ఆకాశవాణి పరిమళాలు-2

    0
    5

    [box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నతస్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను ‘ఆకాశవాణి పరిమళాలు’ శీర్షికన ఆయన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

    ఆకాశవాణిలో ప్రవచనశాఖ ప్రయోక్త (ప్రొడ్యూసర్ స్పోకెన్ వర్డ్) ఉద్యోగానికి ఇంటర్వ్యూ పిలుపునందుకొని హైదరాబాదు చేరుకొన్నాను. హైదరాబాదు లోగడ వచ్చినప్పుడు – కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా – ఆకాశవాణిలో పనిచేస్తున్న అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరు గుంటూరు రఘురాం గారిని కలిసి ఉన్నాను. ఆయన యువవాణి కార్యక్రమాలు పర్యవేక్షిస్తుండేవారు. “మీరు రేపు అవధాన ప్రక్రియ గూర్చి ఒక ప్రసంగం 15 నిముషాలకు తయారు చేసుకుని రండి!” అన్నారు. మర్నాడు స్టూడియోలో రికార్డు చేశారు. అందువల్ల నాకు ఆ ప్రాంగణం చిరపరిచితమే.

    ఇంటర్వ్యూ కెళ్ళేముందు నేను నెల్లూరు ఏదో పని మీద వెళ్ళాను. అంతకు ముందు నెలలో నేను నెల్లూరు వేదసంస్కృత కళాశాలలో ఒక అష్టావధానం చేశాను. ఆ సభ ప్రారంభమైన కొద్ది నిముషాలలో డా. బెజవాడ గోపాలరెడ్దిగారు, విశ్రాంత గవర్నరు విచ్చేశారు. సభలో కోలాహలం. ఆయనను వేదిక మీదకి రమ్మని ప్రిన్సిపాల్ ఉడాలి సుబ్బరామశాస్త్రి మర్యాదపూర్వకంగా మైక్‌లో ఆహ్వానించారు. నేను క్రింది వరుసలో కూచొని పది నిముషాలలో వెళ్ళిపోతానని ఆయన మొదటి వరుసలో కూచొన్నారు.

    నేను ఆశువుగా గోపాలరెడ్ది మీద ఓ పద్యం అల్లాను:

    సరసుల పాలి కల్పలత, సత్ప్రజ కొంగు పసిండి సాహితీ

         సరణికి మేలుబంతి, వన జాసనురాణికి కొల్వుకూటమున్

       వర హిమశైల సానువుల వ్రాలెడి నీడల వంటి చిత్తమున్

    అరయగ గోపాలార్య విబుధాగ్రణి అగ్రణి కాదె అన్నిటన్

    సభాసదులు చప్పట్లు చరిచారు. గోపాలరెడ్డి మందస్మితం చేశారు. అవధానం బాగా రక్తి కట్టింది. 10 నిముషాలు వుండాలనుకొన్న ఆయన రెండు గంటలు సాంతంగా కూచొని అవధానంతరం వేదిక పైకి వచ్చి నన్ను శాలువాతో సత్కరించారు.

    ఆ పరిచయాన్ని పురస్కరించుకొని వారిని ఇంటి వద్ద – సుదర్శన మహల్‌లో కలిసి వున్నాను. ప్రాచీన పద్యాలు నాలుగు చెప్పమని అడిగి నా చేత చెప్పించుకొని ఆనందించారు. ఆ చనువుతో నేను ఇంటర్వ్యూకు ముందు వారిని కలిసి హైదరాబాదు వెళ్తున్నానన్నాను.

    ఆయన నా మనసు కనిపెట్టారు.

    “నేను ఎవరికీ సిఫారసు చేయను. వాళ్ళు నా మాట గౌరవించరనుకో, ఏం బాగుంటుంది? నా జీవితంలో ఎవరికీ సిఫారసు లెటర్లు ఇవ్వలేదు. ఇవ్వను” అని ఆయన సిఫారసు లెటర్ మీద వ్రాసిన వచన కవిత వినిపించారు.

    “నా అవధానం పూర్తిగా మీరు చూశారు. ఆస్వాదించారు. ఆ మాట మీ స్వదస్తూరితో వ్రాసి ఇవ్వండి” అన్నాను.

    “నిరభ్యంతరంగా” – అంటూ ఆయన లెటర్‌హెడ్ మీద స్వయంగా నాలుగు వాక్యాలు వ్రాశారు. “అనంతపద్మనాభరావు చక్కటి అవధాని. వందల కొద్ది ప్రాచీన పద్యాలు కంఠతా వచ్చు” అని వ్రాసి సంతకం చేసి ఇచ్చారు.

    ***

    ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అప్పటి స్టేషన్ డైరక్టరు పసల గురుమూర్తి. ఆయన కార్యాలయం ముందు వేసిన కుర్చీలలో స్వయంవర రాకుమారుల వలె 30 మంది కూచుని ఉన్నారు. ఆకాశవాణి వివిధ కేంద్రాలలో పనిచేస్తున్న అభ్యర్థులు పదిమందికి పైగా ఉన్నారని తర్వాత తెలిసింది. నాకు పరిచయమైన వ్యక్తి ఒకే ఒక్క ఉషశ్రీ. ఆయన విజయవాడ కేంద్రంలో అప్పటికే సీనియర్ స్క్రిప్ట్ రైటర్‌గా పని చేస్తున్నారు.

    1974లో ప్రకటన చేసే సమయానికి ఒకే ఒక్క ప్రొడ్యూసర్ పదవి విజయవాడలో ఖాళీ వుంది. ప్రకటన వెలువడ్డ కొద్ది నెలల్లో రావురి భరధ్వాజగారిని హైదరాబాద్ కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా వేస్తున్నట్లు ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయి. 1975 జూన్‌లో ఆయన హైదరాబాదులో చేరారు. అదే నెలలో కడప, విశాఖపట్టణం కేంద్రాలు పూర్తిస్థాయి ప్రసారాలు త్రిసంధ్యలలో మెదలెట్టాయి. ఆ రెండింటికీ ప్రొడ్యూసర్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి. మొత్తం మూడు ఖాళీలకు ముప్పయి ఐదు మంది అభ్యర్థులం.

    ఆకాశవాణిలో పనిచేసిన అనుభవం లేనివారు నా వంటి నలుగురైదుగురు ఉన్నారు. ఇంటర్వ్యూ దాదాపు 11 గంటలకు ప్రారంభమైంది. భోజన విరామానంతరం మూడింటికి నా వంతు వచ్చింది. ఉదయం వరుసలో ఉషశ్రీని లాంఛనంగా ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఆ పదవికి నూరు శాతం అర్హులు. ఆయన సెలెక్షన్ నిశ్చితం. ఇక మిగిలింది రెండే పోస్టులు. కడప, విశాఖపట్టణం.

    ఇంటర్వ్యూ బోర్డులో డైరక్టర్ చైర్మన్. ఆయనతో బాటు మరో ముగ్గురు మెంబర్లు. డైరక్టర్ జనరల్ కార్యాలయ ప్రతినిధిగా విజయవాడ కేంద్ర డైరక్టరు బాలాంత్రపు రజనీకాంతరావు వచ్చారు. సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య బిరుదురాజు రామరాజు వచ్చారు. మూడో వ్యక్తి ఎవరో నాకిప్పటికీ తెలియదు. నన్ను 30 నిముషాలకి పైగా ప్రశ్నలడిగారు.

    నేను హుషారుగానే సమాధానాలిచ్చాను. నాకు ఎం.ఏ.లో వచ్చిన గోల్డ్ మెడలు, నా సర్టిఫికెట్లు, గోపాలరెడ్డి గారు యిచ్చిన టెస్టిమోనియల్, నేను అప్పటికే ప్రచురించిన ‘వి.వి.గిరి.జీవిత చరిత్ర’, ‘మారని నాణెం’ నవల చూపించాను.

    రామరాజు గారు “మీరు కందుకూరి రుద్రకవి మీద పి.హెచ్.డి.కి పరిశోధన చేస్తున్నారు గదా, జనార్దనాష్టకంలో ఒక పద్యం చెప్పండి” అన్నారు.

    నేను సంతోషంగా రాగయుక్తంగా ఒక పద్యం చదివాను.

    సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా

    చరణ పద్మము మీద దేహము చంద్ర కాంతులు దేరగా

    మురువు జూపుచు వచ్చినావో మోహనాకృతి మీరగా

    గరుడవాహన! దనుజ మర్దన కందుకూరి జనార్దనా!”

    అందరి ముఖాలలో హర్షం కనిపించింది.

    “మీరు ఇంత ఖరీదైన గోల్డ్ మెడల్ ఎందుకు తెచ్చారు, దొంగలుంటారు జాగ్రత్త!” అన్నారు మరో మెంబరు.

    “నేను వచ్చిన చోటు భద్రమైనది గదా సార్!” అన్నాను అవధానంలో అప్రస్తుత ప్రసంగానికి జవాబిచ్చినట్లు.

    రజనీకాంతరావు గారు, “అవధానం చేశామంటున్నారు, హైదరాబాద్ నగరంపై ఆశువుగా ఒక పద్యం చెప్పండి” అన్నారు.

    రెండు నిముషాలు ఆలోచించి చార్మినార్ ప్రాశస్త్యంపై పద్యం చెప్పాను. అప్పటికే అరగంట పూర్తి అయింది.

    స్టేషన్ డైరక్టర్ బాలగురుమూర్తిగారు నాకు కొన్ని హెచ్చరికలు చేశారు – “చూడండి! ఈ ఉద్యోగం కాంట్రాక్టు పద్ధతిపై ఏడాది కొకసారి పొడిగిస్తారు. పెన్షన్ లేదు. మీరు ఇప్పుడు రూ.355 బేసిక్‌లో ఉన్నారు. దీని బేసిక్ రూ.350/- పైపెచ్చు మీరు కాలేజీలో ప్రిన్సిపాల్ పోస్టు వరకు ఎదగవచ్చు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం ‘రిజైన్’ చేసి రావాలి. ఆలోచించుకోండి. మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను” అన్నారు సున్నితంగా.

    “సార్! నాకు మీడియాలో – అందునా రేడియోలో పని చేయాలని ఎప్పటినుంచో కోరిక. ఈ అవకాశం వచ్చింది. నేను స్టేషన్ డైరక్టర్ అవుతాను సార్!” అన్నాను వినమ్రంగా.

    రజనిగారు ముసి ముసి నవ్వులు నవ్వారు.

    తర్వాత ఓ సంవత్సరానికి వారిని కలిసినప్పుడన్నారు – “You Are A Born Prodigy”.

    నేనంటే వారికి వాత్సల్యం.

    చివరగా స్టేషన్ డైరక్టర్ అడిగారు –

    “ఒక వేళ సెలెక్ట్ అయితే రిజైన్ చేసి రావడానికి ఎంత టైం పడుతుంది?” అని. నెల రోజుల్లో చేరిపోతానన్నాను.

    ***

    ఆగస్టు మొదటివారంలోనే నాకు ఆర్డర్లు వచ్చాయి. పోలీస్ వెరిఫికేషన్ అప్పటికే పూర్తి అయింది. ఉషశ్రీని విజయవాడ, నన్ను కడప, విజయభూషణ శర్మను విశాఖపట్టణం వేస్తూ ఆర్డర్లు వచ్చాయి. వాళ్ళిద్దరూ రేడియోలో అప్పటికే విజయవాడ, విశాఖలలో పనిచేస్తున్నారు. వెంటనే చేరిపోయారు.

    నేను రాజీనామా ఆమోదం కోసం హైదరాబాద్ లోని డైరక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసుకు కందుకూరు నుండి పరుగులు తీశాను. సంబంధిత గుమాస్తాకు మా కళాశాల ప్రిన్సిపాల్ వ్రాసిన ఆమోదముద్ర లెటర్ చూపించాను. “ఆగస్టు 15లోగా చేరాలి సార్!” అన్నాను.

    ఆయన ఓ నవ్వు నవ్వాడు.

    “రాజీనామా ఆమోదించడానికి కనీసం ఓ నెల పడుతుంది. ఫైలును జాయింట్ డైరక్టర్‌కు పంపాలి. ఆయన దగ్గర నుండి డైరక్టర్‌కు వెళుతుంది. ఆయన సంతకమై వస్తుంది. మళ్ళీ ఆర్డర్ తయారు చేయాలి” ఇలా ఒక ఉపన్యాసం ఇచ్చారు.

    మా కళాశాల మిత్రులు కొందరు నాకు హితబోధ చేశారు. ‘ఓ వంద రూపాయలు గుమాస్తా చేతిలో పెట్టండి. పని సులువవుతుంది’ అని.

    లంచం ఇవ్వడం ఎలానో తెలియని అర్భకుణ్ణి. తీసుకోవడం అనే ప్రశ్న ఉదయించలేదనుకోండి.

    ఆయన ఫైళ్ళు చూస్తున్నప్పుడు ఆయన టేబుల్‌పై వున్న ఒక పెద్ద లెడ్జరులో 50 రూపాయల నోటు దోపాను. ఆయన అటుకేసి చూడలేదు. బహుశా ఆ ఫైలు డైరక్టరు దగ్గరకు వెళ్ళదేమోనని నా భయం.

    పది నిముషాల తర్వాత్త సైగల ద్వారా విషయం బయటపెట్టాను.

    “ఇక్కడటండీ ఇచ్చేది” అన్నాడు గొణుగుతూ.

    “ద్వారకా హోటల్లో కాఫీ తాగి వద్దాం రండి సార్! బాగా అలసిపోయారు” అన్నాను.

    “మీరు నడవండి. పది నిముషాల్లో వస్తాను” అన్నారు.

    మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. సాయంకాలం 5 గంటలలోపు ఆయనే స్వయంగా డైరక్టరు వద్దకు వెళ్ళి నా రాజీనామా ఆమోదముద్ర వేయించి ఆ కాగితం నా చేతిలో పెట్టారు.

    నేను మర్నాడు కందుకూరు చేరాను విజయగర్వంతో –

    (మళ్ళీ కలుద్దాం).

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here