద్రాన్ని, 1991 ఫిబ్రవరి 1న తిరుపతి కేంద్రాన్ని ఆరంభించారు. అనంతపురం కేంద్ర ప్రారంభోత్సవం కోసం డైరక్టరేట్‌లోని డి.డి.జి. మలాకర్‌ను సంప్రదించాను. మంత్రిగారి పర్యటనను బట్టి మే 1991లో ఉండవచ్చుననీ, అన్నీ తయారు చేసుకోమని పురమాయించారు. సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. ముగ్గురు డ్యూటీ ఆఫీసర్లు కొత్తగా వచ్చి చేరారు. అనౌన్సర్ల నియామక ప్రక్రియ మొదలెట్టాం. అనంతపురంలో నేను అనువదించిన ముల్క్‌రాజ్ ఆనంద్ ప్రభాత వదనాన్ని ఆయనే ఆవిష్కరించడం హైలైట్ (సభ అనంతపురంలో జరిగింది).

అనౌన్సర్ల ఎంపిక:

పారదర్శకంగా అనౌన్సర్లు ముగ్గురిని నియమించేందుకు పత్రికా ప్రకటన ఇచ్చాం. వందకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వారికి గవర్నమెంటు జూనియర్ కాలేజీలో పరీక్ష నిర్వహించాం. ఎవ్వరికీ తెలియకుండా (నా భార్యకి కూడా) ప్రశ్నాపత్రం నేనే తయారు చేశాను. సైక్లోస్టయిల్ చేయించాను. అది రెండు కాగితాలతో వుండడంతో పిన్నింగ్ చేయించాలి. నా దగ్గర ప్యూన్‌గా పనిచేస్తున్న బాషాకు ఆ పని అప్పగించాను. అతనికి తెలుగు రాదని ఆ పని అప్పగించాను. పని పూర్తి అయిన తర్వాత ఆ కుర్రవాడు – “పేపర్ చాలా కష్టంగా వుంది సార్” అన్నాడు. ఆ కాగితాలన్నీ చించివేసి కొత్త పేపరు తయారు చేశాను.

అనౌన్సర్ల సెలెక్షన్‌కు experts గా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యులు డా. మద్దూరి సుబ్బారెడ్డి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ తెలుగు ప్రొఫెసర్ డా. కొలకలూరి ఇనాక్‌లను డైరక్టరేట్ ఆమోదించింది. నేను కమిటీ చైర్మన్. మూడు ఖాళీలు. అందులో ఒకటి ఎస్.సి.లకి. మొత్తం 14 మందిని ఇంటర్వ్యూ చేశాము. డా. వి. పోతన, కె. పుష్పరాజ్, పి. అమృత సెలెక్ట్ అయ్యారు. ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకొన్నారు.

ప్రారంభోత్సవం:

మే నెలలో (1991) ప్రారంభోత్సవం వుంటుందని హంగులు తయారు చేశాం. ఒకరోజు మలాకర్‌ (డి.డి.జి.) ఫోను చేశారు. “పద్మనాభరావ్! ప్రారంభోత్సవానికి ఎవరూ రావడం లేదు. మీరే లాంఛనంగా ఆ పని పూర్తి చేయండి. అది మే 29న జరగాలని డి.జి. ఆదేశం” అన్నారు.

“సార్! మా అమ్మాయి శైలజ పెళ్ళి మే 24న పెట్టుకొన్నాం సార్!”

“రెండూ పెళ్ళిళ్ళలా ఘనంగా జరిపించగలరనే ధీమా నాకుంది” అన్నారు.

అలానే నా చేతుల మీదుగా లాంఛన ప్రారంభోత్సవం చేశాను.

అయితే ఇక్కడ ఒక ఉదంతం చెప్పకతప్పదు.

1991 మే 21న రాత్రివేళ శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్యకు గురి అయ్యారు. 22, 23 తేదీలలో అనంతపురమే గాదు, యావత్ భారతదేశం అట్టుడుకిపోయింది. కర్ఫ్యూ, బంద్‌లతో సామాన్య జీవితం అతలాకుతలమైంది. 24 ఉదయం మా అమ్మాయి పెళ్ళి. బళ్లారి నుండి పెళ్ళికొడుకు వాళ్ళు  23 సాయంత్రానికి రావాలి. వస్తారో, మధ్యలో అటకాయిస్తారో తెలియదు.

భగవత్ కృపవల్ల ప్రత్యేక బస్‌లో వారు వచ్చి విడిది దిగారు. టెన్షన్ తగ్గిపోయింది. కావలి నుండి రావల్సిన భజంత్రీలు రాలేదు. పోలీస్ బ్యాండ్ అద్దెకు తెచ్చి పెళ్ళి జరిపించాము. కడప నుంచి జె.సి.సుబ్బయ్య అనే బంగారు వ్యాపారి ప్రత్యేక దూత ద్వారా మాంగళ్యాలు పంపారు. క్వార్టర్స్‌లోనే షామియానా వేసి పెళ్ళి అయిందనిపించాం.

భగవాన్ సాయిబాబాగారి సాన్నిహిత్యం:

మూడు సంవత్సరాలు నేను అనంతపురం స్టేషన్ డైరక్టరుగా పనిచేశాను. 1990, 1991, 1992 నవంబరు నెలల్లో జరిగిన భగవాన్ జన్మదినోత్సవాలకు రికార్డింగ్ కోసం బృందంతో వెళ్ళాను. ఒక సంవత్సరం రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వచ్చారు. బాబా ఆయనను ఘనంగా కీర్తించారు. వేదిక దిగి వెళ్తున్న రాష్ట్రపతికి నమస్కరించాను. “ఐ వాంట్ దట్ రికార్డింగ్” అన్నారు శంకర్ దయాళ్ శర్మ నా చేయి పట్టుకొని. మర్నాడు ఉదయమే ఆయన తిరుగు ప్రయాణం. మేము టు-ఇన్-వన్ రేడియోలో రికార్డు చేశాం. రాత్రికి రాత్రి అనంతపురం ఇంజనీర్లను పంపి దానిని క్యాసెట్లోకి/స్పూల్‍లోకి మార్చి శర్మగారికి అందిస్తే ఆయన నా భుజం తట్టారు. ఆ వేదిక మీద బాబాగారు మా బృందానికి వస్త్రాలు బహుకరించారు. మా స్టేషన్ ఇంజనీరు వెంకట్రామన్ నా పక్కనే ఉన్నాడు. ఆయనకు బంగారు ఉంగరం సృష్టించి ఇచ్చారు. ఎవరి అదృష్టం వారిది.

మరుసటి సంవత్సరం పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు సంవత్సరం శంకర్ దయాళ్ శర్మ శంఖుస్థాపన చేశారు. పి.వి.వారి చేతుల మీదుగా 1992 నవంబరులో ఎయిమ్స్‌లో హృద్రోగ నిపుణులు డా. పి. వేణుగోపాల్‍కు వంద ఆపరేషన్లు పూర్తి చేసినందుకు స్వర్ణకంకణ బహుకరణ జరిగింది. అలా మూడు సంవత్సరాలు భగవాన్ సాన్నిహిత్యం, టి.వి.కె.శాస్త్రి నిర్వహించిన యం.యస్. సుబ్బలక్ష్మి గాత్రకచేరి వంటి అనేక అనుభూతులు కలిగాయి.

పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలు:

అనంతపురంలో లలితాకళావేదిక సాంస్కృతిక కేంద్రం. ఆ ప్రహరీగోడపై ఆ రోజు జరిగే సభా కార్యక్రమాలు వ్రాసేవారు. వారానికి రెండు కార్యక్రమాలుండేవి. ఆ బోర్డు మీద నిత్యం నా పేరు ముఖ్య అతిథిగా లేదా సభాధ్యక్షులుగా పర్మనెంట్ అని ఆంధ్రప్రభ విలేకరి కాశీపతి చమత్కరించాడు. విశ్వవిద్యాలయ ఉపకులపతిగా యం.జె. కేశవమూర్తి వచ్చారు. వారు లోగడ తిరుపతిలో రిజిస్ట్రారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ డా. వి. సూర్యనారాయణ నేను సూచించిన విధంగా ఒక జాతీయ స్థాయి సైన్స్ కమ్యూనికేషన్ వర్క్‌షాప్ వారం రోజులు ఏర్పాటు చేశారు. కాశీపతి ప్రభలో వ్రాసినట్లుగా – అనంతపురం కేంద్రం – అనంతపద్మనాభరావు నేతృత్వంలో దినదినాభివృద్ధి కాదు, క్షణక్షణాభివృద్ధి చెందింది. మూడేళ్ళు పూర్తి కాగానే నేను కోరుకుని కడప కేంద్రానికి బదిలీపై 1993 ఏప్రిల్‌లో వెళ్ళాను.

(సశేషం)

Exit mobile version